S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆధ్యాత్మిక శక్తి.. మానవతామూర్తి (అక్టోబర్ 31 స్వామీజీ షష్ట్యబ్ది మహోత్సవం)

ఆయన మాట.. తేనెల మూట
ఆయన చూపు.. ప్రేమవాత్సల్యాల పూదోట
ఆయన లక్ష్యం...్భక్తి, సమతా భావనల కలబోత...
చిన్నతనంలోనే కాషాయం ధరించి, ధ్వజం పట్టి..
ఆరు పదుల వయస్సులో అజేయంగా ఆధ్యాత్మిక
మార్గంలో పయనిస్తున్న మార్గదర్శకులు... చిన్నజీయర్...
పేరులో ‘చిన్న’ అన్న పదం భక్తుల ఆప్యాయంగా పిలిచే పిలుపు. నిజానికి ఆయన మనసు పెద్దదే. కేవలం భక్తి, విశిష్టాద్వైత ప్రచారానికే పరిమితం కాని స్వామి.. శాంతి, విద్య, వైద్యం, ఆరోగ్యం, వేదం, ఆగమం, సంస్కృతి, సమతల సాధనకు ఒక్కో అడుగు వేస్తూ వచ్చారు. ఆయన వెంట జనం తరలివచ్చారు. వస్తున్నారు. అందుకే ఆయనను నిజమైన మార్గదర్శిగా పిలుస్తున్నారు. కొలుస్తున్నారు.
ఆయన అడుగుతీసి అడుగు వేస్తే ‘్భక్తితత్వం’ పొంగిపొర్లుతుంది
ఆయన మాట్లాడితే మానవసేవ.. కాదుకాదు.. సర్వప్రాణిసేవ వినిపిస్తుంది, కనిపిస్తుంది.. ఆయన ఒక మానవతామూర్తి.. పేదలకు చేయూత ఇవ్వాలని మాటలతో కాకుండా చేతలతో చూపించారు.. కాషాయం ధరించిన వారు కేవలం ముక్తి కోసమే పాటుపడుతుంటారని కొంతమంది భావిస్తారు. కాని దీనజనోద్ధరణకు పాటుపడతారని ఆయన మనసా, వాచా, కర్మణా నిరూపిస్తున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు..మహాశక్తి. సామాన్య మానవులు చేయలేని పనులను ధృడమైన, అకుంఠిత దీక్షతో, భగవత్ సంకల్పంతో, అవలీలగా చేస్తున్నారు.. ధర్మరక్షణ ఊపిరిగా జీవిస్తున్నారు.. అవును ఆయనే.. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌స్వామి. అందరూ గౌరవంగా, ప్రేమతో ‘చిన్నజీయర్’ అని ఆయనను పిలుచుకుంటున్నారు.
మానవత్వానికి ప్రతీకగా చెప్పుకొనే పెద్దజీయర్ స్వామి అడుగుజాడల్లో చిన్నజీయర్ పయనిస్తూ, సమాజానికి స్ఫూర్తిని కలుగచేస్తున్నారు. చిన్నజీయర్ యశస్సు దేదీప్యమానంగా వెలుగుతోంది. వెయ్యి కాదు..కాదు లక్ష వాల్టుల శక్తి ఆయనలో ప్రజ్వరిల్లుతోందంటే అతిశయోక్తి కాదు. ఆ శక్తిని అందరికీ పంచిపెడుతూ, కుల, మత, భాష, ప్రాంతాలంటూ భేదభావం లేకుండా లోక కల్యాణానికి వినియోగిస్తున్నారు.
చిన్న జీయర్ చిన్ననాటి పేరు శ్రీమన్నారాయణచార్య. 2016 అక్టోబర్ 31 న ఆయన ఆరు పదులు పూర్తి చేసుకుంటున్నారు. స్వాతి నక్షత్రంలో జన్మించినందు వల్ల స్వామి వారి 60వ జన్మదినోత్సవాన్ని... తిరునక్షత్రం ఆ రోజు నిర్వహిస్తున్నారు. నవయువకుడిలా కనిపించే చిన్నజీయర్‌కు అప్పుడే అరవైఏళ్లు నిండాయా అని చాలా మంది భక్తులు ఆశ్చర్యపోతున్నారు. షష్టిపూర్తి సందర్భంగా భక్తులు చిన్న జీయర్‌స్వామి ‘తిరునక్షత్ర మహోత్సవా’న్ని హైదరాబాద్ సమీపంలోని శ్రీరాంనగర్ (ముచ్చింతల్) లో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారు ఈ భువిపైకి వేంచేసిన నక్షత్రం ఆధారంగా జన్మదినోత్సవాన్ని జరుపుతున్నందు వల్ల ‘తిరునక్షత్ర మహోత్సవం’ అంటున్నారు. స్వామివారి షష్టిపూర్తి ఉత్సవాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోనూ భక్తులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శ్రీరామనగరం (రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ గ్రామ పరిధి) దివ్యక్షేత్రంలో అంగరంగవైభవంగా ఉత్సవాలు 2016 అక్టోబర్ 24 నుండి, నవంబర్ 6 వరకు నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామంలో 1956 సంవత్సరంలో దీపావళిరోజు ఆకులమన్నాటి చిలకమర్రి అలుమేలుమంగతాయారు-డాక్టర్ కృష్ణమాచార్యుల’ పుణ్యదంపతులకు శ్రీమన్నారాయణాచార్య జన్మించారు. రాజమండ్రిలో చదువుకున్నారు. అటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొనేవారు. జనరల్ నాలెడ్జి పుస్తకాలు బాగా చదివేవారు. వీరి తండ్రి వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ఇంగ్లీషు పుస్తకాలు పుంఖానుపుంఖాలుగా ఉండేవి. ఈ పుస్తకాలను రోజూ చదువడం వల్ల ఇంగ్లీషులో ప్రావీణ్యం లభించింది.
పెద్దలు చెప్పిన ఒక పనిమీద 1974-75 మధ్యకాలంలో గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోని ఉభయవేదాంతాచార్య పీఠానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ పీఠాధిపతి, చిన్న జీయర్ తాతగారైన (పూర్వాశ్రమం) శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామిని కలిశారు. ముఖంలో వర్చస్సుతో వెలిగిపోతున్న శ్రీమన్నారాయణాచార్యను చూసిన పెద్దజీయర్ మనస్సులో ఒక వెలుగు వెలిగింది. ‘ఈ కుర్రవాడిని సమాజ సేవకు వినియోగించుకుంటే ఎలా ఉంటుంది?’ అన్న భావన పెద్దాయనలో కలిగింది. శ్రీవిశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం కోసం తన వారసులుగా శ్రీమన్నారాయణాచార్యను నియమించాలని పెద్దజీయర్ భావించారు. దాంతో సంస్కృతం, ద్రవిడ సాహిత్యం, వేదాంతం, శ్రీభాష్యం, భగవిద్విషయం, దివ్యప్రబంధాలు తదితర అంశాలపై పరిపూర్ణజ్ఞానాన్ని అందించాలని సంకల్పించారు. ఈ ఆలోచనతోనే ‘శ్రీమన్నారాయణ వేదవేదాంగ పాఠశాల’ను నడిపిస్తున్న శ్రీ గోపాలాచార్య సామివారికి 1977 ఫిబ్రవరిలో చిన్న జీయర్‌ను అప్పగించారు. ఎనిమిది సంవత్సరాల్లో చదవాల్సిన చదువులన్నీ చిన్నజీయర్ కేవలం రెండు, రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి ఏడుకొండలవాడి సన్నిధిలో పెద్దజీయర్ కాషాయాన్ని చిన్నజీయర్‌కు అందించారు. 1980 ఫిబ్రవరిలో సన్యాసాశ్రమం స్వీకరించారు. నడిగడ్డపాలెంలోని పీఠానికి ఉత్తరాధికారి బాధ్యతలను అప్పచెప్పారు. 1980 లో పెద్ద జీయర్ పరమపదించిన తర్వాత పెద్దజీయర్ చేపట్టిన కార్యక్రమాలను చిన్నజీయర్‌స్వామి కొనసాగిస్తున్నారు. వైదిక ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించడం, వేద పాఠశాలలను, వేదవిశ్వద్యాలయాలను స్థాపించడం, ఉభయ వేదాంతాచార్య పీఠంలో పండిత సదస్సులను కొనసాగించడం, ఆగమశాస్త్రప్రవీణులను తయారు చేయడం, జీర్ణదేవాలయాల పునరుద్ధరణ, వైదిక సాంప్రదాయ గ్రంథాలను ముద్రించడం తదితర కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 1981 లో నడిగడ్డపాలెంలోని ఉభయవేదాంతాచార్య పీఠానికి ఆచార్యత్వాన్ని చేపట్టారు. బదరీక్షేత్రంలో శ్రీమన్నారాయణుడి సన్నిదిలో అష్టాక్షరీ మహామంత్రాన్ని అనుసంధానించి సిద్ధిపొంది సామాజిక ప్రచారోద్యమాన్ని చేపట్టారు. పెద్దజీయర్ ప్రారంభించిన స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాలను పూర్తి చేశారు. వీటిలో 108 వ యజ్ఞాన్ని తిరుమలలో 1008 కుండములతో నిర్వహించి ఆధ్యాత్మిక క్రతువు పూర్తి చేశారు.
వేదవిద్య, ఆగమ శాస్త్రాలను విద్యార్థులకు నేర్పించేందుకు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) ను చిన్న జీయర్ స్థాపించారు. 1984 లో జెట్ నేతృత్వంలో వేదవిశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. చిన్నతనంలోనే చురుకైన పిల్లలను ఈ విద్యాయాల్లో చేర్పించి వేద-వేదాంగ విద్యను నేర్పిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ (శ్రీరామనగరం), విశాఖపట్నంలలో వేదపాఠశాలలను స్థాపించి నడిపిస్తున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో తత్త్వకళాశాలను స్థాపించి, దీనికి అనుబంధంగా సంస్కృత పాఠశాల, వైదికాగమన విజ్ఞానాన్ని బోధించేందుకు ఆగమ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఒకటా.. రెండా.. చెబుతూపోతే కొండవీటి చాంతాడంత ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్), జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (సొసైటీ), వికాసతరంగిణి-్భరత్, వికాస తరంగిణి-విదేశాలు స్థాపించారు. ఆకలిగొన్నవారికి ఆహారం అందించేందుకు ప్రధాన కేంద్రాల్లో అన్నదానాల కార్యక్రమం కొనసాగుతోంది. యువతీయుకులకు హోమియో, ఆక్యుప్రషర్‌లలో అవసరమైన ప్రాథమిక శిక్షణ ఇస్తూ, సమాజంలో అవసరమైన వారికి సేవలను అందిస్తున్నారు. ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరంలో మూడంతస్తుల ‘దివ్యసాకేత’ క్షేత్రం, గురుకులం, గోశాల నడిపిస్తున్నారు. జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమి (జీవా) పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ నేతృత్వంలో వేదాంత పాఠశాల, అంధులకు కళాశాల, హోమియో కళాశాల, వంద పడకలతో హోమియో ఆసుపత్రి, నడిపిస్తున్నారు.
ఇవన్నీ ఒక ఎతె్తైతే త్వరలో ఏర్పాటు చేయబోయే సమతాస్ఫూర్తి కేంద్రం మరొక ఎత్తుగా చెప్పుకోవచ్చు. దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో శ్రీరామానుజుల వారి సహస్రాబ్ది సందర్భంగా 216 అడుగుల ఎతె్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రామానుజుల విగ్రహం చుట్టూ ఒక వలయాకారంలో 108 దివ్యదేశాలను తలపించే ఆలయాల నిర్మాణం చేపట్టారు. ప్రత్యేకంగా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ప్రత్యేక థియేటర్లు ఏర్పాటు చేసి, మహాపురుషుల జీవితాలతో డాక్యుమెంటరీలను ప్రదర్శించే ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీరామనగరం, సీతానగరం (విజయవాడ సమీపంలో ఉన్న ఆశ్రమం), నడిగడ్డపాలెం, విశాఖ తదితర ప్రాంతాల్లో స్వామి వారి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
స్వీయ ఆరాధన
‘స్వీయ ఆరాధన-సర్వ ఆదరణ’ అన్నది స్వామివారి నానుడి. అంటే సొంత మతాచారాలను పాటిస్తూ, ఇతర మతాచారాలను కూడా గౌరవించండి అన్నది ఆయన దివ్యబోధన. మానవసేవే మాధవసేవ అంటూ చాలా మంది ప్రచారం చేస్తూ, ఆచరిస్తున్నారు. చిన్న జీయర్ మరొక అడుగు ముందుకు వెళ్లి, ప్రకృతిలో మనుషులతో పాటు, పశుపక్ష్యాదులు, వృక్షాలు, నదులు, పర్వతాలు, అడవులు ఉన్నాయని, ఇవన్నీ భగవంతుడికి ప్రతిరూపాలేనని చెబుతూ, ‘మాధవసేవగా సర్వప్రాణిసేవ’ చేయాలని సంకల్పించారు. ఎంత ఉదాత్తమైన భావన కదా ఇది.
ఇన్ని కార్యక్రమాలు చేపట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న చిన్నజీయర్‌ను ఒక శక్తి అనడం ఆశ్చర్యమేమీ కాదు కదా!
...............................
సమతామూర్తి స్ఫూర్తిక్షేత్రం

భగవత్ రామానుజులు సహస్రాబ్ది (1000 వ జయంతి) సందర్భంగా చిన్న జీయర్ నేతృత్వంలో సహస్రాబ్ది (1017-2017) ఉత్సవాలు 2017 నవంబర్‌లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా సమతామూర్తి స్ఫూర్తి క్షేత్రాన్ని 45 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని శ్రీరామనగరం (రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం) ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్షేత్రంలో రామానుజుల వారి భారీ విగ్రహాన్ని (216 అడుగులు) ఏర్పాటు చేస్తారు. విగ్రహంతో పాటు పీఠభాగం కలిపి ఇంత ఎత్తు ఉంటుంది. ప్రపంచంలో కూర్చుని ఉన్న రూపంలో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇదే పెద్ద విగ్రహంగా రికార్డుల్లోకి ఎక్కబోతోంది. దీన్ని చైనాలో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ‘నభూతో నభవిష్యతి’ అన్న విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు భగవత్ రామానుజుల బంగారు విగ్రహాన్ని 120 కిలోలతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
రామానుజులు గొప్ప మానవతామూర్తి. మనలో అహంకారాన్ని తొలగించుకుని, సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాలని, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని చాటిచెప్పిన వారు. అందుకే రామానుజుల విగ్రహాన్ని ‘సర్వసమానత్వ విగ్రహం’ అంటున్నారు.
ఇలా ఉండగా సమతామూర్తి స్ఫూర్తిక్షేత్రంలో రామానుజుల విగ్రహానికి కొద్దిదూరంలో వలయాకారంలో (విగ్రహం చుట్టూ) 108 దివ్యదేశాల ఆలయాల నమూనాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దివ్యదేశాలను గుర్తుకు తెచ్చేలా వీటిని నిర్మిస్తున్నారు. అలాగే ఒక ఓమ్ని మాక్స్ థియేటర్, ఒక యాంఫీ థియేటర్లను కూడా నిర్మిస్తున్నారు. మన పురాణ పురుషుల జీవితాలను ప్రజలకు తెలియచేసేందుకు వీలుగా వీటిని రూపొందిస్తున్నారు. అలాగే ఒక ధ్యాన కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. భక్తులు ప్రసాదాలను తీసుకునేందుకు వీలుగా రిఫ్రెషింగ్ లాంజ్ ఒకటి ఏర్పాటవుతోంది. హైదరాబాద్‌కే వనె్న తెచ్చే విధంగా దీన్ని రూపొందిస్తుండటం అదృష్టంగా చెప్పుకోవచ్చు.

............................
దివ్యసాకేతం

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి వనె్న తెస్తున్న మరో అద్భుత కట్టడం ‘దివ్యసాకేతం’. దివ్యసాకేతం పేరు గురించి అధ్యయనం చేస్తే, ఈ పేరును శ్రీకృష్ణపరమాత్ముడు వాడారు. నిజం చెప్పాలంటే దివ్యసాకేతం ఆలయం ఈ శ్రీరామనగరానికే కాదు..్భగ్యనగరానికి..ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు వనె్న తెచ్చే విధంగా ఉంది. ఈ తరహా కట్టడం తమిళనాడులోని ఒక చోట తప్ప దేశంలో మరెక్కడా లేదు. సాధారణంగా దేవాలయం ఒకే గర్భగుడితో ఒకే అంతస్తుతో ఉంటుంది. దివ్యసాకేతం నిర్మాణం మాత్రం మూడు అంతస్తులుగా ఉంది. మొదటి అంతస్తు గర్భాలయంలో సీతారామలక్ష్మణ స్వాముల విగ్రహాలతో నిర్మించారు. రెండో అంతస్తు గర్భాలయంలో లక్ష్మీ, గోదాసమేత శ్రీరంగనాథుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు గర్భాలయంలో వైకుంఠ నారాయణుడు వేంచేసి ఉన్నాడు. వైకుంఠం అంటే ఇలా ఉంటుంది అన్న విధంగా అత్యద్భుతంగా నిర్మించారు. మూడు ఆలయాలకు కలిపి ఒక గోపురం (విమానం) ఉంది. ఇక్కడ నిత్యపూజలు, ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దివ్యసాకేతాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి తీరాల్సిందే!
................................
సమాజ హితమే... పథం

చిన్న జీయర్ నేతృత్వంలో వేర్వేరు పేర్లతో కొనసాగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని...
విద్య: ప్రకాశం జిల్లా మార్టూరులో ‘జీవన్ వికాస్’ పేరుతో పేదపిల్లలకోసం పదోతరగతి వరకు పాఠశాల నడిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి (గిరిజనులకు), ఉట్నూరు మండలం బీర్సాయిపేట, ప్రకాశం జిల్లా కఠారివారాపాలెం (గంగపుత్రులకు) లలో జీయర్ గురుకులాలు నడుస్తున్నాయి.
వేద విద్యాలయాలు: శ్రీరామనగరంతో పాటు విశాఖ, సీతానగరం, కరీంనగర్ (ఎల్‌ఎండి) లలో వేదపాఠశాలలు నడుస్తున్నాయి.
అంధులకు విద్య: శ్రీరామనగరంలో అంధులైన విద్యార్థుల కోసం జూనియర్, డిగ్రీకాలేజీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లా వారిజలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల నడుస్తున్నాయి.
ప్రజ్ఞ: ప్రజ్ఞ పేరుతో విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రీరామనగరంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అన్నదానం: బదరీనాథ్ అష్టాక్షరీ క్షేత్రం, హృషీకేష్, శ్రీరంగం, మేల్కొటే, తిరుమల, భద్రాచలం, నడిగడ్డపాలెం, సీతానగరం, శ్రీరామనగరంలలో రోజూ ఉచిత అన్నదానం జరుగుతోంది.
ఆదర్శగ్రామం: ఆదిలాబాద్ జిల్లాలో యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఆదర్శ గ్రామాలను రూపొందించే మహత్తర కార్యక్రమం కొనసాగిస్తున్నారు. 11 గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్మాణం చేశారు.
ప్రకృతి విలయాలు: ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు స్వామి వెంటనే స్పందిస్తున్నారు. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు చేయూత ఇస్తున్నారు. గుజరాత్‌లోని వల్లభాపూర్‌లో 88 శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చారు. నేపాల్ భూకంపబాధితులకు తాత్కాలిక సాయం అందిస్తూ, 1.50 కోట్ల ఖర్చుతో విద్యాలయం నిర్మిస్తున్నారు. తమిళనాడులో సునామీ రాగా, నాగపట్నంలో 50 మందికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. మత్స్యకారుల జీవనం కోసం పడవలు అందించారు. జపాన్‌లో సునామీ సందర్భంగా 11 లక్షల రూపాయలు అందించారు.
ఉగ్రవాద నివారణ కోసం: ఉగ్రవాద నివారణ కోసం మానస సరోవరం తీరంలో బ్రహ్మయజ్ఞం 2002 లో నిర్వహించారు. కార్గిల్ అమరవీరుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు.
వృద్ధాశ్రమం: గుంటూరు జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జిమ్స్: జీయర్ ఇంటిగ్రెటివ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్) పేరుతో శ్రీరామనగరంలో హోమియో మెడికల్ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి నడిపిస్తున్నారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి విధానాల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నారు.
వైద్య శిబిరాలు: గ్రామీణులకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 2500 పైగా ఉచిత క్యాన్సర్ శిబిరాలు నిర్వహించి రెండు లక్షల మంది మహిళలకు చికిత్స అందించారు. 1300 వరకు ఉచిత వైద్య శిబిరాలు, 900 పైగా కంటి చికిత్స శిబిరాలు, 1000 కిపైగా దంత వైద్య శిబిరాలు నిర్వహించారు.
అవయవదానం: అవయవదానం గొప్ప దానమని భావించిన చిన్నజీయర్ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎవరైనా అవయవదానం చెయవచ్చు. అనుకోకుండా ఎవరైనా చనిపోతే, ఆరుగంటల వ్యవధిలో వారి అవయవాలను సేకరించి, అవసరమైన వారికి అమరుస్తారు. ఇందుకోసం ముందుకు వచ్చేవారు 040-6636 9369/98492 45948 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు.
పశువైద్య శిబిరాలు: పశువులకు ఉచితంగా చికిత్స అందించేందుకు తరచూ పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తూ, ఏటా రెండు లక్షల పశువులకు చికిత్స అందిస్తున్నారు.
ఆలయాల జీర్ణోద్ధరణ: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు చిన్న జీయర్ శ్రీకారం చుట్టారు.
గోసేవ: సీతానగరం, శ్రీరామనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేసి దాదాపు 500 గోవులను రక్షిస్తున్నారు.
ఖైదీల్లో పరివర్తన: ఖైదీల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు జీయర్‌స్వామి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా రూపుదిద్దుతున్నారు. వారి కుటుంబాల పోషణకోసం కుట్టుమిషన్లు, సైకిళ్లు తదితర వస్తువులను అందిస్తున్నారు.
భక్తినివేదన: భక్తినివేదన పేరుతో ఆధ్యాత్మిక మాసపత్రిక నడిపిస్తున్నారు.
పురస్కారాలు: వేదవిద్యావ్యాప్తికి పాటుపడుతున్నవారికి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైదిక గ్రంథాలను ముద్రిస్తున్నారు.

-పి.వి. రమణారావు 98499 98093