S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహా విజేత 24

సౌమ్యనిధీ, దుష్టవిరోధీ అయిన మదనుడు తనకు బావమరదే కాదు - భావి రాజ ప్రముఖులలో ఒకడు.
కాళీమాత కరుణా కటాక్షాలతో వీరిని పునరుజ్జీవింప చేయవలసిన ఆవశ్యకత ఉంది అనుకున్నాడు.
కృతనిశ్చయుడై లేచాడు.
ఆలయ ప్రాంగణంలోని నూతి దగ్గరకు వెళ్లి, వలసిన రీతిలో స్నానం చేశాడు. నారాయణ స్తోత్రం చేస్తూ, ఆలయ ప్రవేశం చేశాడు. మహాకాళీ స్తోత్రం పఠించాడు. అర్థనిమీలిత నేత్రుడై హారంలోని విష్ణుశిలని తీసి ఫాలభాగాన్ని స్పృశించాడు.
తన వాంఛితాన్ని చెప్పుకున్నాడు.
అందరూ ఇతని చర్యలను గమనించి వౌనంగా చూస్తున్నారు.
ఇంతలో - ఒక అద్భుతం జరిగింది. ఒక ఇంద్రజాల మహత్వం ప్రత్యక్షీకరించబడింది.
ఎలా అనేది ఎవరికీ తెలియదు కానీ, ఆ అద్భుతం అందరినీ ఆనంద సంభ్రమాల్లో ముంచింది.
నిద్ర మేల్కొని లేచినట్లు లేచారు - దుష్టబుద్ధీ, మదనుడూ!
ఆశ్చర్యం! ‘జయహో చంద్రహాస!’ ధ్వానాల్లో దిక్కులు మార్మోగాయి. చంద్రహాసుని పరోపకార పరాయణత్వానికి ప్రజలు జయహారతులిస్తున్నారు.
దుష్టబుద్ధీ, మదనుడూ చేతులు జోడించి కృతజ్ఞతా భారంతో చంద్రహాసుని ముందుకు వచ్చారు. ఆదరణపూర్వకంగా వారిని దగ్గరకు తీసుకున్నాడు చంద్రహాసుడు.
తన భర్త ఔదార్యానికీ, శిఖరం లాంటి వ్యక్తిత్వానికీ ఆరాధనా భావంతో మనసులోనే ‘జయహో’ అనుకున్నది విషయ.
‘ఈ మహనీయుడికి గల మానవత్వం శ్లాఘనీయమైనది. విశ్వప్రేమికుడుగా ఈయన ధన్యజీవి’ అనుకుని మధుర భావనలతో ఉప్పొంగింది చంపకమాలిని మనస్సు.
ప్రాంగణమంతా ఇప్పుడు హర్షం కురుస్తోంది!
68
ఈ శుభ వర్తమానాలన్నీ కళింద్ర చేరాయి.
కుళిందకుడూ, మేధావినీదేవీ, పరివారం - అంతా కుంతల చేరారు.
చంపకమాలినీ - చంద్రహాసుల వివాహం మహావైభవంగా జరిగింది.
విరజా - అక్షయులకూ, పద్మినీ - మదనులకూ, దుర్గీ - వజ్రసేనులకూ బ్రహ్మానందభరితంగా - కన్నులపండువగా వివాహాలు జరిగాయి.
చంద్రహాసుని కుంతల రాజ్యపట్ట్భాషేకం - దశదిశల్నీ తేజోమయం చేసింది!
69
చంద్రహాసునికి విషయ వలన మకరాక్షుడూ, చంపకమాలిని వలన పద్మాక్షుడూ అనే కుమారులు కలిగారు.
సామంత రాజ్యాలతో సహా కుంతల మహాసామ్రాజ్య పాలనమంతా ప్రజారంజకంగా సాగిపోతోంది.
కాలచక్రభ్రమణంలో సంవత్సరాలు తిరుగుతున్నాయి.
మకరాక్ష, పద్మాక్షులు యువకులై సకల విద్యాప్రవీణులైనారు. చంద్రహాసునికి వారిప్పుడు రెండు కుడిభుజాలు!
70
ఉత్తర భారతంలో కౌరవ పాండవుల ఏలుబడి సాగుతోంది.
వ్యాసశ్రీకృష్ణులు పాండవులను అశ్వమేథ యాగోన్ముఖుల్ని చేశారు.
ధర్మరాజు యజ్ఞాశ్వ రక్షణకు అర్జునుని నియోగించి, విధివిధాయకంగా యాగాశ్వాన్ని రాజ్యాలన్నీ తిరగడానికి విడిచాడు.
యాగాశ్వం దేశదేశాల పర్యటన ప్రారంభించింది.
త్రిగర్త, సింధు, గాంధార దేశాలకు వెళ్లింది అశ్వం! తర్వాత - నకులధ్వజ, సుచిత్ర, తామ్రకేతు, వీరవర్మ వంటి దేశాధీశుల్ని జయించి ముందుకు వెళ్లాడు అర్జునుడు.
అశ్వం కుంతలపురం వచ్చింది. మకరాక్ష, పద్మాక్షులు యాగ హయాన్ని పట్టి తెచ్చి తండ్రి సముఖంలో నిలిపారు.
ఆ సమయానికి శ్రీకృష్ణుడూ, అర్జునుడూ అక్కడికి వచ్చారు. చంద్రహాసుడు భక్త్యనురాగంతో వారిని స్వాగతించాడు.
శ్రీకృష్ణుడు చంద్రహాసుని ప్రశంసిస్తూ అర్జునునితో చంద్రహాస చరిత్ర చెప్పాడు.
‘చంద్రహాసుడు జ్ఞాన తపో వయోవృద్ధుడుగా కనిపిస్తున్నాడు. కానీ, సమరాంగణంలో ‘దారుణ్యతనుడు’, వరబల శక్తియుతుడు, ‘కృషి ఉంటే మనుషులు ఋషులు కాగలర’న్న కవి వాక్కుకు నిదర్శనం. రాజపుత్రుడుగా జన్మించి, భిక్షకుడై దీనావస్థని అనుభవించాడు. సుజనుల ఆదరంతో పూటలు గడిపాడు. దుష్టబుద్ధి వలన హతుడు కావలసినవాడు, ధైర్య శౌర్యనిధిగా వీరుడైనాడు. వ్యక్తి జీవనోన్నతికి వలసిన గుణ విశేషాలన్నీ స్వయంకృషితో సాధించుకున్నాడు. తాను సాధకుడై ఇతరులకు మార్గదర్శకుడైనాడు’ అని ‘ఒక్కటే మాట- చంద్రహాసుడంటే ఒక మహనీయ మానవుడు. అంతే కాదు.. ఇతడు అవధ్యుడు, జాగ్రత్త’ అన్నాడు.
కిరీటికి కను చెమర్చింది. చంద్రహాసుని డగ్గరించి, కైమోడ్చి ‘మీ సామర్థ్యానికీ, పావనతకూ, మానవతకూ, మహనీయతకూ - నమోస్తు’ అని కౌగిలించాడు.
ఈ ఘట్టం అందర్నీ ఉద్విగ్నతలో ముంచింది.
యాగాశ్వాన్ని నరునకు అందజేశాడు చంద్రహాసుడు.
శ్రీకృష్ణస్తవం చేశాడు చంద్రహాసుడు. మకరాక్ష, పద్మాక్షులూ, విషయా, చంపకమాలినీ కలిసి శ్రుతి కలిపారు.
‘అతి సాధారణ మనిషి కూడా, అసాధారణంగా ఈ భువిపై మహావిజేత కాగలడని నిరూపించిన ధన్యజీవి - మా చంద్రహాసుడు’ అని రొమ్ము విరిచి చెప్పుకుంటున్నాడు కుళిందకుడు!
లోకమంతా ‘అవును - అవును’ అంటున్నది!!

* సమాప్తం *

-విహారి 98480 25600