S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బలమైన కోరిక ( సండేగీత)

కొన్ని విషయాలని మనం విశ్వసించం. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే విశ్వసిస్తాం. అది సహజం కూడా. అందులో తప్పులేదు.
మరణానికి చేరువలో వున్న వ్యక్తులు మరణించకుండా కొంతకాలం మంచం మీదే ఉంటూ ఉంటారు. మరణం దగ్గరికి వెళ్తూ ఉంటారు కానీ మరణించరు. వాళ్ల మనసులో ఎవరినో చూడాలని ఉంటుంది. అప్పటి దాకా మరణంతో పోరాడుతూనే ఉంటారు.
ఇలాంటి సంఘటనలు రెండు చూశాను. ఒకటి మా అన్నయ్య మరణం. రెండవది మా అమ్మ మరణం.
మా అన్నయ్య రక్తపోటు బాగా పెరిగి పక్షవాతం వచ్చింది. అతనూ డాక్టరే. కాని తన ఆరోగ్యాన్ని ఆయన సరిగ్గా పట్టించుకోలేదు. హైదరాబాద్ తీసుకొని వచ్చారు. హైదరాబాద్ తీసుకొని వచ్చిన తరువాత రాత్రి గుండెపోటు వచ్చింది. దాదాపు మరణం అంచుదాకా వెళ్లాడు. కానీ మరణం అతని దగ్గరకు రాలేదు. రెండు రోజులు గడిచాయి. పక్షవాతం వల్ల మాటలు రావడం లేదు.
అమెరికాలో వున్న ఆయన కూతురుని పిలిపించాలని నిర్ణయించుకొని కబురుపెట్టాం. ఆ విషయం అన్నయ్యకు చెప్పాం. అతనికి అర్థమైనట్టుగా కళ్లు మెరిసాయి. రెండు రోజుల తర్వాత అన్నయ్య కూతురు వచ్చింది. రోజంతా అన్నయ్యతో బాటే ఉంది. అంత బాధలో కూడా ఆయన కళ్లల్లో మెరపు చూశాం. ఆ మరుసటి రోజు అన్నయ్య మరణించాడు. అతని కూతురు వచ్చేంతవరకు ఆయన మరణంతో పోరాటం చేశాడు కానీ మరణించలేదు. ఇది యాదృచ్ఛికమని కూడా అనే అవకాశం ఉంది. కాదనలేం. కానీ నాకు మాత్రం యాదృచ్ఛికంగా అన్పించదు.
రెండవ సంఘటన మా అమ్మ విషయంలో జరిగింది. ఆమెకు గుండెపోటు వచ్చినప్పుడు నేను కోర్టులో వున్నాను. రావడానికి ఓ గంట పడుతుంది. అప్పటి దాకా ఆమె బతుకుతుందన్న నమ్మకం లేదని నాకు సమాచారం ఇచ్చారు. కొంత కుదుట పడిందన్న సమాచారం కూడా వచ్చింది.
నేనొచ్చిన తరువాత ఆమె కళ్లు తెరిచి చూసింది. నా చేతిని దగ్గరకు తీసుకుంది. ఓ ఐదు నిమిషాల తరువాత కళ్లు మూసింది. అప్పుడు గుండెపోటు రాలేదు. కానీ ఆమె మరణించింది. గుండె పోటు వచ్చినప్పుడు ఆమె మరణించలేదు.
మరణానికి ముందు నన్ను చూడాలన్న బలమైన కోరిక ఆమెను అంతసేపు బతికించి ఉండవచ్చు. కూతురిని చూడాలన్న బలమైన కోరిక మా అన్నయ్యను ఓ నాలుగు రోజులు బతికించిందని నా విశ్వాసం. యాదృచ్ఛికమని అనే వాళ్లతో వాదనలేదు.