S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆశలన్నీ గాంధీ మీదే (భగత్‌సింగ్ 42)

అన్ని దారులూ మూసుకుపోయాయి. మిగిలింది ఒకే ఒక ఆశ.
ప్రివీ కౌన్సిల్ కూడా కుదరదు పొమ్మన్నాక భగత్‌సింగ్, మరి ఇద్దరి ఉరిని ఆపడం ఒక్క వైస్రాయి చేతుల్లోనే ఉంది. ఆయన ఆ పని ససేమిరా చెయ్యడు. దేశమంతటి నుంచి ఎంత మంది ఎన్ని విన్నపాలు పంపినా, ఎవరు ఎంతగా నచ్చచెప్పినా కనికరించడు. అంత మొండి వైస్రాయిని కూడా తలచుకుంటే మెడలు వంచి, పట్టుబట్టి ఒప్పించగలిగినవాడు యావద్భారతంలో ఒకే ఒక్కడు:
మహాత్మాగాంధి!
గాంధీ తిరుగులేని ప్రజా నాయకుడు. కోట్లాది ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే మహాత్ముడు. ఆ ప్రజలను కాల్చుకు తినే పాపిష్టి విదేశీ ప్రభుత్వం అంతటి వాడు చెప్పినా విని తీరుతుందన్న నమ్మకం మామూలుగా అయితే ఉండదు. కాని- ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో గాంధీజీ ఏదైనా గట్టిగా కోరితే కాదనగల ధైర్యం బ్రిటిషు సర్కారుకు లేదు. ఆయనతో ప్రభుత్వానికి ఉన్న అవసరం అలాంటిది!
"Gandhi is the best policeman the Britisher has in India' (బ్రిటిషు వారికి ఇండియాలో ఉన్న మేటి పోలీసు గాంధీయే) అని అప్పట్లో సీమ దొరల్లో ఒక జోకు. పాపం ఆయన కూడా అతి మంచితనంతో తెల్లవారికి తన వల్ల కించిత్తు అసౌకర్యం కలగకుండా కడు జాగ్రత్త పడుతూ, భారతదేశ అవసరాల కంటే కూడా బ్రిటిషు సామ్రాజ్య ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ... తెల్లదొరతనాన్ని ఇబ్బందిలో పెట్టే పనికి దేశభక్తులు ఎవరు పాల్పడ్డా, అటువంటి ‘ఆగడాన్ని’ తెల్లవారు అడక్కుండానే ఖండిస్తూ, ధిక్కార ధోరణులను వెంటపడి అణచివేస్తూ తన రాజభక్తిని పరిపరి విధాల చాటుకుంటూనే ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్, జవాహర్‌లాల్ నెహ్రు వంటి యువ సోషలిస్టుల పూనిక వల్ల 1927 ఆఖరులో మద్రాసు కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్య్రం మినహా మరేదీ సమ్మతం కాదంటూ తీర్మానిస్తే.. గాంధీగారు సంవత్సరంపాటు కష్టపడి, తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి, ఆఖరికి తన ప్రతిష్ఠను పణం పెట్టి 1928 కోల్‌కతా కాంగ్రెసులో స్వాతంత్య్ర లక్ష్యాన్ని జయప్రదంగా అడ్డం కొట్టాడు. బ్రిటిషు సామ్రాజ్యంలో ఒక డొమీనియనుగా కొనసాగడానికైనా అభ్యంతరం లేదు. మనం కోరుతున్న ప్రకారం అటువంటి తాబేదారు ప్రతిపత్తిని మనకు మంజూరు చేయడానికి ప్రభుత్వానికి సంవత్సరం గడువు ఇద్దాం. ఈలోగా అది ఒప్పుకోని పక్షంలో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం పట్టుబడదాం- అని చెప్పి జాతి సమరోత్సాహాన్ని నీరుగార్చి విలువైన సంవత్సర కాలాన్ని వృధా కావించాడు. మహాత్ముడు తనంతట తాను ఎన్ని మెట్లు దిగినా బ్రిటిషు ప్రభుత్వం బెట్టు వదలలేదు. ఆయన కోరిన రెండో రకం స్వయం ప్రతిపత్తిని కూడా భారతదేశానికి అనుగ్రహించడానికి తెల్లవారికి మనసొప్పలేదు.
ఇక రోజులు గడిచేకొద్దీ జాతి జనుల్లో స్వాతంత్య్రేచ్ఛ ప్రబలింది. తమ జన్మహక్కు అయిన స్వాతంత్య్రాన్ని పోరాడి పౌరుషంతో సాధించటానికి యువతరం కృతనిశ్చయమైంది. జాతీయ ఆకాంక్షను అడ్డుకోవటం ఎవరి తరమూ కాదని అర్థమయ్యాక మహాత్ముడు ప్రాప్తకాలజ్ఞతతో ఒడుపుగా పావులు కదిపాడు. 1929 సంవత్సరాంతాన లాహోర్ కాంగ్రెసులో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ చరిత్రాత్మక తీర్మానం చేయించి, దేశమంతటా ప్రజల చేత స్వాతంత్య్ర ప్రతిజ్ఞలు చేయించి యావద్భారతాన అద్భుత సంచలనం కలిగించాడు. సర్వాధికారాలు సమస్త నిర్ణయాధికారాలు తనకే దఖలు పరచుకుని, ఒక శుభ ముహూర్తాన బ్రిటిషు ప్రభుత్వం మెడలు వంచటానికి సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రకటించాడు. అందులో భాగంగా చరిత్రాత్మకమైన దండియాత్రను చేపట్టి, 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమంలో మొదలుపెట్టి, 24 రోజులపాటు 241 మైళ్లు పాదయాత్ర చేసి దారి పొడవునా ఊరూరా, దేశమంతటా అద్భుతమైన కదలిక తెచ్చి ఏప్రిల్ 5న దండి సముద్ర తీరాన శాసనాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేసి స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టాన్ని ఆవిష్కరించాడు.
అది అఖిల భారతానికి అపూర్వ ఉత్తేజాన్నిచ్చింది. సత్యాగ్రహ విద్యలో నిష్ణాతులుగా ఎంపిక చేయబడ్డ వారు మాత్రమే శాసనోల్లంఘన కార్యక్రమంలో చేపట్టాలని గాంధీగారు నిర్దేశించినా దేశవ్యాప్తంగా లక్షలాది స్వాతంత్య్ర యోధులు స్వచ్ఛందంగా బరిలోకి దూకి గాంధేయ పద్ధతిలో సత్యాగ్రహాన్ని సాగించారు. ప్రభుత్వం పైశాచికంగా విరుచుకుపడ్డా లెక్కచెయ్యక, లాఠీలతో మోదుతున్నా, ఎముకలు విరగగొడుతున్నా, ఒళ్లంతా గాయాలైనా నిగ్రహం కోల్పోక శాంతియుతంగా ఉప్పు తయారుచేసి, శాసనాలను ఉల్లంఘించి ధీరోదాత్తంగా పోరాడారు. గాంధీజీ సహా ఎందరో జాతీయ నాయకులను, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యులందరిని ప్రభుత్వం నిర్బంధించింది. దేశమంతటా అరవై వేల మంది స్ర్తి, పురుషులను జైళ్లలో వేసి చిత్రహింసలు పెట్టింది. ఉద్యమకారుల మీద రాక్షసంగా విజృంభించింది. చెప్పరాని అమానుష అకృత్యాలకు పాల్పడింది. అయినా జాతి పట్టు సడలలేదు. నాయకులెవరూ లేకున్నా పది నెలలకు పైగా స్వాతంత్య్ర యోధులు మొక్కవోని దీక్షతో శాంతియుతంగా పోరాడి, తెల్ల రాకాసులకు చెమటలు పట్టించారు. పరిస్థితి చెయి దాటిపోకముందే, పోరాటం ఇంకా తీవ్రమై తమ అధికార సౌధాలను కూల్చివేయకముందే ఏదో ఒకటి చేసి శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలాగైనా ఆపించాలని తెల్లదొరలు తహతహలాడారు.
కాగల కార్యం తీర్చడానికి ఏ గంధర్వుడి కోసమో వెదుకులాడాల్సిన పనిలేదు. అక్కరపడిన ప్రతిసారీ అడగకుండానే ఆదుకొనే ఆపద్బాంధవుడు గాంధీగారు ఉండనే ఉన్నారు. ఎనిమిదేళ్ల కింద ఉద్ధృతంగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమాన్ని చౌరీచౌరా హింస మిషతో ఠక్కున ఆపేసి, స్వాతంత్య్రోద్యమాన్ని కొనే్నళ్ల వెనక్కి నెట్టిన మహాత్ముడు 1930లో శాసనోల్లంఘన ఆయుధాన్ని చేపట్టింది దేశానికి పారతంత్య్రపు పీడ విరగడ చేయాలన్న పట్టుదలతో కాదు. ఒకమారు తానే ‘సైతాను’ అని అభివర్ణించిన బ్రిటిష్ దుష్ట పాలనను తుదముట్టించి తీరాలన్న దృఢసంకల్పంతోనూ కాదు.
"Civil disobedience alone can save the country from impending lawlessness and secret crime since there is a party of violence in the country which will not listen to speeches, resolutions or conferences, but believes only in direct action." (శాసనోల్లంఘన ఒక్కటే దేశాన్ని అరాచకాన్నుంచి, రహస్య నేరాల నుంచి రక్షించగలదు. ఎందుకంటే దేశంలో హింసకు పాల్పడే పక్షం ఒకటుంది. అది ఉపన్యాసాలను, తీర్మానాలను, సమావేశాలను ఆలకించదు. ప్రత్యక్ష చర్యను మాత్రమే నమ్ముతుంది.) అని స్వయానా గాంధీగారే సెలవిచ్చారు. (Quoted in History of the Freedom Movement in India. Vol.III, R.C.Majumdar, p.269). ఆయుధం ఎత్తిందే హింసాత్మక పక్షాన్ని నిఠ్వీర్యం చేయడానికి అయినప్పుడు, ఆ లక్ష్యానికి ఉపకరిస్తుంది అనుకుంటే ఆ ఆయుధాన్ని దించటానికి బ్రిటిషు సర్కారు కోరితే మహాత్ముడు కాదనకపోవచ్చు. ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆ కార్యం ఎలా సాధించాలా అని ఇంగ్లిషు దొరతనం తహతహలాడుతున్నది.
దీనికి తోడు ఇంకో ఈతి బాధ. సైమన్ కమిషన్ పనికిమాలిన రిపోర్టును ఇచ్చాక, ఇండియాకు ఎటువంటి రాజ్యాంగ సంస్కరణలు చేయదగునన్నది చర్చించడానికి బ్రిటిషు ప్రభుత్వం 1930 చివరిలో లండన్‌లో రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సు ఏర్పాటు చేసింది. సర్కారు ప్రతిపాదనలు ససేమిరా సమ్మతం కాదు; సంపూర్ణ స్వరాజ్యం మినహా మరి దేన్నీ అంగీకరించేది లేదు అన్న దృఢ వైఖరితో భారత జాతీయ కాంగ్రెసు ఆ కాన్ఫరెన్సును బహిష్కరించింది. 1930 నవంబర్ 12న కొత్త లేబర్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సులో బ్రిటిషు ఇండియా నుంచి, సంస్థానాల నుంచి, బ్రిటిషు పక్షాల నుంచి 89 మంది సభ్యులు పాల్గొని సుదీర్ఘ సమాలోచనలైతే చేశారు. కాని భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అతి ప్రధాన రాజకీయ సంస్థ అయిన జాతీయ కాంగ్రెసు బ్రిటిషు ప్రభుత్వంపై ఉద్ధృతంగా పోరాడుతున్న సమయాన, ఆ సంస్థ ప్రమేయం లేకుండా భారత భావి రాజ్యాంగం గురించి చర్చించడం తెల్లవారికీ ఎబ్బెట్టుగా తోచింది. తగు మాత్రం రక్షణలతో, ఫెడరల్ బిగింపులతో ఇండియా మొగాన డొమీనియన్ ప్రతిపత్తిని పడెయ్యదలిచామన్న లండన్ ప్రతిపాదనను అంగీకరించడానికి కాంగ్రెసు నాయకులెవరూ సుముఖంగా లేరు. 1931 జనవరి 19న రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ నిరవధికంగా వాయిదా పడ్డాక రెండు రోజులకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అలహాబాద్‌లో సమావేశమైంది. బ్రిటిష్ ప్రధాని చేసిన విధాన ప్రకటన అస్పష్టంగా, అసంబద్ధంగా ఉన్నదని నిష్కర్షగా తోసిపుచ్చింది. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం నడుస్తున్న శాంతియుత ఉద్యమాన్ని లక్ష్యం సిద్ధించేదాకా అదే బిగువుతో కొనసాగించవలసిందని జాతిని ఉద్బోధించింది.
ఇది బ్రిటిషు పాలక వర్గానికి వెంటనే తెలిసింది. ఏదో ఒక విధంగా జాతీయ కాంగ్రెసును రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సుకు హాజరయ్యేట్టు చేస్తేగాని తెల్లదొరల పరువు దక్కదు. పూర్ణ స్వరాజ్యం ఇస్తే తప్ప మాట్లాడేదే లేదని కాంగ్రెసు బిర్రబిగిసింది. కాంగ్రెసు కోరే స్వరాజ్యం ఇవ్వటానికి లండన్ సిద్ధంగా లేదు. లండన్ ఇవ్వజూపే అరకొర సంస్కరణలకేమో కాంగ్రెసు సమ్మతించడం లేదు. ఇదీ ప్రతిష్టంభన. దీన్ని దాటటం ఎలా?
ఉన్నది ఒకటే దారి. కాంగ్రెసు మెడలు వంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో కూలెయ్యాలి. దానిచేత సంపూర్ణ స్వాతంత్య్రం డిమాండును మాన్పించాలి. ఆ డిమాండు కోసం సుమారు సంవత్సరంగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని ఆపించాలి.
మామూలుగా అయితే అది కలలో మాట. జాతీయోద్యమం ఇప్పుడున్న ఉద్ధతిలో, బ్రిటిషు దమననీతిని ఎదిరించి లక్షలాది స్వాతంత్య్ర యోధులు అన్నిటికీ తెగించి అంతులేని కష్టనష్టాలకోర్చి, ఎన్నో త్యాగాలు చేసి పళ్లబిగువున పోరాడుతున్న స్థితిలో అటు సూర్యుడు ఇటు పొడిచినా పోరాటాన్ని అర్ధాంతరంగా చాలించడానికి ఏ కాంగ్రెసువాదీ సిద్ధంగా లేడు. కాని - ఒడుపు తెలిస్తే ప్రతి చిక్కుకూ ఒక విడుపు దొరుకుతుంది. ఆ ఒడుపు తెల్లవారికి బాగా ఉంది. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు కాంగ్రెసు ఆయువుపట్టు గాంధీగారి చేతిలో ఉన్నదని వారు ఎరుగుదురు. కావలసిన కార్యం ఆయన మాత్రమే సాధించి పెట్టి కాంగ్రెసుతో తమకు రాజీ కుదర్చగలడని వారికి తెలుసు.
అంతే! తెర వెనక మంత్రాంగం అమోఘంగా పని చేసింది. రాజకీయ చదరంగంలో పావులు చకచకా కదిలాయి. తాము ఇండియా తిరిగొచ్చి అన్ని విషయాలూ మాట్లాడేదాకా ప్రధానమంత్రి ప్రకటనపై ఏ నిర్ణయానికీ రావద్దు, ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటే దాన్ని ప్రకటించవద్దు - అని రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సుకు వెళ్లిన లిబరల్ ప్రముఖులు శ్రీనివాసశాస్ర్తీ, ఎం.ఆర్.జయకర్, సర్ తేజ్‌బహదూర్ సప్రూలు లండన్ నించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కేబిల్‌గ్రాం పంపారు. ఇలాంటి విషయాల్లో కడు సౌమ్యంగా ఉండే కాంగ్రెస్ నాయకులు కిందటి రోజు చేసిన ఘాటు తీర్మానాన్ని బయటపెట్టకుండా దాచేశారు. ప్రధానమంత్రి ప్రకటనను పురస్కరించుకుని కాంగ్రెసు నాయకుల సహకారాన్ని కోరుతూ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బహిరంగ విజ్ఞప్తి చేశాడు. దానిని పరిశీలించి, ప్రధాని ప్రతిపాదనలపై తగు నిర్ణయం చేయడం కోసం మహాత్మాగాంధిని, వర్కింగ్ కమిటీ సభ్యులను జైళ్ల నుంచి బేషరతుగా విడిచిపెట్టారు.
1930 ఫిబ్రవరి 6న శాస్ర్తీ, సప్రూ, జయకర్‌లు లండన్ నుంచి తిరిగొచ్చి ఎకాఎకి ‘ఆలివ్ కొమ్మలు తీసుకుని’ అలహాబాదు వెళ్లారు. బాగా జబ్బు చేసి బాధ పడుతున్నా మోతీలాల్ నెహ్రు, ఇంకొందరు కొరగాని సంస్కరణల ప్రతిపాదనను తిరస్కరించాలని గట్టిగా వాదించారు. వారివల్ల లాభం లేదని గ్రహించి లిబరల్ నాయకులు మహాత్మాగాంధీని పట్టుకున్నారు. వైస్రాయ్ అంతటివాడు మనకు అనుకూలంగా ఉండి అంత బాగా స్పందించినప్పుడు ఆయనతో మాట్లాడకుండా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించడం బాగుండదని వారు నచ్చచెప్పారు.
బ్రిటిషు ప్రభువులతో రాజీ అంటే మహాత్ముడు ఎప్పుడూ సిద్ధమే. వెంటనే సరే అన్నాడు. ఉత్తరాల వల్ల ప్రయోజనం ఉండదు. మీరే వెళ్లి వైస్రాయ్‌ని కలిస్తే బాగుంటుందని సహచరులెవరో చెప్పారు. గాంధీజీ ‘వల్లె’ అని, మీ ఇంటర్వ్యూ కావాలంటూ 1931 ఫిబ్రవరి 14న వైస్రాయ్‌కి రాశాడు. ‘అలాగే! తప్పక రండి’ అని అటు నుంచి 16న జవాబు వచ్చింది. వర్కింగ్ కమిటీ హుటాహుటిన సమావేశమై కాంగ్రెసు తరఫున వైస్రాయితో మాట్లాడి పరిష్కారం కుదుర్చుకోవటానికి గాంధీగారికి సర్వాధికారాలు ఇస్తూ తీర్మానించింది. మహాత్ముడు ఆ రోజే ఢిల్లీకి బయలుదేరాడు. మరునాడే వైస్రాయ్‌తో సుదీర్ఘ సమాలోచనలకు ఉపక్రమించాడు.
ఇదీ చరిత్రకెక్కిన గాంధీ - ఇర్విన్ ఒప్పందానికి పూర్వ రంగం.
అవసరం బ్రిటిషు ప్రభుత్వానిది. కాబట్టి రాజీ చర్చల్లో దాని చెయ్యి కింద. అది కోరే ఉపకారాలు చెయ్యగలిగిన గాంధీజీ చెయ్యి పైన. కాబట్టి ఆయన ఏదైనా గట్టిగా కోరితే కాదనగల స్థితిలో బ్రిటిషు మహాసామ్రాజ్యం లేదు.
ఆ సమయాన ఆయన నుంచి ప్రజలు ఆశిస్తున్నది, ప్రభుత్వం దగ్గర తన పలుకుబడిని ఉపయోగించి ఈడేరుస్తాడని గంపెడాశ పెట్టుకున్నది ఒకే ఒక్కటి.
వాస్తవానికి అప్పుడు రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సు గురించి గాని, అందులో బ్రిటిష్ ప్రధాని చేసిన ప్రతిపాదనల గురించి గాని దేశంలో సామాన్య ప్రజలెవరూ ఆలోచించడం లేదు. పిలవకుండానే వెళ్లి, బ్రిటిషు సామ్రాజ్యానికి సహాయపడటానికి వైస్రాయితో గాంధీజీ సాగిస్తున్న మంతనాల వివరాల మీదా, వాటి పర్యవసానాల మీదా జనానికి పెద్దగా ఆసక్తి లేదు. భారత ఉపఖండంలోని యావన్మందీ ఆరాటపడుతున్నది, నిరంతరం తల్లడిల్లుతున్నదీ ముఖ్యంగా ఒకే ఒక్క వీరుడి గురించి. అతడి విలువైన ప్రాణాన్ని ఉరి బారి నుంచి ఎలా కాపాడాలన్నదాని గురించి.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు తమ ప్రాణాల మీద తీపి ఏ కోశానా లేదు. 1931 ఫిబ్రవరి 11న ప్రివీ కౌన్సిల్ వారి అపీలును కొట్టేశాక తమకు ఉరి తప్పదన్న బెంగ వారికి లేదు. ఎప్పుడెప్పుడు ఉరికంబమెక్కి దేశమాత సేవలో ప్రాణాలు ధారపోయగలమా అనే వారు ఉవ్విళ్లూరుతున్నారు. కాని దేశవాసులందరూ ఎలాగైనా వారికి మరణశిక్ష తప్పించాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఉరిశిక్షను రద్దు చేయకపోతే మానె, కనీసం శిక్షను తగ్గించి ఏ యావజ్జీవ ఖైదుగానో మార్చినా చాలు. ఆ వీరుల ప్రాణాలు నిలిస్తే అదే పదివేలు - అని జాతి యావత్తూ పరితపిస్తున్నది.
సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించిన విప్లవవీరులను స్వేచ్ఛగా విడిచిపెట్టాలంటే తెల్లదొరతనం ససేమిరా ఒప్పుకోదు. కాని - యావజ్జీవం వారిని ఖైదులో పెట్టటానికి వారికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. అదీ వారు కాదనలేని రీతిలో గట్టి వత్తిడి వస్తే. ఆ వత్తిడి తేగలిగినవాడు మహాత్మాగాంధి మాత్రమే. దానికి సరైన అదను ఇప్పుడు ఆయనకు వచ్చింది. ప్రివీ కౌన్సిలు కేసు కొట్టేసి వారం తిరక్కుండా వైస్రాయ్‌తో మహాత్ముడి మంతనాలు మొదలయ్యాయి. దైవికంగా లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, గట్టిగా పట్టుబట్టి గాంధీజీ జాతీయ వీరులకు ఉరి తప్పించక పోతారా అని అఖిల భారతం ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురుచూస్తున్నది.
మరి - మహాత్ముడు ఏమి చేశాడు?
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ