S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మలుపులు-మెలికలు

జీవితంలో మంచి రోజులతోపాటు దుర్దినాలు అందరికీ వస్తాయి. ఆరోగ్యంతోపాటు అనారోగ్య సమస్యలు అందరినీ బాధిస్తాయి. అందులో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అనుకోని భయాలు, పేదరికం, నిస్సహాయత ఇట్లా ఎన్నో, చాలామందిని వేటాడుతుంటాయి. ప్రపంచంలోని సమస్యలన్నీ తమకే వచ్చినట్టుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. సమస్యలు అందరికీ ఉంటాయి. కొందరివి బహిర్గతమవుతాయి. మరి కొందరివి కావు.
సూర్యుడు అందర్నీ ఒకే విధంగా చూస్తాడు. ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి ఒకే విధమైన ఎండని ప్రసాదిస్తాడు. వరుణ దేవుడు అంతే. ఆయనకి నువ్వూ నేనూ అన్న భేదం లేదు. ఒక ప్రాంతంలో వున్న వ్యక్తులకి ఒకే రకమైన వర్షాన్ని ఇస్తాడు. జీవితం అలాంటిదే. అందరి పట్ల ఒకేలా ఉంటుంది. నూరు శాతం సుఖాన్ని సంతోషాన్ని ఎవరికి ఇవ్వదు. అది సృష్టి నియమం కూడా. ఈ విషయం అర్థం చేసుకుంటే చాలా విషయాలు అర్థమవుతాయి.
చీకటి వెలుతురు ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. నవ్వు, దుఃఖం పక్కపక్కన ప్రయాణం చేస్తాయి.
చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలించకపోవచ్చు.
మనం ప్రయాణం చేస్తున్న రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండొచ్చు.
నడవడం చాలా కష్టంగా ఉండవచ్చు.
చేతిలో డబ్బులు చాలా తక్కువగా ఉండొచ్చు.
అప్పులు ఎక్కువగా ఉండొచ్చు.
నవ్వుదామని ప్రయత్నించగా నిట్టూర్పే రావొచ్చు.
నిటారుగా ఉండాల్సిన సమయంలో మనం వంగి వుండాల్సి రావొచ్చు.
కాస్త జాగ్రత్తగా ఉండాలి తప్ప జీవితాన్ని త్యజించకూడదు.
జీవితం అంటేనే మలుపులు.
ఊహకందని మెలికలు.
అయినా నిలదొక్కుకోవాలి.
నిలదొక్కుకుని నడిచిన వాడే విజయం సాధిస్తాడు.
నిలదొక్కుకోవడంలో మన మీద మరో దెబ్బ మీద పడవచ్చు.
అయినా త్యజించకూడదు.
జీవితంలో పురోగతి చెందాలంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో అవి చేస్తూనే ఉండాలి. అయితే శక్తికి మించి ఏదీ చేయకూడదు. జీవితం కష్టమైనది కాదు అది సుఖమైనది కాదు. సులువైనది కాదు. కానీ సులువైనదిగా మనం భావించాలి. అప్పుడు సులువుగా అన్పిస్తుంది. కష్టతరమైనది అనుకుంటే అది కష్టంగా అన్పిస్తుంది. కష్టమన్న విషయాన్ని మన మనస్సు నుంచి తొలగించాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలం.
మంచి జీవితం కోసం ప్రయత్నం చేయాలి. అయితే జీవితంలో వచ్చినవి వచ్చినట్టుగా స్వీకరించాలి. అన్నీ మన మంచి కోసమే అని చెబుతారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ స్వీకరించడం తప్ప మరోదారి లేదు మనకి.
ఎన్ని కష్టాలు వున్నా జీవితాన్ని త్యజించకూడదు.
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడటం సరైంది కాదు. అదే విధంగా గతంలోకి ప్రయాణం చేయడం కూడా సరైంది కాదు. వర్తమానం గురించి ఆలోచించాలి. వర్తమానంలో నివసించాలి.

-జింబో 94404 83001