S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు..2

రఘు కళ్లల్లో భయం చోటు చేసుకుంది.
‘ఇతని గురించి రేపు ఆలోచిద్దాం... లాకప్‌లో పడేయండి..’ చెప్పాడు. ఉమెన్ కానిస్టేబుల్స్ అతన్ని లాక్కుపోయారు.
రాత్రి పది గంటలకి ఇంటికెళుతూ రైటర్‌తో చెప్పాడు యుగంధర్. ‘రఘుగాడి షర్టు, ప్యాంటు తీసేసి డ్రాయర్‌తో లాకప్‌లో ఉంచండి. తెల్లారేసరికి రోగం కడుతుంది..’
రాత్రంతా డ్రాయర్‌తో లాకప్‌లో ఉంచితే దోమలు అతని అంతు చూస్తాయి. తెల్లారేసరికి గుర్తుపట్టలేనట్టు తయారవుతుంది ఆకారం. ఇండియన్ పీనల్ కోడ్‌లో లేని శిక్ష అది. కర్ర విరక్కుండా పాము చావకుండా సమస్య పరిష్కరించడం అంటే అదే!
చిన్నగా నవ్వుకున్నాడు రైటర్.
2
నెట్‌వర్క్ ఆఫీస్ నుంచి బయటకొచ్చిన ఓ యువకుడ్ని, అతని కోసమే ఎదురుచూస్తున్న రాజేష్ విష్ చేశాడు. ఇద్దరూ దగ్గరలోని ఒక పార్లర్ చేరుకున్నారు. డిస్పోజబుల్ కప్పులతో కాఫీ తెచ్చుకుని కుర్చీల్లో కూర్చుని తాగసాగేరు. ఆ యువకుడు రెండు గుక్కలు కాఫీ తాగి అన్నాడు.
‘మీరిచ్చిన నెంబరు సిమ్ కార్డు అయిదు నెలల క్రితం సరెండర్ అయింది. అందుకే కాల్స్ రిజెక్టవుతున్నాయి’
‘ఆ నెంబరు ఉపయోగించిన మనిషి చిరునామా తెలుసుకోలేమా?’ అడిగేడు రాజేష్.
‘ప్రయత్నించాలి. నిత్యం కొన్ని వేల మంది కస్టమర్లు సిమ్ కార్డులు తీసుకోవడం, మార్చడం చేస్తుంటారు. రేపు సిమ్ కార్డు ఎవరు తీసుకుంటారో తెలియనట్టే సరెండర్ చేసిన సిమ్‌కార్డు ఎవరు ఉపయోగించారో కొన్ని నెలల తర్వాత తెలుసుకోవడం కష్టం’
రాజేష్ వౌనంగా ఉండిపోయాడు.
‘ఆ నెంబరు ఉపయోగించిన మనిషి ఎవరో తెలుసుకోవడం మీకంత అవసరమా?’ ఆ యువకుడు అడిగేడు.
‘అవసరమే.. సంవత్సరం క్రితం నా మిత్రుడ్ని ఇక్కడే విమానం ఎక్కించాను. అతను ఓ నెంబరిచ్చి, ఆమెకి ఏ సాయం కావాలన్నా చెయ్యమని చెప్పి సెక్యూరిటీ చెకప్‌లోకి వెళ్లిపోయాడు. వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయింది. మరునాడు బ్యాంక్‌కి వెళుతూ యాక్సిడెంట్‌కి గురయ్యాను. మామూలు మనిషి కావడానికి చాలా రోజులు పట్టింది. తిరిగి ఉద్యోగంలో చేరి పది రోజులు అయింది. ఆ నెంబరుకి ఎన్నిసార్లు చేసినా కాల్స్ రిజెక్టవుతున్నాయి. నా మిత్రుడ్ని కాంటాక్ట్ చేస్తే అతను అమెరికా వెళ్లిన నెలకే హత్యకు గురయ్యాడని తెలిసింది. అప్పటి నుంచి మిత్రుడు చెప్పిన చిన్న పని చెయ్యలేకపోయాననే ఆలోచన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది’ బాధగా చెప్పాడు రాజేష్.
‘డోంట్‌వర్రీ..’ అన్నాడా యువకుడు రాజేష్ చేతి మీద తన చెయ్యి వేసి.
‘ఆ సిమ్‌కార్డ్ సరెండర్ చేసి బల్క్‌గా కొత్త ఆఫర్‌తో వేరే సిమ్‌కార్డులు తీసుకున్నారు. అందుచేత వివరాలు దొరుకుతాయి. నా కొలీగ్ ఆ పని మీదే ఉన్నాడు’ చెప్పాడతను.
కాఫీ తాగాక ఆ యువకుడు నెట్‌వర్క్ ఆఫీసులోకి వెళ్లిపోయాడు. ఓ గంట తర్వాత బయటకొచ్చి రాజేష్ చేతిలో చిన్న స్లిప్ ఉంచాడు.
* * *
‘హలో..’ ఓ కోమల కంఠం బదులు పలికింది.
‘నా పేరు రాజేష్..’
‘చెప్పండి?’
ఓ క్షణం తటపటాయించి అన్నాడు రాజేష్.
‘శ్రీ్ధర్ నా స్నేహితుడు’
‘అయితే’
‘మీ నెంబరిచ్చాడు నాకు’
‘ఎందుకు?’
‘మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సాయపడమని...’
‘ఎలాంటి సాయం?’ ప్రశ్నించి కిలకిలా నవ్విందా గొంతు.
రాజేష్ మాటలు కూడదీసుకున్నాడు.
‘నాకు తెలియదు. వివరాలు చెప్పడానికి ప్రస్తుతం శ్రీ్ధర్ లేడు. మిమ్మల్ని ఓసారి కలవాలి...’
ఓ క్షణం నిశ్శబ్దం తర్వాత వినిపించింది.
‘నన్ను కలవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఖర్చవుతుంది...’
‘నో ప్రాబ్లమ్.. అపాయింట్‌మెంట్ ఎలా తీసుకోవాలో చెప్పండి?’
‘ఇప్పుడెక్కడున్నారు?’
‘రామకృష్ణా బీచ్‌లో శ్రీశ్రీ విగ్రహానికి ఎదురుగా బెంచీ మీద కూర్చున్నాను’
‘ఏడు దాటిందిప్పుడు. సరిగ్గా ఎనిమిదికి అక్కడుంటా.. తొమ్మిదికి వేరే అపాయింట్‌మెంట్ ఉంది’
‘ఎదురుచూస్తుంటాను’ చెప్పాడు రాజేష్.
కాల్‌కట్ అయింది.
చల్లగాలికి సేదతీరేందుకు వచ్చిన వారితో బీచ్ కళకళలాడుతోంది. రోడ్డు పక్క మొక్కజొన్న పొత్తులతోపాటు రకరకాల తినుబండారాలు అమ్మేవాళ్లు బిజీగా ఉన్నారు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఎలక్ట్రిక్ దీపాలతో సర్వాంగ సుందరంగా ఉంది బీచ్.
సముద్రం మీదకి తన దృష్టి సారించేడతను.
విశాఖలో నివసించేవారు మరో నగరం వెళ్లాలని అనుకోరు. దానికి కారణం విశాఖలోని జీవన వైవిధ్యం. నిత్యం కొన్ని వేల మంది విద్య కోసం, వైద్యం కోసం వస్తారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఇరవై రూపాయలతో కడుపు నింపుకోవచ్చు. మరోపక్క లంచ్‌కి రెండు వేలు ఖర్చు చెయ్యవచ్చు. ముప్పై ఏళ్ల కాలంలో విశాఖపట్నం మహా నగరంగా మారిపోయింది. రాత్రి పదకొండు వరకూ చైతన్యవంతంగా ఉండే నగరం తిరిగి తెల్లవారుజామున అయిదుకి ఊపిరి పోసుకుంటుంది. ఆ తర్వాత పరుగులు.. బళ్ల మీద, బస్సుల మీద.
రాజేష్ ఆలోచనలు చెదరగొడుతూ సెల్ రింగయింది.
అంతకు ముందు తను చేసిన నెంబరు నుంచి కావడంతో ఆన్సర్ బటన్ నొక్కబోయాడు. కట్ అయింది. ఆ వెంటనే వెనుక నుంచి వినిపించింది సన్నటి కోకిల స్వరం.
‘మీరు రాజేష్ కదూ! నా పేరు రాసమణి..’
వెనక్కి చూసిన రాజేష్ కొన్ని క్షణాలపాటు తెల్లబోయాడు.
అయిదున్నర అడుగుల ఎత్తుతో పాతికలోపు వయసున్న యువతి నిలబడి ఉంది. తీర్చిదిద్దినట్టున్న కనుబొమల కింద చక్రాల వంటి కళ్లు. తెలుపు, చామనఛాయ మధ్య శరీరరంగు, సున్నితంగా, సుకుమారంగా చిరునవ్వుతో హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టుంది రూపం.
ఆమె రోడ్డు వైపు తిరిగి సైగ చేసింది. ఓ వ్యక్తి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయేడు.
‘ఇప్పుడు సమయం ఎనిమిది కావస్తోంది. నేను గంటకి అయిదువేలు పుచ్చుకుంటాను’ చెప్పింది బెంచీ మీద కూర్చుంటూ.
రాజేష్ మాట్లాడలేదు.
‘ఈ సముద్రాన్ని చూస్తూ పరిసరాలు మర్చిపోయేరు కదూ?’ అడిగిందామె ముందుకు చూస్తూ.
‘అవును.. ఇంత విశాలమైన సాగరంతో రెండు మూడు గదుల్లోని సంసారాన్ని ఎందుకు పోల్చారా అని ఆలోచిస్తున్నాను’ చెప్పాడతను.
‘మీకు పెళ్లైందా?’ చిన్నగా నవ్వుతూ అడిగింది.
‘లేదు’
‘చేసుకోండి. తెలుస్తుంది. అంతవరకూ ఓపిక పట్టండి. అది సరే.. నా సెల్ నెంబరు మీకెలా వచ్చింది?’
‘శ్రీ్ధర్ ఇచ్చాడు’
ఆమె పక్కున నవ్వింది.
‘మీరు అబద్ధం చెబుతున్నారు’
‘నిజమే చెప్పాను.’
‘నాకు పరిచయమైన వారిలో ముఖ్యమైన వారి పేర్లు గుర్తుంటాయి. అంతేకాకుండా శ్రీ్ధర్ పేరుగల వ్యక్తి నాకెప్పుడూ తారసపడలేదు’
‘మీరు మర్చిపోయినా శ్రీ్ధర్‌తో మీకు పరిచయం ఉందని గట్టిగా చెప్పగలను. సంవత్సరం క్రితం మీరేదైనా సమస్యలో ఇరుక్కున్నారా?’ అడిగేడు రాజేష్.
ఆమె వౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. నిశ్శబ్దంగా క్షణాలు దొర్లిపోతున్నాయి. నెమ్మదిగా తలతిప్పి రాజేష్ ముఖంలోకి చూసింది. అప్పటికే ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.
‘నా కూతురు వయసు ఎనిమిది నెలలు. మీరే ఊహించండి. సంవత్సరం క్రితం నేను ఏ స్థితిలో ఉన్నానో...’
అదిరిపడ్డాడు రాజేష్.
‘అది చాలా కష్ట సమయం. సాయం చేసేవారు లేక కొట్టుమిట్టాడుతున్న రోజులు. తిరిగి భూపతి ఆధీనంలోకి వెళ్లిందప్పుడే..’
‘్భపతి ఎవరు?’
‘అతని గురించి ఎందుకు? శ్రీ్ధర్ గురించి చెప్పండి’
రాజేష్ కొన్ని క్షణాలు ఆలోచించి సెల్ తీశాడు. కాసేపు దాన్ని ఆపరేట్ చేసి ఓ ఫోటో స్క్రీన్ మీదకి వచ్చాక ఆమె చేతికిచ్చి చెప్పాడు.
‘నా మిత్రుడు శ్రీ్ధర్ ఇతనే...’
ఆమె ఫొటోని పరీక్షగా చూసి అంది.
‘నా దగ్గరికి చాలాసార్లు వచ్చాడితను. పేరు చెప్పలేదు ఎప్పుడూ. మీకేమవుతాడు?’
రాజేష్ తల పంకించి చెప్పాడు.
‘స్నేహితుడు... ఇంజనీరింగ్‌లో ఓ సంవత్సరం సీనియర్. కాలేజీలో నేను చేరిన కొత్తలో నన్ను ర్యాగింగ్ చేస్తుంటే అడ్డుకున్న వ్యక్తి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక కూడా ఆ కంపెనీ శ్రీ్ధర్‌ని పిలవలేదు. నేను ఇంజనీరింగ్ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ రాసి ట్రైనింగ్‌కి వెళ్లినపుడు తిరిగి అక్కడ కలిశాడు. ఓ ఏడాది బ్యాంక్‌లో చేసాక యు.ఎస్.లో అవకాశం వచ్చి వెళ్లిపోయాడు’
‘ఆ తర్వాత?’
‘ఇంకే లేదు. శ్రీ్ధర్ విమానం ఎక్కబోతూ మీ నెంబరిచ్చి కాంటాక్ట్ చేసి సాయపడమన్నాడు. అప్పుడు కుదర్లేదు నాకు. ఇప్పుడు మీ పాత నెంబరు ద్వారా కొత్త నెంబరు సంపాదించాను’ చెప్పాడు రాజేష్.
‘అంత శ్రమ దేనికి?’
‘ఆనాడు శ్రీ్ధర్ చెప్పిన పని చెయ్యలేకపోయాను. అతన్ని క్షమాపణ అడగడానికి మనిషి లేడు. అందుచేత ఆ పని పూర్తి చేసి గుండెల్లోని బరువును దించుకోవాలనుకున్నాను’
ఈ కాలంలో అలా ఆలోచించేవాళ్లుంటారా అని ఆశ్చర్యం కలిగినట్టు రాజేష్‌ని చూసింది రాసమణి. అతని ముఖంలో కాని మాటల్లో కాని ఎలాంటి కల్మషం లేదు. తనకంటే ఒకటి రెండేళ్లు పెద్ద కావచ్చని అనుకుంది. ఎదుటి మనిషి గురించి తెలుసుకోవాలంటే పెద్దగా తెలివిని ఉపయోగించాల్సిన పనిలేదు. అతను మాట్లాడే తీరు, ఆలోచించే విధానం చాలు. నిత్యం రకరకాల మనుషులతో సావాసం చేసే ఆమెకి పక్కన కూర్చున్న మనిషి కొత్తగా కనిపించాడు.
ఇంతలో ఆమె సెల్ మోగింది.
‘బీచ్‌లో తెలిసిన ఓ మనిషితో మాట్లాడుతున్నాను. సరిగ్గా తొమ్మిదికి వెళతాను. తాజ్ రెసిడెన్సీ ఇక్కడకు దగ్గరే...’ చెప్పి కాల్ కట్ చేసిందామె.

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994