S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రైమ్ రచయిత

‘మీ అసలు పేరు హోరాషియో లేంబ్ యేనా?’ రియల్ ఎస్టేట్ జోన్స్ నన్ను ప్రశ్నించాడు.
‘అవును. నేను ప్రజల దృష్టిలో ఉన్న వ్యక్తిని. మీరు ఆ పేరుని గుర్తిస్తారని నమ్మాను’ చెప్పాను.
‘మీకు పోలీస్ రికార్డు ఉందా?’ అతను అకస్మాత్తుగా అడిగాడు.
‘మీరు నన్ను పొగిడారు. చాలా దగ్గరికి వచ్చారు కూడా. నిజానికి నేను డిటెక్టివ్, మిస్టరీ కథా రచయితని’
‘కానీ ఈ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకోవాలంటే మొదటి నెల అద్దె డిపాజిట్‌గా ఇవ్వాలి’
నేను గర్వంగా నా పర్స్ తెరిచి అతనికి ఆ డబ్బిస్తే అవి నకిలీ నోట్లా అని సందేహంగా పరిశీలించాడు. కాదని తృప్తి చెందాక బల్ల మీది లీజ్ డాక్యుమెంట్‌ని, పెన్‌ని నా వైపు తోశాడు. నేను సంతకం చేసి ఇచ్చాను.
ఓ తరం క్రితం డిటెక్టివ్ కథలు ఎలా ఆరంభమయ్యేవో గుర్తుందా? నాకు ముందే తెలిసి ఉంటే, ఆ పురాతన భవంతికి వెళ్లేవాడిని కాను. లేదా అలాంటి వాక్యంతో. ఈ కథని అలాంటి వాక్యంతోనే ఆరంభిస్తున్నాను. నాకు ముందే తెలిసి ఉంటే ఆ లీజ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసేవాడ్ని కాను.
* * *
అది పేరుకి గార్డెన్ అపార్ట్‌మెంట్ ఐనా కనుచూపు మేరలో తోట కాని, చెట్లు కాని లేవు. తక్కువ గడ్డి, ఎక్కువ సిమెంట్ నేల. కాని దానికి ప్రైవసీ ఉంది. బాత్‌రూం, బెడ్‌రూంతోపాటు వంట గది కూడా ఉండటంతో భోజనం కోసం బయటకి వెళ్లాల్సిన అవసరం లేదు. గది నాలుగు మూలల్లోకి నేను విడిచిన బట్టలని విసరచ్చు.
నేను నవలని ఆరంభించే ప్రయత్నం చేశాను. ఐతే నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ నా వృత్తి విషయంలో తృప్తి చెందినట్లు లేడు. గార్డెన్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఇతర అపార్ట్‌మెంట్లలోని వారిని నా పేరు గురించి విచారించాడు.
నేను అందులో చేరిన నాలుగో రోజు నా డోర్ బెల్ మోగింది. అంతదాకా నా ఇరుగు, పొరుగు నేనంటే ఆసక్తి చూపించకపోవటంతో ఎవరొచ్చారా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను.
ఎదురుగా నిలబడ్డ ఆమె అందంగా ఉంది. సాధారణంగా నేను సెక్సీ అనే పదం బదులు అందం అనే పదాన్ని నా రచనల్లో ఉపయోగిస్తూంటాను. నగరంలోని ఆడవాళ్లు ధరించే హౌస్ కోట్ వేసుకుని ఉంది. మొహానికి మేకప్ ఉంది.
‘హలో! మీరు హోరాషియో లేంబా?’ ఆమె మాట్లాడే తీరుని బట్టి ప్రతీ పదంలో ఓ పేరాగ్రాఫ్ అర్థం ఉందని నాకు అనిపించింది.
‘అవును’
‘మీరు ప్రఖ్యాత డిటెక్టివ్ కథా రచయితా?’
ఆమె నిజమైన అభిమాని అవచ్చు అనుకున్నాను. అభిమానిని ఏ రచ1త ఇంట్లోకి ఆహ్వానించకుండా ఉంటాడు?
‘మీరు డిటెక్టివ్ కథల అభిమానా?’ అడిగాను.
‘అవును. వాటిని రాసే వారి అభిమానిని కూడా. ఇది సరిగ్గా ఓ రచయిత నివాసం లానే ఉంది. మీ గురించి చెప్తారా?’ సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించింది.
తన వివరాలు చెప్పింది.
‘నేను మీ ఎడం పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటాను. నేను, నా భర్త ఉంటాం. మాకు పిల్లలు లేరు. ఆయన పేరు మాంటీ గ్రీన్. సేల్స్‌మేన్. కాబట్టి ఎక్కువగా ఇంట్లో ఉండడు. నా పేరు లేవండర్ గ్రీన్. మా ఆయన అంటూంటారు. నేను లేవండర్ కాదు, గ్రీన్ కాదు పింక్ అండ్ వైట్ అని. మీ కథల్లో అమ్మాయిలు ఉంటారు కదా మిస్టర్ లేంబ్?’ ఆమె నా మోకాళ్లకి తన మోకాళ్లు తగిలేలా జరిగి అడిగింది.
‘ఉంటారు’
‘మిస్టర్ లేంబ్! మీలాంటి వారి గురించి నాకు తెలుసు. పుస్తకాల షాపుల్లోని అన్ని పుస్తకాల మీదా అమ్మాయిల బొమ్మలు ఉంటాయి’
‘కాని ఆ బొమ్మలు ఒకోసారి తప్పుదారి పట్టిస్తాయి’ చెప్పాను.
‘నేను వాటిలో కొన్ని చదివా కూడా. లేంబ్! నన్ను చూస్తే మీకు అట్టల మీది అమ్మాయిలు గుర్తు రాలేదా?’
‘గుర్తొచ్చారు’ నిజాన్ని ఒప్పుకున్నాను.
‘ఆ అమ్మాయిల్లా నేను కూడా చెడ్డదానే్న’
‘నిజంగా?’
‘అవును. మీ కథల్లో నేను ఓ చక్కటి పాత్రని అవుతాను’
ఆ మాటలతో ఆమె నన్ను అవమానపరచింది.
‘చూడండి. మీరు నా కథలన్నీ చదివినట్లు లేరు. నేను ఆ తరహా కథలు రాయను. పైగా వ్యక్తిగతంగా అలాంటి అమ్మాయిలంటే నాకు అయిష్టం’
లేవండర్ గ్రీన్‌ని వదిలించుకోడానికి నాకు చాలా సమయం పట్టింది.
* * *
తర్వాత జరిగింది కూడా కొద్దిగా తేడాగా ఇలాంటిదే. ఈ రెండో వ్యక్తి డోర్ బెల్‌ని కొట్టలేదు. తలుపు మీదా తట్టలేదు. ఆ రోజంతా నేను ఒక్క పదం కూడా రాయలేదు. చీకట్లో సోఫాలో మొహం మీద దిండుని ఉంచుకుని నా మనసుని రాసే కథ మీద కేంద్రీకరించే ప్రయత్నంలో ఉండగా ఎవరో బలంగా కాలితో తన్నడంతో ముందు తలుపు తెరచుకుంది. నేను నా మొహం మీది దిండుని తీసేసి లేచి లైట్‌ని వెలిగించేసరికి అతను గది మధ్యలో నిలబడి చూస్తున్నాడు. నాకు వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలన్న ఆలోచన వచ్చింది.
పదహారేళ్ల అతను దృఢకాయుడు కాదు కాని వాడి మొహం, డ్రస్ చూస్తే భయం వేసింది. మిలటరీ బూట్లు, టైట్ జీన్స్, భుజాల మీద వెండి నక్షత్రాలు గల నల్లటి తోలు జాకెట్.
‘కథలు రాసే వెధవవి నువ్వేనా?’ కోపంగా అడిగాడు.
‘నేను రచయితని’ జవాబు చెప్పాను.
అతను తిరస్కారంగా చుట్టూ చూసి చెప్పాడు.
‘ఎలాంటి నరక కూపం!’
అది నా అభిప్రాయం కూడా. కాని ఓ కొత్త వ్యక్తి నించి అది వినడం నాకు ఇష్టం లేకపోయింది. అతను గుమ్మం దాటకుండానే మిగతా గదులని చూశాడు. నా దగ్గరికి వచ్చి అడిగాడు.
‘ఎలాంటి కథలు రాస్తావు?’
‘మిస్టరీ, క్రైం కథలు’
‘నీకోటి తెలుసా? నేను జె.డి.ని’
‘అంటే?’
‘జె.డి. జువెనైల్ డెలిక్వెంట్‌న్రా (బాల నేరస్థుడు) వెధవా’
‘అలాగా? నిన్ను చూడగానే పోల్చుకుని ఉండాల్సింది. కాని నేను రాసే కథలు...’
‘ఆగు వెధవా. నినే్నమైనా ప్రశ్నలు అడిగానా?’
‘లేదు’
‘మరి నువ్వెందుకు జవాబు చెప్తున్నావు?’
నేను నోరు మూసుకున్నాను.
‘నా పేరు డ్యూక్ కోర్నెల్. ఆ చివరి అపార్ట్‌మెంట్‌లో ఉంటాను. సిగరెట్ ఉందా వెధవా?’
నేను కిటికీ అంచున ఉన్న సిగరెట్ పెట్టె వంక చూపించాను. దాన్ని అందుకుని వెలిగించి రెండు దమ్ములు పీల్చి నేను రాసిన ఓ కాగితం మీద పడేసి బూటుతో నలిపేసి నిరసనగా చెప్పాడు.
‘మామూలు సిగరెట్టే ఇది’
అతనికి సిగరెట్ అవసరం లేదని, కేవలం తన పొగరుబోతుతనాన్ని ప్రదర్శించడానికే దాన్ని అడిగాడని నాకు అనిపించింది.
‘చూడు వెధవా! నాతో పెట్టుకోకు. నేను రౌడీని’
నిజానికి నాకు వాడితో పెట్టుకోవాలని లేదు.
‘జె.డి.ల మీద చాలా పుస్తకాలు వచ్చాయి. అవునా?’ కొద్ది క్షణాల తర్వాత అడిగాడు.
‘అవును’
‘నేను చేసిన అనేక నేరాల గురించి నీకు చాలా కథలు చెప్పగలను. చెప్పనా? నువ్వు నీ కథల్లో వాడుకోవచ్చు’
డ్యూక్ కోర్నెల్‌ని వదిలించుకోడానికి కూడా నాకు చాలా టైం పట్టింది.
* * *
‘నా పేరు స్టీవ్ మార్స్’. అతను నా లివింగ్ రూంలో నల్లటి సిగార్‌ని నములుతూ అటు ఇటూ నడుస్తూ చెప్పాడు.
అతని వొంటి మీది ఖరీదైన సూట్ అతని ప్రాముఖ్యతని తెలియజేస్తోంది.
‘అలాగా?’ చెప్పాను.
అతను ఆగి వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుని నా కళ్లల్లోకి చూస్తూ చెప్పాడు.
‘నేను ట్రింగో మాబ్‌కి చెందినవాడిని. ఐతే ఇప్పుడు రిటైరైపోయాను. నీ కుడివైపు అపార్ట్‌మెంట్‌లో నీలాగే నిజాయితీగల పౌరుడిగా జీవిస్తున్నాను. ఇప్పుడు నేరాలు చేయడం మానేసాను. ఐనా నువ్వు నా మీద ఎందుకు నిఘా పెట్టావు?’ అడిగాడు.
‘లేదు. నేను మీ మీద ఎలాంటి నిఘా పెట్టలేదు’ నీరసంగా చెప్పాను.
అతను తన కుడిచేతి చూపుడు వేలుని నా ముఖం వైపు గాల్లో పొడిచాడు. దాంతో ఆ చేతిలోని సిగార్ నుసి నా మీద పడ్డా క్షమాపణ చెప్పలేదు.
‘అబద్ధాలాడకు. నా పక్క అపార్ట్‌మెంట్‌లో ఓ రచయిత ఎందుకు బస చేస్తాడు? నీకు రాసేందుకు ముడి సరకు కావాలి. అవునా? నీకు నా జీవిత కథ కావాలి. కాని అది నీకు ఇవ్వను’ మరి కొంత సిగార్ నుసి నా మీదకి రాలింది.
‘మీ ముడి సరుకు నాకు అవసరం లేదు’ అతనికి హామీ ఇచ్చాను.
అతని గురించి నేను రాయకపోవడం అతనికి ఎంతటి ఓదార్పో చెప్పడానికి మాటల కోసం తడుముకున్నాను.
‘నా కథల్లో హింస ఉండదు’ చివరికి చెప్పాను.
‘చూడరా లేంబ్! నా గురించి నువ్వు ఒక్క చిన్న విషయం రాసినా తర్వాత నువ్వు చాలా బాధపడతావు. వెలిగే సిగార్ నీ అరిపాదాన్ని స్పర్శిస్తే నీకు ఇష్టమా?’
‘నాకు ఇష్టం లేదు’
‘సరే. నువ్వు ఇప్పుడు ఆ మాటంటావు కాని నేను చెక్ చేస్తూంటాను. అప్పుడప్పుడూ నేను ఇక్కడికి వచ్చి నీ టైప్‌రైటర్‌లో టైపైంది చదువుతూంటాను రా’
స్టీవ్ మార్స్‌ని బయటకి పంపడానికి నాకు చాలా టైం పట్టింది. తను చేసిన నేరాల గురించి చిన్నచిన్న కథలు చెప్పి వాటిని నేను రాయకూడదు అని హెచ్చరించసాగాడు. నాకు ఇష్టమైన ఏకాంతం నన్నొదిలిపోయింది.
* * *
‘నేను ఈ సందు చివర ఉంటాను. నా పేరు వెర్నా గేల్’ ఆమె చెప్పింది.
‘మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది’ అబద్ధమాడాను.
నా సోఫా చివరి అంచు మీద ఆమె భయపడే పక్షిలా కూర్చుంది. ఆమె లేవండర్ గ్రీన్ టైప్ కాదు. మగాడి సూట్ వేసుకోకుండా, గోధుమరంగు జుట్టుని బన్ లాగా చుట్టుకోకుండా, కొమ్ముతో చేసిన కళ్లజోడు పెట్టుకోకుండా ఉంటే ఆమె కొద్దిగా అందంగానే ఉండి ఉండేది. ఆమె చుట్టూ చూసి చిన్నగా నిట్టూర్చింది.
‘అచ్చం రచయిత ఇల్లులానే ఉంది. నేను కూడా రాసే ప్రయత్నం చేస్తున్నాను. మా అపార్ట్‌మెంట్‌లో కూడా ఇలాంటి ఫర్నిచర్ ఉంచితే మీలాగా రాయగలను అంటారా?’ అడిగింది.
నాకు ఆ రెంటికీ మధ్య గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు.
‘నేను ఫెమినిస్ట్‌ని. క్రైం సాహిత్యాన్ని ఆరాధిస్తాను. ముఖ్యంగా ఎక్కువ హింసాత్మకమైనది’
‘కానీ నేను హింసని రాయను’
‘ఇబ్బందేమిటంటే రాయడానికి నాకు ఏ ఇతివృత్తం తట్టడంలేదు. ఏ ఆలోచనా కలగడం లేదు. అసలు మీకు ఐడియాలు ఎలా వస్తాయి మిస్టర్ లేంబ్?’ ప్రశ్నించింది.
‘అందరూ అనుకున్నట్లుగా నాకు నేను కలిసే మనుషుల నించి రావు. అవి నా బుర్రలోంచి పుడుతూంటాయి’
ఆమె బూట్లని తన్ని కాళ్లని సోఫా మీద ఉంచి చెప్పింది.
‘నేను మాటైనా మాట్లాడకుండా ఇక్కడ కూర్చుంటాను. మీరు ఐడియాలు పొందడాన్ని చూసి నేర్చుకుంటాను మిస్టర్ లేంబ్’
‘నేను ఒంటరిగా తప్ప ఇంకొకరు నన్ను గమనిస్తూంటే రాయలేను’ చిరాకుని దాచుకుంటూ చెప్పాను.
‘నేను ఇక్కడ లేనసలు. ఆలోచించడం ఆరంభించండి’ కోరింది.
వెర్నా గేల్‌ని బయటకి పంపడానికి నాకు కొంత సమయం పట్టింది.
* * *
నేను మా ఇరుగు పొరుగు అందరూ నా ఇంటికి వచ్చారనుకున్నాను. కాని అది నా భ్రమ మాత్రమే. ఉదాహరణకి మోంటీ గ్రీన్. అతను లావెండర్ భర్త. అతను ఎక్కువ కాలం బయట గడుపుతాడు. ఊళ్లో గడిపే విలువైన కాలం నాతో గడపసాగాడు.
‘నా భార్యతో నీకేంటి?’ ఆరడుగుల పొడవు, విశాలమైన భుజాలు, గద లాంటి చేతులు గల అతను మొదటిసారి వచ్చినప్పుడు ప్రశ్నించాడు.
‘మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలీదు మిస్టర్ గ్రీన్. మీ ఆవిడ మా ఇంటికి వస్తోంది తప్ప నేను మీ ఇంటికి వెళ్లలేదు’
‘అందువల్ల మీరు అమాయకుడిని అనుకుంటే నేను అది నమ్మను. నువ్వు ఇంతదాకా ఎవరూ
కనిపెట్టని సెక్స్ అపీల్‌వి అనుకుంటున్నావా?’ గర్జించాడు.
‘సెక్స్ అపీల్?’ నాకు అర్థం కాలేదు.
ఆ క్షణంలో నా నవల సినిమాకి కొన్నారన్నా నమ్మేవాడిని కాని దీన్ని నమ్మలేకపోయాను.
‘చూడు మిత్రమా! నేను పెళ్లి చేసుకుంది ఎలాంటి అమ్మాయినో తెలుసా? సిగ్గరి. మితభాషి. ఆత్మవిశ్వాసం లేనిది, టీవీ ప్రకటనల్లోని లో దుస్తులు వేసుకోని అమ్మాయిల్లా సిగ్గు పడుతూంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చాక లేవెండర్‌లో బాగా మార్పు వచ్చింది. మేకప్ విషయంలో శ్రద్ధ తీసుకుంటోంది. ఇదివరకటిలా ఎక్కువ దుస్తులు ధరించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా వేరే మనిషైంది. నీ అపార్ట్‌మెంట్‌లోకి ఆమె తరచు వచ్చి వెళ్తోందని నాకు తెలుసు మిస్టర్ లేంబ్. ఇదంతా ఎందుకు జరుగుతోందో నువ్వు చెప్తావా? లేక నన్ను ఊహించమంటావా?’
అతను నా మీద భౌతికంగా దాడి చేయకుండా ఎలా నిగ్రహించాలా అని ఆలోచించాను. నా చేతులని అడ్డు పెట్టుకున్నాను.
‘నేను నిన్ను ఇప్పుడే హెచ్చరిస్తున్నాను మిత్రమా. లేవండర్‌ని నువ్వు వదలకపోతే ఈ పందుల కొట్టాన్ని శుభ్రం చేయడానికి నిన్ను చీపురుగా ఉపయోగిస్తాను’ చెప్పి విసవిసా బయటకి నడిచాడు.
* * *
ఎల్సీ కోర్నెల్ లావుపాటి మహిళ. ఆమె నా సోఫా మీద కూర్చుని ఏడ్చింది. తనతో తెచ్చుకున్న చాక్లెట్ పెట్టెలోంచి ఒకోటి తీసి తింటూ నాతో మాట్లాడింది. వాటిని తింటూ కూడా ఆమె ఎలా ఏడవడం ఆపలేదో నాకు అర్థం కాలేదు. చాక్లెట్ తయారీదారుల ప్రకటనలు తప్పా అనిపించింది.
‘రోజర్ మారిపోయాడు’ పదే పదే చెప్పసాగింది.
‘రోజర్? అతను ఎవరు?’ అడిగాను.
‘రోజర్ కార్నెల్. ఇప్పుడు అతని పేరు డ్యూక్. కానీ అతని అసలు పేరు రోజర్’
‘రోజర్‌లో ఏం మార్పు వచ్చింది?’ అడిగాను.
‘రోజర్‌కి తల్లంటే ఇష్టం. అమ్మాయిలతో డేటింగ్ చేసేవాడు కాదు. హోంవర్క్‌ని విడవకుండా చేసేవాడు. రాత్రిళ్లు మేమిద్దరం కూర్చుని టీవీ చూసేవాళ్లం. నేను అల్లుతూంటే దారం పట్టుకునేవాడు’
‘రోజర్ చక్కటి కొడుకు అనుకుంటాను?’
‘కొద్ది రోజుల క్రితం దాకా చక్కటి కొడుకే. ఇక్కడికి నిన్ను చూడటానికి వచ్చేదాకా. ఇప్పుడు పాడు పిల్లాడుగా మారాడు. నా హేండ్‌బేగ్‌లోని డబ్బుని దొంగిలిస్తాడు. స్నానం చేయడు. చెడ్డ భాషని మాట్లాడతాడు. పిచ్చి బట్టలు ధరిస్తాడు’
‘అది నిజం’ ఒప్పుకున్నాను.
‘ఇదంతా మీ వల్లే మిస్టర్ లేంబ్’ ఏడుస్తూ చెప్పింది.
నేను సహనంగా కౌమార దశలో కలిగే వింతైన మనస్తత్వం అని వివరించాను. ఐతే ఎల్సీ కోర్నెల్ ఉద్వేగపూరితమైన తల్లి. సబబైన మనిషి కాదు.
‘ఇదంతా మీ తప్పు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. బాల నేరస్థుడ్ని ప్రోత్సహించడం బహుశా నేరమై ఉండచ్చు. మీ మీద పోలీసులకి ఫిర్యాదు చేయబోతున్నాను మిస్టర్ లేంబ్’ వలవల ఏడవసాగింది.
* * *
ఆ ప్రవాహం ఆమెతో ఆగలేదు. ఓ రాత్రి జో బీగిల్ వచ్చాడు. ట్రెంచ్ కోట్. ముఖం మీదకి లాక్కున్న ఫెల్ట్ హేట్. నిజానికి ఆ కోటుని ధరించాల్సిన చలి లేదు.
‘జో బీగిల్! ప్రైవేట్ డిటెక్టివ్‌ని’ తన విజిటింగ్ కార్డు ఇచ్చి చెప్పాడు.
‘నేను మీకేం సహాయం చేయగలను?’ కొద్దిగా ఇబ్బందిగా చూస్తూ అడిగాను.
‘తన భార్య మీద ఓ కనే్నసి ఉంచమని మోంటీ గ్రీన్ నన్ను నియమించాడు. మీర క్రైం అండ్ మిస్టరీ రచయిత అని, అతని భార్యకి, మీకు సంబంధం ఉందని నాకు మొత్తం పరిస్థితి వివరించాడు. మీ క్రైం రచయితలు రాసేవి అన్నీ చదివాను. అన్నీ తప్పుల తడకలు రాస్తారని చదివినప్పుడల్లా అనుకుంటాను. ఎంత మాత్రం వాస్తవికత ఉండదు. ప్రైవేట్ డిటెక్టివ్ ఐన నాకు మీ ఊహల్లోని నాటకీయ అనుభవాలు ఎన్నడూ లేవు. నా అనుభవాలని చెప్తాను. వాటి ఆధారంగా నేను హీరోగా కనీసం డజను నవలలని మీరు తేలిగ్గా రాయగలరు. రాయల్టీలో నా భాగం గురించి మళ్లీ మాట్లాడదాం...’
* * *
ఇరుగు పొరుగు వాళ్లు నన్ను తమ తమ పద్ధతుల్లో ఇబ్బంది పెట్టడం కొనసాగుతూనే ఉంది. డ్యూక్ ప్రతీ రోజు వచ్చి నేను రాసిన కాగితాల మీద సిగరెట్లని ఆర్పుతున్నాడు.
అతని తల్లి ఎల్సీ ఏడుస్తూ చాక్లెట్లు మింగుతూ నన్ను బెదిరిస్తూనే ఉంది.
ఔత్సాహిక రచయిత్రి వెర్నా నన్ను కిటికీలోంచి రహస్యంగా గమనిస్తూ, నాకు ఐడియాలు ఎలా వస్తాయి అని కనిపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది.
జో బీగిల్ మా క్రైం రచయితలు ఎలాంటి చెత్తని రాస్తారో రోజూ తిడుతూనే ఉన్నాడు.
మోంటీ గ్రీన్ పిడికిళ్లు బిగిస్తూంటే, స్టీవ్ మార్క్స్ సిగార్లని వెలిగిస్తూ నా ముందు పచార్లు చేస్తూనే ఉన్నాడు.
పాపం లేవండర్ కనురెప్పలని ఆర్పుతూ, చవక పెర్‌ఫ్యూమ్‌లని వాడుతూ, బి గ్రేడ్ సినిమాలోని వేంప్ పాత్రలా ప్రవర్తిస్తోంది.
దాంతో నేను ఒక్క అక్షరాన్ని కూడా పేపర్ మీద పెట్టలేకపోయాను. నా టైప్‌రైటర్ మీద సాలె పురుగు గూడు కట్టసాగింది. రచయిత రాయకపోతే భోజనం దొరకదు. నన్ను నిత్యం ఇబ్బంది పెట్టే ఈ పురుగుల్లో ఎవరూ నాకు ఓ కథా వస్తువుని అందించలేక పోయారు. నేను రౌడీల గురించి, సెక్సీ అమ్మాయిల గురించి, అసూయ గల భర్తల గురించి రాయను. వాళ్లకి నేను రాసే తలుపు మూసి ఉన్న గదిలోని హత్య, పెద్ద మనుషులైన డిటెక్టివ్‌లు, క్రైం పజిల్స్ మొదలైనవి చెప్పినా ఎవరూ వినలేదు.
అందువల్ల నేను ఆ అపార్ట్‌మెంట్‌ని వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాను. లీజ్ పీరియడ్ పూర్తి కాకపోయినా నేను సామాను సర్దుకుని ఎవరూ చూడనప్పుడు, వెర్నా కూడా చూడనప్పుడు వెళ్లేందుకు వేచి ఉన్నాను. కాని నేను వెళ్లలేకపోయాను.
వెళ్లడానికి అసాధ్యం అయిన ఓ ముఖ్య సంఘటన జరిగింది. లేవండర్ హత్య చేయబడింది!
* * *
లేవండర్ తన పేరు అచ్చులో చూసుకోవాలని అనుకుంది. అట్టల మీది అందమైన అమ్మాయిల బొమ్మలని చూసి అసూయ చెందానని చెప్పింది. కవర్ పేజీల మీది అమ్మాయిలు హత్య చేయబడతారని ఆమెకి తెలీదు.
ఆమె పేరు, ఫొటో దినపత్రికల్లో అచ్చయి ఆమె కోరిక తీరింది. ఆమె మెడ చుట్టూ సిల్క్ స్కార్ఫ్ బిగించబడి, తల ఆనిన మంచం అంచు నించి కిందకి వేలాడే ఆమె జుట్టు బంగారు రంగు నయాగరా ఫాల్స్‌లా అనిపించింది.
ఆమె భర్త చాలా దూరం నించి ఓ ఉదయం ఇంటికి వచ్చాక హత్య చేయబడ్డ ఆమెని చూసి పోలీసులకి ఫోన్ చేశాడు. ఎల్సీ కోర్నెల్ ఇది తెలిసి గట్టిగా అరిచి ఏడిచింది. ఆమె కొడుకు సిగరెట్లు తాగుతూ, మధ్యమధ్యలో ఉమ్ముతూ విసుగు చెందినట్లుగా కనిపించాడు. ఎవరూ అడక్కపోయినా స్టీవ్ మార్క్స్ తనకి ఎలిబీ ఉందని మాటిమాటికీ చెప్పసాగాడు. వెర్నా గేల్ జరిగేది చూసి ఎక్సైట్ అయింది. మాంటీ గ్రీన్ జో బీగిల్ మీద మండిపడ్డాడు. అతను ఆమెని రహస్యంగా గమనిస్తూ కూడా హంతకుడు ఎవరో కనిపెట్టలేక పోయాడు. ఎవరూ ఇరవై నాలుగు గంటలు నిద్ర పోకుండా అనుసరించలేరని అతను చెప్పాడు.
మేమంతా ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడి పోలీసులు చేసే పనిని గమనిస్తున్నాం. చివరికి శవాన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లిపోయారు. నేను ఎవరో పోలీసులకి చెప్పి పరిశోధనలో వారికి సహాయం చేయాలనుకున్నాను. ఇద్దరు డిటెక్టివ్‌లు మమ్మల్ని సాధారణ ప్రశ్నలు వేశారు తప్ప ఎవర్నీ అనుమానించలేదు. ఆమె భర్తని కొద్దిగా అనుమానించారు. మమ్మల్ని ఇరుగు పొరుగు గానే చూశారు.
‘మీ అంతా ఇళ్లకి వెళ్లచ్చు. క్రితం రాత్రి జరిగింది మీకేదైనా గుర్తొస్తే మాకు తెలియజేయండి’ చీఫ్ డిటెక్టివ్ చెప్పాడు.
‘వీళ్లందర్నీ వదిలేస్తున్నారా?’ ఆయన్ని అడిగాను.
‘మరేం చేయమంటారు? ఎవరికీ ఆమెని హత్య చేయాల్సిన అవసరం లేదుగా’ ఆయన చెప్పాడు.
‘మీరు నిర్లక్ష్యంగా వీరిలో ఎవరూ అనుమానితులు కాదని భావిస్తున్నారు. వీరిలో కొందరికి మిసెస్ గ్రీన్‌ని చంపేందుకు కారణం ఉందని మీకు తెలీదా?’
‘నేను అలా ఆలోచించలేదు. బహుశా మీకూ ఉండి
ఉండచ్చు. వీరిలో ఎవరికి మోటివ్ ఉందో చెప్పండి’ కోరాడు.
ముందు నేను ఎవరో పరిచయం చేసుకుని చెప్పాను.
‘అందరికీ ఉంది. ఆమె భర్త అసూయకి కారణం హతురాలికి నా మీద ఆకర్షణ ఉండటమే’
ఆయన నా వంక ఆశ్చర్యంగా చూశాడు.
‘రెండో వ్యక్తి జో బీగిల్. లేవెండర్ సిగ్గరి. నా పరిచయం తర్వాత కలుపుగోలుగా మారింది. జో ఆమెని గమనించడానికి ఆమె భర్త నియమించాడంటే, ఎందుకో మీకు అర్థమైందిగా?’
‘నాకు అర్థం కాలేదు’
‘ఇక స్టీవ్ మార్క్స్. లేవెండర్ పక్కింట్లోనే చాలా నెలలుగా ఉంటున్న రౌడీ. రౌడీలు సాధారణంగా ప్రియురాలిని హత్య చేస్తూంటారు. రోజర్ కోర్నెల్ తన పేరుని డ్యూక్‌గా మార్చుకున్నాడు. నా కథలోని ఓ పాత్రగా ఆ కుర్రాడు నా ముందు నటించాడు. నా పుస్తకాల్లోలా అతను హంతకుడు కూడా కావచ్చు’
‘మీ పుస్తకంలోలానా?’
‘అవును. అతనికీ, ఆమెకీ సంబంధం ఉండి ఉండచ్చు. ఇది గ్రహించిన ఎల్సీ కోర్నెల్ కొడుకుని రక్షించడానికి ఆమెని చంపి ఉండచ్చు’
‘వెర్నా గేల్‌కి ఏం కారణం?’
‘ఆమెకి కథా రచయిత్రి అవాలనే అభిలాష ఉంది. ఆలోచనలు కావాలి. వాటిని ఎలా పొందాలో నేను ఆమెకి బోధించలేదు. చంపడం ద్వారా ఆమెకి కొంత సరుకు లభిస్తుందని అనుకుని ఉండచ్చు’
‘అదేమిటి? కథల కోసం చంపుతారా? మీరు ఎందర్ని చంపారు?’
‘ఆమె ప్రత్యేక వ్యక్తి. అందరూ అలా ఆలోచించరు. కాబట్టి నా కథల్లోలా ప్రతీ వారికి లేవండర్‌ని చంపడానికి కారణాలు ఉన్నాయి. అందరూ అనుమానితులే’
‘ఇది వీరిలో ఎవరి పనో స్పష్టంగా కనుక్కోగలరా మిస్టర్ లేంబ్?’
‘హాస్యం అడుగుతున్నారా? లేక నిజంగానా?’
‘వినయంగా అడుగుతున్నాను’
‘కనుక్కోను. నా కథల్లో పోలీసుల్ని తెలివిహీనులుగా, ప్రైవేట్ డిటెక్టివ్‌ని మేథావిగా చిత్రీకరిస్తూంటాను. మీరు తెలివిహీనులా?’ ప్రశ్నించాను.
అతను తల అడ్డంగా ఊపాడు.
* * *
కానీ అతను మళ్లీ నన్ను చూడటానికి వచ్చాడు. నేను ఊహించిన దానికన్నా ముందే. నిజానికి మర్నాడే. నా అపార్ట్‌మెంట్ చూసి పెదవి విరిచి చెప్పాడు.
‘మీ రచయితలు నాకు అర్థం కారు. నేను ఆ హత్య గురించి వచ్చాను’
‘ప్రోగ్రెస్ ఏమిటి?’ అడిగాను.
‘వేలిముద్రలు, లేబ్ పరీక్షలు, అనేక చోట్లకి వెళ్లడం అయ్యాక హంతకుడ్ని కనుక్కున్నాను’
‘నేను అందుకు మీకు సహాయం చేశానా?’ ఆశగా అడిగాను.
‘అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మిస్టర్ లేంబ్. ముందుగా హంతకుడు మీరు చెప్పినట్లు స్ర్తి కాదు. పురుషుడు’
‘అలాగా?’
‘అతనికి మిసెస్ లేవండర్ గ్రీన్‌తో మీరు రాక మునుపే అక్రమ సంబంధం ఉంది’
‘అలాగా?’
‘మీరన్నట్లు ఓ మహిళ రాత్రికి రాత్రే కొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు. దాన్ని మీరు కాని, ఆమె భర్త కాని గమనించలేదు. ఆమె ప్రియుడు ఆమెని హత్య చేయాలనుకున్నాడు. అతను డబ్బు కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటే లేవండర్ అడ్డొచ్చింది. అతన్నించి కొంత డబ్బు ఆశించింది. అది శాశ్వత బ్లాక్‌మెయిల్ అవుతుందనుకుని అతను చంపాడు’
క్రైం కథా రచయిత అయిన నేను ఈపాటి కనుక్కోలేనందుకు సిగ్గుపడుతూ అడిగాను.
‘ఎవరా హంతకుడు?’
‘పేరు జోన్స్’
‘జోన్సా? అతను ఎవరు?’
‘మీ అపార్ట్‌మెంట్‌కి రియల్ ఎస్టేట్ ఏజెంట్’
నేను నిశ్శబ్దంగా కూర్చున్నాను. తర్వాత తొడ మీద కొట్టుకుని చెప్పాను.
‘్ఛ! ఇది ఊహించలేకపోయాను. ప్రతీ కథలో హంతకుడి పాత్రని ప్రవేశపెడతాను. కాని అతను ఉన్నాడని పాఠకుడికి చూచాయగానే తెలుస్తుంది. మిగిలిన అన్ని పాత్రలకి కారణాలు ఉండి, అనుమానితులు అవుతారు. ఈ ఒక్క పాత్రని పాఠకుడు మర్చిపోతాడు. చివరకి అతనే హంతకుడనే కథలు నేను చాలా రాసాను’
‘నా సమస్యను పరిష్కరించాను మిస్టర్ లేంబ్. కాని మీది మొదలైంది. మీ ఇరుగుపొరుగు అంతా అనుమానితులని మీరు చెప్పడం వారికి నచ్చలేదు. బహుశ చంపడానికి అది మంచి కారణం అవచ్చేమో రచయిత అయిన మీరు ఆలోచించాలి. అటు చూడండి’ ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు.
నేను కిటికీలోంచి చూస్తే వారంతా నా వంకే కోపంగా చూస్తూ కనపడ్డారు. నోట్లో సిగార్‌తో స్టీవ్, చేతిలో తాడుతో మాంటీ, నన్ను చూసి నేల మీద ఉమ్మిన డ్యూక్, రివాల్వర్‌ని శుభ్రం చేస్తూ జో, ఎల్సీ, వెర్నా కూడా నిరపాయకారులుగా కనిపించలేదు.
* * *
దాంతో నేను ఈ కొత్త అపార్ట్‌మెంట్‌లోకి మారాను.
‘మీరు రచయితట? మీరేం రాస్తూంటారు?’
‘సిస్టమికల్ ఫిలాసఫీ’ నేను జవాబు చెప్పాను.
అదేమిటో వారికి తెలీదు. విసుగైన సబ్జెక్ట్‌గా భావించి వారు మళ్లీ నా జోలికి రాలేదు. అనుభవంతోనే కదా ఎవరైనా నేర్చుకునేది?
*

మల్లాది వెంకట కృష్ణమూర్తి