S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చీకట్లో వంద

న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ క్లబ్‌లో ఆ ఐదుగురు కలిసి భోజనం ముగించారు.
‘్భజనం బాగుంది కదా పీటర్స్?’ ఫెర్గుసన్ అడిగాడు.
‘అవును’
‘బై ది వే ఇతను పీటర్స్’ ఫెర్గుసన్ అతన్ని మిగిలిన వారికి పరిచయం చేశాడు.
తర్వాత చెప్పాడు.
‘మనం ఒకరికొకరం పరిచయం అయాం.. వెయిటర్. అందరికీ స్కాచ్ తీసుకురా’
తర్వాత తను చెప్పేది ఫెర్గుసన్ కొనసాగించాడు.
‘ఇందాక నేను చెప్తున్నట్లుగా ప్రపంచంలో కేవలం ఆరు కథలే ఉన్నాయి. ప్రతీ భాషలో, ప్రతీ కాలంలో ఆ ఆరు కథలనే తిప్పితిప్పి వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే ముగింపులతో చెప్తున్నారు. ఇంతకు మించి కొత్త కథలు లేవు’
‘నాకు కథలతో పెద్దగా పరిచయం లేదు’ వినె్సంట్ చెప్పాడు.
‘ఉదాహరణకి ముక్కోణపు ప్రేమ. ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. లేదా ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. దీనికి వేల కొద్దీ ముగింపులు ఇవ్వచ్చు. కాబట్టి ఆ పాత కథ చదువుతూంటే ఓ కొత్త కథ చదువుతున్న భావన కలుగుతుంది. అవునా జాన్?’
‘ఓ విధంగా అవును. కాని నేను మీతో ఒప్పుకోను ఫెర్గుసన్. మనిషి ఉద్వేగం అన్ని కథలకి ఆధారం. మానవత్వపు ఉద్వేగాలు లేని నేపథ్యం లోంచి కూడా కొన్ని కథలు పుట్టాయి. ఉదాహరణకి నా మనసుకి తట్టిన ఓ కథ చెప్పనా?’ జాన్ అడిగాడు.
‘చెప్పు’ అంతా కోరారు.
‘క్రితం నెల నా మిత్రుడి ఇంట్లో ఇలాంటిది ఒకటి జరిగింది. మీ అందరికీ ఇది తెలుసు అనుకుంటాను. ఓ అరుదైన నాణెం. కొందరు మిత్రులు’
‘నాకు తెలీదు’ వినె్సంట్ చెప్పాడు.
‘సరే. ఓ క్లబ్‌లోని ఓ పొడవైన బల్ల ముందు డజను మంది మిత్రులు కూర్చుని ఉన్నారు. వారిలోని ఒకరికి నాణాల సేకరణ హాబీ. ఏదైనా సేకరించే వారికి తెలుసు, దాన్ని ఇతరులకి చూపిస్తే కలిగే సంతోషం. భోజనానంతరం ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ఓ అరుదైన, విలువైన నాణాన్ని మిగిలిన వారికి చూపించాడు. వారు ఒకరి తర్వాత మరొకరు దాన్ని తాము చూశాక ఇతరులకి ఇచ్చారు. వారు అవీ, ఇవీ మాట్లాడుకోసాగారు. కొద్దిసేపాగి అకస్మాత్తుగా ఆ సేకరణదారుడు చెప్పాడు.
‘ఆ నాణాన్ని తిరిగి ఇవ్వండి’
అది ఎవరి దగ్గరా లేదు! అంతా తమ దగ్గర లేదంటే, తమ దగ్గర లేదని చెప్పారు! ముందు ఎవరో జోక్ చేస్తున్నారని అనుకున్నారు. కాని అది దాని యజమాని దగ్గరికి తిరిగి చేరలేదు. మర్నాడు దాన్ని తనకి అతను తెచ్చి ఇస్తాడని దాని యజమాని భావించాడు.’
‘డిటెక్టివ్ కథ’ ఫెర్గుసన్ చెప్పాడు.
‘అవును. కాని దాన్ని ఆసక్తి అనడంకన్నా ఉత్కంఠ అనడం సబబు. డిటెక్టివ్ కథలో ఆసక్తి అనే మనిషికి ఉండే ఉద్వేగం గాఢంగా పని చేయడంతో సాహిత్యంలో దానికి ప్రముఖ స్థానం ఉంది. ప్రతీ డిటెక్టివ్ కథలో ఓ సమస్య, ఓ పరిష్కారం ఉంటాయి. ఆ పరిష్కారం కనుగొనడంలోనే పాఠకుడిలో ఉత్కంఠ చివరి దాకా కొనసాగుతుంది. తరచు పాఠకుడికి ఓ పరిష్కారం లేదా ముగింపు తడుతుంది. రచయిత సూచించిన పరిష్కారమే పాఠకుడు కూడా ఊహిస్తే పాఠకుడు అసంతృప్తి చెందుతాడు. దానికి భిన్నమైన, మరో ఉత్తమమైన పరిష్కారం లభిస్తేనే పాఠకుడికి సంతృప్తి కలుగుతుంది. ఓ మనిషి ఓటమిలో సంతోషం పొందే ఏకైక సందర్భం బహుశ ఇదే అయి ఉండచ్చు’ జాన్ చెప్పాడు.
‘సరే. డజను మందిలో ఒకరు ఆ అరుదైన నాణెం దొంగ. వారిలో ఎవరైనా కావచ్చు కాబట్టి డజను పరిష్కారాలు ఉన్నాయి. డజను ఉన్నట్లు కనిపించినా నిజానికి ఉన్నది ఒక్కటే పరిష్కారం. ఆ డజను మందిలోని ఒకడు తమని వెదకమని సూచించాడు. చాలామంది దానికి వత్తాసు పలికారు. పదకొండు మందిని వెదికాక పనె్నండో వ్యక్తి మాత్రం తనని వెదకడానికి ఇష్టపడలేదు. దాన్ని తిరస్కరించాడు. కారణం అడిగితే చెప్పలేదు. ‘నువ్వు అంగీకరించపోతే నువ్వే దొంగని అంతా అనుకుంటారు. కాబట్టి వెతకనీ?’ అని ఎందరు చెప్పినా అతను వినలేదు’
జాన్ చెప్పడం ఆపి విస్కీని తాగాడు.
‘తర్వాత?’ వినె్సంట్ ఆసక్తిగా అడిగాడు.
‘వెయిటర్ బల్ల మీది ఖాళీ ప్లేట్లని తీస్తూంటే ఓ దాని కింద ఆ నాణెం కనపడింది. వెంటనే అంతా అతన్ని అనుమానించినందుకు క్షమించమని కోరారు. అతను తనని ఎందుకు వెదకనివ్వలేదో కారణం చెప్పాడు. అది సబబైంది. దాన్ని మీలో ఎవరైనా ఊహించగలరా?’
అంతా వౌనంగా ఉండిపోయారు.
‘అప్పుడు ఆ వ్యక్తి లేచి జేబులోంచి సరిగ్గా అలాంటి నాణెన్ని చూపించి చెప్పాడు. ‘ఇలాంటివి ప్రపంచంలో రెండే ఉన్నాయి. రెండోది నా జేబులో ఉంది. వెదికాక అది నాదని చెప్తే మీలో ఎవరూ నమ్మకపోగా నేనే దొంగిలించానని అనుకుంటారని వెదకనివ్వలేదు’
‘అది నాకు తృప్తి కలిగించలేదు. ఒకే రకం నాణెం ఇంకొకరి దగ్గర, అదీ సరిగ్గా అందులో ఒకటి పోయినప్పుడు ఉండటం బలవంతపు పరిష్కారంలా నాకు అనిపించింది’ ఫెర్గుసన్ చెప్పాడు.
‘అవును. అది అతి అరుదైన కాకతాళీయం. ఇదే కథని నేను డజను తేడాలతో విన్నాను. అతని జేబులో నాణెం బదులు అతన్ని బ్లాక్‌మెయిల్ చేసే ఉత్తరం ఉండచ్చు. ఎవరికీ ఆ డబ్బు ఎలా వచ్చిందో వివరించలేని పెద్ద మొత్తం ఉండచ్చు. అతను సమాన ఆర్థిక స్థాయిగల వాడిగా చలామణి అవుతున్నా, అతను మరమ్మతు చేయించుకునే స్థోమత లేని చిరుగులు జేబులకి ఉండచ్చు’ జాన్ చెప్పాడు.
కొద్దిసేపాగి మళ్లీ జాన్ చెప్పాడు.
‘సరే. నేను విన్న మరో సంఘటన గురించి చెప్తాను. ఇదీ ఇటీవలే జరిగింది. ఐతే నేను చెప్పబోయే ఈ కథకి ముగింపు లేదు. ఎవరికి తోచిన పరిష్కారాన్ని వారు ఊహించచ్చు. ఇది ఓ మహిళ ఇంట్లో జరిగింది. ఇక్కడ ఉన్న ఎవరికైనా ఆమెతో పరిచయం ఉన్నా నేను ఆశ్చర్యపోను. వారి పేర్లు బయటికి రాకూడదు కాబట్టి నేను వారి పేర్లు కాక వేరే పేర్లు చెప్తాను’
గ్లాస్‌ని పూర్తి చేసి, వెయిటర్‌కి దాన్ని నింపమని సైగ చేసి, గొంతు సర్దుకుని జాన్ తను చెప్పేది కొనసాగించాడు.
‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్ సమీపంలోనే మేరీ ఇల్లు ఉంది. ఆ రోజు ఆమె పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఇచ్చే పార్టీకి ఏడుగుర్ని పిలిచింది. వారంతా వివిధ రంగాల్లో ప్రముఖులే. వారి అసలు పేర్లు చెప్తే మీరు వారిని తప్పక గుర్తు పడతారు. రాత్రి ఏడుకి ఆమె కొవ్వొత్తులని వెలిగిస్తూండగా డోర్ బెల్ మోగింది. ఆమె షేర్ బ్రోకర్ ఫ్లెండర్ వచ్చాడు.
‘మీరు త్వరగా వచ్చారు’ ఆమె చెప్పింది.
‘అవును. కాని మీరు డోర్‌బెల్ విన్నాక తలుపు తీయడానికి ఆలస్యం చేశారు. నేనే మొదటగా వచ్చానన్నమాట’
‘అవును. రండి. కొవ్వొత్తులు వెలిగించడానికి దయచేసి మీరు సహాయం చేస్తారా?’ మేరీ అడిగింది.
తర్వాత ఆమె లాయర్ జాక్సన్ వచ్చాడు. అతను జూదరి. తెలివిగలవాడు. ఆ తర్వాత హేరిస్, స్టీవెన్స్, మరి కాసేపటికి క్లారా, మిస్టర్ అండ్ మిసెస్ స్టేన్లీలు వచ్చారు. పార్టీ మొదలైంది. డ్రింక్స్ అందరికీ ఇచ్చాక మేరీ చెప్పింది.
‘మీరంతా ఇతరుల మీద వదంతులు మాట్లాడుకోవచ్చు. అపవాదులు వేయచ్చు. పార్టీలో ఇతరులకి ఆసక్తి కలిగేలా మాట్లాడమని నా కోరిక. రేపు దివాలా, విడాకులు లాంటివి వేచి ఉండచ్చు. కాని ఈ రాత్రి మాత్రం బాగా ఆనందించండి. అది ఈ ఇంటి విషయం. ఈలోగా నేను అన్నీ వేడి చేస్తాను’
ఆమె వంట చేయబోయే ముందు ఎప్పటిలా తన చేతికి ఉన్న మూడు ఉంగరాలని తీసి బెడ్‌రూంలోని ఓ పింగాణీ బౌల్‌లో ఉంచబోయే ముందు వాటిని అతిథులకి చూపిస్తూ చెప్పింది.
‘ఈ రెండు ఉంగరాలని మీరు ఇదివరకు చూశారు. ఈ మూడోది సఫైర్ ఉంగరం. బాగా ఖరీదైంది. నా పుట్టిన రోజుకి ఉండలేక పోవడంవల్ల నష్టపరిహారంగా మా వారు దీన్ని నాకు బహూకరించారు. దీని ధర ఇరవై వేల డాలర్లు’
అంతా దాన్ని మెచ్చుకున్నారు.
ఆ తర్వాత మేరీ వంట గదిలోకి వెళ్లింది. ఏడుగురు అతిథులు విస్కీ తాగుతూ, సంగీతం వింటూ, నృత్యం చేస్తూ కాలం సరదాగా గడపసాగారు. ఆ హాల్‌లోంచి తలుపు తెరచుకుని బెడ్‌రూంలోని బాత్‌రూంని అంతా ఉపయోగించుకున్నారు.
‘ఎక్స్‌క్యూజ్‌మీ. నేను మీకు సహాయం చేస్తాను’ జాక్సన్ ఆమె వెంట వంటగదిలోకి వెళ్లాడు.
‘మీ పడక గది బావుంది’ మిసెస్ స్టేన్లీ వచ్చి చెప్పింది.
‘్థంక్ యూ’
వేడి చేయడం పూర్తయ్యాక మేరీ వారితో చెప్పింది.
‘అంతా డైనింగ్ టేబిల్ ముందు కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను’
ఆమె తన బెడ్‌రూంలోకి వెళ్లి డ్రెస్సింగ్ టేబిల్ మీది పింగాణీ బౌల్‌లోని ఉంగరాలని తీసుకుని వేళ్లకి పెట్టుకుంది. కాని రెండు ఉంగరాలే ఉన్నాయి. మూడోది మాయం అయింది! సఫైర్ ఉంగరం ఆ బౌల్‌లో లేదు! వెంటనే ఆమెకి కలిగిన మొదటి ఆలోచన ‘మూర్ఖురాలిని’
ఆ ఏడుగురు అతిథులకి ఆమె వంట గదిలో ఉండగా దాన్ని తీసుకోడానికి ఒక్కొక్కరికి కనీసం డజను అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎవరు దొంగిలించి ఉంటారా? అని ఆలోచించింది. దొంగిలించడానికి ఎవరూ సందేహించరని ఆమెకి అనిపించింది. స్వభావరీత్యా వారిలో వ్యామోహానికి లొంగని వారు ఎవరూ లేరు అని ఆమెకి తెలుసు. దాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? అని ఆలోచించింది. తర్వాత నెమ్మదిగా పడక గదిలోంచి హాలులోకి వచ్చింది. హేరిస్ పింగాణీ ప్లేట్లని బల్ల మీద ఉంచుతున్నాడు. అంతా ఆమె మొహం చూసి ఏదో విపరీతం జరిగిందని గ్రహించారు.
‘గ్రీక్ ట్రాజడీలోని హీరోయిన్‌లా కనిపిస్తున్నావు. ఏమిటి సంగతి?’ స్టేన్లీ అడిగాడు.
‘నేను మీ అందరికీ ఒకటి చెప్పాలి. మిస్టర్ జాక్సన్. అంతకు ముందుగా మీరు ఓ పని చేయాలి’ ఆమె కోరింది.
‘చెప్పండి ఏం చేయాలో’ జాక్సన్ అడిగాడు.
‘దయచేసి మీరు తలుపు తాళం వేసి తాళం చెవిని నాకు ఇవ్వండి’
అతన ఆ పని చేస్తూంటే అంతా గుసగుసలాడుకున్నారు.
‘్థంక్ యు మిస్టర్ జాక్సన్. మిస్టర్ క్లేన్. దయచేసి మీరు అన్ని కొవ్వొత్తులని ఆర్పేస్తారా, డైనింగ్ టేబిల్ మీదివి తప్ప?’ మేరీ కోరింది.
అతను ఆమె కోరింది చేశాక డైనింగ్ టేబిల్ దగ్గర తప్ప ఇల్లంతా చీకటైంది. మేరీ చెప్పింది.
‘సరే. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నా ఉంగరం దొంగిలించబడింది’
తక్షణం ఆ హాల్‌లో రణగొణ ధ్వని వినపడింది.
‘అది ఇరవై నిమిషాలలోపు దొంగిలించబడింది. నేను మాటలు నాన్చను. దాన్ని ఎవరో తీసుకున్నారు. ఆ దొంగ మీ మధ్యే ఉన్నారు’
మళ్లీ అంతా ఒకరితో మరొకరు గుసగుసలాడుకున్నారు.
‘అందులో అనుమానం లేదు. మీలోని ప్రతీ వారికి దాన్ని దొంగిలించే అవకాశం ఉంది. నా ఉంగరం నాకు కావాలి. దాన్ని ఎవరు తీసుకున్నారన్నది నాకు అనవసరం. దాన్ని ఎవరు తీసుకున్నారో ఇతరులకి తెలీకుండా దాన్ని నాకు తిరిగి ఇచ్చే ఓ అవకాశాన్ని ఇస్తున్నాను. మా ఇంటి తలుపుమూసి ఉంది. ఆ ఉంగరం దొరికే దాకా అది మూసే ఉంటుంది. ఈ డైనింగ్ టేబిల్ మీది మూడు కొవ్వొత్తులని నేను ఆర్పబోతున్నాను. వంద లెక్క పెట్టాక మళ్లీ కొవ్వొత్తిని వెలిగిస్తాను. ఆ ఉంగరం ఇక్కడ నా ముందు బల్ల మీద లేకపోతే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. అప్పుడు ఈ గదిలోని అందర్నీ వాళ్లు వచ్చి వెదుకుతారు’
మళ్లీ ఆ గదిలో గుసగుసలు వినపడ్డాయి.
‘అంతా బల్ల చుట్టూ నించోండి. ఒక అంకె ఎక్కువా కాదు. ఒక అంకె తక్కువా కాదు. సరిగ్గా వంద దాకా నెమ్మదిగా లెక్క పెడతాను’
ఆమె ఆ మూడు కొవ్వొత్తులని ఆర్పేసి అంకెలని లెక్క పెట్టసాగింది. పాతిక లెక్క పెట్టాక స్టేన్లీతో ఆమె భార్య ఏదో గొణిగింది. నలభై రెండు లెక్క పెట్టేప్పుడు జాక్సన్ తన పక్కన ఉన్న ఎవరితోనో ఏదో మాట్లాడాడు. డెబ్బై ఆరు లెక్క పెట్టేప్పుడు ఎవరిదో గురక వినిపించింది. తొంభై దాటాక అందరిలో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరింది. ఆమె వంద పూర్తి చేశాక అగ్గిపుల్ల గీసి కొవ్వొత్తిని వెలిగించింది. మళ్లీ చాలా కంఠాలు గుసగుసలాడాయి.
బల్ల మీద ఆ ఉంగరం కనిపించింది!
మేరీ దాన్ని తన చేతి వేలికి పెట్టుకుని తన అతిథులతో చెప్పింది.
‘ఇప్పుడు మనం కేండిల్ లైట్‌లో వేడివేడి భోజనం చేయబోతున్నాం. దయచేసి ఎవరైనా కొవ్వొత్తులని వెలిగిస్తారా?’
* * *
‘కథ పూర్తయిందా?’ వినె్సంట్ ప్రశ్నించాడు.
‘ఐంది’
‘ఎవరు దొంగ?’
‘తెలీదు’

‘ఆధారాలు’
‘ఒక్కటీ లేదు’
‘ఈ కథ ముగింపులో అయోమయం ఉందనిపిస్తోంది’ ఫెర్గుసన్ చెప్పాడు.
‘ఆ గదిలోని ఏడుగురిలో దొంగ ఎవరు అన్నది నాకు తెలీదు. ఇదే కథగా రాస్తే పాఠకులకి నచ్చదు. ఎందుకంటే వారికి ఎవరు దొంగో తేల్చి చెప్పాలి. ఆ గదిలోని ఎనిమిది మందిలో ఆ దొంగకి తప్ప మిగిలిన ఏడుగురికి ఎవరు దొంగో తెలీనప్పుడు రచయిత ఎలా చెప్పగలడు? పరిష్కారం లేని సమస్య ఇది’ జాన్ ప్రశ్నించాడు.
‘ఇది నిజంగా జరిగిందా, లేదా అన్నది పక్కన పెడితే జాన్ మంచి కథని సృష్టించాడు. నేను చివరి దాకా జాగ్రత్తగా విన్నానంటే అది మంచి కథయితేనే వింటాను. దీనికి ఏడు పరిష్కారాలు లేదా ఏడు ముగింపులు ఉన్నాయి. దాన్ని లాజికల్‌గా నాలుగు, మూడుకి కుదించగలను. ఆ ఏడుగురిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు మగాళ్లు. ఆడవారికి సహజంగా ఆభరణాలంటే ఇష్టం కాబట్టి ఇది ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి పనై ఉండాలి’ ఫెర్గుసన్ చెప్పాడు.
‘తన గర్ల్‌ఫ్రెండ్‌కి దాన్ని బహూకరించాలని ఓ మగాడు తాత్కాలిక వ్యామోహానికి గురై దొంగిలించి ఉండచ్చుగా?’ అంతదాకా వౌనంగా ఉన్న ఒకరు ప్రశ్నించారు.
‘మగవారు దొంగిలించి ఉంటే ఆ ఉంగరం తిరిగి బల్ల మీద కనిపించేది కాదు’
‘దీని మీద మనం ఎనే్నళ్లు చర్చించుకున్నా మన ఐదుగురికి నచ్చే ముగింపు రాదు. గుడ్‌నైట్ ఎవ్విరిబడి’ జాన్ లేస్తూ చెప్పాడు.
‘ఇది నిజంగా జరిగిందా?’
‘అవును’
జాన్ వెళ్లాక ఫెర్గుసన్ నెమ్మదిగా చెప్పాడు.
‘ఆ ఏడుగురు కాక నిజాయితీగల బట్లర్ హెర్బర్ట్ గురించి జాన్ చెప్పలేదు?’
‘అతని గురించి మీకెలా తెలుసు?’ వినె్సంట్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘ఆ పార్టీకి హాజరైన ఏడుగురిలో నేనొకర్ని కాబట్టి. జాన్ చెప్పిన హేరిస్‌ని నేనే. గుడ్‌నైట్ ఎవ్విరిబడీ’ చెప్పి ఫెర్గుసన్ కూడా బయటకి నడిచాడు.
‘అపూర్వమైన కథ’ జాక్సన్ చెప్పాడు.
‘నేను ఊహించేదే మీరూ ఊహిస్తున్నారా?’ వినె్సంట్ ప్రశ్నించాడు.
‘ఏమిటది?’ మిగిలిన వారు అడిగారు.
‘అరుదైన నాణెం మాయం అయి ప్రత్యక్షం అయిన సందర్భంలో నేను అక్కడే ఉన్నాను. ఆ ఉంగరం మాయం అయి ప్రత్యక్షమైన సందర్భంలో మాత్రం లేను. కాని ఆ రెండు సందర్భాల్లో ఒక్కరే రెండు చోట్లా ఉన్నారు. దీన్నిబట్టి మీకేం అనిపిస్తోంది?7
‘అతను ఎవరు?’ అన్న కంఠాలు ఆసక్తిగా అడిగాయి.
‘ఇప్పుడే బయటకి వెళ్లిన ఇద్దరిలో ఒకరు’ వినె్సంట్ జవాబు చెప్పాడు.
‘వారిలో ఎవరు?’
‘వాళ్లు మాట్లాడింది ఓసారి ఆలోచిస్తే మీకే అర్థవౌతుంది’ వినె్సంట్ లేచి చెప్పారు.

(ఆల్విన్ జాన్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి