S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బహుమతి (సండేగీత)

చిన్నపిల్లలకి బహుమతులంటే చాలా ఇష్టం. పెద్దవాళ్లు పట్టణానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఏదో బహుమతి తెచ్చేవాళ్లు. పిల్లలు వాటి కోసం ఎంతో ఎదురుచూస్తారు.
నేను పదవ తరగతి పాస్ కాగానే మా అన్నయ్య నాకు ఓ చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతిని తీసుకున్నప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.
పెద్దవాళ్లుగా చిన్నపిల్లలకి ఎన్నో బహుమతులని ఇచ్చాం. వాళ్ల కళ్లల్లో వెలుగులని చూశాం. పెద్దవాళ్లం అయిన తరువాత కూడా చిన్న పిల్లల మనస్తత్వం పోలేదు. బహుశ అది మంచి గుణమని అన్పిస్తుంది.
మా అబ్బాయి అమెరికా నుంచి మొదటిసారి వచ్చినప్పుడు నాకు ఓ చేతి గడియారం బహుమతిగా తెచ్చాడు. అప్పటికే నాకు మూడు గడియారాలు ఉన్నాయి. అయినా అది నాకు ఓ అపురూప కానుకగా మారిపోయింది.
వాడు అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా ఏవో బహుమతులు తెస్తూనే ఉంటాడు. ఆ బహుమతులని చూసినప్పుడల్లా ఓ చిన్న పిల్లవాడిగా మారిపోతూంటాను.
చూసే కోణం ఉంటే మనం ప్రతిరోజూ చిన్నపిల్లవాడిగా మారి పరవశించవచ్చు. మనకు నచ్చిన వస్తువు వెనక భావనని గమనిస్తే అది బహుమతిగా మారిపోతుంది. ఆ భావనని మనం గమనించకపోతే అది ఓ వస్తువుగా కన్పిస్తుంది. ఉదయం లేవగానే చిన్న పిల్లవాడిగా మనం పరవశించాలి. ఎందుకంటే ఆ రోజు అనేది మనకు లభించిన కానుక.
ఈ బహుమతి ఆ భవగంతుడు మనకు ఇచ్చి ఉండవచ్చు. సృష్టి ఇచ్చి ఉండవచ్చు. ఎవరు ఇచ్చినా కొత్త రోజు మళ్లీ మన జీవితంలో లభించని రోజు. చిన్నప్పుడు మనకు బహుమతిగా లభించిన వస్తువుల మాదిరిగా ఈ రోజుని కూడా భద్రంగా చూసుకోవాలి. సద్వినియోగపరచుకోవాలి.
ప్రతిరోజు మనకు బహుమతి లభిస్తుంది. ఆ బహుమతిని ఆనందంగా ఎగిరి అందుకోవడమే కాదు. వీలైనంత ప్రయోజనకరంగా వాడుకోవాలి. అదొక జ్ఞాపకంగా మన జీవితంలో మిగలాలి.