S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విలువైన బహుమతి (స్ఫూర్తి)

సజయ్ పుట్టిన రోజుకి వాడి అమ్మమ్మ నించి కొరియర్లో ఓ పెట్టె బహుమతిగా వచ్చింది. స్కూల్ నించి తిరిగి వచ్చిన సజయ్‌కి తల్లి దాన్ని చూపించి చెప్పింది.
‘నీ పుట్టిన రోజు వర్కింగ్ డే వచ్చిందని ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆ రోజు తెరిస్తే బావుంటుందేమో’
సజయ్ ఉత్సాహంగా ఆదివారం కోసం ఎదురు చూడసాగాడు. అమ్మమ్మ ఏం పంపి ఉంటుందా అని ఆలోచించాడు. ఆటబొమ్మలా? బొమ్మల పుస్తకమా? చాక్లెట్లా?
ఆదివారం గిఫ్ట్ రాప్ చేసిన ఆ బహుమతిని తన కుటుంబ సభ్యుల ముందు ఆనందంగా తెరిచాడు. తెరవగానే ముందుగా లోపల ఉన్న అద్దంలో సజయ్‌కి తన ప్రతిబింబం కనిపించింది. లోపల నించి ఉత్తరం ఉన్న కవర్ని, కొన్ని చిన్న చాక్లెట్లని బయటకి తీశాడు. సజయ్ ఊహించినట్లుగానే చాక్లెట్లు, జంగిల్ బుక్ సినిమా సీడీ, బేటరీ కారు, బూట్లు, మరి కొన్ని కనిపించాయి. తర్వాత అమ్మమ్మ రాసిన ఉత్తరాన్ని తెరిచి చదివాడు.
పుట్టిన రోజుకి సజయ్‌కి అనేక ఆశీర్వచనాలతో వ్రాయునది,
నేను పంపిన పెట్టెలోని బహుమతులన్నీ నీకు నచ్చాయని అనుకుంటాను. మొత్తం ఎనిమిది బహుమతులు పంపాను. లెక్క చూసుకో.
ప్రేమతో అమ్మమ్మ
సజయ్ లెక్క చూసుకుంటే ఏడే ఉన్నాయి. మరోసారి లెక్కపెట్టి పెట్టెలోకి చూశాడు. ఖాళీ.
‘ఇదేమిటి? అమ్మమ్మకి లెక్కలు రావా? లేక ఒకటి పెట్టడం మర్చిపోయిందా?’ సజయ్ తల్లిని అడిగాడు.
‘బేంక్‌లో ఆఫీసర్‌గా చేసి రిటైరైన అమ్మమ్మకి లెక్కలు ఎందుకు రావు? ఎనిమిదోది ఏమిటో నువ్వే కనిపెట్టాలని అనుకుని ఉండచ్చు. లేదా ఫోన్ చేసి కనుక్కో’
సజయ్ వెంటనే అమ్మమ్మకి ఫోన్ చేసి, థాంక్స్ చెప్పి అడిగాడు.
‘అమ్మమ్మా! నువ్వు నాకు ఎన్ని బహుమతులు పంపావు?’
‘ఎనిమిది’
‘కాని పెట్టెలో ఏడే ఉన్నాయి?’
‘పెట్టె మూత తెరవగానే మొదటగా నీకు ఏది కనిపించిందో అది నీ మొదటి బహుమతి. అది గొప్ప నిధి కూడా’
‘పజిలా?... మొదటగా నాకు కనిపించింది అద్దం... అద్దంలో నా మొహమే’ సజయ్ చెప్పాడు.
‘అవును. నీకు నువ్వు మొదటి బహుమతి. అది నీకు ఈ రోజు గుర్తు చేయడం కూడా ఓ బహుమతి. చాలామంది పరమాత్మ ఇచ్చిన ఇది మర్చిపోయి ప్రవర్తిస్తూంటారు. ఏదో కోరుకుని అందకపోయినా, అందినది దూరం ఐనా నిరాశా నిస్పృహలకి లోనవుతూంటారు. కాని ఎవరికి వారే తోడు అన్నది జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన విషయం. తోడు కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నాం అంటే నువ్వు నీకు బహుమతి అన్న విషయాన్ని విస్మరించి ఒంటరితనాన్ని ఆహ్వానిస్తున్నట్లే’ అమ్మమ్మ చెప్పింది.
‘అర్థమైంది. నువ్వు క్రితంసారి మా ఇంటికి వచ్చి వెళ్లాక నేను చాలాసేపు నీ కోసం ఏడ్చానని నీకు అమ్మ చెప్పింది కదా? ఇక మీదట ఈ సలహాని గుర్తుంచుకుంటాను’ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ సజయ్ చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి