S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కవిత గాలి

ఒక విషయాన్ని ఎత్తుకుంటే, దాని గురించి ఎంత దూరమయినా రాయవచ్చు ననిపిస్తుంది. కానీ, ప్రపంచంలో ప్రతి పనికి పరిధులు కూడా ఉండాలి. ఉంటేనే మేలు. విషయాన్ని ఇంకొకసారి ఎత్తుకోవడానికి అవకాశం మిగులుతుంది. సంగీతం నాకిష్టం. కనుక అది అందరికీ ఇష్టం అనుకుంటే తప్పు. కవిత కూడా నాకు నచ్చుతుంది. ఒకనాడు గాలిలో పాట తేలియాడుతుంది. మరొకనాడు కథ, ఇంకొకనాడు కవిత. ఆ మరునాడు ఒక గీత, అంటే బొమ్మ. రాత, గీత, కూత అని అందుకే నేను తరుచుగా అంటూ ఉంటాను. ఇవాళ కనీసం ఈ రాత సమయానికి కవిత గాలిలో తేలియాడుతున్నట్టుంది. ‘పల్లె ఒడిని పెరిగాను. బతుకు మీద ఆశలు మరిగి, పక్కకెలా జరిగాను?’ అంటుంది కవిత. పత్రికల వారికి పంపేటప్పుడు చెప్పినట్టి, ఇక్కడ కూడా చెపుతున్నాను. ఈ కవిత పూర్తిగా నా స్వంతం. దేనికీ అనుకరణ, అనువాదం కాదు. చిత్రంగా, నిజంగానే నేను దీన్ని మరే పత్రికకు పంపలేదు. నేను అప్పుడప్పుడు కథ, కవిత రాస్తాను గాని పత్రికలకు పంపను.
కవితలో మూడు పాదాలున్నాయని పాఠక మిత్రులు గుర్తించే ఉంటారు. మధ్యలో పాదం లేకుండా ‘పల్లె ఒడిని పెరిగాను. పక్కకెలా జరిగాను’ అంటే కూడా బాగానే ఉంటుంది. ఇలాంటిదే ఇంకొక కవిత ‘మాటల పందిరి కింద, మల్లెలుండవేమో గానీ, అబద్ధాలు దొరుకును వంద’ మొదటి, మూడవ పాదాల చివరలలో ‘ప్రాస’ పద్ధతి మాటలను కూడా చదువరులు గమనించి ఉంటారు.
జపాను వారికి హైకూ ఉంది. (హైదరాబాదీ భాషలో కైకూ అంటే ఎందుకు? అని అర్థం. కానీ ఈ కైకూ అనే మాట హిందీలో గానీ, ఉరుదూలో గాని లేదు. కాహీకో లేదా క్యౌఁ తో అనే మాటలున్నాయి. అప్రస్తుతమును ఆపక తప్పదు) ఎన్.గోపి నానీలు తయారుచేశాడు. వాళ్ల గురువుగారు ప్రపంచ పదులు రాశారు. నేను ఈ త్రిపదలను రాశాను. చెవులు పట్టుకుని చెపుతున్నాను. నేను వీటిని, ఈ పద్ధతిని కొత్తగా సృష్టించలేదు. కొలంబస్ అమెరికాను కనుగొనలేదు. అప్పటికే అమెరికా ఉంది. ఇతను వెళ్లి చూచి, తిరిగి వచ్చి, అది ఉందని, అందరికీ చెప్పాడు. అంతే. అదే పద్ధతిలో నేను కూడా ఈ త్రిపద పద్ధతిని పంజాబీ జానపదం నుంచి ఉర్దూ ద్వారా అరువు తెచ్చి ప్రయోగించాను. అంతే. (అప్రస్తుతాలు, హరికథలో పిట్టకథల వంటివి. కనుక చెప్పి తీరాలి. ‘ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది?’ ప్రశ్న! ‘చాలా నాళ్ల నుంచి చూస్తున్నాననండీ, ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉంది. ఉంటుంది’ జవాబు! ఎందుకు గుర్తు వచ్చిందో మరి!)
పంజాబీ జానపదం పాటల్లో ఈ పద్ధతిని ‘మాహియా’ అంటారు. డప్పు మీద దరువు వేస్తూ, ఒక పద్ధతిలో వీటిని పాడుతుంటారు. గాయకుడు మొదటి పాదం అప్పజెపుతాడు. రెండు మూడు తాటింపులు మాత్రం వేసి ఊరుకుంటాడు. డప్పుగల గొప్పాయన ఇక రెండవ పాదాన్ని ‘రెండో, అనవచ్చా? వచ్చు! రొండో అనకుంటే చాలు! అనవచ్చా అంటే అనడం వీలవుతుందా? అనుకోవచ్చు. ఎందుకు రాదు? లక్షణంగా అనావచ్చు. వినావచ్చు. అవేవో కథల్లో లాగ అప్రస్తుతంలో మరొక (మరో!) అప్రస్తుతం. ‘అబద్ధాలు ఆడరాదు!’ సలహా. ‘ఎందుకు రాదూ? నాకు లక్షణంగా వచ్చు!’ జవాబు! ఆడకూడదు (గూడదు) అంటే వేరే సంగతి! ఛస్! ఇక చాలు!) గాయకుల వారు, గాయకులుంగారు రాగం తీసి మరీ పాడతారు. అప్పుడిక డప్పుగల గొప్ప మనిషి, ఉద్రేకంగా ఒక వరుస వాయించి ఒక్కసారిగా ఆగిపోతాడు. సస్పెన్స్ విడిపోయిందీ అన్నట్టు గాయకుడు మూడవ పాదం మరింత బాగా పాడతాడు. అది పేలుతుంది. ఢామ్మనదు. అన్నంత పని చేస్తుంది. ఇక డప్పు దరువు సంతోషంగా కొంతసేపు సాగుతుంది.
ఈ తతంగం ఒక పెద్దాయన గమనించాడు. ఆయనగారు స్వతహాగా కవీంద్రుడు. కనుక పుస్తకానికి సరిపడా మాహియాలు అల్లి అచ్చొత్తించాడు. అందులో ఒక కాపీ మా దోస్త్ అనగా నేస్తం దానిష్‌కు అందింది. చదివి సంతోషిస్తానని అతను నాకిచ్చాడు. దానిష్ అనే మాటకు ‘తెలివిగలవాడు’ అని అర్థం. మా దానిష్ నిజంగా తెలివిగలవాడు. గొప్ప నాటకాలు రాసి గొప్ప పేరు సంపాయించుకుంటున్నాడు. ఇంతకూ సంగతేమిటంటే, పుస్తకం నా దగ్గర ఉంది. దానిష్ దిల్లీ వెళ్లిపోయాడు. ఇదంతా దశాబ్దాల నాటి మాట. మాహియాలు మాత్రం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మరొక్కటి మాసరాకు (నమూనా కూడా ఉర్దూ మాటే. శాంపిల్ అంటే ఇంగ్లీషు. మరి తెలుగేమిటబ్బా!) కానున్నది కాక మానదు. ఎదిరిస్తే గాలి నిలవదు. రేపన్నది రాక మానదు’
మాహియాలను గురించి చెప్పి, మరీ బోర్ కొట్టిస్తే బాగుండదు కదా! అందరికీ అందే సంగతులను గురించి చెప్పడం ఒక దారి. అన్ని సంగతులను, అందరికీ అందే రకంగా చెప్పడం మరొకదారి. గాలిలో కవిత్వం తిరుగుతున్నది గనుక అందులోనే గడిపేస్తే సరి!
హజ్రత్ అమీర్ ఖుస్రో అని ఒక మహానుభావుడు 1253-1325 మధ్య బతికాడు. ఆయనకు ‘తుతియె హింద్’ (భారతదేశపు చిలుక) అని బిరుదు నామం ఉండేది. ఆయన పనులు, రచనలు, పేరు ఈనాటికీ సలక్షణంగా ఉన్నాయి. భారతీయ శాస్ర్తియ సంగీతాన్ని ఒక దారిలో పెట్టిన గురువు ఆయన. ఖయాల్ పాట పద్ధతి, తబలా, సితార్, ఖవ్వాలీ లాంటివన్నీ ఆయన కనుగొని అందించినవే. (అవి అంతకు ముందు లేవని మనవి!) సూఫీ తత్వం, అందుకు తగిన ఖవ్వాలీ పాట, అంతెందుకు ఖుస్రో ప్రయత్నాలలో ప్రతి అంశం గురించి ఒక పుస్తకం రాయవచ్చు. అప్పట్లో దిల్లీ ప్రాంతంలో మాట్లాడుకునే హిందవీ అనే భాషలో ఆయన కవితలు అల్లి అందించాడు. ఉర్దూ ఆ భాష నుంచే పుట్టింది (అనవచ్చు.)
అమీర్ ఖుస్రో, ఒకానొక కవితలో సంగీతానికి, కవితకు గల తేడా గురించి చెపుతాడు. చెప్పమని ఎవరో అడిగినట్లు కవిత మొదలవుతుంది. ‘నాకు రెంటిలోనూ అనుభవం ఉంది. కనుక జవాబు నేను చెపితేనే బాగుంటుంది అంటాడు మన కవి. ‘కవితకు స్వరాలతో పనిలేదు. మనిషి గొంతుక అనే స్వరంతోనూ పనిలేదు. ఏ శృతిలో పాడినా దాని అర్థం చెడదు. మారిపోదు. కనుక అది ఒక సంపూర్ణ విజ్ఞానము’ అంటాడు ఖుస్రో.
‘నోటికి అందిన మాటలను కలిపి పాడితే, అది పాట కాదు గదా! అర్థం రాదు గదా! బాసురీ వాయించినా అందులో కళాకారునికీ, విన్నవారికీ మాటలు వినిపిస్తాయి.’ అంటాడాయన. కవిత పెళ్లికూతురు. పాట ఆమె ధరించిన ఆభరణం. అందమయిన పెళ్లికూతురికి ఆభరణాలు లేకుంటే ఏమి? ‘ఈ తేడా తెలిసినవాడు మనిషి. తెలియకుంటే నన్ను అడగాలి. అడగకుంటే వాడు గాడిద’ అంటూ ఆ గీతం ముగుస్తుంది. దాన్ని మాటకు మాటగా తెనుగు, తెలుంగు, అను తెలుగు (టెల్గూ?) చేసి చెప్పడానికి ఇక్కడ కుదరదు. కనీసం కుదరలేదు.
‘కోరికలు కోట్లుగ ఉన్నయ్. కానున్నది ఎవరికి తెలుసు? ఆశలు పలు మెట్లుగ ఉన్నయ్’ మరో మాహియాతో ముగిద్దాం!

కె.బి. గోపాలం