S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం - మీరే డిటెక్టివ్

‘నేను ఓ సిద్ధి కోసం చేసే వ్రతాన్ని భగ్నం చేయడానికి మారీచ, సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు రక్తమాంసాలని యాగ వేదిక మీద వర్షిస్తున్నారు. వారిని శపించలేని యజ్ఞం అది. నీ పెద్ద కొడుకు రాముడు వాళ్లని చంపే సమర్థత గలవాడు. నువ్వు ధర్మం నెరవేరాలని కోరే పక్షంలో నీ మంత్రి సుమంత్రుడితో చర్చించి అతని అనుమతితో రాముడ్ని నాతో పంపు’
విశ్వామిత్రుడు చెప్పిన ఆ మాటలు వినగానే దశరథుడు భయంతో ఇలా బదులు చెప్పాడు.
‘పదిహేనేళ్ల రాముడు రాక్షసులతో యుద్ధం చేయలేడు. కాబట్టి నా సైన్యంతో నేనే వెళ్లి ఆ రాక్షసులని చంపి, మీరు చేసే యాగాన్ని రక్షిస్తాను. రాముడికి ఇంకా అస్త్ర బలం లేదు. యుద్ధంలో నేర్పరి కాదు. పైగా రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. మీరు రాముడే కావాలంటే, అతనితోపాటు నేను, నా సైనికులు కూడా వెంట వస్తాం. ఎంతో ప్రయాసతో నేను అరవై వేలవ ఏట రాముడ్ని కన్నాను. కపట యుద్ధం చేసే ఆ రాక్షసులతో నేను ఎలా యుద్ధం చేయాలో చెప్పండి’
‘పౌలస్త్య వంశానికి చెందిన మిశ్రవశుడి కొడుకు, కుబేరుడి సోదరుడు, బ్రహ్మ నించి వరాలని పొందిన రావణుడు మూడు లోకాలని పీడిస్తున్నాడు. అతని ప్రేరణతో మారీచ, సుబాహులు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞాలకి విఘ్నాలు కలిగిస్తున్నారు.’
ఆ పేర్లు వినగానే దశరథుడు చెప్పాడు.
‘దేవ, దానవ, గంధర్వ, యక్ష, పతగ, పన్నాగులు కూడా రావణుడితో పోరాడలేరు. ఇక మానవులు ఏం చేయగలరు స్వామి? నేను నా సైన్యంతో, రాముడితో కలిసి కూడా వారితో యుద్ధం చేయలేను. నిజానికి నేను కూడా ఆ ఇద్దరు రాక్షసుల్లో ఒకరితోనే యుద్ధం చేయగలను. పున్నామ నరకం నించి నన్ను ఉద్ధరించే రాముడ్ని అందుకు మీకు ఇవ్వలేను’
ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంగా ఇలా చెప్పాడు.
‘అడిగింది ఇస్తానని మాట ఇచ్చి వెనక్కి వెళ్లడం రఘువంశ రాజులకి తగదు. అది అధర్మం’
వెంటనే వశిష్ఠుడు కల్పించుకుని ఇలా చెప్పాడు.
‘రాముడికి అస్త్ర విద్య రాకపోయినా విశ్వామిత్రుడి రక్షణలో ఉంటే రాక్షసులు ఏమీ చేయలేరు. కాబట్టి రాముడ్ని విశ్వామిత్రుడి వెంట పంపు. విశ్వామిత్రుడికి తెలిసిన అస్త్ర విద్యలు దేవతలకి కాని, గంధర్వ, యక్ష, కినె్నర, మహోదరులకి కాని, రాక్షసులకి కాని తెలీదు. దక్ష ప్రజాపతి ఇద్దరు కూతుళ్ల పేర్లు జయ, సుప్రభ, ఓ అల్లుడి పేరు భృశాశ్వు. రాక్షసులని చంపడానికి జయ ఏభై మంది కొడుకులని, సుప్రభ ఏభై మంది కూతుళ్లని కన్నారు. నిజానికి ఆ సంతానం జయాన్ని చేకూర్చే అస్త్రాలు. అవన్నీ నేడు విశ్వామిత్రుడి అధీనంలో ఉండటమే కాక, కొత్త అస్త్రాలని కూడా సృష్టించగలడు. స్వయంగా వారిని ఎదుర్కోగలిగీ, రాముడి మేలు కోసమే విశ్వామిత్రుడు రాముడి కోసం వచ్చాడు’
దాంతో దశరథుడు తృప్తి పడి విశ్వామిత్రుడి వెంట రాముడ్ని పంపడానికి అంగీకరించాడు.
* * *
విశ్వామిత్రుడు ముందు నడుస్తూంటే రామలక్ష్మణులు బాణాలతో ఆయన వెనక నడిచి సింధూ నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ వారిద్దరికీ బ్రహ్మ కూతుళ్లైన బల, అతిబల అనే రెండు అస్త్ర విద్యలని విశ్వామిత్రుడు ఉపదేశించాడు. వాటివల్ల శ్రమ, జ్వరం కలగక వారు నిద్ర పోతున్నప్పుడు కూడా రాక్షసులు వారిని ఏం చేయలేరు. ఆకలి, దాహం కలగవు. రామలక్ష్మణులు ఆ రాత్రి అలవాటు లేని గడ్డి మీదే నిద్రించారు.
మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు వారిద్దరినీ నిద్ర లేపాడు. ఆ సోదరులు ఇద్దరూ సంధ్యావందనం, గాయత్రి జపం చేశాక కొద్ది దూరంలోని సింధూ, గంగానదుల సంగమ స్థానానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని వేల ఏళ్లుగా తపస్సు చేసే ఋషులని చూశారు. ఓ ఆశ్రమాన్ని చూసి దాని గురించి రాముడు అడిగితే విశ్వామిత్రుడు వారికి ఇలా వివరించాడు.
‘ఇక్కడ తపస్సు చేసుకుని తన భార్యతో వెళ్లే శివుడ్ని మన్మథుడు ఎదిరించాడు. శివుడి చూపుతో మన్మథుడు కాలి బూడిద అయ్యాడు. అప్పటి నించి మన్మథుడికి అనంగుడు (అంగాలు లేని వాడు) అనే పేరు, ఈ ప్రదేశానికి వంగదేశం అనే పేరు వచ్చాయి. ఈ ఋషులంతా విష్ణువు శిష్యుల పరంపర’
వారి సంభాషణని ఆశ్రమంలోని ఋషులు దివ్యదృష్టితో తెలుసుకున్నారు. ఆ రాత్రి వారంతా ఋష్యాశ్రమంలో విశ్రమించారు.
(బాలకాండ సర్గ 19-23)
ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా నుదుట నిలువు నామాలు, పంచె, లాల్చీ, ఉత్తరీయం వేసుకున్న ఓ వృద్ధుడు ఎదురుపడి నవ్వుతూ ఆశే్లషని అడిగాడు.
‘నేను ఈ రోజు రావడం ఆలస్యమైంది. ఇవ్వాళ చెప్పిన కథ చెప్పవా?’
ఆశే్లష తను విన్న రామాయణ కథని చెప్పాక ఆయన చెప్పాడు.
‘బాబూ! నువ్వు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా విను’
డిటెక్టివ్‌గా మీరు ఆ ఏడు తప్పులని కనుక్కోగలిగారా?

**
కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.రాగి మూత గల వెండి పాత్ర కాదు. వెండి మూతగల బంగారు పాత్రలో పాయసం ఇచ్చాడు.
2.కైకేయికి పాయసం ఇవ్వగా మిగిలిన ఎనిమిదో భాగాన్ని మళ్లీ సుమిత్రకి ఇచ్చాడు.
3.దేవేంద్రుడికి వాలి, సూర్యుడికి సుగ్రీవుడు పుట్టారు.
4.పర్జన్యుడికి శరభుడు, వాయుదేవుడికి హనుమంతుడు జన్మించారు.
5.పది కోట్లు కాదు. కోటి మంది వానరులు రాముడికి సహాయం చేయడానికి పుట్టారు.
6.ఋష్యశృంగుడి మామగారు రోమపాదుడు. తండ్రి కాదు.
7.విశ్వామిత్రుడు అత్రి కుమారుడు కాదు. గాధి కుమారుడు.
**

గత వారం మీ ప్రశ్నకి జవాబు
తక్షశిల, పాకిస్తాన్
**
మీకో ప్రశ్న
కౌసల్యా సుప్రజా రామా... అనే విశ్వామిత్రుడు రాముడ్ని నిద్ర లేపే (23 సర్గలోని రెండవ శ్లోకం) ఏ సుప్రభాతంలో ఉంది?

-మల్లాది వెంకట కృష్ణమూర్తి