S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిత్యరూప! ఎవరి పాండిత్యమేమి నడచురా! (అమృతవర్షిణి)

సత్యమైన ఆజ్ఞ మీద సామర్థ్యము కలదా!
భానురేయి పగలు రత్న సాను జుట్టడా!
పూనిశేషుడమిత భార భూమి మోయడా!
వీనులందు కాశీపతి నీ నామము పల్కడా!
వౌని త్యాగరాజ వినుత - మహిమాస్పద మగు నీ ముందు!
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యమంటారు శంకర భగవత్పాదులు.
లోకంలో ఒక్క అంగుళం ఖాళీ లేకుండా సర్వత్రా వ్యాపించి, క్రిందకీ పైకీ ఎగరేస్తూ, గంతులేయిస్తూ వుండే అతీతమైన శక్తి ఒకటుందని అందరికీ తెలుసు. కాలాతీత స్వరూపమైన ఆ శక్తి ముందు అందరూ దిగదుడుపే. ఎవరి సామర్థ్యమూ పనికిరాదు. నిత్య సత్యమైన పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు అంతా నడుస్తుందని తెలిసిన పెద్దల అనుభవాలు, అనుభూతులూ ఎప్పటికప్పుడు మననం చేసుకోవడమే సరైన మార్గం- ఆధ్యాత్మిక మార్గానికి వారి మాటలే బలాన్నిస్తాయనటానికి త్యాగయ్యగారి ఈ కీర్తన చాలు.
లోకం తీరు ఎప్పుడూ అర్థంపర్థంలేని శతావధానం, ద్విశతావధానమే. తుదీ, మొదలూ వుండవు. ఎప్పటికప్పుడు పరగడుపే. పాతది వెనక్కి వెళ్లిపోతుంది. కొత్తది ముందుకొస్తూంటుంది. ఒకటి పూర్తవుకుండానే, రెండోది మొదలవుతుంది. ఏదో చెప్పలేని ఆందోళన, అలజడి, ఏదో నిత్యం సంకులమే. ఒకవైపు ఏడ్చేవారు, మరోవైపు నవ్వేవారు. చావు పుట్టుకలు. భూమి మీదకు ఎందుకొచ్చారో తెలియదు, ఎలా వెళ్లిపోతున్నారో అంతకంటే తెలియదు. మాయ సృష్టికి ఇవి మాయ సంకేతాలు.
ఈ మాయలో చిక్కుకోకుండా, మళ్లీ చావు పుట్టుకలు లేకుండా, సరైన మార్గాన్ని ఎంచుకోవడంలో త్యాగయ్య సఫలీకృతుడయ్యాడు. తానొక్కడే సుఖపడాలని భావించి ఉంటే అసలు ఆయనను తలుచుకోవాల్సిన పనిలేదు. లోకానికి సంగీత మార్గాన్ని చూపించాడు. ఈ మాయా వలయం సంగతి ఆయనకు బాగా తెలుసు. దాటే మార్గాన్ని ఎంచుకున్నాడు.
ఇది అందరివల్లా అయ్యే పనికాదు. సంగీతం పాడేవారందరికీ ఈ మార్గం అనుభవంలోకి రాదు.
ప్రపంచంలో సూర్యుడనేవాడు లేకపోతే ప్రపంచం ఏమవుతుంది? గాఢాంధకారమే అంతా. ఎక్కడి నీరు అక్కడే ఉండిపోయి ఆ నీరు ఇంకదు. అందులోంచి క్రిమికీటకాలు పుట్తాయి. ఇంక మనిషి జీవితం ఎక్కడ? క్రమంగా జలంతో కలిసిపోతుంది. అలా అవకుండా ప్రపంచాన్ని కాపాడే ‘నిత్య శక్తి స్వరూపుడి ముందు ఎవరి సామర్థ్యం పనిచేస్తుంది? ఎందుకు పనికొస్తుంది?’
‘చేసేదంతా ఆయనే. చేయించేదీ ఆయనే’ అని నమ్మి, నిమిత్తమాత్రంగా బ్రతికినవాడు త్యాగయ్య. ఆయన అందుకే నిత్యానంద స్వరూపుడు. స్థితప్రజ్ఞుడు. ‘కాశీక్షేత్రం’ పేరుకు శివక్షేత్రమే అయినా శివుడు చనిపోయేవారి చెవులలో చెప్పేది రామనామమే’ అని మన నమ్మకం. అందుకే, ‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’ అనే మాట వచ్చింది.
‘నన్ను నమ్ముకుంటూ బ్రతుకు. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానం’టాడు గీతాకారుడు. ఈ మాటను నమ్మిన భక్తులలో త్యాగయ్య ఒకడు. త్యాగయ్యగారికి భావగురువు భద్రాచల రామదాసు. ముముక్షువులెప్పుడూ పెద్దలమాట విస్మరించరు. భక్తులకు భక్తులే స్నేహితులౌతారు. భక్తికి భక్తే నిదర్శనం. భక్తులు భావాలు పంచుకుంటారు. లోకాన్ని అనుగ్రహించి మార్గాన్ని చూపిస్తారు. భగవదనుగ్రహానికి పిచ్చివాళ్ళై కడవలకొద్దీ కన్నీరు మున్నీరుగా విలపిస్తారు.
లోకానికి వాళ్లు పిచ్చివాళ్లుగా కనిపిస్తారు కానీ లోకం వీళ్లకు పిచ్చిగా కనిపిస్తుంది.
‘దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు’ అన్న ప్రహ్లాదుని భక్తి త్యాగయ్యను కుదిపేసింది కాదా! బాధలొచ్చినప్పుడల్లా పాడుకున్నాడు. లేకపోయినా పాడాడు. ప్రహ్లాద భక్త విజయానికి మార్గం చూపినది, ఈ మానసిక స్థితే.
ప్రహ్లాదుడు పడ్డ బాధలు సామాన్యమైనవా? రాక్షస కులంలో పుట్టినా పారమార్థిక చింతన కలిగి ఉండటమే అతడి పెద్ద నేరం. చెప్పాలంటే బాధలు అనుభవించని భక్తులెవరున్నారు? రామదాసు పడ్డ బాధలేమైనా తక్కువా?
అన్నీ సహిస్తూ అంతా రామమయం అన్నాడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ అన్నాడు - అదీ నమ్మకం. అదీ పూనిక. దైవం మీద భక్తికి అదే పరాకాష్ట. తన బ్రతుకు తాను బ్రతుకుతూ ఉంఛవృత్తి చేస్తూ త్యాగయ్య కూడా బాధలనుభవించాడు. అన్న జపేశం ఉన్న ఇంటికే ఎసరు పెట్టి, వేరు కాపరం పెట్టాడు. నిత్యం రాముడే లోకంగా బ్రతికే త్యాగయ్య పంచాయతన విగ్రహాలను సైతం తీసుకెళ్లి కావేరిలో పారేస్తే, ఏడుస్తూ పాడుకున్న దైవంపై ఆయన నమ్మకం కాస్తయినా, సడలిందా? పైగా మరింత దృఢపడింది.
రామభక్తి సామాజ్య్రాన్ని నిర్మించుకున్నాడు. దానికి ఆయనే రాజు. పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందాడు.
తన సమస్యలన్నిటికీ రాముడే పరిష్కారం చూపించాలని ఆయనే్న నమ్ముకున్నాడు. మనస్సుతోనే శ్రీరాముడికి సందేశాలు పంపాడు. అంతే, నివృత్తి మార్గం దొరికింది.
ఈ విషయం ఆయన కృతులే చెబుతాయి. సాధారణంగా మనిషి జీవితమెప్పుడూ అనుభవాల రాశియే. అతని అనుభవాల ద్వారా ఇతరులు నేర్చుకునేదంటూ ఏమీ వుండదు. తన అనుభవాల ద్వారా విషయం తెలిసికొంటాడు. కానీ ‘తనను’ మార్చుకునే ప్రయత్నం చేయడు. దీనికి అడ్డం వచ్చేది అతని జన్మజన్మ వాసనలు. అయితే కారణజన్ములు వేరు. వారో ప్రయోజనం కోసం పుడ్తారు. లోకాన్ని ఉద్ధరిస్తారు.
మానవకోటికి వారే జగద్గురువులు. అందుకోవాలనే సంస్కారం వున్నవాళ్లకే ఆ బోధలు అందుతాయి. లేకపోతే ఎలా వచ్చారో, అలాగే వెళ్లిపోతారు. ఆదర్శ గ్రంథాలన్నీ మూలబడిపోయాయి. (For a Foolish man scriptures are closed books).
రామాయణ భారతాల కథలను వినే ఓపిక ఎక్కడుంది? ఈవేళ నీతిని అవినీతే పరిపాలిస్తోంది. అవే పోషించుకుంటున్నాయి. బంగారం మోసే గాడిద గడ్డిపరకలకేసే చూస్తుందన్న సామెత వుండనే ఉంది. అందుకే సంస్కారం లేని మనుషులకు ‘దుర్మార్గ చరాధములనే పేరు పెట్టారు’ త్యాగయ్య. ‘కనిపించిన వాణ్ణి తెగ పొగిడెయ్యడం, నా వల్ల కాదయ్యా! నీట ముంచినా, పాలముంచినా నువ్వే దిక్కు’ అన్నాడు.
‘్ధర్మాత్మ! ధన ధాన్యము, దైవము నీవై యుండగా, జానెడు పొట్ట కోసం నాకు గడవకపోతుందా! ఎందుకీ నీచాశ్రయం నాకు?’ అనే ఈ ధీమా ఎంతమందికి ఉంటుంది?
ఆత్మ ఎప్పుడూ మనతోనే, మనలోనే ఉంటుంది. బంధువుగా స్నేహితుడిగా సలహాలనిస్తుంది. భగవంతుణ్ణి నమ్మి చెడ్డవాళ్లెవరు? నమ్మక బాగుపడిన వాళ్లెవరు? ఈ మాయా లోకంలో బాటసారిగా జీవించేవాడే మనిషి. ఏ పుణ్యవశం చేతనో మానవుడుగా జన్మించి, సమస్త సంపదలు అనుభవిస్తూ ‘ఇదంతా నా ప్రజ్ఞయే’ అనుకుంటూ అహంకారంతో, మెప్పులూ, గొప్పలూ చెప్పుకుంటూ, ఒళ్లు తెలియకుండా విర్రవీగేవారు ‘ఇదంతా’ భగవంతుని చిద్విలాసం అని అనుకోరు. అహంకార, మమకార, మోహాల్లోంచి పుట్టిన కృత్రిమ విషవృక్షాలు.
God is the first and all the things next - అంటారు వివేకానంధ. అనుభవంలో నుండి వచ్చిన మాట.
ఎందుకంటే ఈ కలికాలంలో, అనేక రకాల మనస్తత్వాలున్న మనుషులతో సహవాసం చేయాలి మనం. అందరూ ఒకేలా వుండరు. రాజస గుణం కొందరికి, తామస గుణం మరికొందరికి. ఇన్ని రకాల వాళ్లలో తిరిగినా, జీవిత నాటక రంగంలో జాగ్రత్తగా బ్రతికే ఉపాయాన్ని అడుగుతారు. త్యాగయ్య తన కోసం కాదు. మన కోసమే. లౌకిక జీవితంలో భార్యాపిల్లలూ జీవన విధానం, ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధంగానే ఉంటుంది. మొదటిది అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది. రెండవది వేదాంత తత్త్వానికి సంబంధించినది. తత్త్వాన్ని బుద్ధి తెలుసుకోనివ్వదు. ఒకవేళ తెలిసినా ఆచరణలో పెట్టనివ్వదు.
అప్పటికే జీవితంలో సగభాగం పూర్తవుతుంది. ‘కవే సంకీర్తనమ్’. కలికాలంలో కడతేరే మార్గం నాదోపాసన. సంగీత జ్ఞానం లభించిన అదృష్టవంతులకు వేరే యోగాభ్యాసం అవసరం లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సంగీత యోగం కలిగిన వారికి ‘ఇది’ కరతలామలకం.
ప్రాణానల సంయోగం చేత ప్రణవ నాదంలో నుంచి సప్త స్వరాలు పుట్టాయి. ఆ ప్రణవ నాద మాధుర్యం దొరకటమే కష్టం. త్యాగయ్య అదృష్టవంతుడు. ఈ నాద సుఖం దొరికింది. మామూలు మనిషి వేరు. ఆశ, నిరాశ, నిస్పృహల మధ్య మనసు విచిత్రంగా సంచరిస్తూ ఉంటుంది. అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్వేచ్ఛను కోల్పోతూ ఉంటాయి. మూడు యుగాలు దాటి కలియుగంలో ఇంకా ప్రథమ పాదంలోనే వున్నాం.
దీని ధర్మం, కలౌ కల్మష చిత్రానాం పాప ద్రవ్యోప జీవినామ్ విధి క్రియా విహీనాం కర్తవ్యో గోవింద కీర్తనమ్. మరో మార్గమంటూ లేదు.
నీవె సర్వంబని నిశ్చయించిన వాడు
భవరోగ మంటడో పద్మనాభ!
వ్వద్దివ్య నామామృతము గ్రోలువా డిహ
భోగంబు లొల్లడో భోగిశయన!
నీ పదాంబుజ భక్తి నిరతుడౌ వాడన్య
కర్మము ల్సేయడో జ్ఞానరూప!
నీదు దాసుల తోడ నేస్తమందిన వాడు
పరుల సేవించడో పరమ పురుష!
నీ వలన బ్రతుకున్ గాంచు నేను నిన్ను
మోసపుచ్చగ బూనితి మూఢుడనయి
అక్కలూ! గ్రుడ్డు పిల్లను వెక్కిరించు
నట్లు మాధవ! గోవింద! హరి! ముకుంద’
అంటారు. హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణదాసు.
భాగవత ప్రియులైన వారి మనోభావాలన్నీ ఒకేలా వుంటాయనటానికి ఉదాహరణగా నిలిచే ఈ పద్యం - అన్యథా శరణం నాస్తి అనే ప్రవృత్తిని ప్రతిబింబిస్తుంది.
*

- మల్లాది సూరిబాబు 9052765490