S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భాగ్యనగరి ఆణిముత్యాలు

క్రీడారంగంలో తెలుగువారి ప్రాభవం కొత్తవెలుగులు నింపింది. ముఖ్యంగా షటిల్ బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భవిష్యత్‌లో మరిన్ని రికార్డులు నమోదవుతాయన్న భరోసా వచ్చింది. అకుంఠిత దీక్ష, అసలుసిసలైన దక్షత, పతకాలు సాధించాలన్న కసి...వెరశి రియోలో సింధు మెరుపులు, కిడాంబి పోరాట పటిమ తెలుగువారి కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేశాయి. ఓ జ్వాల.. ఓ సైనా.. ఓ కశ్యప్.. ఇలా తెలుగునేలపై రాకెట్ పట్టి ప్రతిభకు పదునుపెట్టి దూసుకుపోతున్న మనవాళ్లు ఓనమాలు నేర్చింది మన భాగ్యనగరంలోనే కావడం గర్వకారణం.
ప్రపంచం మనవైపు కన్నార్పకుండా చూసే రోజు ఇప్పుడు వచ్చింది. ఇంతటి ఘనతకు కారణం ద్రోణాచార్యుడి లాంటి పుల్లెల గోపీచంద్. ఆయన శిక్షణలో రాటుదేలిన మన కుర్రకారు. అందుకే జయహో అంటూ వారిని ఆహ్వానించారు సర్వజనులు.
మార్పుకు నాంది
రియో ఒలింపిక్స్‌లో హైదరాబాదీ పివి సింధు రజత పతకం గెలవడం, ఆ వెంటనే దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటడం క్రీడా రంగంలో కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించింది. క్రికెట్‌ను భుజాలకెత్తుకొని ఊరేగుతూ, మిగతా క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్న దేశంలో హఠాత్తుగా బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు విజయానికి ఎవరూ ఊహించని స్పందన రావడం రాబోయే మార్పులకు నిదర్శనం. దేశంలో క్రికెట్‌కు తప్ప మరో క్రీడకు ఆదరణ లేదన్నది నిన్నటి వరకూ మనకు తెలిసిన నిజం. దక్షిణ భారత దేశం క్రికెట్ బంధనాలను తెంచుకొని బాడ్మింటన్ హబ్‌గా ఎదుగుతున్నదన్నది నేడు మన కళ్ల ముందు కనిపిస్తున్న తిరుగులేని వాస్తవం. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడెమీలు రావడం బాడ్మిండన్ అభివృద్ధికి ఒక కారణమైతే, ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్ జాతీయ కోచ్‌గా సేవలు అందించడం మరో కారణం. ఎంతో మంది బాడ్మింటన్ క్రీడాకారులు ఈ అకాడెమీలోనే ఓనమాలు దిద్దుకున్నారు. అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగారు. చైనా, జపాన్, ఇండోనేషియా దేశాల ఆధిపత్యానికి గండి కొడుతున్నారు. రియోలో సింధు సాధించిన విజయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
సూపర్ సింధు
రియో ఒలింపిక్స్ విజయంతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెల్చుకున్న సింధు గురించి ఎంత చెప్పినా తక్కువే. గోపీచంద్ అకాడెమీలో తయారైన మరో ఆణిముత్యం ఆమె. ఫిట్నెస్‌తోపాటు స్కిల్స్‌పై దృష్టి కేంద్రీకరించి, నిరంతరం శ్రమిస్తున్న సింధు ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి, తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించింది. ఆటలో ఆమెను నిలువరించడం సులభం కాదని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు కాంస్య పతకాలను గెల్చుకోవడమే ఆమె సామర్థ్యానికి నిదర్శనం.
వౌనంగా ఎదుగుతూ..
ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే అంతర్జాతీయ బాడ్మింటన్ రంగంలోకి దూసుకొచ్చి, తనదైన ముద్రవేసిన కిడాంబి శ్రీకాంత్ సైతం గోపీ అకాడెమీలో శిక్షణ పొందుతున్న వాడే. కెరీర్‌లో ఇప్పటి వరకూ నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను సాధించాడు. ఒక్కో టోర్నీతో రాటుదేలుతూ, విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతున్న యువ సంచలనం శ్రీకాంత్ ఖాతాలో అప్పటి ప్రపంచ నంబర్ వన్ చెన్ లాంగ్‌ను ఓడించిన రికార్డు ఉంది. చైనాసహా బాడ్మింటన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న దేశాలకు భారత్ నుంచి గట్టిపోటీ తప్పదని అతను ఎన్నో టోర్నీల్లో తన ఆట ద్వారా హెచ్చరికలు పంపాడు.
ఫిట్నెస్ సమస్య
గోపీ అకాడెమీ నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న క్రీడారులందరిలో పారుపల్లి కశ్యప్ ఒక్కడే అధికంగా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. తరచూ గాయాల బారిన పడుతున్న అతను నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఫిట్నెస్‌ను మెరుగుపరచుకుంటే, ప్రపంచ మేటి స్టార్‌గా ఎదిగే లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి.
మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్పతో కలిసి ఆడుతున్న జ్వాల గుత్తా ఎన్నో సంచలన విజయాలను సాధించింది. గోపీ అకాడెమీలోనే శిక్షణ పొందిన ఆమె తర్వాతి కాలంలో విభేదించి, గురువుపైనే బహిరంగంగా విమర్శలకు దిగి సంచలనం రేపింది. దక్షిణాదికి చెందిన ఈ జోడీ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
హైదరాబాదీలపైనే ఆశ
అంతర్జాతీయ స్థాయి పోటీలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా పతకాల కోసం అభిమానులంతా హైదరాబాదీలవైపే చూడడం ఆనవాయితీగా మారింది. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పివి సింధు, పారుపల్లి కశ్యప్, జ్వాల గుత్తా పతకాలతో తిరిగి వస్తారని ఆశతో ఎదురుచూస్తుంటారు. హర్యానాలో పుట్టినప్పటికీ సైనా చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆమెను మినహాయిస్తే, పతకాలు సాధించే సత్తా ఉన్న మిగతావారంతా తెలుగువారు కావడం విశేషం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే వీరు సత్తా చాటుతున్నారు.
రియో ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శన పేలవంగానే కొనసాగినా, క్రీడాభిమానుల్లో ఒకింత ఉత్సాహం నింపేలా ఆశల గవాక్షాన్ని తెరచింది. మన దేశంలో ‘క్రికెట్ ఉక్కు సంకెళ్ల’ను తెంచుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా, సర్కారును నడిపే నేతలు ఎవరైనా- హ్రస్వదృష్టి విధానాలే భారత క్రీడా రంగాన్ని నిలువునా ముంచేశాయన్నది కాదనలేని కఠోర వాస్తవం. ‘బంగారు గని’ లాంటి క్రికెట్‌ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న పెద్దలు ఇకనైనా మిగతా క్రీడలపై దృష్టి సారించాలి. అభిమానుల దృష్టి క్రికెట్ బ్యాట్ నుంచి బాడ్మింటన్ రాకెట్‌పైకి.. బంతి నుంచి రెజ్లింగ్ మ్యాట్‌పైకి.. స్టంప్స్ నుంచి జిమ్నాస్టిక్స్ వాల్ట్‌పైకి మారుతున్నదన్న వాస్తవం మీడియాలో ఇపుడు పివి సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, లలితా బాబర్‌లకు లభించిన ప్రచారమే ఇందుకు నిదర్శనం. బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సింధు రజత పతకాన్ని సాధించడం ఒక ప్రభంజనమైంది. సాక్షి అందుకున్న కాంస్యం మార్పుల కవాతు చేసింది. దీప పట్టుదల ఇతర క్రీడల్లో ప్రగతి ఇంద్రచాపాన్ని ఆవిష్కరించింది. ఈ మార్పు హర్షణీయం. దీనిని ప్రతి ఒక్కరూ మనసారా ఆహ్వానించాలి.
గతంలో ఎన్నడూ, ఎవరికీ లభించనంత ప్రచారం రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షి మాలిక్‌లకు లభించింది. కోట్ల రూపాయల నజరానాలు అడక్కుండానే వారి చెంత చేరాయి. పతకం సాధించలేకపోయినా, కడ వరకూ పోరాడిన దీప, లలితలకు దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒకప్పుడు మైఖేల్ ఫెరెరా బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించడం, భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్‌ను ఒక మ్యాచ్‌లో ఓడించడం ఒకే రోజు జరిగాయి. క్రికెట్‌లో విజయాల గురించి పతాక శీర్షికలుగా ప్రచురించిన చాలా పత్రికలు ఫెరెరా ఫీట్‌ను అపుడు పట్టించుకోలేదు. కొన్ని పత్రికలు నామమాత్రంగా ప్రస్తావించి ఊరుకున్నాయి. ఫార్ములా వన్ రేసింగ్‌లోకి అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడు నారాయణ్ కార్తికేయన్ గురించి ఎంత మందికి తెలుసు? ఒలింపిక్స్‌లో తొలిసారి వ్యక్తిగత ఈవెంట్‌లో భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టిన కెడి జాధవ్ పేరు కూడా తెలియని వాళ్లు కోట్లలో ఉంటారు. వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ జూనియర్స్ విభాగంలో మొదటిసారి పతకాన్ని గెల్చుకున్న రామనాథన్ కృష్ణన్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా జరగలేదు. మొట్టమొదటిసారి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను, కెరీర్ శ్లామ్‌ను మహేష్ భూపతి గెల్చుకున్నాడన్నది అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన వాస్తవం. బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విల్సన్ జోన్స్, కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టిన ఆశిష్ కుమార్ వంటి ఎంతో మంది ఎలాంటి ప్రచారానికి నోచుకోలేదు. వివిధ క్రీడల్లో అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, వారికి సరైన గుర్తింపురాలేదు. గల్లీ స్థాయి క్రికెటర్‌కు ఉండే ఆదరణగానీ, ఆదాయంగానీ అంతర్జాతీయ స్థాయిలో ఆడే మిగతా క్రీడాకారులకు లేవన్నది చేదునిజం.
క్రీడారంగ సమగ్రాభివృద్ధికి ఊతమిచ్చేలా సమగ్ర కార్యాచరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టాలెక్కించాలి. స్వార్థం, ఆశ్రీత పక్షపాతం, అవినీతి, అక్రమాలకు తావులేని రీతిలో స్పష్టమైన, పారదర్శకమైన విధివిధానాలు రూపొందాలి. ఉత్తమ ఫలితాలను రాబట్టే వ్యూహరచన జరిగినపుడే- భారత క్రీడా రంగం అంతర్జాతీయ వేదికలపై తనదైన ముద్ర వేయగలుగుతుంది. అంతేగానీ, ఒకటిరెండు సంఘటనలకు హడావుడి చేసి, ఆతర్వాత ఎప్పటిలా మరచిపోయి, మళ్లీ క్రికెట్‌నే భుజాలపై ఎక్కించుకుంటే ఎన్ని శతాబ్దాలైనా దేశ క్రీడా రంగం కుంటుతునే ఉంటుంది. అభివృద్ధికి నోచుకోకుండా పతనం వైపు పరుగులు తీస్తునే ఉంటుంది.
దక్షిణ భారతమే ఆశాకిరణం
క్రికెట్ ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న క్రీడా రంగానికి కొత్త ఊపిరినిచ్చే ఆశాకిరణంగా దక్షిణ భారతం అవతరించింది. ప్రత్యేకించి బాడ్మింటన్‌కు కీలక కేంద్రంగా మారింది. నిన్నమొన్నటి వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. అటు ప్రజలు, ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో క్రీడలు అంటే క్రికెట్ ఒక్కటే. జాతీయ క్రీడగా పేర్కొనే హాకీని సైతం విస్మరించి దశాబ్దాలు గడిచిపోయింది. అసలు హాకీని జాతీయ క్రీడగా ఎన్నడూ ప్రకటించలేదని 2012లో సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? అప్పటి యుపిఎ సర్కారుకుగానీ, ఇప్పటి మోదీ ప్రభుత్వానికి గానీ హాకీని అధికారికంగా జాతీయ క్రీడగా ప్రకటించాలనిగానీ, అందుకు తగిన చర్యలు తీసుకోవాలనిగానీ తోచకపోవడం దురదృష్టకరం. క్రికెట్‌కు పెద్దపీట వేసి, ఊరేగడమే- హాకీ సహా మిగతా క్రీడలపై నిర్లక్ష్యానికి ప్రధాన కారణం. క్రికెట్‌లో ప్రస్తుత ఆటగాళ్లే కాదు, మాజీలకు కూడా విపరీతమైన ప్రచారం లభిస్తుంది. చివరికి వారు డబ్బు కోసం చేసే వ్యాపార ప్రకటనలు కూడా పతాక శీర్షికల్లో కనిపిస్తాయి. హాకీ, ఫుట్‌బాల్, రెజ్లింగ్ వంటి క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన వారు ఎంతో మంది కెరీర్‌లో ఏమీ సంపాదించుకోలేక, రిటైర్మెంట్ తర్వాత కూలీలుగానో, బిచ్చగాళ్లగానో రోజులు దొర్లిస్తున్న సంఘటనలు కోకొల్లలు. క్రికెట్‌పై అభిమానుల్లో మోజు ఉంది కాబట్టి, ఆ వార్తలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది మీడియా ధోరణి. మీడియా క్రికెట్‌కే అంకితమైంది కాబట్టి, గత్యంతరం లేక ఆ వార్తలకే కట్టుబడి ఉంటున్నామన్నది సామాన్య క్రీడాభిమానుల వాదన. చెట్టు ముందా? విత్తనం ముందా? అన్న చర్చ మాదిరి ఇది ఎన్నటికీ తేలని ప్రశే్న. నిరంతరం రగిలే రావణకాష్టమే. ఒలింపిక్స్‌లో భారత హాకీ సాధించిన అసాధారణ విజయాలను మినహాయిస్తే భారత్ సాధించిన అద్భుతాలు ఏవీ లేవు. మిగతా ఆటలపై నిరాదరణే వైఫల్యాలకు ప్రధాన కారణం. రియో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత హాకీ క్రీడాకారులకు చివరి క్షణం వరకూ జెర్సీలు, కొత్త హాకీ స్టిక్స్ అందలేదు. బాక్సర్లకు హెడ్‌గార్డ్స్ కూడా లేవు. క్రీడలపై ప్రభుత్వాలకు, అధికారులకు ఎంతటి ప్రేమ ఉందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రియో ఒలింపిక్స్‌తో కనువిప్పు కలిగిందో ఏమోగానీ, జాతీయ మీడియా సైతం సింధు, సాక్షి, దీప, లలిత కృషిని వేనోళ్ల ప్రశంసించింది. ప్రత్యేక కథనాలతో, ఎన్నడూ లేనంత ప్రాధాన్యతనిచ్చింది. మీడియా దృష్టిని సింధు బృందం ఆకర్షించడం వెనుక దశాబ్దాల కృషి, అంతకిభావం ఉన్నాయి. 1980లో ప్రకాశ్ పదుకొనే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంతో దక్షిణ భారత యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆకర్షించింది. ఫైనల్‌లో బలమైన ప్రత్యర్థి లీమ్‌స్వీ కింగ్‌ను ప్రకాశ్ ఓడిస్తాడని గానీ, టైటిల్‌ను సాధిస్తాడని గానీ ఎవరూ అనుకోలేదు. అతను టైటిల్ దక్కించుకోవడంతో బెంగళూరు పేరు మారుమోయిపోయింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత, 2001లో పుల్లెల గోపీచంద్ ద్వారా భారత్‌కు మరోసారి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ లభించింది. చైనా అడ్డుగోడల్ని కూల్చేసిన గోపీ ఫైనల్‌లో చెన్ హాంగ్‌ను 15-12, 15-6 ఆధిక్యంతో చిత్తుచేశాడు. అప్పటి నుంచే బాడ్మింటన్‌లో హైదరాబాద్ పేరు వినిపించడం మొదలైంది. 2015లో సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లాండ్ మహిళల ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, రన్నరప్ ట్రోఫీని అందుకొని హైదరాబాదీల సత్తాను చాటింది. తాజాగా సింధు అదే దారిలో నడిచి, రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొంది, జాతీయ, అంతర్జాతీయ మేటి స్టార్లుగా ఎదిగిన వారిలో సైనా, సింధు, గుత్తా జ్వాల తదితరులున్నాయి. హైదరాబాద్ బాడ్మింటన్ హబ్‌గా మారిందనడానికి ఇక్కడే ఒనమాలు దిద్దుకొని, బాడ్మింటన్ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నవారు సాధించిన విజయాలే నిదర్శనం.
వైఖరి మారాలి.. క్రీడల పట్ల అటు ప్రభుత్వం, ఇటు అభిమానుల వైఖరి మారాలి. క్రీడలంటే క్రికెట్ ఒక్కటే కాదన్న వాస్తవాన్ని గ్రహించాలి. మిగతా ఆటలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న క్రికెట్‌కు బ్రహ్మరథం పట్టడం, పెద్దపీట వేసి ఆదరించడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ప్రజాభిమానం ఎక్కువ ఉందన్న పేరుతో క్రికెట్‌ను అందలం ఎక్కించి, తద్వారా వచ్చే కోట్లాది రూపాయల కోసం మిగతా క్రీడల్ని తొక్కేయడం ప్రభుత్వం చేయాల్సిన పనికాదు. ఎలాంటి ఆదరణకు నోచుకోకపోవడంతో రియో ఒలింపిక్స్‌లో ఏ విధంగా విఫలమయ్యామో, యావత్ ప్రపంచం ముందు సిగ్గుతో ఎందుకు తలదించుకోవాల్సి వచ్చిందో ప్రభుత్వాలు గ్రహించాలి. క్రికెట్‌కు మాత్రమేకాదు.. ఇతర క్రీడలకు కూడా ప్రజలు జేజేలు పలుకుతారని సింధు, సాక్షి, దీపలకు లభించిన ఘన స్వాగతాలు, ఎల్లలు లేకుండా వచ్చిపడుతున్న నజరానాలు స్పష్టం చేస్తున్నాయి. క్రీడాభివృద్ధికి సంపూర్ణ నిబద్ధతతో కృషి చేస్తున్నామని పదేపదే ప్రకటించుకుంటున్న కేంద్రం నిజానికి ఈ రంగానికి ఖర్చు పెడుతున్నది సగటున రోజుకు మూడు పైసలే అన్న చేదు నిజాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి క్రీడలను కాపాడాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. ప్రభుత్వ సహకారం, అభిమానుల ప్రోత్సాహం ఉంటే మన దేశంలో క్రికెట్ ఆధిపత్యానికి తెరపడడం ఖాయం. క్రికెట్‌ను ఆదరించకూడదని గానీ, ఆ క్రీడను పూర్తిగా అణచివేయాలనిగానీ ఎవరూ అనుకోరు. ఆ దిశగా ప్రయత్నించరు. కానీ, క్రికెట్‌కు ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం నాలుగో వంతైనా ఇతర క్రీడలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారత క్రీడావనికి విజయహారతులు ఇవ్వడానికి యావత్ దేశం సమాయత్తం కావాలి. ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రీడా చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలి. దేశమంతటా ఒకే క్రీడా విధానాన్ని అమలు చేయాలి. క్రికెట్‌తోపాటు అన్ని క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బాడ్మింటన్‌లో దక్షిణ భారతం, ప్రత్యేకించి హైదరాబాద్ అనుసరిస్తున్న విధానాలను మార్గదర్శకంగా తీసుకొని కొత్త క్రీడా ముఖచిత్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిష్కరిస్తాయని ఆశిద్దాం.
ప్రధాన సమస్యలు ఇవే!
భారత క్రీడా రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించగలిగతే, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
* ప్రోత్సాహం కరవు: క్రీడలకు దేశంలో ప్రోత్సాహం దాదాపుగా ఉండదు. చదువు, ఉద్యోగమే పరమావధిగా భావించే కోట్లాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుగల క్రీడాకారులను మన దేశం అందించలేకపోతున్నది.
* సౌకర్యాల లేమి: ధైర్యం చేసి క్రీడల పట్ల మొగ్గు చూపిన వారికి సౌకర్యాల లేమి ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నది. అరకొర సామాగ్రితో ప్రాక్టీస్ చేసిన వాళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో రాణించాలనుకోవడం అత్యాశే.
* ఆధునికతకు దూరం: శాస్త్ర, సాంకేతిక విప్లవంతో అన్ని రంగాల్లో మాదిరిగానే ప్రపంచ క్రీడా రంగంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు పచ్చిక మైదానాల్లో ఆడే ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడలు ఇప్పుడు కృత్రిమ మైదానాలు (ఆస్ట్రో టర్ఫ్)లపై జరుగుతున్నాయి. టర్ఫ్‌పై బంతి వేగంగా వెళుతుంది. అందుకు తగినట్టు క్రీడాకారులు తమ వ్యూహాలను, ఆడే విధానాలను మార్చుకోవాలి. సాధారణ పచ్చికమై ప్రాక్టీస్ చేసి, ఒక్కసారిగా టర్ఫ్‌పై మ్యాచ్‌లు ఆడడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు కోకొల్లలు. దేశం మొత్తం మీద ఆస్ట్రోటర్ఫ్ ఉన్న మైదానాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆధునికతకు దూరంగా ఉంటున్నాం కాబట్టే, అంతర్జాతీయ ప్రమాణాలను మనం సాధించలేకపోతున్నాం.
కెరీర్ ప్రశ్నార్థకమే: క్రికెట్‌ను మినహాయిస్తే, ఏ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారుతున్నది. సరైన ఉద్యోగం దొరకదు. ఉపాధి మార్గాలు ఉండవు. ఎంతో మంది మాజీ అంతర్జాతీయ క్రీడాకారులు రోజుకూలీలుగా మారడం మనకు తెలియనిది కాదు. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తే, క్రీడల పట్ల ఎంత మక్కువ ఉన్నా ఆ రంగం వైపు మొగ్గు చూపడానికి ఎవరు సాహసిస్తారు?
ప్రోత్సాహం ఎక్కడ?: ఇన్ని కష్టనష్టాలను భరించి క్రీడా రంగంలో ముందుకెళ్లినా, ప్రోత్సాహం లేక క్రీడాకారులు నీరసపడిపోతున్నారు. రంజీ స్థాయి క్రికెటర్‌కు ఉన్నంత ఆదరణ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఇతర ఆటగాళ్లకు లేదు. కనీస గుర్తింపు కూడా లేకపోవడంతో క్రీడలను ఒక వృత్తిగాఎంచుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది.
అరకొర కేటాయింపులు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లో క్రీడలకు కేటాయింపులు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఆర్థిక సాయం అందకపోవడంతో, మైదానాల అభివృద్ధి అందని ద్రాక్షగా మారుతున్నది.
నాయకులు, వ్యాపారవేత్తల ఆధిపత్యం: క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో నిజమైన క్రీడాకారులకు ప్రాధాన్యం దాదాపుగా లేదనే చెప్పాలి. రాజకీయ నేతలు, బడా వ్యాపారులు వీటికి అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా ఉంటున్నారు. ఏళ్లకు ఏళ్లు ఆయా పదవుల్లో తిష్టవేసుకొని, క్రీడలను సాధ్యమైనంతగా భ్రష్టుపట్టిస్తున్నారు. దీంతో అవినీతి, అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట లేకుండాపోయింది. ప్రతిష్ఠాత్మక కామనె్వల్త్ క్రీడలకు ఢిల్లీ ఆతిథ్యమిచ్చినప్పుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి సురేష్ కల్మాడీ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో అందరికీ తెలిసిందే. క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో క్రీడాకారులకు చోటు లేకపోవడం మన దేశంలో మాత్రమే కనిపించే దారుణం.
భారత క్రీడా రంగం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ వౌలిక సమస్యలను పరిష్కరిస్తే, భవిష్యత్తులోనైనా క్రీడారంగం బాగుపడుతుంది. రియో ఒలింపిక్స్‌కు మన దేశం నుంచి 118 మంది వెళితే, కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కాయంటూ క్రీడాకారులను నిందించడానికి ముందు- వారికి లభించిన ప్రోత్సాహం, అందుతున్న సౌకర్యాల గురించి మనం ఆలోచించాలి. లైమ్‌లైట్‌లోకి వచ్చి, కోట్లకు కోట్లు సంపాదించే వారు కళ్లునెత్తికెక్కడంలో నిర్లక్ష ప్రదర్శనలతో విఫలమయ్యారు. నిజమే. కానీ, బృందంలోని ఎక్కువ మంది ఎలాంటి సౌకర్యాలు, మద్దతు, ఆదరణ లభించని పరిస్థితులకు ఎదురొడ్డి, ఒలింపిక్స్ వరకూ వెళ్లారు. సమస్యలను పరిష్కరించనంత వరకూ అంతర్జాతీయ వేదికలపై టైటిళ్లు, పతకాలను ఆశించడం ముమ్మాటికీ తప్పే.
**
గోపీ అకాడెమీ నుంచే..
సింధు మాత్రమే కాదు.. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, గుత్తా జ్వాల వంటి మేటి స్టార్లంతా గోపీచంద్ అకాడెమీ నుంచి వచ్చినవారే. అతిక్ జౌహరీ వద్ద బాడ్మింటన్‌లో ఓనమాలు దిద్దుకున్న సైనా ఆ తర్వాత గోపీచంద్ శిక్షణలో రాటుదేలింది. ఇటీవలే అతనితో విభేదించి, ప్రస్తుతం జాతీయ మాజీ చాంపియన్ విమల్ కుమార్ వద్ద బెంగళూరులో శిక్షణ పొందుతోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించే వరకూ ఆమె గోపీచంద్ శిష్యురాలే. అంతకు ముందు ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, కామనె్వల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణం, రజతం, కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణం, రజతం, మరో కాంస్యం, ఆసియాల్లో కాంస్యం, ఉబేర్ కప్ టీం చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. గోపీచంద్ పర్యవేక్షణలోనే సైనా ఎదిగిందడంలో అనుమానం లేదు. దక్షిణ భారతానికే చెందిన విమల్ కుమార్ పర్యవేక్షణలో నైపుణ్యానికి పదును పెట్టుకుంటున్న సైనా ఖాతాలో 4 సూపర్ సిరీస్, 5 సూపర్ సిరీస్ ప్రీమియర్, 7 గ్రాండ్ ప్రీ టైటిళ్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద కెరీర్‌లో 381 మ్యాచ్‌లు ఆడిన సైనా 266 విజయాలు సాధించింది. భుజం, మోకాలు, చీలమండ గాయాలు వేధిస్తున్న నేపథ్యంలో, ఫిట్నెస్ సమస్య అడ్డంకిగా మారకపోతే సైనా మరిన్ని సంచలనాలను నమోదు చేసి ఉండేది. ఇటీవలే కాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా సాధ్యమైనంత త్వరలో తిరిగి ప్రాక్టీస్‌ను ప్రారంభిస్తుంది.

-విశ్వమిత్ర