S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆమె జీవితాన్ని జయించింది! (కథ)

కథల పోటీలో ఎంపికైన రచన
**
ఇంటి వెనుక ఉన్న లాన్‌లో కూర్చుని ఏదో పుస్తకం దీక్షగా చదువుతున్నాడు ప్రసాదరావు.
కూర్చుని అరగంట కాక ముందే ఆయన భార్య రమాదేవి - ‘ఏమండీ.. ఏమండోయ్.. ఓసారిలా వస్తారా? మళ్లీ వెళ్దురుగాని..’ అంటూ వచ్చింది.
అది విని వెంటనే లేవలేదాయన. తల మాత్రం అటు తిప్పి అడిగాడు- ‘ఏమైందే?... ఏమిటా కంగారు? ఏదైనా అర్జంటా?...’
ఏదో పనిలో ఉండి వచ్చిందేమో - కొద్దిగా చెదిరిన ముంగురుల్ని చేతివేళ్లతోనే వెనక్కి దువ్వుకుంటూ వచ్చి ‘ఎవరో ఒకావిడ వచ్చిందండీ... శారదట! ఆమె ఎవరో, ఎక్కడ్నుంచి వచ్చిందో, ఎందుకొచ్చిందో నేనెంత అడిగినా చెప్పటం లేదు. మీతోనే మాట్లాడాలట!’ అంది విపులంగా.
‘శా..రద...! శారద!!’ - ఆయన పెదవులు అస్పష్టంగా పలుకుతూండగా... అసంకల్పితంగానే ఆయన భృకుటి ముడివడింది. వృత్తిరీత్యా ఆయన తరచూ క్యాంపులకీ, వేర్వేరు ఊళ్లకీ తిరుగుతూంటాడు. ఆ ప్రస్థానంలో ఎందరో తారసపడుతూంటారు. పలకరింతగానో, పరిచయం కోసమో ఎంతమందో తనతో మాట్లాడ్తుంటారు.
ఒక్కొక్కరి జీవన పయనంలో ఎన్నో రకాల సంఘటనలు, విశేషాలు, ఎందరో వ్యక్తులు తారసపడ్తుంటారు. అలాగే వారి జ్ఞాపకాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. వాటిలో అన్నీ గుర్తుండకపోవచ్చు. వాటిలో హృదయాన్ని తాకిన సంగతులు కూడా ఉండవచ్చు. కానీ వాటిని ఎల్లకాలమూ పదిలంగా మనసులో ఉంచుకోలేం కదా! తన జీవన పయనంలో అలాంటి సంఘటనలేమైనా జరిగి ఉంటే.. మరి, ఈ ‘శారద’ అనే పేరు మాత్రం వెంటనే గుర్తు రావడంలేదు.
ఆవిడ మాత్రం తననే వెదుక్కుంటూ ఇంటి వరకూ వచ్చిందంటే..?!
‘అబ్బఁ.. త్వరగారండి - తర్వాత చదువుకుందురు గానీ..’ రమాదేవి విసుక్కుంటూ లోపలికొచ్చింది.
ప్రసాదరావు అన్యమనస్కంగానే కుర్చీలోంచి లేచి బయటికొచ్చాడు.
భుజం చుట్టూ కొంగు కప్పుకొని గుమ్మం దగ్గర వినయంగా నిలబడి వున్న ‘ఆమె’ ముఖంలోకి పరీక్షగా చూశాడు. నిజమో, కాదో తెలీదుగానీ... జీవితంలో ఎన్నో వొడిదుడుకులకి గురై అన్నిటినీ దాటుకుంటూ తుది వరకొచ్చిన శ్రమ తాలూకు విజయం ఆ కళ్లల్లో కనబడ్తున్నట్లుగా అన్పిస్తోంది ఆమెని చూస్తూంటే.
‘నమస్కారం సార్..’ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ అన్నదామె.
ఒక్క క్షణం తటపటాయించి, ఇంటి దాకా వచ్చిన వ్యక్తి ఎవరైతేనేం - అతిథిలా భావించి ఇంట్లో కూర్చోబెట్టకుండా ఉండడం భావ్యం కాదనిపించింది. అందుకే ఆమెని ‘లోపలికి రండమ్మా.. కూర్చుని మాట్లాడదాం!’ అని లోపలికి నడిచాడు. ఆయన వెనకే ఆమె లోపలికి అడుగుపెట్టి హాల్లోని సోఫాలో కూర్చున్న తర్వాత తనూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు ప్రసాదరావు.
చుట్టుపక్కల ఎటూ చూడటం లేదామె. ఆయన వంకే కన్నార్పకుండా చూస్తోంది. ఆమె కళ్లనిండా కృతజ్ఞతా భావం సముద్రంలా నిండి ఉంది. అది గమనించి కాస్త ఇబ్బందిగా కదిలాడు ప్రసాదరావు. ఆ తర్వాత తలతిప్పి - ‘రమా.. కాస్త మంచినీళ్లు తీసుకురా!’ అని చెప్పాడు.
‘ఆఁ.. ఆఁ.. అలాగే!’ లోపల్నుంచే బదులిచ్చింది రమాదేవి.
తనను తాను సర్దుకుంటూ కూర్చున్నాడు ప్రసాదరావు. ఆమె ఎవరో తనకింకా గుర్తుకు రాకపోయినా.. ఆమెకి తను బాగా తెలిసినవాడే అన్న విషయం ఆమె వాలకాన్ని చూస్తూంటే అర్థమవుతోంది.
‘ఊఁ.. చెప్పమ్మా..’ అన్నాడు విషయంలోకి వస్తున్నట్లుగా.
‘మా అమ్మాయి ‘శే్వత’ ఇప్పుడు మంచి కూచిపూడి డాన్సరయ్యింది సార్! ఇప్పటిదాకా నూట యాభై ప్రదర్శనలిచ్చింది. వాటి గురించి తెలిసి లండన్ వాళ్లట.. వాళ్ల దేశంలో ప్రోగ్రాం ఇవ్వమని అడిగారు. వచ్చే నెలలో అక్కడికి వెళ్లబోతున్నాం...’ చకచకా చెప్పుకుపోతున్న ఆమె మాటలు విన్నాడే కాని, ‘అసలు ఆమెకి తనతో పనేమిటి?’ అన్న విషయం మాత్రం అర్థం కాలేదు ప్రసాదరావుకి.
‘శే్వత? ఈ పేరు విన్నట్లుగానే ఉంది. అసలు నిన్నా, మొన్నా తన మాటల్లో కూడా ఈ ‘శే్వత’ అనే పేరు దొర్లినట్లుగానే అనిపిస్తోంది. కానీ, ఎవరో గుర్తు రావడంలేదు. ఎవరా శే్వత? ‘మా అమ్మాయి’ అని ఈవిడ చెప్తోంది గానీ.. నాకు మాత్రం అస్సలు గుర్తు రావడం లేదే? అసలేంటి విషయం?’ అనుకుంటూ ఏం మాట్లాడాలో తెలీక వౌనంగా ఆమె చెప్పేది వినసాగాడు ప్రసాదరావు. అది తెలియని శారద ఆయనకు తన గురించి అంతా తెలుసనే అనుకొని గుక్కతిప్పుకోకుండా చెప్పసాగింది.
అంతలో.. లోపల్నుంచి రమాదేవి రెండు మంచినీళ్ల గ్లాసులు, రెండు కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొని తీసుకువచ్చి వారి ముందున్న టీపాయ్ పై పెట్టింది.
‘తీసుకోండమ్మా...’ అన్నాడు ప్రసాదరావు - శారద వైపు చూస్తూ. కానీ, తీసుకోలేదామె.
తను చెప్పే మాటలకు ఆయన ఏ విధంగానూ స్పందించక పోవడం గమనించిన శారదకి కాస్త అనుమానం కలిగింది. కాసేపు ఆయననే పరిశీలనగా చూసింది.
‘సార్.. నేనెవరో మీకు గుర్తుకు రాలేదా?’ అనడిగింది సందేహంగా.
చెప్పక తప్పలేదాయనకి - ‘క్షమించమ్మా.. నిజంగానే నాకు గుర్తు రావడంలేదు...’ అన్నాడు.
అది విన్న వెంటనే ఆమె మనసు నొచ్చుకుంది.
రమాదేవి కూడా భర్త పక్కనే కూర్చుంది విషయం తెలుసుకోవడానికి.
‘పదహారేళ్ల క్రిందటి విషయం సార్...’ గుర్తు చేస్తున్నట్లుగా మొదలుపెట్టింది శారద.
భార్యాభర్తలిద్దరూ ఆసక్తిగా వినసాగారు.
‘కొత్తపేటలోని ‘సంజీవని’ హాస్పిటల్‌లో నేను అబార్షన్ కోసం అడ్మిట్ అయ్యాను. అప్పుడే నా బెడ్ పక్కనే మీకు తెలిసిన పేషెంట్ ఎవర్నో పరామర్శించడానికి మీరొచ్చారు. నాకు తలెత్తిన పరిస్థితిపై నేననుభవిస్తున్న మానసిక క్షోభను, దానికి పరిష్కారం లేని ఆలోచనలతో చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్న నా బాధని మా అమ్మకు నేను వివరిస్తూ తల్లడిల్లిపోతున్నప్పుడు - ఏ మూల ఏ దైవశక్తి నాపై దయ తలిచిందో అన్నట్లుగా మీరు ధైర్యాన్నిస్తూ చెప్పిన నాలుగు మాటలు నాకు బ్రతుకుపై ఆశ కలిగించాయి. నా భర్త నన్నూ, నా బిడ్డనూ పోషించలేని అసమర్థుడు మాత్రమే కాదు - అతనొక వ్యసనపరుడు, వ్యక్తిత్వం లేనివాడు. నా సంసార జీవితం నూరేళ్లు చల్లగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న నాకు - పెళ్లైన మూడేళ్లకే నరకం చూపించాడు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా బ్రతుకు మరింత దిగజారిపోయింది. తను సంపాదించకపోగా - ఇంట్లోని విలువైన వస్తువులన్నింటినీ తన తాగుడుకే తగలబెట్టాడు.
అంతేకాదు, ఇల్లు గడిచేందుకు పది మంది ఇళ్లల్లో చాకిరీ చేసి నేను తెచ్చే నాలుగు డబ్బుల్ని కూడా దౌర్జన్యంగా లాక్కుని తాగేసేవాడు. ఆత్మహత్యకు పూనుకునే స్థితికి వచ్చిన నా సమస్యలు అందరికీ చాలా తేలికగా అన్పించవచ్చు. కానీ, నాకు అలా అన్పించకపోవడం వల్లే ఆ ప్రయత్నం చేశాను.
మా అమ్మతో నేను రహస్యంగా చెప్పుకుంటున్న నా బాధా, వేదనా అన్నీ విన్నారు మీరు. ఆ తర్వాత మా అమ్మ నాకు ధైర్యం చెబుతూంటే.. మధ్యలో మీరు కలుగజేసుకొని, ‘జీవితం’ విలువ గురించి నాకు అర్థమయ్యేట్లు చెప్పారు. ‘చూడమ్మా.. చనిపోవడానికి నువ్వు చూపించిన ధైర్యం, తెగువా - బ్రతకడానికి చూపించు. అప్పుడు నీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి!’ అని ఆ రోజు మీరు అన్న మాటలు నాకు కొత్త ధైర్యాన్నిచ్చాయి. ఆ తర్వాత మొండి ధైర్యం తెచ్చుకొని, నా బిడ్డను తీసుకొని నా భర్త నుంచి దూరంగా వచ్చేశాను. అక్కడా, ఇక్కడా నాలుగిళ్లలో పని చేసుకుంటూ నా కూతురు శే్వతను చదివించుకొంటూ పెంచి పెద్ద చేశాను. తను ఇప్పుడు మంచి కూచిపూడి డాన్సర్ అయ్యింది..’ అని, ఉద్వేగాన్ని ఆపుకొనే ప్రయత్నంలో రెండు క్షణాలు ఆగిందామె.
ప్రసాదరావు ఆశ్చర్యంగా వినసాగాడు....
ఆమె మళ్లీ చెప్పసాగింది. ‘సార్! ఇనే్నళ్లలో నాకు ఎన్నోసార్లు బాధలూ, కష్టాలూ ఎదురయ్యాయి. కానీ, ఎప్పుడూ పిరికిదానిలా చనిపోవాలని మాత్రం అనుకోలేదు సార్! ప్రతి కష్టంలోనూ ‘చనిపోవడానికి నువ్వు చూపించిన ధైర్యం, తెగువా - బ్రతకడానికి చూపించు. అప్పుడు నీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి!’ అన్న మీ మాటలే గుర్తు తెచ్చుకొనేదానిని. ఎక్కడలేని గుండె ధైర్యం కలిగేది. ఆ ధైర్యంతోనే ప్రతి కష్టాన్నీ దాటుకుంటూ వచ్చాను సార్! ఇప్పుడు నాకు భవిష్యత్తు కూడా సంతోషంగా కనపడుతూంది..’ అని ఓ క్షణం ఆగి, ‘ఇప్పుడు మా అమ్మాయి మంచి కూచిపూడి డాన్సర్ మాత్రమే కాదు సార్.. మొన్న జరిగిన పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రం మొత్తం మీద అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఫస్ట్‌న పాసయ్యింది...’
ప్రసాదరావు నమ్మలేకపోయాడు. ఏదో సాటి మనిషిగా ఒక అభాగ్యురాలికి ధైర్యాన్నివ్వడానికి తాను చెప్పిన నాలుగు మాటలు ఆ వ్యక్తి మీద ఎంతటి ప్రభావాన్ని చూపించాయో - కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తూంటే.. అనిర్వచనీయ అనుభూతితో అతడి మేను జలదరించింది.
వెంటనే తేరుకొని - ‘అవునూ.. మీ అమ్మాయి పేరేమిటన్నావ్?’ అనడిగాడు.
‘శే్వత.. శే్వత సార్!’ అందామె ఉద్వేగంగా.
అప్పుడు గుర్తొచ్చింది ప్రసాదరావుకి - పది రోజుల క్రితం అన్ని దినపత్రికల్లో పదవ తరగతి ఫలితాలు ప్రకటిస్తూ ‘స్టేట్ ఫస్ట్’ వచ్చిన శే్వత అనే అమ్మాయి ఫొటో ప్రచురించిన విషయం! అంతేకాదు, ఆ రోజు రాత్రి టీవీ న్యూస్ ఛానల్స్‌లో ఆ అమ్మాయిని చూపిస్తూ నాలుగు మాటలు మాట్లాడిస్తున్న సమయంలో - ఆ పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన తన మనవడికి అది చూపిస్తూ ‘ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా!’ అని తను అన్న మాటలు కూడా గుర్తొచ్చాయ్. అయితే, ఆ ‘శే్వత’ అనే అమ్మాయి ఈ ‘శారద’ కూతురు అన్నమాట!
‘సార్...’ అంటూ శారద పిలిచిన పిలుపునకు ఆలోచనల్లోంచి తేరుకొని, ఆమె వైపు చూశాడు.
‘సార్! స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిన సందర్భంలో ఈ రోజు సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో మా శే్వతకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కారం, ప్రశంసా పత్రం ఇస్తున్నారు. మీరు తప్పకుండా వచ్చి నా బిడ్డకు మీ దీవెనలు అందించండి సార్! ఇందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీ మాటలు నా జీవితాన్ని నిలబెట్టాయి... మీ ఆశీర్వాదం నా కూతురు భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్న నా నమ్మకం!’ కళ్లల్లో నీటిసుడులు కమ్ముకుంటూండగా.. అభ్యర్థనగా అంది శారద.
ప్రసాదరావు వెంటనే బదులివ్వలేదు. సాలోచనగా ఎటో చూస్తూ వౌనంగా ఉండిపోయాడు. ఆయన స్పందన అర్థంకాక - ఉద్వేగంగా ఆయన ముఖంలోకి చూడసాగింది శారద.
కొద్దిసేపటి తర్వాత - మనసులోని భావాలన్నిటికీ ఓ రూపం వచ్చినట్లుగా తల పంకిస్తూ... శారద వైపు తిరిగి అన్నాడు ప్రసాదరావు.
‘చూడమ్మా శారదా! ఆనాడు నీతో చెప్పినట్లుగా కష్టాల్లో ఉన్న చాలామందికి ధైర్యాన్నిచ్చే మాటలు నేను ఎంతోమందికి చెప్పాను. వాళ్లందరూ నా మాటల్ని ఎలా స్వీకరించారో నాకైతే తెలీదుగానీ - నేను చెప్పిన ఆ నాలుగు మాటలతోనే నీ జీవితాన్ని నిలబెట్టుకోవడమే కాక - నీ కూతుర్ని కూడా చక్కగా పెంచి, ప్రతిభావంతురాలిగా తీర్చిదిద్దావు. అందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా మాటల్ని వృధా పోనీయక - ఇంతటి ప్రయోజకత్వాన్ని చేకూర్చి చూపావు. నువ్వు సాధించిన ఈ ప్రయోజకత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కదా!’
శారద అర్థం కానట్లు అయోమయంగా చూసింది.
అప్పటివరకూ ప్రసాదరావు పక్కనే కూర్చొని, జరిగేదంతా వౌనంగా చూస్తూ, వింటూ వున్న రమాదేవి అప్పుడు పెదవి కదిపింది-
‘ఏం లేదు శారదా! స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన మీ శే్వతని మొన్న టీవీలో ఇంటర్వ్యూ చేస్తూన్న యాంకర్ అడిగిన ప్రశ్నకి ‘నాకు డాక్టర్ కావాలని ఉంది. కానీ, మా ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఆ కోర్స్ చేయలేను’ అని శే్వత చెప్పడం మేమూ చూశాం. ఇక ఆ దిగులు పెట్టుకోవద్దని మీ అమ్మాయికి చెప్పు. మీ శే్వత మెడిసిన్ చదివేందుకు అయ్యే ఖర్చు మొత్తం మేము భరిస్తాం. అలా మా బాధ్యతని నెరవేరుస్తాం... సరేనా!’
శారదకి వెంటనే అర్థం కాలేదు.
కాసేపటికి రమాదేవి మాటల్లోని సారం పూర్తిగా అవగతమయ్యాక - మనసులోని ఉద్వేగం, ఆనందం ఒక్కసారిగా భళ్లున బ్రద్దలయ్యేసరికి- ‘సార్... అమ్మా...’ అంటూ భోరుమంటూ ముందుకొచ్చి రెండు చేతుల్తోనూ ఆ భార్యాభర్తల కాళ్లను చుట్టేసి, ఆనంద బాష్పాలతో కన్నీరు మున్నీరవసాగింది.
ప్రసాదరావు ఆమెని వారించే ప్రయత్నం చేయలేదు...
‘అర్ధాంగి’ అన్న పదానికి నిజమైన నిర్వచనంలా.. తన మనసునీ, మాటల్నే కాదు - తన ఊపిరిని సైతం మాటల్లోకి అనువదించి పలికిన భార్య రమాదేవి వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఉండిపోయాడు.

యస్వీ కృష్ణ 19-20, పి అండ్ టి కాలనీ దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-500 060 93999 39302