S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రియో వేదికపై ఆటల పండుగ

ప్రారంభం : ఆగస్టు 5

ముగింపు : ఆగస్టు 21
**
మహాసంగ్రామం మొదలవుతోంది. ప్రపంచంలో అతిపెద్ద క్రీడల పోటీకి మరో ఐదురోజుల్లో తెరలేస్తోంది. నాలుగైదేళ్లుగా కఠోరశ్రమతో శిక్షణ పొందుతున్న వేలాదిమంది క్రీడాకారులు తమ కల నిజం చేసుకునేందుకు, పతకాలు సాధించేందుకు చివరి కసరత్తు చేస్తున్నారు. బ్రెజిల్‌లోని రియోడిజనీరియోలో ఆగస్టు 5నుంచి 21వ తేదీవరకు జరిగే ఈ విశ్వక్రీడా సమరాంగణం సర్వసన్నద్ధమైంది. ఇంతవరకు జరిగిన ఒలింపిక్స్‌కన్నా ఈ ఏడాదిలో రియో క్రీడాసంబరానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దశాబ్దాల తరువాత గోల్ఫ్, రగ్బీసెవన్ ఆటలను ఈ ఒలింపిక్స్‌లో అనుమతించారు. ఎన్నడూ లేనంత సంఖ్యలో మహిళలు పోటీల్లో పాల్గొంటున్నారు. ఎన్నడూలేనన్ని దేశాలు, క్రీడాకారులు ఈ సంబరంలో భాగస్వాములవుతున్నారు. ఎన్నడూలేని విధంగా ఈసారి ఎక్కువ దేశాలు ఈ సమరానికి సై అన్నాయి. దేశాల తరపున కాకుండా ఓ వలస జట్టు, ఓ వ్యక్తిగత జట్టు కదనరంగంలో కాలుమోపుతున్నాయి. ప్రకృతి విసిరిన ‘జికా’ సవాలు, తీవ్రవాదుల భయం, కాలుష్యం, రాజకీయ అనిశ్చితి వంటి పెనుసవాళ్లను కాచుకుని బ్రెజిల్ ఈ సమరానికి మొక్కవోని దీక్షతో సన్నాహాలు చేసింది. రియో ఒలింపిక్స్‌కు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో, ఈ క్రీడాసమరానికి సన్నద్ధమైన భారత్ కూడా ఈసారి సాదాసీదాగా తయారవ్వలేదు. ఎన్నడూలేనంత పెద్ద బృందానే్న పంపుతోంది. గతంలో కన్నా ఎక్కువ పతకాలపైనే గురిపెట్టింది. రియో-2016 సమ్మర్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఆ విశేషాలేంటో చూద్దాం...

**
ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్‌కు ఎన్నడూ చెప్పుకోతగ్గ స్థానం రాలేదు. చిన్నచిన్నదేశాలు అద్భుత ఫలితాలు సాధిస్తూంటే మనం చాలా వెనకబడిపోయాం. ఒకప్పుడు కొన్ని దశాబ్దాలపాటు ‘హాకీ’తో స్వర్ణాల పంట పండించినా అది గత వైభవచిహ్నంగా మారిపోయింది. చాలా కాలం తరువాత బీజింగ్ ఒలింపిక్స్ (2008)లో అభినవ్ బింద్రా సాధించిన గోల్డ్ మనకు కొత్త ఆశలు రేపింది. అప్పటినుంచి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలన్న కసి పెరిగింది. అందుకు ప్రభుత్వంనుంచి సంపూర్ణ సహకారం అందింది. కేంద్రప్రభుత్వంకూడా ఈసారి చాలా ప్రాధాన్యం ఇచ్చింది.

మన పతకాలివీ...
ఒలింపిక్స్ చరిత్రలో మనం సాధించిన పతకాలు కేవలం 26. 1900లో తొలిసారి రెండు పతకాలు సాధించిన బ్రిటిష్ ఇండియా, ఆ తరువాత 1920నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో పాల్గొంది. సాధించిన 26 పతకాల్లో 9 స్వర్ణ, 6 రజతం, 11 కాంస్యం. ఇప్పటివరకు మనం 32 ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్నాం. 1928నుంచి 1980ల మధ్య భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో జైత్రయాత్ర సాగించింది. నిజానికి 1928-56మధ్య వరుసగా ఆరుసార్లు స్వర్ణం సాధించిన హాకీజట్టు సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. 1980 తరువాత ఆ ప్రాభవం పోయి పరాభవాలే ఎదురయ్యాయి. చాలాదశాబ్దాల తరువాత ఇప్పుడు ఇటు పురుషులు, అటు మహిళల హాకీ జట్లు ఇటీవల సాధించిన ఫలితాలు రియో ఒలింపిక్స్‌పై కొత్తఆశలు రేపాయి. 1900లో ఒకే ఒక్క అథ్లెట్ ఒలింపిక్స్‌కు హాజరై రెండు వెండి పతకాలు సాధించారు. అతడి పేరు నార్మన్. 1920లో నలుగురు పాల్గొంటే రియో-2016 ఒలింపిక్స్‌కు 121మంది వెళుతున్నారు. 2008లో 3 పతకాలు సాధించగా 2012లో ఆరు పతకాలు సాధించాం.

ఎలా సన్నద్ధమయ్యామంటే..
క్రీడారంగంలో ఓ వెలుగువెలగాలని కేంద్రప్రభుత్వం కంకణం కట్టుకుంది. భారత ఒలింపిక్ సంఘమూ అదే భావనతో కదనరంగంలోకి దూకింది. కార్పొరేట్ సంస్థలూ తొలిసారిగా పూర్తిస్థాయిలో స్పాన్సర్‌షిప్ ఇచ్చాయి. కేంద్రంనుంచి నిధులవెల్లువ వచ్చింది. 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ‘టాప్’ అన్న ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 700 కోట్లు నిధులు కేటాయించారు. క్రీడా, యువజనుల మంత్రిత్వశాఖకూడా ఈ కర్తవ్యంలో భాగస్వామ్యం తీసుకుంది. అటు ఆటగాళ్లూ కసితో శిక్షణ తీసుకున్నారు. కొన్ని దేశాలు ఆధునిక పరికరాలు, కిట్లు అందజేశాయి. ‘టాప్’ (టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్)లో భాగంగా విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. క్రీడాకారులకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. నిధుల సమస్య రానివ్వలేదు. స్పాన్సర్‌షిప్‌లు, స్కాలర్‌షిప్‌లు అడిగిందే తడవుగా ఇచ్చారు. నిబంధనలు అడ్డులేదు. రాజకీయాలు లేవు. ఒక్క సుశీల్‌కుమార్ (రెజ్లింగ్) విషయంలో మినహా ఎక్కడా అపశ్రుతులు లేవు. సమరోత్సాహంతో భారీ బృందం రియోకు బయలుదేరినప్పడు ఎన్నడూలేని విధంగా క్రీడాకారులతో ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశమై స్ఫూర్తినిచ్చాచరు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు రెహమాన్ వారికి మద్దతు ఇచ్చారు. ఇలాంటి ప్రయత్నాలు గతంలో లేవు. ఈసారి కఠోర శిక్షణ, కసి, స్ఫూర్తి పతకాల పంటపై ఆశలు చిగురింప చేశాయి.

ఆ పదిమందిపైనే ఆశలన్నీ...
షటిల్ బ్యాండ్మింటన్‌లో సైనానెహ్వాల్‌పై ఈసారి ఎన్నో ఆశలున్నాయి. ఇటీవలికాలంలో ఆమె సాధించిన విజయాలు, ఈ విభాగంలో పాల్గొంటున్న ఇతర దేశాల క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా సైనాపై గట్టి నమ్మకం ఏర్పడింది. మహిళల ఆర్చరీలో దీపిక కుమారి, బి దేవి లాశ్రమ్, మహిళల రెజ్లింగ్‌లో బబితకుమారి, వినీషపొగెట్, సాక్షిమాలిక్ బృందంపైనా ఆశలున్నాయి. పిటి ఉష తరువాత (36 సంవత్సారల తరువాత) ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రన్నర్ ద్యుతిచంద్ వంద మీటర్ల మహిళల పరుగులో పతకం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఎన్నో వివాదాలను ఎదుర్కొని రియోలో అర్హత సాధించిన ఈ ఒడిశా యువతిపై పెద్దఆశలో ఉన్నాయి. ఇక టెన్నిస్‌లో సానియా మీర్జా, బోపన్న బృందం పతకం సాధించే అవకాశాలున్నాయి. 1964 తరువాత ఒలింపిక్స్‌లో భారత్ తరపున అర్హత సాధించిన జిమ్నాస్ట్ దిపా కమ్రాకర్, మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం ఉన్న షూటర్ గగన్‌నారంగ్, అభినవ్ బింద్రా, జితురామ్, బాక్సింగ్‌లో వికాశ్ కృష్ణన్ యాదవ్, హాకీలో పురుషుల జట్టు, యోగీశ్వర్‌దత్, నర్సింగ్‌పోచమ్, డిస్కస్ త్రోలో వికాస్‌గౌడ, బాక్సింగ్‌లో మనోజ్‌కుమార్, శివథాప పతకాలు సాధిస్తారన్న నమ్మకంతో భారత్ ఉంది. ఇక పివిసిందు, కిడాంబి వంటి వారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. డోపింగ్ వివాదంలో కూరుకుపోయిన రష్యా ఒలింపిక్స్‌లో చాలా విభాగాల్లో చోటు కోల్పోయే అవకాశం ఉంది. పతకాలకోసం ఎన్నడూ లేని విధంగా గట్టిపోటీ ఏర్పడుతోందని, ఈసారి పతకాలు సాధించడం అంత సులువేం కాదని చైనా చెబుతోంది. ఇక్కడ ఒక్కమాట చెప్పుకోవాలి. భారత్ ఈసారి నిజంగానే పతకాల సాధన దిశగా కష్టపడింది. అందుకే ఆశలు పెట్టుకుంది. రియో ఒలింపిక్స్‌లో రెండకెల్లో పతకాలు సాధిస్తామన్న నమ్మకం ఉందంటున్నారు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్. *

ఇదీ స్ఫూర్తి
రియో ఒలింపిక్స్ లక్ష్యం....కొత్త ప్రపంచం. (న్యూ వరల్డ్). ఆ దిశగా ఈ క్రీడాసమరం కొత్తకొత్త అంశాలతో ఉత్కంఠ రేపుతోంది. ‘ప్రవర్థమానమవయ్యే శక్తి, పవిత్రమైన, అచ్చెరువొందే వైవిధ్యం, ఔరా అన్పించే ప్రకృతి, ఒలింపిక్ స్ఫూర్తి’ అన్న నాలుగు నినాదాలతో విశ్వక్రీడాసమరానికి పిలుపుఇచ్చింది బ్రెజిల్.

ఇదీ మస్కట్
రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన మస్కట్ పేరు వినిసియస్. బ్రెజిల్‌కు చెందిన ప్రఖ్యాత సంగీతకళాకారుడు వినిసియస్ డి మోరిస్‌కు గుర్తుగా ఈ పేరు పెట్టారు. ఇక ఆ దేశ జాతీయపతాకంలోని మూడు రంగులు పసుపు, ఆకుపచ్చ, నీలంతో దీనిని రూపొందించారు. బ్రెజిల్ సంప్రదాయ వన్యప్రాణులు, క్షీరదాల సంకేతంగా ఈ మస్కట్‌ను తీర్చిదిద్దారు. సమ్మర్, పారా ఒలింపిక్స్‌కు వేర్వేరు మస్కట్‌లు రూపొందించారు. ఇవి రెండూ బ్రెజిల్ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. మస్కట్‌ల ప్రతిపాదనల్లో 323327మంది (దాదాపు 44శాతం) వినిసియస్‌కు ఓటువేసి ఎంపిక చేశారు.

ఒలింపిక్ విలేజ్
ఈ ఒలింపిక్స్‌కు హాజరయ్యే క్రీడాకారులు, వారితో వచ్చే అధికారులు, క్రీడాభిమానులు ఉండేందుకు సకల సౌకర్యాలతో ఒలింపిక్ విలేజ్ సిద్ధమైంది. ఒలింపిక్స్ చరిత్రలో.. విస్తీర్ణం, ఆధునిక వసతి, సీటింగ్ సామర్థ్యంలో ఇదే రికార్డు. 80వేల కుర్చీలు, 70వేల టేబుళ్లు, 60వేల క్లోత్‌హాంగర్లు, 10వేల స్మార్ట్ ఫోన్లు, 6వేల టీవీసెట్లు అక్కడ అందుబాటులో ఉంచారు.

ఇదే తొలిసారి
*ఒలింపిక్స్ చరిత్రలో ఓ దక్షిణ అమెరికా దేశం (బ్రెజిల్) పోటీలు
నిర్వహించడం ఇదే తొలిసారి.
*సౌత్‌సూడాన్, కొసావో దేశాలు తొలిసారిగా ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాయి.
*అథ్లెట్ల సంఖ్య, పాల్గొంటున్న దేశాల సంఖ్య ఇంత పెద్దసంఖ్యలో ఉండటం ఇదే ప్రథమం
*చాలా దశాబ్దాల తరువాత గోల్ఫ్, రగ్బీసెవెన్స్ ఆటలకు చోటు
*రెఫ్యూజీ టీం, ఇండిపెండెంట్ టీం పాల్గొంటున్న తొలి ఒలింపిక్స్ ఇవే.

భారత్ కొత్త ఆశలు
రియో ఒలింపిక్స్‌పై భారత్ పెద్దఆశలే పెట్టుకుంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న రెండో దేశంగా భారత్‌కు రికార్డు ఉంది. కెన్యావంటి అతితక్కువ జనాభా ఉన్న దేశాలు సాధిస్తున్న సంఖ్యలోకూడా మనవాళ్లు ఫలితాలు రాబట్టలేదు. ప్రభుత్వంనుంచి తగినంత మద్దతు లేక ఇన్నాళ్లూ మన క్రీడారంగం కుదేలైంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. 2012లో బీజింగ్ ఒలింపిక్స్‌లో సాధించిన ఆరు పతకాలు కొత్త ఆశలను రేపాయి. 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్ సర్వసన్నద్ధమైంది. అప్పుడు సాధించే ఫలితాలకోసం రియో ఒలింపిక్స్ ఓ పరీక్షగా భావిస్తోంది. కేంద్రప్రభుత్వంనుంచి కూడా ఎన్నడూలేనంత మద్దతు లభించింది. కార్పొరేట్ రంగమూ భారత క్రీడాకారులకు అండగా నిలిచారు. మరో మూడు దశాబ్దాల్లో ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంత నిధులతో క్రీడాసమరానికి సన్నద్ధమయ్యేందుకు భారత ఒలింపిక్ సంఘం కార్యరంగంలోకి దిగింది. ఈసారి ఒలింపిక్స్‌లో కనీసం పది పతకాలైనా సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. తొలిసారిగా భారత్‌నుంచి 121మందితో భారీ బృందం వెళ్లింది. పది పతకాలపై ఆశలు పెట్టుకున్న భారత్ అందుకు తగ్గ కృషి చేసింది. మన క్రీడాకారులు గత నాలుగేళ్లుగా కామనె్వల్త్, ఆసియా క్రీడలతో సహా ప్రపంచంలో ఇటీవలి కాలంలో జరిగిన వివిధ క్రీడాంశాల్లో అత్యుత్తమ ప్రతిభచూపి పతకాలు సాధించారు. ఆ విజయాలే ఇప్పుడు రియోపై ఆశలుపెంచేలా చేశాయి.

ఆ ముగ్గురూ...
ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సాధన 1900లో మొదలైంది. బ్రిటిష్‌ఇండియాలోని కలకత్తాలో పుట్టిన నార్మన్ ప్రిట్‌ఛార్డ్ వందమీటర్ల పరుగు, వందమీటర్ల హర్డిల్స్‌లో వెండిపతకాలు సాధించి రికార్డు సాధించాడు. ఆ ఏడాది మన దేశం తరపున పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు అతడే. ఆ తరువాత అతడు హాలీవుడ్ సినిమాల్లో నటించాడు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఎఎఎఫ్) నార్మన్‌ను బ్రిటిషర్‌గానే పరిగణిస్తున్నా భారత ఒలింపిక్ సంఘం మాత్రం భారతీయుడిగానే గుర్తించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి ఆసియాదేశంగా గుర్తింపు లభించింది అతడివల్లే. ఆ తరువాత 2008లో సుశీల్‌కుమార్ రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించగా తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా అదే ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా రికార్డు సాధించాడు.

రియో ప్రత్యేకతలివీ

10500
-పోటీలకు హాజరవుతున్న క్రీడాకారులు
207
- ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న దేశాలు
306
- పతకాల సెట్లు
28
- పోటీలు జరిగే క్రీడాంశాలు

41
వివిధ క్రీడల్లో విభాగాలు

33
రియోలో పోటీలు జరిగే వేదికలు
5
బ్రెజిల్‌లో పోటీలు జరిగే ఇతర వేదికలు

లోగో ప్రత్యేకత
రియో ఒలింపిక్స్ -2016 లోగోకు ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రెజిల్ పతాకంలోని మూడు రంగులూ ఈ లోగోలో కన్పిస్తాయి. బ్రెజిల్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన ‘సుగల్‌లోఫ్ వౌంటెయిన్’ ఆకారాన్ని ప్రతిబింబించేలా ఈ లోగో రూపొందించారు. టటిల్ అనే ఏజెన్సీ రూపొందించిన ఈలోగోను ఎక్కువమంది ఇష్టపడ్డారు. నిజానికి 139 సంస్థలు లోగో రూపొందించేందుకు పోటీ పడ్డాయి.

రియో - భారత్

121
- భారత ఆటగాళ్ల బృందం
67
- పురుషులు
54
- మహిళలు
37
- బీజింగ్ (2012) ఒలింపిక్స్‌కు
హాజరైనవారికన్నా ఎక్కువమంది
10
- పతకాలపై గురి
15
- క్రీడాంశాల్లో పోటీ
***

-రామానుజం