S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కర రాగిణి.. కృష్ణవేణీ తరంగిణి..

గోదావరి, కృష్ణవేణి నదీమతల్లుల పేరు తలవని తెలుగువాడు లేడు. జనజీవన స్రవంతి అంతా వీటి చుట్టూనే తిరుగుతూంటుంది. తెలుగునేలపై గత ఏడాది గోదావరి పుష్కరాలతో ప్రారంభమైన ఆధ్యాత్మికశోభ ఇప్పుడు ద్విగుణీకృతమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సౌరభాలు ప్రజల మనస్సులను పరవశింపచేస్తున్నాయి. గోదావరి అంత్య పుష్కరాలు పరిసమాప్తమవడమే తరువాయి.. కృష్ణవేణి పుష్కరాలు ప్రారంభమవడం ఈసారి విశేషం. దీనికి తోడు వరలక్ష్మీవ్రతాలు. ఈనెల 12నుంచి ప్రారంభమయ్యే కృష్ణవేణి పుష్కరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. కృష్ణవేణి ఉరవడి, సవ్వడి ఈనాటికాదు. పురాణేతిహాసాల్లో కృష్ణవేణి ప్రస్తావన ఉన్నది. 12రోజుల పాటు సాగే పుష్కరాల సందర్భంగా కృష్ణమ్మ వైభవం తెలుసుకుందాం.

పుణ్యప్రదం కృష్ణవేణీ తరంగిణీ పుష్కరం
‘ఆపో వా ఇదగ్‌ః సర్వం విశ్వా భూతాన్యాపః
ప్రాణావా ఆవః, పశవ ఆపోన్న మాపోమృతమాపః, సమ్రాడాపో,
విరాణాపః సర్వాడాపః ఛందాంస్యాపో, జ్యోతీంష్యాపో, యజూంష్యాపః
సత్యమాపః, సర్వదేవతా ఆపో భూర్భువ స్రువరాప ఓమ్’

అప్, సలిలం, జలం, ఉదకం మొదలగు పదములకు సాధారణముగా జలమనియే (నీరు) అర్థము. జలములే ఈ విశాల విశ్వం, సమస్త భూతములు, ప్రాణములు, పశువులు, అన్నము, అమృతము, ఛందస్సులు, జ్యోతిస్సులు, యజోస్సులు, వేదములు, సత్యము, సమస్త దేవతలు, ఓంకారము.. అని చెప్తోంది వేద మంత్రము. కనుక జలములంటే సామాన్య జలములుగాదు, చతుర్వేద స్వరూపమనీ అనగా వేద మంత్ర స్వరూపమనీ, దేవతా స్వరూపమనీ, ఓంకార స్వరూపమనీ, అమృత స్వరూపమనీ చెప్తోంది. కనుక జలములలో ఇంత మహత్తరమైన శక్తి ఉంది.
‘దివ్యములైన ఈ జలములు మంగళకరములై, శుభప్రదములై మా కోర్కెలను తీర్చుగాక. మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక, మా వైపు ప్రవహించుగాక’ అని జల వైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొన్న వేద ఋషులు త్రికరణ శుద్ధిగా జల దేవతను ప్రార్థించారు. ‘శంవో దేవీ రభీష్టయ ఆపో భవంతు పీతయే శం యో రభిస్తవన్తునః’ ఇది జల తత్త్వాన్ని తెలుపుతుంది.
జలములు, నదులు: జలములు, గ్రీష్మాదిత్య కిరణముల చేత తపించి శోషించి సూర్య కిరణములే అవుతాయి. సూర్య కిరణముల యందలి జలములను మేఘములు స్వీకరిస్తాయి. మేఘములకు, ఈశాన్య నైరుతి ఋతు పవనములు తాకగానే ద్రవీభవిస్తాయి. వర్షం కురుస్తుంది. పర్వతముల మీద వర్షములు కురిసినపుడు, క్రిందకు ప్రవహించి, మైదానముల గుండా ప్రవహిస్తూ, ఓషధీ గుణములు గల్గిన మొక్కలు, చెట్ల మీదుగా ప్రవహిస్తుంది, ఓషధీ గుణాలను సంతరించుకుంటుంది. వాగులు, వంకల్ని కలుపుకుంటూ, చిన్నచిన్న ఉపనదులను కలుపుకుంటూ శక్తివంతమైన నదిగా ప్రవహిస్తుంది. తన పరీవాహక ప్రదేశాల్ని పాడిపంటలతో సస్యశ్యామలం చేస్తుంది నది. సాంస్కృతికంగా మనకు మహోన్నత స్థానాన్ని సంపాదించిపెట్టేవి, నదులు. ప్రజలకు జీవనాధారం - నదులు. భారతీయ జన జీవనానికి, నాగరికతకు అద్దం పట్టేవి నదులు. ఓషధీ గుణములతోనున్న నదీ జలములలో స్నానాదులు చేసిన వారికి అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి కలిగి, అలౌకిక ఆధ్యాత్మికానందం చేకూరుతుంది. మానవ జీవనానికి మహత్తర సందేశాన్నిచ్చేవి నదులు.
పంచభూతములలో, జలము ప్రముఖ స్థానం వహిస్తుంది. ‘జ’ అంటే జన్మ లేక పుట్టుక. ‘ల’ అంటే లయము. అనగా దేని నుండి జగత్తు పుట్టిందో దేనిలో లీనమవుతుందో దానికి ‘జల’మని పేరు. పరమేశ్వరునివి -సృష్టి లయములు. కనుక జలములంటే ప్రప్రథమముగా సృష్టింపబడిన పరమాత్మ స్వరూపం.
నీటికి ఆధారభూతమైన నదులు, ఆసేతు హిమాచల పర్యంతం ప్రవహిస్తూ భారతదేశాన్ని సస్యశ్యామలంగా ఉంచుతున్నాయి. వీటిలో గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, సింధు, ప్రణీతో అనే పనె్నండు సుప్రసిద్ధమైనవి.
కృష్ణవేణీ తరంగిణి: ‘బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేనూ బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి..’ అని ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ భావగీతంలో తెలుగువారి ముద్దుబిడ్డ శంకరంబాడి సుందరాచారి కృష్ణవేణీ నది గురించి ఎలుగెత్తి పలికాడు.
పురాణేతిహాసాలలో కృష్ణవేణీ నది
తతో గోదావరీ రమ్యాం కృష్ణవేణీ మహానదీమ్
వరదాంచ మహాభాగం మహోరగ నిషేవితామ్ - రామాయణమ్
హనుమదాదులకు దక్షిణ దిక్కున వెతకవలసిన ప్రదేశాలను సూచిస్తూ సుగ్రీవుడు, కిష్కింధకాండలో 39వ సర్గ 9వ శ్లోకంలో పవిత్ర గోదావరి, కృష్ణవేణీ నదులను మహానదులుగా పేర్కొంటూ, అక్కడి నుండి సీతానే్వషణ చేయమన్నారు. దీనినిబట్టి మనకేమి అర్థమవుతుంది? కృష్ణవేణీ నది రామాయణ కాలం కంటే ముందే ఉన్నదని తెలుస్తోంది.
వేద పాదముల నుండి పుట్టి, వేద స్వరూపిణి, పుణ్యమూర్తి, లోకపావనియగు కృష్ణవేణీ తరంగిణి మునుపెపుడో పరమాత్మచే సృజింపబడిందని, స్కాంద పురాణం పేర్కొన్నది.
తుంగభద్రా కృష్ణా భీమరథి గోదావరి
(్భగవతం 5-19-18)
తుంగభద్రకి ఉత్తరంగా కృష్ణానది, కృష్ణకి ఉత్తరంగా భీమరథి, భీమరథికి ఉత్తరంగా గోదావరీ నది వున్నాయని నదీ శాఖల్ని గురించి భాగవతంలో చెప్పబడింది. భీష్మ పర్వంలో కూడా ప్రస్తావించబడింది. బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణంలో, పద్మపురాణంలో కృష్ణవేణీ నది గురించి పేర్కొనబడింది.
కృష్ణవేణి పుట్టుక
కృష్ణానది విష్ణురూపిణి అని ప్రసిద్ధి. లోకాలను తరింపచేయడానికి శ్రీమహావిష్ణువు కృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన అశ్వత్థ (రావి) వృక్ష రూపంలో నిలిచాడని, ఆ చెట్టు వేళ్ల నుంచి కృష్ణానది అవతరించిందని చెప్తారు. సహ్యాద్రి మీద బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశాన్ని బ్రహ్మగిరి అని, వేదాలు మూర్త్భీవించి పరమేశ్వరుణ్ణి స్తోత్రించిన చోటును వేదగిరిగా ప్రసిద్ధి చెందినాయి. జనుల పాపప్రక్షాళన కొరకు మహర్షులు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమాత్మ ఆ ప్రదేశంలో లింగరూపంలో వెలశాడు. ఆ ప్రదేశంలోగల ఆమలక (ఉసిరిక) వృక్షం మాడి వేణీ నది ఆవిర్భవించింది. వేణీనది, కృష్ణానదితో ఏకమైతే, ఇనుమడించిన ప్రాశస్త్యంతో కృష్ణవేణీ నది ఏర్పడిందని చెప్పబడింది. ఇది శివకేశవులకు అభేద రూపం. ఇంతటి ఖ్యాతి ఒక్క కృష్ణవేణీ నదికే దక్కింది. కనుక, నదులన్నింటిలోకి ప్రాముఖ్యత వహిస్తుంది కృష్ణవేణీ నది. పరమ పవిత్రంగా భావించబడిన ఈ నదిలో స్నానం, సమీపంలో జీవనం అత్యంత పుణ్యప్రదం, ఫలప్రదం.
కృష్ణవేణీ నది జన్మవృత్తాంతం గూర్చి పద్మపురాణంలో కార్తిక మహాత్మ్యంలో వేరే విధంగా ఉన్నది. బ్రహ్మదేవుడు సహ్యాద్రి శిఖరమందు యజ్ఞాన్ని తలపెట్టగా సరస్వతీ దేవి రావటంలో ఆలస్యమయింది. ముహూర్తము అతిక్రమిస్తోందని భృగు మహర్షి ‘గాయత్రి’ని ప్రక్కన కూర్చోపెట్టుకుని యజ్ఞం చేస్తుండగా, వాణి - స్వరదేవత వచ్చింది. గాయత్రికి ‘గుప్త రూపమైన నది అగుగాక’ అని, మిగిలిన వారందరినీ జడత్వముతో కూడిన నదులు అగుదురుగాక’ అని శపించింది. దానికి ప్రతిగా గాయత్రి ‘సరస్వతిని నీవు కూడా నదిని అగుదువుగాక’ అని, శపించింది. అక్కడున్న వారందరూ నదులగుట సంభవించింది. విష్ణువు కృష్ణానది అయినాడు, మహేశ్వరుడు వేణీ నది అయినాడు, బ్రహ్మ కకుద్మిని అయినాడు. దేవతలు తమ తమ అంశములు జడములుగా చేసి సహ్యాద్రి శిఖరము నపేక్షించి తాము కూడా వేరువేరుగ నదులైనారు. అవి దైవాంశలచే పూర్వవాహినులైనాయి. దేవతల భార్యల అంశలచే పెక్కు పశ్చిమ వాహినులైన నదులేర్పడ్డాయి. గాయత్రి, సర్వము కూడా పశ్చిమాభిముఖులైన నదీ రూపములు దాల్చినారు. ఏ పురాణగాథను చూచిన ‘కృష్ణా విష్ణు తనుః సాక్షాత్ వేణీ దేవో మహేశ్వరః’ అనేది సహత్య. అనగా కృష్ణవేణీ తరంగిణి శివకేశవులకు అభేద రూపమైన నది.
అందుకే భారతావనిలోని నదులన్నింటిలోకి కృష్ణవేణీ నది ప్రత్యేక పవిత్రతను పొందింది. సరస్వతీ దేవి శాపము వలన త్రిమూర్తులు, దేవర్షులు నదీ నద రూపంలో జన్మించి కృష్ణయందు కలిసారన్న పద్మపురాణ గాథగా, కృష్ణవేణి, కకుద్మతి సావిత్రి గాయత్రి వార్సియా ఏరాకి దూధ్‌గంగా ఘట ప్రభ మలప్రభ, భీమ, తుంగభద్ర, మూసీ మొదలగు పదునాలుగు ఉపనదులను కలుపుకొంటూ ఇహ పరములకు సేతువై, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ, నూట ముప్పది ఎనిమిది పుణ్య తీర్థాలు క్షేత్రాల మీదుగా సుమారు పదునాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, నలుబదికి పైగా తనపై ఆనకట్టలను నిర్మింపజేసికొని, కృష్ణాజిల్లా దివి తాలూకా హంసలదీవి వద్ద, తన స్వరూపుడైన శ్రీ వేణుగోపాలస్వామి సాక్షిగా, సముద్రినిలో ఐక్యమవుతున్న కృష్ణవేణీ తరంగిణి కల్పవృక్షమే గాక కామధేనువు. అందుకేనేమో నదీ ప్రారంభము గోముఖము నుండి జరుగుతోంది.
పుష్కరం అంటే ఏమిటి?
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - ఇవి పంచభూతములు. వీటిలో జలమునకు సంబంధించినది పుష్కరము. ‘పోషయతీతి పుష్కరమ్’ ఎల్లప్పుడూ పోషించేది, లోకమునకు జీవనభూతమైన జలమునకు - పుష్కరమని పేరు. ‘జీవనం భువనం వనమ్ పుష్కరం సర్వతోముఖమ్’ అన్నది అమరకోశము.
పూర్వం తుందిలుడనే ధర్మనిష్ఠుడు పరమేశ్వరుని గూర్చి అత్యంత దీక్షగా ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన పరమేశ్వరుని, తను శాశ్వతంగా ఆయనతో ఉండేటట్లుగా వరమడిగాడు. పరమశివుడు అష్టమూర్తి అని విష్ణు పురాణం చెప్పింది. ‘సూర్యో జలం మహీ వహ్ని ర్వాయు రాకాశ ఏవచ, దీక్షితో బ్రాహ్మణ స్సోమః ఇత్యష్టౌ మూర్తయే మతాః’ సూర్యుడు, చంద్రుడు, జలము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, సత్వ గుణ సంపన్నుడైన జీవుడు - ఎనిమిది పరమేశ్వరుని అష్టమూర్తులు. పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన ‘జల’ రూపంలో అతడికి శాశ్వత స్థానమిచ్చాడు. మూడున్నర కోట్ల పుణ్య తీర్థాలకు అధికారణుడుగా, జల సామ్రాజ్యానికి సార్వభౌముడుగా పుష్కరుడు వరాలు పొందాడు. తరువాతి కాలంలో బ్రహ్మకు జగత్సృష్టి చేయటానికి జలములు అవసరమైనాయి. అందుకు బ్రహ్మ పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. పుష్కరుణ్ని తన కమండలంలో నివాసముండేటట్లు వరం పొందాడు బ్రహ్మ- పరమేశ్వరుని నుండి.
పుష్కర ఉదంతం
ప్రాణులను బ్రతికించే ధర్మం - బృహస్పతిది అనగా నవగ్రహములలో గురువుది. గురువు - జీవన, విద్యా, వాక్కు, గృహ, వాహన కారకుడు. కుటుంబ కారకుడు. గురు అనుగ్రహంతో జీవనం సుసంపన్నం అవుతుంది. గురువు బ్రహ్మను గురించి తపమాచరించాడు. ప్రాణులకు జీవనాధారం - జలములు. జలములకు, సమస్త తీర్థకోటికి అధికారణుడైన పుష్కరుణ్ణి తన అధీనంలో ఉండేటట్లుగా చేయమని బ్రహ్మను వరమడిగాడు, గురువు. అయితే, గురువు బ్రహ్మను విడిచి వెళ్లటానికి ఇష్టపడలేదు. బ్రహ్మ కూడా తనతో ఉండాలన్నాడు. అది అసాధ్యం. బ్రహ్మదేవుడు ఒక ఏర్పాటు చేశాడు. గ్రహములన్నీ ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించటానికి చంద్రునికి రెండుప్పాతిక రోజులు పడితే, రవికి ముప్పది రోజులు పడుతుంది. అదే, గురువుకి ఒక సంవత్సరం పడుతుంది. మేషాది మీన రాశులు పనె్నండు. కనుక గురుడు ఒక రాశిలో ప్రవేశించేటపుడు మొదటి పనె్నండు రోజులు, ఆ రాశుల నుండి నిష్క్రమించేటపుడు 12 రోజులు, సంవత్సరంలో మిగిలిన అన్ని దినాలలో మధ్యాహ్నం రెండు ముహూర్తముల కాలం, పుష్కరుడు బృహస్పతితో ఉండాలని, ఆ సమయాలలో తాను సమస్త దేవతలతోను, పితృదేవతలతో, గురువు ఉన్న రాశికి అధిష్ఠానమైన పుణ్యనదికి వస్తానని, ఈ విధంగా పుష్కరుడు నిరంతరం బ్రహ్మతోనూ గురువుతోనూ ఉండే ఏర్పాటు జరిగింది.
నదుల పుష్కరములు
‘మేషే గంగా వృషే రేవా మిథునేచ సరస్వతీ కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మృతా, కన్యాయాం కృష్ణవేణీ చ కావేరీ ఘటకే స్మృతా...’ అనే శ్లోక ప్రకారం, బృహస్పతి పుష్కరునితో కలిసి మేషరాశిని ప్రవేశించినపుడు గంగకు పుష్కరం, వృషభ రాశిలో నర్మదకు, మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరథికి, ధనస్సులో బ్రహ్మపుత్ర (వాహిని)కి, మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధునదికి, మీనంలో ప్రణీతానదికి పుష్కరాలు వస్తాయి. ‘పుష్కరం’ అంటే పనె్నండు సంవత్సరములని కూడా అర్థం. గురుడు కన్యారాశిలో ప్రవేశిస్తే వచ్చేవి కృష్ణా పుష్కరములు. మరల కృష్ణా పుష్కరములు రావాలంటే పనె్నండు సంవత్సరాలు పడుతుంది.
పుష్కర ప్రశస్తి
నదులన్నీ శక్తివంతమైనవి. గురుడు, పుష్కరుడు, బ్రహ్మాది దేవతలతోను, మూడున్నర కోట్ల తీర్థరాజములతోటి, పితృదేవతలలో ఉన్నపుడు ఆ నదీ జలములు, అనగా పుష్కర కాలంలో ఎన్నో రెట్లు శక్తివంతంగా, తేజోవంతంగా ఉంటాయి. ఆ సమయాలలో చేసే స్నాన దాన జప అర్చన ధ్యాన హోమ తర్పణ అనుష్ఠానాలు, పితృ పిండ ప్రదానాలు అత్యంత పుణ్యప్రదమని పురాణములు పేర్కొన్నాయి, మహర్షులు బోధించారు. పుష్కర సమయంలో నదీ పరీవాహక ప్రాంతంలో ఎచ్చట స్నానం చేసినా అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి జరిగి, శారీరక మానసిక బౌద్ధిక కల్మషాలు తొలగి, పవిత్రత తేజస్సు ఉత్తేజము కలిగి, ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
పుష్కర విధులు
పుష్కరముల పనె్నండు రోజులకు విధి విధానాలను శాస్తమ్రులు పేర్కొన్నాయి. దినానికొక రీతిని దాన విధి ప్రతిపాదింపబడినది. పదహారు రకములైన దానములు చెప్పారు. పుష్కర విధులలో విశేష ప్రాముఖ్యమివ్వబడే మరొక అంశం పితృదేవతలకు తర్పణములు, పిండ ప్రదానములు. ‘అగ్నేనయ సుపథారాయేంస్మాన్..’ అగ్ని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ,‘ఓ అగ్ని దేవుడా! నాకు మంచి మార్గాన్ని చూపించమ’ని అడుగుతున్నాం. అదే వెలుగు మార్గం. జీవుడు మరణించిన తరువాత, చంద్రలోకమునకు జేరి, పుణ్య పాప విశేషాల్ని అనుభవించి మరల, శేషించిన వాటితో భూలోకంలోకి వర్షధారల నుండి గాని, చంద్ర కిరణముల ద్వారా గాని చేరుతాడు. ఆ ధాన్యాన్ని స్ర్తి, పురుషులు భుజిస్తే, శుక్ల శోణితములుగా మారి, జననము ఏర్పడుతోందని భగవద్గీత, ఛాందోశ్యపనిషత్, అరుణ మాత్రం చెపుతాయి. అయితే, జీవుడు ఈ జనన, మరణ చక్రబంధంలో తిరగకుండా తను చేసిన ధర్మ కార్యములతోను, పర్వదిన కాలములలో (పుష్కరములు, అమావాస్య సంవత్సరములో పెట్టే తిథి) పితృదేవతలకిచ్చే తర్పణములు, పిండ ప్రదానములతో మోక్షాన్ని పొందుతారని పేర్కొనబడింది.
పుష్కర కాలంలో జరుపవలసిన విస్తృత విధి విధానము ఒక మహత్తర తపస్సు, ఒక యజ్ఞ దీక్ష లాంటిది.
క్రైస్తవ మత సోదరులు కూడా ప్రతి సంవత్సరం నవంబరు 2వ తేదీనాడు ‘ఆల్ సోల్స్ డే’ అనే పేరుతో, మరణించిన వారి సమాధుల దగ్గర శ్రద్ధ్భాక్తులతో పుష్పములు అర్పిస్తారు. పిల్లల సమాధుల దగ్గర ఊయలలు, ఆటబొమ్మలను ఉంచే ఆచారం ఉంది. ఇతర మతాలలో కూడా పితరుల ఆరాధన ఉన్నది.
తల్లి గర్భంలో జీవుణ్ణి ఆధారం చేసి పెంచే దేవతలు, పితృదేవతలు అనబడే వర్గంలో ఒక అంతర్భాగం. పిండ పితృ యజ్ఞం అనగా పుష్కర శ్రాద్ధం, ప్రతి సంవత్సరం పెట్టే ఆబ్దీకము మొదలగునవి శాస్ర్తియమైన కర్మకాండలు. పితృదేవతారాధన వంశవృద్ధిని కలిగిస్తుంది.
పుష్కర స్నానములు
నర్మదా నదీ తీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానము, కాశీ క్షేత్రంలో మరణము మోక్షప్రదమని చెప్పబడింది. అయితే, పుష్కర కాలంలో కృష్ణవేణీ తరంగిణీ స్నానం చేస్తే, పై మూడింటి ఫలితాల్ని యిస్తుందని పద్మ పురాణం పేర్కొన్నది.
పుష్కరా, పుష్కరేక్షణా - లలితా సహస్ర నామం
‘పుష్కరా’ - పుష్కంరాతీతి పుష్కరా’ అనగా పోషణ నిచ్చునది గాన లలితా పరమేశ్వరి ‘పుష్కర’ అయింది. ‘పుష్కరేక్షణా - పుష్కరే ఈక్షణం యస్యాఃసా’ పుష్కరములందు ఈ క్షణము గల్గినది - లలితాదేవి. పుష్కరములంటే జలములు (పుష్కర+ఈక్షణ) జలము లందు ఉత్సవములు గలది అనే అర్థం కూడా వస్తుంది. జలములందు ఉత్సవము అనగా ‘పుష్కరోత్సవము’. లలితా సహస్ర నామములలోని ఈ నామములనుబట్టి పుష్కరోత్సవమనగా ‘లలితాదేవి ఆరాధనమే’.
కనుక పుష్కరోత్సవములు జరిపి, నదీ పుష్కర స్నానమాచరించి దేవ, ఋషి, పితృ తర్పణము గావించి, పనె్నండు సంవత్సరముల కొకసారి ఒక నదికి వచ్చే పుష్కరములలో మన విధులను నిర్వర్తించి సత్ఫలితాల్ని పొందాలి.
కళలకు కాణాచి
కృష్ణా పరీవాహక ప్రాంతం. సంస్కృతంలో శ్రీకృష్ణ లీలాతరంగిణిని రచించిన శ్రీనారాయణ తీర్థులు, పుష్టిమార్గ తత్త్వ నిర్దేశకుడు శ్రీ వల్లభాచార్యుడు, కూచిపూడి నాట్యసిద్ధాంతకర్త, యోగి పుంగవుడు సిద్ధేంద్రయోగి, భక్తితో శృంగార రసభావంతో రచించిన పదములతో మువ్వగోపాలుని పద కమలములను అర్చించిన క్షేత్రయ్య, శ్రీకాకుళాంధ్ర దేవునిపై పద్య కుసుమములర్పించిన కాసుల పురుషోత్తమ కవి, ప్రజల నోట పద్యం పలికించిన చెళ్లపిళ్ల వేంకట శాస్ర్తీ, ఒకప్పటి ప్రభుత్వ ఆస్థాన కవి కాశీకృష్ణాచార్యులు, అన్నమాచార్య కీర్తనలు పరిశోధించి, పరిష్కరించి, ప్రకటించిన వేటూరి ప్రభాకరశాస్ర్తీ, చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న వేటూరి సుందరరామ్మూర్తి, సందేశాత్మక చిత్రాలకు హృద్యంగా పాటలు, మాటలు అందించిన పింగళి నాగేంద్రరావు, సాహిత్య విరాట్టు కవి సమ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ.. ఇలా ఎందరో మహనీయులను అందించింది కృష్ణవేణి.
పుష్కర నదీ స్నానంతో అంతఃశ్శుద్ధి బాహ్యశుద్ధిని పొంది, సాత్విక సాధనతో, పవిత్ర భావనతో నిర్మల హృదయాన్ని నిశ్చల మనస్సు పొంది కాల ప్రాముఖ్యాన్ని గుర్తెరిగి, అనంతకాల సాగర లహరి మానవ జీవితం అని తెలిసికొని దాన్ని సద్వినియోగం చేసికొని, సర్వులయందు ఉన్నది ఒకే చైతన్యమని గ్రహించి, స్వార్థ రహితంగా విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించి, ‘నదీనాం సాగరోగతిః’ అన్నట్లుగా జీవుడు పరమాత్మలో ఐక్యం అవటమే మోక్షమన్న జ్ఞానాన్ని పొందాలని హితవు పలుకుతున్నాయి - కృష్ణవేణీ తరంగిణీ పవిత్ర పుష్కరములు.

కృష్ణవేణీ పరీవాహక ప్రాంత పుణ్యక్షేత్రాలు

‘కోటి తీర్థాలు నీ నీటిలో దాచి, ముక్కోటి దేవతలు నీ పైటలో ముడివైచి, కదలిరా, కదలిరా, కడలిరాయుని రాణి, ఎదురుచూచుచు నున్నది తెల్గు మాగాణి’ అని ‘కరుణశ్రీ’ చేత, ‘కృష్ణా తరంగ పంక్తిక ద్రొక్కి త్రుళ్లింత నాంధ్ర నౌకలు నాట్యమాడు నాడు’ అని నవ్య కవితా యుగకర్త రాయప్రోలు సుబ్బారావు చేత, ‘కృష్ణా తరంగాల సారంగ నాదాలు కృష్ణలీలా తరంగిణీ దివ్య గీతాలు’ అంటూ మరపురాని చలనచిత్ర గేయ కవి వేటూరి సుందర రామమూర్తిచేత స్వాగత గీతాలు ఆలపింప చేసికొంటూ, తెలుగు నేలపైకి బిరబిరా వచ్చింది, గలగల ధ్వనితో కృష్ణవేణీ తరంగిణి.
మహబూబ్‌నగర్ జిల్లా పెద్దచింతలలో ప్రథమంగా ఈ నది ప్రవేశిస్తుంది. అక్కడి ప్రసిద్ధ దేవాలయం ఆంజనేయస్వామిది. తరువాత ‘కృష్ణ’ గ్రామం ‘సర్వదేవతా స్వరూపుడు, వనపర్తికి దగ్గరలో ‘శ్రీరంగాపురం’ పరిపాలించే మహారాజు తరచు శ్రీరంగం క్షేత్రం వెడుతూండేవాడట. కొంతకాలానికి వెళ్లలేకపోతున్నాని తపిస్తుంటే, శ్రీరంగనాథుడు స్వప్నంలో కనపడి, మరునాడు ఒక పక్షి రాజు ఆకాశంలో విహరిస్తూ వస్తాడు. ఆ పక్షి మరునాడు కృష్ణ భూపాలునికి దర్శనమిచ్చింది. దాన్ననుసరించి వెళ్లారు. ఒకచోట కనపడకుండా వెళ్లిపోయింది. ఆగిన చోట చూస్తే శ్రీరంగనాథుని విగ్రహం దృశ్యమయింది. వైభవోపేతంగా ఉంటుంది నూట ఎనిమిది స్తంభాలతో సభా మండపం. కన్నుల పండువుగా జరుగుతుంది రథోత్సవం.
ఆలంపూర్
మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణవేణి, తుంగభద్ర సంగమము ఆలంపూర్‌కు నాలుగు మైళ్ల దూరంలో ఏర్పడింది. అష్టాదశ శక్తి వేదాలలో ఒకటైన శ్రీ జోగులాంబా పీఠం ఇక్కడే ఉంది. ప్రధానాలయం బాలబ్రహ్మేశ్వరాలయం.
సంగమేశ్వరం
ఆలంపురానికి పనె్నండు మైళ్ల దూరంలో ఆరు నదుల సంగమం ఉండేది. ఆలయంలో సంగమేశ్వర లింగం, వీరభద్రమూర్తి, శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఆలయాన్ని ఆలంపూర్‌కు తరలించి పునర్నిర్మించారు.
పెద్ద సంగమేశ్వరం
కృష్ణవేణీలో భవనాశినీ నది కలుస్తుంది. కృష్ణవేణీ మలప్రభ, ఘట ప్రభ, భీమ, తుంగ, భద్ర - సప్తనదీ సంగమం. వివృత్తి సంగమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పాప నివృత్తి చేసే సప్తనదీ సంగమ క్షేత్రం కనుక. మహాభారతంలో ధర్మరాజు అరణ్యవాసం చేస్తున్నపుడు ఈ ప్రదేశానికి వచ్చినపుడు అచ్చటి ప్రజలు అక్కడ ఒక శివాలయాన్ని నిర్మించమని కోరారు. శివలింగాన్ని తీసుకొని రావటానికి భీముడు కాశీకి వెళ్లాడు. ముహూర్త సమయానికి రాలేదు. ఋత్విక్కులు ఆదేశించగా వేపమొద్దును కోయించి సకాలంలో లింగంగా ప్రతిష్ఠ చేశాడు. తరువాత భీముడు వచ్చాడు. కోపంతో తాను తెచ్చిన లింగాన్ని నదిలోకి విసిరేశాడు. అది నది ఒడ్డునే పడింది. ధర్మరాజు భీముణ్ని సమాధానపరచి, అతను తెచ్చిన లింగం భీమలింగం అనే పేరుతో మొదటి పూజ లందుకుంటుందని అక్కడే ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ పంచేశ్వరాలయాలున్నాయి. నది అవతల ఉన్న సోమశిల, అగస్త్యేశ్వరాలయాలను వేరేచోటికి తరలించి పునర్నిర్మాణం చేశారు. మహాశివరాత్రికి సంగమేశ్వరాలయం బయటపడుతుంది.
శ్రీశైల మహాక్షేత్రం
ప్రకృతి శోభతో, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటై, పదునెనిమిది (అష్టాదశ) శక్తి పీఠములలో ఒకటైన శ్రీ భ్రమరాంబాదేవితో కొలువుతీరిన మల్లికార్జున స్వామి లింగ రూపంగా స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం. పర్వత పంక్తుల మధ్య గంభీరంగా ప్రవహిస్తుంది కృష్ణవేణీ నది. ‘పాతాళగంగ’ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ఎందరో మహర్షులు, మహనీయులు తపస్సు చేసిన ప్రదేశం. ‘శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే’ శిఖర దర్శనం చేతనే పునర్జన్మ నుండి ముక్తిని కలిగించేదీ మహాక్షేత్రం. ఆదిశంకరులు ‘శివానందలహరి’ శ్రీశైల క్షేత్రంలోనే లిఖించి స్తోత్రించారని చెప్తారు. ధూళి దర్శనం (క్షేత్రానికి వచ్చినదే తడవుగా స్వామి దర్శనం చేసికోవటం) ఇక్కడి ప్రత్యేకత.
వాడపల్లి, మట్టుపల్లి, వేదాద్రి
ఇవి నారసింహ క్షేత్రాలు. వాడపల్లి క్షేత్రం అత్యంత పురాతనమయింది. ఇచ్చటి మీనాక్షీ సుందరేశ్వరాలయం, లక్ష్మీ నృసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. దీపాలు ఊగుతూ ఉంటాయి. అవి- స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసములని చెప్తారు. మట్టుపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి - ప్రహ్లాద వరదుడు. ప్రహ్లాదుని విగ్రహం స్వామి పాదాల చెంత ఉండటం భక్తి పారవశ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం - వేదాద్రి. బ్రహ్మ నరసింహస్వామిని కృష్ణవేణీ నదీ గర్భంలో సాలగ్రామ పర్వతంపై ప్రతిష్ఠించాడు. వేద శిఖరాన జ్వాలా నరసింహాకృతితోను, ఋష్యశృంగ మహర్షిచే యోగమూర్తిగాను, పీఠాన లక్ష్మీ నరసింహునిగాను, గరుడాద్రిపై వీర నరసింహాకృతిలోను - పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతోంది వేదాద్రి.
అమరావతి
పవిత్ర పంచారామ క్షేత్రములలో ప్రథమారామము - అమరారామం. ఇక్కడ అమరలింగేశ్వర ప్రతిష్ఠ ఇంద్రునిచే జరిగింది. నేటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అత్యంత వైభవంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. తల్లి బాల చాముండేశ్వరీ దేవి కొలువై భక్తుల పాలిటి కల్పతరువై విరాజిల్లుతోంది.
విజయవాడ కనకదుర్గాలయం
పవిత్ర కృష్ణవేణీ నదీ తీరంలో విరాజిల్లుతున్నది విజయవాడ నగరం. మహిషాసుర వధానంతరం, ఇంద్రకీలుడనే శాక్తేయునికి ఇచ్చిన వరం ప్రకారం స్వయంభువుగా వెలసింది- ఇంద్రకీలాద్రిపైన దుర్గామాతగా. తప్పు చేసిన తన తనయునికి ఉరిశిక్ష వేసిన ధర్మప్రభువు మాధవవర్మ ధర్మనిరతికి సంతసించి కనకవర్షం కురిపించి, కనకదుర్గ నామంతో లక్షలాది భక్తుల పూజలందుకుంటోంది కనకదుర్గామాత. బ్రహ్మచే ప్రతిష్ఠింపబడిన లింగం - మల్లేశ్వరస్వామి. ఇంద్రకీలాద్రి దిగువ భాగంలో ఉన్నది విజయేశ్వర ఆలయం. పాండవ మధ్యముడైన అర్జునుడు పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని పొంది వినమ్రతతో ప్రతిష్ఠించిన మహాలింగం - విజయేశ్వర లింగం. విజయుడు ప్రతిష్ఠించిన లింగం పేరు మీద వచ్చినదే విజయవాటిక. అదే నేటి ‘విజయవాడ’.
శ్రీకాకుళం: ఆంధ్ర మహావిష్ణువు
ఆంధ్ర, శాతవాహన రాజులకు ప్రథమ రాజధాని ఇది. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గర్భాలయంలో దర్శనమిస్తాడు. మూలవిరాట్టుపై దశావతారాలను చూడవచ్చు. అమ్మవారి పేరు రాజ్యలక్ష్మీదేవి. స్వామివారికి 108 సాలగ్రామ శిలాహారం ఉన్నది. శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడే ఆముక్తమాల్యద కావ్యాన్ని వ్రాశాడన్న విషయానికి చిహ్నంగా, దేవాలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ చేసిన మండపం ఉంది.
ఐలూరు, పెదకళ్లేపల్లి, మోపిదేవి
ఐలూరు ఉభయ రామేశ్వర క్షేత్రం. కృష్ణానది ఇవతల ఒడ్డున, శ్రీరామచంద్రుడు రావణబ్రహ్మను చంపిన పాప పరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆంజనేయ స్వామి తెచ్చిన లింగాన్ని కృష్ణ అవతల ఒడ్డున (గుంటూరు జిల్లా) చిలుమూరు క్షేత్రంలో ప్రతిష్ఠించాడు. ఈ రెండింటికి ఉభయ రామేశ్వర క్షేత్రాలుగా ప్రసిద్ధి. పెదకళ్లేపల్లిలో స్వయంభువుగా వెలసిన దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. ఇందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇక్కడ కృష్ణవేణి ఉత్తర వాహినిగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. మోపిదేవి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మహిమాన్వితమైనది. కుమారస్వామి సర్పాకారంలో ఇక్కడ తపస్సు చేసి, స్వయంభువుగా వెలిశాడు.

-పసుమర్తి కామేశ్వరశర్మ