S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తప్పు చేశావ్ నాన్నా! (భగత్‌సింగ్ 40)

భగవతీ చరణ్ ఆకస్మిక దుర్మరణంతో విప్లవకారులందరి మనసులూ వికలమయ్యాయి. దుర్గాదేవి జుట్టు విరబోసుకుని ధ్యాన సమాధిలో ఉన్నట్టు నిశ్చలంగా కూర్చుండిపోయింది. భర్తృ వియోగపు చిచ్చు మనసును దహిస్తున్నా పైకి ప్రశాంతంగా ఉంది. ఆమె పక్కనే కన్నీరు కారుస్తూ సుశీలాదేవి కూర్చుంది. పక్క గదిలో సేనాపతి చంద్రశేఖర్ ఆజాద్ నిస్త్రాణతో గోడకు చేరగిలబడ్డాడు.
శోకం ఎంత ఉన్నా కర్తవ్యం విస్మరించరానిది. భగత్, దత్‌లను చెర నుంచి విడిపించటానికి ఇంక ఒక్కరోజే వ్యవధి ఉంది. తన మరణం వారి విడుదలకు అడ్డం రాకూడదని, అనుకున్నది పూర్తయితేనే తన ఆత్మకు శాంతి అనీ భగవతీ చరణ్ కన్నుమూసే ముందు అన్న మాటలు అందరి చెవులలో గింగురుమంటున్నాయి. బాధకూ నిర్వేదానికీ ఇది సమయం కాదు.
ఆజాద్ గుండె రాయి చేసుకుని పనిలో పడ్డాడు. యాక్షన్ టీములోని భగవతీ చరణ్ మరణించాడు. సుఖ్‌దేవ్ రాజ్ గాయపడ్డాడు. వారి స్థానాల్లో కొత్తవారు ఎవరిని తీసుకోవాలా అని ఆజాద్ ఆలోచిస్తూండగా.. ‘నేనున్నా’ అంటూ శోకమూర్తి దుర్గాదేవి దిగ్గున లేచింది. ‘నేనూ వస్తా’ అన్నది సుశీలా దీదీ. ఎవరు ఎంత వారించినా వారు వినలేదు. ‘మీ అవసరం ఇప్పుడు కాదు. మన వాళ్లను విడిపించుకు వచ్చాక వారిని దాచిపెట్టి, కాపాడటంలో మీరు చేయవలసింది చాలా ఉంది’ అని ఆజాద్ వారికి నచ్చచెప్పాడు. మదన్‌గోపాల్‌ను కొత్తగా టీములోకి తీసుకుని తుపాకి పేల్చడంలో మెలకువలు నేర్పాడు.
జూన్ 1 వచ్చింది. వైశంపాయన్ బోర్‌స్టల్ జైలు దగ్గర కాపు కాశాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు భగత్, దత్‌లను పోలీసు లారీలో తీసుకువెళ్లి అక్కడ దింపారు. ఇంకో రెండు గంటలపాటు వారు అక్కడే ఉంటారు. వైశంపాయన్ తిరిగి వచ్చి ఆ సంగతి చెప్పగానే యశ్‌పాల్, వైశంపాయన్, మదన్‌గోపాల్‌లను తీసుకుని ఆజాద్ బయలుదేరాడు. సుశీలాదేవి కుడిచేతి బొటనవేలును బాకుతో గుచ్చుకుని అందరికీ రక్తతిలకం దిద్దింది. అంతా కారెక్కారు. తేహాల్‌సింగ్ డ్రయివ్ చేశాడు. ముందు సీట్లో ఆజాద్. అతడి పక్కన వైశంపాయన్. వెనక సీట్లో ముగ్గురు. బోర్‌స్టల్ జైలు ఎదుట రోడ్డు పక్కన చిన్న సందులో ఎవరి కంటా పడకుండా వారు ఆపారు. భగత్, దత్ జైలు గేటులోంచి బయటికి రాగానే యాక్షనుకు అందరూ సిద్ధంగా ఉన్నారు.

జైలు దగ్గర పోలీసు వాహనం తిరగడానికి కొంత స్థలం ఖాళీగా వదలబడింది. వాహనం నిలబడే చోటికీ, జైలు ముఖద్వారానికీ 20 గజాల దూరం ఉంది. ఖైదీలిద్దరూ జైలు నుంచి బయటికి రాగానే వైశంపాయన్ సిగ్నలుగా పిల్లనగ్రోవి వాయించాలి. దానికి జవాబుగా భగత్‌సింగ్ నుదుటిపై చేత్తో రుద్దుకోవాలి. వెంటనే ఆజాద్ కారు రివ్వున వారి దగ్గరికి వెళుతుంది. భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు పోలీసు వ్యాను వద్దకు వెళ్లటానికి బదులుగా ఆజాద్ కారు దగ్గరికి పరిగెత్తాలి. మదన్ గోపాల్ వారిద్దరికీ పిస్టళ్లు అందించాలి. యశ్‌పాల్ కారు దిగి జైలు వాకిట్లో ఆయుధాలు ధరించి నిలబడ్డ పోలీసుల మీద బాంబు వేయాలి. తరవాత పిస్తోలు పేలుస్తూ మిగిలిన పోలీసులను దగ్గరికి రాకుండా చేయాలి. అదే సమయానికి వైశంపాయన్ పోలీసు వ్యానుపై బాంబు విసరాలి. తరవాత చేతిలో పిస్తోలు పట్టుకుని పోలీసులతో పోరాడాలి. ఆజాద్ వౌజర్ రివాల్వరుతో వీరందరికీ రక్షణ ఇవ్వాలి. భగత్, దత్‌లు వచ్చి కలుసుకున్న వెంటనే అందరూ కారెక్కి అక్కడి నుంచి మాయం కావాలి. ‘ఇదీ ప్లాను; మీరు చేయవలసింది ఇది’ అని జైల్లోని భగత్‌సింగ్‌కి అతికష్టంమీద ముందే కబురు పంపారు.
కాని జరిగింది వేరు.
కారు ముందుకు ఉరకడానికి సిద్ధంగా రోడ్డు పక్క నిలబడి ఉంది. ఎవరి పొజిషన్లలో వారున్నారు. పోలీసు వ్యాను భగత్, దత్‌లను తీసుకువెళ్లటానికి వచ్చి (రోజూ కంటే గేటుకు బాగా దగ్గరలో) నిలిచింది. జైలు వాకిలి తీయబడింది. భగత్, దత్‌లు సుమారు 20 అడుగుల దూరంలోనున్న పోలీసు వ్యాన్ వైపు నడిచి రాసాగారు. వారికి ఆజాద్ కారు కనపడుతోంది. ఆజాద్ ‘సిగ్నల్’ అన్నాడు. వెంటనే వైశంపాయన్ వేణుగానం మొదలైంది. ఇతరులు తమతమ ఆయుధాలపై చేతులుంచి సిద్ధమయ్యారు. కారు ఇంజన్ స్టార్ట్ అయింది. వేణునాదం విని భగత్, దత్‌లు కారు వైపు చూశారు.
భగత్‌సింగ్ నుదుటిపై రుద్దుకోగానే వారు వ్యాన్‌కు దగ్గరగా వెళ్లాలి. అయితే.. ఇదేమిటి? భగత్‌సింగ్ ఏ సూచనా చెయ్యలేదు. ఇద్దరూ నేరుగా వెళ్లి పోలీసు వ్యాన్ ఎక్కేశారు.
ఆజాద్ కారాపమన్నాడు. ఇంజన్ ఆగిపోయింది. పోలీసు వాహనం బయలుదేరింది. ఆజాద్ ‘వ్యానును వెళ్లనివ్వండి’ అన్నాడు. భగత్‌సింగ్, దత్‌లు ఆజాద్‌నూ, మిగిలిన వారినీ కిటికీలో నుంచి చూచారు. వారి ముఖాల్లో ఎలాంటి స్పందన లేదు. అంతా శూన్యం. కారు వెనక్కి బయలుదేరింది.
ఇంట్లో భాభీ - దీదీ ఎంతో ఉత్సాహంతో భగత్, దత్‌లకు స్వాగతం ఇవ్వటానికి ఎదురుచూస్తున్నారు. వట్టి చేతులతో వచ్చిన సోదరులను చూచి వారిద్దరూ నిరాశగా కూలబడ్డారు.
విప్లవకారుల మనస్సుకు దెబ్బపై దెబ్బ. బహావల్‌పూర్ రోడ్డు ఇంట్లో ఎవరికీ శాంతి లేదు. భర్తను పోగొట్టుకున్న దుర్గాదేవికి ఈ కార్యం విఫలం కావడం దుఃఖం కలిగించింది.
ఆజాద్ ముందు కార్యక్రమం ఆపాలన్న నిర్ణయం తీసుకోవడం బుద్ధిపూర్వకంగానే. భగత్, దత్‌లే సిద్ధంగా లేనప్పుడు తామేం చేసినా ప్రయోజనం లేదు. తరవాతి ఆదివారం మరలా ప్రయత్నం చేయాలని ఆజాద్ అభిప్రాయం. దాని కోసం భగత్‌సింగ్‌కి రహస్యంగా వార్త పంపి ఎందుకు సంకేతం చెయ్యలేదని అడిగాడు. భగత్‌సింగ్‌కి.. బయటికి వచ్చి పోరాడే భావన హరించుకుపోయింది. తను కూడా ఉరికంబమెక్కి బలిదానం చెయ్యాలని నిర్ధారణ చేసుకున్నాడు. ఇదే ఆజాద్‌కు జైలు నుండి వచ్చిన జవాబు సారాంశం.
చంద్రశేఖర్ ఆజాద్, బాబు కృష్ణమూర్తి, పే.146-149

సహచరులు ప్రాణాలకు తెగించి అంత డేరింగ్ ఆపరేషన్‌లో చెర విడిపిస్తామని ముంథుకొస్తే బహుశా ప్రపంచంలో ఏ విప్లవకారుడూ వద్దనడు. ఎలాగూ ఉరిశిక్ష తప్పదనుకున్నప్పుడు, జైలు నుంచి బయటపడి, విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే స్వర్ణావకాశం కాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు విప్లవయోధులు ఎవరూ వదులుకోరు. కాని భగత్‌సింగ్ మార్గం వేరు. ఎంచుకున్న లక్ష్యం వేరు. ఇంతకు ముందు ‘కోరుకున్న ఉరి’ అధ్యాయంలో మనం చెప్పుకున్నట్టు భగత్‌సింగ్‌కి తన ప్రాణం మీద తీపి, తన స్వేచ్చ పట్ల అనురక్తి ఉన్నట్టయితే సాండర్స్ కేసులో తనను ఇరికించి ఉరితీసే అవకాశాన్ని చేతులారా పోలీసులకు ఇచ్చి ఉండేవాడు కాడు. ఆజాద్ సాహసాన్ని అందిపుచ్చుకుని ఉంటే అతడు జైలు నుంచి బయటపడగలిగేవాడు. కాని బయట ఉన్నంతకాలం వెంటాడే పోలీసులకు చిక్కకుండా దాక్కుంటూ, పారిపోతూ, తనను తాను కాచుకోవడంతోటే అతడికి కాలమంతా చెల్లిపోయేది. ఒకవేళ పట్టుబడకుండా తప్పించుకోగలిగినా జాతి జనుల ముందు తన గళాన్ని వినిపించే అవకాశాన్ని కోల్పోవలసి వచ్చేది. అనామకంగా, అజ్ఞాతంగా కథ ముగిసిన ఎంతోమంది చరిత్రహీనుల్లో అతడూ ఒకడయ్యేవాడు. అలా కావటం భగత్‌సింగ్‌కి ఇష్టంలేదు. తన మరణం జాతి యువతకు కలకాలం స్ఫూర్తిదాయకమైన బలిదానంగా నిలిచిపోవాలని అతడు కోరుకున్నాడు. అందుకే ఏరికోరి ఉరితాడును వరించాడు. సాహసోపేతమైన ఆజాద్ ఆఫరును తిరస్కరించాడు.
భగత్‌సింగ్ అంతరంగ మథనం చంద్రశేఖర్ ఆజాద్‌కి వివరంగా తెలిసే అవకాశం లేదు. భగవతీ చరణ్ దుర్మరణంతో నిస్పృహ చెందడంవల్లే భగత్ ఉరికి సిద్ధపడుతున్నాడని అతడు తలపోశాడు. ‘అటు భగత్, ఇటు భగవతీచరణ్ పక్కన లేకపోవడంతో నేను రెక్కలు తెగిన పక్షిలా అయ్యాను. ఎలాగైనా భగత్‌ని ఒప్పించి, ఇంకో ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక విధంగా అతడిని విడిపిస్తాను’ - అని ఆజాద్ ఒకరాత్రి వైశంపాయన్‌తో అన్నాడు. మళ్లీ విధి వక్రించింది. అదే రోజు తెల్లవారుఝామున లాహోర్ రహస్య గృహం అలమారాలో దాచిపెట్టిన రెండు బాంబులు ప్రమాదవశాత్తు ఒకటి తరవాత ఒకటి పేలాయి. పెట్టాబేడా సర్దుకుని అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి, పోలీసులు వచ్చేలోగా తలా ఒక దిక్కుకు పారిపోవలసి వచ్చింది.
బాంబులేసి జైలు నుంచి విడిపించటానికి ముందుకొచ్చిన విప్లవ సహచరులను వద్దు పొమ్మనడం మాత్రమే కాదు. తన మెడకు బిగియనున్న ఉరిని తప్పించటానికి తన తండ్రి పిటీషను పెట్టడాన్నీ భగత్‌సింగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు.
తన పక్షాన డిఫెన్సూ వద్దు డిఫెన్సు లాయరూ వద్దు అని కుమారుడు కరాఖండిగా చెప్పటంతో కిషన్‌సింగ్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం తమను ఎలాగైనా సరే చంపి తీరాలని నిశ్చయించిన సంగతి తేటపడ్డాక ఇక బూటకపు విచారణ తంతులో పాలుపంచుకోవటం వృథా అని భగత్ తలిచాడు. అతడి సలహా ప్రకారం స్పెషల్ ట్రిబ్యునల్ ముందు నిందితులెవరూ హాజరుకాలేదు. ఏ సాక్షినీ క్రాస్ ఎగ్జామిన్ చెయ్యలేదు. తమ మీద అభియోగాలను అంగీకరించడం లేదన్నది కూడా చెప్పలేదు. తమ నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి, తమపై అభియోగాల బండారం బయటపెట్టడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అసలు ట్రిబ్యునల్ అస్తిత్వానే్న గుర్తించలేదు. తమను విచారించడానికి బ్రిటిషు న్యాయవ్యవస్థకు ఉన్న అధికారానే్న వారు గుర్తించదలచలేదు.
ఉరికి సిద్ధపడ్డ భగత్‌సింగ్ ఎంత నిర్వికారంగా ఉన్నా అతడికున్న నిబ్బరం తండ్రికి లేకపోయింది. ప్రియాతిప్రియమైన కుమారుడి ప్రాణం ఎలాగైనా కాపాడాలని కిషన్‌సింగ్ కేసు చివరి దశలో చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఆఖరి అస్త్రంగా వైస్రాయికి, ట్రిబ్యునల్‌కీ పిటీషను పంపాడు. అదీ పుత్రభిక్ష పెట్టమని దీనంగా దేబిరిస్తూ కాదు. కేసు విచారణలో జరిగిన అక్రమాలను కిషన్‌సింగ్ చక్కగా ఎత్తిచూపాడు. లాహోర్ సెంట్రల్ జైలుకు తరలించే ముందు తన కుమారుడిని స్థానిక పోలీసుస్టేషనుకు తీసుకువెళ్లి, అక్కడ సిద్ధంగా ఉంచిన దొంగ సాక్షులకు అతడి మొగాన్ని గుర్తుపెట్టుకునే వీలు కల్పించారు; ప్రాసిక్యూషను వారు పూర్తిగా అప్రూవర్ల కథనాల మీదే ఆధారపడ్డారనీ.. ఇలా అనేక తప్పులను ఏకరవు పెట్టి న్యాయానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టాడు. ‘డిఫెన్సు’కు తగిన అవకాశం ఇస్తే తన కుమారుడి నిర్దోషిత్వం నిరూపించగలమన్నాడు. కుమారుడిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆరాటంలో - సాండర్స్ హత్యనాడు అసలు భగత్‌సింగ్ ఊళ్లోనే లేడంటూ తప్పుడు ఎలిబీనీ బనాయించబోయాడు.
ఆ సంగతి తెలిసి భగత్‌సింగ్ భగ్గుమన్నాడు. అప్పటికప్పుడే (1930 అక్టోబరు 4న) తండ్రికి ఈ జాబు రాశాడు.

ప్రియమైన తండ్రిగారికి
నా డిఫెన్సుకు సంబంధించి స్పెషల్ ట్రిబ్యునల్ సభ్యులకు మీరు పిటీషను పెట్టారని తెలిసి నేను నిర్ఘాంతపోయాను. ఈ సమాచారాన్ని నేను తట్టుకోలేక పోయాను. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ దశలో, ఈ పరిస్థితుల్లో అలాంటి పిటీషను పెట్టదగునని మీరు ఎలా అనుకున్నారో నాకు అర్థం కావటంలేదు. తండ్రిగా మీకు సెంటిమెంట్లు, ఫీలింగ్సు ఎన్నయినా ఉండనీండి. నన్ను సంప్రదించకుండా నా తరఫున ఇలాంటి అడుగువేసే అధికారం మీకు లేదు.
రాజకీయ రంగంలో మీ అభిప్రాయాలతో నేను ఎన్నడూ ఏకీభవించలేదు. మీ ఆమోదాన్ని తిరస్కారాన్ని లెక్కచేయకుండా నేను స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చాను. నా కేసును నేను గట్టిగా పోరాడి, నన్ను నేను సవ్యంగా డిఫెండు చేసుకోవాలని మీరు మొదటి నుంచీ చెబుతున్నారు. దాన్ని నేను ప్రతిసారీ వ్యతిరేకించిన సంగతి మీకు తెలుసు... ...
ఈ విచారణలో మేము ఒక నిర్దిష్ట విధానం అనుసరిస్తున్నట్టు మీరు ఎరుగుదురు. నేను చేసే ప్రతి పనీ ఆ విధానానికి, నా సిద్ధాంతాలకు, కార్యక్రమానికి అనుగుణ్యంగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకవేళ అవి మారకుండా ఉన్నా నేను డిఫెన్సుకు ఒప్పుకునేవాడిని కాను. ఈ విచారణ మొత్తంలో నా ఆలోచన ఒక్కటే. మా మీద అభియోగాలు ఎంత తీవ్రమైనవైనా, విచారణను బొత్తిగా పట్టించుకొనకూడదు. రాజకీయ కార్యకర్తలు అందరూ ఇలాగే ఉండాలి. న్యాయస్థానాల్లో లీగల్ పోరాటాన్ని ఎంత మాత్రం లక్ష్యపెట్టకుండా ఉండి, తమకు విధించే ఎంత తీవ్ర శిక్షలనైనా వారు ధైర్యంగా భరించాలి. రాజకీయ అంశాలపైనే తప్ప వ్యక్తిగత కోణం నుంచి వారు తమ నడవడిని కోర్టులో ఎన్నడూ సమర్థించుకొనకూడదు. ఈ విచారణలో మేమంతా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాం.
లాహోర్ కుట్ర కేసు ఆర్డినెన్సుతోబాటు వెలువరించిన ప్రకటనలో వైస్రాయి ఏమన్నాడు? ఈ కేసులో నిందితులు చట్టాన్ని, న్యాయాన్ని చులకన చేయజూస్తున్నారని కదా? న్యాయాన్ని చులకనకావిస్తున్నది మేమా, ఇతరులా అన్నది ప్రజలకు చూపించేందుకు ప్రస్తుత స్థితి అవకాశం ఇచ్చింది. ఇది మీలాంటి వారు అంగీకరించకపోవచ్చు. అలాగని నా ఆమోదం లేకుండా, నాకు తెలియకుండా నా తరఫున ఇలాంటి అడుగులు మీరు వేయకూడదు. నా జీవితం మీరు అనుకుంటున్నంత విలువైనదేమీ కాదు. నా నియమాలను వదులుకుని దక్కించుకోవలసినంత ముఖ్యమైనదీ కాదు. మిగతా కామ్రేడ్లున్నారు. వారి మీద కేసూ నాదాని అంత తీవ్రమైనవే. అందరం కలిసి ఒక పాలిసీ పెట్టుకున్నాం. ఇప్పటిదాకా భుజం భుజం కలిపి నిలబడ్డాం. కడదాకా అలాగే నిలబడతాం. దానికి వ్యక్తిగతంగా మేము చెల్లించవలసి వచ్చే మూల్యంగా ఎంతటిదైనా సరే!
నాన్నా, నేను ఎంతో కలవరపడుతున్నాను మీరు చేసిన పనిని ఆక్షేపించడానికి - కాదు అభిశంసించడానికి - నేను మర్యాదను అతిక్రమించి పరుషంగా మాట్లాడుతున్నానేమో! అయినా మనసులోని మాట దాచకుండా చెప్పనివ్వండి. మీరు నన్ను వెన్నులో పొడిచారని నేను భావిస్తున్నాను. ఇంకొకరెవరైనా ఇది చేసి ఉంటే దాన్ని నేను ద్రోహం అనేవాడిని. కాని మీ విషయంలో ఇది బలహీనత. అధమ స్థాయి దౌర్బల్యం.
ఇది ప్రతి ఒక్కరి చేవను పరీక్ష చేస్తున్న సమయం. మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారు నాన్నా! మీ జీవితమంతటినీ భారత స్వాతంత్య్రానికి అంకితం చేశారని నాకు తెలుసు. కాని ఈ క్షణాన మీకు ఇంత బలహీనత ఎందుకు కమ్మిందో నాకు అర్థం కావటంలేదు.
చివరగా - మీకు, ఇతర మిత్రులకు, ఈ కేసుపై ఆసక్తి ఉన్న వారందరికీ నేను తెలియపరచాలనుకుంటున్నది ఇది: నేను మీరు చేసిన దాన్ని ఆమోదించటం లేదు. నేను డిఫెన్సుకు ఎన్నడూ ఇష్టపడలేదు. ఇప్పుడూ అదే మాట మీద ఉన్నాను... ... మీరు పెట్టిన అప్లికేషనుకు సంబంధించిన వివరాలన్నీ ప్రజలకు తెలియాలి. ఈ ఉత్తరాన్ని పత్రికల్లో ప్రచురింపజేయండి.
[Quoted in Bhagat Singh, The Prince of Martyrs,
Dr.L.P.Mathur, PP.134-136]
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ