S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహనీయుల విలక్షణ వ్యక్తిత్వం

కొంతమంది సాధారణ వ్యక్తులు తమ చర్యల ద్వారా విశిష్టత సంపాదించుకొని మహనీయులుగా పరిగణింపబడ్డారు. అలాంటి కొందరి విలక్షణ వ్యక్తుల జీవితాలలోని కొన్ని సంఘటనలను చూద్దాం.
జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్. ఆయన గొప్ప దేశభక్తుడు. ఒకానొక సంఘటన ఆయన స్వభావాన్ని చక్కగా విశదపరుస్తుంది. ఆయన న్యాయవాదిగా రెండు చేతులా సంపాదించిన వ్యక్తి. ఒకసారి ఓ పేదవాడు ఆయన వద్దకు వచ్చి ‘అయ్యా! నా కుమార్తె వివాహానికి సహాయం చెయ్యండి’ అని అర్థించాడు. అప్పుడు మోతీలాల్ తన గుమాస్తాను పిలిచి ‘ఈ రోజు సాయంత్రం వరకు ఎంత ఆదాయం వచ్చినా అది మొత్తం అతనికి ఇచ్చెయ్’ అని చెప్పారు. అతను అడిగింది మూడు వందల రూపాయలే. ఆ రోజు వచ్చిన ఆదాయం పదమూడు వందలు. గుమాస్తా మోతీలాల్ వద్దకు వచ్చి ‘అయ్యా, ఈ రోజు పదమూడు వందలు వచ్చింది. మూడు వందలు ఆ పేద బ్రాహ్మణునికి ఇచ్చి మిగిలినది మన లెఖ్ఖల్లో జమ చేయమంటారా?’ అని అడిగాడు. అందుకు మోతీలాల్ ‘అదేం కాదు! వచ్చిన మొత్తం అంతా ఇచ్చెయ్’ అన్నారు. ఈ సంఘటన ఆయన వితరణ శీలాన్ని తెలియజేస్తుంది.
వివేకానందుడు మాటల తూటాలు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకసారి స్వామి కాళ్లకు విదేశీ పాదరక్షలు ధరించారు. ఒక అమెరికన్ మహిళ ‘స్వామీ! మీరు విదేశీ పాదరక్షలు ధరించారేమిటి’ అని ప్రశ్నించింది. ఆయన వెంటనే ‘విదేశీ వస్తువులను ఏ స్థానంలో ఉంచాలో తెలపడానికే’ అని ఘాటుగా జవాబివ్వడంతో ఆవిడ నిశే్చష్టురాలయింది. మరోసారి ఒక క్రైస్తవ మతాచార్యుని ఆహ్వానంపై ఆయన ఇంటికి వెళ్లాడు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే టేబుల్ మీద భగవద్గీతను ఉంచి దానిపై ఇతర క్రైస్తవ మత గ్రంథాలు ఉంచి ‘గీత ఎక్కడ ఉన్నదో చూశారా?’ అని ప్రశ్నించాడు. అన్నింటికంటే కింద ఉంటే దాని స్థానం అంతేనన్నట్లు విమర్శించాను కదా అని తృప్తిగా ఉన్నాడు. స్వామి వెంటనే ‘గీత ఉండవలసిన స్థానంలోనే ఉన్నది. అది లేకపోతే మిగతా పుస్తకాలు నిలబడేవి కాదు కదా’ అని ఎదురుప్రశ్న వేసి ఆ పృచ్ఛకుడి నోటికి తాళం వేశాడు.
భగవాన్ రమణ మహర్షిని గురించి వినని వాళ్లు అరుదు. ఒకసారి ఒక దొంగల ముఠా ఆయన ఆశ్రమంలో ద్రవ్యం బాగా దొరుకుతుందని దొంగతనానికి వచ్చి తీరా చూస్తే వాళ్లకు రెండంటే రెండే రూపాయలు దొరికాయి. కోపంలో వాళ్లు ఆయనను గాయపరిచారు. స్వామిజీ కోపగించుకోలేదు. ‘నాయనలారా! ఈ పూట ఇక్కడే భోం చేసి వెళ్లండి’ అని స్వయంగా తానే వారికి వడ్డించాడు. దొంగలు పశ్చాత్తాపంతో తప్పు క్షమించమని స్వామిని వేడుకొన్నారు. ఇది ఈ మహర్షి ఆధ్యాత్మికేతర విశిష్టతను వ్యక్తం చేసే అంశం.
సిక్కు ప్రభువైన రంజిత్‌సింగ్ న్యాయమైన తీర్పులు ఇవ్వడంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. ఆయన రాజ్యంలో ఒక ముసలమ్మ ఉంది. ఆమెకు ఒక బావి ఉండేది. బంధువొకడు ఆ బావిని ఆక్రమించుకొన్నాడు. ఆమె బలహీనురాలు ఏమీ చేయలేదని అతని నమ్మకం. పాపం ఆ ముసలావిడ ప్రభువు వద్దకు వెళ్లి తన మొర విన్నవించుకొన్నది. నీకు న్యాయం జరిపిస్తానని రంజిత్‌సింగ్ ఆ ఊరికి వెళ్లారు. ఆ బావి వద్ద కూర్చున్నారు. బావిని అన్యాయంగా ఆక్రమించుకొన్న బంధువును పిలిపించి అతనితో ‘ఏమోయ్! నా పైకం అయిదువేల వరహాలు ఈ బావిలో పడిపోయాయి. అవి తీసి నా దగ్గరకు వచ్చి రేపటిలోపుగా అందజెయ్యి’ అని ఆదేశించాడు. అప్పుడు అతడు భయంతో ‘ఈ బావి నాది కాద’ని అంగీకరించాడు. అలా చెప్పకపోతే అయిదువేల వరహాలు ఇవ్వవలసి వచ్చేది. ఈ విదంగా కఠినంగా శిక్షించకుండానే ముసలమ్మకు న్యాయం చేసిన రంజిత్ సింగ్ తాను గొప్ప పోరాట యోధుడే కాక న్యాయం చెయ్యడంలో కూడా తనదైన శైలిని చూపించాడు.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం