S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు 5

‘శనివారం ఉదయం నుంచి సాయంకాలం వరకూ మీరెక్కడున్నారు?’ సుందరాన్ని అడిగేడు యుగంధర్.
‘మధురవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో...’ చెప్పాడతను.
‘అంటే రాంప్రసాద్ హత్య జరిగినప్పుడు మీరక్కడే ఉన్నారన్నమాట. ఆఫీసులో ఎంతసేపున్నారు?’
‘శుక్రవారం కొన్ని సైట్లు రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ డాక్యుమెంట్లు తీసుకోవడానికి శనివారం వెళ్లాను. సాయంకాలం ఆరు వరకూ అక్కడే ఉన్నాను’ జవాబిచ్చాడు సుందరం.
ఆ ఇద్దరితో కరచాలనం చేసి బయటకొచ్చాడు యుగంధర్. పరవాడ పోలీసుస్టేషన్‌కి, పోతిన మల్లయ్యపాలెం స్టేషన్‌లోని ఎస్సైకి కాల్ చేసి రాజిరెడ్డి, సుందరంల ఎలిబీ చెక్ చెయ్యమన్నాడు.
ఆ తర్వాత జీపుని ఆంధ్రా బ్యాంక్ వైపు పోనిచ్చాడు.
* * *
తన సీటులో అనీజీగా కదిలేడు రాజేష్.
ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నా అప్పుడప్పుడు భూపతి పేరు తళుక్కున మెరుస్తోంది. మనుషుల్ని పంపి తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావడంలేదు. రాత్రి మాదిరిగానే మరో ప్రయత్నం జరగదని గ్యారంటీ లేదు. కేవలం రాసమణితో మాట్లాడినందుకే తన గురించి

తెలుసుకోవాలనుకున్నారా? లేక మరేదయినా కారణం ఉందా?
‘మేం భూపతి మనుషులం...’ అన్నాడా మనిషి.
అంటే నగరంలో భూపతికి బాగా పేరు ఉండి ఉండాలి. ఆ పేరు మంచిదా చెడ్డదా అనేది వేరే విషయం. తన గురించి వాళ్లు తెలుసుకోవడానికి ముందే భూపతి గురించి తను తెలుసుకోవాలి.
ఎలా?
ఆ మధ్యాహ్నం లంచ్ అయ్యాక రాసమణికి కాల్ చేశాడు.
‘హలో...’ వినిపించింది అటు నుంచి.
‘రాసమణి...’ అన్నాడు, అది స్ర్తి గొంతు కావడంతో.
‘కాదు.. రమణిమాల నా పేరు. రాసమణి స్నానానికి వెళ్లింది. మీరెవరు?’
‘నా పేరు రాజేష్’ చెప్పాడు.
‘ఈ రోజు మీకు రాసమణితో అపాయింట్‌మెంట్ ఉందా?’
‘లేదు’
‘మరెందుకు కాల్ చేశారు?’
సమాధానం ఏం చెప్పాలో తోచలేదతనికి. అంతకు ముందు భూపతి మనుషులు తన గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యడంవల్ల రాసమణి చుట్టూ ప్రమాదకరమైన అంశాలు దాగి ఉన్నాయని భావించాడు. అందుకే చప్పున జవాబు ఇవ్వలేకపోయాడు.
‘సమాధానం చెప్పరేం..’ ఆ గొంతులో సందేహం.
‘రొటీన్‌గా చేశాను’ చెప్పాడు.
అవతల నుంచి నవ్వు. అది తెరలు తెరలుగా రాజేష్ చెవుల్ని తాకుతోంది.
‘ఇందులో నవ్వడానికేముంది?’ ముఖం చిట్లించేడు.
‘శారీరక సంబంధాలు తప్ప మానవ సంబంధాలతో పని లేని వాళ్లని రొటీన్‌గా పలకరిస్తే నవ్వు రాదా మరి?’
‘మీతో ఓసారి మాట్లాడాలి...’
‘అపాయింట్‌మెంట్ తీసుకోండి’ మళ్లీ నవ్వు.
‘ఎలా తీసుకోవాలి?’
‘రాసమణి చెప్పలేదా?’
‘లేదు... మీరు చెప్పండి’
‘అది..’ ఆమె చెప్పబోతూండగా మధ్యలో మరో గొంతు కరుకుగా వినిపించింది. ‘ఎవరితో మాట్లాడుతున్నావ్?’
‘సారీ రాంగ్ నెంబర్...’ కాల్ కట్ చేసిందామె.
తన సెల్ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయేడు రాజేష్. పరిస్థితి చూస్తుంటే మళ్లీ చెయ్యడం మంచిది కాదని తోచింది. రాసమణి వెనుక బలమైన నెట్‌వర్క్ ఉందని, దాన్ని దాటి ఆమెని కలవడం అంత తేలిక కాదని అర్థమైందతనికి. తను అనవసరంగా ఆమె జోలికి వెళుతున్నాడేమోననే సందేహం కలిగింది.
* * *
‘రాంప్రసాద్ హత్య కేసు దర్యాప్తు పని మీద వచ్చాను. నా పేరు యుగంధర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ని’ చెప్పాడు మేనేజర్‌తో.
‘కూర్చోండి...’ కుర్చీ చూపించి, అంతవరకూ చూసిన కంప్యూటర్ షీట్ మీద సంతకం చేసి దాన్ని పక్కనపెట్టి పేపర్ వెయిట్ ఉంచాడు. ఎగిరిపోకుండా కాలింగ్ బెల్ నొక్కి మెసెంజర్ వచ్చాక చెప్పాడు.
‘రెండు కాఫీ తీసుకురా...’ యుగంధర్ని చూసి అడిగేడు ‘దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?’
‘ప్రాసెస్‌లో ఉంది.. ఇంతవరకూ ఏమీ తెలియలేదు’ చెప్పాడు యుగంధర్.
‘రాంప్రసాద్ వంటి ఎఫీషియంట్‌ని చంపేంత తీవ్రమైన పరిస్థితులు ఏమొచ్చాయో ఎంత ఆలోచించినా అర్థం కావడంలేదు’ మేనేజర్ అన్నాడు.
‘అతను ఎలాంటి వాడు?’ మొదటి ప్రశ్న అడిగేడు యుగంధర్.
‘వేలెత్తి చూపే వ్యక్తి కాదతను. బ్యాంక్ టైంకి ఓ అరగంట ముందు వచ్చి పని ముగిసేక వెళ్లేవాడు. సిబ్బంది మీద కాని కస్టమర్ల మీద కాని విసుక్కోవడం నేనెప్పుడూ చూడలేదు. అలాగే లోన్ రికవరీ విషయంలో చాలా సిన్సియర్...’ చెప్పాడతను.
‘అవినీతిపరుడా?’
‘కాదు. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి తీసుకోని మనిషి. రాంప్రసాద్ మా బ్రాంచ్‌కి వచ్చాక బిజినెస్ పెరిగింది. గత సంవత్సరం వ్యాపారంలో మాదే మొదటి స్థానం’ అన్నాడు మెరుస్తున్న కళ్లతో. అతని మాటల్లో రాంప్రసాద్ మీదున్న గౌరవం వ్యక్తమవుతోంది.
ఇంతలో మెసెంజర్ రెండు కప్పులతో కాఫీ తెచ్చి టేబుల్ మీద ఉంచి వెళ్లిపోయాడు.
‘తీసుకోండి...’ చెప్పాడు మేనేజర్ తనో కప్పు అందుకుంటూ.
యుగంధర్ కాఫీ తాగుతూ చుట్టూ చూశాడు.
మేనేజర్ కేబిన్ నుండి బ్యాంక్ మొత్తం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికే వర్కింగ్ అవర్ పూర్తి కావడంతో సెక్యూరిటీ ఎంట్రన్స్ మూసేశాడు. లోపల వుండిపోయిన కస్టమర్స్‌ని సైడ్ డోర్ నుండి బయటకు పంపుతున్నాడు.
‘రాంప్రసాద్‌కి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధం ఉందన్న విషయం మీకు తెలుసా?’ అడిగేడు యుగంధర్, ఖాళీ కప్పు టేబుల్ మీద ఉంచుతూ.
చిన్నగా నవ్వేడు మేనేజర్.
‘తెలుసు... నేను రెండు సైట్లు తీసుకున్నాను అతని దగ్గర’ చెప్పాడు.
‘అతనే అమ్మాడా?’
‘అవును. బ్యాంక్ నుండి పర్సనల్ లోను తీసుకుని కొంతమందితో కలిసి భూమి కొన్నాడు. లే అవుట్ వేశాక రాంప్రసాద్ వాటాకి ఆరు ప్లాట్లు వచ్చాయి. అందులో రెండు రీజనబుల్ రేటుకి నాకిచ్చాడు. మిగతావి మార్కెట్ ధరకి అమ్మాడు. కొంత బ్యాంకు అప్పు తీర్చి ఆ తర్వాత మరో లే అవుట్‌లో భాగస్తుడయ్యాడు. అలా వచ్చిన ఆదాయంతో గ్రూప్ హౌస్ కొన్నాడు. గృహ ప్రవేశానికే రెండు లక్షలు ఖర్చు చేశాడు. మంచి భవిష్యత్తున్న వ్యక్తి జీవితం అర్ధాంతరంగా ముగిసింది’ అన్నాడు బాధగా.
మెదడ్ని ఆవరించిన మబ్బులు క్రమంగా విడిపోతున్న ఫీలింగ్ కలిగింది యుగంధర్‌కి.
‘రాంప్రసాద్ ఎవరితో కలిసి వ్యాపారం చేశాడు?’
‘గృహ ప్రవేశం నాటి రాత్రి మందు పార్టీలో ఇద్దర్ని పరిచయం చేశాడు. వాళ్ల పేర్లు గుర్తులేవు’
కొద్దిసేపు వౌనంగా ఉండిపోయేడు యుగంధర్.
‘మీరు రాంప్రసాద్ నుంచి తీసుకున్న ఇంటి స్థలాలని నేరుగా అతనే రిజిస్ట్రేషన్ చేశాడా?’ అడిగేడు.
రెండు క్షణాలు ఆలోచించి సమాధానం ఇచ్చాడు మేనేజర్.
‘రాంప్రసాద్ ఉద్యోగి కాబట్టి ప్రత్యక్ష జోక్యం లేకుండా జాగ్రత్త పడ్డాడు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని ఏర్పాట్లు చేశాక కాల్ చేస్తే వెళ్లాను. అక్కడ చాలామంది ఉన్నారు. నన్ను పిలిచినప్పుడు వెళ్లి సంతకం చేశాను. రెండు రోజుల తర్వాత డాక్యుమెంట్లు ఇచ్చాడు రాంప్రసాద్. మొత్తం డబ్బు అతనికి చెల్లించాను. అందుచేత రిజిస్ట్రేషన్ ఎవరు చేశారో నాకు తెలియదు’
‘డాక్యుమెంట్స్‌లో పేరు ఉంటుంది కదా!’
‘ఉంటుంది’
‘డాక్యుమెంట్ చూసి పేరు, చిరునామా నాకు చెప్పాలి’ అని, తన సెల్ నెంబర్ ఇచ్చాడు యుగంధర్.
‘ఉద్యోగపరంగా రాంప్రసాద్‌కి ఎలాంటి సమస్యలు లేవు కదా?’
‘లేవు. రెండేళ్ల క్రితం ఇద్దరు వ్యక్తులకు చెరో పాతిక లక్షలు అప్పిచ్చాడు. వాళ్లింతవరకూ బ్యాంక్‌కి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దాన్ని రికవరీ చేయాల్సిన బాధ్యత అతనిదే. ఈ సంవత్సరం కొంతయినా రికవరీ చెయ్యమని గట్టిగా చెప్పాను. ఆ పని మీదే ఉన్నాని గత వారం చెప్పాడు’
‘లోన్ తీసుకున్న వారి పేర్లు, చిరునామాలు ఇవ్వగలరా?’ అతను చెప్పింది శ్రద్ధగా విన్న యుగంధర్ అడిగేడు.
వెంటనే ల్యాప్‌టాప్ ఆపరేట్ చెయ్యసాగేడు మేనేజర్. పది నిమిషాల తర్వాత చెప్పాడు,
‘జనత రియల్ ఎస్టేట్ పేరు మీద బాజిరెడ్డి, సాయి ట్రేడర్స్ యజమాని సదాశివం అనే ఇద్దరు లోన్ తీసుకున్నారు. ఆరు నెలలకే వాళ్లిద్దరూ బోర్డు తిప్పేశారని తెలిసింది. దాని గురించి అడిగితే అదంతా నేను చూసుకుంటానని చెప్పాడు రాంప్రసాద్’
ఆ రెండు చిరునామాలు నోట్ చేసుకున్నాడు యుగంధర్.
4
అది ఇంజనీరింగ్ కాలేజి క్యాంపస్. లంచ్ అవర్ కావడంతో కొంతమంది క్యాంటీన్ వైపు, బాక్సులు తెచ్చుకున్నవారు స్ట్ఫారూమ్ వైపు కదులుతున్నారు. అలా క్యాంటీన్ వైపు వెళుతున్న అమ్మాయిల్లోని ఓ అమ్మాయి సెల్ మోగింది.
‘హల్లో...’ ఆన్సర్ చేసింది.
‘స్వప్నా?’ అటు నుంచి అడిగేరు.
‘ఎస్...’
‘్భపతిని’
ఆమె చప్పున మిగతా స్టూడెంట్స్‌కి దూరంగా నడిచింది.
‘చెప్పండి’
‘ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి హాస్టల్ దగ్గరకి కారొస్తుంది...’
ఆమె వెంటనే బదులు చెప్పలేదు.
‘వినిపించిందా?’ కాస్త కటువుగా అడిగింది ఆ కంఠం.
‘వినిపించింది’

(మిగతా వచ్చే సంచికలో)

-మంజరి 9441571994