S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రహాంతర నేరస్థుడు

యునైటెడ్ నేషన్స్ భవంతి పైన తిరిగే ఫ్లయింగ్ సాసర్‌ని చాలా మంది అప్పటికే చూశారు. ఆ ఫ్లయింగ్ సాసర్ నించి సమాచారం అందుకున్న యు.ఎన్.ఓ. సెక్రటరీ జనరల్ అప్పటికే తమ సభ్యత్వ దేశాల ప్రతినిధులని అత్యంత అవసర సమావేశానికి ఆహ్వానించాడు. చైనా, రష్యా, కొలంబియా, ఇంగ్లండ్ మొదలైన దేశాల ప్రతినిధులతో సమావేశ హాలు నిండిపోయింది. అది దేని గురించని వారు ఒకరితో మరొకరు గుసగుస లాడుకుంటున్నారు. టీవీ కెమెరామెన్, పత్రికా విలేఖరులు ఆ సందర్భాన్ని కవర్ చేస్తున్నారు. అంతరిక్షం నించి భూమి మీదకి వచ్చిన జీవుల గురించిన ప్రకటన వెలువడవచ్చని చాలామంది ఊహించారు.
చివరికి సభ ఆరంభమైంది. సెక్రటరీ జనరల్ వారితో ఇలా చెప్పాడు.
‘ఈ ఉదయం పదకొండు గంటలకి తమని ‘కానమిట్స్’గా పిలుచుకునే గ్రహాంతర వాసులు భూమి మీదకి దిగారు. న్యూజెర్సీలోని నెవార్క్‌లో, ఈస్ట్రన్ స్టాండర్డ్ టైం పదకొండు గంటలకి వారిని మొదటగా కనుగొన్నాం. నార్వే, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ దక్షిణ తీరం, రియోడిజనీరో శివార్లు, ఇంకా చాలా అనేక చోట్ల వీళ్లు దిగారు. ఈ సమయంలో కానమిట్స్ మనకి శత్రువులని నేను చెప్పలేను. ఇందువల్ల ప్రపంచ ప్రజలు శాంతిగా ఉండాలని ప్రార్థన. అన్ని దేశాల ప్రభుత్వాలకి జరిగేది ఎప్పటికప్పుడు తెలియజేసే ఏర్పాట్లు చేశాం.’
‘వాళ్లు ఎలా ఉంటారు?’ ఓ సభ్యుడు ప్రశ్నించాడు.
‘ఈ భవంతి మీద వాళ్లు ఇందాకే దిగారు. వారి ప్రతినిధి ఒకరు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు.’
దుబాసీలు అక్కడ మాట్లాడేది అనువదిస్తున్నారు. ప్రతీ దేశం వాళ్లు దాన్ని శ్రద్ధగా వింటున్నారు.
కొద్ది నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుని వచ్చిన ఓ గ్రహాంతర వాసిని అంతా ఆసక్తిగా చూశారు. తొమ్మిది అడుగుల పొడవు, దాదాపు 180 కిలోల బరువు గల అతనిది పొడవాటి మొహం, బట్టతల, తెల్లటి వస్త్రాలు ధరించాడు. చేతిలోని కాగితాన్ని చూస్తూ చదివాడు.
‘లేడీస్ అండ్ జెంటిల్‌మేన్. మీ అందరికీ శాంతి, స్నేహపూర్వక అభినందనలు. మేము ఈ పాలపుంతకి అవతలి నించి మీ మిత్రులుగా వచ్చాం. నా పెదవులు కదలకపోవడం మీరు గమనించచ్చు. మేం కంఠం ద్వారా కాక, ఆలోచనా తరంగాల ద్వారా సంభాషిస్తూంటాం. మీ భాష మాకు క్షుణ్ణంగా తెలుసు. యంత్ర సహాయంతో మీ భాషలో వినిపిస్తున్నాను. ఇక్కడికి రావడానికి మా ఉద్దేశాలు గౌరవప్రదమైనవి. కానమిట్స్ ఇక్కడ ఓ ఎంబసీని స్థాపించాలని, భవిష్యత్తులో మా గ్రహానికి మీ రాకపోకలు సాగాలని మా కోరిక’
ప్రపంచవ్యాప్తంగా రేడియో, టీవీలలో ప్రసారమయ్యే ఆ గ్రహాంతరవాసి ఉపన్యాసాన్ని కోట్ల మంది వింటున్నారు, చూస్తున్నారు.
‘మీ భూవాసులు రాక్షసుల్లా ప్రవర్తించడం చూస్తున్నాం. మాది స్నేహం, శాంతి భాష. మాలో మేము ఎన్నడూ యుద్ధాలు చేసుకుని ఒకరిని ఒకరు చంపుకోలేదు. నేను చెప్పాల్సింది ముగిసింది. మీరేమైనా ప్రశ్నలు అడగచ్చు’
అర్జెంటీనా ప్రతినిధి లేచి అడిగాడు.
‘సెనార్! మీరు మా గ్రహాన్ని ఎందుకు ఎన్నుకున్నారు?’
‘ఒక్క భూగోళంలోనే సహజమైన, అసహజమైన వినాశనాలు జరుగుతున్నాయి. వీటిలో చాలాభాగం తప్పించగలిగినవే. మీకా విషయంలో సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం’
అతని చేతిలోని పుస్తకం మీద లిపి అతి కొత్తది చాలా కెమెరాలు దాన్ని ఫొటో తీశాయి.
* * *
మర్నాడు ఉదయం ప్రపంచంలోని అన్ని దినపత్రికల్లో ఇదే వార్త చోటు చేసుకుంది. ది డైలీ క్రానికల్‌లో ‘కానమిట్స్ కొత్త యుగానికి మాట ఇచ్చారు’ అని, ప్రెస్ హెరాల్డ్‌లో ‘కామనిట్స్ శాంతిని, అభివృద్ధిని అందించబోతున్నార’ని.. ఇలా హెడ్‌లైన్స్ ప్రచురించాయి.
ప్రపంచ ప్రజలందరూ ఆనందపడే ఆ సమయంలో, అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ హెడ్‌క్వార్టర్స్‌లోని క్రిస్టోగ్రాఫర్స్ (కోడ్స్‌ని డీకోడ్ చేసేవారు) మాత్రం ఆందోళనగా ఉన్నారు. డీకోడింగ్ నిపుణుడు ఛాంబర్స్‌ని ఓ కల్నల్ అడిగాడు.
‘ఏం తెలిసింది?’
‘ఇది తలనొప్పి, కళ్లనొప్పి అని తెలుసుకున్నాను’ అతను నవ్వుతూ జవాబు చెప్పాడు.
‘వారి భాషని కనుక్కోలేమా?’
‘ఎనిమిది గంటల్లో కనుక్కోలేకపోయాం. జపనీస్ కోడ్‌ని కనుక్కోడానికి మాకు సంవత్సరం పట్టింది. ఇది గ్రహాంతరవాసుల భాష. బహుశా మనకన్నా ఐదున్నర రెట్లు మేథస్సుతో ఏర్పడ్డ భాషై ఉండచ్చు. మేమంతా దీన్ని కనుక్కోడానికే ప్రయత్నం చేస్తున్నాం. క్రిస్టోగ్రఫీలో మాకు తెలిసిన అన్ని పద్ధతుల ద్వారా పరీక్షించాం. మేము డీకోడింగ్‌కి దగ్గరగా వచ్చామో లేక పది లక్షల మైళ్ల దూరంలో ఉన్నామో మాకు తెలియదు’
‘అంటే ఇది మీ వల్ల కాదా?’ అతను నిరుత్సాహంగా అడిగాడు.
‘ప్రతి కోడ్‌ని ఛేదించేదాకా మేమా పని చేయగలమో లేదో తెలీదు. రివర్సల్ మెథడ్, రౌండమ్ మెథడ్, స్టాండర్డ్, డైరెక్ట్, సిస్టమేటికల్లీ మిక్స్‌డ్, కీవర్డ్ మిక్స్, రెసిప్రోకల్, కాంజ్యుగేట్... ఇలా కోడ్‌లో అనేక పద్ధతులు ఉంటాయి. అవన్నీ ప్రయత్నించినా ఫలితంలేదు. ఇది చాలా కష్టమైంది అనిపిస్తోంది. ఇది చాలా ముఖ్యమైందా?’
‘నాకు తెలీదు. కానమిట్స్ వెళ్లిపోతూ ఈ పుస్తకాన్ని యుఎన్‌ఓ బిల్డింగ్‌లో వదిలి వెళ్లారు’
సరిగ్గా ఆ సమయంలో పక్క గదిలోంచి కేథీ ఓ కాగితాన్ని తెచ్చి ఇచ్చి ఆనందంగా చెప్పింది.
‘పుస్తకం పేరుని కనుక్కోగలిగాను. ఎలా డీకోడ్ చేయాలో ఓ దారి దొరికింది’
‘వెరీగుడ్. మనం మళ్లీ మాట్లాడదాం’ ఛాంబర్స్ చెప్పాడు.
‘టు సర్వ్‌మేన్’ అని ఆ కాగితం మీద ఇంగ్లీష్‌లో రాసి ఉంది.’
* * *
మర్నాడు ఆ గ్రహాంతర వాసికి లై డిటెక్టర్ టెస్ట్ చేసి అతను చెప్పేది నిజమే అని శాస్తజ్ఞ్రులు నిర్ణయించారు.
* * *
అరబ్ ఎడారులన్నీ పంటపొలాలుగా మారాయి. ప్రతీ దేశం ఆర్మీని, నేవీని తొలగించేసింది. గ్రహాంతరవాసి చెప్పిన మాటలు నిజమయ్యాయి! భూగోళంలోని ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. తమ గ్రహానికి రాకపోకల ఏర్పాట్లని ఆ గ్రహవాసులు చేపట్టారు.
* * *
గ్రహాంతరవాసులకి, అన్ని దేశాల ప్రతినిధుల నించి వారి భాషల్లో కృతజ్ఞతలు తెలియజేసే లేఖలు అందజేయబడ్డాయి. న్యూయార్క్‌లో వారి ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక రన్‌వేని నిర్మించారు. తమ గ్రహానికి పర్యాటకులుగా వచ్చే వారికి వీసాలని కూడా మంజూరు చేశారు. అందుకు కనీస బరువే అర్హత. అక్కడికి వెళ్లడానికి చేంతాడంత క్యూ రిజిస్టరయింది. వారి గ్రహం నించి ఓ ప్రత్యేక వాహనం వచ్చి ఆగింది. అందులో పదమూడు వందల మంది పడతారు.
ఆ రోజు మొదటిసారిగా పర్యాటకులతో వాహనం బయలుదేరబోతోంది. దాన్ని పత్రికా విలేఖరులు, టీవీ కెమెరామెన్ కవర్ చేస్తున్నారు. ప్రయాణీకులు ఒక్కొక్కరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అందరి మొహాల్లో ఆనందం కనిపిస్తోంది.
‘ఆ గ్రహంలో వాతావరణం సదా ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుందిట’ ఒకామె తోటి ప్రయాణీకుడితో చెప్పింది.
‘సూర్యుడు ఎప్పుడూ అస్తమించడట’ అతను చెప్పాడు.
‘వారి దుస్తులు కూడా ఏదో లోహంతో చేసినవి. అందంగా ఉండటమే కాక ఉతకాల్సిన అవసరం కూడా లేదుట’ మరొకావిడ చెప్పింది.
‘బంగారంకన్నా వెలిగిపోతోంది’
‘మనం అక్కడికి చేరుకున్నాక వాళ్ల దుకాణాలకి కండక్టెడ్ టూర్‌తో తీసుకెళ్తారట. బరువు సమస్య లేకుండా ఎంతైనా భూగోళానికి తీసుకురావచ్చట’
ఇలా ప్రయాణీకులంతా తాము విన్న సంగతులని ఒకరితో మరొకరు ముచ్చటించుకుంటున్నారు.
గేటు తెరవగా ఒక్కొక్కరు వాహనంలోకి వెళ్లే ముందు గ్రహాంతర వాసి వారి బరువుని చూసి లోపలికి వదలుతున్నాడు. డిప్లమేటిక్ వీసా ఉన్న కొందరు కూడా సందర్శకుల్లో ఉన్నారు.
‘అక్కడ ఒక్క పనీ చేయాల్సిన అవసరం లేదు. అంతా సెలవే. బేస్‌బాల్ లాంటి ఆట కూడా ఉందిట’ అమెరికన్ డిప్లొమేట్ ఉత్సాహంగా చెప్పాడు.
‘కోట్ల కొలది మైళ్ల దూరం ప్రయాణించడానికి కొన్ని రోజులే పడుతుందిట. అసలు ప్రయాణిస్తున్న భావనే ఉండదుట. కారణం మన విమానాల్లా కాక లోపలంతా నిశ్శబ్దంట’
‘నాకక్కడ చావుంటే ఇక తిరిగి రాను’
ఇలా మాట్లాడుకుంటూ అందరూ వాహనంలోకి ఎక్కుతున్నారు.
* * *
అక్కడికి సమీపంలోని సిఐఏ హెడ్ క్వార్టర్స్‌లోని క్రిస్టోగ్రఫీ విభాగంలోని ఛాంబర్స్ గదిలోకి కేథీ వచ్చి చెప్పింది.
‘నేను ఇంటికి వెళ్తున్నాను. నీకేమైనా అవసరమా?’
‘లేదు. ఇంకొద్ది నిమిషాల్లో నేను వారి గ్రహానికి బయలుదేరుతున్నాను. తిరిగి వచ్చాక బహుశా మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారి భాషని త్వరగా నేర్చుకుంటాను’ ఛాంబర్స్ చెప్పాడు.
‘ఇక మీదట భూమి మీద సైన్యం, క్షామం, హైడ్రోజన్ బాంబు లాంటివి ఉండవు. కాబట్టి నాకు హాయిగా నిద్ర పడుతుంది’ కేథీ చెప్పింది.
‘నాకోటి వింతగా ఉంది. భూగోళం మీది ప్రజలందరికీ తమ గోళం చూపించాలనుకుంటున్నారు. ఎంత మంది దాన్ని భరించగలరు? పది వేల కోట్ల మైళ్ల దూరంలో, అంతరిక్షంలోని ఆ గ్రహానికి వెళ్లడానికి సంవత్సరం తర్వాత ఇంకా డిమాండ్ పెరిగేలా ఉంది’
ఛాంబర్స్ లేచి కోడ్ మెషీన్ స్విచ్‌లని ఆఫ్ చేశాడు.
‘నువ్వు తిరిగి వచ్చేదాకా నేనింకా దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను’ కేథీ చెప్పింది.
‘సరే. నేను ఇంటికి వెళ్లి అక్కడ నించి సమయానికి కొత్త ఎయిర్‌పోర్టుకి చేరుకుంటాను’ ఛాంబర్స్ చెప్పాడు.
* * *
‘ఇది ఫ్లైట్ నెంబర్ 914. భూమి నించి మా గ్రహానికి మూడు నిమిషాల్లో వాహనం బయలుదేరబోతోంది. ప్రకటన పబ్లిక్ ఎడ్రస్ సిస్టంలో వినిపించింది.
ఆఖరి ప్రయాణీకుడిగా మెట్ల మీంచి ఛాంబర్స్ పైకి ఎక్కుతున్నాడు. కేథీ హడావిడిగా పరిగెత్తుకొచ్చి పిలిచింది.
‘మిస్టర్ ఛాంబర్స్’
అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి వీడ్కోలుగా చేతినెత్తాడు.
‘ఆ వాహనంలోకి ఎక్కకండి’ అరిచింది.
‘ఏమిటీ?’ అడిగాడు.
‘టు సర్వ్‌మేన్ అంటే... అది నరమాంస భక్షకుల వంటల పుస్తకం’
ఛాంబర్స్ వెంటనే వెనక్కి తిరిగాడు. కానీ గ్రహాంతరవాసి బలవంతంగా అత్ని వాహనంలోకి ఎక్కించాడు. ఆ గుండ్రటి స్పేస్‌షిప్ ఆకాశంలోకి ఎగిరిపోయింది.
***
డేమన్ నైట్ రచనకు స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి