S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కఠిన సమయాలు

సుధాకర్ జీవిత ప్రయాణం చాలా సుఖంగా సాగింది. నాలుగు రోడ్ల హైవే మీద విలాసవంతమైన కారులో ప్రయాణం చేసినంత హాయిగా అతని ప్రయాణం సాగింది. ఒక్కడే కొడుకు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. అది హైదరాబాద్‌లో. అతని పెళ్లి కూడా చేశాడు. ఆ తరువాత సమస్యలు మొదలయ్యాయి. కొడుకు కోడలు మధ్య చిన్నచిన్న సమస్యలు చాలా పెద్దగా మారిపోయి సుధాకర్‌ని భయపెట్టాయి. సుధాకర్ కుటుంబ సభ్యులందరి పైనా క్రిమినల్ కేసులు పెట్టడానికి సిద్ధపడింది అతని కోడలు.
సుధాకర్ భయపడిపోయి ఓ న్యాయవాది మిత్రుడి దగ్గరకు వెళ్లాడు. సమస్య చెప్పాడు. న్యాయ సలహాతోపాటూ జీవితం గురించి ఓ అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు ఆ న్యాయవాది.
‘మన జీవిత ప్రయాణంలో అన్నీ సాఫీగా జరగవు. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. అనుకోని మలుపులు ఉంటాయి. ఒక్కో మలుపు మన దృష్టి పెంచుతుంది. మరో మలుపు దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజెబుతుంది.
జీవితంలో ఓ సమస్య తరువాత మరో సమస్య వస్తుంది. మనం బతికి వున్నంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓ చిన్న సమస్య దగ్గరే మనం ఆగిపోతే మనం కృంగిపోతాం. సమస్యలని ధైర్యంగా అధిగమించాలి’ ఇదీ ఆ న్యాయవాది ఉపన్యాసంలోని సారాంశం.
సుధాకర్ సమస్యకి తగు న్యాయ సలహాతోపాటు ఓ జీవిత పాఠం కూడా చెప్పాడు ఆ న్యాయవాది.
కొంతకాలం గడిచింది. ఆ న్యాయవాదికీ అతని భార్యతో పొరపొచ్చాలు వచ్చాయి. అతన్ని వదిలి వెళ్లిపోయింది అతని భార్య. అక్కడితో సమస్య ఆగిపోలేదు. అతనిపై వరకట్నం కేసు పెట్టింది. ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
అప్పటి నుంచి న్యాయవాది స్థిమితం కోల్పోయాడు. పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారేమోనని ఒకటే భయం. అతను పేరున్న క్రిమినల్ లాయర్. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయినా భయం అతన్ని తరుముతూనే ఉంది. బెయిల్ వచ్చింది. అయినా అతని ఆందోళన అతన్ని వదిలిపెట్టలేదు.
చివరికి సలహా కోసం నా దగ్గరికి వచ్చాడు. అంతా విన్న తరువాత సుధాకర్‌కి అతను చెప్పిన మాటలు కూడా అతనికి తిరిగి చెప్పాను. కానీ అతని ఆందోళన తగ్గలేదు.
సుధాకర్‌కి మా న్యాయవాద మిత్రుడికి వచ్చిన సమస్య దాదాపు ఒకలాంటిదే. కానీ మా న్యాయవాద మిత్రుడు సుధాకర్‌కన్నా ఎక్కువ ఆందోళనలో ఉన్నాడు. అప్పుడు అతను సమస్యతో కలిసి రాకుండా సమస్యని చూశాడు. అందుకే ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు సమస్యతో కలిసి చూస్తున్నాడు. అందుకే ప్రశాంతంగా ఉండలేక పోతున్నాడు.
సుధాకర్ సమస్యతో వచ్చినప్పుడు తన శక్తియుక్తులు అన్నీ ఉపయోగించి అతన్ని సమాధానపరిచాడు. కానీ ఇప్పుడు ఆ పని చేయలేక పోయాడు. సమస్యతో పూర్తిగా మమేకం అయితే ఎవరైనా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. ఆ సమస్య నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే ఆ సమస్యకు దారి దొరుకుతుంది. ఇది చెప్పడం సులువే. కానీ పాటించడం చాలా కష్టం.
కఠిన సమయాలు ఎప్పుడూ అంతంకావు. గట్టి మనుషులు వాటిని అధిగమిస్తారు.
గట్టి మనిషిగా మారడానికి చేసే ప్రయత్నమే జీవిత ప్రయాణంగా కొనసాగాలి.

-జింబో 94404 83001