S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేయసి

‘తర్వాత కలుద్దాం’ మెలనీకి గుడ్‌బై చెప్పి నిక్ రెస్ట్‌రెంట్‌లోంచి బయటకి వచ్చాడు.
వారికి రెండు నెలల క్రితమే పరిచయం, వారి మధ్య ప్రేమ మొదలై తీవ్ర స్థాయికి చేరింది. జీవితంలో మొదటిసారి నిక్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఐతే ఆమెకి కూడా తన మీద అలాంటి అభిప్రాయం కలిగే దాకా వేచి ఉండాలని అనుకున్నాడు. వారి మధ్య ప్రేమ అలా కొనసాగితే అప్పుడు పెళ్లి చేసుకోమని కోరాలని అనుకున్నాడు. ఈ ఆలోచనలతో నడిచి వెళ్లే నిక్‌కి తనని ఎవరో పేరు పెట్టి పిలవడం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే పరిచయం ఉన్న మొహంలా అనిపించింది.
బంగారు రంగు జుట్టు గల పొడవైన అతను చేతిని చాపుతూ అడిగాడు.
‘మీరు నిక్ ఫోర్బ్స్. అవునా?’
‘అవును. నేను మీకు తెలుసా?’ నిక్ కరచాలనం చేస్తూ అడిగాడు.
‘నేను మెలొనీ అన్నయ్యని. పేరు జెమీ’
నిక్‌కి అతని మొహంలో మెలనీ పోలికలు బాగా కనిపించాయి. ఓసారి మెలొనీ తన అన్న గురించి చెప్పడం గుర్తొచ్చింది.
‘మెలొనీ రెస్ట్‌రెంట్‌లోనే ఉంది’ నిక్ చెప్పాడు.
‘నేను వచ్చింది మెలొనీ కోసం కాదు. నీ కోసం’
‘నా కోసమా?’
‘అవును. నువ్వూ, మెలొనీ బాగా దగ్గర అవుతున్నారు’
‘అవడం కాదు. దగ్గరయ్యాం’
పేవ్‌మెంట్ మీది మనుషులు వారి పక్క నించి హడావిడిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరికీ వీరి సంభాషణ మీద ఆసక్తి లేదు.
‘నా చెల్లెలికి నీకు గల ప్రేమ ఓ సమస్య’
‘ఎవరికి సమస్య?’
‘నీకే. ఇక నువ్వు ఆమెని కలవడం మానేయాలి’
‘మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసో, తెలీదో కాని మీకు నేన కాని, మెలొనీ కాని ఎలా జీవించాలో చెప్పే హక్కు లేదు’
‘ఉంది. మా చెల్లెలుకి దూరంగా ఉండు. లేదా నువ్వు కష్టాల్లో పడతావు’ నిక్ ఛాతీ మీద చూపుడు వేలుతో పొడిచి చెప్పాడు.
‘ఇది బెదిరింపా?’ నిక్ అతని చేతిని విసురుగా తోసేస్తూ అడిగాడు.
‘నేను చెప్పినట్లు వింటే నీకు కష్టాలు రావు’
‘ఐతే ఇది బెదిరింపే’
‘బెదిరింపు కాదు. హెచ్చరిక. నీతో నేను చర్చించ దలచుకోలేదు. నేను చెప్పిన మాట విను. నేను నిన్ను గమనిస్తూంటాను. మెలొనీకి దూరంగా ఉండు’
‘దానర్థం?’ నిక్ వెళ్తున్న అతన్ని కోపంగా అడిగాడు.
అతను జవాబు చెప్పలేదు.
* * *
మర్నాటి రాత్రి కాండో బయట నిలబడి వేచి ఉన్న మెలొనీని నిక్ తన కారులో ఎక్కించుకున్నాడు. జెమీ గురించి చెప్పాలనుకున్నాడు. కాని చెప్పలేకపోయాడు. వాళ్లిద్దరూ క్లోజ్ అని ఆమె చెప్పడం అతనికి గుర్తుంది. బహుశ తన నించి అతను తన చెల్లెల్ని రక్షించాలని అనుకుంటూండి ఉండచ్చు. కాని తన గురించి ఏం తెలీకుండానే అలాంటి నిర్ణయం దేనికి తీసుకున్నట్లు? అతనిది ఒట్టి బెదిరింపే కావచ్చు. లేదా కాకపోవచ్చు కూడా. ఐనప్పటికీ నిందించదగ్గ ఆ విషయాన్ని మెలొనీ నించి దాచాడు.
ఖరీదైన ఆ రెస్ట్‌రెంట్‌కి జెమీ వచ్చి గొడవ చేయడం కుదరదని, ఆమెకి ఇష్టమైన ‘ది ఫిఫ్త్ ఫ్లోర్’ అనే ఫ్రెంచ్ రెస్ట్‌రెంట్‌కి తీసుకెళ్లాడు. రియర్ వ్యూ మిర్రర్‌లో తమ కారుని ఇంకో కారు అనుసరించడాన్ని నిక్ గమనించి చిన్నగా నిట్టూర్చాడు. ఆ కారు గత రెండు వారాలుగా తన ఇంటి బయట, జిమ్ బయట, ఆఫీస్ బయట పార్క్ చేసి ఉండడం చూశానని నిక్‌కి గుర్తొచ్చింది.
‘ఇవాళ ఏమిటి హుషారుగా లేవు?’ కొద్దిసేపాగి మెలొనీ అడిగింది.
‘సారీ!’
‘ఈ రాత్రి నువ్వు నాతో ఉన్నంతసేపు పరాకుగా ఉండకూడదని ఆజ్ఞ’ మెలొనీ నవ్వి చెప్పింది.
‘సరే యువరాణిగారు’ మళ్లీ నవ్వాడు.
రియర్ వ్యూ మిర్రర్‌లోంచి చూస్తే ఆ రంగు కారు కనపడలేదు. అది ట్రాఫిక్‌లో ఎక్కడో ఉండి తన కారుని అనుసరిస్తోందనే నిక్ నమ్మాడు.
రెస్ట్‌రెంట్‌కి చేరుకున్నాక హోస్టెస్ వారని ఓ టేబిల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టింది. నిక్ కూర్చున్న కుర్చీలోంచి లోపలకి వచ్చే అంతా కనిపిస్తారు. ఒకవేళ జెమీ వచ్చినా కనిపిస్తాడు. స్టివార్డ్‌కి డ్రింక్స్, భోజనం ఆర్డర్ చేశాడు. మెలొనీ చెప్పేది ఎప్పటిలా మనసు పెట్టి వినలేకపోయాడు. మధ్యలో ఒకటి, రెండుసార్లు ఆమె అతన్ని పేరు పెట్టి పిలిచింది కూడా. ఏ క్షణంలోనైనా జెమీ రావచ్చని ఎదురుచూశాడు. సగం భోజనం తిన్నాక ఇక అతను ఆ రాత్రి రాడని భావించాడు. అతనిలోని వొత్తిడి తగ్గిపోయింది.
అతను నిజంగా మెలొనీ సోదరుడు కాక అసూయ చెందిన ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ అయి ఉండచ్చా? అనే ఆలోచన నిక్‌కి కలిగింది. గత కొనే్నళ్లుగా ప్రేమలో తను సఫలం కాలేకపోతున్నానని మెలొనీ చెప్పడం గుర్తొచ్చింది. పెళ్లిదాకా వచ్చాక కొందరు ఆమె జీవితంలోంచి మాయం అయిపోయారు. వారు మాయం అవడానికి కారణం జెమీనా?
‘నీకు జెమీ అనే అన్న ఉన్నాడని చెప్పావు. కాని అతని గురించి ఎక్కువ చెప్పవే?’ అడిగాడు.
‘మా అన్న చాలా మంచివాడు. ఓసారి మనం ముగ్గురం తప్పక కలవాలి. నాకన్నా రెండేళ్లు పెద్ద. అందువల్ల తను నా సంరక్షకుడు అనుకుంటాడు. నా కోసం ఏదైనా చేస్తాడు. ఏదైనా’ మెలొనీ ఉత్సాహంగా చెప్పింది.
ఆ వివరణతో గత రాత్రి తనని కలిసింది జెమీనే అని నిక్‌కి అనిపించింది.
‘అతని ఫొటో ఉందా?’ నిక్ అడిగాడు.
‘ఓ! ఇంతదాకా చూపించనేలేదా?’ చెప్పి హేండ్‌బేగ్ తెరిచి మెలొనీ తన అన్న ఫొటోని తీసి చూపించింది.
అతనే!
రెస్ట్‌రెంట్ నించి ఇంటి దగ్గర దింపాక మెలొనీ అతన్ని తన అపార్ట్‌మెంట్‌లోకి ఆహ్వానించింది కాని ఈసారి నిక్ దాన్ని అంగీకరించలేదు.
‘ఇంటి దగ్గర చాలా ఆఫీస్ పని నా కోసం వేచి ఉంది’ అబద్ధం చెప్పాడు.
తామిద్దరి మధ్యా సంబంధాన్ని నాశనం చేయడానికి జెమీ ఏం చేయచ్చని ఇంటికి వెళ్తూ ఆలోచించాడు. బహుశ గతంలో తన చెల్లెలి బాయ్‌ఫ్రెండ్స్‌ని కూడా జెమీ ఇలాగే బెదిరించి దూరం చేసి ఉండచ్చు. కాని తన విషయంలో అది సాధ్యంకాదు.
రకరకాల ఆలోచనల మధ్య నిక్‌కి నిద్ర పట్టింది.
* * *
మర్నాడు ఉదయం నిక్ నిద్రలేచాక గుమ్మం బయటి క్రానికల్ దినపత్రికని తీసుకుని చదవసాగాడు. మూడో పేజీకి వచ్చాక ఓ దొంగ రోడ్ మీద వెళ్లే వ్యక్తిని దోచుకున్న వార్త చుట్టూ ఎర్రటి ఇంక్‌తో గీత గీసి ఉండటం గమనించాడు. వెల్స్ ఫార్గో బేంక్ ఉద్యోగి మైల్స్ టాల్బర్ట్ అనే యువకుడు ఓ రాత్రి రెస్ట్‌రెంట్ నించి ఇంటికి నడిచి వెళ్తూంటే అనేకసార్లు పొడిచి చంపబడ్డాడు. అతని జేబులోని పర్స్ మాయం అయింది.
అది ఆర్నెల్ల క్రితం దినపత్రిక అని నిక్ ఇట్టే గ్రహించాడు. దాన్ని తన దినపత్రికలో ఎవరు ఉంచారో కూడా ఇట్టే ఊహించాడు. అతను మెలొనీ ప్రేమికుడా? జెమీ అతన్ని చంపాడా? మెలొనీని కలవడం మానకపోతే తను కూడా అలాగే చంపబడతాడా? దాన్ని చెత్తబుట్టలో వేయబోయి ఆగిపోయాడు. జెమీ హంతకుడైతే ప్రమాదకారి. అతను హంతకుడని నమ్మకపోయినా నిక్ ఆ విషయం తెలుసుకోవాలని అనుకున్నాడు.
మైల్స్ టాల్బర్ట్ హత్య గురించి గూగుల్‌లో వెదికాడు. క్రానికల్‌లో తను చదివిన వార్తే అనేక వెబ్‌సైట్స్‌లో కనిపించింది. ఏ వార్తలో అతని ప్రియురాలి పేరు లేదు.
* * *
మర్నాడు ఉదయం వెల్స్ ఫార్గో బేంక్‌కి ఫోన్ చేసి మైల్స్ టాల్బర్ట్‌తో మాట్లాడాలని కోరాడు.
‘నేను జూలియాని. మైల్స్ టాల్బర్ట్ అన్నారా?’ ఓ ఆడ కంఠం వినిపించింది.
‘అవును’
‘అతను లేడు’
‘ఐతే వచ్చాక నేను చెప్పేది దయచేసి అతనికి చెప్తారా?’
‘ఐతే మీకు తెలీదన్నమాట’ క్రానికల్‌లో ప్రచురించబడ్డ విషయానే్న చెప్పింది. పోలీసులు ఇంకా హంతకుణ్ని కనిపెట్టలేకపోయారని కూడా చెప్పింది.
‘నాకే ఇది పెద్ద షాక్. అతని గర్ల్‌ఫ్రెండ్ దీన్ని ఎలా తీసుకుంది?’ అడిగాడు.
‘మెలొనీ లాసెన్? నాకు తెలీదు. ఆమె మీకు తెలుసా?’
‘తెలుసు. థాంక్స్. బై’
ఆఫీస్‌కి వెళ్తూ నిక్ సబ్‌వేలో క్యూలో నించుని మధ్యమధ్యలో వెనక్కి తిరిగి చూశాడు. సియర్స్ స్ట్రీట్ స్టేషన్‌లో దిగబోతూంటే అతనికి జెమీ కంఠం వినిపించింది.
‘నువ్వు నిన్న ఏదో చెడ్డ వార్త చదివినట్లున్నావు?’
నిక్ అది వినపడనట్లుగా జవాబు చెప్పలేదు. వెనక్కి తిరిగి చూడలేదు.
‘దానర్థం తెలుసుకునే ఉంటావు. మెలొనీ జీవితంలోంచి ఎలా బయటికి వెళ్తావో నువ్వు నిర్ణయించుకోవాలి’
వెంటనే వెనక్కి తిరిగి జెమీని చూస్తూ కోపంగా చెప్పాడు.
‘ఆమెని నువ్వు ఇలా కంట్రోల్ చేయలేవు. ఆమె చిన్నపిల్ల కాదు. పైగా నువ్వు ఆమె తండ్రి కూడా కాదు’
‘అంటే? మెలొనీతో సంబంధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నావా?’
‘అవును.ఏ బెదిరింపులూ నన్ను భయపెట్టలేవు’
‘ఓ హత్య నిన్ను భయపెట్టలేదంటావు?’
‘లేదు. అలా ఓ డజను మంది చంపబడ్డా కూడా’ నిక్ స్థిరంగా చెప్పాడు.
‘ఐతే నువ్వు దద్దమ్మవి’
వెంటనే నిక్ జెమీ కాలర్ పట్టుకుని ఓ భవంతి గోడకి నొక్కి పెట్టి గట్టిగా చెప్పాడు.
‘సాహసవంతుడినేమో? నువ్వే దద్దమ్మవేమో? నువ్వు మమ్మల్ని విడదీయలేవు. మా విషయంలో జోక్యం చేసుకోవద్దు’
జెమీ ఎదిరించే ప్రయత్నం చేయలేదు. వెళ్తూ చెప్పాడు.
‘మైల్స్ టాల్బర్ట్ ఒక్కడే కాడు. మిగిలిన వారి గురించి మెలొనీని అడుగు’
* * *
మెలొనీ పడక మీద అదే ఆఖరి సారా అన్నట్లుగా నిక్ మెలొనీతో రతిని జరిపాడు. అతని ఛాతీ మీద స్వేదబిందువులు మెరిసాయి. జెమీ చెప్పిన మాటలే గుర్తుకు రాసాగాయి. ఎంత మంది చంపబడ్డారో మెలొనీని అడగమన్నాడు. ఇద్దరా? ఐదుగురా? డజను మందా? అన్ని హత్యలు చేసి ఎలా పట్టుబడకుండా ఉన్నాడు? అంతమంది మరణిస్తే మెలొనీ ఎలా తట్టుకుంది? వారి మరణాల గురించి తెలుసా? మెలొనీ తన బాయ్‌ఫ్రెండ్స్ తనకి దూరం అయ్యారని చెప్పింది. కాని మరణించారని చెప్పలేదు. తను పోలీసులకి జెమీ మీద ఫిర్యాదు చేయాలి. కాని ఆధారాలు లేవు. లేకపోతే వాళ్లు పట్టించుకోరు.
‘అంత నిరాశ దేనికి? నువ్వు ఎందుకంత విచారంగా ఉన్నావు?’ మెలొనీ అడిగింది.
‘ఏం లేదు. ఆలోచిస్తున్నాను’
‘దేని గురించి?’
‘నేను నీకు ఎంత ముఖ్యమా అని’
‘చాలా’
‘నిజంగా?’
‘నువ్వు అభద్రతని ఫీలవుతున్నావా?’
‘నువ్వు నాకు పరిచయం. అదే సమయంలో నాకు తెలీవు అని కూడా అనిపిస్తోంది’
‘నువ్వేం తెలుసుకోవాలని అనుకుంటున్నావు?’
‘ఏదైనా. అంతే’ నిక్ చెప్పాడు.
ఆమె కళ్లల్లోంచి ఓ కన్నీటి బొట్టు రాలింది. ఆమె తన ఫేమిలీ ఆల్బం తీసి తన కుటుంబ సభ్యులని, బంధుమిత్రులని పరిచయం చేసింది. దాదాపు ఆమె ఉన్న ప్రతీ ఫొటోలో జెమీ నీడలా ఉన్నాడు.
‘ఇతనెవరు?’ పనె్నండేళ్ల ఓ కుర్రాడి ఫొటోని చూపించి అడిగాడు.
‘నా మొదటి ప్రేమికుడు. పేరు ఛార్లెస్. ఇతని పదహారో ఏట మేం ఆరు నెలలు డేటింగ్ చేశాం’
‘నీకు ఎలా దూరం అయ్యాడు?’
‘మరణించి’
‘ఎలా?’
‘నీళ్లల్లో మునిగి. నా బాయ్‌ఫ్రెండ్స్ అందరికీ నన్ను వదిలి వెళ్లిపోయే అలవాటు ఉంది’ చెప్పింది.
‘నేను మాత్రం వదలను’ ఆమెని ముద్దు పెట్టుకుని నిక్ చెప్పాడు.
* * *
ఏడుగురు!
నిక్ దినపత్రికలు వెదికితే దినపత్రికల్లో ఏడు పేర్లు కనిపించాయి. చాలా సందర్భాల్లో మెలొనీ హతుల సమీపంలోనే ఉన్నదని తెలుసుకున్నాడు. జెమీ కూడా!
తన ఖాళీ సమయాల్లో మెలొనీ పాత బాయ్‌ఫ్రెండ్స్ గురించి దినపత్రికల్లో రీసెర్చ్ చేయసాగాడు. ఇప్పుడు వారానికి రెండుసార్లే ఆమెని కలుస్తున్నాడు. ఆమె ఫిర్యాదు చేస్తే తన ఆఫీసర్ కొత్త ప్రాజెక్ట్‌ని అప్పగించాడని అబద్ధం చెప్పాడు. జెమీ అతన్ని బెదిరించడం మానేశాడు. బహుశ అతను తన తప్పుని ఈపాటికి అర్థం చేసుకుని ఉంటాడు అని నిక్ ఆశపడ్డాడు.
ఓ వార్త ప్రకారం శాక్రిమెంటోలో స్టేక్టో, అమెరికన్ నదులు కలిసేచోట ఛార్లెస్ నీళ్లల్లో మునిగి మరణించాడు. అతని మరణానికి సాక్షి ఐన జెమీ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అంటే జెమీ పదిహేడో ఏటే హంతకుడు అయ్యాడా? మెలొనీ హైస్కూల్ బాయ్‌ఫ్రెండ్ ట్రెంట్ జీవించే ఉన్నాడు. సినిమాల్లో సౌండ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. నిక్ అతనికి ఫోన్ చేసి చెప్పాడు.
‘మనిద్దరికీ గల కామన్ ఫ్రెండ్ గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను’
‘ఎవరు?’
‘మెలొనీ లాసన్’
‘మీరెవరు?’ అతను కోపంగా అడిగాడు.
‘మెలొనీ తాజా బాయ్‌ఫ్రెండ్‌ని’
‘ఆమెకి గుప్త వ్యాధులు ఉన్నాయా అని తెలుసుకోవడానికైతే ఆమెకి రక్తపరీక్ష చేయించండి’
‘నేను జెమీ గురించి మాట్లాడటానికి చేశాను’
‘ఐతే మిమ్మల్నీ బెదిరించాడన్న మాట’ ఈసారి అతని కంఠంలో కోపం మాయమైంది.
‘మీరు మెలొనీని కలవకుండా మిమ్మల్ని అతను సఫలవంతంగా బెదిరించాడన్నమాట’
‘జెమీ సుత్తితో నా ఎడం చేతి మణికట్టుని విరక్కొట్టాడు’
నిక్ జోనాథన్, టామీ అనే మరో ఇద్దరితో మాట్లాడితే జెమీ వాళ్లని కూడా శారీరకంగా హింసించి తన సోదరికి దూరంగా ఉంచాడని తెలిసింది. వార్నర్ మాత్రం దురదృష్టవంతుడు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర మేరిన్ హైలేండ్స్ దగ్గర గొంతు కోసిన అతని శవం లభించిందని అతని చెల్లెలు చెప్పింది. దొంగిలించబడ్డ అతని కారు కోసం దుండగులు అతన్ని చంపి ఉంటారని పోలీసులు భావించారు.
నాలుగో వ్యక్తి మార్క్‌ని కలుసుకోలేక పోయాడు.
* * *
జెమీ నించి నిక్‌కి మర్నాడు ఫోన్ వచ్చింది.
‘మనం ముగ్గురు రెస్ట్‌రెంట్‌లో కలవాలని మెలొనీ అనుకుంటోంది. గురువారం రాత్రి ది ఫిఫ్త్ ఫ్లోర్ రెస్ట్‌రెంట్‌లో కలుద్దాం అని చెప్పమంది. నువ్వు రాకపోతేనే నాకు సంతోషం’
‘నేను వస్తే మెలొనీకి సంతోషం కాబట్టి వస్తాను’ చెప్పి నిక్ లైన్ కట్ చేసేశాడు.
రెస్ట్‌రెంట్‌లో నిక్‌ని చూడగానే మెలొనీ మొహం వెలిగింది. జెమీ మొహం ముడుచుకుపోయింది. అతని వంక కోపంగా చూడటం తప్ప మరే విధంగా అమర్యాదగా ప్రవర్తించలేదు. మెలొనీ బాత్‌రూంలోకి వెళ్లినప్పుడు జెమీ చెప్పాడు.
‘రావద్దన్నాగా? వెంటనే వెళ్లిపో. మెలొనీకి నేనేదో సర్ది చెప్తాను’
‘నేను ఇక్కడికి రావడానికి కారణం మెలొనీ నా భార్య కాబోతోందని నీకు అర్థం కాలేదా?’
‘నీకు ఏం జరగబోతోందో తెలుసుగా?’ జెమీ కఠినంగా చూస్తూ అడిగాడు.
‘నీ మీద పోలీసులకి ఫిర్యాదు చేయడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఛార్లెస్, మిగిలిన వారు అందరి గురించి నాకు తెలుసు. నేను మెలొనీని ప్రేమిస్తున్నాను కాబట్టి ఇంతదాకా నీ గురించి వాళ్లకి చెప్పలేదు. నువ్వే వెళ్లిపో. ఈ రెస్ట్‌రెంట్‌లోంచే కాదు. ఈ ఊరు, ఈ రాష్ట్రం, అసలు ఈ దేశం వదిలే వెళ్లిపో. మా జీవితాల్లోంచి వెళ్లిపోయి మమ్మల్ని ప్రశాంతంగా బతకనీ. నేను మెలొనీకి నీ గురించి ఏదో సర్ది చెప్తాను’
‘వెళ్లను’
‘ఐతే నువ్వు ఇబ్బందుల్లో పడక తప్పదు’
మెలొనీ వచ్చి కూర్చుని అడిగింది.
‘మీ ఇద్దరూ ఒకరి ఇల్లు మరొకరు తగలబెట్టుకున్న వారిలా కనిపిస్తున్నారేమిటి? ఏం చర్చిస్తున్నారు?’
బిల్ రాగానే జెమీ, నిక్ ఎవరు దాన్ని చెల్లించాలా అని పోట్లాడుకున్నారు.
‘నేను వేలట్ నించి నా కారు తీసుకుంటాను’ చెప్పి నిక్ జెమీ చేతిలోని వేలట్ టిక్కెట్లని తీసుకున్నాడు. మెలొనీ కూడా లేచి అతన్ని అనుసరించి బయటికి వచ్చాక అడిగింది.
‘ఏమిటి? మీరు ఎందుకు గొడవ పడ్డారు?’
‘నీతో ఒంటరిగా మాట్లాడాలి. నీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను’
ఇద్దరూ కారెక్కాక నిక్ దాన్ని స్టార్ట్ చేసి వేగంగా పోనించాడు.
‘ఏమిటి?’ ఆమె అడిగింది.
‘అక్కడికి చేరాక’
నిర్మానుష్యంగా ఉన్న బే బ్రిడ్జి దగ్గరికి తీసుకెళ్లి కారుని రెడ్ జోన్‌లో ఆపాడు. దీపాలు వెలగడం లేదు.
‘ఇక్కడికి ఎందుకు వచ్చాం?’ మెలొనీ ఆశ్చర్యంగా అడిగింది.
ఆమెని చెయ్యి పట్టుకుని వాటర్ ఫ్రంట్ వైపు నడిచాడు.
‘మనిద్దరం చాలా వారాలుగా డేటింగ్ చేస్తున్నాం. కాని నాకు నువ్వు జీవితకాలం నించి పరిచయం అనిపిస్తోంది’
‘హౌ స్వీట్!’
తను ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నాడో చాలాసేపు చెప్పాడు. ఆమె అడ్డుపడకుండా వింది.
‘నీకు జెమీ గురించి చెప్పాలి’
‘ఏం చెప్పాలి?’ ఆశ్చర్యంతో కూడిన ఆసక్తితో అడిగింది.
అకస్మాత్తుగా ఓ కారు వచ్చి వారికి కొద్ది దూరంలో ఆగింది. అందులోంచి జెమీ బయటకి దూకాడు.
‘మెలొనీ. ఐ లవ్ యు’ నిక్ హత్తుకుని చెప్పాడు.
‘నేను కూడా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను’
‘అందుకే నీకిది తెచ్చాను’ జేబులోంచి ఉంగరం తీసి ఆమె ముందు ఓ మోకాలి మీద కూర్చుని అడిగాడు.
‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’
‘ఆగు’ జెమీ వాళ్ల వైపు పరిగెత్తుకు వస్తూ అరిచాడు.
‘ఐ యామ్ సారీ నిక్! చేసుకోను’
‘నిక్! జాగ్రత్త’ జెమీ హెచ్చరికగా అరిచాడు.
అదే సమయంలో ఆమె హేండ్‌బేగ్ లోంచి చేతిలోకి ప్రత్యక్షమైన కత్తి నిక్ పొట్టలో గుచ్చుకుంది. ఆశ్చర్యం, అయోమయంతో అతనికి వెంటనే నొప్పి తెలీలేదు.
‘ఎందుకు?’ బలహీనంగా అడిగాడు.
‘మళ్లీ అదే పనా?’ జెమీ మెలొనీ చేతిని పట్టుకుని ఆపాడు.
‘నిక్! నిన్ను కాపాడటానికి ప్రయత్నించాను. కాని నువ్వు నా మాట వినలేదు’
మెలొనీ వారి సమీపంలో ఉన్నా ఆమె చూపుల్నిబట్టి లక్షల మైళ్ల దూరంలో ఉన్నట్లుగా నిక్‌కి అనిపించింది.
‘కాని నువ్వే హంతకుడివి అని నేను నమ్మేలా ప్రయత్నించావు’ నిక్ జెమీతో చెప్పాడు.
‘మెలొనీలోని మానసిక జాఢ్యం గురించి నీకు తెలీకూడదని అలా నటించాను. ఆమె చెడ్డది కాదు. మెదడు దెబ్బతింది’
‘ఏమిటి నువ్వనేది?’
‘మా నాన్న ఆమెని ఎంతగా ప్రేమించాడంటే, ఎవర్ని పెళ్లి చేసుకున్నా వాడు హింసిస్తాడనే భయాన్ని చిన్నప్పటి నించే మెలొనీలో ప్రవేశపెట్టాడు. ఆయన అతి ప్రేమ వెగటై ఆమె మెదడుని పాడు చేసింది’
‘్ఛర్లెస్‌ని చంపింది మీ చెల్లెలేనా?’
‘అవును. మొదటగా మా నాన్నని. తర్వాత మిగిలిన అందర్నీ కూడా. తను చేసే పనిలోని వివేకం ఆమెకే తెలుసు. మెలొనీ గీసుకున్న సరిహద్దుని నువ్వు ఉంగరంతో దాటావు. అది దాటి ఎవరూ తనని ప్రేమించకూడదన్నది ఆమె ఉద్దేశం’
సేక్టో- అమెరికన్ నదులు కలిసిన చోట ఛార్లెస్‌ని మెలొనీ ఎలాంటి మానసిక స్థితిలో చంపిందో నిక్ ఊహించగలిగాడు. ఇప్పుడు తనని.
‘గాడ్! రక్తం కారిపోతోంది. నైన్ లెవెన్‌కి ఫోన్ చేయి’ అర్థించాడు.
‘సారీ! నేనేం చేయలేను నిక్. మెలొనీ. నువ్వేం తప్పు చేయలేదు. తప్పంతా నిక్‌దే. ఈసారి కూడా సవరిస్తాను. నువ్వెళ్లి కార్లో కూర్చో’
హిప్నాటిక్ ట్రాన్స్‌లో ఉన్నట్లుగా మెలొనీ వెనక్కి తిరిగింది.
‘ఆమెని నువ్వు ఇలా రక్షిస్తూండటం ఎప్పుడూ కుదరదు జెమీ’ నిక్ చెప్పాడు.
‘అది నాకు తెలుసు. కాని ఈసారి కూడా కాపాడుతాను’
జెమీ తనని నీళ్లల్లో తోసే లోపలే నిక్ మెలొనీ నడుం పట్టుకుని అమాంతం ఎత్తి నీళ్లల్లోకి విసిరేశాడు. నిశే్చష్టుడైన జెమీని పక్కకి తోస్తూ చెప్పాడు.
‘దేనికీ సాక్ష్యం లేదు. నీ మీద నేను ఫిర్యాదు చేసినా పోలీసులు నమ్మరు. నా మీద నువ్వు చేసినా అంతే. సమస్య పరిష్కారమైంది కాబట్టి ఎవరి బతుకులు వారు బతుకుదాం’
కృంగిపోయినట్లుగా జెమీ తల వంచాడు.
తీవ్ర గాయం అవని నిక్ జెమీని వదిలి తన కారు వైపు నడిచాడు.

(జాన్ జాన్సన్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి