S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరువీధుల మెరసీ దేవదేవుడు

శ్రీగిరీశుడు వేంకటేశుడు. తిరుమల ప్రభువైన శ్రీనివాసుడు. ‘తిరు’ అంటే ‘శ్రీ’. ‘మల’ అంటే కొండ, గిరి, పర్వతము. తిరుమల అంటే శ్రీగిరి. శ్రీగిరి మీద వెలసిన కరుణాళుడు. వేంకటగిరి, శ్రీగిరి పర్వతానికి మరొక పేరు. కనుకనే ఆయన వేంకటేశ్వరుడు. ఆయన నుండి పర్వతానికి, పర్వతం నుండి ఆయనకు పేర్లు వచ్చినాయి. పర్వతాన్ని ‘వేంగడ’ అని, ‘వెంగళ’ అనీ ‘వేంకట’ అని పిలుస్తారు. అందువల్ల, ఆయన వేంకట నాథుడు, వేంగళ నాథుడు. తిరుపతి, తిరుమల కలిసే ఉంటాయి. ‘తిరు’ అంటే శ్రీ అని చెప్పుకున్నాం. పతి తిరుపతి అనగా ‘శ్రీపతి’ శ్రీ’పత్ని అయితే, ఆయన పతి. ఆశ్రయతీతి శ్రీః ఆశ్రయించేది గనుకనే శ్రీ అయింది శక్తి.
ఆయనే తిరుమలేశుడు, తిరుమలప్ప. ఆయన వేంచేసినందువల్ల ఈ పర్వత ఔన్నత్యానికి విలువ వచ్చింది, కొత్త అర్థమూ వచ్చింది. ఆధ్యాత్మిక యోగ సాధనతో ఉన్నత స్థితికి చేరుకొని, శ్రీమంతుడైన భక్తుని హృదయ పీఠమే - శ్రీగిరి. దాని ప్రభువే పరమాత్మ.
‘శ్రీ’ అంటే పంచేంద్రియాలు. కన్ను చెవి ముక్కు నోరు మనస్సు. పరమాత్ముని క్షేత్రాలను విశేషాలను ఉత్సవములను చూడగలిగిన సంపద కన్ను. భగవంతుని మహిమలను వినే సంపద చెవి. ఆయనకు అర్పించిన సుగంధాన్ని ఆఘ్రాణించే సంపద ముక్కు. పరమాత్ముని గుణాలను గానం చేసే సంపద నోరు. ఆయన తత్త్వాన్ని నిరంతరం చింతించే సంపద మనస్సు. ఈ ఐదు సంపదలు మానవ దేహంలో శిరోభాగంలో ఉన్నాయి. ఈ సంపదల్ని మోస్తున్న పర్వతం, మన దేహం యొక్క పైభాగం - శిరస్సు. అక్కడున్న సహస్రార చక్రంలో శయనించిన నారాయణుడే - శ్రీగిరీశుడు. ఆయన వేంకటేశుడు. ‘వ’కారం జ్ఞాన శక్తి వాచకం, ‘ఇ’ కారం ఇచ్ఛాశక్తి వాచకం. ‘కట’ అంటే ప్రకటమయ్యేది, కురిపించేది అని అర్థం. మనలో జ్ఞాన ఇచ్ఛా శక్తులను నిండుగా ప్రవహింపజేసి, మనలో నిద్రించిన శక్తిని ప్రకటం చేసి, ఉద్ధరించే స్వామి శ్రీగిరి శిఖరవాసి వేంకటేశుడు. మన యిష్టార్థాలను ఈడేర్చే ఈశుడు - వేంకటేశుడు.
సమస్త పాపాలను పరిహరించేవాడు వేంకటేశుడు. ‘అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః’ అన్నాడు గదా గీతాచార్యుడు.
తిరుచానూర్, అలమేలు మంగ, పద్మావతి అంటే ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? తిరు అంటే శ్రీ, చాన్ అంటే దేవి, తిరుచానంటే ‘శ్రీదేవి’. ఆవిడ అలమేలు మంగ కూడా. అలరంటే పద్మం. మేర్ అంటే మీద. పద్మం మీద నివసించే మంగై అంటే మాత - పద్మాలయ అయిన దేవి - పద్మావతి. పారమేశ్వరమైన శక్తికి నిలయాలు పద్మాలు. తల్లి పద్మాలయ, అలర్మేల్మంగా. ఈ పద్మాలేమిటి? పద్మాలేవోగావు, మన శరీరంలోని మూలాధారాది షట్చక్రాలు. అవేషట్కమలాలు. వాటిలో విహరిస్తుందా శక్తి. అంత్యంలో సప్తమ చక్రమైన సహస్రారంలో తనకాశ్రయమైన పరమాత్మతో వేంకటేశునితో ఏకమవుతుంది.
ఇదిగో, ఈ ఆధ్యాత్మికమైన భావానికి బాహ్యంగా కనిపించేవి ఈ ఏడుకొండలు. వృషభాద్రి నుంచి వేంకటాద్రి దాకా వ్యాపించిన సప్తగిరులూ సప్త చక్రాలే. ఒక్కొక్క కొండ ఎక్కిపోతున్నామంటే ఒక్కొక్క చక్రాన్ని దాటి వెడుతున్నాం. మూలాధారం. స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను లేక పద్మాలను దాటి చివరిదైన సహస్రార చక్రం చేరేసరికి వేంకటేశ్వర స్వామి సన్నిధి చేరుకుంటున్నాం. అదే ఆనంద నిలయం. కుండలినీ శక్తి సుషుమ్నానాడి ద్వారా ఆరు చక్రములు దాటి చంద్ర మండలమైన సహస్రారాన్ని చేరగానే అమృతధారలు వర్షిస్తాయి. జ్ఞాన జ్యోతి ద్యోతకమవుతుంది. అలాగే భక్తుడు ఆరు కొండలు దాటి ఏడవ కొండ చేరుకుని, ఆనంద నిలయంలో అమృతమయమైన స్వామిని దర్శించి ఆత్మానందానుభూతిని పొందుతాడు. ఇది అమృతవర్షం.
విభేదాలెందుకు మీకు, నా పాదాలాశ్రయించండి - అవే మీకు పరతత్త్వాన్ని తెలుపుతాయని చేతితో చూపెడుతున్నాడు, స్మితవదనుడై. మానసికమయిన శరణాగతి ఉండాలేగాని, ఆయన తత్త్వం ఆత్మ తత్త్వంగానే సాక్షాత్కరిస్తుందని అభయమిస్తున్నాడు. శివుడా, విష్ణువా, కమలభవుడా అనే ప్రశ్న వస్తే, అవి మూడూ కాదు, మూడూ కలిసి ‘బ్రహ్మమ్’ ‘పరబ్రహ్మమ్’ పరమ భాగవతుడు త్యాగయ్య స్వామివారిని దర్శించి గానం చేసిన తత్త్వమిదే. ఈ తత్త్వానే్న, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని మూడుసార్లు చెప్తూ అందరికే శ్రీహరే అంతరాత్మ అంటూ తంబూరా మీడుతూ తన్మయత్త్వంతో ‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకం సతివిప్రాబహుదా వదంతి, ఈశావాస్య మిదం సర్వం’ - ఇలా శ్రుతి స్మృతి పురాణాలలో పేర్కొనబడిన విశేషాల్ని, శ్రీగిరీశుడు వేంకటేశుని పరబ్రహ్మ తత్త్వాన్ని విశదపరుస్తూ పదాన్నందించాడు, అన్నమాచార్యుడైన అన్నమయ్య. ఇంకా ఎన్నో పదములలో ఈ భావానే్న వక్కాణించాడు - అన్నమయ్య. ‘సిరి చైతన్యమిల్లా నీ సొమ్మై ఉండగాను - యెరుక వొక్కటే కాక యెవరున్నారీడను’ ‘అంది చూడగ నీకు నవతారమొకటే - ఎందువాడవైతివి యేటిదయ్యా’ వేదాంత నిలయా వివిధాచరణా ఆదిదేవ శ్రీ వేంకటేశ సోధించి తలంచిన చోటనే వుందువ, ఏ దెస నీ మహిమే ఇదేటిదయ్యా’ స్వరూపమొక్కటే తక్కినవన్నీ దాని విభూతులే నంటాడు, ఉన్నదంతా ఒకే శుద్ధ చైతన్యం. దానికి భిన్నంగా సృష్టిలో మరేదీ లేదని పాడుతూ, శ్రీ వేంకటేశుని పరబ్రహ్మ తత్త్వాన్ని చాటి చెప్పాడు తాళ్లపాక అన్నమయ్య.
ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని సగుణంగా, సాకారంగా అర్చించి ఆత్మ తత్త్వాన్ని తెలిసికోటానికి, స్వామి అర్చామూర్తిగా స్వయంభువుగా వెలిసాడు.
బ్రహ్మాండ నాయకుడు
‘ఓ మహర్షీ మీరు వచ్చిన కార్యమేమి’ అని అగస్త్య మహర్షిని కరుణతో అడిగాడట శ్రీమన్నారాయణుడు. దానికి ‘స్వామీ తమ పాదర్శనమే పరమానందం. వేరే కోరికలు లేవు. ఉత్తర దక్షిణాలకు అడ్డంగా మధ్యలో బాగా పెరిగిన వింధ్య పర్వత గర్వమణచడానికి ‘నేను దక్షిణాపథానికి వెడుతున్నాను. మరల తిరిగి కాశీ యేత్రం వచ్చేంతవరకు అణగే ఉండవలసింది’ అని ఆదేశించి వచ్చాడు. మరల ఉత్తరంగా వెళ్లలేదు మహర్షి. అప్పటి నుంచి వింధ్యుడు పెరగకుండా ఉన్నాడని పురాణగాథ. లోక కల్యాణార్థం అగస్త్య మహర్షి గావించిన త్యాగమిది. అందుకే, దక్షిణాపథంలో అగస్త్య మహర్షి కృతంగా స్వయంభువుగా వెలిసినవి, మహర్షి ప్రతిష్ఠించినవి, ఇలా ఎన్నో స్థల పురాణాలతో ఉన్న మహాక్షేత్రాలు ఏర్పడ్డాయి. అటువంటి క్షేత్రములలో తిరుమల కూడా ఒకటి. అగస్త్య మహర్షి ప్రార్థన మేరకు శ్రీమహావిష్ణువు కలియుగ వైకుంఠమైన వేంకటాచలముపై, ‘కలౌ వేంకట నాయకః’ అని కలియుగ దైవమై సాక్షాత్కరించాడు.
బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేనే లేదని, అలాగే ఆ కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి సాటిరాగల దైవం ఇటు భూతకాలంలోను, అటు భవిష్యత్తులోను లేదు. ఉండబోడని, వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాందేనాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి’ అన్నారు.
భక్తప్రియుడు, కోరికలన్నీ తీర్చేవాడు, దర్శిస్తే ముక్కిని ప్రసాదించే కోనేటి రాయడికి, అర్చామూర్తియై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతిరోజూ కళ్యాణోత్సవంతోపాటు సుప్రభాతం తోమాల సేవ, సహస్ర నామార్చన, ఏకాంతసేవ వంటి నిత్యోత్సవాలు, విశేష పూజ, అష్టదశ పాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు; రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్ర ఉత్సవాలతోపాటు ఉగాది ఆస్థానం, పద్మావతీ పరిణయం, జ్యేష్ఠ్భాషేకం, అణివార ఆస్థానం, పవిత్రోత్సవం, కోయిల్ ఆళ్వారు తిరుమంజనం లాంటి బ్రహ్మోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుపబడుతాయి.
బ్రహ్మోత్సవం ఎందుకు.. ఎలా?
వీటన్నిటిలో సంవత్సరాని కొకసారి జరిపే బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి. పది రోజులపాటు జరిపే ఉత్సవం. ‘ఉత్ సూతే హర్షః అనేన ఇతి ఉత్సవః’ మనలో ఉన్న ఆనందాన్ని పైకి వ్యక్తీకరించటాన్ని ఉత్సవం అంటారు. మరి ‘బ్రహ్మోత్సవం’ అని పేరు ఎలా వచ్చింది?
శ్రీ వేంకటేశ్వరుని దర్శించిన బ్రహ్మ ‘సమస్త జీవులకు పరమానందకరమైన నేత్రోత్సవం, దీనిని శాశ్వతంగా బ్రహ్మోత్సవము జరుపటానికి అనుగ్రహాన్ని ప్రసాదించండి’ అని ప్రార్థించాడు. శ్రీగిరీశుని అనుగ్రహానికి పాత్రుడై తాను సంకల్పించిన బ్రహ్మోత్సవ క్రతువును ఆనాడే అంకురార్పణ చేసి ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని చేత ప్రారంభించబడినాయి కనుక బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. శ్రీవారి పాదాలను బ్రహ్మ సేవించి ప్రారంభించినందుకే ‘బ్రహ్మ కడిగిన పాదము’ అని పేరొందింది - బ్రహ్మోత్సవం.
బ్రహ్మోత్సవాలకు ఆ పేరు రావటానికి మరొక ఉదంతం కూడా ప్రమాణంగా చెప్తారు. నవ సంఖ్యకు ‘బ్రహ్మాభిదాఖ్య’ సంఖ్య అని పేరు. ముందు రోజు జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, ముగింపు రోజున జరిగే పుష్పయాగం ఇవి మినహాయించి, మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక వీటికి బ్రహ్మోత్సవాలని ప్రసిద్ధి చెంది, నాటి నుండి నిరాఘాటంగా నిరాటంకంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి.
అంతేగాక, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీగిరీశుడు వేంకటేశుని జరుపబడుతున్న ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలని పేరు కలిగిందని కూడా మరొక అర్థం ప్రసిద్ధిలో ఉంది. ‘బ్రహ్మాండం’గా జరిగే ఉత్సవాలు కనుక ‘బ్రహ్మోత్సవాలు’ అని కూడా పిలువబడుతున్నాయని కూడా చెప్తారు.
బ్రహ్మోత్సవాలను, సూర్యుడు కన్యారాశిలో ఉండగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో కన్యామాసం వస్తుంది. ప్రతి మూడు సంవత్సరాల కొకసారి అధికమాసం, చాంద్రమాన ప్రకారం వస్తుంది. అపుడు భాద్రపదంలో కన్యామాసం వస్తుంది. ఆ సంవత్సరం రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడతాయి. భాద్రపదంలోను, ఆశ్వయుజ మాసంలోనూ జరుపుతారు.
బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం నుంచి ప్రారంభమై ధ్వజ అవరోహణంతో సమాప్తమవుతాయి. ఇది పదిరోజుల ఉత్సవం. వేడుకలు ప్రారంభించటానికి ముందే ఆలయాన్ని పూర్తిగా తప్పక శుద్ధి చేస్తారు. బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారంనాడు స్వామివారి ఆలయాన్ని ముఖ్యంగా పరిమళ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని ‘కోయిల్ ఆళ్వారు తిరుమాజనం’ అనే పేరుతో పెద్దఎత్తున చేస్తారు. విద్యుత్ దీపాలతోను, పూల పందిళ్లతోను, మామిడాకులతోను శుభ కార్యములను సూచించే అరటి స్తంభాలతోనూ శోభాయమానంగా అలంకరిస్తారు.
వాహన సేవల పరమార్థం
ధ్వజారోహణకు ముందు అంకురార్పణ ఉత్సవం జరుగుతుంది. సాయంకాలం. స్వామివారి సేనాపతి అయిన విష్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో వున్న వసంత మండపానికి ఛిత్రచామర మంగళ తూర్యముల పురస్పరంగా తరలివెళ్లి, భూమి పూజ మొదలగు వైదిక కార్యక్రమములు చేసి, మృత్సంగ్రహణం చేసి ప్రదక్షిణంగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు. ఆ రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో బీజావాసం (అంకురార్పణ) జరుగుతుంది.
మరునాటి కార్యక్రమం: ధ్వజారోహణం. గరుడ కేతన ప్రతిష్ఠ, కంకణ ధారణ, బలిహరణ జరుగుతుంది. శ్రీగిరీశుని, శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పరివార దేవతలతో ఊరేగుతూ ఉండగా అష్టదిక్పాలకులను ఆహ్వానపరుస్తారు. స్వామివారి ఆలయ ప్రవేశం చేసి ధ్వజ స్తంభం దగ్గరికి చేరుకుంటారు, మిగిలిన పరివార దేవతలతో వేదస్వస్తి మంగళ వాద్యాలు మోగుతుండగా, శ్రీదేవి భూదేవి సహితుడైన మలయప్ప స్వామి వారి సమక్షంలో అర్చక స్వాములు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. పెసరపప్పు బియ్యంతో చేసిన ముద్గలాన్నాన్ని (పులగం) నివేదిస్తారు. ఆ రాత్రి నుంచే ఊరేగింపులు ప్రారంభమవుతాయి.
పెద్ద శేష వాహనం: ధ్వజారోహణం అయిన తరువాత పెద్ద శేష వాహనంపై ఇద్దరు దేవేరులతో మలయప్ప స్వామిని ఊరేగిస్తారు. ఈ ఆదిశేషుడే భూభారాన్ని వహించేది. వైకుంఠంలో పాలసంద్రంలో స్వామి శేష శయనుడు. ఈ శేషుడే లక్ష్మణుడుగా అవతరించి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చెంత నిలిచాడు. ఈ ఆదిశేషుడే, ఆ శేషాచలం.
మరునాడు వెండి చిన శేష వాహనంలో స్వామివారి ఒక్కరే ఊరేగింపుగా భక్తులకు దర్శనమిస్తారు.
రెండవ రోజు రాత్రి బంగారు హంస వాహనంపై స్వామి వారొక్కరే వీణాపాణి అయి చదువుల తల్లికి, శారదా మాతకు, సరస్వతీ దేవికి ప్రతిరూపంగా భక్త జనావళికి దర్శనమిస్తారు. మనం పీల్చే గాలి వదిలే గాలి - ప్రాణాయామం చేసేటప్పుడు సోహం - హంస శబ్దం వినపడుతుంది. ప్రాణశక్తి. ఇది ఉంటేనే జీవుడు శివం. లేకపోతే శవం. ‘హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హరిసప్తచోదయాత్’ అన్నది మహన్యాసం. గంగానది తన పాపాల్ని పోగొట్టుకోటానికి నల్లని కాకి రూపంలో కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేసి, తెల్లని రాజహంసగా మారి వెడుతుందని ప్రశస్తి. మన మానవ హంసల్ని స్వామి పరం చేస్తే కరుణాళువైన వేంకటేశుడు మనల్ని పరమ హంసలుగా మార్చి, ఆనందమయాకోశంలో ప్రవేశింపజేస్తాడు. ధర్మంతో అర్థకామాల్ని అనుభవింపజేసి, అంత్యంలో మోక్షి పురుషార్థాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞానదేవత సరస్వతి. ‘సరాంసిజలాని సన్తి అస్యాః యితి సరస్వతి’. సరస్వతీదేవి వాహనం హంస. బ్రహ్మదేవుని వాహనం కూడా హంసే.
మూడవ నాటి ఉదయం వేంకటేశ్వర స్వామి వారు ఒక్కరే సింహ వాహనంపై ఊరేగింపబడతాడు. శత్రువులను సంహరించేది సింహం. శౌర్య ధైర్య సాహసములకు ప్రతీక సింహం. ‘మృగాణాంచ మృగేం ద్రోహం’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, భగవద్గీతలో. సంసార ఘోరారణ్యంలో చిక్కుకున్న భక్తుల్ని కాపాడటానికి మద మాత్సర్యా మత్త్భాల్ని అణచే శక్తికి ప్రతీకయే, సింహ వాహనుడైన శ్రీగిరీశుడు వేంకటేశుడు.
మూడవ నాటి రాత్రి, ‘ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి ఉభయ దేవేరులతో కూడి వున్న మలయప్ప స్వామి వారిని ఊరేగిస్తారు. ముత్యమనగానే మనకు జ్ఞాపకం వచ్చే గ్రహం - చంద్రుడు. ‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు’ అని అన్నమయ్య పదానే్న ఇచ్చాడు. మనస్సును హృదయాన్ని, నిర్మలంగా ఉంచుకొని కరుణా సముద్రుడైన శ్రీ వేంకటేశుని సేవిస్తే, ‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ పూర్తి శరణాగతితో ఏడుకొండల శ్రీనివాసుని ఆరాధిస్తే, అర్చిస్తే, ఉపాసిస్తే, పనికిరాని గవ్వ, స్వాతి చినుకు వల్ల ముత్యంగా మారినట్లు, మన జీవితాలు ధన్యమవుతాయని ఈ ముత్యాల పందిరి వాహనం ప్రబోధిస్తోంది.
నాల్గవ నాటి ఉదయమే కల్పవృక్ష వాహనం. శ్రీదేవి భూదేవి ఉభయ దేవేరులతో కూడా శ్రీగిరీశుడు వేంకటేశుడు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ దివ్య దర్శనమిస్తాడు. విత్తనాన్ని నాటి, కాసిని నీళ్లు పోస్తే మొక్కలు మానై, పెద్ద వృక్షమవుతుంది. పుష్పాలనిస్తోంది, ఫలాలనిస్తోంది, నీడనిస్తోంది, వృక్షజాతి. మానవుడు కాసిని నీళ్లు పోసినందుకుగాను, ఈ సమాజానికి దాని రుణాన్ని తీర్చుకుంటోంది. మనిషిని కూడా తమని ఆదర్శంగా తీసికొని సమాజానికి మన వంతు కర్తవ్యాన్ని అందించి, నిస్వార్థ సేవతో కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండమని హితబోధ చేస్తోంది వృక్షజాతి. కల్పవృక్షమంటే ఎక్కడో దేవలోకంలో ఉంటుంది, ఏది కోరితే అది ఇస్తుందని చెప్తారు. అయితే ‘వృక్షో రక్షతి రక్షితః’ వృక్ష సంపదని పెంపొందించండి అవే అనేక విధాలుగా మీ జీవనాన్ని సుసంపన్నం చేస్తాయి. మీ పాలిటి కల్పవృక్షాన్ని నేనే. మీరు కోరుకున్నవి నేను తీరుస్తాను’ అని కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ ఏడుకొండల శ్రీనివాసుడు అభయమిస్తున్నాడు.
నాల్గవ నాటి రాత్రి సర్వభూపాల వాహనం. ఇది ఒక శోభాయమానంగా అలంకరించిన బంగారు మండపం. మండప మధ్యలో శ్రీదేవి భూదేవి దేవేరులతో కూడి, సర్వ జగత్ప్రభువైన శ్రీ వేంకటేశ్వర స్వామి మహారాజ ఠీవితో ఊరేగుతూ దర్శనమిస్తూ భక్తుల కోర్కెలను ప్రసాదిస్తూ అభయమిస్తాడు.
ఐదవ నాటి ఉదయం శ్రీ వేంకటేశుడు, కృతయుగం నాటి మోహినీ అవతారం దాల్చి దంతపు పల్లకి నెక్కి దర్శనమిస్తాడు. అమృత కలశాన్ని చేతితో పట్టుకుంటాడు. ‘న కర్మణా న ప్రజయాధనే న త్యాగేనైకే అమృతతత్వ మానసుః’ అన్నది శ్రుతి. త్యాగ గుణం ఉన్నవారికి అమృతమైన మనస్సు ఉంటుంది. బాహ్య సౌందర్యానికి భ్రమపడి భ్రష్ఠులవకుండా, సర్వాంతర్యామిగా జగదానంద కారకునిగా, పుంసామోహన రూపునిగా దర్శించి, పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలిసికోరే’ అని హితవు పలుకుతూ, నన్ను శరణు వేడండి, మీకు అమృతమయమైన మనస్సును ప్రసాదిస్తానని చెప్తున్నాడు వేంకటాద్రి నిలయుడు.
ఐదవ నాటి రాత్రి జరిగే వాహన సేవ - గరుడోత్సవం. అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. ఆ రోజు మూల విరాట్టుకు అలంకరించే మకర కంఠి లక్ష్మీహారాది శ్రేష్టమైన ఆభరణాలను స్వామివారి ఉత్సవ మూర్తికి అలంకరిస్తారు. ఆ రోజే శ్రీవిల్లిపూత్తూరు నుంచి, గోదాదేవికి అలంకరించిన పూలమాలను తెచ్చి స్వామివారికి అలంకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నూతన పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తమిళనాడులోని మిరాశిదారులు, కాలినడకన, పది రోజులు ముందుగా బయలుదేరి కొత్త గొడుగులను తెచ్చి స్వామికి సమర్పిస్తారు.
గరుత్మండు వేదమయుడు, అప్రతిహత శౌర్యవంతుడు, బలవంతుడు, తల్లికి దాస్య విముక్తి చేసిన ఆదర్శ తనయుడు. శ్రీ వేంకటేశ పరబ్రహ్మను బంగారు గరుడోత్సవంలో దర్శనం సర్వ పాపహరం, సర్వసంపత్కరం సర్వశ్రేయోదాయకం.
ఆరవనాటి ఉదయం స్వామికి హనుమంత వాహనం. హనుమంతుడు ఈశ్వరుని అంశమని పురాణ ప్రసిద్ధి. ‘అంతకారి నీ చెంత చేరి హనుమంతుడై కొలువలేదా’ అన్నాడు త్యాగయ్య. ‘సంస్కార క్రమ సంపన్నా’ అంటూ, హనుమంతుడు మా కులదైవమన్నాడు శ్రీరామచంద్రుడు. సర్వరోగములను హరించి, భయాన్ని పారద్రోలి, గ్రహపీడను తొలగించే అభయప్రదాత ఆంజనేయుడు. ‘పవనజ స్తుతిపాత్ర పావన చరిత్ర’ అని త్యాగయ్య కీర్తించటంలోగల విశేషం. ఆ హనుమంతుని సంపూర్ణ భక్తి భావాన్ని తెలుపుతుంది. సీతాప్రాణ ప్రదాత. మా ఇరువురికి భేదం లేదని చాటుతూ ఊరేగుతూ దర్శనమిస్తాడు - వేంకటాద్రి రాముడు.
ఆ మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారికి వసంతోత్సవం జరుగుతుంది. సాయంత్రం ఉభయ దేవేరుల సమేతంగా మలయప్ప స్వామి స్వర్ణ రథాన్ని అధిరోహించి తిరుమల పురవీధుల్లో వేద పారాయణ, మంగళ వాద్యములతో ఉభయ దేవేరులతో ఊరేగుతాడు. హితము రమ్యము అయినది హిరణ్యం - బంగారం. ‘హిరణ్య వర్ణాం హరిథేయ్ సువర్ణ రజత ప్రజామ్’ అని మహాలక్ష్మిని శ్రీసూక్తంలో అభివర్ణించి స్తుతించారు. అందుకే ‘సువర్ణ రథ రంగడోలోత్సవం’ అని పిలుస్తారు.
ఆరవ నాటి రాత్రి గజ వాహనం. స్వామి గజేంద్రునిపై సంచరిస్తూ దర్శనమిస్తారు. గజేంద్రుడు అహంకారంతో, బల గర్వంతో, ఏండ్ల తరబడి చిన్న మొసలితో పోట్లాడి, చివరకు విధిలేక పూర్తి శరణాగతితో స్వామిని వేడుకొంటే అప్పుడు ఉన్నపళంగా వచ్చి గజేంద్రుణ్ని రక్షించాడు. ఇదే ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి పండుగకు స్ఫూర్తి. భగవదనుగ్రహం తోటే జీవితం చరితార్థత చెందుతుందని, రక్షణ భారమంతా నా మీద ఉంచండి, పురష ప్రయత్నం మీరు చేయండని గజవాహనుడైన శ్రీగిరీశుడు గీతలో చెప్పిన విషయాల్ని ప్రస్ఫుటిస్తున్నాడు.
ఏడవనాటి ఉదయం సూర్యప్రభ వాహనం. రాత్రి చంద్రప్రభ వాహనం. మానవ జీవితానికి మంగళ తోరణం - సూర్యకిరణం. ప్రాణికోటికి ప్రాణాధారం - సూర్యుడు. వేదంలోని తైత్తిరీయ ఆరణ్యకం - అరుణ మంత్రంలో సూర్యుచంద్రుల విశేషాలు, ఆధ్యాత్మికత గోచరమవుతుంది. ‘సూర్య ఆత్మ జగత్ స్తుషశ్చ’ మనమందరం సూర్యుని ఆత్మస్వరూపం
ఎనిమిదవ రోజు రథోత్సవం. ‘రథ్యతే ఇత రథః’ ‘రమంతా అత్ర రథాః ఇతి’ రమణీయత్వము నొందించేది రథం. అందరూ రమిస్తారు కనుక రథమని అర్థం. ‘బ్రహ్మాణం బ్రహ్మ వాహనం’ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి రథోత్సవం. భగవంతునికి ‘బ్రహ్మ’ అని పేరు. కనుక బ్రహ్మాణం బ్రహ్మ వాహనమన్నారు. ఎన్ని వాహన సేవలు జరిగినా, రథోత్సవం అన్నిటికీ మకుటాయమానం. యజ్ఞము కూడా రథమే. రథోత్సవమంటే యజ్ఞ కార్య ముగింపు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామిని రథోత్సవంలో దర్శించిన వారి జీవితం ధన్యం. ఆనాటి రాత్రి అశ్వ వాహనం. అశ్వనీ దేవతలు ఆరోగ్యాన్ని, పుష్టిని ఇస్తారు. ‘జ్ఞానానందమయం దేవం..’ హయగ్రీవుడు విద్యకు జ్ఞాన ప్రదాత. ఇంద్రియాలు గుర్రాలు. వాటిని, శిరస్త్రాణ్ని దాల్చి చేత ఖడ్గంపూని అశ్వంపై వచ్చే శ్రీ వేంకటేశ్వర స్వామి, మనల్ని జితేంద్రియులుగా చేస్తాడు.
తొమ్మిదవ నాటి ఉదయం చక్రస్నానం. శుభప్రదమైన దర్శనం చేత మోక్షాన్ని ప్రసాదించే స్వామి సుదర్శనుడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేది సుదర్శనం. ఆ సుదర్శన చక్రాయుధాన్ని ధరించిన స్వామే మనకు రక్షకుడు. పుష్కరిణిలో సుదర్శన చక్రానికి అవభృద స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
సాకారంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. సర్వదేవతా స్వరూపుడు. ఆయనే నిరాకార నిరంజన తత్త్వంతో పరబ్రహ్మ. అందుకే పరబ్రహ్మకు బ్రహ్మోత్సవాలు. భక్తితో శ్రీవారి బ్రహ్మోత్సవ శోభను తిలకించి తరిద్దాం.

-పసుమర్తి కామేశ్వరశర్మ