S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆఖరి ట్రిక్

వాళ్లు ఫెర్లినీ మణికట్లకి బలమైన ఆ తాడుని గట్టిగా కట్టి ముడి వేశారు. వారిద్దరిలోని పొట్టివాడు ఒకటికి రెండుసార్లు ఊపిరి బిగబట్టి అతి బలంగా లాగి చూసి, ఇక ఊడదని తృప్తి చెందాడు. తర్వాత కాలి మడమలకి ఇనప పట్టీలని బిగించి దానికి తాళం వేశారు. ఫెర్లినీ ఇక తప్పించుకోలేడని తృప్తి చెందాక ఓ యువతి ప్రేక్షకులకి, అతనికి మధ్య ఓ తెరని అడ్డుగా ఉంచింది.
నిమిషం కన్నా తక్కువ సమయంలో ఫెర్లినీ ‘సరే’ అని ఆమెకి మాత్రమే వినపడేలా అనగానే ఆమెని తెరని తొలగించింది. చూస్తే ఫెర్లినీ మొహంలో విజయవంతమైన చిరునవ్వు, అతని చేతిలో తాడు, ఇనప పట్టీలు కనిపించాయి. ఆ క్లబ్‌లో ఆ రాత్రి భోజనం చేస్తున్న వారు కొద్దిగా నివ్వెరపోయి, తర్వాత మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు. ప్రేక్షకుల్లోంచి వచ్చి వాటిని కట్టిన ఇద్దరూ కూడా చప్పట్లు కొట్టారు. వెంటనే బేండ్ సంగీతం ఆరంభమైంది. ఫెర్లినీ భార్య, వృత్తిలో భాగస్వామి అయిన వాండా యాంత్రికంగా వేదిక మీదకి వెళ్లి తెరని, ఫెర్లినీ చేతిలోని వాటిని తీసుకుని స్టేజ్ వెనక్కి వెళ్లిపోయింది. ఆమెని చూడగానే కొన్ని ఈలలు ఉత్సాహంగా వినిపించాయి. అవి తన భర్త కోసం కాక తనని చూశాకే అని ఆమె గ్రహించింది.
ఆమె వయసు నలభై రెండు. మొహానికి మేకప్ వేయబట్టి వయసు తెలీడంలేదు. ఆమె డ్రెస్సింగ్ గదిలోకి వెళ్తూంటే బెగెట్ ఆమె చేతిలోని తెరని అందుకుంటూ చెప్పాడు.
‘నేను సహాయం చేస్తాను’
‘వద్దు’
‘ఇవాళ్టి షో సక్సెసే కదా?’
‘అవును. నీ షోని, నీ గానాన్ని కూడా వాళ్లు మెచ్చుకుంటారు’
‘్థంక్స్’ బెగెట్ పొడిగా చెప్పాడు.
ఆమె డ్రెస్సింగ్ గదిలోకి వెళ్లేసరికి ఫెర్లినీ అద్దం ముందు నిలబడి భుజాలని టవల్‌తో బలంగా రుద్దుకుంటూ, నవ్వుతూ కనిపించాడు.
‘ఆ పొట్టివాడ్ని చూసావా? నేను తప్పించుకోలేను అనుకున్నాడు. అంత గట్టిగా ముడి వేశాడు. కాని వాళ్లని మూర్ఖుల్ని చేయడంలో నాకూ, వాళ్లకి కూడా ఆనందం ఉంది’ చెప్పాడు.
‘ఈ రాత్రి మనల్ని రోస్కో భోజనానికి ఆహ్వానించాడు’ వాండా చెప్పింది.
వెంటనే ఫెర్లినీ మొహంలో చిరాకు కనిపించింది.
‘తప్పించుకునే వినోదం చచ్చిపోయిందని అతని భావన. అతను ఇవాళ రాత్రి చప్పట్లని విని ఉండాల్సింది’
‘అతనే కదా ఈ షోని బుక్ చేసింది. ఈ రాత్రి రోస్కోతో ఆ నీటి ట్రిక్ గురించి మాట్లాడకు. ఇది విని విని నాకు విసుగేస్తోంది’ చెప్పింది.
‘వాండా! నీతో ఇబ్బందేమిటో తెలుసా? నువ్వు ముసలిదానివి అవడం. నీకన్నా నాలుగేళ్లు పెద్దయినా నేను ఇంకా యువకుడ్నే. నేను నీ మొహంలో పది ముడతలని లెక్క పెట్టాను’ అతని బలమైన చేతులు ఆమె తలని అద్దం ముందు అదిమి పట్టాయి.
‘ఒదులు’ వాండా బాధగా అరిచింది.
‘ఇంకెప్పుడూ నేను ముసలివాడిని అని చెప్పకు’
‘నన్ను అంతా ముసలిది అనుకోవడం లేదా?’ ఆమె గొణిగింది.
‘నోరు మూసుకో. వాటర్ ట్రిక్ గురించి ఇవాళ రోస్కోతో మాట్లాడతాను’
* * *
అదీ గ్రీక్ రెస్ట్‌రెంట్.
‘ఇవాళ షో హిట్ అని విన్నాను?’ రోస్కో అడిగాడు.
‘అవును. కాలం మారినా మనుషులు మారరు. థ్రిల్ ఉన్న వినోదాన్ని అన్ని కాలాల్లోని ప్రజలు ఆనందిస్తారు. వాటర్ ట్రిక్...’
‘వాటర్ ట్రిక్‌తోనే ఎస్కేప్ ఆర్టిస్ట్ హౌడీని మరణించాడని నువ్వు మర్చిపోయావా?’ రోస్కో హెచ్చరికగా చెప్పాడు.
‘హౌడినీ చేసినవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. తాళ్లు, గొలుసులు, ఇనప పట్టీలనించి, బేడీల నించి, సంచీల్లోంచి, పెట్టెల్లోంచి, భోషాణాల్లోంచి హౌడినీలా పారిపోగలను. హౌడినీ నకిలీ వాటితో ఆ ట్రిక్స్‌ని చేసేవాడు. నేనో? నా బలంతో’ ఫెర్లినీ బలంగా చెప్పాడు.
‘నిజమే. నువ్వు అతి గొప్పవాడివి. కాని వాటర్ ట్రిక్‌ని గతంలో హౌడినీ చేశాడు కదా?’ రోస్కో విసుగ్గా చెప్పాడు.
‘కాని ఇప్పుడు కొత్త తరం వారు దాన్ని చూడలేదు. నాకు మొదట బేడీలు వేస్తారు. తర్వాత ఏభై అడుగుల తాడుని నా శరీరానికి చూడతారు. కాళ్లకి ఇనప పట్టీలని తొడిగి ఆ తర్వాత నన్నో సంచీలో ఉంచి దాన్ని కట్టేస్తారు. ఆ సంచీని ఓ పెద్ద ఇనప పెట్టెలో ఉంచి టస్కాన్ సరస్సులో పడేస్తారు. కొన్ని నిమిషాల్లో నేను ప్రేక్షకుల వెనక నించి ప్రత్యక్షం అవుతాను’
‘ఇందులో ట్రిక్ శాతం ఎంత? శరీర బలం శాతం ఎంత?’
‘తాడు కట్టేప్పుడు గట్టిగా ఊపిరి పీల్చి నా ఛాతీని విశాలం చేస్తాను. తర్వాత మామూలుగా చేసి వదులైన తాడు లోంచి బయటపడతాను. తర్వాత నా పేంట్ మడతల్లో దాచుకున్న డూప్లికేట్ తాళం చెవితో బేడీల తాళం తీసి, ఆ తాళంతో సంచీని కోసుకుని బయటకి వస్తాను. ఆ ఇనప పెట్టె కింద భాగాన్ని లోపల నించి పక్కకి జరపచ్చు. దాన్ని తెరచుకుని ఈదుకుంటూ ప్రేక్షకుల ముందుకి వస్తాను. ఇదంతా మూడు నిమిషాల్లోగా జరిగిపోతుంది’
‘నువ్వు బాగా ఈదగలవా?’
‘ఓసారి ఇంగ్లీష్ ఛానల్‌ని ఇంగ్లండ్ నించి ఫ్రాన్స్ దాకా ఈదాలనుకున్నాను. కాని స్పాన్సరర్స్ లేక ఈదలేదు’
‘నీ పెట్టెని మోటార్ బోట్లోంచి బయటక పడేశాక, నువ్వు ఈదుకుంటూ వచ్చే కంటే మళ్లీ నిన్ను పడవలోకి ఎక్కించుకోవడం మంచిది’ రోస్కో సూచించాడు.
‘అలాగే చేద్దాం’
‘కాని ఎందుకో నాకు ఇది నచ్చడంలేదు. వెయిటర్! ఇంకో రౌండ్ తీసుకురా’ రోస్కో వెయిటర్‌కి ఆర్డర్ చేశాడు.
‘నాకూ ఈ ట్రిక్ వద్దనిపిస్తోంది’ అంతదాకా వౌనంగా ఉన్న వాండా చెప్పింది.
* * *
హోటల్ మూడో అంతస్థులోని తమ గదిలోంచి వాండా బయటకి చూసింది. భర్త స్విమ్మింగ్ పూల్‌లో షార్క్ చేపలా నీటిలో ఈదుతున్నాడు. విశాలమైన అతని భుజాల కండరాలు గాలికి పైకి వచ్చినప్పుడు కనిపిస్తున్నాయి. పదిహేనేళ్ల క్రితం కంటే అతని శక్తి తగ్గిందని ఆమెకి తెలుసు. కాని అతను అంగీకరించడు.
బెగెట్ ఆ గదిలోకి వచ్చాడు.
‘ఇక్కడికి ఎందుకు వచ్చావు?’ ఆమె ప్రేమతో కూడిన అయిష్టంతో అడిగింది.
‘ఫెర్లినీ స్విమ్మింగ్ పూల్‌లో ఉండటం చూసే వచ్చాను. సాయంత్రం దాకా అక్కడే ఉంటాడు’
తర్వాతి నిమిషం ఆమెని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కాని ఆమె భయం వల్ల వెనక్కి తగ్గింది.
‘నీకు ఫెర్లినీ గురించి తెలీదు. అతను ఎప్పుడూ ఎస్కేప్ ఏక్ట్ గురించే ఆలోచిస్తూంటాడు. పగలు, రాత్రి కూడా. ఒక్కోసారి ఆయన మాటలు వింటూంటే పిచ్చెక్కినట్లు ఉంటుంది. ఎప్పుడూ ఎస్కేప్, ఎస్కేప్’
‘నన్నడిగితే నీకు కాదు. అతనికి పిచ్చి’
‘అతను నిద్రలో కూడా పారిపోతూంటాడు. జోక్ కాదు. అర్ధరాత్రి మెళకువ వస్తే దుప్పటిని తీసి దూరంగా విసిరేసి ప్రేక్షకులు ఉన్నారనుకుని అభివాదం చేస్తాడు. ఒక్కోసారి అతను పారిపోని విధంగా కాళ్లు చేతులని కట్టేయాలని అనిపిస్తుంది’ ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
‘ఏమిటి నువు చెప్పేది?’ బెగెట్ అడిగాడు.
‘అతన్ని నీళ్లల్లో ముంచే వాటర్ ట్రిక్ గురించి నీకు తెలుసు కదా? ఒకటి, రెండు వారాల్లో అతను దాన్ని చేయబోతున్నాడు. అతను అది చేయాలనుకున్నప్పటి నించి నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా?’
ఆమె కిటికీ దగ్గరికి వెళ్లి నీళ్ల అడుగున ఈదే ఫెర్లినీ వంక కొద్దిసేపు చూసింది.
ఆమె చెప్పే దాని కోసం బెగెట్ ఎదురుచూడసాగాడు.
‘ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరగచ్చా అని నేను ఆలోచిస్తున్నాను. తన కళలో అతను నిపుణుడు అని నాకు తెలుసు. దేంట్లోనించైనా ఫెర్లినీ తప్పించుకోగలడు. కాని ఈసారి ఓ చిన్న పొరపాటు వల్ల అతను తప్పించుకోలేడు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా?’
‘నిన్ను నేను ఒక్క క్షణం కూడా తప్పు పట్టను’ బెగెట్ సానుభూతిగా చెప్పాడు.
వాండా బీరువా దగ్గరికి వెళ్లి రెండో డ్రాయర్ని తెరచింది. అందులోని అనేక వస్తువుల్లోంచి ఓ స్టీల్ బేడీల జతని, రెండు చిన్న లోహపు పట్టీలని తీసింది. వాటిని బెగెట్‌కి ఇచ్చి చెప్పింది.
‘దయచేసి వీటిని ధరించు’
‘నిజంగా చెప్తున్నావా?’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అవును. దయచేసి’
అతను చేతులు చాపితే బేడీలు వేసి, దానికి తాళం వేసి తాళం చెవిని ఇచ్చి చెప్పింది.
‘ఇప్పుడు తప్పించుకో’
బెగెట్ చాలాసేపు ప్రయత్నించి చెప్పాడు.
‘నా వల్ల కావడంలేదు’
‘నీ వల్ల కాదు. నిజానికి ఎవరి వల్లా కాదు. ఫెర్లినీతో సహా. ఇది అతని దగ్గర ఉంటే తప్ప’ ఇంకో తాళం చెవిని ఇచ్చింది.
దాంతో సంకెళ్లని విడిపించుకున్నాడు.
‘తాళం చెవిని మార్చావేం?’ అడిగాడు.
‘ఇంక నువ్వు వెళ్లచ్చు’ వాండా అతన్ని చుంబించి చెప్పింది.
* * *
వాటర్ ట్రిక్‌కి రోస్కో చాలా ప్రచారం చేశాడు. డెన్వర్ ప్రాంతంలోని నాలుగు స్థానిక దినపత్రికలు, ఓ జాతీయ వార్తాపత్రిక ఆ సందర్భాన్ని కవర్ చేయడానికి తమ విలేకరులని పంపుతామని మాట ఇచ్చాయి. ఫెర్లినీ టీవీలో, జాతీయ పత్రికల్లో కవరేజ్‌ని ఆశించాడు.
‘అంత ఖర్చు చేయలేను. ఇది చంద్రుడి మీద కాలు పెట్టేలాంటి సందర్భం కాదు. ఇప్పటికే హౌడినీ దీన్ని చేశాడు’ రోస్కో సముదాయించాడు.
ఆ వాటర్ ట్రిక్ రోజు వాండా ఉదయమే నిద్ర లేచింది. ఏదైనా పొరపాటు జరగచ్చని ఆమెకి ఆదుర్దాగా ఉంది. ఫెర్లినీ ఆ ప్రదేశానికి వెళ్లడం కోసం రోస్కో ఓపెన్ టాప్‌గల కారుని అద్దెకి తీసుకున్నాడు. ఆ కారు వెనక సీట్లో వాండా, పక్కనే రోస్కో కూర్చున్నారు. ముందు సీట్లోని నల్ల సూట్, తెల్ల టై ధరించిన ఫెర్లినీ సందర్శకుల వైపు చేతులని ఊపసాగాడు.
టస్కాన్ సరస్సు దగ్గర గుమిగూడిన వందలాది మందిని చూశాక ఫెర్లినీకి ప్రచారం విషయంలో గల అసంతృప్తి తొలగింది. పోలీస్ చీఫ్, ఫైర్ కమిషనర్, ఇద్దరు ప్రముఖ వ్యాపారస్థులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మ్యూజిక్ ఆర్కెస్ట్రా కూడా సిద్ధంగా ఉంది. ఓ డజను మంది పత్రికా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు కూడా హాజరయ్యారు. స్పీకర్‌లలోంచి పెద్ద కూత వినిపించడంతో ఎవరూ ఉపన్యాసాలు ఇచ్చే అవకాశం లేకపోయింది.
ఆ ఉదయం ఆకాశం నిర్మలంగా ఉన్నా మధ్యాహ్నానికి నల్లటి మేఘాలు ఆకాశం నిండా కమ్ముకున్నాయి. దాంతో రోస్కో వాయిదా వేయకుండా తక్షణం చేయమని ఫెర్లినీని కోరాడు.
మధ్యాహ్నం రెండుకి పోలీస్ చీఫ్ అతని రెండు చేతులకి కలిపి బేడీలని వేసి, తాళం చెవిని తన జేబులో ఉంచుకున్నాడు. తర్వాత బేడీలని పరీక్షించి అవి ఊడిరావని, నకిలీ బేడీలు కావని తృప్తి పడ్డాడు. ఫెర్లినీ తన కోట్, షర్ట్ బూట్లని విప్పాక, ఇద్దరు వ్యాపారస్థులు ఫెర్లినీ శరీరం చుట్టూ లావుపాటి తాడుని బలంగా కట్టారు. టిషర్ట్‌లోని అతని బలమైన కండరాలని ఆడవాళ్లు ఆసక్తిగా గమనించారు. ఏభై అడుగుల తాడుని కట్టాక వారు రొప్పసాగారు.
‘ముడి గట్టిగా వేయండి’ ఫెర్లినీ వాళ్లని ప్రోత్సహించాడు.
వారు తాడు కట్టే సమయంలో గాలిని బలంగా పీల్చి ఛాతీని దాదాపు ఏడు అంగుళాలు విస్తరింపజేస్తాడని వాండాకి, రోస్కోకి మాత్రమే తెలుసు. ఫైర్ కమిషనర్ ఫెర్లినీని సంచీలోకి ఎక్కించి దాన్ని మూసి తల దగ్గర తాడుని ముడేశాడు. పెద్ద ఇనప భోషాణాన్ని చూశాక కాని సందర్శకుల్లో స్పందన రాలేదు. ప్రేక్షకుల్లోని ఓ మహిళ భయంగా అరిచింది. రోస్కో ఆనందంగా నవ్వాడు. అతను వాండా వంక చూస్తే ఆమె మొహం పాలిపోయి పెదాలు వణుకుతున్నాయి.
ఫెర్లినీని ఆ పెట్టెలో ఉంచి తాళం వేశారు. దాన్ని పరీక్షించాక అందులోంచి అతను తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రేక్షకుల్లోంచి పిలిచిన నలుగురు చెప్పారు. బలిష్టులైన కొందరు ఆ పెట్టెని ఎత్తి సరస్సు ఒడ్డున ఉన్న మోటర్ బోట్ డెక్ మీద ఉంచారు. క్లబ్ ఆర్కెస్ట్రా శవపేటికని తీసుకెళ్లేపుడు వాయించే విషాదకరమైన సంగీతాన్ని వాయించారు. పడవలోకి ముఖ్య అతిథులు కూడా ఎక్కారు. పడవ కెప్టెన్ సందర్శకులకి చేతులని ఊపి ఇంజన్‌ని ఆన్ చేశాడు. నెమ్మదిగా అది సరస్సు మధ్యకి ప్రయాణించసాగింది. రోస్కో వాండా వీపు మీద అనునయంగా తట్టాడు.
పడవ ఐదు వందల గజాల దూరం వెళ్లాక దాన్ని రోస్కో ఆపించాడు. బైనాక్యులర్‌లోంచి ఒడ్డున ఉన్న పత్రికా విలేకరులని చూశాడు. వాళ్ల ఫొటోగ్రాఫర్స్ తమని ఫొటోలు తీస్తున్నారని గ్రహించి తృప్తి పడ్డాడు. రోస్కో సైగ చేయగానే బలాఢ్యులు ఇద్దరూ ఆ ఇనప పెట్టెని నీళ్లల్లోకి తోసేశారు. నీళ్లు బాగా పైకి చిమ్మాయి. వెంటనే ఒడ్డు నించి ఎక్సయిట్‌మెంట్‌గా కంఠాలు వినిపించాయి. నావికుడు ఈల వేయసాగాడు.
రోస్కో చేతి గడియారం వంక చూసుకుంటూ నీళ్లల్లోకి చూడసాగాడు. అర నిమిషం గడిచింది. నిమిషం తర్వాత రోస్కో బైనాక్యులర్‌లోంచి నీటి ఉపరితలం వంక నిశితంగా చూడసాగాడు. నిమిషంన్నర తర్వాత ఏ క్షణంలోనైనా అతను రావచ్చని అంతా ఎదురుచూశారు. ఆసరికి నావికుడి నోట్లోని ఈల ఆగిపోయింది.
‘అయ్యో మిస్టర్ రోస్కో! అతను రానేలేదు. నన్ను సహాయానికి వెళ్లమంటారా?’ నావికుడు ఆదుర్దాగా అడిగాడు.
మూడు నిమిషాలు గడిచాక వాండా చెప్పింది.
‘నిమిషంన్నర క్రితమే రావాలి. మనల్ని సర్‌ప్రైజ్ చేయడానికి ఫెర్లినీ ఒడ్డుకి ఈదుకుని వెళ్లి ఉంటాడు’
మరో నిమిషం తర్వాత పడవని ఒడ్డుకి పోనించాడు.
ఆ రాత్రి చేతికి బేడీలు వేసి ఉన్న ఫెర్లినీ శవాన్ని పోలీసులు బయటకి తీయించారు.
* * *
వాండా బాధపడే విధవరాలుగా చక్కగా నటించింది. మేకప్ వల్ల వయసు కన్నా చిన్నదిగానే కాక, విషాదంగా కూడా కనిపించింది. ఆ అంతిమ ఏర్పాట్లని రోస్కో గ్రాండ్‌గా చేశాడు. పత్రికా విలేకరులే కాక అనేక వందల మంది దానికి హాజరయ్యారు. కొందరు కంట తడిపెట్టారు కూడా. అరగంట శవయాత్ర జరిగాక శ్మశానానికి శవపేటికని తీసుకెళ్లే వాహనం చేరుకుంది.
‘తనకి లభించిన ఈ మర్యాదకి ఫెర్లినీ ఆనందిస్తాడు’ దారిలో రోస్కో చెప్పాడు.
‘అవును. ఆయనకి ఖ్యాతి తినే బతికేవారు’ వాండా అంగీకరించింది.
ఫాదర్ ఫెర్లినీ ధైర్యం గురించి, అతని వృత్తికి సంబంధించిన నైపుణ్యం గురించి, తన జీవిత కాలంలో వేలాది మందికి వినోదాన్ని ఇవ్వడం గురించి మాట్లాడాడు. తర్వాత బండిలోంచి శవపేటికని దింపారు. దింపేప్పుడు దాన్ని మోసిన వారి మొహాల్లో ఆశ్చర్యం కనిపించింది. వాళ్లు ఒకరితో మరొకరు గుసగుసలాడుకుని ఫాదర్ దగ్గరికి వెళ్లి చెప్పారు.
‘శవపేటిక చాలా తేలికగా ఉంది. లోపల శవం ఉన్నట్లు లేదు’
‘నిజంగా?’
‘అవును. ఫెర్లినీ కనీసం రెండు వందల పౌన్ల బరువు ఉంటాడు. కానీ శవపేటిక అంత బరువుగా లేదు’
‘ఐతే నాకు ఇష్టం లేకపోయినా సరే, దాన్ని తెరచి చూద్దాం’ రోస్కో సూచించాడు.
‘శవాన్ని ఇందులో ఉంచాక నేనే దీని మూత మూసి బండిలోకి దీన్ని ఎక్కించింది’ అండర్‌టేకర్ చెప్పాడు.
పేటికని తెరవడానికి ఫాదర్ అంగీకరించలేదు. కాని ఆయన నిరసనని పట్టించుకోకుండా దాన్ని తెరిచారు.
సందర్శకులు కొందరు పెద్దగా అరిచారు.
శవపేటిక ఖాళీగా ఉంది!
వాండా పెద్దగా అరిచి స్పృహ కోల్పోయింది.
* * *
డాక్టర్ రష్‌ఫీల్డ్‌తో రోస్కో జరిగింది చెప్పాడు.
‘నాది ప్రదర్శనా వృత్తి డాక్టర్. అందుకే ఫెర్లినీ నాతో పనె్నండేళ్ల క్రితమే ఓ ఒప్పందాన్ని చేసుకున్నాడు.
‘ఏమిటది?’
‘దాని గురించి నాకు, అతనికి తప్ప ఎవరికీ తెలీదు. ఇది పిచ్చితనం అని, వద్దని వారించినా ఫెర్లినీ వినలేదు. తను నాకన్నా ముందే మరణిస్తే ఈ ఆఖరి తప్పించుకునే ట్రిక్‌ని ఏర్పాటు చేయమని నన్ను కోరాడు. హౌడినీ కన్నా తను ఎక్కువ కాలం ప్రజలకి గుర్తుండి పోవాలన్నది అతని కోరిక’ రోస్కో చెప్పాడు.
‘ట్రిక్కా?’
‘అవును. తేలికైంది. నేను అండర్ టేకర్‌కి ఐదు వందల డాలర్లు ఇచ్చి ఫెర్లినీ శవాన్ని మరోచోట రహస్యంగా పాతించాను. అందులోంచి ఖాళీ శవపేటిక దిగాక మోసేవాళ్లు నేను చెప్పినట్లుగానే అది ఖాళీదని చెప్పారు’
‘కాని ఇది అతని భార్య వాండా మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఆమె మానసిక స్థితి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉండి ఉండాలి. దాంతో షాక్‌కి గురైంది’ డాక్టర్ రష్‌ఫీల్డ్ చెప్పాడు.
‘ఆమెకి ఎలా ఉంది? నేను మాట్లాడచ్చా?’ రాస్కో ప్రశ్నించాడు.
‘ఐయాం సారీ. మాట్లాడినా జవాబు చెప్తుందనుకోను. దూరం నించి చూడండి’
రోస్కో డాక్టర్ వెంట నడిచి ఓ ఇనప చువ్వల తలుపులోంచి లోపలకి చూశాడు. మెంటల్ హాస్పిటల్ రోగుల దుస్తుల్లో ఉన్న ఆమెని చూశాడు. ఆమె చూపులు తన ముందుది ఆమె గ్రహించలేనట్లుగా ఉన్నాయి.
ఆమె తన చేతులకి కట్టిన అదృశ్య బేడీలని విడిపించుకునే తీవ్ర ప్రయత్నం చేస్తూ కనిపించింది.

(జె.స్ట్రీట్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి