S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

థ్రిల్

ఆ సెడాన్ కారు రోడ్డు పక్కన ఆగింది. లిఫ్ట్ కోసం నిలబడ్డ ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు ఆ కారు డ్రైవర్ దగ్గరికి వెళ్లారు.
‘దయచేసి లిఫ్ట్ ఇస్తారా?’ వారిలో బలంగా ఉన్న పద్దెనిమిదేళ్ల కుర్రాడు అడిగాడు.
‘ఎక్కడికి?’ డ్రైవర్ స్నేహపూర్వకంగా అడిగాడు.

‘ఏడు మైళ్ల దూరంలోని గ్రామానికి డేన్స్‌కి వెళ్తున్నాం’ గడ్డం కూడా సరిగ్గా రాని లేతగా కనిపించే పదిహేడేళ్ళ కుర్రాడు చెప్పాడు.
‘సరే. ఎక్కండి. నా పేరు విలియమ్స్’ డ్రైవర్ చెప్పాడు.
‘నా పేరు బిన్స్’ బలంగా ఉన్న కుర్రాడు చెప్పి కారు ఎక్కి విలియమ్స్ పక్కన కూర్చున్నాడు.
‘నా పేరు జేమ్స్’ వెనకాల సీట్లో కూర్చున్న కుర్రాడు చెప్పాడు.
సూర్యాస్తమయ సమయం అవడంతో అప్పటికే చాలామంది తమ వాహనాల హెడ్‌లైట్స్‌ని ఆన్ చేశారు. చీకట్లు ముసురుకుంటున్నాయి. విలియమ్స్ కూడా కారు హెడ్‌లైట్స్‌ని ఆన్ చేసి చెప్పాడు.
‘చాలామంది పూర్తిగా చీకటి పడేదాకా హెడ్‌లైట్స్ ఆన్ చెయ్యరు. చాలా ప్రమాదాలు ఈ మునిమాపు వేళలోనే జరుగుతూంటాయి’
‘అవును. అది ఎక్కడో నేను చదివాను. ఈ విషయం నేర్చుకున్నావా జేమ్స్?’ ముందు సీట్లోంచి బిన్స్ అడిగాడు.
కొన్ని మైళ్లు వెళ్లే దాకా విలియమ్స్ వారితో మర్యాదగా మాట్లాడుతూంటే, వాళ్లు మాత్రం మొరటుగా జవాబులు చెప్పసాగారు.
కారు ఎతె్తైన పైన్ వృక్షాల మధ్యకి వెళ్లాక బిన్స్ కోరాడు.
‘ఆ మట్టి రోడ్డు పక్కన కారాపు’
‘ఇక్కడ నించి ఊరు దగ్గరా?’ విలియమ్స్ అడిగాడు.
బిన్స్ చేతిలో అకస్మాత్తుగా ఓ కత్తి ప్రత్యక్షమైంది. దాన్ని విలియమ్స్ పక్కటెముకలకి ఆనించి గద్దించాడు.
‘ఆపమన్నానా?’
ఆ కత్తిని గమనించిన విలియమ్స్ వెంటనే చెప్పాడు.
‘సరే. దయచేసి ననే్నం చేయకండి’ కారుని చెట్ల మధ్య రోడ్డుకి ఓ పక్కన ఆపాడు.
‘మీకేం కావాలి?’ వణికే కంఠంతో అడిగాడు.
వాళ్లు జవాబు చెప్పలేదు.
‘మీకీ కారు కావాలా? నేను దిగిపోనా?’
‘కారు మాకు అవసరం లేదు’ బిన్స్ చెప్పాడు.
‘డబ్బా? నా దగ్గర ఎక్కువ లేదు’
‘అదీ నువ్వు ఇవ్వక్కర్లేదు. తర్వాత ఎటూ మేం తీసుకుంటాం’
‘మరి?’
‘థ్రిల్’
‘నాకు అర్థం కాలేదు’ కొద్ది క్షణాల తర్వాత విలియమ్స్ చెప్పాడు.
‘నువ్వు పేపర్లో చదివి ఉంటావు. థ్రిల్ కోసం మా వయసు వాళ్లు వింతగా ప్రవర్తిస్తారు. ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని జేమ్స్, నేను ఓ మనిషిని చంపాలనుకున్నాం. అవునా జేమ్స్?’
వెనక సీట్లోంచి జేమ్స్ జవాబు చెప్పలేదు.
‘నిన్నో ప్రశ్న అడిగాను జేమ్స్. లేక నువ్వు అకస్మాత్తుగా పిరికిపందవి అయ్యావా? థ్రిల్ కోసం ఇతన్ని మనిద్దరం కలిసి చంపబోతున్నాం. ఇంక వెనక్కి వెళ్లేది లేదు’ బిన్స్ కోపంగా అరిచాడు.
‘మీలాంటి యువకులకి డబ్బవసరం ఉంటుంది. నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకుని నన్ను వదిలిపెట్టండి’ విలియమ్స్ అర్థించాడు.
‘జేమ్స్ తండ్రి కోటీశ్వరుడు. ఆయన బాగా ప్రాక్టీస్ ఉన్న లాయర్. ఆయన పేరు..’
‘నోర్ముయ్. మా నాన్నని ఇందులోకి తీసుకురాకు. నన్నీ పీడకలలోకి నువ్వు మాయమాటలు చెప్పి తెచ్చావు’ జేమ్స్ వెనక నించి గట్టిగా వారించాడు.
‘అవును. మాయమాటలు చెప్పాను. నువ్వు నమ్మి ఇందులోకి దిగావు. ఇక వెనక్కి తగ్గేది లేదు. ఇతన్ని మనం చంపకుండా వదిలేస్తే మనం చిక్కుల్లో పడతాం. ఇతనికి మన పేర్లు తెలుసు’
‘నాకు మీ పూర్తి పేర్లు కూడా తెలీదు. నన్ను వదిలేస్తే మీకు నా నించి ఎలాంటి చిక్కులూ ఉండవని హామీ ఇస్తున్నాను’ విలియమ్స్ వెంటనే చెప్పాడు.
‘అంటే నా పూర్తి పేరు బిన్స్ క్లైన్ అని, నా మిత్రుడి పేరు జేమ్స్ ఫెటర్‌మేన్ అని, అతని తండ్రి కార్ల్ ఫెటర్‌మేన్ గొప్ప లాయర్ అని నీకు ఇప్పుడు తెలుసు’
‘ఎందుకు చెప్పావా పేర్లు?’ జేమ్స్ అరిచాడు.
‘నువ్వు పిరికిపందవి కాకూడదని. ఇప్పుడు ఇతనికి మనం ఎవరో తెలుసు కాబట్టి ఇతన్ని వదిలిపెడితే పోలీసులకి మన గురించి చెప్తాడు. కాబట్టి ఇతన్ని చంపడం తప్ప మనకి వేరే దారి లేదు’
‘వద్దు. దయచేసి నన్ను చంపద్దు’ విలియమ్స్ ఏడవసాగాడు.
బిన్స్ గలగలా నవ్వాడు.
‘బతిమాలు. నువ్వు నీ వృద్ధాప్యం చూడటం కోసం బతిమాలు. నేను వినాలనుకున్నది అదే. నిన్ను చంపడానికి కారణం నీ ప్రాణాలని నువ్వు బిచ్చం అడగడం వినాలనే. నిన్ను ముక్కలుగా కోస్తూంటే నువ్వు ఎలా అరుస్తావో వినాలని ఉంది. జేమ్స్. ఎలా చంపుదాం? ఒకేసారి గొంతు కోసా? లేక పొట్టలో గుచ్చి లోపలవి బయటకి లాగా? రెండోదే ఎక్కువ బాధాకరం అనుకుంటా’
జేమ్స్ చేతుల్లో మొహం కప్పుకుని వారి వైపు చూడకుండా చెప్పాడు.
‘నేను ఇందులో భాగం పంచుకోదలచుకోలేదు’
‘నీకు కొంత భాగం ముడుతుంది మిత్రమా. సావనీర్‌గా ఇతని చేతి వేళ్లని కోసి ఇస్తాను. గుడ్‌లక్ ఛార్మ్‌లా జేబులో ఉంచుకో’
‘నువ్వు పిచ్చివాడివి’ జేమ్స్ అరిచాడు.
‘నీ బాల్య మిత్రుడితో మాట్లాడే పద్ధతేనా ఇది?’
‘నా దగ్గర డబ్బుంది. నీకు డబ్బిస్తాను’ విలియమ్స్ గట్టిగా అరిచాడు.
‘అది ఎటూ నాదే అవుతుంది. నీ ప్రాణాలని ఆ నా డబ్బుతో ఎలా కొనుక్కోగలవు? నువ్వు ఇప్పటికే చచ్చినవాడితో సమానం. విన్నావా జేమ్స్? బాధని అనుభవించడం మినహా ఇతను ఇప్పటికే చచ్చాడు’
‘దయచేసి డబ్బు తీసుకోండి’ విలియమ్స్ పదేపదే చెప్పసాగాడు.
‘సరే. సరే. మరణించే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం భావ్యం. నీ డబ్బు నాకు ఇవ్వాలని నీకంత కోరికగా ఉంటే అలాగే ఇవ్వు’
విలియమ్స్ తన కోటు లోపలి జేబులోకి చేతిని పోనించి, ఓ రివాల్వర్‌ని బయటకి తీశాడు. బిన్స్ దాని వంక భయంగా చూస్తూండగా అది మూడుసార్లు పేలింది. అతను పెద్దగా అరిచి సీటు కిందకి జారి పడిపోయాడు. అతని చేతిలోని కత్తి జారిపోయింది. జేమ్స్ పాలిపోయిన మొహంతో పొగలు వచ్చే రివాల్వర్ వంక చూశాడు. అది అతని మొహానికి గురిపెట్టబడి ఉంది.
‘ఇప్పుడు నీ వంతు వచ్చింది. అవునా?’ విలియమ్స్ నవ్వుతూ అడిగాడు.
‘మీకు నన్ను చంపాల్సిన అవసరం లేదు’ జేమ్స్ బాధగా చెప్పాడు.
‘నువ్వు నా కొడుకు వయసు వాడివి. నిన్ను చంపే ఉద్దేశం నాకు లేదు. నీ మిత్రుడు తనని చంపే పరిస్థితికి తెచ్చుకున్నాడు. ఇతను నిన్ను బలవంతంగా తెచ్చాడని నాకు అర్థమైంది. చెడ్డ మిత్రుడి ప్రభావంలో పడ్డ మంచి కుర్రాడివి నువ్వు. అంతే. కాని నువ్వు ఇబ్బందిలో పడ్డావు. నేను ఆత్మరక్షణ కోసం బిన్స్‌ని చంపాను. నువ్వు? నన్ను చంపే బెదిరింపులో సహదోషివి. ఐనా నువ్వంటే నాకు ద్వేషం లేదు. కాబట్టి నువ్వు చిక్కుల్లో పడటం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఓ మిత్రుడి ప్రభావంతో నీ జీవితమే కాక మీ నాన్న వృత్తి కూడా నాశనవౌతుంది. వెంటనే ఈ హత్య గురించి నేను పోలీసులకి ఫిర్యాదు చేయాలి. ఐనా మనం ఓ ఒప్పందానికి రావచ్చు’
‘ఏం ఒప్పందం?’
‘పోలీసులకి నేను నీ జోక్యం కూడా ఇందులో ఉందని చెప్పాల్సిన పనిలేదు. నువ్వు నన్ను బెదిరించనప్పుడు నువ్వు దేనికి ఇబ్బందుల్లో పడటం?’
‘అంటే నా పేరు పోలీసులకి చెప్పరా? థాంక్స్’ జేమ్స్ ఆశగా చెప్పాడు.
‘మీ నాన్నగారు కూడా నాకు ఏభై వేల డాలర్ల విలువగల థాంక్స్ చెప్తారా అన్న దాన్నిబట్టి అది ఆధారపడుతుంది’
‘ఇది బ్లాక్‌మెయిల్’ జేమ్స్ నివ్వెరపోయాడు.
‘కాదు. అర్థం చేసుకో. నేను నీకు ఓ మంచి భవిష్యత్‌ని ఇస్తున్నాను. మీ నాన్నగారికి ఆ డబ్బు పెద్ద మొత్తం కాదు’
‘మా నాన్న ఇవ్వరు’ గొణిగాడు.
విలియమ్స్ కారుని స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి చెప్పాడు.
‘స్టేట్ పోలీస్ బేరక్స్ దగ్గరలోనే ఉంది. జరిగింది వాళ్లకి ఫిర్యాదు చేయాలి’
‘ఆగండి. మా నాన్నగారు ఏమంటారో విందాం. ఆయన లాయర్ కదా?’
‘సరే బాస్. నువ్వు చెప్పినట్లే వింటాను. మీ ఇంటికి దారి చెప్పు’ విలియమ్స్ నవ్వాడు.
కార్ల్ ఫెటర్‌మేన్ ఇల్లు పెద్ద భవంతి. అక్కడ ఒక కారు మాత్రమే ఉండటం చూసి విలియమ్స్ అడిగాడు.
‘మీ ఇంట్లో మీ ఇద్దరే ఉంటున్నారా?’
‘అవును. మా అమ్మ మాతో ఉండదు. మా నాన్నగారు స్టడీరూంలో ఉన్నారు. మీరు హాల్లో కూర్చోండి. జరిగింది నేను ఆయనకి చెప్తాను. ఆయన మీతో మాట్లాడదలచుకుంటే బయటకి వస్తారు’
విలియమ్స్ సోఫాలో కూర్చున్నాడు. జేమ్స్ స్టడీ రూంలోకి వెళ్లాడు. జేమ్స్ తండ్రి కోపంగా అరవడం, జేమ్స్ బతిమిలాడటం అతనికి వినిపించాయి. కొద్దిసేపటికి నిశ్శబ్దం. ఓ నిమిషం తర్వాత జేమ్స్ హాల్లోకి వచ్చి రమ్మన్నట్లుగా విలియమ్స్‌కి సైగ చేశాడు.
‘మిస్టర్ విలియమ్స్. మీరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలుసా?’ కార్ల్ కఠినంగా అడిగాడు.
‘దానికి నేనా పేరు పెట్టను. మీ అబ్బాయి భవిష్యత్‌ని డాలర్లలో, సెంట్లలో కొలవలేరు. పది నిమిషాల నరకయాతన తాలూకు నష్టపరిహారం అంటాను’
‘మా అబ్బాయి భవిష్యత్ వాడి గతంలా కొనసాగితే వాడు జైల్లో కూర్చోవడం ద్వారా వాడికి నేను మేలు చేసిన వాడిని అవుతాను. వీడు నాకు, నా కుటుంబానికి అవమానం. పనికిరాని వెధవ’ కార్ల్ కోపంగా కొడుకుని తిట్టాడు.
జేమ్స్ కళ్లల్లోంచి నీళ్లు కారుతూంటే తల వంచుకుని నేల వంక చూస్తూండిపోయాడు.
‘ఐతే నేను ప్రజల దృష్టిలో ఉండేవాడిని. నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది’
‘అందుకే పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు మీ దగ్గరికి వచ్చింది’ విలియమ్స్ చెప్పాడు.
‘ఏభై వేల డాలర్లని ఇంత తక్కువ సమయంలో నేను ఎక్కడ నించి తేను?’
’టేక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టిన డబ్బు ప్రతీ లాయర్ ఇంట్లో ఉంటుంది’ విలియమ్స్ చెప్పాడు.
‘నా నిజాయితీ మీద నింద వేస్తున్నావా?’ కార్ల్ గర్జించాడు.
‘మిమ్మల్ని నిందించడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఐదు నిమిషాల్లో మీరా డబ్బు ఇవ్వకపోతే పోలీసుస్టేషన్‌కి వెళ్లాలనే నిశ్చయంతో వచ్చాను’
‘మా అబ్బాయి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. మూడు గంటల నించి నాతోనే ఉన్నాడని నేను వాళ్లకి చెప్తాను’ కార్ల్ చెప్పాడు.
‘మీ అబ్బాయి మీతో మాట్లాడటానికి ఇక్కడికి తెచ్చాడని, మీరు ఏభై వేల డాలర్లు ఇస్తానంటే నిరాకరించానని నేను పోలీసులకి చెప్తాను. అది రుజువైనా కాకపోయినా మీ అబ్బాయి దోషి అనే వార్తలో మీ పేరు చోటు చేసుకుంటుంది. అది మీ లాయర్ వృత్తికి మంచిదా? ఆలోచించండి’ విలియమ్స్ హెచ్చరికగా చెప్పాడు.
‘నాన్నా. అతను కోరింది ఇచ్చి పంపుదాం. కోపం మాని ఆలోచించు’ జేమ్స్ కోరాడు.
‘మీ అబ్బాయి వివేకంగా మాట్లాడాడు. మీ పేరు నాశనం కాకపోతే నాకు ఇచ్చే డబ్బుకి ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. కాబట్టి అది ఇచ్చి నన్ను పంపండి’
‘నిన్ను జైలుకి పంపాలని ఉంది కాని పంపలేదు. కాబట్టి...’ కార్ల్ కొడుకు వంక తీవ్రంగా చూస్తూ చెప్పి లోపలికి వెళ్లాడు.
జేమ్స్ తన తండ్రిని అనుసరించాడు. విలియమ్స్ కుర్చీలో కూర్చుని టేబిల్ మీది సిగార్ పెట్టెని తెరచి ఓ హవానా సిగార్ని తీసి వెలిగించాడు. ఖరీదైన లైటర్ని జేబులో వేసుకుని అది చిన్న బోనస్ అనుకున్నాడు. డబ్బున్న కవర్‌తో కార్ల్ తిరిగి వచ్చేసరికి విలియమ్స్ గాల్లోకి పొగ రింగులు వదులుతున్నాడు.
‘ఇది తీసుకుని బయటకు నడు’
విలియమ్స్ డబ్బు లెక్క పెట్టుకుని, చేతిలో పట్టినన్ని సిగార్స్ తీసుకుని బయటకి వచ్చాడు. కారు స్టీరింగ్ వీల్ ముందు కూర్చుని దాన్ని స్టార్ట్ చేశాడు. కారు హైవే మీదకి వచ్చాక చెప్పాడు.
‘ఓకే బిన్స్. నువ్విక లేవచ్చు’
బిన్స్ వెంటనే లేచి సీట్లో కూర్చుని నవ్వుతూ అడిగాడు.
‘కిందంతా మురికిగా ఉంది. ఎప్పుడూ శుభ్రం చేయవా?’
‘ఇప్పుడు కొత్త కారు కొంటాను’
‘ఇచ్చాడన్నమాట. నా వాటా ఇవ్వు’ బిన్స్ ఉత్సాహంగా అడిగాడు.
విలియమ్స్ ఇచ్చిన డబ్బుని లెక్క పెట్టుకుని చెప్పాడు.
‘కార్ల్ పడతాడని నాకు తెలుసు’
‘జేమ్స్ నీకెలా పరిచయం?’
‘స్కూల్లో. డబ్బున్నవాడు. రౌడీలతో స్నేహం చేయడం గొప్పనుకుంటాడు’
‘వాళ్ల ఇంట్లో దొంగిలించడానికి చాలా ఉన్నాయి. దీనికి అనేక రెట్లు మనం సంపాదించచ్చు. కాకపోతే మనం కొంతకాలం ఆగాలి’
‘అవును. మనకి బేంక్‌లో డబ్బున్నట్లే’ బిన్స్ నవ్వాడు.
‘అన్నట్లు ఆ రివాల్వర్ ఇవ్వు’
విలియమ్స్ దాన్ని బిన్స్‌కి ఇచ్చాడు.
‘నువ్వు నన్ను కాల్చిన చోట ఓసారి కారాపు’
‘దేనికి?’
‘నా కత్తి కిటికీలోంచి బయట పడిపోయినట్లుంది’
విలియమ్స్ రోడ్ పక్కన కారాపాక బిన్స్ టార్చ్‌లైట్ తీసుకుని దిగాడు.
బిన్స్ చేతిలోని రివాల్వర్ తనకి గురి పెట్టి ఉండటం చూసి విలియమ్స్ అడిగాడు.
‘ఏమిటిది?’
‘నీకూ, నాకు మధ్య పది అడుగులు ఉండాలి’
‘ఏమిటి నువ్వనేది? నన్ను నకిలీ బుల్లెట్లతో కాలుస్తావా? ఆటలు ఆపి నీ కత్తి కోసం వెతుకు’
‘కత్తి జేమ్స్ దగ్గర ఉంది. దాన్ని ఇప్పుడు వాడు వాళ్ల నాన్న మీద ప్రయోగిస్తున్నాడు’
విలియమ్స్ వెన్నులో చలి.
‘ఏమిటి నువ్వనేది?’
‘మనం వెళ్లేసరికి జేమ్స్ తన తండ్రిని చంపేస్తాడు. నిన్ను చంపాక నీ శవాన్ని అక్కడ స్టడీరూంలో పడేస్తాను. ఆ ఇంట్లో దొంగతనం చేస్తూండగా అడ్డు పడ్డ కార్ల్‌ని నువ్వు చంపావని పోలీసులు అనుకుంటారు. ఇది చూసిన జేమ్స్ నిన్ను కాల్చాడు’
‘నీ రివాల్వర్ జేమ్స్‌కి ఎక్కడిది?’
‘ఇది కార్ల్ రివాల్వర్. పథకం ప్రకారం జేమ్స్ దీన్ని తన తండ్రి బీరువాలోంచి ఉదయం దొంగిలించాడు. కొన్ని నెలలుగా జేమ్స్ తల్లి తన భర్తని చంలనుకుంటోంది. అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాకపోతే పోలీసులు మొదటగా అనుమానించేది ఆమెనే. అందుకని ఈ పథకాన్ని రచించింది’
‘నేను మీకు హైవేలో లిఫ్ట్ ఇవ్వడం కూడా ఆమె పథకమేనా?’
‘అవును. మొదటి మూడే డమీ బుల్లెట్స్. మిగిలిన మూడూ అసలు బుల్లెట్స్’
విలియమ్స్ బిన్స్ వైపు దూకుతూంటే బిన్స్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది. విలియమ్స్ తక్షణం నేలకూలాడు. బిన్స్ అతని జేబులోని డబ్బుని తీసుకుని, శరీరాన్ని ప్లాస్టిక్ సంచీలోకి తోసి, దానికి ముడి వేసి కారెక్కించి, కార్ల్ ఇంటి వైపు కారుని పోనించాడు.
‘అంతా పథకం ప్రకారమే జరిగిందా?’ జేమ్స్ ప్రశ్నించాడు.
‘ఆ’
ఇద్దరూ కలిసి విలియమ్స్ శవాన్ని స్టడీరూంలోకి తీసుకెళ్లారు. సంచీలోంచి బయటకి తీసి విలియమ్స్ శవాన్ని సరైన పొజిషన్‌లో పడేశారు. కార్ల్ శవం కుర్చీలోంచి సగం నేల మీదకి పడి ఉంది. కత్తి హేండిల్ మెరుస్తూ ఆయన ఛాతీలోంచి కనపడుతోంది.
ఓసారి ఇద్దరూ అక్కడి దృశ్యాన్ని తామేమైనా తప్పు చేసామా అని పరిశీలించి చూసి తృప్తిపడ్డాక జేమ్స్ కోరాడు.
‘రివాల్వర్ ఇవ్వు. దాన్ని మా నాన్న చేతిలో ఉంచాలి’
‘నాకు ఇంకాస్త డబ్బిస్తావా?’ బిన్స్ ఆశగా అడిగాడు.
తక్షణం బదులుగా జేమ్స్ చేతిలోని రివాల్వర్ పేలింది. బిన్స్ తక్షణం మోకాళ్ల మీద పడిపోయి రెండు చేతులతో పొట్టని అదుముకుంటూ ఆశ్చర్యంగా చెప్పాడు.
‘నువ్వు నన్ను కాల్చావు?’
‘అవును. అంత డబ్బుతో నీలాంటి వాడు బార్లోకి వెళ్లడం నాకు మంచిది కాదు. తప్ప తాగి ఏం వాగుతావో నాకు తెలుసు. అదీగాక సాక్షులు జీవించకూడదు’
బిన్స్ ప్రాణం పోయిందని రూఢీ చేసుకున్నాక ఆ రివాల్వర్‌ని శుభ్రంగా తుడిచి దాన్ని తండ్రి చేతిలో ఉంచి, వేలి ముద్రలు పడ్డాక కిందకి జారవిడిచాడు.
తర్వాత కళ్ల వెంట నీరు కారుతూంటే పోలీసులకి ఫోన్ చేయడానికి బల్ల మీది రిసీవర్‌ని అందుకున్నాడు.

(బ్రౌస్ హన్స్‌బెర్గర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి