S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గురువే దైవం

ఆర్ష సంస్కృతిలో ‘గురు’ స్థానానికి విశిష్ఠమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. గురువుకు నిర్వచనం చెబుతూ ‘అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించేవాడనీ, నిర్గుణ పరబ్రహ్మ తత్త్వానికి వ్యక్తరూపమైన సగుణ బ్రహ్మ స్వరూపమే గురువు’ అన్నారు. ‘ఈశ్వరో గురు రాత్మేతి’ - ఈశ్వరుడు, గురువు, ఆత్మ అభిన్నములని శ్రీశంకర భగవత్పాదులు అంటే, ‘ఒకే వస్తువు యొక్క భిన్న స్వరూపాలు’ అని భగవాన్ శ్రీరమణ మహర్షి సెలవిచ్చారు.
భారతీయ సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రవక్త కాని, గ్రంథం కాని లేదు. కానీ, వేదాల ఆధారంగా విస్తరిల్లిన పురాణేతిహాస ధర్మశాస్త్రాలన్నిటికీ ఒకే ఒక కర్తగా చెప్పుకోవలసి వస్తే శ్రీ వేదవ్యాసులు వారినే ప్రస్తావించాలి. భారతీయ సంస్కృతికి శ్రీ వాస్యుడే జగద్గురువు.
భారతీయ ఆధ్యాత్మిక, తాత్త్విక, సాంస్కృతిక, బౌద్ధిక రంగాలలో వ్యాస ప్రస్థానం ఒక అద్భుత ఘటన. ప్రతి మన్వంతరం ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు అవతరిస్తాడని, అది వ్యవహార నామం కాక ఒక పదవీ పీఠం వంటిదని, ఒక్కొక్క ద్వాపరంలో ఒక మహాజ్ఞాని ఆ పీఠాన్ని అధిష్ఠిస్తాడని పురాణ వాఙ్మయం తెలియజేస్తున్నది మానవ జాతికి జ్ఞానభిక్ష పెట్టుటకై కృతయుగంలో దక్షిణామూర్తిగా, ద్వాపరంలో వ్యాసునిగా, కలియుగంలో శ్రీ శంకర భగవత్పాదులుగా ఈ మన్వంతరంలో అవతరించారని భారతీయుల విశ్వాసం. అంతేకాక, సృష్ట్యారంభం నుండి త్రిమూర్త్యాత్మకుడైన, పరిపూర్ణ జ్ఞానమూర్తి శ్రీ దత్తాత్రేయులు ఆదిగురువుగా అన్ని యుగాలలో చిరంజీవిగా ఉంటూ గుప్త రూపంలో మార్గదర్శనం చేస్తున్నారన్న నమ్మకం ప్రగాఢంగా ఉంది.
వ్యాసుని జన్మతిథి ఆషాఢ శుద్ధ పూర్ణిమ. నల్లని మేనిఛాయ కలవాడు కనుక ‘కృష్ణ’ నామాంకితుడు. సత్యవతీ పరాశరులకు ద్వీపంలో జన్మించిన కారణంగా ‘కృష్ణద్వైపాయునుడ’న్న పేరు వచ్చింది. పుట్టిన వెంటనే తపస్సుకై బదరికాశ్రమానికి వెళ్లిపోయిన కారణంగా బదరీ నారాయణుడని, సమస్త వేదరాశినీ వ్యాసం (విభజించడం) చేసి నాలుగు వేదాలుగా కూర్చడం చేత వేదవ్యాసుడని పేర్లు స్థిరపడ్డాయి.
వ్యాసుడు సాక్షాత్తు విష్ణ్వాంశ సంభూతుడు. సృష్ట్యారంభంలో విష్ణువు అపాంతరతముడు పేర ఆవిర్భవించాడు. ‘అంతరంగంలో అజ్ఞానాన్ని తొలగించేవాడ’ని ఈ నామానికి అర్థం. ‘ఈతడే ఈ యుగంలో వ్యాసునిగా అవతరించాడ’ని వ్యాసుని శిష్యుడు వైశంపాయనుడు చెప్పాడు. వ్యాసుని రూపంలో వేదధర్మాన్ని భువిపై ప్రతిష్ఠితం చేసిన శ్రీమహావిష్ణువు.
‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే’ అంటూ వేద నిధియైన వ్యాసుని శ్రీమన్నారాయణునిగా సంభావించి పూజిస్తున్నాం. అల్పాయుష్కులైన మానవులు తమ జీవిత కాలంలో వేదాలను అధ్యయనం చేయలేరని నాలుగు వేదాలను ఒక్కొక్క రుషి పేరున ఒక్కొక్క వేదాన్ని వ్యాప్తం చేశాడు. ఋగ్వేదాన్ని పైలుడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడు, సామవేదాన్ని జైమిని, అధర్వణ వేదాన్ని సుమంతుడు అధ్యయనం చేసి వ్యాస ఆదేశానుసారం ప్రచారం చేశారు. ధర్మం యొక్క యథార్థ స్వరూపాన్ని చెప్పేది వేదమే. వేదం బోధించిన విషయాలను ఆచరించుటయే ధర్మం. ‘గృణాతి ధర్మాది రహస్యం ఇతిగురుః’ - ధర్మాది జ్ఞాన రహస్యాలను బోధ చేయువాడు గురువు. వేదాలనే కాక, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, జ్యోతిష ఆయుర్వేదాది విద్యలకూ కూడా ఆచార్యులు వేదవ్యాసులు. నారద మహర్షి ప్రేరణతో భక్తి మార్గానికి స్ఫూర్తిని కలిగిస్తూ మహాభాగవతాన్ని అందించినదీ వేదవ్యాసుడే. భారతీయ ధర్మంలో ఏ ఉపాసనా సంప్రదాయానికి చెందినవారైనా వ్యాసుని గురువుగా అంగీకరిస్తారు. వ్యాసుని జన్మదినాన్ని ఒక అపూర్వ అవకాశంగా, ఒక పర్వదినంగా సంభావించి ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా భావించడం ఒక సత్సంప్రదాయంగా అనూచానంగా కొనసాగుతోంది. అనాదికాలంగా వస్తున్న గురుపరంపరను దివ్యౌషుము, సిద్ధౌషుము, మానవేషుము అని మూడు విధములు పెద్దలు విభాగించారు.
ప్రప్రథమంగా ఆత్మజ్ఞాన సిద్ధిని పరమేశ్వరుని యొద్ద నారాయణుడు అతని నుండి బ్రహ్మ పొందేరట. ఇది దివ్యౌషుము.
తరువాత పరంపరానుగతంగా బ్రహ్మ నుండి ఆత్మజ్ఞానం ప్రవాహమై సాగినది. ఈ పరంపరను తెలియజేస్తూ-
వ్యాసం వాసిష్ఠ నప్తారం శక్తే పీత్రమ కల్మషమ్‌
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌॥
వశిష్ఠుని మునిమనుమడు, శక్తిపౌత్రుడు, పరాశరుని పుత్రుడు, శకుని తండ్రి అయిన వ్యాసునికి వందనం అని నమస్కరించారు. శుకుని అనంతరం పిత్ర, పుత్ర క్రమమునుగాక గురు-శిష్య పరంపరగా సాగినది. గౌడపాద, గోవింద భగవత్పాద, శంకరాచార్య ఇత్యాది క్రమంలో కొనసాగింది. ఈ పరంపరను ‘సిద్ధౌషుము’ అంటారు.
శ్రీ శంకరాచార్యుల వారిచే చతురామ్నాయాలు స్థాపించబడి, తమ ముఖ్య శిష్యులను తొలి పీఠాధిపతులుగా నియుక్తులను చేశారు. ఆ పీఠాధిపత్యం అజరామరంగా నేటికీ కొనసాగుతున్న పరంపర. ఇది ‘మానవౌషుము’ అంటారు. గురువు అందించిన జ్ఞాన జ్యోతినే కాలక్రమంలో ఆ శిష్యుడే గురువు పాత్రను తీసుకుని తన శిష్యులకు అందిస్తాడు. ఇదే గురు-శిష్య సంప్రదాయం. సనాతన ధర్మజ్యోతిని దీప్తిమంతం చేసే అవిరళ ఆజ్యధార. జ్ఞానప్రదాతలుగా నిలచిన గురువులను కృతజ్ఞతా భావంతో సంస్మరించుకోవడమే వ్యాసగురుపూర్ణిమ అంతరార్థం. మాతృభక్తి వలన ఇహలోకము, పితృభక్తి వలన పరలోకము, గురుభక్తి వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని మనుస్మృతి ఉవాచ. గుర్వనుగ్రహం, గురూపదేశం లేనిదే జ్ఞానం పొందలేం. గురువు ముఖతః సంప్రాప్తించినదే ఫలవంతమైన జ్ఞానం సిద్ధిస్తుంది. గురుతత్త్వమే పరమేశ్వర తత్త్వం. రెండూ ఒక్కటేనని భారతీయ విచారధార ఉద్ఘోషిస్తున్నది.
గురు-శిష్య సంబంధం యుగాలుగా వస్తున్న పరంపరాగత సంప్రదాయం. శ్రీరాముడు వశిష్ఠుని వద్ద, శ్రీకృష్ణుడు సాందీపని ముని వద్ద, ఆదిశంకరులు గోవింద భగవత్పాదుల వద్ద శిష్యులై బ్రహ్మోపదేశం పొందేరు. వీరందరూ అవతారమూర్తులు. రామానుజ, ఆనందతీర్థ, రామకృష్ణ పరమహంస, స్వామిరామతీర్థ, వివేకానంద, కంచి మహాస్వామి, చిన్మయానంద, యోగానంద వంటి మహనీయులందరూ గురువుల నాశ్రయించి కృతార్థులయ్యారు.
అట్టి గురుపరంపరను సంస్మరించుకుని, వందనములర్పించి, తమతమ గురువులలో వ్యాస భగవానుని సంభావించి బ్రహ్మజ్ఞాన సాధనలో ముందుకు సాగుటయే వ్యాసగురుపూర్ణిమ యొక్క పరమార్థం.

-ఎ.సీతారామారావు