S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహావిజేత 21

54
దుష్టబుద్ధి కళింద్రకు వెళ్లిన మర్నాడు-
ఇక్కడ కుంతలపురిలో గాలవుల వారినీ, కుమార్తెనీ తన విశ్రాంతి మందిరంలోకి పిలిపించాడు మహారాజు. కళింద్రకు వెళ్లి అమాత్యులు ఏం చేయనున్నారో అనే ఆందోళన ముగ్గురికీ ఉన్నది. ఆ విషయం మీదే మాటలు సాగాయి. ‘ఏది ఏమైనా కుళిందకుడూ, చంద్రహాసుడూ పరిస్థితిని అర్థం చేసుకోనూగలరు. వలసిన రీతిని ప్రవర్తించనూ గలరు’ అన్నారు గాలవులు.
మందిరం నిశ్శబ్దంలోకి దిగింది.
క్షణాల తర్వాత చంపకమాలిని చెప్పసాగింది. ‘నాకు మన పొరుగు రాజ్యం విజయపురి వారి కవ్వింపులూ, దుశ్చర్యలూ స్ఫురణకొచ్చాయి. అలాంటి దుర్నయాలకి అవసరమైతే తగిన గుణపాఠం చెప్పగల ధీరుడూ, వీరుడూ అక్కడ కళింద్రలో ఉన్నాడు కదా అని అనిపిస్తోంది’ అని క్షణం ఆగి మళ్లీ చెప్పుకువచ్చింది చంపకమాలిని.
‘ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. కరదలోనూ, అష్టలోనూ పాలనా విషయంలో చంద్రహాసుని ముద్ర ప్రస్ఫుటంగా ద్యోతకమవుతోంది. అధికారులూ, ఉపసేనానులూ అతనిని అమితంగా గౌరవిస్తున్నారు. అతను మానవ సంబంధాల పట్ల ఎంతో ఆరాధనా భావం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అడివప్ప వంటి గురువు కూడా అతని శక్తియుక్తుల పట్ల, చిత్తశుద్ధి పట్ల ఎంతో ప్రశంసార్హతని ప్రదర్శిస్తారు’
‘ఇవన్నీ రాకుమారి బాగానే గమనించారన్నమాట’ ఏ విధంగా అని అడిగీ అడగనట్లుగా గాలవుల వారన్నారు.
ఆమె చెప్పటం కొనసాగించింది. ‘అవును గురువుగారూ, అతని కార్యదక్షత అతని సహచరుల ద్వారా వినగలిగాము. ప్రసక్తానుప్రసక్తంగా అనేక మంది చెబుతుంటారు కదా! మీరు నేర్పించిన విద్యలో వినగలిగిన చెవులు ఉండడం కూడా ఒకటి కదా!’ అని నవ్వింది.
గాలవులూ మందస్మితం చేశారు.
అగ్నివర్మ - కుమార్తె తెలివితేటలకి సంతోషించాడు.
‘ఏమైనా కళింద్ర మహామండలం ఈనాడు చంద్రహాసుని ముద్రతో సుభిక్షంగా ఉన్నది. అది మనకు ఆనందాన్ని కలిగించే విషయం. ఇక నిన్న మొన్నటి సంభవాలను చూసినా, ఎవరో అజ్ఞాత వ్యక్తులు మన వారికి తలపెట్టిన ఎగ్గుల్ని అడ్డుకున్నది చంద్రహాసుడే అయి ఉంటాడని నా అంచనా. ప్రత్యేకించి రాకుమారిపై ముసుగు మనిషి ఖడ్గచాలనం, దాన్ని మరో ముసుగు వీరుడు ఖండించటం, అతన్ని వెంబడించటం - విన్న తర్వాత, ఆ సాహసి చంద్రహాసుడే అయి ఉంటాడనిపించింది. అటు శక్తీ, ఇటు యుక్తీ ఈ రెంటినీ అనుసంధానిస్తూ తేజోమయంగా నిలుస్తున్న అతని మానవీయ చర్యలూ - చంద్రహాసుని ఉత్తమ వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అన్నారు గాలవులు.
ఆయన మాటలకి కొనసాగింపుగా అన్నాడు మహారాజు, ‘ఇవి నిజంగా ఉత్సుకత కలిగిస్తున్న విషయాలు. మీరిరువురూ చెబుతున్న అంశాలను యోచిస్తుంటే -పరాక్రమమూ, ప్రశాంతతా, ధీరత్వమూ, శూరత్వమూ కలిగిన చంద్రహాసుని మూర్తి నా కనుల ముందు కదులుతోంది. విజయపురి సమస్య, అతని వంటి సాహసికి తెలిసి ఉండటమూ అవసరమే. ఆ చంద్రహాసుని ఒకపరి మన రాజధానికి పిలిపించండి. ముఖాముఖీ మాట్లాడుకోవచ్చు. మన మహాసామ్రాజ్యంలో వున్న అంతటి వీరుని మనమూ గౌరవించవలసిందే’ అని కూతురు వైపు తిరిగి ‘ఏమంటావమ్మా?’ అని అడిగాడు.
ఆమె తల వంచుకుని ‘మంచి ఆలోచన నాన్నగారూ’ అన్నది.
‘కుళిందకునికి వెంటనే పత్రికని పంపండి’ అన్నాడు ప్రభువు.
‘చిత్తం’ అని లేచారు గాలవులు.
‘అయితే చంద్రహాసుని చూచే సందర్భం నీకూ తటస్థపడలేదన్న మాట’ అడిగాడు అగ్నివర్మ.
‘అవును.. నాన్నగారూ’ అని ‘అయినా ఎదురుచూస్తున్న వానిపట్ల ఉత్కంఠ ఉంటేనే మంచిదేమో! మీ సమక్షంలో ఆ అవకాశం కలగబోవటం సంతోషం కదూ?’ అని నవ్వుతూ మందిరాన్ని వీడింది చంపకమాలిని!
55
కారాలూ, మిరియాలూ నూరుతూ కళింద్ర చేరిన దుష్టబుద్ధికి మంచి స్వాగతమే లభించింది.
మంత్రి సేనాపతులు, సింగన్న అడివప్పలు, ఆచార్యులూ, అక్షయ చంద్రహాసులూ, పరివార సహితంగా మహామండలేశ్వరుడే ఎదురేగి రాజప్రాసాదానికి తోడితెచ్చాడు.
ఈ సూచన ఆచార్య, చంద్రహాసులదే!
పరిచయాల్లోనే దుష్టబుద్ధి చంద్రహాసుని ఆపాదమస్తకం తేరి చూశాడు.
క్షాత్రతేజంతో ప్రచండంగా ఉన్నాడు చంద్రహాసుడు! ‘ఓహో...’ అదోలా అని ‘సరిసరి. మీకిప్పుడు అదనపు శక్తియుక్తులు పుష్కలమైనాయి’ అని కుళిందకునితో నర్మగర్భంగా అన్నాడు. చంద్రహాసుని మూర్తీ, ధీరగాంభీర్యాలూ, వైభవోన్నతులూ - తనకు హృదయశల్యంగా వున్నా బయటపడలేదు. ఆయన ఎంత మర్యాదగా, మృదువుగా మాట్లాడినా, ఆ మాటల వెనుకనున్న భావం కొందరికి అర్థమవుతూనే ఉంది.
‘మా శ్రేయోభిలాషులైన తమవంటి పెద్దల ఆశీర్వాద బలమే కళింద్ర మహామండలానికి శ్రీరామరక్ష మహామాత్యా! ఇదంతా మీ చలవే’ అన్నారు పురుషోత్తమాచార్యులు. ఇది దుష్టబుద్ధికి తీసిపోని లౌక్యపు మాటే!
‘మహామాత్యులకు మా శక్తిమేర మర్యాదల్ని ఏర్పాటు చేశాము. అనుగ్రహించి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. లోటుపాట్లని పెద్ద మనసుతో మా దృష్టికి తీసుకురండి. మా అక్షయ చంద్రహాసులు తమ కనుసన్నల్లో మెలగుతారు’ వినయంగా అన్నాడు కుళిందకుడు.
ఆ సాయంత్రం రాజమందిరంలో అధికార సమావేశం ఏర్పాటైంది. ప్రముఖులంతా వున్నారు.
దుష్టబుద్ధి తన ఆధిపత్య ధోరణిలో కళింద్ర వారి చర్యల్ని ఒక వరసలో ప్రశ్నించాడు. చివరికి ‘మీవైన నిర్ణయాలు మీరు తీసుకునేంత స్వేచ్ఛ వాంఛనీయం కాదు’ అన్నాడు నిష్కర్షగా.
వెంటనే ఎవ్వరూ జవాబివ్వలేదు. క్షణాల తర్వాత, చంద్రహాసుని వైపు చూశాడు కుళిందకుడు. అతడు చేతనమంత్రిని చెప్పమని చూపులతో అర్థించాడు. ఆయన లేచి గంభీరంగా అన్నాడు.
‘మహామాత్యా! వీనిలో ఎక్కువ శాతం ఖర్చుని మేమే భరించాము. అదనపు రాబడిలో మాకు మేముగా స్వచ్ఛందంగా కుంతలవారికి భాగం పంపాము’
దుష్టబుద్ధి కళవళ పడ్డాడు. నిలువరించుకుని ‘విషయం ఆదాయ వ్యయాలను గురించి కాదు. నిర్ణయాల గురించి. సామ్రాజ్యం మొత్తానికీ, అన్ని సామంత సంస్తానాలకూ కలిపి కొన్ని అంశాల్లో - సమత్వం, సామంజస్యం ఉండే విధంగా చూసుకోవాలి మేము. ఆ విధాన నిర్ణయాల్ని ప్రభావితం చేసే అంశాల్లో మీరిలా చొరవ చేయటం కూడదు’ అన్నాడు.
మరి కొంతసేపు సాగింది చర్చ.
ఆ తర్వాత - కరదలో, అష్టలో కుంతల రాజబృందం ఎదుర్కొన్న దుర్ఘటనల మీద మాటలు సాగినై. అందులోనూ దుష్టబుద్ధికి మంచి సమాధానాలే వచ్చాయి. ‘ఎక్కడికక్కడ మా ప్రయత్నాలతో ఆ దుష్ట చేష్టల్నీ, దురాగతాల్నీ ఎదుర్కొనగలిగాం కదా అమాత్యా!’ అన్నాడు కుళిందకుడు.
చివరికి అక్షయుడు అన్నాడు, ‘కళింద్ర పథకాల్లో నిర్ణయాలు సత్ఫలితాల నిస్తున్నప్పుడు వాటిని ఇతర సంస్థానాలలో అమలుకూ ప్రయత్నించవచ్చేమో - ఆలోచించండి అమాత్యవర్యా!’
దుష్టబుద్ధి ఇరుకున పడ్డాడు. ఇది ఆయనకు పూర్తిగా అనూహ్యమైన సలహా! ‘సరి... సరి’ అని సమావేశాన్ని ముగించారు.
ఆ రాత్రంతా అస్థిమితంగానే గడిపాడు. ‘అన్నీ తానే నిర్వహిస్తున్నా, తానుగా ఏమీ మాట్లాడక పాత్రోచితంగా ప్రవర్తించాడే చంద్రహాసుడు’ - అనే బాధే ఆయనను ఎక్కువగా వేధించింది. అతడుగా మాట్లాడితే తగిన రీతిలో అతన్ని చులకన చేయవచ్చనే తన ప్రయత్నం విఫలమయిందే అనేది ఆయన వేదన!!
56
చంద్రహాసునికి కుంతల రాజధానికి ఆహ్వానం అందింది.
అడివప్ప వంటివారు - దుష్టబుద్ధి బుద్ధి స్ఫురించి అక్కడ కుంతలపురిలో ఏం జరుగనున్నదో - అనే భయాన్ని వ్యక్తం చేశారు. చివరికి కుళిందకుడు - ‘మహారాజాజ్ఞ అనుల్లంఘనీయం. అంతా మన మేలుకే అనుకుని బయలుదేరమ’ని - చంద్రహాసుని ఆజ్ఞాపించాడు.
అక్షయుడు తానూ అన్నతో వెళ్తానని అన్నాడు. నీవంటి మండలేశ్వరుని పుత్రుడు పిలవని పేరంటానికి వెళ్లకూడదన్నాడు చంద్రహాసుడు! తానొక్కడూ ప్రయాణమయ్యాడు చంద్రహాసుడు.
57
చంద్రహాసునికి కుంతల ప్రభువు ఆహ్వానం సంగతి దుష్టబుద్ధికి తెలిసింది. ఆలోచనలో పడ్డాడు. ముళ్ల పొద లాంటి ఆ ఆలోచనల్లోంచీ ఒక తీగె లాగాడు.
దుష్టబుద్ధిది అగ్నితత్వం. అది ఇప్పుడు ప్రకోపించింది. అలనాడు మరణాన్ని తప్పించుకు పోయిన పిల్లవాడు ఈనాడు ఇంతవాడై, తన బాటలో పల్లేర్లు జల్లి, జీవన ప్రశాంతినే విచ్ఛేదం చేస్తున్నాడే అనే క్రోధ ద్వేష ప్రకోపం అది!
ప్రస్తుత కర్తవ్యాన్ని ఆలోచించాడు. పన్నుగడ స్ఫురించింది. చంద్రహాసుని తన వద్దకు రమ్మంటూ సందేశం పంపాడు. ఈలోగా తన కుమారుడు మదనునికి స్వహస్తంతో ఒక లేఖని తయారుచేసి, తన చేవ్రాలుతో అమాత్య ముద్ర వేసి సిద్ధం చేశాడు.
చంద్రహాసుడు వచ్చాడు. వినమ్రంగా కైమోడ్చి అమాత్యుల ఆజ్ఞను అర్థించాడు.
దుష్టబుద్ధి అతని వైపు చూశాడు. ప్రశాంతంగా ఉందతని ముఖం. లేఖను చంద్రహాసునికిచ్చి ‘ముఖ్యమైన రాచకార్యాన్ని మరచి వచ్చాను. నీవిప్పుడు మా రాజధానికి వెళ్లడం అనువుగా కుదిరింది. ఈ పత్రికను భద్రంగా తీసుకు వెళ్లి స్వయంగా నీవే నా పుత్రుడైన మదనుని చేతికి అందించాలి. సర్వమూ నీకహితమవుతుంది జాగ్రత్త’ అని హెచ్చరించాడు.

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600