S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘దాశరథీ! నీ బుణము తీర్ప మా తరమా!’

కర్ణాటక సంగీత లోకంలో సంగీతమూర్తి త్రయమే ఉద్భవించకపోతే సంగీత పరిణామానికి ఒక దిశ, దశ ఉండేవి కావు - ఈ ముగ్గురిలో, ముఖ్యుడు త్యాగరాజు - మన తెలుగువాడు. ఈయన కీర్తనలు వినని వారుండరు - సంగీతం కోసమే పుట్టిన జీవన్ముక్తుడు. నాదయోగి. ఆయన నాదోపాసన ఎందరికో ఒరవడి దిద్దింది. ఆయన గానం నుండి కవితామృతం ఉద్భవించింది. త్యాగయ్య స్వర సాగరానికి రెండు గట్లు, స్వర సాహిత్యాలు. దానికి ఆయన వారథి. ఉపాసనతో కూడిన నాదానంద సాగరంలో మునిగి ఆణిముత్యాల్లాంటి కృతులను లోకానికి అందించాడు. అపారమైన జ్ఞానం అహంకారం పెంచవచ్చు. త్యాగయ్య దీనికి అతీతుడు కాబట్టే, సంగీత జ్ఞానం ఒకవైపు, మరోవైపు వైరాగ్య భావం.. రెంటికీ మధ్య నలిగిన మహాభక్తుడు - ఈ రెండూ వైరుధ్యంతో వున్నవే. సాహిత్య లోకంలో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన లాంటి వారు పుట్టడంతో సారస్వతానికి ఓ పెద్ద వెలుగు లభించినట్లుగా, తెలుగు సాహిత్యానికి భక్తి భాగ్య సమృద్ధి కలిగించి, మొత్తం సంగీత లోకానే్న పునీతం చేసినవాడు త్యాగరాజు. ఆయన ఇష్టపడినది ఉంఛవృత్తి జీవనం. జీవితంలో సగం తాపత్రయం దీనితో తగ్గిపోతుంది. ఆయనకిది ఓ వరం.
విరాగియై రోజులు వెళ్లదీస్తూ తల్లిదండ్రులు తప్ప, తక్కిన వాళ్లందరూ తనని బాధిస్తే, తన గోడునూ, పరితాపాన్ని విని, తీర్చేవాళ్లు లేక తాను నమ్మిన దైవమైన రాముడికి మొఱ పెట్టుకుంటూ ‘పరదేశి’గా పంచనదంలో జీవించిన రామ భజనా తత్పరుడు.
ఏ పరిస్థితులలో ఆయన చిత్తవృత్తి ఏ రూపం దాలిస్తే ఆ రూపాన్ని హృదయపూర్వక పద స్వర గతులతో బంధించి పాడేసుకున్నాడు. అలా ప్రసిద్ధమైన ఆయన కీర్తనలు విచ్చలవిడిగా, విశృంఖలంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పాడకుండా, ఒళ్లు దగ్గర పెట్టుకుని నియమ నిష్ఠలతో, శాస్త్ర ప్రమాణంతో, శుద్ధంగా, బుద్ధిగా నేర్చుకుని సాధన చేస్తే తప్ప పాడే వీలు లేకుండా కట్టడి చేసి పెట్టాడు. అదీ ఆయన గొప్పతనం. నాలుగైదుసార్లు వినేసి ముక్కున పట్టేసేవి కావు, ముక్కేసి పాడేస్తూ, అరకొర జ్ఞానంతో, వీధికెక్కి పాటలు దంచేసే వీర గాయకులకు వీటి జోలికి వెళ్లే ధైర్యం ఉండదు. భక్తి గౌరవాలున్న వారికే ఈ సంప్రదాయ సంగీతం చేరువై విస్తరిల్లింది.
ఈ విషయంలో మన విద్వాంసులు చాలా అదృష్టవంతులు. అద్భుతంగా కీర్తనలు రాసిన చాలామందికి ఈ అదృష్టం పట్టలేదు. ఏ కోరికలూ లేని త్యాగరాజాది మూర్తిత్రయానికి మాత్రమే పట్టిన యోగం ఇది. పదిమంది శిష్యుల్ని తయారుచేయగల సత్తా కలిగినవారు. ఆయన కీర్తనలను విస్తృతంగా ప్రచారం చేశారు. త్యాగరాజు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అంటే నిర్ణయించి చెప్పలేం. తేల్చి చెప్పటానికి మనమెంత? కవి వరేణ్యులైన వాళ్లు కూడా భక్తి శూన్యులై భావం గ్రహించరు. కాబట్టి, కవిత్వాలు మాని, భుక్తికీ, ముక్తికీ లోటు లేకుండా వుండేలా ఈ కీర్తనలు బోధించానని త్యాగరాజే చెప్పుకున్నాడు. అన్ని బాధలూ (దాశరథీ - తోడి రాగంలో) ఆయనే పడ్డాడు.
త్యాగరాజ కీర్తనలు బాగా ప్రచారమవ్వటానికి కారణం, ఆయన చుట్టూ చేరి, ఆయన సంగీతానికి దాసోహమన్న తమిళ సోదరులు - మాతృభాష కాకపోయినా, కీర్తనలంటే ప్రాణం కాబట్టి, తెలుగు భాష నేర్చుకున్నారు. త్యాగయ్యగారి శిష్యులు, ప్రశిష్యులూ తెలుగులోనే ఎక్కువగా కీర్తనలు రాశారు.
సర్వసాధారణంగా - త్యాగరాజ కీర్తనలు విన్నప్పుడు, పల్లవి ‘త్యాగరాజ నుత’ అని వచ్చే చరణం మాత్రం గాయకుడు పాడేసేయటం వల్ల కీర్తనలోని భావం తెలుసుకోవాలన్న ఆసక్తి లేకుండా పోయింది. క్రమక్రమంగా, సాహిత్యార్థం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు విద్వాంసులు, హృదయం నిండా ఆయన సంగీతమే ముప్పిరిగొన్న కారణం ఇది. త్యాగయ్య హృదయ కవి- ఆయన వాడినంత విరివిగా ‘హృదయం’ అనే మాట వాడిన తెలుగు రచయితలు లేరు. మనస్సుకూ, హృదయానికీ ప్రత్యేక స్థానం ఇచ్చాడు. ఆయన వాడిన ప్రతి మాట, ఆయన హృదయంలో బాగా నాని విహరించి బయలుదేరినవే గాని, ఏ మాటా అప్రయత్నంగా వచ్చినవి కాదు. ఆయన హృదయం నుంచి వచ్చిన ‘క్షోభ’ బహిర్గతమైనప్పుడు, దానికి అతి సమీపంలోని మాటలు, సన్నిహితంగా ఉన్న రాగాలు, తాళం, సరిగ్గా ఆయనకు అందుబాటులోకి వచ్చి, అతుక్కుని అమిరి, ఆయన స్వంతమై, వినేవారి హృదయాలకు సూటిగా ప్రవేశించే సామర్థ్యాన్ని కలిగి, ఆయన చెప్పుచేతల్లో మెలిగాయి.
ఆయనకు అదో వరం. అదంతా తన ప్రతాపమే అనుకుని, విర్రవీగలేదు. పబ్లిసిటీ కోసం ఏడవలేదు. శిష్యులతో ఫొటోలు తీయించుకోలేదు. మనకు దొరికేవన్నీ ఆయన ఊహాచిత్రాలే. ఏకాంతంగా రాముని దగ్గరే పాడుకున్నాడు. పాడించాడు. గుట్టుగా తన బ్రతుకు తను బ్రతికాడు. విశ్వవ్యాప్తమై పోయాడు.
త్యాగయ్య రామభక్తుడై, వేలాది కీర్తనలు రాశాడని అనుకుంటూ వున్నా, మనకు దొరికినవి వందలే - ‘పోతన’లాగా తెలుగు సంస్కృతాలు రెండూ కలిపాడు. గ్రాంథిక వ్యవహార శైలిని పక్కన బెట్టాడు. తను పుట్టింది. తన ఆశ చొప్పున రామ మహిమను, రామ నామ మాధుర్యాన్ని వర్ణించడానికే అని చెప్పాడు. చక్కని మాటలతో వెదుక్కోనవసరం లేని అర్థాలతో ఔచిత్యంతో పాడుకున్నాడు. ఆయన కీర్తనలు, శ్రద్ధగా పాడితే.. ఆయన కొలిచిన రాముని స్వరూపం, ఆ జనం, ఆ కనులు తాకని మనసు, వాళ్లకెదురుగా చేతులు జోడించి కూర్చున్న పరమ భక్తుడైన అమాయికమూర్తీ అయిన త్యాగరాజు దర్శనమిస్తాడు. లోతుగా ఆలోచిస్తే తప్ప దొరకని విషయాన్ని అతి తేలికైన, సరళమైన మాటలు జోడించి పాడటం ఆయనకే చెల్లు. పాట వింటున్నంతసేపూ ధ్వని మర్యాద, ఆ భాషలో ప్రక్షిప్తమై కనిపిస్తుంది.
- ఎన్నడు జూతునో యినకుల తిలక (కళావతి రాగంలో)
- ఎన్నాళ్లు తిరిగేది (మాళవశ్రీ)
- ఎవరితోను నే తెలుపుదు (మానవతి)
- కన్నతండ్రి నాపై (దేవ మనోహరి)
- నా జీవాధార! నా నోము ఫలమా (బిలహరి)
త్యాగయ్య.. రాముడి పొందు కోరినట్లుగా, ఏ ప్రేయసి తన ప్రియుడి పొందు కోరింది? రాముని దర్శనం కోసం ఆయన పరితపించినట్లుగా ఏ కాముకి వియోగ బాధతో విలపించింది?
తన మనసుతో మాట్లాడుకుంటూ పాడుకున్నవీ, రాముడి గుణగణాల్ని శ్లాఘిస్తూ పాడినవీ, జనంతో అన్నవీ, తన అనుభవాలు, కవి కాలాన్ని, దిక్కుమాలిన మనుషుల్ని తెగడుతూ అందగా, నిందిస్తూ పాడినవి అనేకం - కీర్తనలోని భావాన్ని తెలుసుకుంటూ, తృప్తిగా, హాయిగా, శృతిమాధుర్యంతో పాడినప్పుడే, ఆ కీర్తనల వల్ల సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుంది. దాని వృత్తాంతం వల్ల కాదు. పక్క వాద్యాల హడావుడి ఏమీ లేకుండా, తంబురా శృతిని మేళవించుకుంటూ, రాగమాధుర్యంతో పాడేవారు దొరికితే, త్యాగరాజ కీర్తనల సారం మనసుకు పట్టుతుంది. త్యాగయ్య, శిష్యులతో అలాగే పాడాడు - తారస్థాయిలో ఆయన నిలిపి పాడుతోంటే, శిష్యులు తదేక తన్మయత్వంతో వినేవారట. మేళ కర్త రాగాలకు వందలాది జన్యరాగాలున్నట్లు, త్యాగయ్యకు వందలాది శిష్య సంతతి ఉంది.
త్యాగయ్యకు ఆత్మీయుడు, ప్రధాన శిష్యులలో మానాంబుచావిడి వెంకట సుబ్బయ్యకు త్యాగయ్య (త్యాగయ్య మేనత్త కుమారుడు) యింటి విషయాలు, బాగా తెలిసిన వ్యక్తి. ఈయన శిష్యులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మహావైద్యనాథయ్యర్ (1844-1893) మహా విద్వాంసులుగా పేరు పొందారు. ‘వక్తా శ్రోతా చ దుర్లభా’ అన్నట్లు, పాడేవాడికి వినేవాడున్నపుడే ఆ పాటకు శోభ. సంస్కారవంతమైన పాటకు మళ్లీ అటువంటివారే దొరకాలి. లేకపోతే ప్రయోజనం సున్నా. తంజావూర్ పాలకుడు శరభోజీ మంచి సంగీత ప్రియుడు. ఆయన ఆస్థానంలో 364 మంది గాయకులుండేవారట. సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్వాంసుడు పాడేవాడు. ఏడాదికి సరిపడ్డ గ్రాసాన్ని రాజు ఇచ్చేవాడు. శిష్య ప్రశిష్య పరంపర గొప్పతనం చూడండి. వారిలో శొంఠి వెంకట సుబ్బయ్య, ‘కృష్ణలీలా తరంగిణి కర్త’ నారాయణ తీర్థులవారి శిష్యుడు - వెంకట సుబ్బయ్య కొడుకు శొంఠి వెంకటరమణయ్య, త్యాగయ్యకు సంగీత గురువు. వేంకట రమణ భాగవతులు కూడా ఆస్థాన విద్వాంసుడే.
త్యాగయ్య కీర్తిని విని - తన సన్నిధిలో పాడమని అడిగారు. మారుమాటాడకుండా, గుర్వాజ్ఞనుసారం బయలుదేరి, భాగవతుల సన్నిధిలో తంబురా శృతితో ‘దొరకునా ఇటువంటి సేవ’ కీర్తన పాడి, సమ్మోహపరిచాడు. త్యాగయ్య గాత్ర సంపదకు, పాండిత్యానికి సమ్మోహితుడైన గురువు నోట మాట లేదు. ‘దొరకునా యిటువంటి శిష్యుడు?’ అని శ్లాఘించాడు. ఈ కీర్తనకు ఎంతో చరిత్ర ఉంది. త్యాగయ్య గారి శిష్యులలో ఉమయాళ్‌పురం సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్ సోదరులిద్దరూ చాలా చిన్నతనంలోనే త్యాగరాజు దగ్గర చేరారు. అద్భుతంగా పాడేవారు. ప్రత్యేకంగా జరిగే ఉత్సవాలలో (సప్త స్థానం ఉత్సవాలు) పల్లకితో ఊరేగే సమయంలో ఒక్కొక్క చోట ఆగుతూ పాడేవారు - ఓసారి ఈ పల్లకీ ఉత్సవంలో సోదరులిద్దరూ ‘దొరకునా యిటువంటి సేవ’ అందుకుని, మైమరచి పాడేశారు. జనం భారీగా గుమిగూడి ప్రశాంతంగా, అంతే తన్మయత్వంతో వినేశారు - పల్లకీ, మహావైద్యనాథయ్యర్ ఇంటి ముందు ఆగింది.
మైకులు లేని రోజుల్లో వేలాది సంగీత రసికులను తన గాత్రంతో ఉర్రూతలూగించిన మహా గాయకుడు మహా వైద్యనాథయ్యర్, ఆసక్తితో కీర్తన వింటున్నాడు. ఆనందబాష్పాలతో, పరమాశ్చర్యంతో, సోదరులిద్దరినీ అభినందిస్తూ ‘ఏమీ గానం?’ అని రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.
ఇద్దరు కలిసి పాడే కీర్తనలను, ఎంపిక చేస్తూ, చెప్పి త్యాగయ్య ఈ సోదరులను తీర్చిదిద్దాడు. దక్షిణ భారతదేశంలో త్యాగరాజ కీర్తనలు ప్రచారం కావటానికి ఈ సోదరులు చేసిన కృషి చెప్పుకోతగినది.
లోకంలో మనుషుల తీరును బాగా గ్రహించేశాడాయన. తన కీర్తనల ద్వారా చెప్పి చూశాడు. వినకపోతే ‘నీ ఖర్మ’ అన్నాడు. ఐశ్వర్యవంతుణ్ని పొగిడితే నచ్చదు. గాయకుణ్ణి (విద్వాంసుడైనా) విమర్శిస్తే కిట్టదు. సంగీత రంగం కంటే ‘సంగీతమే’ గొప్పదని నమ్ముతూ, అన్నింటికి భక్తి ఒక్కటే కారణం - ఇది లేకపోతే ఏదైనా వృథా! అని లోకాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేసిన మహానుభావుడు, త్యాగయ్య.
కీర్తనలు పాడేసుకుంటూ పోకుండా, ఆగి ఓసారి చూసి, పరిశీలిస్తే, ఆయన హృదయం ఏమిటో తెలుస్తుంది. (ఆ ప్రయత్నం సంగీత సభలు పూనుకోవాలి) కాకి, చేప రెండూ నీటిలో మునుగుతూనే వుంటాయి. అది స్నానం కాదుగా? మేక ఆకులు మేస్తుంది, అది ఉపవాసమా! మునివేషాలేసే వాళ్లు చాలామంది ఉంటారు. వారంతా సర్వసంగ పరిత్యాగులా? కాదు’ అంటూ కపటం లేని భక్తి కలిగి ఉంటూ, సుస్వరంతో పరాత్పరుణ్ణి అర్చించే మార్గాన్ని, గాయకులకు పాడి చూపించిన నాదయోగి త్యాగయ్య. సంగీతమూర్తిత్రయం వారి కీర్తనలు, దశాబ్దాలుగా అలా వింటున్నాం. ఎవరు పాడినా వింటున్నాం. ఎలా పాడినా వింటున్నాం. ఒకే కీర్తన పదిమంది పాడినా విసుగనిపించకుండా ఎలా వింటున్నారు? జనం ఏమిటి వాటి గొప్పతనం? మతాబులలో మందు కూరినట్లు, కీర్తనలలో రాగమాధుర్యాన్ని నింపేశాడు. ఒక రాగ స్వరూపం తెలియాలంటే ఆ కీర్తనలే శరణ్యం. ఒక రాగాన్ని రోజంతా పాడిన విద్వాంసులుండేవారు, తంజావూరు సంస్థానంలో. రాగం పాడేందుకు దగ్గర దారులు లేవు.
ఆరోహణ, అవరోహణ ఒక్కటే తెలిస్తే సరిపోదు. 72 మేళ కర్త రాగాలన్నిటిలోనూ కనిపించేవి ఆ ఏడు స్వరాలే. కాని స్వరాల స్వరూపం వేరు. స్వరాన్ని రాగభావం వచ్చేలా పాడటానికి ఒక జీవితకాలం సరిపోదు. ఎప్పటికప్పుడు రాగం అనేది కొత్తగానే ఉంటుంది. మహా గాయకులైనా ఈ మాటే అనుకుంటూ పాడతారు. మామూలు గాయకులెంత? ప్రధాన మేళ కర్త రాగాలలో త్యాగయ్య ఎన్నో కీర్తనలు రచించాడు. తోడి, కల్యాణి, శంకరాభరణం, ఖరహరప్రియ, కాంభోజి లాంటి రాగాలలో పదుల సంఖ్యలో కీర్తనలున్నాయి. ఒక్క కీర్తన సరిపోదా? అంటే సరిపోదు. రాగం ఒకే కీర్తనలో ఆవిష్కరింపబడక పోవచ్చు. తృప్తి ఉండదు. అందుకే అన్ని కీర్తనలు పుట్టాయి. ఆయన ప్రతి కీర్తనా రాగ రసంతోనే ఉంటుంది. నీరసంగా వుండే కీర్తనలేమీ లేవు - వుండవు. పాడగలిగే సామర్థ్యాన్నిబట్టే వాటికి రూపం వస్తుంది.
శిల్పులను బట్టే శిల్పం. చిత్రకారుణ్ణి బట్టే చిత్రం. గాయకుణ్ణి బట్టే పాట. మూర్ఛన భేదాలతో, సారూప్యత కల్గిన రాగాలెన్నో ఉన్నాయి. దేవగాంధారి, ఆరభి, ఒకేలా ఉంటాయి. అవే స్వరాలు. భైరవి, ముఖారి కూడా అంతే. మనుషుల్లాగే ఒక రాగాన్ని పోలిన మరో రాగం ఉంటూనే ఉంటుంది. అప్రధానంగా వుండి రంజకత్వం లేని రాగాలూ ఉన్నాయి. యిటువంటి రాగాలలో ఒకటో అరో కీర్తనలు పాడుకుని ఊరుకున్నాడు - వివాది స్వరాలతో - కూడినవీ, రంజకత్వం లేని రాగాలు సంఖ్య కోసమే తప్ప, పాడుకుని ఆనందం ఇవ్వని వాటి జోలికి, ఆయన వెళ్లలేదు. తాళంతో పాడితే కీర్తన. తాళం తీసేసి, స్థిమితంగా కీర్తన పాడుకుంటే రాగం. పాట పాడటానికి, రాగం పాడటానికీ ఎంతో తేడా ఉంది. అప్పటికప్పుడు పాడేది రాగం.
ప్రత్తి (దూది) నుంచి వత్తులు ఎలా తయారవుతాయో కీర్తనల నుంచి ‘రాగం’ అలా వస్తుంది. ఈ మర్మం తెలిసిన కొద్ది సంగీత సద్గురువుల వల్ల మాత్రమే, శిష్యులు తయారౌతారు. లేనివాళ్లు శ్రోతల్లా మిగిలిపోతారు.
* * *
ఈ పుష్యమాసంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు, ఊరూ, వాడా, ఎంతో వైభవంగా జరుగుతాయి. వేలాది విద్వాంసులు ఆ సంగీత సద్గురువుకు నీరాజనాలు సమర్పించుకుంటూంటారు. త్యాగయ్య కృతులలో బాగా ప్రసిద్ధమైనవి ‘త్యాగరాజ పంచరత్న కీర్తనలు’. ఆరాధనోత్సవాలలో విధిగా వినిపించేవి. సంగీత గుణం నిండిన సాహిత్యం, పదిమందీ కలిసి పాడుతోంటే దేవేంద్రుడు కొలువులో కూర్చుని వింటున్నామా అన్న అనుభూతి. క్షణక్షణం త్యాగయ్యను స్మరిస్తూ, చేతులు రెండూ జోడించి నమస్కరించాలనే దివ్యమైన అనుభూతి, ముప్పిరిగొని, పరమానందాన్ని పంచేస్తాయి. వివిధ జంత్ర, గాత్రాలతో పాడేవారిని చూస్తూ వింటే సర్వత్రా వ్యాపించి వున్న నాదంలో రామపద కమలాలు పట్టుకుని కూర్చుని, సేవచేసే ఆంజనేయుడు, రామనామ రసికుడైన పరమశివుడు, నారదుడు, పరాశరుడు, శుకశౌనకాది మునులు, పార్వతి, సీత, మొదలైన వారందరూ మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తారు - ఆ కీర్తనలన్నీ విన్నాక, ఇంటి ముఖం పట్టాలనిపించదు.
సహజ పండితుడై, సంగీత సాగరాన్ని పుక్కిటబట్టి చరితార్థుడైన ఆ నాదయోగికి సాష్టాంగపడాలనిపించటం అందరికీ అనుభవమే. సంస్థానాధీశుల హయాంలో మనం స్వతంత్రంగా బ్రతకలేని ఆ రోజుల్లో, చెయ్యి చాచి ‘దేహి’ అనకుండా సర్వస్వతంత్రులై, తాను నమ్ముకున్న దైవమే జీవితంగా బ్రతికిన త్యాగరాజాది సద్గురువుల ఋణం తీరాలంటే వారు పాడుకుని తరించిన మార్గంలో, ఆ కీర్తనలు శుద్ధంగా, సంప్రదాయసిద్ధంగా, అలా పాడుకోవటమే!
‘ఎందుకు పుట్టావని నువ్వు అడగవద్దు, నేనెందుకు పుట్టానో నీకు తెలుసు. నా మెడకు భక్తిని గుట్టుగా చుట్టేసావు. నిన్ను విడిచిపెట్టి బ్రతకగలనా? అన్నిటికి సర్వాధికారివి కాబట్టి నిన్ను పట్టుకుని ఏడుస్తున్నాను. లోకంలో కృతజ్ఞత లేని మనుషుల దగ్గర ఏడ్చినా కంటినీళ్లు దండగ. కాపాడితే నువ్వే కాపాడాలి. మోక్షమివ్వాలంటే నువ్వే యివ్వాలి’ అంటాడు. ఇదే త్యాగరాజ కీర్తనల గీతార్థం - సంగీతార్థం.

ఆరాధనోత్సవాలకు ఆద్యురాలు

త్యాగరాజు స్వస్థలం తిరువయ్యార్ ఇప్పుడు ఒక పవిత్ర సంగీత క్షేత్రం.
ప్రతి ఏడాది త్యాగరాజ ఆరాధనోత్సవాలు వైభవంగా జరగటానికి, నాంది పలికినది బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఓ దేవదాసి. ‘నాన్ దేవర అడియాళ్’ (నేను దేవదాసిని) అని 1941 సంవత్సరంలో మైకు ముందు నిలబడి తిరువయ్యార్‌లో ఉత్సవాలు ప్రారంభించింది. నాగరత్నమ్మ ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బిడారం కృష్ణప్ప శిష్యురాలు. దయనీయమైన స్థితిలో వున్న త్యాగరాజ స్వామివారి సమాధిని పునరుద్ధరించి స్వంత ధనాన్ని ఖర్చుపెట్టి తన 43వ ఏట నుండి త్యాగరాజ స్వామి భక్తురాలైంది. గొప్ప గాయని. త్యాగరాజు నిర్యాణం చెందిన పుష్యబహుళ పంచమి రోజున ఆయన సమాధి చుట్టూ విద్వాంసులు చేసే పంచరత్న గానాన్ని కనులారా తిలకించాల్సిన పరమాద్భుత దృశ్యం.

బెంగుళూరు నాగరత్నమ్మ

- మల్లాది సూరిబాబు 9052765490