S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిజేత 18

మర్నాడు-
‘రాచవారిపై విష ప్రయోగం’ అంటూ జనశ్రుతి కరద వాతావరణాన్ని కలుషితం చేయనే చేసింది. ఏర్పాట్ల బాధ్యతని నిర్వర్తించటంలో ఇది పెద్ద లోటుగా - మరిన్ని చిలవలు, పలవలు సమకూరేయి ఆ వార్తకి!
కరదలో నిర్వాహకులయిన అడివప్ప, దక్షణ్ణలు దోషులనే భావన త్వరత్వరగా వ్యాపించింది.
మూడవ రోజు ఉదయానికి చంపకమాలినీ, విషయా స్వస్థులయినారు. అయితే జరిగిన ప్రయత్నానికి కారకులెవ్వరో మాత్రం బయటపడలేదు. ఇది కరద అధికారుల అసమర్థతగా గుసగుసలు మొదలైనాయి.
జరిగిన దుర్ఘటన గురిచి కళింద్రకు తెలియజేశారు. కళింద్రలో ప్రభువు - మంత్రి సేనానులనూ, ఆచార్యులనూ, రాకుమారులనూ రప్పించి - ‘జరిగిన ఉదంతాన్ని చర్చించారు. వివిధ కోణాలలో ఆలోచించారు. ఎవరు ఎందుకు ఇలా చేశారన్నది వారికి అంతుచిక్కలేదు.
చివరకు చంద్రహాసుడు, ‘ఇలా కాదు, అటు నుంచీ నరుక్కువస్తే గానీ పూర్వాపరాలు బయటపడవు. నేనూ, అక్షయుడూ వెంటనే బయలుదేరి కరదకు వెళతాం’ అన్నాడు.
అందరూ ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ‘అటు నుంచీ అంటే ఎటు నుంచీ’ అనుకున్నాడు అక్షయుడు.
43
అక్షయుడు, చంద్రహాసుడు కరదకు వచ్చారు. వీరు కరదకు వచ్చేసరికే రాకుమారి బృందం అష్టకు వెళ్లారు. కరద రాగానే వున్న పెద్దలందరినీ సమావేశపరచి జరిగినదంతా వారి నుండీ విన్నారు.
అక్షయునీ, దక్షణ్ణనీ తీసుకుని చంద్రహాసుడు సరాసరి శంబరుడు వున్న చెరసాలకు వెళ్లాడు. మాటలతో, చేతలతో అతనికి విశ్వాసపాత్రులైన వారి వివరాలను సేకరించాడు. ఆ వివరాల ఆధారంగా వెంట వెంటనే - ఆనాటి విష ప్రయోగ సంఘటనతో సంబంధమున్న నలుగురినీ బంధించేశారు.
కరద అనుభవం దృష్ట్యా అష్టకు తప్పనిసరిగా వెళ్లాలని నిశ్చయించుకున్నారు అక్షయ, చంద్రహాసులలు. ఇక్కడి పరిస్థితులన్నింటినీ వివరిస్తూ కళింద్రకు వార్తాహరుని పంపారు.
అష్టకు వెళ్తూండగా దారిలో ‘ఒక యజ్ఞం ముగిసిందనుకోవచ్చు’ అన్నాడు అక్షయుడు.
‘యజ్ఞం చేయటాన్ని ఒక రకంగా తపస్సు చేయటం అనే అంటారు. ఆ తపస్సులో మంచి పనులను చేయటం సుస్వభావాన్ని కలిగి ఉండటం, ప్రజా శ్రేయస్సుని లక్షించటం కూడా కలిసే వున్నాయంటారు పెద్దలు. ఆ దృష్ట్యా మరో యజ్ఞం మొదలుపెట్టాలేమో! పద’ అన్నాడు చంద్రహాసుడు.
అశ్వాల వేగాన్ని హెచ్చించారు.
44
కుంతల రాచవారూ, పరివారం అందరూ అష్టకు చేరుకున్నారు. ఏర్పాట్లనన్నింటినీ వేయి కళ్లతో పర్యవేక్షిస్తున్నారు - కుంజరుడూ, వివరీ.
అష్టలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. చౌండేశ్వరీ దేవి ఆలయంలో ప్రధాన ఉత్సవం. అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం ఎడ్లబండ్లనీ, గుమ్మటాల బండ్లనీ ప్రభలు కట్టి ఊరేగిస్తారు. ఈ ఉత్సవ వేడుకలలో భాగంగా ఆలయ ప్రాంగణానికి చుట్టూ వున్న అష్టలింగాలకూ - అభిషేకాలూ, ప్రత్యేక పూజలూ జరుగుతాయి. వచ్చిన భక్తులంతా దగ్గరలో వున్న ‘మునిపుట్ట’నూ దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటారు.
బ్రాహ్మీ ముహూర్తం నుంచీ రాత్రి రెండవ జాము వరకూ ఉత్సవ కోలాహలం సాగుతూనే ఉంటుంది.
రాకుమారి బృందానికి ప్రతిదినమూ - ఉదయం నుండీ రాత్రి వరకూ ఒకటే హడావిడిగా ఉంది. అష్టను చూస్తుంటే వారికి అది ఏదో దేవభూమిలా అనిపిస్తోంది. సంస్కృతి,
సాహిత్యం, కళలూ, వేదవేదాంగాలూ, అర్చనలూ - అలా వివిధ చర్చలతో - స్వేచ్ఛగా ఆనందిస్తున్నారు. వాటన్నింటి మధ్యనా అపశ్రుతిలా కరదలోని సంఘటన కూడా జ్ఞప్తికి వస్తూనే వున్నది.
మధ్యమధ్య - ‘నేను కుంతల సేనాని కుమార్తెను జాగ్రత్త’
‘మనకేమీ కాదు. నవయువశక్తి మనది’
‘ఆఁ.. ఆఁ.. ఈ కబుర్లకేం గానీ, అందరమూ కడకు తలవంచుకుని కాలచక్రంలో పరిభ్రమించేవాళ్లమే..’ వంటి లోతు కలిగిన మాటలూ, పరిహాసోక్తులూ, మనసు లోతుల్లోని తీయని కోరికలూ, ఒగరు పొగరులూ.. బహిర్గతమవుతున్నాయి.
పండుగ దినాలు గడుస్తున్నాయి.
45
కుంతలపురి-
కరదలో రాకుమారి బృందానికి జరిగిన ఘటన గురించి ఇరువురికే తెలుసు. ఒకరు దుష్టబుద్ధి. మరొకరు ప్రసేనుడు. కారణం - అది వారి పథకమే కావటం! కరద నుండీ వారి చారుడు వచ్చి జరిగినదంతా వివరించాడు. దుష్టబుద్ధికి కోపం బుగ్గ పొంగింది. రెండు విధాలుగా గుండె గుబగుబలాడింది. ఒకటి - ఆ ఘటనలో విషయ మరణించి ఉంటే - అనేది. రెండవది తమ పేర్లు బయటకి వచ్చి వుంటే - అనేది. తమ అదృష్టం బాగుండి రెండూ జరగలేదు!
ఈ విషయం మీదే ఇప్పుడు వాదులాడుకుంటున్నారు ఇద్దరూ.
‘ఇదంతా అలా వుంచు. నీ కూతురూ, కొడుకూ కూడా ఆ పదార్థం తినేసి వున్నట్లయితే - చచ్చేవారే కదా! అనాలోచితంగా చేసే పనులు ఇలానే ఉంటాయి’ కటువుగానూ, నిష్టూరంగానూ అన్నాడు దుష్టబుద్ధి.
నిజానికి ప్రసేనునికీ చాలా బాధగా ఉంది. తమ పిల్లల మరణాలకు తానే కారకుడయ్యేవాడు. అది తలచుకోగానే గుండె దడదడలాడింది. వౌనం వహించాడు.
‘విత్తులు చల్లేటప్పుడే - పంట గురించిన శ్రద్ధా, ఆలోచనా ఉండాలయ్యా’ అని తన పీఠం మీద అస్థిమితంగా కూర్చున్నాడు దుష్టబుద్ధి.
‘ముందుగా మీకు చెప్పవలసింది. పొరపాటే’ ప్రసేనుడు తన పశ్చాత్తాపాన్ని స్వరంలో వొలికించాడు. ‘సరి.. సరి..’ అని ఊరుకున్నాడు దుష్టబుద్ధి.
ఆ తర్వాత - అష్టలో తాను ఆచరించబోయే పన్నాగాన్ని వివరించాడు ప్రసేనుడు. ఆలోచించి.. ఆలోచించి.. ‘సరే, తగు జాగ్రత్తలు తీసుకో. అష్టకు ఈ రోజే ఇక్కడ నుంచీ మన నమ్మినబంటును పంపు. పని జాగ్రత్తగా జరిగిపోవాలి. మన మార్గం నిష్కంటకం కావాలి గుర్తుంచుకో’ అన్నాడు దుష్టబుద్ధి.
మనోవికారం ఆటలాడిస్తుంటే, అవివేకం ఇలాగే కోతిచేష్టల్లోకి దిగుతుంది!
46
అష్టలో ఎటు చూసినా ఉత్సవ శోభ వెల్లివిరుస్తోంది.
చౌండేశ్వరీదేవి ఆలయంతోపాటు అష్ట శివాలయాలూ క్రిక్కిరిసిన జనంతో కళకళలాడుతున్నాయి. అవీ సోమేశ్వర, కాశీ విశే్వశ్వర, కోటేశ్వర, త్రయంబకేశ్వర, లవంగేశ్వర, కాళేశ్వర, కపిలేశ్వర, రామేశ్వర ఆలయాలు! ఇక చౌండేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో భక్తుల ప్రపత్తులు, నవదుర్గా మాతలకు ఒడిబియ్యం సమర్పణ వంటి సందడి సాగిపోతున్నది. పక్కన జాతరలో ఆకర్షణీయమైన వస్తు సంబారాల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
చంపకమాలిని బృందం - దేవీ ఆలయానికి వచ్చేసరికీ వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలూ, సౌకర్యాలూ సిద్ధంగా వున్నై. భద్రతాధికారులూ, భటులూ వేయికళ్లతో సావధానులై ఉన్నారు. వివరీ, కుంజరుడూ దగ్గరుండి పూజాదికాలు నిర్వహింపజేశారు.
ఆ మీదట అంగళ్లనీ, ఇతర ఆకర్షక యంత్రాల్నీ, విన్యాస పరికరాల్నీ, వివిధ భక్త బృందాల్నీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు.
ఆ తర్వాత నిదానంగా విడిదికి చేరుకున్నారు.
సరిగ్గా అదే సమయంలో కోట మరో ద్వారం నుండీ యువ వీరులిద్దరూ తమ పర్యవేక్షణని ముగించుకుని బయటకి వెళ్లిపోయారు.
వారే అక్షయ, చంద్రహాసులు!
47
అష్టలో - మహర్నవమి - ఉదయం.
విశాలమైన కోట ప్రాంగణంలో ఈశాన్య దిగ్భాగంలో ఒక పెద్ద నీటికొలను ఉంది. దాని నిండా తమ్మిపూలు. కొలను చుట్టూ ఉద్యానవనం. వివిధ వనవృక్ష శోభ, ఆ వృక్షాలపై పిట్టల మధురధ్వనులు! అన్నీ సరసులకు నేత్రపర్వంగా, వీనులవిందుగా ఉన్నాయి.
చంపకమాలినీ బృందం - కేరింతలతో ఆ కొలను సోపానాల దరికి వచ్చారు. వారికి రక్షకులుగా భటులూ, వివరీ, అక్షయుడూ కూడా వచ్చారు. వారంతా కూర్చునీ, నిలిచీ, నీటితో కేరుతూ ఆనందిస్తున్నారు. లోకాభిరామాయణం సాగిస్తూంది - విషయ.
వీరికి దగ్గరగా వచ్చి మాటలు కలిపారు అక్షయుడు, విరజా.
చంపకమాలినీ, విషయ, కళావతి, దుర్గీ, విరజ - అందరూ కొలను గట్టుమీద నడవటం మొదలుపెట్టారు. వీరి పక్కగా అక్షయుడూ, వజ్రసేనుడూ. యథాలాపంగా మాట్లాడుకుంటూ సరస్సుకు పశ్చిమ దిక్కుకు చేరేరు. విరజ మెట్లు దిగసాగింది. ఆమెతో అడుగు కలిపి, క్రితం రోజు జరిగిన వింత గురించి మాట్లాడుతున్నాడు అక్షయుడు.
ఉన్నట్టుండి విరజ మెట్టు తట్టుకుని నీటిలోకి పడిపోయింది. చూసిన వారంతా పరుగు పరుగున అక్కడికి వచ్చేశారు.
అసంకల్పంగా కొలనులోకి దూకేశాడు అక్షయుడు. విరజా, అక్షయుడు నీటిలో మునిగారు.
క్షణాల్లో విరజను తన చేతుల్తో ఎత్తి పట్టుకుని మెట్లపైకి తెచ్చాడు అక్షయుడు. ఆమెను క్రిందికి దింపాడు.
ఎదురుగా - కొలను చుట్టూ అక్కడక్కడా వున్న వారంతా అక్కడికి చేరారు. ఆశ్చర్యంతో వీరిద్దరినే చూడసాగారు.
‘ఏమిటిది? ఎందుకిలా జరిగింది?’ అనే ప్రశ్నలు వాళ్ల నోళ్లలోనే ఉండిపోయాయి. అక్షయుడూ, విరజా ఒకరినొకరు అర్థం కానట్లుగా చూసుకున్నారు.
వాళ్లందరి ఆశ్చర్యానికి కారణం - ఇద్దరి దుస్తులూ పసుపు రంగులో ఉండటం. ఇద్దరి గళసీమల్లోనూ పుష్పమాలలు ఉండటం. ఆశ్చర్యమూ, లజ్జా - తను, మాన, ప్రాణాల్ని తత్తరపరచాయి. ఏ విధంగా జరిగిందో అర్థంకాని అయోమయ స్థితి వారిది!
అందరూ కింకర్తవ్యతా విమూఢులై నిలబడిపోయారు. ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మలేకపోతున్నారు.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600