S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవీం శరణం గచ్ఛామి

శరదృతువు ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మిక శోభను కూడా సంతరించుకున్న ఋతువు. ‘జీవేన శరదశ్శతం’ అనడం ద్వారా శరత్తులను చూడడం కూడా ఒక విశేషమే. శరదృతువులోని అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు గల నవరాత్రులను శరన్నవరాత్రులని, దేవీ నవరాత్రులనీ అంటారు. దేవీ నవరాత్రులలో శక్తి ఆరాధన ప్రధానమైనది. జగద్వాపకమైన శక్తి వివిధ నామాలతో, వివిధ రూపాలతో ఆరాధింపబడుతున్నది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధ్ధిత్రి అని నవదుర్గల రూపంలో, బాలాత్రిపుర సుందరి, లలితాదేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మీదేవి, దుర్గ, మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరీ రూపాలలోను అమ్మవారు పూజింపబడుతున్నది. కార్యసిద్ధికైనా విజయప్రాప్తికైనా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. విజయ, విజయలక్ష్మి కూడా అమ్మవారి స్వరూపాలే. అమ్మవారికి ఎందులోనూ ఎదురులేదు. పరాజయమన్నది ఎరుగదు. తాను నిర్వర్తించే సృష్టి స్థితి లయ కార్యాలలోను, తాను నిర్వహించే యుద్ధాలలోను జయమే కానీ అపజయమే లేదు. అందువల్ల ఆమె అపరాజిత అయింది. విజయ అయింది. రాక్షస సంహారానంతరం విజయగా కీర్తించబడింది. అందుకే నవరాత్రులలోని చివరి రోజు విజయానికి గుర్తుగా, విజయ అనే నామానికి సంకేతంగా విజయదశమిగా పిలువబడుతున్నది. విజయదశమి నాడు సాయం సమయంలో విజయోత్సవం జరపడం ఆచారమైంది. సంకల్పం సాకారం కావాలంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు అధిదేవత అయిన జగన్మాతను ఆరాధించవలసిందే. ‘శుక్రవార పూజ నవరాత్రులలో కొలువై వుండగా చూడగా అడిగిన వారికి అభయమిచ్చే తల్లి’ అట ఆ జగన్మాత. అంతటి అపార కృపాస్వరూపిణి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందగోరే ముందు ఒక విషయాన్ని గ్రహించాలి. ధర్మాతిక్రమణను ఆ తల్లి సహించదు. ధర్మాన్ని పాటించే ధర్మనిరతులపై దయను కురిపిస్తుంది. శిష్టోష్టా, శిష్టపూజితా, సువాసిన్యర్చిత వంటి విశేషణాల ద్వారా దేవీ ఆరాధనకు సంకల్పంతోపాటు సద్గుణాలు కూడా ఉండాలి అని తెలుస్తున్నది. వర్ణాశ్రమ ధర్మపరులైన జనులు శిష్టులవుతారు. అందులో శ్రుతిస్మృతి సంప్రదాయ సదాచారపరులు శిష్టులవుతారు. అటువంటి శిష్టులకు జ్ఞాననిష్ఠులకు, ధ్యాన నిష్ఠులకు ప్రీతికరమైనది, వీరి పట్ల ప్రీతి కలిగినదీ ఆ పరమేశ్వరి. పరమేశ్వరీ భావనతో సువాసినులను అర్చించడం చేత తనను అర్చించిన దాని కంటె ఎక్కువ ప్రీతి చెందుతుందట ఆ తల్లి. సద్గుణవంతులైన స్ర్తిలను గౌరవించడం వల్ల దేవి సంతుష్టి చెందుతుంది. ధర్మబద్ధంగా ఉంటూ చేసే ఆరాధనమే అనుగ్రహ పాత్రమవుతుంది. శక్తి వికాసానికి, శక్తి సాధనకు, యధాశక్తిగా శక్తిని ఆరాధించాలి.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ