S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిరిసిరిమువ్వ

నేను వెతికి వెతికి శ్రీరంగం శ్రీనివాసరావు సాహిత్య సర్వస్వంలో నుంచి ఆయన పాత ఛాదస్తం బయటపెట్టే పుస్తకాన్ని ఒకదాన్ని వెతికి తెచ్చుకున్నాను. అందులో శ్రీశ్రీ రాసిన పద్యాలు, పాత పద్ధతి కవితలు, నాటకాలు మొదలయినవన్నీ ఉంటాయి. ఒకప్పుడు ఒకానొక పత్రికవాళ్లు నన్ను సాహిత్య వ్యాసం రాయమన్నారు. అది వానకాలం. కనుక నాకు మబ్బులను గురించి రాస్తే బాగుంటుంది అనిపించింది. రకరకాల కవులు మబ్బులను గురించి చెప్పిన పద్యాలను ఒకచోట చేర్చి వ్యాసం రాశాను. అందులో విశ్వనాథ సత్యనారాయణ పద్యం తరువాత ఇంచుమించు అదే ధోరణిలో శ్రీశ్రీ పద్యం కూడా వచ్చింది. చదివిన వాళ్లు చాలామంది ఆశ్చర్యపోయారు. అంతటితో ఆ వ్యవహారం కొంత వెనకబడిపోయింది.
మేం వచ్చేస్తున్నాం, కిందకు దిగుతారా? అన్నాడు మిత్రుడు సూరిబాబు. నాకు అర్థమయింది. అతను కారునిండా కావలసినన్ని పుస్తకాలు తీసుకుని వస్తున్నాడు. వాటిలో నుంచి నాకు కావలసినవి నేను ఏరుకుని పైకి అంటే, అయిదవ అంతస్తులో ఉన్న నా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఆ పని చేశాను. మిగతా పుస్తకాల గురించి ఇప్పుడు చెప్పడం మొదలుపెడితే ఇవాళటి విషయం వెనకబడిపోతుంది. కనుక ఏకంగా ఒక్క పుస్తకం గురించి మాత్రమే చెపుతాను. శ్రీశ్రీ సాహిత్య సర్వస్వంలోని 18వ పుస్తకం ఇది. అట్ట వెనుక ఉన్న బొమ్మను చటుక్కున చూస్తే ఏదో యూరోపియన్ దేశానికి చెందిన ఒక రచయిత లేదా వక్తలాగ కనిపించాడు శ్రీశ్రీ. కవర్ పేజి మీద ఉన్నది ఫొటో కాదు. చాలా అందంగా వేసిన లేదా గీసిన బొమ్మ అది. పుస్తకంలో ఎక్కడా ఆ బొమ్మ గీసింది ఎవరో రాయలేదు. కానీ తప్పకుండా మోహన్ గీసిన బొమ్మ అని నేను చెప్పగలను. ఆ బొమ్మలో ఆ తీరు స్ఫుటంగా కనపడుతున్నది.
ఇంతకూ ఈ పుస్తకం శ్రీశ్రీ ఉపన్యాసాల సంకలనం. మూడు వందల పేజీల పుస్తకం వేశారు. అంటే, గింటే శ్రీశ్రీ అనే శ్రీరంగం శ్రీనివాసరావు చాలా బోలెడు ఉపన్యాసాలు చేసినట్టే లెక్క. కానీ చిత్రంగా కొన్ని విషయాలను గురించి మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు.
ఈ ప్రపంచంలో తెలివిగా, బాగా రాయగలిగిన చాలామందికి మాట్లాడటం చేతకాదు. విషయం ఉండనీ, లేకపోనీ గంటల తరబడి ఉపన్యాసాలు చేయగలవారికి కలం పట్టుకుంటే దడ మొదలవుతుంది. అక్షరాలు కాగితం మీద కదలనంటూ నిలబడిపోతాయి. అవును మరి, అన్ని విద్యలు ఒకరికే చేతనయితే బాగుండదు కదా! నేను నిజానికి శ్రీశ్రీని చూడనే లేదు. ఆయన ఉపన్యాసం వినడం అనే సమస్యే నాకు లేదు. కానీ ఎందుకో ఆయన రాతలు చదివినా లేక బొమ్మలు చూచినా ఆ మనిషికి అనర్గళంగా ఉపన్యాసం చేయడం చేతనవుతుందని అనిపిస్తుంది. కనీసం నాకు అనిపించింది. అలవోకగా కవితలో లయతో సహా ముందుకు కదిలే శ్రీశ్రీకి ఆ పొడి పేరులోనే లయ ఉంది. మరి మాటలు రావంటే నాకెందుకో అనుమానం కలిగింది.
పుస్తకం తెరిచి చూచాను. మొట్టమొదట్లోనే మా మాటలు అంటూ చలసాని ప్రసాద్ రాసిన ఒక సుమారు మూడు పేజీల ముందు మాటలు ఉన్నాయి. చలసాని ప్రసాద్ ఉపన్యాసం కూడా వినలేదు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా?’ అన్న పాటను మాత్రం ఆయన నోట, ఇతరుల నోట విన్నాను. కమ్యూనిస్టు నాయకులలో డాంగే మొదలు జ్యోతిబాసు దాకా ఎంతోమంది ఉపన్యాసాలు విన్నాను. ఈ రెండు పేర్ల మధ్యన ఉన్న మిగతా వాళ్ల గురించి ఇక్కడ చెప్పను. మొత్తానికి వాళ్లంతా నిజంగా చేటలతో మాటలు చెరిగే రకం మనుషులే. శ్రీశ్రీకి కూడా కేవలం కమ్యూనిస్టు ప్రచార బాధ్యతలు తలమీద పడ్డందుకే ఉపన్యాసం అన్న కళ అంతో ఇంతో చేతనయిందట.
‘శ్రీశ్రీ ఉపన్యాసాల సంపుటేమిటని కొందరు చప్పరించవచ్చు. గొప్ప వక్త కాదు కదా కనీసం మంచి ఉపన్యాసకుడయినా కాదు శ్రీశ్రీ, వేదిక ఎక్కేసరికి మాత్రం నోరు పెగలదు. కాళ్లు తడబడవు గానీ, నీళ్లు నములుతాడు’ అంటూ ప్రసాద్‌గారు మూడు వందల పేజీల ఉపన్యాసం పుస్తకం మొదట్లోనే రాసి లేదా చెప్పి బహుశా చదువరుల ఆసక్తిని మరీమరీ పెంచినట్టున్నారు. వినేవారిని ఆకట్టుకునేటట్టు స్పష్టంగా, శ్రావ్యంగా, స్వచ్ఛంగా, సమగ్రంగా శ్రీశ్రీ మాట్లాడలేడు పొమ్మన్నారు. అయినా సరే, పుస్తకం చదవకుండా ఉండగలుగుతామా? చదివి తీరుతాం కదా!
ఈ పుస్తకంలో శ్రీశ్రీ ఉపన్యాసాల కన్నా ఉపన్యాసాలకు సంబంధించిన పత్రిక వార్తలుల, వివరాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఉపన్యాసాలు లేకపోలేదు. అందులో ఒకటి నన్ను బాగా ఆకర్షించింది. 1955 జులై చివరలో విజయవాడలో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల అయిదవ మహాసభలో అధ్యక్షుడిగా శ్రీశ్రీ చదివిన ఉపన్యాస పాఠం అది. అంటే ఆయనకు ఉపన్యాసం ఇవ్వడం రాదని మళ్లీ రుజువయింది. ముందే రాసుకుని చదివాడన్నమాట. కానీ ఉపన్యాసం చదువుతూ ఉంటే రాసి చదివిన వ్యాసంలాగ ఎంతమాత్రమూ లేదు. చెప్పదలచుకున్న సంగతి సూటిగా, గట్టిగా చెప్పడం ఆయనకు బాగా చేతనయింది. నిజానికి ‘ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను’ అన్న వాక్యం ఒకటి ఈ ప్రసంగం వ్యాసంలో ఉంది.
సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం గురించి ఆయన మాట్లాడుతూ నిజంగా చక్కని విషయాలు చెప్పారు. పాత పద్ధతి రచయితల మీద ఆయన విసిరిన విసుర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఆ యొక్క దిలీప మహారాజు కాలంలో అని వీరి పురాణం ఆరంభమవుతుంది. ఎన్నికలు, ఎలక్ట్రిక్ దీపాలు లేని కాలం. ఏనుగు చేత పూలదండను పంపించి, కాబోయే రాజును కనుక్కునే కాలం (ఏం? అది ఒక రకం ఎలక్షనే!) (వేదిక మీద నుంచి ఇచ్చే ఉపన్యాసంలో బ్రాకెట్ ఎట్లాగుంటుంది? దాన్ని ఎలా వాడుకుంటారు? కనుక ఈ సదరు ఉపన్యాసం కేవలం వ్యాసమని భవదీయుని భావన! ఇంతకూ ఈ బ్రాకెట్ మాత్రం నా స్వంతం.) ప్రపంచమంతా ఏడు ద్వీపాలు, ఏడు సముద్రాలు అనే నమ్మకాలం. వీరు కోరేది కూడా అభ్యుదయమే. ఒక పదిహేనేళ్లు ఓపిక పట్టండి, మాతృభాష తెలుగు, పితృభాష హిందీ, పితామహ భాష సంస్కృతం, సోదరీ భాష కన్నడం! ఇలాగ ఒక పెద్ద అవిభక్త కుటుంబం ఆవిర్భవిస్తుంది. ఆహా! ప్రజాస్వామ్యం! ఓహో మనోహర స్వప్నం!’
శ్రీశ్రీగారికి ప్రేమగా పిలిస్తే శ్రీశ్రీకి ఉపన్యాసం రాదేమో గానీ, మాటలు రావని ఎవరన్నా అంటే వాడి బుర్రను పిడికెటుతో పగులగొట్టవచ్చు. ఈ ఉపన్యాసం చాలా పొడుగ్గా సాగింది. ఆసక్తికరంగానూ ఉంది. రచయితల ఆర్థిక పరిస్థితిని బాగుచెయ్యడం గురించి ఆయన ఒకచోట మొదలుపెడతారు. చంద్రుడిలోని అమృతాన్ని మాత్రమే సేవిస్తూ ఏ రచయిత కూడా ఎంతోకాలం జీవించలేడు అని చాలా కవితాత్మకంగా చెపుతారు. ఎందుకు కలిగిందో గానీ, ఆయనకు ముందుకు సాగుతూ ఉంటే రేడియో గురించి మాట్లాడాలన్న భావన కలిగింది.
నేను కూడా అవకాశవాణి అని అందరూ ముద్దుగా పిలుచుకునే ఆకాశవాణిలో ఉద్యోగం చేశాను గనుక శ్రీశ్రీ గారి వ్యాసం చదువుతుంటే ఒక్కసారి చెంప మీద ఛెళ్లుమని కొట్టినట్టు అనిపించింది. ఈ ఉపన్యాసం 1955లో జరిగింది. అంటే నెలలతో సహా నేను పుట్టిన రెండు సంవత్సరాలకు అన్నమాట. అప్పటికి నాకు ఊంగా ఊంగా తప్పితే తెలుంగా లేది తెలుగు అనే భాష రానేరాదు. కనుక శ్రీశ్రీ ఉపన్యాసం వినే అవకాశం లేదు. విన్నా అర్థం చేసుకునే అవకాశం అంతకన్నా లేదు. రేడియోలో నేను ఉక్కిరిబిక్కిరయి ఉద్యోగం వదులుకుని బయటపడ్డాను. ఇక్కడ నాకు శ్రీశ్రీ ఉపన్యాసం చదువుతూ ఉంటే ఒక గొప్ప సత్యం ఎదురయింది. ఉపన్యాసంలో భాగంగా ఆయన చెప్పిన ఒక మాటను, అనగా ఒక వాక్యాన్ని ‘స్వాతంత్య్ర వాయువులు పీల్చడానికి అలవాటుపడ్డ మనిషి మన రేడియో స్టేషన్‌లలో ఏ హోదాలో ప్రవేశించినా ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు’ అని ఆయన నేను పుట్టిన రెండు సంవత్సరాలకే వేదిక మీద నుంచి బాహాటంగా చెప్పారు. అంటేగింటే ఆనాటికీ, నేటికీ పరిస్థితిలో తేడా రానేరాలేదని నాకు ఇప్పుడు అర్థమవుతున్నది.
అప్పుడెప్పుడో శ్రీశ్రీ కవితల పుస్తకం సంపాదించుకున్నాను గదా! దాని బదులు ఈ ఉపన్యాసాల సంకలనం వెదికి తెచ్చుకుని ఉంటే బతుకుబాటలో నేనుగా ఏర్పాటు చేసుకున్న మలుపు తప్పేమీ కాదని అప్పుడే నమ్మకం కలిగి ఉండేది. సరే, ఇప్పటికి కలిగింది గదా! ఇది చాలు.

కె.బి. గోపాలం