S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెనె్నల వేడుక

మానవులు తమ నిత్య జీవితంలో ఎప్పుడూ ఆరాటాలు, పోరాటాలతోనే సతమతమవుతూ ఉన్నారు. అటువంటి వారిని ఆదుకుని నిలిచిన వారినే ఆరాధిస్తారు. దైవీశక్తిగా పరిగణిస్తారు. ఆ శక్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తమ జీవితాలలో చీకట్లు తొలగి వెనె్నల కాంతులు విరజిమ్మాలని కాంక్షిస్తారు. అటువంటి వెలుగులు ప్రసాదించేది శరదృతువు.
చంద్రుడు మనస్సుకు అధిపతి. తన వెనె్నల జిలుగుతో ఆహ్లాదం కలిగించే ఋతువు శరదృతువు. ఆశ్వీయుజ, కార్తీక మాసములు శరదృతువు. ఆశ్వీయుజ మాసంలో మనస్సును నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోవడానికి ‘శక్తి’ ఆరాధనావశ్యకతను పూర్వ ఋషులు తెలియజేశారు. జ్యోతిష శాస్త్రం చంద్రుని జగన్మాతగా పేర్కొంది. ఆమె చైతన్య స్వరూపిణి. మూలాధార శక్తి. విశ్వమంతా చిచ్ఛక్తి రూపం. పంచభూతాలలో, నవగ్రహాలలో ఎక్కడ చూసినా శక్తి ప్రదర్శితమవుతుంది. ఆ శక్తి పరమేశ్వరునిది - పుంరూపంలో ప్రకటిస్తే. వాస్తవానికి పరమేశ్వరీ పరమేశ్వరులు అభిన్నులు - ప్రకృతీ పురుషులు అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి.
ఉపాసనా మార్గాలలో కొంత వైవిధ్యమున్నా శక్తి స్వరూపాన్ని మాతృభావనతో ఆరాధించడం శ్రేష్ఠమైనది. భక్తి ప్రపత్తులతో త్రికరణ శుద్ధిగా పూజిస్తే కన్నతల్లిలా వాత్సల్యం, ప్రేమ, కారుణ్యం అనుగ్రహిస్తుంది. పరమాత్మను పరాశక్తిగా భావించి పూజించే విధానాన్ని భారతీయ సంస్కృతి వేదకాలంనాడే అందించింది. భారతీయులకు గల విశిష్ఠ సంప్రదాయమిది. జగన్మాత గుణగణాలు ఉపనిషత్తులు, శ్రీదేవీ భాగవతము, చండీ సప్తశతి, శ్రీ లలితా సహస్రం, సౌందర్య లహరి, ఖడ్గమాలా స్తోత్రం మున్నగు గ్రంథాల్లో చక్కగా వర్ణించి విశదీకరించబడ్డాయి. జగత్కల్యాణం కోసం ఆయా సందర్భాల్లో జగన్మాత అవతరించి రాక్షస సంహారం గావించి ముల్లోకాలను అసురుల బారి నుండి రక్షించింది. మధుకైటభులు, శుంభ నిశుంభులు, చండముండులు, దుర్గముడు, మహిషాసురుడు - వీరంతా మాత చేతిలో మరణించినవారే! అలా దనుజులను రూపుమాపి, దైవీ తత్త్వాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసి మానవత్వం విలువలను పరిమళింప జేసినది జగన్మాతయే!
జగన్మాత నిర్గుణ, నిరాకార, నిరంజన, పరబ్రహ్మం. పుంరూపంలో పరమాత్మ. స్ర్తి రూపంలో పరాశక్తి. వేదకాలం నుంచి జగన్మాత సగుణ, నిర్గుణ స్వరూప స్వభావాలు, పరతత్త్వం, లోక కళ్యాణం కోసం తన సంతానాన్ని రక్షించి, పోషించడానికి మాతృమూర్తిగా ఆమె నిర్వహించిన కార్యకలాపాలు పురాణ గ్రంథాలలో విస్తృతంగా వర్ణించబడ్డాయి. ఈ సందర్భంలో శ్రీ కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని ‘ఉమాసహస్రం’లో ఉటంకించిన మాటలను మననం చేసుకుందాం.
అర్చన కాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా
చిన్తనకాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా॥
జగన్మాత పూజా సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, తత్త్వ విచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది. అంతేకాదు-
బ్రహ్మ ముఖాబ్జే వాగ్వనితా వక్షసి విష్ణోః శ్రీర్లలితా
శంభు శరీరే భాగమితా విశ్వ శరీరే వ్యోమ్ని తతా॥
బ్రహ్మముఖాన సరస్వతిగా, విష్ణు వక్షాన శ్రీలక్ష్మిగా, శంభుని దేహాన అర్ధ్భాగంగా, వివ్వ శరీరునిలో ఆకాశ రూపంలో ఉన్నది పరాశక్తి.
ఇలా నిర్గుణ, సగుణ స్వరూపాలను తెలియజేశారు గణపతిముని. ఆది పరాశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మిక. సృష్టి స్థితి లయకారిణి. ఇచ్ఛ జ్ఞాన క్రియా శక్తి స్వరూపిణి. ఆమెయే మూల ప్రకృతి.
జగన్మాత ఆరాధనను ‘రాత్రి వ్రతం’ అంటారు. రాత్రి దేవియే మహాకాళి. మహాలక్ష్మి, మహా సరస్వతి రూప నామాలతో ఆరాధన లందుకుంటున్నది. ఈ తొమ్మిది రోజులను నవ అహోరాత్ర దీక్షగా పగలు, రాత్రి అనే భేదం లేకుండా పూజిస్తారు. నవరాత్రులుగా పరిగణిస్తారు. ‘నవ’ శబ్దం పరమేశ్వరునికి ప్రతీకగా, ‘రాత్రి’ శబ్దం పరమేశ్వరికి పర్యాయ పదంగా చెప్పబడుతోందని ‘నిర్ణయ సింధువు’ తెలుపుతోంది. ఆ విధంగా నవరాత్రి ఉత్సవాలు పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతి పురుషుల ఆరాధనా వ్రతముగా చెప్పబడుతున్నది.
శరన్నవరాత్రి వ్రతమాచరిస్తే తేజస్సు, శుభము, మంగళప్రదము అయిన జీవితం సమకూరుతాయంటారు. స్ర్తిలకు ఐదవతనము జీవితాంతం ఉంటుందంటారు. ఆ కారణంగా స్ర్తిలు, సర్వ కార్యములలో జయం పొందడానికి స్ర్తిలతోపాటు పురుషులు నవరాత్రి ఉత్సవాలలో జగన్మాతను అర్చిస్తారు.
జగన్మాతకు సహస్రాధికంగా నామాలున్నాయి. ఏ నామం యొక్క ప్రత్యేకత దానిదే! ఆమె మంత్రశక్తి, ప్రాణ శక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగ్వైభవ శక్తి, విజయ శక్తి, ధార్మిక శక్తి - ఇలా ఎనె్నన్నో. అందుకే జగన్మాతను రోజుకొక రూపంలో అర్చిస్తారు.
నవరాత్రులలో జగన్మాతను మొదటి మూడు రోజులు దుర్గాదేవిగా, తరువాత మూడు రోజులు మహాలక్ష్మిగా, చివరి మూడు రోజులు మహా సరస్వతిగా ఆరాధించడం ఒక సంప్రదాయం. పదియవ నాడు అపరాజితగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ఈ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ భక్తుల పాలిట కల్పవల్లి. చల్లని తల్లి.
త్రిమూర్తులతోపాటు సకల దేవతలు జగదంబలో లీనమై ఉంటారు. తల్లి తొమ్మిది రోజులు తొమ్మిది శక్తులుగా అవతరించి ఒక్కోరోజు ఒక్కొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. మిగతా శక్తులన్నీ పరాశక్తికి పరివార దేవతలు. మహేశ్వరి, కౌమారి, వారాహి, మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణి, బ్రాహ్మి, నారసింహ, చాముండి- ఇవి ప్రధాన శక్తులుగా చెప్పబడ్డాయి.
నవరాత్రులలో మొదటి మూడు రోజులు శక్తులైన మహేశ్వరి, కౌమారి, వారాహి పార్వతీదేవి అంశలు. తరువాత మూడు రోజుల శక్తులు - మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణిలు. వీరు మహాలక్ష్మి అంశలు. చివరి మూడు రోజులు బ్రాహ్మీ, నారసింహి, చాముండీ శక్తులు సరస్వతీ అంశలుగా పరిగణిస్తారు. ఇవి ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులకు ప్రతీకలు.
‘సర్వం రూపమరుూదేవి, సర్వం దేవమయం జగతి
అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్‌॥ *

-ఏ.సీతారామారావు