S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పులుల అడుగుజాడలేవీ?

రాజసానికి అది చిహ్నం...
అందానికి అది గుర్తు..
సాహసానికి మారుపేరు..
దూకుడుతోకూడిన జీవనశైలికి చిహ్నం..
అదే పెద్దపులి...బెబ్బులి...
ఇప్పుడు దానికి పెద్దకష్టమొచ్చిపడింది.
ఆ జాతి ఇప్పుడు అంతరించిపోయే దశకు చేరుకుంది..అతివేగంగా..
భావి తరాలకు పులుల గురించి చెప్పాల్సి వస్తే బొమ్మలు చూపించే చెప్పే పరిస్థితులు దాపురించాయి. ఈ పరిస్థితికి మనమే కారణం.
ఒకప్పుడు అలా.. ఇప్పుడిలా..
పెద్దపులులు ఆవాసం ఒకప్పుడు ఆసియా, పశ్చిమాన టర్కీ, తూర్పున రష్యా ప్రాంతాలకు విస్తరించి ఉండేది. ముఖ్యంగా భారత ఉపఖండంలో వాటి ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. రష్యాలోని సైబీరియా, మలేషియా, బాలి, శ్రీలంక, బంగ్లాదేశ్-్భరత్‌లోని సుందర్‌బన్ అటవీప్రాంతం, చైనా ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన జాతితో పులుల సంతతి గణనీయంగా ఉండేది. బెంగాల్ టైగర్‌ను చూస్తే దాని దర్పం, ఆకర్షణీయమైన మేని, ఉట్టిపడే రాజసం ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్, వియత్నాం, ఉత్తర,దక్షిణ కొరియాల్లోనూ వాటి సంచారం ఎక్కువగానే ఉండేది. కానీ ఆధునిక మానవుడి అభివృద్ది కాంక్ష వాటి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. పెరిగిన నగరాలు, పట్టణీకరణతో అడవుల విస్తీర్ణం అతివేగంగా, గణనీయంగా తగ్గిపోయింది. అవి మనుగడ సాగించే ఆవాస ప్రాంతం తగ్గిపోవడంతో వాటికి ఆహార లభ్యత తగ్గిపోయింది. అవి సంచరించే ప్రాంతం లేక వాటి మనుగడ దెబ్బతింది. దీంతో వాటి సంఖ్య రానురాను తగ్గిపోయింది. భూమీద పిల్లి జాతికి చెందిన ఈ పెద్దపులులు మిగతా పిల్లిజాతి జీవులకన్నా ఎంతో విలక్షణమైన, విభిన్నమైన జంతువులు. అయితే మానవుడి అకృత్యాలవల్ల అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. పులిచర్మం, పులి ఎముకలు, గోర్లు, వెంట్రుకలు ఇలా దాని శరీరంలోని అన్ని భాగాలకూ విపణిలో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని విశృంఖలంగా వేటాడుతున్నారు. ముఖ్యంగా చైనాలో ఇది అపరిమిత స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆ దేశంలో కొన్ని జాతుల పులులు పూర్తిగా అంతరించిపోగా మిగిలినవి పదులసంఖ్యలోనే ఉన్నాయి. అయితే చైనాలో ఔషధ, ఆహార, ఆధ్యాత్మిక రంగాల్లో పులులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కాసులు కురస్తుండడంతో ఇతర దేశాల్లోనూ వేటగాళ్లనుంచి వాటికి పెద్దఎత్తున ప్రమాదం ఎదురౌతోంది. వాతావరణంలో మార్పులవల్లకూడా వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత ఉపఖండంలో సముద్రనీటిమట్టం ఒక అడుగుమేర పెరుగుతుందని అంచనా అదే జరిగితే భారత్, బంగ్లాదేశ్ మధ్య విస్తరించిన సుందర్‌బన్ మడ అడవులు నీట మునుగుతాయి. పెద్దపులులు, ముఖ్యం గా బెంగాల్ టైగర్ జాతి ఉన్నది అక్కడే. అదీ చెప్పుకోదగ్గ స్థాయిలో. ఆ వనాలు అంతరిస్తే ఆ జాతియావత్తు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పులులను కాపాడేందుకు ప్రపంచం నడుంకట్టింది.
జూలై 29 టైగర్స్ డే
పులులు అంతరించిపోకుండా చర్యలు తీసుకోవాలని, వాటి సంరక్షణకు ప్రత్యేక పథకాలు చేపట్టాలని, పులుల వేటను నిషేధించి, అక్రమాలకు పాల్పడేవారి ఆటకట్టించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన సదస్సులో జూలై 29 టైగర్స్‌డేగా ప్రకటించారు. పులుల ప్రత్యేకత, వాటి ప్రస్తుత పరిస్తితి, వాటి సంఖ్య పెంచేందుకు చర్యలు, వేటపై నిషేధం వంటి అంశాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. పాంథెరా కార్పొరేషన్, టైగర్ ఆర్గనేజేషన్, వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ వంటి సంస్థలు ఈ లక్ష్యంకోసం విస్తృతంగా పనిచేస్తున్నాయి.
పులుల అంతర్థానం ఇలా...
ఈ భూమీద 2వేల మిలియన్ ఏళ్లక్రితంనుంచి జీవిస్తున్న పెద్దపులులు ఆసియా దేశాల్లో ఒకప్పుడు గణనీయసంఖ్యలో ఉండేవి. 1900నాటికి ప్రపంచంలో లక్ష పులులు ఉండేవి. ఆ తరువాత మానవుడి చర్యల వల్ల చాలావేగంగా తగ్గిపోతూ వచ్చింది. 1973నాటికి 1200 పులులు మాత్రమే మిగిలాయి. ఆ విపరీత పరిణామం చూసి ప్రపంచం ఉలిక్కిపడి వాటి సంరక్షణకు నడుం బిగించింది. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గట్టి చర్యలు తీసుకున్నారు. దేశంలో 25 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లను ప్రకటించి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత మరో ఎనిమిది టైగర్ రిజర్వ్ ఫారెస్టు రేంజ్‌లను ప్రకటించారు. దీంతో కొంత సానుకూల పరిణామాలు సంభవించాయి. 1990 నాటికి వాటి సంఖ్య 3500కు పెరిగింది. కానీ వేటగాళ్ల విజృంభణతో 2007నాటికి వాటి సంఖ్య 1400 చేరింది. 2011నాటికి 3200గా ఉన్న వాటి సంఖ్య గతేడాదికి 2890కు చేరుకుంది. చాలాసంవత్సరాల తరువాత వాటి సంఖ్యలో పెరుగుదల కన్పించినది గతేడాదే. ముఖ్యంగా భారత్‌లో పులుల సంఖ్య పెరగడం విశేషం. అయితే పులుల జనాభా లెక్కింపు విధానాలపై విభిన్నవాదనలు ఉన్నాయి.
ఇవి అంతరించిపోయాయ్!
పులుల జాతుల్లో ముఖ్యమైనవి 9 ఉపజాతులు. వాటిలో ప్రస్తుతం ఒకటీఅరా ఉన్నవి సైబీరియన్, బెంగాల్, ఇండోచైనీస్, మలయన్, సుమత్ర, సౌత్‌చైనా పులులు మాత్రమే. ఇవి అంతర్థాన దశకు చేరుకుంటున్నాయని వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ గ్రూప్ హెచ్చరిస్తోంది. ఎంతో విలక్షణమైన బాలి, కాస్పియన్, జావన్ టైగర్లు ఎప్పుడో అంతరించిపోయాయి. గత వందేళ్లలో 93 శాతం అడవుల విస్తీర్ణం తగ్గిపోగా 97శాతం పులులు అంతరించిపోయాయి.

ప్రస్తుతం అడవుల్లో
పులుల సంఖ్య

బంగ్లాదేశ్ - 440
భూటాన్ - 103
చైనా - 45
ఇండియా -2226
ఇండోనేషియా - 500
లావోస్ - 17
మలేసియా - 500
మయన్మార్ - 85
నేపాల్ - 198
రష్యా - 502
థాయ్‌లాండ్ - 252
వియత్నాం - 20
మొత్తం : 5283

-రవళి