S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హితవు

కథల పోటీలో
ఎంపికైన రచన
**

వేదనారాయణగారు చెప్పిన హితబోధలేవీ ఆ కుర్ర గుమాస్తా తలకెక్కలేదు. మంచిగా మసలుకోవాలని, పరులకు చేతనైన మేలు చేయాలని, అవినీతి జోలికి పోవద్దని, ఇవేగా ఆయన నూరిపోసే వేదాలు. అవి వింటేనే శ్రీముఖ్ అనే ఆ కుర్రాడికి తేళ్లూ జెర్రులూ పాకినట్లవుతుంది. నిన్నగాక మొన్న సర్వీసులోకొచ్చాడు శ్రీముఖ్.
ఆఫీసు వాతావరణం అతగాడికి కొత్తగాని వేదనారాయణగారిక్కాదు. అక్కడున్న పరివారమంతా జలగలతో సమానమని ఆయన ఎరుగుదురు. అవతలి వారి ఇబ్బందులు, కష్టాలు కన్నీళ్లు వారికి అనవసరం. ఎందరో ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలు, ఆర్జిత సెలవుల మంజూరు కోసం, పదవీ విరమణ తదుపరి రావలసిన బకాయిలు, ఆర్థికపరమైన లావాదేవీలు వారి గుప్పెట్లోనే ఉంటాయి. తమ బిల్లులు చేయండని మొర పెట్టుకున్నా సరే అది బదిరశంఖారావమే అవుతుంది. తృణమో పణమో ఇచ్చుకుంటే సర్దిపుచ్చుకోరు. పైగా ఇంతిస్తే తప్ప ఫైలు ముట్టుకోమంటూ భీష్మించుక్కూచోవడం వారి క్రూరత్వానికి నిదర్శనం.
అలాటి అవినీతి సందర్భాల్లోనే వేదనారాయణగారు పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఆయన పైసా పుచ్చుకోరు. లంచాల బాగోతమంటే మంట! అందుకే ఆయన్ను ఈ కాలంవాడు కాదన్నారు. దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవడం చాతకాదన్నారు. ఛాందసుడని ఆడిపోసుకునేవారు. అన్ని నిందలను భరిస్తూ తన పని తాను చేసుకునేవారాయన.
తన దగ్గరికొచ్చిన ఫైల్స్ సవ్యమనిపిస్తే చాలు చిటికెలో చేసి పడేసేవారు. పైవాళ్లెవరూ తనను మభ్యపెట్టాలని చూసినా సరే లొంగేవారు కాదు. మిగతా వాళ్లు డబ్బు కోసం దేబిరించుకుపోయి లంచం కోసం అర్రులు చాస్తుంటే మహా జుగుప్సగా అనిపించేది.
ఒక్కోసారి ఊరుకోలేక ఇతరులను హింసించి ముక్కుపిండడం బాగులేదని దెబ్బలాడేవారు. ఒకవేళ పనైనందుకు సంతోషంతో పళ్లో ఏదైనా బహుమతో ఇస్తే తీసుకోవడంలో తప్పు లేదంటూ చెప్పేవారు. ఆయన ఓ హితైషిలాగ చెబుతుంటే అందరూ పక్కున నవ్వేవారు.
‘పండు, కాయ వల్ల ఏం వస్తుంది గురూగారూ! మీరు తినరని చెప్పి మమ్మల్ని మేయద్దంటే ఎలా?’ అని ఎద్దేవా చేసేవారు.
అయితే ఈ మధ్యన వాళ్ల ధోరణి చూస్తూ పట్టించుకోవడం మానేసినప్పటికీ కొత్తగా నౌకరీలోకి వచ్చిన శాల్తీలను చూస్తే మాత్రం గుండె తరుక్కుపోయేది. కారణం వాళ్లను కూడా ఈ రాక్షసులు ముళ్లదారంట నడిపిస్తున్నారనే! అలాటి వారి సావాసం పాము పడగ నీడతో సమానమని, దాని కింద చేరడమంటే ఏదోనాడు కాటుకి గురవడమే అని గ్రహించాలని ఉద్బోధ చేసేవారు. అలాటి హితబోధ శ్రీముఖ్‌కి కూడా జరిగింది. అయినా ఋజువర్తనకు ఓటేసేవాళ్లు తక్కువనే చెప్పాలి ఈ రోజుల్లో! ఒక్కోసారి టీవీలో గాని, పేపర్లోగాని అవినీతి నిరోధక శాఖ వారి వలలో పడ్డ చేపలంటూ లంచగొండుల గురించి, దొరికిన వారి ఆస్తులను, ఎలాగ పట్టుబడ్డారో బయటపెట్టినప్పుడు అందరినీ ఓసారి హెచ్చరించటం పరిపాటిగా మారిందాయనకు.
‘ఎవరో ఎక్కడో వారి ఖర్మ కాలి పట్టుబడితే మాకెందుకు చెప్పడం? అంటే మేమూ పట్టుబడాలనా మీ ఉద్దేశం? మీకిష్టం లేకపోతే మేయద్దు! మా హితబోధ చేయొద్దు!’ అని ఎదురుదాడికి దిగేవారు.
ఒకరోజు శ్రీముఖ్ భోజనాల సమయంలో ఒంటరిగా దొరికాడు. ‘ఇదిగోనయ్యా! పదేపదే చెబుతున్నానని అనుకోవద్దు! నీ క్షేమం కోసమే చెబుతున్నా! వీళ్లంతా దోపిడీదారులు! నీకేమో కొత్త! నీలాటి వారిని పావులుగా చేసుకొని ఇరికిస్తారు. ఎప్పటికప్పుడు అడ్డగోలుగా మన జేబులో సొమ్ములు పడిపోతుంటే హాయిగా ఉండి కన్నుమిన్ను కానదు. ఏం చేయడానికైనా సిద్ధపడతాం! అంతటి పాపిష్ఠి వ్యసనమది. దేశంలో ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు దొరికిపోయి వారి జీవితాలు భ్రష్ఠు పట్టిపోతున్నాయని తెలుసుకుంటున్నా మళ్లా మామూలే! అదే నీకూ తలకెక్కుతుంది. నీ పంథా కూడా మారదు. దయచేసి బంగారంలాటి ఉద్యోగానికి ఎసరొచ్చే పనికి మాత్రం దిగజారద్దు! మీలాటి యువకులు దయచేసి వారి మాటలు వినకండి’ అని విడమరచి మరీ చెప్పుకొచ్చారు.
శ్రీముఖ్‌కి అదంతా ఏదోలా అనిపించింది. తన గొర్రె తోకంత జీతంతోనే అంతా నెట్టుకు రావాలంటే కష్టమే! అటు చెల్లి పెళ్లి, ఇటు కుటుంబ భారం అంతా తన నెత్తిమీదనే ఉంది. నెలకొచ్చే జీతం రాళ్లకంటే అడపాదడపా జేబులో పడే సొమ్ములే దినసరి ఖర్చులు గట్టెక్కించడంలో కీలకపాత్ర వహిస్తున్నాయి. అటువంటి వాటికి తిలోదకాలిమ్మంటున్నాడు ఈ ముసలి శాల్తీ! పదవీ విరమణ చేసే ముందర తన మీద ఎందుకింత శ్రద్ధ? అనుకున్నప్పుడు ఒకటే కారం రాసుకున్నట్లుంటుంది. తన దారిపైన ఎందుకీ నిఘా!
అల్లంత దూరం నుండి చూసిన తోటి కొత్త గుమాస్తాలు తమ దగ్గరకు లాక్కుపోయి ‘ఆ వృద్ధకపోతం మెత్తగా చీవాట్లు మొదలెట్టిందా ఏమిటి? ససేమిరా వినకు. టీవీలో మద్యపాన నిషేధం గురించి పెద్దఎత్తున ప్రచారం చేస్తుంటారు. త్రాగుతున్న సన్నివేశాలు తొలగించమంటే వాటిని ఉంచుతూనే క్రింద చిన్న అక్షరాలతోటి హెచ్చరికలు చేస్తుంటారు. అలాటివే ఈ పెద్ద తలకాయల హితబోధలు కూడాను! జనమే లంచాలిచ్చేసి పని చేయించుకుందికి క్యూ కడుతుంటే మనకేం? హాయిగా జేబులో వేసుకుని ఎంజాయ్ చేస్తాం!’ వాళ్ల వెకిలి నవ్వులు దూరం నించి వినిపిస్తూనే ఉన్నాయి అక్కడే నిలబడ్డ వేదనారాయణగారికి.
‘ఏరా నారాయణా! ఏంటలాగున్నావు?’ అన్న గొంతుకి ఇహంలోకొచ్చాడు. పలకరించింది ఎవరో కాదు తమ శాఖకు ఎదురుగా ఉండే పంచాయతీ కార్యాలయం హెడ్ గుమాస్తా వెంకునాయుడు.
‘ఇంతదాకా నువ్వు మాట్లాడుతున్నది ఎవరితో ననుకున్నావు?’ అని మరల ప్రశ్నించాడు.
‘ఈ కుర్రాడు మా ఆఫీసులో కొత్తగా చేరాడు’ ముక్తసరిగా చెప్పాడు.
‘నీకు గుర్తుందో లేదోగాని ఐదేళ్ల క్రితం మనం ఇద్దరం మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసేటప్పుడు కూర్మయ్యనే గుమాస్తా ఉండేవాడు. గుర్తుకొచ్చిందా?’
‘ఔనౌను! కూర్మయ్యను నాకెందుకు తెలీదూ! పైసా కూడా పుచ్చుకునేవాడు కాదు! లంచానికి పూర్తి వ్యతిరేకం. పాపం! ఆ మధ్యన కాలం చేశాడని తెలిసింది’ బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు వేదనారాయణ.
‘మరి ఆ కూర్మయ్య పోవడంతోనే ఈ కుర్రాడికి ఉద్యోగం ఇచ్చారు’ వివరించి చెప్పాడు వెంకునాయుడు.
‘కూర్మయ్య కొడుకా? ఈ కుర్రాడు!? అరె తండ్రి గుణం కొంచెమైనా రాలేదు. ఈ ముఠాతో కలిసి వెంపర్లాడుతున్నాడు. బంగారంలాటి ఉద్యోగం గాని ఊడగొట్టుకోడు కదాని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాను’ బాధగా అన్నాడు వేదనారాయణ.
‘మనమేం చేస్తాం చెప్పు! తమ తండ్రి తన కోసం ఎంత పాటుపడ్డాడో బ్రతికినంతకాలం ఎంత నిక్కచ్చిగా పని చేశాడో, తాము ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో తెలుసుకోవాలి! ఆ భగవంతుడే వారిని మార్చాలి తప్ప మన వల్లకాదు!’ అని తన ధోరణిలో చెప్పి తన పని మీద ఆఫీసు వైపు వెళ్లిపోయాడు వెంకునాయుడు.
మిత్రుడు కూర్మయ్య సంగతులు చెప్పిన దగ్గర నుంచి వేదనారాయణ గారు నలిబిలి పడ్డారు. ఇంతకాలం పడిన వేదన ఒక ఎతె్తైతే ప్రస్తుతం పడుతున్న మనస్తాపం పదింతల ఎత్తు! కూర్మయ్య, తను ఎదురెదురుగానే పని చేశారు. ఆఫీసులో తలలో నాలుకలా మెలిగేవాడు. లంచాలకు దూరంగా ఉండే అతని నైజం అక్కడ ఎవరికీ నచ్చేది కాదు. వచ్చే జీతం రాళ్లతోనే సర్దుకుని బ్రతకాలని చెప్పేవాడు. సమస్యలతో పోరాడ్డమే జీవితమంటే అనే అతన్ని అందరూ ఎద్దేవా చేసేవారు. అదే ఈ రోజున తండ్రి ప్రవర్తనకు విరుద్ధంగా శ్రీముఖ్ వ్యవహరిస్తున్నాడు. దెబ్బ తింటావని చెప్పిన ప్రతీసారి మరింతగా బిగిసిపోతున్నాడు. ఈసారి తను కూర్మయ్యను ఎరుగుదునని చెప్పి మరోసారి హితవు చెప్పి చూస్తే! అనే ఆలోచనలో కొట్టుకులాడాడు వేదనారాయణ. కాని అందువల్ల ఒరిగేదేమిటి? మరోసారి తనని పూచికపుల్లలా చూస్తాడు!
ఓసారి టీ తాగుతుంటే ఎదురుపడ్డాడు శ్రీముఖ్! వేదనారాయణ గారి మనసూరుకోలేదు. జ్ఞానబోధ చేయడానికి ఉపక్రమించాడు.
‘నాయనా! మీ నాన్నగారి గురించి విన్నాను. ఆయన బాగా ముక్కుసూటి మనిషని, లంచానకి పరమ వ్యతిరేకమని, ఆయన చనిపోయిన స్థానంలోనే నీకుద్యోగం వచ్చిందని తెలిసింది. మరి నీకేమైందయ్యా! వాళ్ల వలలో చిక్కుకున్నావు?’
‘అయ్యా! మీ ఉపన్యాసం అయిందా? నాకీ ఉద్యోగం మా నాన్నగారు పోవడంవల్లే రావచ్చు! కాని ఏ బాధ్యతలు తీర్చకుండానే కన్నుమూసారాయన! చెల్లి పెళ్లి గుదిబండలాగ నాపై ఉంది. మా నాన్నగారితో పనిచేసిన వాళ్లంతా లక్షలకు లక్షలు కూడబెట్టుకున్నారు. మా కోసం ఏమీ మిగల్చకుండా పోయారాయన. మేం ఏం సుఖపడ్డాం చెప్పండి? ఆయన పైసలు తిని ఉంటే మాకీ గతి పట్టేది కాదు’ అని ఆవేదనగా అన్నాడు.
‘నువ్వేదో వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. మామూలుగా అయితే ఈ రోజుల్లో ఉద్యోగం పొందడం ఎంతో కష్టం! అలాటిది ఆయన రిటైరైయ్యేలోగానే పోయి నీకు భిక్ష పెట్టాడు. అది నీ పాలిట అదృష్టంగా మారింది’ అని ఏదో చెప్పబోయాడు వేదనారాయణ. కాని వినే స్థితిలో లేడు శ్రీముఖ్! ఎదురుగా ఉన్న పెద్దమనిషి అడ్డుపుల్లలు వేసే శకునిలాగ కనిపించాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
* * *
ఓ రోజు సాయంత్రం తల్లి అరవిందమ్మ చేతిలో ఐదు వందల నోటు పెట్టి ‘అమ్మా! ఇవి నీ దగ్గరుంచమ్మా! ఏమైనా కూర ఖర్చుకు పనికొస్తాయి’ అన్నాడు.
వెంటనే ‘నెలాఖరులో ఈ సొమ్ము నీకెక్కడిదిరా?’ నిలదీసింది.
ఇదివరలో ఏనాడూ అలా ప్రశ్నించని తల్లి అలా అడిగేసరికి దిమ్మెరపోయాడు శ్రీముఖ్. ‘అదేంటమ్మా! కొత్తగా అడుగుతున్నావు? ఇంతకు ముందు ఎన్నిసార్లు నీకివ్వలేదని!’ తడబడుతూ అన్నాడు.
‘ఇంతదాకా పట్టించుకోలేదు! నీ వ్యక్తిత్వం మీ నాన్నగారి లాటిదే అనే అపోహలో ఉండిపోయాను. అదే నా పొరపాటు!’ ఆవేదన వొలికింది అరవిందమ్మ గొంతులో.
‘అదేంటమ్మా! ఎన్నడూ లేనిది అంతగా బాధపడిపోతున్నావు’
‘ఔన్రా! ఎప్పుడూ నీ ప్రవర్తనలో నేను చెడును ఊహించలేకపోయాను. మీ నాన్నగారు ఏనాడూ ఇతరుల నుంచి ఒక్క పైసా ఆశించలేదు. ఉన్నదాన్లోనే కలోగంజో తాగి బతికారు. అదే మాకూ నేర్పారు. నా దురదృష్టంవల్ల ఆయన పోయారు. నువ్వు బాగుపడతావో లేదోనన్న వేదనతోనే అనుక్షణం నరకం అనుభవించారు. ఆయన జబ్బు పడ్డప్పుడు కూడా రిటైరైయ్యేలోగా పోతే కనీసం అబ్బాయికి ఉద్యోగమన్నా ఇస్తారు అలాగయినా నీ జీవితం సాఫీగా సాగుతుందని భావించారు. ఆయన ఆశించినట్లుగానే నీకుద్యోగం వచ్చింది. కాని ఆయన పదవిని అనుభవిస్తున్న నువ్వు ఆయన బాటలో నడవడం లేదు. మచ్చతెచ్చేలాగ ప్రవర్తిస్తున్నావు’ అన్నది భావోద్విఘ్నంగా అరవిందమ్మ.
‘అమ్మా! నువ్వెందుకలా మల్లగుల్లాలు పడుతున్నావో నాకెంత మాత్రం అర్థం కావడంలేదు’ తల పట్టుకున్నాడు శ్రీముఖ్.
‘ఒరే! నీకు నా బాధ అర్థంకాదురా! నీలో ఎటువంటి అవినీతి లేదని, అడ్డదారులు తొక్కడం లేదని మీ నాన్నగారి ఫొటో మీద ప్రమాణం చేసి చెప్పగలవా?’ నిగ్గదీసి అడిగింది అరవిందమ్మ.
ఆ ప్రశ్నకు చేష్టలుడిగి పోయాడు శ్రీముఖ్.
‘ఏరా నోరు పెగల్లేదేం? అంటే నువ్వూ ఓ జలగవై పోయావన్నమాట! ఛీ! ఎందుకురా వెధవ బతుకు! నిన్నగాక మొన్న ప్రభుత్వం నీకు భిక్ష పెట్టినట్లుగా నౌకరీ ఇచ్చింది. అందుకు సంతోషించి చక్కగా ఉద్యోగం చేసుకోక వ్యసనం బారిన పడ్డావేంట్రా? బంగారంలాటి నీ ఉద్యోగం ఎక్కడ పోతుందేమోనని అనుక్షణం ఎంత నలిగిపోతున్నానో తెలుసా?!’ అన్నది కళ్లంట నీళ్లు పెట్టుకుని కుమిలిపోతూ.
‘అమ్మా! పరిస్థితులు నీకు తెలీవు. మా పై గ్రహాలు ఎలా తిరిగితే మేమూ అదే విధంగా తిరగాల్సి ఉంటుంది. అయినా నా జాగ్రత్త నాకు తెలుసు. వాళ్లకు వచ్చిందాంట్లో నాకూ ఇంత పడేస్తున్నారు. కేవలం జీతంతోటే ఐతే సమస్యలు ఒడ్డెక్కుతాయా? నాన్నగారేమో బరువంతా నాపై మోపేసి వెళ్లిపోయారు’ ఉద్విఘ్నంగా అన్నాడా మాట.
‘చాలా బాగుందిరా నీ జవాబు! నీపై బెంగతోనే ఆయన లోకం విడిచి వెళ్లిపోయి నీకు మేలు చేశారు. అది మరచి నువ్వు నిందిస్తున్నావు! ఇప్పటికైనా మార్పు తెచ్చుకో! లేకుంటే ఇరుకున పడతావు!’ మరీ మరీ హెచ్చరించింది ఏడుస్తూనే.
* * *
ఒకరోజు మధ్యాహ్నం వేదనారాయణగారు శ్రీముఖ్‌కి తారసపడ్డారు. వెంటనే ఆయనతో ‘నిజం చెప్పండి. మీరు మా ఇంటికెళ్లి నా మీద లేనిపోనివన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పారు కదూ! ఎప్పుడూ పల్లెత్తు మాట అనని మా అమ్మ నాతో గొడవకు దిగింది. ఇదంతా మీ పుణ్యమే అనుకుంటా! చెప్పండి!’ నిలదీశాడు.
‘అబ్బే! నేనేం చెప్పలేదే! మీ ఇంటివైపే రాలేదు’ అనేశారు.
‘లేదు మా ఇంట్లో చిచ్చు పెట్టేందుకు మీరు తయారయ్యారు. దయచేసి మీరు మా ఇంటి విషయాల్లో తలదూర్చద్దు!’ అని దణ్ణం పెట్టేసి వడివడిగా వెళ్లిపోయాడు శ్రీముఖ్.
వాస్తవానికి రెండ్రోజుల క్రితం శ్రీముఖ్ ఇంటికి వేదనారాయణగారు వెళ్లారు. ఉండబట్టక తల్లితో శ్రీముఖ్ వైఖరి అంతా చెప్పేశారు. ఆయన చెప్పీ చెప్పగానే ఆమె కొడుకుపై ఈగ వాలనీకుండా ఎదురుదాడికి దిగడంలోనే ఆమెకు శ్రీముఖ్‌పై ఎంత అనురాగముందో తేటతెల్లమైంది. ఆమెను చల్లార్చి ఆఫీసులో జరిగే బాగోతమంతా కళ్లకు కట్టినట్లుగా చెప్పారాయన. ఓ పెద్ద మనిషి కొడుకు విషయంలో అంతలా జాగ్రత్తలు చెబుతుంటే నిజమేనని నమ్మింది.ఆ కారణంగానే ఇంటికి రావడంతోనే కొడుకుపై ధ్వజమెత్తినట్లుంది. అందుకే తను కనపడగానే నిలదీశాడు. పోనీ తనను ఏమనుకున్నా సరే అపసవ్య దిశలో నున్న దాన్ని సంస్కరించే పని తను చేపట్టాడు. అందులో తప్పులేదనిపించింది వేదనారాయణ గారికి. ఏ మనిషిలోనైనా మార్పు తేవడం ఒక్క దేముడికే సాధ్యమేమో! ఎవరికి వారుగా తమ తప్పు తెలుసుకునేలాగ దేవుడే ఏదో సంఘటన సృష్టించకపోడు!
* * *
‘ఒరే! రేపు పదవ తేదీ మీ నాన్నగారి ఆబ్దికం! సెలవు పెట్టాలి! ముగ్గురు భోక్తలకు ముందుగా చెప్పుకోవాలి. దానికి తగిన సంభారాలు సమకూర్చుకోవాలి. వంటలామెకి చెప్పి కొంత అడ్వాన్సుగా ఇయ్యి’ ఇంటికి రాగానే చెప్పింది తల్లి అరవిందమ్మ శ్రీముఖ్‌తో.
ఈ నెలలో తండ్రి ఆబ్దికం ఉన్న సంగతి మరచేపోయాడు శ్రీముఖ్. ఇప్పటిదాకా సెలవు అడగనే లేదు. రేపు వెళ్లగానే అడగాలి. మంజూరు చేస్తాడో లేదో! ఇది తప్పనిది. సాయంత్రం బయటకెళ్లినప్పుడు ముగ్గురు భోక్తలకు చెప్పాడు. అదే సమయంలో వంటలామెక్కూడా చెప్పేసి అడ్వాన్సిచ్చాడు.
మర్నాడు ఆఫీసు కెళ్లడంతోనే అధికారిని కలిసి సెలవు గురించి చెప్పాడు. దస్త్రాలన్నీ పేరుకుపోయున్నాయని ససేమిరా వీలు పడదన్నాడు. సరిగ్గా పదవ తేదీన ఉండక తప్పనిసరి అని, తన తండ్రి ఆబ్దికం తప్పదని బతిమిలాడుతూ చెప్పాడు శ్రీముఖ్. అయినా కరగలేదాయన!
ఇదంతా చూస్తున్న సూపర్నెంటు సూర్యమూర్తి శ్రీముఖ్‌ను చాటుగా తీసుకెళ్లి ‘పెద్ద కేసేదో మన ఆఫీసరు గురుడు పట్టినట్లున్నాడు. దానికి వాళ్లు చేతులు తడుపుతారట! మనక్కూడా కొంత విదల్చకపోడు. అయితే పని చేయాల్సినదంతా మనమే కదా! అందుకే మోకాలడ్డుతున్నాడు. ఆలోచించుకో’ అని చెప్పాడు.
మహా చికాగ్గా అనిపించింది ఆ పరిస్థితికి. ఆఫీసులో ఉన్నాడన్న మాటే తప్ప ఏదేదో ఆలోచిస్తున్నాడు శ్రీముఖ్. సాయంత్రం ఇంటికెళ్లగానే ‘అమ్మా! మా ఆఫీసరు సెలవివ్వనంటున్నాడమ్మా! ఫైల్సేవో ఉండిపోయాయట. మనం నాన్నగారి ఆబ్దికం మరో రోజున...’ అని అనడంతోనే కోపంగా ‘నీకు మతిసుతి ఉన్నాయా? తిథిని బట్టేగాని ఎప్పుడంటే అప్పుడు పెట్టడానికి వీల్లేదురా! వేరే ఎవరో వచ్చి చేసేది కాదిది! కొడుగ్గా నువ్వే నిర్వహించాలి. సెలవు ఇవ్వకపోయినా ఉండిపోయి చేయాల్సిందే!’ కరాఖండిగా చెప్పింది అరవిందమ్మ.
అంతే! శ్రీముఖ్‌కి సంకెళ్లు పడ్డట్టయింది. ఆఫీసరు చేత సెలవు మంజూరు చేయించుకోకుండా ఉండిపోతే ఏవౌతుందోనన్న బెంగ మొదలైంది. పైగా తనకు ఆ రోజున వచ్చే పై డబ్బులు మరి ఉండవు. అవే ఉంటే ఈ ఆబ్దికం ఖర్చులు ఒడ్డెక్కేవి. మర్నాడు ఆఫీసుకెళ్లి మధ్యలో అనుమతి అడిగి ఇంటికి వచ్చి తండ్రి ఆబ్దికం జరిపించాలని ఆలోచన చేశాడు. కాని ఒకవేళ అధికారి వెళ్లకూడదంటూ అడ్డుపెడితే అప్పుడు ఇంటి దగ్గర కార్యక్రమం అభాసుపాలౌతుంది. అందువల్ల ఏదైతే అదవుతుందని ఇంటి దగ్గర ఉండిపోయాడు శ్రీముఖ్.
* * *
ఆ రోజు మధ్యాహ్నానికి భోక్తలు రాగా ఆబ్దికం ఘనంగా జరిపించేశాడు. కార్యక్రమం అంతా అయ్యేసరికి నాలుగయింది. అదే సమయంలో టీవీలో వార్తల్లో ‘అవినీతి నిరోధక శాఖ వలలో మరో పెద్ద చేప’ అని తమ కార్యాలయంలో జరిగిన విషయాలను బట్టబయలు చేసి చెబుతుంటే గతుక్కుమన్నాడు శ్రీముఖ్. వెన్ను జలదరించింది. యమునారావనే ఉపాధ్యాయుడి పింఛను దస్త్రం ఆమోదం చేసి పైకి పంపటానికి ముప్పై వేల రూపాయలు లంచంగా అడిగినందుకు ఆ ఉపాధ్యాయుడు ఇక సహించలేక అవినీతి నిరోధక శాఖ వారిని ఆశ్రయించక తప్పలేదు. ఆఫీసరు శరభయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంకా ఏవేవో చెబుతున్నారు టీవీలో.
సరిగ్గా సాయంత్రం ఫోన్. ‘ఇదిగో శ్రీముఖ్! నేనెప్పటి నుంచో చెబుతూనే ఉన్నా! గుర్తుందా? మన ఆఫీసరు అడ్డంగా దొరికిపోతాడని. ఇప్పుడు అదే జరిగింది. నువ్వు సెలవు పెట్టి ఉండిపోవడం వల్ల నీకు గండం తప్పింది! ఇకనైనా నీ పద్ధతి మార్చుకో! ఈ జలగలతో కూడకు’ అని చెప్పింది మరెవరో కాదు వేదనారాయణగారు.
శ్రీముఖ్‌కి చెమట్లు పట్టేసాయి. ఒక్కసారి గుండె అదురు పెరిగి మెల్లగా సర్దుకోసాగింది. టీవీ చూస్తున్న అరవిందమ్మ కొడుకు ముఖంలో రకరకాల మార్పులు ఆందోళనలు గమనించి ‘ఒరే! నేను పోల్చకపోలేదురా! చూశావా? మీ ఆఫీసరు గతి ఏమైందో? నిజానికి నువ్వు మీ ఆఫీసరు కోసం ఈ రోజు పట్టుబట్టి మొండిగా ఉండిపోతే ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకో. మీ నాన్నగారు ఏనాడో పైలోకాల్లో కలిసిపోయినా నేటికీ నీ క్షేమమే కాంక్షించార్రా! ఆయన ఆత్మ నిన్ను హెచ్చరించటం కోసమే ఇలా జరిగిందేమో! ఆయన ఆబ్దికం పేరుతో సెలవు పెట్టించింది. నా దృష్టిలో ఇదంతా నీలో మార్పు కోసమే ననుకుంటున్నా! ఇకనైనా ఆలోచించు. దినదినగండం నూరేళ్లాయుష్షుగా బ్రతికే అడ్డదారి నీకొద్దు! భవిష్యత్తు పాడుచేసుకోకు. అవినీతి అనే ముళ్లబాటను విడిచిపెట్టు. శ్రమపడి సంపాదించింది పైసా అయినా సరే నీకెంతో తృప్తినిస్తుంది. నీ వృత్తి ధర్మాన్ని నమ్ముకో! నీకు కొండంత పెన్నిధినిస్తుంది. అదే నీకు శ్రీరామరక్ష. దయచేసి అవినీతి జలగల మాయమాటలు వినకండి’ అని దగ్గరగా వెళ్లి ప్రేమతో తల నిమిరింది.
అప్పటికే శ్రీముఖ్ కళ్లంట విస్తారంగా కురుస్తున్న కన్నీటి వానను చూస్తున్న అరవిందమ్మకు కొడుకు తన తప్పును తాను తెలుసుకున్న వైనం సాక్ష్యమిచ్చింది. అంతకంటే ఆ తల్లికింకేం కావాలి?
*
కె.కె.రఘునందన
ఇం.నెం.27-23-1,
గణపతి ఎన్‌క్లేవ్, ఫ్లాట్ నెం.402
జగన్నాథనగర్,
నియర్ సింగపూర్ సిటీ లైన్
దాసన్నపేట,
విజయనగరం - 535 002
9705411897, 9492620382

- కె. కె. రఘునందన