S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కక్ష ( విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

కేవలం చంపడంలోని ఆనందం కోసమే చంపేవారు సైకోలు. డబ్బు కోసం చంపేవారు కిరాయి హంతకులు. కాని నేను ఆ రెండూ కాదు.
ఉదాహరణకి నేను రేని చంపాను. ముప్పైలలో ఉన్న నేను జోక్స్ చెప్పే అవకాశాన్ని ఎన్నడూ వదులుకోను. నా భార్య రూత్‌ని తప్ప మరొకర్ని ఎరగను. ముగ్గురు కొడుకులకి చక్కటి తండ్రిని. ప్రతీ ఆదివారం చర్చ్‌కి వెళ్తాను. ప్రవచనం చెప్పేప్పుడు ఎప్పుడూ నిద్రపోను. నిజానికి అసలు నేరస్థుడు రే తప్ప నేను కాదు. ఐనా నన్ను రేని చంపినందుకు పోలీసులు అరెస్టు చేశారు.
* * *
నా బాస్ వాల్టర్ మే నెలలోని ఆ శుక్రవారం మధ్యాహ్నం నన్ను పిలిచి అడిగాడు.
‘రే గురించి నీ అభిప్రాయం ఏమిటి?’
‘అతను మంచి సేల్స్‌మేన్’ జవాబు చెప్పాను.
‘అంతేకాని ఉత్తమ సేల్స్‌మేన్ కాదు కదా?’
‘నేనా మాట అనలేదు’
‘నీతో వచ్చిన ఇబ్బందే ఇది. దేంట్లోను నువ్వు చెడుని చూడలేవు. గత నెల రోజులుగా రే ఏదీ అమ్మలేదు’
‘ప్రతీ సేల్స్‌మేన్‌కి ఇలాంటి దశ వచ్చిపోతూంటుంది’ రేని సమర్థించాను.
‘రే మీద ఒకరిద్దరు ఆడవాళ్ల నించి ఫిర్యాదులు అందాయి. అమ్మకానికి ఉన్న ఇళ్లు చూపించినప్పుడు వారి మీద సన్నిహితంగా చేతులు వేశాట్ట’
‘నేను అతనితో మాట్లాడుతాను’
‘అతన్ని డిస్మిస్ చెయ్యి’ వాల్టర్ ఆజ్ఞాపించాడు.
‘నేనా?’
‘అవును. నువ్వు ఆఫీస్ మేనేజర్‌వి. సాయంత్రం ఐదుకి అతను వెళ్లాక మళ్లీ రాకూడదు. తీసేస్తున్నందుకు నష్టపరిహారంగా అతనికి ఒక్క సెంట్ కూడా ఇవ్వక్కర్లేదు’
రేని నా గదిలోకి పిలిచాక అతన్ని తీసేస్తున్నానని చెప్పడానికి నాకు అరగంట పైనే పట్టింది.
‘ఈ రోజు వాతావరణం బావుంది కదా?’ మాటలు కలుపుతూ చెప్పాను.
‘ఐనా నేను క్లైంట్స్ దగ్గరికి వెళ్లలేదని, నా బాధ్యతని సక్రమంగా చెయ్యడం లేదని ఆరోపిస్తున్నావా?’ అడిగాడు.
‘లేదు. ఈ రోజు బావుందని చెప్తున్నాను. అంతే’
‘సరే. మంచి రోజే. నువ్వు వాల్టర్ గదిలోకి వెళ్లి చాలాసేపు మాట్లాడావు. నా మీద అతనికి ఏం చెప్పావు?’ రే ప్రశ్నించాడు.
‘ఏం చెప్పలేదు’
‘అబద్ధం ఆడకు. నా మీద ఏం చాడీలు చెప్పావు? నన్ను ఉద్యోగంలోంచి తీయించే ప్రయత్నం చేసావా?’
‘అందులో నాకు సంబంధం లేదు. అది వాల్టర్ ఆలోచన’ అతనే విషయానికి రావడంతో చెప్పాను.
‘వాల్టర్ ఆలోచన ఏమిటి?’
‘నిన్ను ఉద్యోగంలోంచి తీసేయడం’
‘చివరకి వాల్టర్‌తో మాట్లాడి అది సాధించావన్నమాట’
‘లేదు’
‘ఐతే ఇది ఎవరి పని? కొన్ని నెలలుగా నువ్వు నాకు పిచ్చెక్కిందని అందరికీ అబద్ధాలు చెప్తున్నావు. ఆ ఒత్తిడివల్లే నేను సరిగ్గా అమ్మకాలు చేయలేకపోతున్నాను’
‘రే. నన్ను నమ్ము. నేను ఎన్నడూ..’
‘ఆ... ఆ పని చేయలేదంటావు? జార్జ్. అంతా నీ అబద్ధాలు నమ్ముతారు. నేను పిచ్చివాడినని అందర్నీ నమ్మించావు. బదులుగా నేను నిన్ను నాశనం చేస్తాను. నేను తప్పకుండా ఆ పని చేసి తీరతాను’
అతని స్పందనకి నేను నివ్వెరపోయాను.
‘నువ్వు చెప్పేది పూర్తయిందా?’ అడిగాను.
‘ప్రస్తుతానికి’
‘సోమవారం నించి ఇక నువ్వు ఆఫీస్‌కి రానక్కర్లేదు’ చెప్పాను.
* * *
వారం తర్వాత నేను ఓ బార్లో మిగిలిన సేల్స్‌మెన్‌తో కలిసి బీర్ తాగుతూంటే ఒకరు అడిగారు.
‘రే అంటే నీకు ఎందుకు కోపం?’
‘నాకా? లేదు. వాల్టర్ అతన్ని తీసేయమంటే తీసేసాను’
‘కాని రే అలా చెప్పడంలేదు’
‘మరి ఇంకెలా చెప్తున్నాడు?’
‘అతను చాలా మందిని కలిసి, లేదా ఫోన్ చేసి నీకు మతిస్థిమితం తప్పిందని చెప్తున్నాడు’
‘అతనికే పిచ్చి. మా నాన్నకి జీవితాంతం మీసం ఉండేది’
‘మీ నాన్నతో నువ్వు ఎలా ఉండేవాడివి?’
‘ఆయన్ని ద్వేషించేవాడిని కాను’
‘ఆయన్నించే నీకు ఈ ఫోబియా అంటుకుందని రే చెప్పాడు’
‘అది నమ్మితే నువ్వే పిచ్చివాడివి’
అతను నవ్వి మోచేత్తో నా పక్కటెముకల్లో పొడిచి చెప్పాడు.
‘నిజమే జార్జ్. నువ్వు తప్ప అంతా పిచ్చివాళ్లు’
కొద్ది దూరంలో కూర్చున్న బుంగ మీసాలుగల ఓ వ్యక్తి నా కళ్లబడ్డాడు. నేను ఎంత ప్రయత్నించినా అతని మీసాలని పదేపదే చూడకుండా ఉండలేకపోయాను. కొద్దిసేపటికి అతను లేచి నా దగ్గరికి వచ్చి అడిగాడు.
‘నా మీసంలో ఏదైనా లోపం ఉందా?’
‘లేదు. ఎందుకలా అడిగారు’
‘ఇందాకటి నించి మీరు దానే్న చూస్తున్నారు. దానికి బీర్ అంటుకుందా?’ ప్రశ్నించాడు.
‘లేదు’
‘ఇతనికి మీసాలంటే భయం’ నా మిత్రుడు చెప్పాడు.
‘నాకు మీసాలంటే భయం లేదని ఇప్పుడే నీకు చెప్పాను’ కోపంగా అరిచాను.
‘మరి ఇతని మీసాన్ని ఎందుకు భయంగా చూసావు?’ నా మిత్రుడు ప్రశ్నించాడు.
లంచ్ బ్రేక్ తర్వాత బార్ నించి ఆఫీస్‌కి వెళ్లాను. నా టేబిల్ మీద ఓ గోధుమ రంగు కవర్ నా పేరుతో ఉండటంతో చూసి తెరిచాను. అందులో ఓ పెట్టుడు మీసం ఉంది.
‘ఈ కవర్ని ఇక్కడ ఎవరు ఉంచారు?’ దాన్ని చెత్తబుట్టలో పడేస్తూ నా పక్కనే ఉన్న లేడీ క్లర్క్‌ని అడిగాను.
‘నాకు తెలీదు’
ఆమె మొహంలోని భావాలని బట్టి రే ఆమెతో కూడా మాట్లాడాడని నాకు అర్థం అయింది.
ఆ రాత్రి నా భార్య రూత్ నాతో చెప్పింది.
‘మీకో విచిత్రమైన ఫోన్ కాల్ వచ్చింది’
‘ఎవర్నించి?’
‘రే నించి’
‘ఆ పిచ్చివాడికి ఏం కావాలిట?’ కొద్దిగా ఆందోళనగా ప్రశ్నించాను.
‘తను ఎన్నడూ మీసాన్ని తీసేయను అని చెప్పమన్నాడు. అతనా మాట ఎందుకు అన్నట్లు?’
‘అతని మీసం నాకు నచ్చక ఉద్యోగంలోంచి తీసేసాను అనుకుంటున్నాడు’
‘అయ్యో జార్జ్. మీరా పని చేయకుండా ఉండాల్సింది’ రూత్ వెంటనే చెప్పింది.
‘ఏ పని?’
‘మీసం నచ్చక ఉద్యోగంలోంచి తీసేయడం’
‘చూడు రూత్. నేను అతని మీసం నచ్చక ఉద్యోగంలోంచి తీసేసాను అనలేదు. అతను కేవలం అలా అనుకుంటున్నాడు అని చెప్పాను’
‘జార్జ్. మీకు మీసాలంటే ఇష్టం లేదని నాకు తెలుసు’ కొద్దిసేపాగి రూత్ నెమ్మదిగా చెప్పింది.
‘అని నేను నీకు ఎప్పుడు చెప్పాను’
‘మరి మీరు మీసం ఎందుకు పెంచలేదు. పైగా ఓసారి హిట్లర్ మీసాన్ని తిట్టారు’
‘నాకు గుర్తు లేదు. హిట్లర్‌ని తిట్టి ఉంటాను. కాని మీసాన్ని కాదు’
‘పదమూడేళ్ల క్రితం తాగి’ రూత్ జవాబు చెప్పింది.
* * *
నా కేబిన్‌లోకి అడుగుపెట్టి టేబిల్ మీది నా ఫేమిలీ ఫొటోని చూశాక ప్యూన్‌ని పిలిచి చెప్పాను.
‘ఇది చాలా దూరం వెళ్లింది’
‘ఏది మిస్టర్ జార్జ్’ అతను అడిగాడు.
నేను చూపించిన నా ఫేమిలీ ఫొటోని చూసి నవ్వుతూ అడిగాడు.
‘అందరికీ మీసాలు మీరు గీసారా?’
‘లేదు’
‘ఐతే ఇది ఎవరి పని?’
‘నేను నిన్ను అదే అడుగుతున్నాను’ గదమాయించాను.
‘అలా చూడకండి మిస్టర్ జార్జ్. అది నా పని కాదు. మీసాలంటే మీకు గల ఫోబియా గురించి నాకు తెలుసు’
‘నాకు ఏ ఫోబియా లేదు’ కోపంగా బల్ల మీద గుద్ది చెప్పాను.
అతను భయంగా వెళ్లిపోయాడు. కొద్దిసేపాగి రిసీవర్ అందుకుని రే నంబర్ని డయల్ చేసాను. రెండోసారి మోగాక రిసీవర్ ఎత్తాడు.
‘రే! నువ్వు ఇంకోసారి నీ మీసం అంటే భయంతో నిన్ను ఉద్యోగంలోంచి తీసేసానని ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తాను. అర్థమైందా?’ కోపంగా అరిచాను.
‘అర్థమైంది. నా మీసం అంటే భయంతో నువ్వు నన్ను ఉద్యోగంలోంచి తీసేసావని నేను ఎవరితోనైనా చెప్తే చంపుతానన్నావు. నిజంగా చంపుతావా?’ అడిగాడు.
‘నిజంగా చంపుతాను’
‘నా మీసం అంటే నీకు ఎందుకంత భయం జార్జ్?’
‘నాకు భయం కాదు. అసూయ. సరా?’ కోపంగా అరిచి రిసీవర్ పెట్టేసాను.
* * *
ఆ రాత్రి నేను పిల్లలతో హోంవర్క్ చేయిస్తూంటే బెల్ మోగింది. నేను తలుపు తెరిచాను. బయట నిలబడ్డ ఇద్దరు పోలీసుల్లో ఒకరు అడిగారు.
‘జార్జ్ అంటే మీరేనా?’
‘అవును. ఏమిటి సమస్య?’
‘సారీ సర్. కెప్టెన్ మిమ్మల్ని స్టేషన్‌కి పిలుచుకురమ్మన్నారు’
‘దేనికి?’
‘కెప్టెన్ చెప్తారు. మీకు మాతో రావడం ఇష్టం లేకపోతే ఆ పని చేయకుండా ఉండాల్సింది’ రెండో పోలీస్ ఆఫీసర్ అసంతృప్తిగా చెప్పాడు.
‘ఏం చేసాను?’
‘కెప్టెన్ మీకు చెప్తారు. మిమ్మల్ని ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు’
‘ఏమిటి డియర్? పోలీసులు రాఫెల్ టిక్కెట్లని అమ్మడానికి వచ్చారా?’ రూత్ ఆ గదిలోకి వచ్చి వాళ్లని చూసి అడిగింది.
‘సారీ మేడం. మీ భర్తని ప్రశ్నించడానికి స్టేషన్‌కి తీసుకెళ్లాలి’ ఒకతను చెప్పాడు.

‘ఆయనేం చేశారు?’
‘వాళ్లు చెప్పడం లేదు’ నిస్పృహగా చెప్పాను.
‘ఐతే వెళ్లకండి’
‘లేదు. తప్పక రావాలి’ రెండో అతను గట్టిగా చెప్పాడు.
రూత్ నా వంక భయంగా చూసింది. తప్పదు కాబట్టి వాళ్ల వెంట వెళ్లాను.
స్టేషన్‌కి చేరుకున్నాక కొద్దిసేపు కెప్టెన్ నిశ్శబ్దంగా సిగరెట్ తాగుతూ నా వంక చూసి తర్వాత చెప్పాడు.
‘కూర్చోండి మిస్టర్ జార్జ్. నా పేరు కెప్టెన్ వాటోస్కి’
తర్వాత దాన్ని ఖాళీ టీ పేపర్ కప్‌లో ఆర్పి, బల్ల మీది టేప్ రికార్డర్ బటన్‌ని నొక్కాడు. నేను రేతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ వినిపించింది.
‘మిస్టర్ జార్జ్. ఇది మీ కంఠమేనా?’ కెప్టెన్ అడిగాడు.
‘అవును. కాని అది ఉత్త బెదిరింపే’ ఇబ్బందిగా చూస్తూ చెప్పాను.
‘ఇది నవ్వులాట కాదు. నేనే మీరైతే ఇలా ఎన్నటికీ బెదిరించను. అది మిమ్మల్ని చాలా కష్టాల్లోకి తీసుకువెళ్తుంది. ఈ అలవాటుని మానండి’ కెప్టెన్ హెచ్చరించాడు.
‘అది నా అలవాటు కాదు’
‘దురదృష్టవశాత్తు నేను మిమ్మల్ని కేవలం హెచ్చరించగలను. కోర్ట్ ఆర్డర్ లేకుండా ఎవరైనా సంభాషణని ఇలా రహస్యంగా టేప్ చేయడం చట్టవిరుద్ధం. చట్టమైనా, చట్ట విరుద్ధమైనా మీరు ఎవర్నీ చంపుతానని బెదిరించకూడదు’
‘సరే’ గొణిగాను.
‘మంచిది. ఇంక మీరు వెళ్లచ్చు’
‘అంతేనా?’
‘అంతే’
నేను లేచి నాలుగు అడుగులు వేసాక కెప్టెన్ అడిగాడు.
‘ఇటు చూడండి. నా మీసం మీకు ఎలా ఉంది?’
‘చాలా అందంగా ఉంది’
‘మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’
పోలీసుస్టేషన్‌లోంచి బయటకి వచ్చిన నేను రే మీద మనసులో మండిపడ్డాను. సమీపంలోని బార్‌కి వెళ్లి విస్కీ తాగాను. నాకు రే సన్నటి ఫ్రెంచ్ కట్ మీసమే కనిపిస్తోంది. నాలుగు పెగ్‌లు తాగాక నాకు కలిగిన ఆ ఆలోచనకి బయటికి గట్టిగా నవ్వాను. దారిలో ఓ దుకాణంలో డిస్పోజబుల్ రేజర్ కత్తిని కొన్నాను. ఇరవై నిమిషాల తర్వాత రే అపార్ట్‌మెంట్ బెల్‌ని నొక్కాను.
‘రే! తలుపు తీయి. నీకో బహుమతి తెచ్చాను’ గట్టిగా అరిచాను.
తలుపు తెరచిన రే సన్నటి మీసాన్ని, తర్వాత అతని చేతిలోని నాకు గురి పెట్టిన పాయింట్ 38 రివాల్వర్‌ని చూశాను.
‘హలో జార్జ్! నీ కోసమే ఎదురుచూస్తున్నాను’ పక్కకి తప్పుకుంటూ చెప్పాడు.
‘ఇదేమిటో తెలుసా? దీంతో నీ పాడు మొహంలోని మీసాన్ని తీసేయబోతున్నాను’ నా చేతిలోని రేజర్ని చూపిస్తూ చెప్పాను.
రే వంకరగా నవ్వి రివాల్వర్‌ని నా ముక్కుకి ఆనించి చెప్పాడు.
‘ఇదేమిటో తెలుసా జార్జ్. పాయింట్ 38 స్మిత్ అండ్ వెసన్’
నేను కొద్దిగా భయపడ్డాను.
‘దీంతో నేను ఏం చేయబోతున్నానో ఊహించగలవా జార్జ్? నిన్ను నాశనం చేయబోతున్నాను’
నాలోని మత్తు కొద్దిగా దిగింది.
‘నీకు పిచ్చెక్కిందా?’ అడిగాను.
‘నాక్కాదు. నీకు. నీ మీసం ఫోబియా గురించి అందరికీ తెలుసు. లోపలకి రా’
‘ఏం చేయబోతున్నావు?’ ప్రశ్నించాను.
‘ఇప్పుడే చెప్పానుగా’
నేను లోపలకి రాగానే అతను తలుపు మూసి, రిసీవర్ అందుకుని ఓ నంబర్ని డయల్ చేసి చెప్పాడు.
‘కెప్టెన్ వాటోస్కి రేని, జార్జ్‌తో మీరు మాట్లాడి ప్రయోజనం లేకపోయింది. అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. నన్ను రేజర్ బ్లేడ్‌తో చంపడానికి వచ్చాడు. అతనికి నా రివాల్వర్‌ని గురి పెట్టాను. దయచేసి వెంటనే వస్తారా?... మంచిది. మీ కోసం ఎదురు చూస్తూంటాను’
‘నీకు పిచ్చెక్కింది’ అతను రిసీవర్ పెట్టేసాక అరిచాను.
‘నాక్కాదు. నీకు పిచ్చి. అర్థం కాలేదా? నన్ను ఉద్యోగంలోంచి తీసేయడం నువ్వు చేసిన పిచ్చి పని. నేను బెస్ట్ సేల్స్‌మేన్‌ని. కాని నా గురించి నువ్వు వాల్టర్‌కి అబద్ధం చెప్పావు. ఎందుకు? నీకు పిచ్చి కాబట్టి’ పకపక నవ్వాడు.
‘నువ్వు ఇదంతా ఓ పథకం ప్రకారం చేసావని ఇప్పుడు అర్థమైంది’
‘అవును. నేను పిచ్చివాడ్ని అయితే ఇలాంటి పథకాన్ని వేయగలనా? ప్రతీ వారికి నీ మీసం ఫోబియా గురించి తెలుసు. పోలీసులకి కూడా. నన్ను చంపుతావని బెదిరించావని వారి దగ్గర సాక్ష్యం ఉంది. నా రక్షణకి వాళ్లు గన్ పర్మిట్‌ని కూడా ఇచ్చారు’
‘ఇప్పుడు నువ్వు నన్ను చంపబోతున్నావా?’
‘నిన్ను నాశనం చేయబోతున్నాను. పూర్తిగా’ రే సరిదిద్దాడు.
‘దయచేసి నన్ను చంపకు. నాకో భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు’ అర్థించాను.
‘నాటకీయత మాను. కొద్ది నిమిషాల్లో ఈ రివాల్వర్ పేలుతుంది’ కసిరాడు.
నేను మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తూ చెప్పాను.
‘దయచేసి నన్ను చంపకు. నేను వాల్టర్‌తో మాట్లాడి మళ్లీ నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. దయచేసి కాల్చకు’
కొద్దిసేపటిదాకా ఆ గదిలో నా ఏడుపు, తర్వాత దగ్గరవుతున్న పోలీస్ వేన్ సైరన్ మాత్రమే వినిపించాయి. అకస్మాత్తుగా అతని మొహం వికృతంగా మారింది. రివాల్వర్ గొట్టాన్ని హఠాత్తుగా తన పొట్టవైపు తిప్పుకుని ట్రిగర్ నొక్కాడు. చెవులు బద్దలయ్యే చప్పుడు. అతను తడబడుతూ అడుగులు వెనక్కి వేస్తూ రివాల్వర్‌ని నా వైపు విసిరాడు.
‘కేచ్’
నేను అనాలోచితంగా దాన్ని కుడిచేత్తో పట్టుకున్నాను. తర్వాత అరిచాను.
‘మూర్ఖుడా. నువ్వు నిజంగా పిచ్చివాడివి’
‘నేను పిచ్చివాడ్ని కాను. నిన్ను కాలిస్తే నీ పని తేలికయ్యేది. ఇప్పుడు నీకు మరణశిక్ష తప్పదు.’
కూలబడ్డ అతనిలో కదలిక ఆగిపోయింది. తర్వాత నేను చేయగలిగిన ఓ పని మాత్రమే చేసాను. రేజర్ కత్తిని విప్పి రే మీసాన్ని గొరిగేసి అతని మీద గల నా కక్షని తీర్చుకున్నాను.
పోలీసులు నన్ను చూసినప్పుడు నా ఎడమ చేతిలో రివాల్వర్, కుడి చేతిలో మడత కత్తి ఉన్నాయి.
హంతకుడిగా నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. నేను నేరస్థుడినని తీర్పు కూడా వచ్చింది. ఐతే రే పథకం చివర్లో విఫలమైంది. నాకు మరణశిక్ష పడలేదు. నన్ను పిచ్చివాడుగా భావించి మెంటల్ హాస్పిటల్‌కి తరలించారు.
మీసం ఉన్న ఎవరూ హాస్పిటల్‌లో నా దగ్గరికి రారు. నాకు మీసం ఫోబియా ఉందని ఇంకా అంతా నమ్ముతూనే ఉన్నారు.

(జేమ్స్ ఎం గిల్మోర్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి