S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఛాలెంజ్

కథల పోటీలో
ఎంపికైన రచన
**

తన ఎదురుగుండా ఉన్న అతన్ని తీక్షణంగా చూసింది డా.మహాలక్ష్మి. అతనికి ఇరవై ఎనిమిదేళ్లు. చూడటానికి తెలివైనవాడిలాగే ఉన్నాడు. అతని ముఖంలో చదువు నేర్పిన అణకువ కనిపిస్తోంది. భయం భయంగా ఇటూ అటూ చూస్తున్నాడు. అతన్ని చూస్తున్న కొద్దీ తన కళ్లు ఎర్రబడసాగేయి. గతం అంతా జ్ఞాపకం వస్తోంది. ఆమె జీవితంలో ఎందరో పేషెంట్లను చూసింది. వాళ్లంతా చూచాయగా జ్ఞాపకం ఉన్నారు. కాని ఇతను మటుకు-
మనస్సులో ప్రింట్ వేసినట్టు ఉండిపోయేడు. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే అక్కడే నిలబెట్టేయాలనుకుంది. అంతగా ఆమె అంతరంగం మండిపోతోంది. తన భావాన్ని ముఖం మీదికి రానీయకుండా ‘చెప్పండి’ అంది. తలఎత్తి ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేక ‘మేడమ్’ అన్నాడు.
‘చెప్పండి’ అంది వస్తోన్న కోపాన్ని దిగమింగుకుంటూ.
‘సారీ మేడమ్ నేను అలా చేయకుండా ఉండాల్సింది. కాని పరిస్థితులు అలా ఉండి మీ ముందు మాట్లాడే ధైర్యం లేక...’ అతను వాక్యాన్ని పూర్తి చేసేందుకు నానా బాధపడిపోతున్నాడు.
‘ఎన్నడో జరిగిపోయిందాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్?’
అతను బేలగా చూసేడు.
అతని ముఖంలో దైన్యం కనిపిస్తోంది. మాటలు మింగేస్తూ ‘ఈసారి మీరు ఎలా చెబితే అలా నడచుకుంటాను మేడమ్’
డాక్టర్ అతన్ని వారిస్తున్నట్టు ‘ఇది మూడోసారి ఈ మూడు సంవత్సరాలలో అనడం’
‘ఇప్పుడు మాత్రం మనసులోంచి అంటున్నాను. నాకు మరొక్క ఛాన్స్ ఇవ్వండి’
అతని ముఖాన్ని క్రోధం కప్పిన ముఖంతో చూసింది. గతంలో రెండుసార్లు అతని బేలతనాన్ని, అతను ప్రాధేయపడే విధానాన్ని నిజం అనుకుంది. ఎంత బాగా తన ముందు నటించేడు. కాని అది నిజం కాదని, అవసరానికి తన్ను నమ్మించేడని తర్వాత తెలిసింది.
‘సరే ఇప్పుడు విషయం ఏంటో చెప్పు’ ఎంత శాంతంగా మాట్లాడాలనుకున్నా కొంచెం కఠినంగానే వెలువడ్డాయి మాటలు.
తన చేతుల్లో ఉన్న పేపర్లను డాక్టర్‌కి అందించేడు శేఖర్. పేపర్‌లను తిప్పింది డాక్టర్.
‘ఉమ. ఇరవై ఐదేళ్లు’ అన్న పేరు మీద ఉన్న రిపోర్టులు అవి.
అందులో రాసి ఉన్నవాటన్నింటినీ నిశితంగా చూసింది.
అతనికి పేపర్లు అందిస్తూ ‘చెప్పండి’ అంది.
‘మీరు ఈ కేసు టేకప్ చేయాలి మేడమ్. నా భార్యని రక్షించాలి’
‘ఇది చాలా క్రిటికల్ కేసు. ఎన్నో హంగులు ఉండే ఆస్పత్రికి తీసుకెళ్లు’
‘మేడమ్. మీ అంత సీనియర్ గైనకాలజిస్ట్, మేము డబ్బులు పెట్టుకోగలిగే పరిధిలో ఉన్న డాక్టర్ మీరేనండి. ప్లీజ్ మీరు ఈ కేసు టేకప్ చేయండి’ తలవంచుకునే అతడు మాట్లాడుతున్నాడు. అతని మాటలు చాలా దీనంగా ఉన్నాయి. అతని ముఖం నీకే తప్ప ఇతఃపరంబెరుంగ అన్నట్టు కనిపిస్తోంది.
‘పేషెంట్ ఎక్కడ ఉంది?’
‘బయట అంబులెన్స్‌లో ఉంది మేడమ్’
డాక్టర్ మహాలక్ష్మి కాలింగ్ బెల్ కొట్టింది. ఒక నర్స్ లోపలికి వచ్చి ‘చెప్పండి మేడమ్’ అంది.
‘ఈయన భార్య బయట ఉంది అంబులెన్స్‌లో. తీసుకుని రా’
ఒక ఆయా, ఒక వార్డ్‌బాయ్ బయటికి వెళ్లి స్ట్రెచర్ మీద ఉన్న ఆమెని లోనికి తెచ్చి ఎగ్జామ్ టేబుల్ మీద పడుకోబెట్టారు.
డాక్టర్ మహాలక్ష్మి పేషెంట్‌ని నఖశిఖ పర్యంతం చూసింది. పేషెంట్ ముఖం ఉబ్బిపోయి ఉంది. ఆమె చర్మం పాలిపోయి ఉంది. వొళ్లంతా వాపులు. ముక్కుపుటాలు ఎగురుతున్నాయి, ఆయాసానికి సంకేతంగా.
తమ ప్రథమ పరీక్షలు అన్నీ ముగించింది. రిపోర్టులన్నీ డాక్టర్ మరోసారి చదివింది. చేతిలో ఉన్న గ్లౌస్ తీసివేసి కుర్చీలో కూర్చొని ‘పేషెంట్‌కి తొమ్మిదో నెల వచ్చింది. నొప్పులు కొద్ది కొద్దిగా వస్తున్నాయి. వొళ్లంతా వాపు ఉంది. బీపీ కూడా చాలా అధికంగా ఉంది. కొంచెం ఇబ్బందే’ అంది బరువైన ముఖంతో.
‘మిగిలిన డాక్టర్లకి ఇబ్బంది కావొచ్చు. కాని మీరు చాలా సీనియర్ డాక్టర్ కదా మేడమ్. మీరు ఈ కేసుని చేయగలరు మేడమ్’
డాక్టర్ శేఖర్ ముఖంలోకి చూసింది.
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇలానే మాట్లాడేడు. అప్పుడు తన నైపుణ్యాన్ని గుర్తించి తన మీద నమ్మకంతో వచ్చినందుకు సంతోషపడింది. కొద్దిగా గర్వపడింది కూడా.
సంవత్సరం క్రిందట కూడా ఇవే పొగడ్తలు. అప్పుడు కూడా కొద్దిగా మనసు తేలిక అయింది. కాని ఇప్పుడో...
అతని ముఖంలోకి చూసింది. తన వయసులో సరిగ్గా సగం కూడా లేని ఈ కుర్రాడు తనను పొగడ్తల్తో ముంచెత్తి అతనికి కావలసింది తనచేత చేయించేద్దాం అనుకొంటున్నాడు.
అతను అన్నట్టుగా తనో సీనియర్ గైనకాలజిస్ట్. తన వయస్సుకి హందాతనాన్నిచ్చే గద్వాల్ చీరలే ఎప్పుడూ కడుతుంది. ముప్పై సంవత్సరాలకు మీదే ఈ ఫీల్డులో ఉంది.
తనకి ఛాలెంజెస్ అంటే ఇష్టం. టెన్షన్స్ అంటే మరీ ఇష్టం. మిగిలిన వారికి దడపుట్టించే కేసులే తను తీసుకుంటుంది. నిద్రాహారాలు మాని చికిత్స చేస్తూంటుంది. ఒక్కసారి ఈ టెన్షన్ తట్టుకోలేను. ఈ ప్రాక్టీస్ మానేద్దాం అనుకుంటుంది. అలా అనుకుని ఆ నిర్ణయం గట్టిపడేలోపు తన్ను సవాల్ చేసే మరో కేసు. ఈ వొక్క కేసే చేసి తర్వాత మానేస్తాను.
అలా తర్వాత.. తర్వాత ఇప్పుడు అరవైయో సంవత్సరానికి చేరింది. తను ఎన్నోసార్లు తనను తాను ప్రశ్నించుకొంది. ఎందుకు ఈ ప్రాక్టీస్ మానలేకపోతున్నా అని. ప్రతీసారీ సమాధానం ఈ వృత్తి అంటే ఇష్టం. ఏడుస్తూ బాధపడుతూ వచ్చే వాళ్లు నవ్వుకుంటూ సంతోషంతో ముఖాలు వెలిగిపోతూ వెళుతుంటే... దానితో సమమైన ఆనందం మరెందులోనూ కలగలేదు.
తను డబ్బు సంపాదించింది. మరీ అంతగాకాదు. వొక స్థాయికి వొచ్చింత్తర్వాత డబ్బు కిక్ ఇవ్వడం మానేసింది. తనకు ఛాలెంజ్‌గా నిలిచిన కేసులు గెలవడం అంతకంటె ఇంక ఏమీ అక్కర్లేదు.
ఈ సొసైటీలో అన్ని రకాలవాళ్లూ తన దగ్గరికి వస్తారు. అందరూ తన్ను గౌరవిస్తారు. అభిమానిస్తారు. నాలుగు రోజులు సైట్ సీయింగ్‌కి వెళితే మనస్సంతా హాస్పిటల్ మీదే ఉంటుంది. గంట గంటకు డ్యూటీ డాక్టర్‌కి ఫోన్ చేసి ఆ పేషెంట్ ఎలా ఉన్నారు. ఈ పేషెంట్ ఎలా ఉన్నాడు అని అడగడమే.
డ్యూటీ డాక్టర్, స్ట్ఫా ‘మేడమ్ మీరు గుళ్లకూ గోపురాలకూ, విహారాలకి వెళ్లి ఎంతసేపూ హాస్పిటల్ ధ్యాస పెట్టుకొనే కంటే ఇక్కడే ఉండిపొండి. ఇదే మీ బృందావనం. ఇదే మీ గుడి...’ అని ఎన్నోసార్లు అందాం అనుకున్నారు. కాని వయస్సు తెచ్చిన ఆ ముఖం హుందాతనం చూసి అనలేకపోయేవారు.
ఈసారి మీ మాటలకి లొంగదలచుకోలేదు. ‘మరెక్కడికైనా తీసుకెళ్లు’ నోటిదాకా వచ్చాయి మాటలు. నోటి బయట నుంచి రాలేకపోయాయి. ‘వెళ్లు’ అని చెప్పడం ఒక్క క్షణం పని. కాని తను చెప్పలేదు. తను చేయాలి. ఇంకా చేయాలి. అలాంటి శిక్షణ ఇచ్చారు తన ప్రొఫెసర్లు. ఈ వృత్తిలో డబ్బు కాదు మరేదో ఉంది. ఆ మరేదో... ఒక చిరునవ్వు. నిర్మలమైన చిరునవ్వు. చూసే కళ్లు ఉండాలి కాని బాధ తగ్గిన రోగుల కళ్లలో వెలిగే ఆనందం.
నిజంగా సేవచేసే డాక్టర్‌కి అదొక అడిక్షన్. ఏది లేకపోయినా ఉండగలము గాని అది లేకుండా ఉండలేదు.
అదే తనకి కావాలి. ఇన్ని సంవత్సరాల నించి దానే్న పొందుతుంది. అది లేకపోతే తను ఉండలేదు. ఈ భావాలన్నీ మదిలో మెదులుతుండగా సిస్టర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి కుర్చీలో కూర్చుంది.
శేఖర్ ముఖంలోకి చూసింది. ‘మేడమ్..’ అనబోయేడు శేఖర్. ఆమె చేయి ఎత్తింది ‘నువ్వేం మాట్లాడవొద్దు’ అని.
‘ఈమెని ఇంతకు ముందు ఎక్కడ చెకప్ చేయించావ్?’
‘చిన్న డాక్టర్‌కి చూపించేను మేడమ్. మొదలు ఆ డాక్టరే చేస్తానంది కాన్పు. కాని ఇప్పుడు పెద్దాసుపత్రికి తీసుకెళ్లు అంది’
‘అలా అంటే నేను జ్ఞాపకం వచ్చేనా?’ కొద్దిగా కఠినంగా అంది.
‘అవును మేడమ్. రెండుసార్లు మీరు రక్షించారు. మూడోసారి కూడా..’
‘నువ్వు నా మాట వినకుండా రెండుసార్లు మోసం చేశావు. అలాంటిది ఈ కేసు ఎలా తీసుకుంటాను అనుకున్నావ్’
‘మీలో డాక్టర్ కంటె తల్లి భాగం ఎక్కువగా ఉంది. ఆ అమ్మగా నన్ను క్షమిస్తారని వచ్చాను’
డాక్టర్‌కి ఈ మాట గుండెలో ఎక్కడో తేమ ఉండే చోట గుచ్చుకుంది. అందుకే జవాబు చెప్పలేకపోయింది. అయినా తన స్పందనను కప్పిపుచ్చుకుంటూ ‘నువ్వు ప్రతీసారి ఆమె జీవితాన్ని ఆపదలో పడేస్తున్నావ్ శేఖర్. పోయిన రెండుసార్లు ఆమె జీవితపు అంచులకి వెళ్లింది. ఇక నా చేతుల్లో లేదు అనుకున్న సమయంలో ఆ దేవుడి దయ వల్ల ఆమె బతికి బట్టకట్టింది. ఇదివరకు కూడా రెండుసార్లూ నీకు చెప్పాను. ఇక ఉమకు డెలివరీలు పనికిరావని. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించమని. సరే అన్నావ్. కాన్పు అయిన రెండో రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఆమెని దొంగతనంగా తీసుకువెళ్లిపోయావు. మళ్లీ మూడోసారి మొదలు రెండుసార్ల కంటే ఇంకా సీరియస్ పరిస్థితుల్లో తీసుకొచ్చావు. ఈసారి అయినా పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించి ఆమెని బ్రతికించుకోవూ’
శేఖర్ తలూపాడు. అది అర్థంపర్థంలేని చర్య అని డాక్టర్‌కి తెలుసు.
‘శేఖర్ చెప్పు’
తను ఏం చెబుతాడు. తమ వంశంలో అందరికీ పిల్లలు ఉండాలి. చాలా పిల్లలు ఉండాలి. తన తండ్రికి ఆరుగురు సంతానం. తాతకు ఎనిమిది మంది. ముత్తాతకు వొక చిన్న సైన్యం లాంటి పిల్లలుండేవారని.
ఇలాంటి కుటుంబ చరిత్ర ఉంది కాబట్టి తనకు పిల్లలంటే చాలా ఇష్టం. డాక్టర్ మంచి చెప్పినా సరే అనగలుగుతున్నాడు కాని పెద్ద సంసారం అనే బలహీనతకు లొంగిపోకుండా ఉండలేకపోతున్నాడు.
శేఖర్ ముఖంలో ఈ భావాలు కనిపించకపోయినా - కళ్లలోని చిన్న కదలికను చూసి డాక్టర్ పసిగట్టగలదు. ఎందర్నో చూసిన డాక్టర్‌కి శేఖర్ తెరచి ఉంచిన పుస్తకంలా కనిపించాడు.
ఉమ ప్రాణాపాయంలో ఉంది. తను తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, అనుభవాన్నీ అన్నీ ప్రయోగించి పేషెంట్ బాగు కావాలనే తపనతో పనిచేయగలదు. వీలైనంత వరకూ తల్లీ బిడ్డా క్షేమంగా ఉండేలా ప్రయత్నించగలదు. కాని దీని తర్వాత మరో కాన్పు. అయితే ఆమె ప్రాణానికే ముప్పు.
శేఖర్‌కి ఎంత చెప్పినా అన్నీ సరే అంటాడు. కాన్పు అయిన మర్నాడు ఎవ్వరికీ చెప్పకుండా ఉమని తీసుకువెళ్లిపోతాడు. అలా అని బిల్లు ఎగ్గొట్టడు. ఒక కవర్‌లో బ్లాంక్ చెక్ పెట్టి సీల్ చేసి తనకు అందేలా కొరియర్‌లో పంపించేస్తాడు. తన ఫీజు పదిహేను నించి ఇరవై ఉంటుందని తను అతనికి భారంగా ఉండే ఛార్జీలు వేయదని అతనికి బాగా తెలుసు.
ఇలాంటి మనిషితో వ్యవహరించడం ఎలా? తనలోని నరాలు బిగదీసినట్టయింది డాక్టర్‌కి.
పేషెంట్‌ని శేఖర్ రూంలోకి స్ట్రెచర్ మీద తీసుకెళ్లమని ఆయాకి చెప్పింది.
శేఖర్ బయటికి వెళ్లాడు.
ఆయా ఉమని బయటికి తీసుకువెళ్లింది.
సిస్టర్ మెల్లిగా డాక్టర్ దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పటి వరకు ఆలోచనలలో వున్న ఆమె సిస్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది.
‘మేడమ్. ఇతను ప్రతీసారీ ఆ అమ్మాయిని మృత్యువు అంచులదాకా పంపేస్తున్నాడు. మీరు నిద్రా భోజనం మానేసి మీకుండే శక్తులన్నీ ధారపోసి ఆ
అమ్మాయిని వొడ్డుకు లాగుతున్నారు. ఇలా రెండుసార్లు అయ్యింది. ఈసారి కూడా అలానే అవుతుంది. దీన్ని ఆపడం ఎలా మేడమ్?’
‘నేను దీన్ని గురించే ఆలోచిస్తున్నాను. ఇతని మనస్సు మార్చేది ఎలా అని’
డాక్టర్ మహాలక్ష్మికి ఎప్పుడూ పేషెంట్లు, పేషెంట్లు, పేషెంట్లు. అది తప్ప ఆమెకి ఇంకోటి తెలియదు. వాళ్లకి తను ఎలా మంచి చేయగలదా అని ప్రతీ పేషెంట్ గురించి లోతుగా అధ్యయనం చేస్తుంది. అలాంటి అంకిత భావాలు ఉన్న డాక్టర్‌కి ఇదొక సమస్యా?
ఏదో ఆలోచన స్ఫురించిన దానిలా ‘సిస్టర్! శేఖర్ని పిలు’ అంది. శేఖర్‌ని తీసుకువచ్చింది సిస్టర్.
‘ఏం మేడమ్ పిలిచారు?’
‘ఇవాళ నాకు స్ట్ఫా తక్కువ ఉన్నారు. ఇంక సిస్టర్ లీవ్ పెట్టింది. నీవు నాకు ఈ కాన్పు చేసేందుకు సహాయం చేయాలి. ఏమంటావ్?’
‘తప్పకుండా మేడమ్’ అన్నాడు.
అతనికి డెలివరీ చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. మేడమ్‌కి ఆమె వృత్తిలో సహాయం చేసినట్టూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నించి ఉన్న తన కోరిక తీరినట్టుంటుంది.
‘సరే అయితే నాతో రా’ అంటూ లేచారు డాక్టర్.
అది పెద్ద హాస్పిటల్ కాదు. మామూలు ఇరవై ఐదు పడకల హాస్పిటల్. అక్కడ వ్యాపార ధోరణులకి తగినట్టు కాకుండా అతి సర్వసాధారణంగా ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటల్ హడావిడి ఉండదు. ఆ రిచ్‌నెస్ కనపడదు. అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉంటుంది.
ఇక్కడ పెట్టుబడి డాక్టర్ మహాలక్ష్మి అంకితభావం. మొదట పేషెంట్. తర్వాత పేషెంట్. తర్వాత పేషెంట్. ఇందులో తను తను ముఖ్యం కాదు. పేషెంట్ ముఖ్యం. వాళ్లకే పెద్దపీట.
వార్డును దాటుకుంటూ మొదటి అంతస్తులో ఉన్న గది ముందు నిలబడ్డారు శేఖర్ డాక్టర్‌తో సహా. ఆ గది ముందు నియాన్ లైట్లతో లేబర్ రూం అని ఉంది. స్ప్రింగ్ డోర్ తెరచుకుని మొదట డాక్టర్ తర్వాత సిస్టర్ ఆఖర్న శేఖర్ ఆ గదిలో ప్రవేశించారు.
డబుల్ బెడ్‌రూం అంత గది.
ఆ గది మధ్య టేబుల్.
దాని మీద ఉమని పడుకోబెట్టారు.
ఆమె పక్కన సెలైన్ స్టాండ్.
‘సిస్టర్ ముందు ఈ పేషెంట్‌కి సెలైన్ స్టార్ట్ చేయండి’ అంది డాక్టర్.
మరో సిస్టర్ చేయి పట్టుకోబోయింది.
‘సిస్టర్ నువ్వు ఉండమ్మా’ అని ‘శేఖర్ మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకో’ అంది డాక్టర్. శేఖర్ ఉమ దగ్గరికి వచ్చాడు.
ఫ్లడ్‌లైట్ లాంటి వెలుగులో ఉమ చేయి చూశాడు. ఇన్నాళ్ల నించి ఆమె దగ్గరగా ఉన్నాడు కాని ఏనాడూ ఆమె చేయి అతను అంత నిశితంగా చూడలేదు.
సన్నగా ఉండే చేయి అరటిబొద్దులా ఉంది. ఇది నా ఉమ చేయేనా అనిపించింది అతనికి.
అతను తన చేతితో ఆమె మణికట్టుని పట్టుకున్నాడు. ‘గట్టిగా’ అంది సిస్టర్. పట్టు అధికం చేశాడు. ‘ఇంకా గట్టిగా’ అంది సిస్టర్. గట్టిగా అదిమి పట్టుకున్నాడేమో అతని చేయికింద గుంట పడ్డట్టు అనిపించింది. ఒకసారి ఉమ ముఖంలోకి చూశాడు. నిర్వికారంగా పడుకుని ఉంది. సిస్టర్ మండ మీద నరాలు ఉబ్బేలా వొకటి రెండుసార్లు కొట్టింది.
నరాలు ఎక్కడా కనిపించటంలేదు.
‘ఇంకా గట్టిగా అదుము’ అంది సిస్టర్.
అతని బలప్రయోగానికి ఉమ ‘ఊ’ అంటూ మూల్గింది. సిస్టర్ మండని స్పిరిట్‌తో శుభ్రంచేసి ప్లాస్టిక్ సూదిని మండలో గుచ్చింది. ‘అబ్బా’ అంది ఉమ. ఉమ ముఖాన్ని చూశాడు. వాచిన ముఖంలో బాధ అస్పష్టంగా కనిపించింది. శేఖర్ తన పట్టు సడలించబోయాడు. ‘అలాగే బిగువుగానే ఉండనీయ్. ఈ నీడిల్ ఇంకా నరంలోకి వెళ్లలేదు’ అంది సిస్టర్.
సిస్టర్ కొంచెం కొంచెం లోపలికి గుచ్చింది. రక్తం రాలేదు. కొన్ని సెకన్లు ప్రయత్నం చేసి సూదిని మండ నించి తీసేసింది.
‘ఏమయింది?’ అన్నాడు శేఖర్.
‘నరం దొరకడంలేదు’
‘మరి ఎట్లా?’
‘మళ్లీ ప్రయత్నించాలి’
చర్మం నించి బయటికి తీసిన నీడిల్ని అప్పుడు చూశాడు శేఖర్.
‘ఇంత లావుగా ఉందేంటి సూది’
‘ఈ సూదులు ఇలానే ఉంటాయి’
‘ఈ సూదితో మళ్లీ గుచ్చుతావా?’
‘నరం దొరకకపోతే డెలివరీ చేయలేం. కాన్పుకి కావలసిన మందులను దీని ద్వారానే ఇవ్వాలి’
మరొకసారి మణికట్టు పట్టుకున్నాడు శేఖర్. తను పోయినసారి పట్టుకున్న దగ్గర ఒక గుంతలా కనిపించింది. ‘ఇదేంటి’ అన్నాడు శేఖర్.
‘ఆమె ఒంట్లో నీరు బాగా చేరింది. అందుకే అలా గుంటపడింది’ అంది నర్సు. తన చెయ్యి ఆమె వొంటి మీద అచ్చుగుద్దినట్టు పడింది. అతని మనసులో ఏదో చిన్న బాధ మొదలైంది.
ఈసారి సిస్టర్ మళ్లీ సూది మండలో గుచ్చింది. ‘అబ్బా’ అంది ఉమ. ఈసారి గట్టిగా శేఖర్ తన భార్య ముఖాన్ని చూశాడు. అతనికి మనసులో ఏదో కెలికినట్టు అయింది.
‘నీ చేయి తీసేయ్. నరంలోకి సూది వెళ్లింది’ అంది సిస్టర్. శేఖర్ తన చేతితో సున్నితంగా ఉమ నుదురును తాకేడు.
గ్లూకోజ్‌లో మందులు కలిపేరు. ఆ ద్రవం మెల్లిగా ఉమ రక్తంలోకి వెళ్లసాగింది. ఇదంతా ముగియగానే సిస్టర్ ఒక ప్లాస్టిక్ షీట్ ఇచ్చి ‘కట్టుకో’ అంది.
తనూ వాళ్లలాగే కట్టుకున్నాడు.
‘శేఖర్ నువ్వు ఉమ తలవైపు కూర్చో’ అంది.
అతను అలానే చేశాడు. సిస్టర్, డాక్టర్ గ్లౌస్‌లూ ఏప్రాన్‌లు వేసుకున్నారు. ఆమె చేతికి బీపీ కట్టబడింది. మానిటర్‌లో బీపీ 180/100 కనిపించింది.
‘సిస్టర్! ఆమె నాలిక కింద బీపీ మందు వేయండి’ అంది.
ఆదేశాలు అమలుకాబడ్డాయి.
‘ఉమా ఎలా ఉన్నావ్?’ అంది డాక్టర్.
‘బాగానే ఉన్నాను’
నొప్పులు కొంచెం ఎక్కువయ్యాయి.
‘నొప్పులు బాగా తీయమ్మా. నువ్వు ఎంత ఎక్కువగా తీస్తే నీ డెలివరీ అంత తొందరగా అయిపోతుంది’
రానురాను నొప్పులు అధికం కాజొచ్చాయి.
‘నోరు తెరవకు. నోరు మూసుకుని గట్టిగా ముక్కు. దాన్నించి నీ గర్భంలో ఉన్న పాప కిందకు దిగుతుంది’
ఉమ ‘అమ్మా! అమ్మా!’ అంటూ నొప్పులు తీయసాగింది. ప్రతీ నొప్పీ రెండు నిమిషాలు ఉంటోంది.
ఉమ రెండు కాళ్ల మధ్యా స్టూలు వేసుకుని డాక్టర్ కూర్చుంది. నొప్పులు మరీ అధికం కాసాగేయి.
డాక్టర్ బీపీ చూసింది. బీపీ బాగా కంట్రోల్ అయింది.
‘ఉమా! బాగా నొప్పులు తీయ్. ఇంకా పాప వచ్చే మార్గం బాగా విచ్చుకోలేదు’
ఉండి ఉండి నొప్పులు తీస్తోంది.
శేఖర్ రెండు చేతులూ ఉమ చేతిలో ఉంచాడు. నొప్పి అధికం అయినప్పుడల్లా శేఖర్ చేతుల్ని గట్టిగా వత్తేస్తుంది ఉమ.
ఆ నొప్పులూ - ఆమె పడే అవస్థ. ఇక నేను చూడలేను అనుకున్నాడు శేఖర్. ఉమ చేతుల్ని వదిలించుకుంటూ ‘డాక్టర్ నేను బయట ఉంటాను’
‘ఎందుకు?’ అంది డాక్టర్.
‘ఆమె బాధని చూడలేక పోతున్నాను’
‘నువ్వు వెళ్లిపోతే ఎలా? ఆమెకూ నాకూ నీ సహాయం చాలా అవసరం ఉంటుంది’
‘కానీ నేను చూడలేకపోతున్నాను’
‘నువ్వు వెళ్లిపోతే మాకు వొక హ్యాండ్ తగ్గి రిస్క్ ఎక్కువవుతుంది. ఉండు’ అంది డాక్టర్ కఠినంగా.
శేఖర్ మాట్లాడలేకపోయాడు. అలానే కూర్చుండిపోయాడు.
ఉమ ప్రతీ నొప్పికీ సొమ్మసిల్లిపోతోంది. శేఖర్ ‘డాక్టర్! నా ఉమ’ అంటున్నాడు.
అతని చేతికి ఒక తువ్వాలు ఇచ్చి ఆమె ముఖం మీద పట్టిన స్వేదాన్ని తుడవమంది. ఉమ రెండేసి నిమిషాలకు ఒకసారి గట్టిగా అరుస్తోంది, ఆ నొప్పుల్ని తట్టుకోలేక. ఆ శబ్దాలతో ఆ గది ప్రతిధ్వనిస్తోంది. శేఖర్ ఆమె కేకల్ని వినలేకపోతున్నాడు. ‘డాక్టర్ ఉమ నొప్పుల్ని ఇవ్వలేకపోతోంది. ఏమైనా చేయరా?’ అన్నాడు దీనంగా.
‘ఈ కాన్పుల్లో ఎవరి నొప్పులు వాళ్లే ఇవ్వాలి శేఖర్’ అని ఉమ ముఖాన్ని చూసింది. అప్పటికే ఆమె బలమైన నొప్పులను తీస్తూ, కళ్లు తేలవేస్తూ పడిపోతోంది. అపస్మారకంలోకి పోతున్నట్టు ఉంది.
శేఖర్ అది చూడలేకపోతున్నాడు. తనకు ఇష్టమైన ఉమ. ప్రాణంకన్నా ప్రేమించే ఉమ ఈ స్థితిలో - అతను ఎప్పుడూ ఊహించలేదు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని.
కూర్చున్నవాడల్లా దిగ్గున లేచి డాక్టర్ దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకుని ‘మేడం ఏమైనా చేయరా. ఆమె నొప్పులు ఇవ్వలేకపోతోంది. ఆమె దగ్గర బలం ఏమీ లేదు’
డాక్టర్ మహాలక్ష్మి శేఖర్ ముఖంలోకి చూసింది. అతనికి ఇప్పటిదాకా తెలియదు, ఇలాంటి ప్రపంచం ఒకటి ఉంటుందని. ఈ నాలుగు గోడల గదిలో ఈ కేకలూ, రక్తాలు, హృదయాన్ని ద్రవింపజేసే పేషెంట్ల ముఖకవళికలూ...
పిల్లలు అంటే ఏదో చెట్లకు కాసే కాయలు అనుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వాటిని కోసుకోవచ్చనుకుంటారు. దీని నుంచి తల్లి పడే వేదన, సర్వస్వం అర్పించే స్థితి- ఆఖరికి తన ప్రాణాన్ని కూడా తన సంతానానికి ధారపోసే ఆ వ్యక్తిత్వం-
అందుకే దీన్ని అంటారు చచ్చి బ్రతకడం అని.
అదే మాతృత్వం అని.
ఆ తల్లి ప్రసవవేదనతో కార్చే ఆ కన్నీటి చుక్కలే మీ పాలిట పన్నీటి జల్లు అని.
‘మేడమ్ మేడమ్! ఏంటి అలా ఉండిపోయారు’ అంది సిస్టర్. తన ఆలోచనలలోంచి బయటికి వచ్చి డాక్టర్ మహాలక్ష్మి ‘శేఖర్! పాప చాలా మటుకు కిందకు దిగింది. ఇంకొంచెం కిందకు దిగితే కాన్పు అవుతుంది. ఇప్పుడు ఇస్తూన్నట్టే మరో నాలుగు నొప్పులు - ఇంకొంచెం బలంగా ఇస్తే ఈ డెలివరీ అయిపోతుంది’
‘నాలుగు కాదు కదా, ఇంకొక్క నొప్పి అయినా ఇవ్వలేదు మేడమ్’
‘అలా అయితే బిడ్డ?’
‘బిడ్డ నాకు అక్కర్లేదు. నా భార్య నాకు కావాలి. కావాలంటే బిడ్డను...’ అతను ఏం అనబోతున్నాడో డాక్టర్‌కి అర్థమైంది.
‘ఇక్కడిదాకా వచ్చిన తర్వాత బిడ్డని అలా వొదిలేయలేం. తప్పకుండా డెలివరీ చేయాలి’
‘మేడం! ఒక్కసారి నా భార్యని చూడండి. శక్తి నశించిన దానిలా ఎలా పడుకొని ఉందో. ఆమె నరం నరంలో ఉండే బలాన్ని అంతా ఇచ్చేసింది. ఇంక ఆమె దగ్గర ఏమీ లేదు’
‘అయితే వొక పని చేయి. ఆమె నొప్పులు ఇవ్వలేదు కదా, నువ్వు ఇవ్వు’
డాక్టర్ తన్ను గేలిచేస్తున్నదేమో అని ఆమె ముఖంలోకి చూశాడు. అక్కడ వ్యంగ్యం కనపడలేదు.
‘ఎలా మేడమ్?’ అన్నాడు అయోమయంగా.
‘నువ్వు టేబుల్ ఎక్కు. ఉమకి ఇరువైపులా నీ రెండు కాళ్లు పెట్టి మోకాళ్ల మీద కూర్చో. కొద్దిగా నొప్పి వచ్చినపుడు నీ బలాన్నంతా కూడకట్టుకుని ఆమె మీద వొంగి నీ రెండు చేతులతో ఆమె కడుపులో ఉన్న బిడ్డని కిందకి తొయ్యి’
‘సరే మేడమ్’
శేఖర్ పొజిషన్ తీసుకున్నాడు.
‘సిస్టర్ డ్రిప్ ఎక్కువ చేయి. ఉమా నీకు వీలైనంత నొప్పి తీయ్. శేఖర్ నీకు సహాయం చేస్తాడు’
చాలా బలహీనంగా తల ఆడించింది ఉమ.
‘శేఖర్ నొప్పి వస్తుంది. నీ బలం అంతా ప్రయోగించి తొయ్యి. ఎంత గట్టిగా తోస్తే అంత తొందరగా అయిపోతుంది డెలివరీ’
శేఖర్ తన బలమంతా ఉపయోగించి తోశాడు.
‘ఇక నొప్పి పోయింది. ఆగు శేఖర్’
శేఖర్ ఆగాడు.
మరో రెండు నిమిషాలకు మరో నొప్పి. ‘కమాన్ శేఖర్’ శేఖర్ తన బలమంతా కూడగట్టుకున్నాడు. ఈసారి మరీ గట్టిగా తోశాడు. రెండుసార్లు తోసేటప్పటికి అతనికి ఆయాసం వచ్చింది. ఇంక ఆగిపోదాం అనుకున్నాడు.
అప్పుడు ‘స్టాప్’ అంది డాక్టర్.
శేఖర్ ఆగాడు.
డాక్టర్ ఉమ కింది భాగాన్ని పరీక్షించింది.
‘శేఖర్! పాప బాగానే ఎదిగింది. ఇంకో ఇరవై నిమిషాలు. అంతే కాన్పు అయిపోతుంది’ అతని గుండె గుభేల్‌మంది.
‘ఇంకా ఇరవై నిమిషాలా...’ మనసులో అనుకున్నాడు దిగ్భ్రాంతితో.
మళ్లీ నొప్పి మొదలైంది. ‘సిస్టర్ ఫ్యాన్ ఆపు. బేబీ కిందకు దిగుతుంది’
‘శేఖర్ స్టార్ట్’ అంది.
శేఖర్ శక్తినంతా కూడగట్టుకుని తోస్తున్నాడు.
గది అంతా వేడెక్కిపోయింది. శేఖర్ బట్టలు చెమటతో తడిసి ముద్దయ్యాయి.
అయిదు నిమిషాలు.
పది నిమిషాలు.
పదిహేను నిమిషాలు.
ఇరవయ్యో నిమిషం.
శేఖర్ వొంటి మీద నుంచి చెమట ధారగా కారుతోంది.
ఉమ పరిస్తితి చెప్పనక్కర్లేదు.
ఇరవై ఒకటో నిమిషం.
కెవ్వున కేక.
ఆ కేక తన నోటి నించి వచ్చిందా లేక పుట్టిన పాప నోటి నించా-
శేఖర్‌కి అర్థం కాలేదు.
కదలలేని భంగిమలో ఉండిపోయాడు.
‘శేఖర్ దిగు. డెలివరీ అయిపోయింది’
అతను కదలలేకపోయాడు. నర్సూ ఆయా అతనికి సహాయం చేశారు దిగడానికి.
‘కంగ్రాట్స్! నీకు పాప పుట్టింది’
శేఖర్ ఆ మాట వినే స్థితిలో లేడు. అతని కళ్లు అయోమయాన్ని ప్రకటిస్తున్నా అతని అంతరంగంలో -
‘ఇదో మారథాన్ రేస్, ఈ రేస్‌లో ప్రతీ స్ర్తి వొక పతకాన్ని సాధిస్తుంది. అది మనుషులిచ్చేది కాదు. భగవంతుడు ఇచ్చేది. అదే-
డాక్టర్ చేతిలోని పాప
ఆ పాపని చూశాడు.
అతని దృష్టి అక్కడి నించి ఉమ మీదికి మళ్లింది.
ఇన్నాళ్లు భార్య అంటే అభిమానం మాత్రమే ఉండేది. ఇప్పుడో-
స్ర్తి అంటే గౌరవం.
డెలివరీ అనే ఈ మారథాన్‌లో తన ఆఖరి శ్వాసని కూడా ఇచ్చి - ఒక ఫలాన్ని అందిస్తుంది. అదే... అదే.. తండ్రిని చేయడం. ఇన్నాళ్లూ తన తండ్రికి ఆరుగురు పిల్లలని, తాతకు ఏడుగురు పిల్లలని గొప్పగా చెప్పుకునేవాడు.
అంటే తన అమ్మ-
నానమ్మ-
ఎన్ని డెలివరీలు అయితే అన్నిసార్లు మృత్యుముఖం దాకా వెళ్లి, మృత్యువునే జయించి-
అతని చేతులు అసంకల్పితంగా నమస్కారాన్ని పెట్టాయి. అదే స్ర్తి జాతికి! పురుషుడు సమర్పించే పురస్కారం.
ఆలోచనల కెరటాలు ఉధృతంగా లేస్తూంటే శేఖర్ బయటికి వచ్చాడు.
అలా నడుచుకుంటూ రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఒక కాగితాన్ని తీసుకుని నాలుగు వాక్యాలు రాసి డాక్టర్‌గారికి ఇవ్వండి అని వెళ్లిపోయాడు.
బయటకి వచ్చిన డాక్టర్ మహాలక్ష్మికి స్ట్ఫా ఇచ్చిన కాగితం చూసింది. పిల్లలు చాలు మేడమ్. నా భార్యకి ఆపరేషన్ చేయండి అన్న శేఖర్ ళ్యశఒళశఆ అది.
డాక్టర్ పెదాల మీద సన్నని నవ్వు.
తనొక ఛాలెంజ్‌గా తీసుకుంది శేఖర్‌ని. అందులో సక్సెస్ అయింది. ‘ప్రసవం అంటే తెలిసిన వాళ్లకే స్ర్తి విలువ తెలుస్తుంది. వాళ్లే చిన్ని కుటుంబాన్ని కోరుకోగలరు’ అన్న మాటలు ఆమె నోటి నించి వెలువడ్డాయి.

-శ్రీరంగం ఎస్సెస్.. 9246536867