S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 19

వశిష్ఠుడి చేతిలో పరాభవం చెందిన విశ్వామిత్రుడు తన పెద్ద భార్యతో ఉత్తర దిక్కుకి వెళ్లి కేవలం పళ్లు, కందమూలాలే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో తీవ్రమైన తపస్సు చేశాడు. తర్వాత ఆయనకి నలుగురు కొడుకులు పుట్టారు. అలా కొంతకాలం ఆయన తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.
‘విశ్వామిత్రా! నువ్వు రాజర్షివి అయ్యావు’
తన తపస్సుకి లభించిన ఆ ఫలితానికి తృప్తి చెందక, పైగా సిగ్గుపడ్డ విశ్వామిత్రుడు మళ్లీ తీవ్ర తపస్సుని ఆరంభించాడు.
ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు త్రిశంకుడు అనే రాజు ఉండేవాడు. అతనికి యజ్ఞం చేసి శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగి, వశిష్ఠుడి దగ్గరికి వెళ్లి కోరాడు. కాని ఆయన అది కుదరదని చెప్పడంతో, దక్షిణ దిక్కులోని వశిష్ఠుడి కొడుకుల దగ్గరికి వెళ్లి తన కోరికని చెప్పాడు. అది విన్న వారు కోపంగా చెప్పారు.
‘మూర్ఖుడిలా ఉన్నావు. న్యాయపరుడైన గురువు కాదన్నాక ఇంకొకర్ని ఎలా ఆశ్రయిస్తున్నావు? ఇక్ష్వాకు వంశీయులకి పురోహితుడు, గురువైన మా తండ్రి చేయలేని దాన్ని మేము చేసి ఆయన్ని అవమానిస్తామా?’
‘సరే. నా గురువు, వారి కొడుకులు కూడా నిరాకరించారు కాబట్టి నేను మరొకర్ని చూసుకుంటాను’ చెప్పాడు.
ఆ మాటలకి కోపంతో వశిష్ఠ కుమారులు త్రిశంకుణ్ని ఛండాలుడు అవమని శపించారు. ఆ రాత్రి గడిచాక ఆయన సుకుమారమైన శరీరం నల్లగా, రాజదుస్తులు నల్లటి దుస్తులుగా, జుట్టు పొట్టిగా, బంగారు ఆభరణాలు ఇనప ఆభరణాలుగా మారి ఛండాలుడి రూపం వచ్చింది. ఆయన్ని చూసి అనుచరులు, మంత్రులు పారిపోయారు.
ధైర్యవంతుడైన త్రిశంకుడు దుఃఖంతో విశ్వామిత్రడి దగ్గరికి వెళ్లాడు.
‘నా గురువు, అతని కుమారుల వల్ల శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే నా కోరిక తీరకపోగా ఈ రూపాన్ని పొందాను. బొందితో స్వర్గానికి వెళ్లాలనే కోరికతో వంద యజ్ఞాలు చేసినా ఫలితం లభించలేదు. అనేక యజ్ఞాలు చేస్తూ ప్రజలని ధర్మంగా పాలించిన నేను ఎన్నడూ అబద్ధం ఆడలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇక మీదట కూడా అబద్ధం ఆడను అని నా క్షత్రియ ధర్మం మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నేను చేసే యాగానికి గురువులు చేయూత ఇవ్వడం లేదు. అందువల్ల నీ దగ్గరికి వచ్చాను. దయచేసి నా కోరిక తీర్చు. ఇంక నన్ను కాపాడే వారే లేరు’
అతనికి జరిగింది విని, ఛండాల రూపంలోని త్రిశంకుడి మాటలకి జాలిపడ్డ విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
‘్భయపడక. నువ్వు ధర్మపరుడివని నాకు తెలుసు. నిన్ను కాపాడుతాను. కాబట్టి నిశ్చింతగా యజ్ఞం చేయి. అందుకు అవసరమైన మహర్షులని రప్పిస్తాను. ఇక స్వర్గం నీ చేతిలో ఉన్నట్లే. ఈ ఛండాల రూపంలోనే నువ్వు స్వర్గానికి వెళ్తావు’
విశ్వామిత్రుడు యజ్ఞానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చమని తన కొడుకులకి సూచించి, తన శిష్యులతో చెప్పాడు.
‘మీరు ఋషులని, వారి శిష్యులు, స్నేహితులు, ఋత్విక్కులని తీసుకురండి. ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతారో ఆ మాటలని నాకు చెప్పండి’
విశ్వామిత్రుడి శిష్యులు నాలుగు వైపులకి వెళ్లి, అన్ని దేశాల నించి వేద పండితులైన బ్రాహ్మణులని తీసుకువచ్చారు. మహోదతుడు తప్ప మిగిలిన బ్రాహ్మణులు అంతా వచ్చారని విశ్వామిత్రుడు గ్రహించాడు.
‘గురుదేవా! మహోదతుడు, వశిష్ఠుడి కొడుకులని కూడా ఆహ్వానించాం. కాని వారు కోపంగా ‘క్షత్రియుడు యాగ్నీకుడిగా, ఛండాలుడు సమర్పించే హవిస్సుని దేవతలు ఎలా స్వీకరిస్తారు? ఛండాలుడి అన్నం తినే బ్రాహ్మణులు స్వర్గానికి ఎలా వెళ్తారు?’ అని అన్నారు.’
విశ్వామిత్రుడు వెంటనే కోపంగా ఇలా శపించాడు.
‘ఉగ్ర తపస్సు చేసే నన్ను నిందించిన వారంతా బూడిద అగు గాక! వారు వంద జన్మలు ముష్టిక జాతిలో పుట్టి, నిత్యం కుక్క మాంసాన్ని తింటూ వికృత రూపాలతో ఈ లోకంలో సంచరించుదురు గాక! నన్ను తిట్టిన మహోదతుడు ప్రాణం తీసే దయలేని దుష్టజాతి ఐన నిషాద జాతిలో పుట్టుగాక!’ (బాలకాండ సర్గలు 57-59)
**

మీకో ప్రశ్న
బాలకాండలో మొత్తం
ఎన్ని సర్గలు ఉన్నాయి?
**

గత వారం ప్రశ్నకి జవాబు

పశ్చిమ ఒరిస్సాలోని మహేంద్ర పర్వతం.
**

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1. యోని నుంచి శకులు, మలమూత్ర ద్వారాల నించి యవనులు పుట్టడం తప్పు. యోని నించి యవనులు, మలమూత్ర ద్వారాల నించి శకులు పుట్టారు.
2. విశ్వామిత్రుడి కొడుకులు ఏభై మంది తప్పు. వారు వంద మంది.
3. విశ్వామిత్రుడు హిమాలయాలకి వెళ్లబోయే ముందు తన భార్యకి రాజ్యం అప్పగించడం తప్పు. ఓ కొడుక్కి రాజ్యాన్ని అప్పగించాడు.
4. వశిష్ఠుడి మీద అస్త్రాలని ప్రయోగించడం తప్పు. వశిష్ఠాశ్రమానికి వెళ్లి విశ్వామిత్రుడు ఆశ్రమం మీద ఆ అస్త్రాలని ప్రయోగించాడు.
5. వశిష్ఠుడు విశ్వామిత్రుడి మీద అస్త్రం ప్రయోగించడం తప్పు. ఆ పని ఆయన చేయలేదు.
6. వెంటనే బ్రహ్మదేవుడు రావడం తప్పు. మునులంతా వచ్చి వశిష్ఠుడితో ఆయన గెలిచాడని చెప్పారు.
7. విశ్వామిత్రుడ్ని మునులంతా ఓదార్చడం తప్పు. అది జరగలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి