S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హృదయం బద్దలైంది (కథ)

ఒక రైతు కొడుకు పదేళ్లవాడు పొలం పక్కన ఆడుకుంటున్నాడు. వాడికి ఆ పొలంలో ఒక ఎర్రటి గుండ్రపు రాయి దొరికింది. దాన్ని గోళీకాయలా ఆడుకుంటున్నాడు. ఆ దారిన వెళ్తున్న ఒక రత్నాల వ్యాపారి ఆ కుర్రాడు ఆ రాయితో గురిచూసి వేరొక బండను కొట్టడం చూశాడు.
‘బాబూ! ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది?’ అని అడిగాడు.
‘మా పొలంలో’ అన్నాడు కుర్రవాడు.
అది మామూలు రాయి కాదు. వజ్రం అని వ్యాపారి పోల్చుకున్నాడు.
‘బాబూ! నీకు డబ్బులిస్తాను. ఆ రాయినిస్తావా? ఆ డబ్బుతో నీవు మిఠాయి కొనుక్కోవచ్చు’ అన్నాడు వ్యాపారి.
మిఠాయి అంటే కుర్రాడికి నోరూరింది. ‘ఎంత ఇస్తావ్?’ అని అడిగాడు.
‘పది రూపాయలు’ అన్నాడు వ్యాపారి.
ఇంకా ఎక్కువ కావాలనుకున్నాడు పిల్లాడు. బేరం పెట్టాడు. పది నుంచి ఇరవైకి ఇలా నూరు వరకు పాట పెరిగింది. కుర్రాడు నూరు రూపాయలు తీసుకొని ఆ రాయి ఇచ్చి ఇంటికి పారిపోయాడు.
ఆ వ్యాపారి సంతోషపడ్డాడు. ఈ రోజు ఎవరి మొహం చూశానో నాలుగైదు వేలు ఖరీదుచేసే వజ్రం వంద రూపాయలకు దొరికింది అని అనుకున్నాడు.
హఠాత్తుగా ఆ రాయి ముక్కలైంది. వ్యాపారి ఆశ్చర్యపోయాడు.
అది భూమిలో ఉన్నప్పుడు నాగలి దెబ్బలు కాచింది. పశువుల గిట్టలు బలంగా పడినా ముక్కలు కాలేదు. పక్షులు ముక్కుతో పొడిచినా ముక్కలు కాలేదు. కుర్రాడు బండరాయి మీదకు విసిరినా బద్దలు కాలేదు. సున్నితంగా తను పట్టుకున్నా ఆ వజ్రం తన చేతిలో ఎందుకు బద్దలైంది? అని ఆలోచించసాగాడు.
అతని బాధను అర్థం చేసుకున్న వజ్రం ‘నాగలికి నా విలువ తెలియదు. అది ప్రాణం లేనిది. అందుకే నాగలి దెబ్బ నాకు బాధ కలిగించలేదు. పశువులకు నేనేమిటో తెలియదు. అందుకే అవి గట్టిగా కొట్టినా నేను ఓర్చుకున్నాను. అలాగే పక్షులు అవి నేను తినే పదార్థం అనుకున్నాయి. తినేది కానని తెలియగానే నన్ను వదిలేసాయి. ఆ కుర్రవాడికి నా విలువ తెలిసి ఉంటే నీకు నూరు రూపాయలకు నన్ను అమ్ముతాడా? నీవు రత్నాల వ్యాపారివి. నాలుగైదు వేలు చేసే నన్ను వంద రూపాయల వెల కట్టుకొన్నావ్. అందుకే నా హృదయం బద్దలైంది’ అని జవాబు చెప్పిందా వజ్రం.

- జి. నిత్యకళ్యాణమ్మ