S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్లాక్ అవుట్ (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

అతను పోలీస్ స్క్వేడ్ రూంలోకి ఉదయం పదిన్నరకి వచ్చాడు. అతని గడ్డం అప్పుడే గీసినట్లుగా ఉంది. ఇస్ర్తి చేసిన దుస్తులని ధరించినా, గత రాత్రి బాగా తాగి నిద్రలేని హేంగోవర్‌లో ఉన్నాడని అతన్ని చూడగానే నాకు అర్థం అయింది. అతని వయసు నలభై ఐదు దాకా ఉండచ్చు.
‘నా పేరు హేరిస్. పోలీస్ సార్జెంట్‌ని. మీకేం సహాయం చేయగలను?’ అడిగాను.
‘నన్ను దయచేసి జైల్లో పెట్టండి’ అతను కోరాడు.
బులెటిన్ బోర్డ్‌ని చదువుతున్న సార్జెంట్ సేమ్ దాన్ని పక్కన పెట్టి వచ్చి ఆసక్తిగా అతని వంక చూస్తూ నిలబడ్డాడు.
‘మీరు ఏం నేరం చేశారు?’ అడిగాను.
అతను అయోమయంగా చూశాడు.
‘మేం హోటల్‌ని నడపటం లేదు. మీ మీద నేరారోపణ ఉండాలి మిస్టర్’ సేమ్ అతనితో చెప్పాడు.
‘తాగడం సరైన నేరమేనా?’ అతను అడిగాడు.
‘కావచ్చు. కాని తాగుబోతుల్ని అరెస్ట్ చేసేది హత్యానేర పరిశోధన విభాగం కాదు’ సేమ్ చెప్పాడు.
‘మీ పేరు?’ అతన్ని అడిగాను.
‘అది అవసరం లేదు అనుకుంటాను. నేను ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చాను తప్ప నన్ను ఎవరూ అరెస్ట్ చేసి తీసుకురాలేదు. సమాజంలో నాకో గౌరవప్రదమైన స్థానం ఉంది. నిజానికి నేను తాగుబోతునే ఐనా దినపత్రికల్లో ఆల్కహాలిక్‌గా నా గురించి రావడం నాకు ఇష్టం లేదు. ఒకోసారి నెలల తరబడి తాగను. కాక్‌టెయిల్ పార్టీలకి వెళ్తే మిగతా వాళ్లు తాగినా నాకు వ్యామోహం కలగదు. కాని అకస్మాత్తుగా ఓసారి తాగాలనే కోరిక కలిగి, కొద్దిగా రుచి చూస్తాను. ఇక ఆపలేను. కొద్దిరోజులపాటు మెలకువగా ఉండి తాగుతూనే ఉంటాను’ అతను చెప్పాడు.
‘ఈసారి ఎన్ని రోజులు?’ సేమ్ ప్రశ్నించాడు.
‘మూడున్నర రోజులు. పద్దెనిమిది నెలల తర్వాత’
‘మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?’ నేను ప్రశ్నించాను.
‘నేను తాగడం ఆపడానికి జైల్లో ఉండటం తప్ప నాకు ఇంకో దారి కనిపించక వచ్చాను’
‘గతంలో ఎప్పుడైనా మీరు ఇలా అరెస్ట్ అయే ప్రయత్నం చేశారా?’ అడిగాను.
‘లేదు. ఇదే మొదటిసారి’
‘మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?’
‘ఇది మంచి పరిష్కారం అనిపించింది’
‘మీ పేరు?’ సేమ్ అడిగాడు.
అతను జవాబు చెప్పలేదు.
‘మీ జేబుల్లోవి బయటకి తీస్తారా?’ అడిగాను.
అతను తన జేబులోంచి రుమాలు, సిగరెట్ పాకెట్, అగ్గిపెట్టె, కొన్ని తాళం చెవులు ఉన్న కీ రింగ్, చిల్లర, క్లిప్ పెట్టిన పౌండ్ నోట్లని తీశాడు.
‘పర్స్ లేదా?’ అడిగాను.
‘అందులో నా ఐడి కార్డ్‌లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వదిలి వచ్చాను’
‘మీరు గతంలో అరెస్ట్ అయ్యారా?’
‘లేదు’
నేనా తాళం చెవుల గుత్తిని సేమ్‌కి ఇచ్చి చెప్పాను.
‘దీన్ని లేబ్‌కి తీసుకెళ్లి కీ మెషీన్‌లో చెక్ చెయ్యి’
‘కీ మెషీన్ అంటే ఏమిటి?’ అతను అనుమానంగా చూస్తూ అడిగాడు.
‘తాళాలని గుర్తించే మెషీన్. పావుగంటలో మాకు మీ ఇంటి అడ్రస్ తెలుస్తుంది’ చెప్పాను.
‘మీరు ఇలా కనుక్కోగలరని నాకు తెలీదు’ కొద్దిగా ఆందోళనగా చెప్పాడు.
సేమ్ వెళ్తూంటే అతను నిస్పృహగా చెప్పాడు.
‘సరే. నా భార్యకి ఇది తెలీడం నాకు ఇష్టం లేదు. నా పేరు జార్జ్ కూపర్’
‘మీ చిరునామా?’ అడిగాను.
అతని చిరునామాని రాసుకున్నాను. దాన్ని సేమ్‌కి ఇచ్చి చెప్పాను.
‘ఇతను పాత నేరస్థుడేమో చూడు’
సేమ్ రిసీవర్ని అందుకుని రికార్డ్స్ సెక్షన్ కనెక్ట్ అవగానే అతని పేరు చెప్పి కనుక్కోమని చెప్పాడు. కొద్దిసేపటికి అతను పాత నేరస్థుడు కాదని తెలిసింది.
‘జైలుకి పదండి’ చెప్పాను.
అతను మళ్లీ తన వస్తువులని జేబులో ఉంచుకుని చెప్పాడు.
‘నాకు బ్లాక్ అవుట్ వచ్చినప్పుడు జరిగిందంతా మర్చిపోతూంటాను. తర్వాత నేను చేయకూడనివి చేసానని ఇతరులు చెప్తూంటారు’
‘ఎలాంటివి?’ సేమ్ అడిగాడు.
‘పోట్లాటల్లాంటివి’
‘మీరు పోట్లాడారా?’ సేమ్ అడిగాడు.
‘లేదు. ఉదాహరణకి చెప్పాను. పోట్లాడకుండా ఉండటానికి ఇక్కడికి వచ్చాను’
‘ఎవరితో?’ అడిగాను.
‘నా పక్కింటివాడు హెన్రీ మార్క్స్‌తో’
‘అతనితో మీకేమైనా ఇబ్బంది ఉందా?’ అడిగాను.
‘నా భార్య వెంటపడే అతన్ని ఆమెకి దూరంగా ఉండమని చెప్పాను’
‘ఆ పేరు ఎక్కడో విన్నట్లుంది?’ చెప్పి సేమ్ ఇందాక తను చదివే బులెటిన్ బోర్డ్ దగ్గరికి వెళ్లి అక్కడ అతికించిన కాగితాలని చదివి చెప్పాడు.
‘హెన్రీ మార్క్స్ గత శుక్రవారం నించి కనపడటం లేదు అని రిపోర్ట్ అందింది’
మేము ఇద్దరం వెంటనే జార్జ్ కూపర్ వంక చూశాం. అతని ఇబ్బందిగా చూశాడు. అతన్ని అరగంటసేపు ప్రశ్నించాం. మొదట అతను హెన్రీ మార్క్స్ గురించి తెలీదన్నాడు. కాని చివరికి తన కథని మార్చాడు. గత రాత్రి తన ఇంట్లో కనపడ్డ హెన్రీతో అతను పోట్లాడాడు. ఆ తర్వాత హెన్రీ తన ఇంట్లోంచి వెళ్లిపోయాడని, అతను కనపడకపోవడానికి, తనకి సంబంధం లేదని చెప్పాడు.
‘మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ ప్రకారం గత శుక్రవారం నించి, అంటే మూడు రోజుల నించి అతను కనపడటం లేదు’ సేమ్ చెప్పాడు.
‘విన్నారుగా? నిన్న రాత్రి సోమవారం. మీ పోట్లాట శుక్రవారం రాత్రి జరగలేదు కదా?’ గట్టిగా అడిగాను.
‘లేదు. నిన్న రాత్రే’
‘ఇది రెండు రోజుల క్రితం జరిగి బ్లాక్ అవుట్ వల్ల మీరు మర్చిపోయి ఉండచ్చు’ సేమ్ సూచించాడు.
‘క్రితం రాత్రే. గత మూడు రోజులుగా హోటల్‌లో గది తీసుకుని తాగి క్రితం రాత్రే నేను ఇంటికి వచ్చాను. ఐతే మా మధ్య పోట్లాట జరిగిందని నాకు గుర్తులేదు. నేను అసలు ఇంటికి రావడం కూడా గుర్తులేదు. నా భార్య ఆ విషయాలు చెప్పింది... నేను ముందు చెప్పడానికి భయపడ్డాను కాని నేను అతన్ని చంపాను’ ఆఖరి మాటలు గొణుగుతున్నట్లుగా చెప్పాడు.
నేను, సేమ్ కొద్ది క్షణాలు ఒకరి మొహం మరొకరం చూసుకున్నాం.
‘దాని గురించి చెప్తారా?’ నేను అతన్ని అడిగాను.
ఓసారి అతను తన నేరాన్ని అంగీకరించాక మా ప్రశ్నలన్నిటికీ నిరుత్సాహంగా జవాబు చెప్పాడు.
శుక్రవారం రాత్రి ఎనిమిదికి అతను ఇంట్లోంచి బయటికి వెళ్లాడు. అనేక బార్లు, నైట్ క్లబ్స్‌లో తాగాక హోటల్‌లో గది తీసుకుని తాగడం కొనసాగించాడు. శని, ఆది, సోమవారం సాయంత్రం దాకా అతనికి జరిగింది ఏదీ గుర్తులేదు. తన ఇంట్లో ముందు గదిలో సోఫాలో పడుకున్న అతని భార్య హెలెన్ నిద్ర లేపింది. సోఫా పక్కన నేల మీద తల పగిలిన హెన్రీ మార్క్స్ దేహం, పక్కనే పోకర్ (ఫైర్ ప్లేస్‌లోకి నిప్పుని ఎగతోసే ఇనప కర్ర) కనిపించాయి.
‘మీకు ఆ పోట్లాట గుర్తు లేదా?’ అడిగాను.
‘లేదు. నా భార్య హెలెన్ చెప్పింది. తను చూసిందిట’
‘ఏం చూసిందిట?’
‘నేను సోమవారం రాత్రి తూలుతూ ఇంటికి వచ్చి, అక్కడ ఉన్న హెన్రీని చూసి, హెలెన్ వెంట పడ్డావని నిందించాను. మాటలు పెరిగాక అతను నన్ను కొట్టాడు. నేను ఫైర్ ప్లేస్ పక్కన పడ్డాను. అక్కడున్న పోకర్ని అందుకుని అతని తల మీద కొట్టగానే పడిపోయాడు. జరిగింది అది’
‘ఆ శవాన్ని ఏం చేశారు?’ ప్రశ్నించాను.
‘ఇంటి వెనుక పాతి పెట్టాను. కావాలంటే ఎక్కడో మీకు చూపిస్తాను’
హత్యానేరం మీద అతన్ని బుక్ చేసి, ఫోరెన్సిక్ యూనిట్‌ని కూపర్ ఇంటికి రమ్మని ఫోన్ చేసి, పలుగులు, పారలు, బలమైన ఇద్దరు మనుషులతో కూపర్ ఇంటికి చేరుకున్నాం. లండన్ శివార్లలోని ఖరీదైన ఫారెస్ట్ పార్క్ సమీపంలో ధనవంతులు నివసించే ఓ కాలనీ అది.
ఆ రెండంతస్థుల భవంతి వెనక తోటలోని కొత్తగా తవ్విన భాగాన్ని అతను చూపించాడు. తవ్విన మట్టిని నింపిన ఇంటి వెనక గోతిని చూపించాడు.
‘తాగి ఉండి కూడా మీరు ఇంత చక్కగా ఎలా పూడ్చగలిగారు?’ సేమ్ అడిగాడు.
‘హెలెన్ నాకు సహాయం చేసింది’
ఇంటి వెనక తలుపు తెరచుకుని సన్నగా, అందంగా ఉన్న ఓ స్ర్తి బయటికి వచ్చింది. ఆమే హెలెన్. ఆమె యూనిఫాంలోని మమ్మల్ని చూసి అడిగింది.
‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?’
‘హెలెన్! ఇంక దాచి లాభం లేదు. జరిగింది వాళ్లకి చెప్పను’ కూపర్ ఆమెతో లోగొంతుకతో చెప్పాడు.
‘దాంతో నాకేం సంబంధం లేదు’ హెలెన్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి చెప్పింది.
‘శవాన్ని దాచడంలో మీరు సహాయం చేశారని మీ భర్త చెప్పారు. కాబట్టి మీరు సహదోషి అవుతారు’ సేమ్ చెప్పాడు.
తవ్వి శవాన్ని బయటికి తీశారు. అడుగు లోతులోనే శవం బయటపడింది. ప్రశ్నిస్తే భర్త చెప్పిందే తేడా లేకుండా ఆమె కూడా చెప్పింది.
‘అసలు మీ పొరుగతను హెన్రీ మీ ఇంటికి ఎందుకు వచ్చాడు?’ అడిగాను.
‘కూపర్ రావడానికి పావుగంట ముందు వచ్చాడు. అతనూ తాగి ఉన్నాడు. నా చేతిని పట్టుకోపోతే బయటకి వెళ్లమన్నాను. కాని వెళ్లలేదు. ఈలోగా కూపర్ తూలుతూ లోపలకి వచ్చాడు. వారి మధ్య వాదన మొదలైంది. కూపర్ తాగడానికి బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఉంటే ఇది జరిగేది కాదు. అతని తాగుడే దీనికంతటికీ కారణం. జార్జ్! నిన్ను తాగుడు ఆపమని ఎన్నిసార్లు అర్థించాను?’ ఆమె తీవ్రంగా చూస్తూ భర్తని అడిగింది.

‘నువ్వు చెప్పింది నిజమే’ అతను లోగొంతుకతో చెప్పాడు.
నేను పక్కింట్లోని హతుడి భార్యని పిలిపించి, శవాన్ని గుర్తు పట్టమని కోరాను. ఆమె గుర్తు పట్టింది. కాని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే స్థితిలో లేదు. ఆమె డాక్టర్ నంబర్ తీసుకుని, జరిగింది చెప్పి, ఆమెకి నిద్ర మాత్రని ఇవ్వమని సూచించాను. కూపర్ ఫైర్ ప్లేస్ పక్కన ఉన్న, తను ఉపయోగించిన పోకర్ని చూపించాడు. దానికి అంటిన రక్తం ఎండిపోయింది. వేలిముద్రల కోసం దాన్ని లేబ్‌కి తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో శవాన్ని మార్చురీకి తరలించాక నిందిత దంపతులు ఇద్దర్నీ మేము ప్రశ్నించి స్టేట్‌మెంట్స్ తీసుకోడానికి హెడ్ క్వార్టర్స్‌కి తీసుకెళ్లాం. హత్యలో సహదోషిగా హెలెన్‌ని కూడా అరెస్ట్ చేశాం.
* * *
‘హెన్రీ మాయమైన రోజు గురించి చెప్పండి. హెన్రీ మాయమయ్యాడని శుక్రవారం రాత్రి పదికి మీరు రిపోర్ట్ చేశారా?’ మర్నాడు హతుడి భార్యని పిలిపించి ప్రశ్నించాను.
‘కాదు. శనివారం ఉదయం రిపోర్ట్ చేశాను. శుక్రవారం రాత్రి అతనికి ఇష్టమైన స్ట్ఫ్‌డ్ పెప్పర్ వండాను. ఎనిమిది గంటలకి ఇద్దరం కలిసి భోజనం ముగించాం. అప్పుడు బయటికి వెళ్లి మళ్లీ ఇంటికి రాలేదు. రాత్రి ఇంటికి రాకపోవడం అదే మొదటిసారి. ఉదయం కూడా రాకపోవడంతో ఆయనకి ఏదైనా అయిందని భయం వేసింది’
‘శుక్రవారం రాత్రి మీ వారు ఎక్కడికి వెళ్లారో తెలుసా?’
‘తెలీదు’
‘అతను హెలెన్ వెంటపడుతున్నాడని తెలుసా?’
‘తెలుసు. ఇది మా కాలనీలో చాలామందికి తెలుసు. మా ఆయన అందగాడు. నేను సామాన్యంగా ఉంటాను’
* * *
శవ పరీక్ష చేసిన డాక్టర్ పంపిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని చదివాను. వెంటనే ఆయనకి ఫోన్ చేసి అడిగాను.
‘తల పగలడం వల్ల మరణం సంభవించింది నిజమే. కాని మీరు తారీకు విషయంలో పొరబడినట్లున్నారు?’
‘తారీకే కాదు. హత్యా సమయం విషయంలో కూడా పొరపడలేదు. అతను భోజనంలో స్ట్ఫ్‌డ్ పెప్పర్ ఎప్పుడు తిన్నాడు? అది తిన్నాక జీర్ణం అవలేదు. శవం చల్లటి ప్రదేశంలో ఉంచబడింది. శవం ఉబ్బలేదు కాబట్టి శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయమే మరణించి ఉండాలి’
‘సోమవారం రాత్రి మరణించలేదా?’ అడిగాను.
‘లేదు’
ఇంటరాగేషన్‌కి నిందితులని పిలిపించి హెలెన్‌ని అడిగాను.
‘మీరు హతుడితో ఎంత స్నేహంగా ఉండేవారు?’
‘ఏమిటి మీ ఉద్దేశం?’
‘మీ కాలనీలో ఇది అందరికీ తెలిసిన విషయమే’
‘మీ పోలీసులు పుకార్లని కూడా నమ్ముతారా?’ కోపంగా అడిగింది.
‘పుకార్ల వల్ల చాలా కేసులు పరిష్కరించబడ్డాయి. హతుడు మరణించింది సోమవారం రాత్రి కాదు. శుక్రవారం రాత్రి’ చెప్పాను.
‘మూడు రోజుల ముందా? ఇదెలా సాధ్యం?’ కూపర్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘దానికి మీ ఆవిడ జవాబు చెప్పాలి’ చెప్పాను.
‘నిజమా? మూడు రోజులుగా ఆ శవం మనింట్లో ఉందా?’ హెలెన్‌ని ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఇతను అబద్ధం చెప్తున్నాడు’ హెలెన్ అరిచింది.
‘పోలీసుల శవ పరీక్షలో అది తెలిసింది’
‘ఐతే వారు పొరపడ్డారు’ హెలెన్ చెప్పింది. తర్వాత తల విదిలించి చెప్పింది.
‘నా భర్త శుక్రవారం రాత్రే అతన్ని చంపాడు. ఎక్సయిట్‌మెంట్లో నేను...’
నేను ఆమె వంకే గుచ్చిగుచ్చి చూస్తూండిపోయాను. కొద్దిసేపటికి నిస్సహాయంగా చూస్తూ చెప్పింది.
‘నేను కావాలని అతన్ని చంపలేదు. అప్పటికప్పుడు... అతను ఆ మాట చెప్పాక...’ ఆగిపోయింది.
‘ఏ మాట అన్నాక?’ అందించాను.
‘తను ఇక నన్ను కలవడానికి రానని చెప్పాక. సామాన్యురాలైన తన భార్య అంటే ప్రేమని, తను ఆమెనే ప్రేమిస్తున్నాడని, నాతో జరిగింది చిన్న వ్యవహారమని చెప్పాడు. దాంతో నాకు పిచ్చి కోపం వచ్చి పోకర్ని అందుకుని... తర్వాత ఏం చేయాలో తోచలేదు. మొదటి రాత్రి అలమరలో దాచాను. దుర్వాసన వస్తుందని శనివారం ఉదయం బాత్ టబ్‌లో ఉంచి ఐస్ కొనుక్కొచ్చి నింపాను. తర్వాత నాకీ ఆలోచన వచ్చింది. జార్జ్ తప్పతాగి ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతోందో అతనికి గుర్తుండదని నాకు తెలుసు’
‘మీకు ఇలా జరిగిందని తెలీదు కదా?’ జార్జ్‌ని ప్రశ్నించాను.
‘అనుమానించాను తప్ప తెలీదు. హెలెనే అతన్ని చంపి ఉండచ్చన్న ఆలోచన నాకు రాకపోలేదు. హత్యని ఎలా పరిశోధించాలో నాకు తెలీదు. ఇందులో పోలీసులని దింపితే అసలు నిజం బయటకి తీస్తారనుకుని మీ దగ్గరికి వచ్చాను. హెలెన్ నిర్దోషి అయితే నాకు శిక్ష పడటం సబబు అనుకున్నాను’ కూపర్ విషాదంగా చెప్పాడు.
హెలెన్ చేతుల్లో మొహం కప్పుకుని ఏడవసాగింది.
(రిచర్డ్ డెమింగ్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి