S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఘజల్ వింటూ... బొమ్మ గీస్తూ..

బాపు బొమ్మ, బాపు రాత, బాపు గీత, బాపు సినిమా.. మొత్తంగా బాపు మన తెలుగువారికి సొంతమై పోయిన వ్యక్తి.
వీలునామా అవసరం లేని ఆస్థి. ఆయన గొప్ప దర్శకుడుగా అందరికీ తెలిసినవాడు. కానీ, ఆయన గొప్ప సంగీత ప్రియుడన్న సంగతి ఆయనతో బాగా సన్నిహితంగా మెలిగిన వారికే తెలుసు.
1978 సం.లో ప్రసిద్ధ ఘజల్ గాయకుడు మెహదీ హసన్ ఇండియా టూర్‌కు వచ్చి, కచేరీలు చేసే రోజులలో హైద్రాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఓ రోజు ఆయన కచేరీ జరిగింది.
ఆ రోజుల్లో ఆ కచేరీకి టిక్కెట్టు ధర, వెయ్యి రూపాయలు. ఐదు వందలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో మెహదీ అభిమానులున్నారు. ‘బాపు’ ఆయనకు వీరాభిమాని అన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. నా గురువు వోలేటిగారితో, నేనూ ఆ కచేరీ వినటానికి హైద్రాబాద్ వెళ్లాం. కచేరీ రోజున హైద్రాబాద్ ఆలిండియా రేడియో వారు మెహదీ హసన్‌తో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అవ్వగానే, నేను మెహదీ హసన్‌ను కలిసి, విడిగా సమావేశం కోరాను.
తిన్నగా ఆయన బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి కలిశాను. గంటన్నరగా సాగిన మా ఇద్దరి సమావేశం అవ్వగానే బయటకు వచ్చి చూస్తునుగదా! ఎదురుగావున్న గదిలో బాపు, ఆర్.ప్రభాకర్‌రావు (అప్పటి డిజిపి, ప్రముఖ గాయని వేదవతీ ప్రభాకర్రావు భర్త) నన్ను అభినందిస్తూ లోపలకు రమ్మన్నారు. ఆ ఘజల్ చక్రవర్తిని గూర్చి గుచ్చిగుచ్చి అడిగారు.
‘చారుకేశి’ రాగంలో మెహదీ హసన్ పాడిన ఘజల్ పాడి వినిపించాను. పరవశించిపోయారు. క్షణాల్లో మెహదీ హసన్ బొమ్మ గీసి నా చేతిలో పెట్టారు. ఆ సమావేశమే మా ఇద్దరి మధ్య స్నేహాన్ని పెంచింది. ప్రసిద్ధ ఘజల్ గాయకులైన రోషనారా బేగం, నూర్జహాన్, గులామాలీ మధురాణి, ఫరీదాకానన్, సంగీతాన్ని ప్రశంసిస్తూ, ఫోన్‌లో మాట్లాడేవారు.
పలామత్ అలీఖాన్, నజాకత్ ఆలీఖాన్, ఉస్తాదోంకా ఉస్తాద్ బడేగులామాలీఖాన్ వంటి వారి సంగీతం వింటూ బొమ్మలు వేసేవారాయన. బహుశా ఆయన విన్న సంగీతం, సంగీత విద్వాంసులెవరూ విని ఉండరేమో. అంత పెద్ద వైచిత్రీ ఉంది ఆయనకు - ఘజల్ కింగ్‌గా ప్రసిద్ధుడైన మెహదీ, బాపు ఇద్దరూ జిగ్రీ దోస్తులు. ‘నాకు ఉర్దూ భాష తెలియదు. కానీ, ఈ హిందూస్థానీ సంగీతంలో మత్తునిచ్చే నాదం నన్ను కట్టిపడేస్తుంది’ అంటూ,
‘ఈ గాత్ర ధర్మాలన్నీ వింటున్నప్పుడు, మాధుర్యం మనసు నిండా నింపుకుని తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎందుకో దిగులుగా ఉంటుంది. కులాసాగా వుండీ, కూడా బెంగటిల్లిపోతాం. ఒక్కొక్కసారి వెక్కివెక్కి మనసులో ఏడుస్తూ పోతాం. మనసంతా డీలా పడుతున్నట్లు నిస్త్రాణ పడతాం. అవునా! ఇంత బాధపడి, మళ్లీ అవే వినాలనిపిస్తుంది సుమా!
ఘజల్‌లో ఈ అనుభూతులన్నీ నిండిపోతాయి అనేవారు.
ఆయనకు నచ్చిన ఘజల్ ఒకటి ఉంది. ‘అబ్‌కే బిచ్‌డే తో షాయద్ కభీ గ్యాచోంమిలే జిస్ తరహ్ సూఖే హువె ఫూల్ కితాబో మిలే’ ప్రసిద్ధ కవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కూడా బాపుగారి మిత్రబృందంలోని ప్రముఖుడే. ‘నిశ్శబ్దం - గమ్యం’ సంగీత రూపకంలో ఈ ఘజల్ ప్రేరణతో ఓ పాట రాయించి, రేడియో కోసం నేనే పాడాను. బాపుకు వినిపించాను.
‘ఇపుడు విడితే ఏమిలే.. కల
సేము, రేపటి కలలలో
పుస్తకములో వాడిపోయిన
పూలు మిగిలిన తీరుగా...’
‘జనసమ్మోదిని’ రాగంలో చేసిన ఆ పాటను ఎంతో ఆసక్తిగా విన్నారు బాపు. ఇదే రాగంలో మెహదీ హసన్ ట్యూన్‌కు ఆకర్షితుడనై ‘రజని’గారి పాట ఒకటి ట్యూన్ చేసి, ఆయనకు వినిపించా. ‘ఘజల్ సంగీతమంతా హిందీ, ఉర్దూ భాషల్లోనే ఉంటుంది. తెలుగులో వున్న పాట ఆయన ఎంతో ఇష్టంగా విన్నారు.
కలలో నీలిమగని
నీలిమలో కమల పత్త్ర చారిమగని
కమల పత్త్ర చారిమలో సౌహృద మృదురక్తిమగని
అగరు ధూమ లతిక వోలె అవశమయ్యెనే
మనసు ఎగసి పోయెనో, మనసూ ఎంత వెర్రిదె!
(1980లో సంగతి) యస్వీ భుజంగరాయశర్మ రాసిన ఈ పాటను వోలేటి వెంకటేశ్వర్లుగారు ఈ మాసపు పాటగా ట్యూన్ చేసి నన్ను పాడమన్నారు. ఘజల్ సంగీత మాంత్రికుడు పాడిన ఉర్దూ ఘజల్‌లో
‘మేరీ జాన్ నజర్ కరో అప్నే వఫా పేశ్ కరూఁ’ అనే ఘజల్ దీనికి ప్రేరణ. ‘సింధుభైరవి’ రాగంలో స్వరాలుంటాయి. సంగీతజ్ఞానం కలిగినవారు, లేదా సంగీతం బాగా వినేవారు మాత్రమే పాటలోని స్వరాలను గుర్తించి రాగాన్ని చెప్పగలరు. మిగతా వారకి కొంచెం కష్టం. మద్రాసు వెళ్లినప్పుడు ఈ పాట బాపు’కు వినిపించా. పాటకు ముందు సాగే ఆర్కెస్ట్రా వినగానే సింధుభైరవి రాగంలా వుందే’ అన్నారు. అప్పుడు నాకనిపించింది, వినికిడి జ్ఞానం చాలా గొప్పదని.
ప్రముఖ విద్వాంసుడు సజ్జద్ హుస్సేన్ మాండలిన్ వాద్యానికి మురిసిపోయి, ఓ చిత్రంలో, ఈ వాద్య మధురిమలను వినిపించారు కూడా.
గుంటూరు శేషేంద్రశర్మ మంచి భావుకుడైన కవి. ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో ‘నిదురించే తోటలో’ అనే పాటకు ప్రేరణ ఘజలే. కె.వి.మహదేవన్ సంగీత సవ్యసాచి గదా! ఈ పాటలో ప్రారంభ వాద్య సంగీతం వింటే మహదేవన్ చేతిలో స్వరాలెల్లా పురివిప్పి నాట్యం చేస్తాయో రసికులకు అనుభవమే.
అలా, బాపుతో స్నేహం క్రమక్రమంగా పెరుగుతూ ఆయన విన్న ఘజల్సు నాకు పంపేదాకా వెళ్లింది.
కచేరీలలో కాకుండా, ప్రసిద్ధులైన ఈ ఘజల్ గాయకులు, ప్రముఖుల ఇళ్లల్లో పాడిన రికార్డింగులు, తన సన్నిహితుల వల్ల తెప్పించుకుంటూ వినేవారాయన.
ప్రముఖ గాయని ఆశాభోంస్లే ఇంట్లో జరిగిన గులామాలీ గానం, రికార్డింగ్ ఒకటి, ఆయన ప్రక్కనే కూర్చుని విన్నా. 50 నిమిషాలసేపు రాగ్ మార్వాలో గులామాలీ పాడిన ఘజల్ ఒకటి. ఒకటికి రెండుసార్లు వినిపిస్తూ ఆ గానంలో వచ్చే గమక సౌందర్యం, ప్రత్యేకంగా ఆయన అనుభవిస్తూ వింటోంటే, నాకు ఎంతో ఆశ్చర్యంగా వుండేది.
‘ఇంత గొప్ప సంగీతం వింటున్నారు గదా! మీరు తీసే సినిమాల్లో ఈ శైలిలో ఒకటో, రెండో పాటలు పాడించవచ్చు గదా’ అనేవాణ్ణి.
నవ్వేసి ఊరుకునేవారు.
‘చుట్టూ చెంగావి చీర’ అనే పాట ‘తూర్పు వెళ్లే రైలు’ చిత్రానికి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చేసిన ట్యూన్‌కు ఆధారం మెహదీ హసన్ ఘజలే.
అలాగే ‘కలనైనా క్షణమైనా’ అనే పాట కూడా (‘రాధాకళ్యాణం’ చిత్రానికి బాలు పాడారు) ఘజల్ ఆధారంగా తయారైనదే. ఆయన జీవిత కాలంలో సేకరించి విన్న ‘హిందూస్థానీ’ సంగీతమంతా సీడీలలోకి మార్చి, నాకు పంపించేశారు వినమని. ఆయన ఎంత సంగీత పిపాసియో తలుచుకున్నప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతూంటుంది.
శ్రీరామాయణమన్నా, రామకథన్నా, రామాయణంలోని పాత్రలన్నా పులకించి పరవశించే బాపు’కు ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవె’ అనే కీర్తన చాలా ఇష్టం. నేనూ, పిల్లలూ, మద్రాసు సంగీతోత్సవాలకు వెళ్లినప్పుడల్లా ఆయనను వెళ్లి కలుసుకుంటూండేవారం. సూర్యకాంతి రాగంలో ‘ముద్దు మోము ఏలాగు చెలంగెనో మునుల్లెగని మోహించేదో’ అనే కీర్తనంటే ఆయనకు పరమ ప్రీతి. తృప్తిగా పాడించుకుని వింటూ వుండేవారు.
‘హరియట, హరుడట, సురలట, నరులట అఖిలాండ కోటులట యిందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరె’ కీర్తనలో అనుపల్లవి ఓసారి పాడుతోంటే ఆయన కళ్లు చెమర్చాయి. ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ‘అంతర్చహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, శివాయ, విష్ణురూపాయ, శివరూపాయ విష్ణువే’ మొదలైన శ్లోకాల సారాంశమంతా ఈ కీర్తనలో ఇమిడ్చేశారు త్యాగయ్య’ అన్నాను వెంటనే...
ఆ రామచంద్రుడి గుణగణాలన్నీ లోకానికి తెలియచేసేందుకే త్యాగరాజు ఈ భూమీద పుట్టాడేమో! అన్నారు.
మితంగా మాట్లాడటం అమితంగా సంగీతం వినటం ఆయన దగ్గరే చూశాను. ఆయన చూసే దృష్టి వేరు.
ఆయన అనుభూతులు వేరు’ అనిపిస్తుంది నాకు. ‘ఒక ప్రాయోజిత కార్యక్రమం ‘నవ్వితే నవ్వండి’ టీవీ ఛానెల్‌లో వరుసగా రెండు మాసాలు ప్రసారమైంది. ‘బాపు’యే ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో కొందరు సినీ నటులతోబాటు మా ఆకాశవాణి కళాకారులు కూడా పాల్గొన్నారు.
నేనూ, ప్రముఖ సినీ నటుడు ఎ.వి.సుబ్రహ్మణ్యం (ఎవిఎస్) కలిసి సంగీతంపై చిన్న ప్రహసనం కూడా రూపొందించి వేశాం.
బాపు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలురు చాలా అరుదుగా ఉంటారు. *

చిత్రాలు..
విశ్వవిఖ్యాత ఘజల్ గాయకుడు మెహదీ హసన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో బాపు గీసిన చిత్రం. దీనిని హసన్‌కు కానుకగా ఇస్తే సంతకం చేసి తిరిగి సూరిబాబుకు తన గుర్తుగా ఇచ్చారు.

హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో మెహదీ హసన్ (1978)

గులాం అలీఖాన్‌తో సూరిబాబు

-మల్లాది సూరిబాబు