S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోతిచేష్టలు (కథ)

ఆ రోజు ఆదివారం. ఐదవ తరగతి చదువుతున్న చింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. చింటూ అమ్మ సాయంత్రం టిఫిన్ కోసం దోసెల పిండి కలుపుతోంది.
ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. ‘చింటూ! నాన్న వచ్చినట్లున్నారు. చూడు’ అన్నది.
చింటూ లేచి తలుపు తెరచి చూసి కెవ్వున అరిచాడు.
ఎదురుగా కోతి నిలబడి ఉంది. అది గభాలున ఇంట్లోకి వచ్చి గినె్నలన్నీ వెతికింది. చింటూ అమ్మకి ఏం చేయాలో తోచలేదు. పెద్దగా అరిచింది.
కోతి దోసెల పిండి దొర్లించింది. బస్తాలోని బియ్యం పారబోసింది. గినె్నలు విసిరేసింది. తినటానికి ఏమైనా దొరుకుతాయేమోనని వెతికింది. ఐదు నిమిషాల్లో ఇల్లంతా చిందరవందర చేసింది.
చింటూ అమ్మ అరుపులకి చుట్టుపక్కల ఇళ్లల్లోని ఆడవాళ్లందరూ వచ్చారు. వాళ్లని చూసి కోతి పారిపోయింది.
‘అబ్బబ్బ! ఈ కోతుల బెడద పడలేకుండా ఉన్నాం. మొన్నటికి మొన్న డాబా మీద వడియాలు ఎండబెట్టాను. కోతుల మంద వచ్చి అన్నీ తిని వెళ్లాయి’ అన్నది ఒకామె.
‘మా పెరట్లో జామచెట్టు కాయలన్నీ తెంపి తిన్నన్ని తిని మిగిలినవి పారబోసి పోతున్నాయి. ఒక్క పండ్ల చెట్టు కూడా ఉండనీయటంలేదు’ అన్నది మరొకామె.
‘అంతేనా! కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు ఇంట్లోకి జొరబడి అందినవి అందినట్లు తీసుకుపోతున్నాయి’
‘మున్సిపాలిటీ వాళ్లు కోతులను పట్టించే వాళ్లని పిలిపించి దూరంగా ఎక్కడో వదిలేస్తామంటున్నారు’
‘ఆఁ ఏం వదలటమో! రెండు నెలలు తిరగకముందే మళ్లీ వస్తున్నాయి’
ఆడవాళ్ల మీటింగ్‌లా ఉన్న వాళ్ల మాటలు చింటూ కళ్లు పెద్దవి చేసుకుని విన్నాడు. అందరూ తలా ఒక రకంగా మాట్లాడి ‘జాగ్రత్తమ్మా! ఏదైనా అవసరమైతే మమ్మల్ని పిలు’ అని చెప్పి వెళ్లిపోయారు.
చింటూ అమ్మ ఇల్లు సర్దుకోసాగింది. చింటూ వాళ్ల నాన్న ఒక చేత్తో సెల్‌ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ బజారు నించీ తిరిగి వస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా ఒక కోతి వచ్చి సెల్‌ఫోన్ లాక్కుని పరిగెత్తింది.
‘అయ్యో! నా ఫోన్! మొన్ననే పది వేలు పెట్టి కొన్నాను. స్మార్ట్ ఫోన్’ అంటూ చింటూ నాన్న అరిచాడు. చుట్టుపక్కల ఇళ్లల్లోని మగవాళ్లంతా వీధిలోకి వచ్చారు. కోతి ఎదురింటి డాబా మీద కూర్చుని సెల్‌ఫోన్ అటూ ఇటూ తిప్పి చూస్తోంది.
ఎదురింట్లో ఉంటున్న అతను రెండు అరటిపండ్లు తెచ్చి ప్రహరీ గోడ మీద పెట్టాడు. కోతి ఫోన్ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి అరటి పండ్లు తీసుకుని వెళ్లిపోయింది. చింటూ నాన్న పరుగున ఎదురింటి డాబా మీదకు వెళ్లి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
చింటూ నాన్న స్నానం చేసి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ‘నాన్నా! కోతులు ఇళ్లల్లోకి ఎందుకు వస్తున్నాయి? ‘జూ’లో ఉండాలి కదా!’ అని అడిగాడు చింటూ.
‘జూలో కూడా కాదు. అడవులలో ఉంటాయి. పండ్లు, కాయలు తింటూ రాత్రిళ్లు చెట్ల మీదే నిద్రపోతాయి. కానీ మనిషి విచక్షణా రహితంగా చెట్లను నరికివేసి వాటికి ఆవాసం, ఆహారం లేకుండా చేస్తున్నాడు. వాటి నివాసాలను దురాక్రమణ చేస్తున్నాడు. ఉండే చోటు లేక, ఆహారం దొరకక అవి ఆకలికి తాళలేక ఇళ్లల్లోకి జొరబడుతున్నాయి ఇది వాటి తప్పు కాదు. ముమ్మాటికీ మనిషి తప్పే!’ అన్నాడు చింటూ నాన్న.
‘చెట్లను పెంచితే మళ్లీ వాటి నివాసాలకు తిరిగి వెళతాయిగా నాన్నా!’
‘అవును. వాటి యొక్క సహజ వాతావరణంలోనే అవి ఆనందంగా జీవించగలుగుతాయి’
‘ప్రభుత్వం వారు మా స్కూల్‌కి మొక్కలను పెంచమని పంపిణీ చేశారు నాన్నా! నేను, మా స్నేహితులు ప్రతిరోజూ నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుతాం. పెరిగిన చెట్లను కూడా నరకవద్దని అందరికీ చెపుతాం’ అన్నాడు చింటూ.
‘వెరీగుడ్’ అని చింటూని మెచ్చుకున్నాడు వాళ్ల నాన్న.

- గోనుగుంట మురళీకృష్ణ