S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శత్రువులు

పోలీసులను చూస్తే నిజానికి మన దేశంలో కనీసం అందరూ భయపడతారు. వాళ్ల నుంచి దూరంగా ఉండడం మాత్రమే మంచిదని అందరికీ గట్టి నమ్మకం. వాళ్లు మాత్రం రక్షకులు. ఎవరినీ ఎప్పుడు ఎట్లా రక్షిస్తారన్నది అందరికీ అర్థంకాదు. నాకు కూడా పోలీసుల నుంచి దూరంగా ఉండడమే అలవాటు. అందరిలో నేనూ ఒకణ్ణి కనుక నాకు ఆ రకమయిన ఆలోచన వచ్చి ఉంటుంది. అది నా స్వంత ఆలోచన కాదు. సమాజం నాకు రుద్దిన ఆలోచన. పోలీసులతో కొందరికి భయంకరమయిన అనుభవాలు ఏర్పడి ఉంటాయి. అట్లాగని పోలీసులందరూ చెడ్డవాళ్లంటే నిజమని నాకు అనిపించదు.
గతంలో ఒకసారి ట్యాంక్‌బండ్ దగ్గర ఒక భారీ సమావేశం ఏదో జరిగింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. శాంతిభద్రతలను కాపాడే పేరుతో పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా అక్కడ చేరారు. సమావేశం బహుశా ప్రభుత్వ వ్యతిరేక పద్ధతిలో జరిగి ఉంటుంది. అక్కడ గద్దర్ పోలీసులను గురించి ఒక పాట పాడాడు. పోలీసుల బతుకులను దయనీయంగా చిత్రించాడు. అక్కడే ఉన్న పోలీసులందరూ బహుశా చేయవలసిన పనిని మరిచి అతని పాట వింటూ ఉండిపోవడం నాకు గుర్తు. పోలీసులు కల్పించుకోవలసిన పరిస్థితి అక్కడ ఏమీ కలగలేదు. అయినా పోలీసులు ఉండాలి కనుక ఉన్నారు. కానీ, ఆ సమావేశానికి పోలీసులు కేవలం బందోబస్తుగా కాకుండా ప్రేక్షకులుగా మిగిలారని నాకు ఇవాళ అనిపిస్తున్నది.
నేను ఎన్నడూ పోలీసుస్టేషన్‌లో కాలు పెట్టలేదు. పెట్టడం పొరపాటని నేను అనుకోవడం లేదు. కానీ నాకు ఆ అవసరం రాలేదు. గొప్ప పేరున్న ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు నన్ను కలవాలనుకున్నాడు. ఆయన మా ఇంటికి రావాలంటే పెద్ద గందరగోళమే జరగాలి. కనుక, ననే్న వాళ్ల ఆఫీస్‌కు గౌరవంగా ఆహ్వానించాడు. కారు పంపుతానన్నాడు. నేను పోలీస్ కారు మాత్రం దయచేసి పంపవద్దన్నాను. ఆ రకం కారు వచ్చి నన్ను గౌరవంగా తీసుకుపోయినా, ‘ఈ మనిషిని పోలీసులు పట్టుకుపోయారు’ అని మా పక్కలవాళ్లు అనుకునే ప్రమాదం ఉందని నాకు అనుమానం మాత్రమే. నిజానికి ఆ మిత్రుడు తన స్వంత కారు పంపించాడు. ఈ సందర్భం తప్ప నేను అధికారంలో ఉన్న పోలీసులతో వారి ఆఫీసులో మాట్లాడిన సందర్భాలు లేవు.
అట్లాగే, నేనెప్పుడూ ఏ కోర్టులోకి వెళ్లలేదు. చిత్రంగా నా పేరునే చివరికి సుప్రీంకోర్టులో దాకా అంటే మూడు అంచెలలో కేసులు జరిగాయి. నేను మాత్రం వెళ్లలేదు. నా లాయర్లను నేను కనీసం చూడలేదు. మూడు చోట్లా నేనే నెగ్గాను. అందువల్ల నాకు ఒరిగినది ఏమీ లేదనడానికి లేదు. నాకు గౌరవం మిగిలింది. వివరాలు అప్రస్తుతం.
ఈ మధ్యన ఒక విచిత్రమయిన పుస్తకం చేతికందింది. ఈ మాటలో కొంచెం తికమక ఉందేమో. పట్టుకోవడానికి ఆ పుస్తకం నా చేతికి చిక్కలేదు. అది కంప్యూటర్‌లో నాకు అందింది. కంప్యూటర్‌లోనే చదివాను. పుస్తకాన్ని రాసింది ఒక న్యాయాధికారి. సులభంగా చెప్పుకోవాలంటే జడ్జిగారు. ఆయన పేరు హెన్రీ సిసిల్ లియాన్. తన పదవీ కాలంలో ఎదురయిన కొన్ని అనుభవాలను గురించి ఆయన కొంత వ్యాసంగాను, మరింత కథగానూ ఉండే పద్ధతిలో రాసుకున్నారు. చదవడానికి నిజంగా సరదాగా ఉంది. చదివిన సంగతులు సరదాగా లేదా ఉపయోగకరంగా ఉంటే మరింత మందికి చెప్పాలని నాకు బలంగా అనిపిస్తుంది. అందుకు తప్ప, ఈ ముక్క రాయడానికి మరొక కారణం లేదంటే లేదు. పోలీసుల గురించి, జడ్జిల గురించి రాయకుండా ఉంటేనే మంచిది. వాళ్లు తమ గౌరవానికి భంగం కలిగింది అనుకుని నా మీదకు వస్తారేమో! ఈ అనుమానం నాకు అసలు లేదు. అట్లాగని లేదనడానికీ లేదు.
మరొక్కసారి పోలీసుల గురించి... నేను కొంతకాలం ప్రయివేటు కంపెనీలలో మేనేజ్‌మెంట్ పాఠాలు చెప్పాను. చిత్రంగా ఒకానొక కంపెనీ వారి కార్యక్రమంలో కొంతమంది మధ్యస్థాయి పోలీసు అధికారులు నా క్లాసులో విద్యార్థులుగా వచ్చేశారు. నేను అక్కడ కమ్యూనికేషన్ అనే విషయం గురించి చెపుతున్నాను. వివిధ స్థాయిలలో ఉండే మనుషులతో మనం మాట్లాడవలసిన మసలవలసిన తీరులను గురించి చెపుతున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా పోలీసు అధికారులు తమ అనుభవాలను అందరి ముందు చెప్పవలసిన సందర్భం ఏర్పడింది. అవి విన్న తరువాత నాకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ల మీద గౌరవం కొండంత ఎత్తుకు పెరిగింది. వాళ్లు తమ ప్రాణాలను కూడా పట్టించుకోకుండా ప్రజాసంక్షేమం కొరకు చేసే పనులను అందరికీ చెపితే బాగుండును అనిపించింది. ఆఫీసర్లు మాత్రం ఆ అవసరం లేదన్నారు. తమకు ప్రచారం అక్కరలేదన్నారు. అది నాకు మరింత బాగనిపించింది.
వద్దంటూనే పోలీసులను గురించి చాలా చెప్పినట్టున్నాను. సందర్భం కనుక మరో నాలుగు సంగతులు కూడా ఇక్కడే చెపితే బాగుంటుంది. ఒక మిత్రుడు చదువులో మాకు సీనియర్. ఆ తరువాత అతను పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అది హైదరాబాద్‌లో కాదు. ఎక్కడో చెప్పను. విషయం మాత్రం చెపుతాను. అతను మమ్మల్ని అంటే నాతోబాటు మరొక మిత్రుణ్ణి ఇంటికి భోజనానికి పిలిపించాడు. వెళ్లి తిన్నాము. ఆ తరువాత అతనే సినిమాకు వెళదామన్నాడు. బయలుదేరాము. ఈలోగా అతను మమ్మల్ని తమ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన వివరాలను ఎక్కువగా చెప్పడం బాగుండదని నాకు గట్టిగా భావన కలుగుతున్నది. ఈ ఆఫీసర్ ఒక దుర్మార్గుణ్ణి మా కళ్ల ముందే గొడ్డును బాదినట్టు బాదాడు. అది అవసరమా, కాదా అన్న ప్రశ్న ఆనాడు, ఈనాడు నా మనసులో అలాగే ఉంది. ఆ సంగతి వదిలేద్దాం. తరువాత మేము ఒక ఏఎన్నార్ హిట్టు సినిమా చూడడానికి ఆ ప్రక్కనే ఉన్న హాల్లోకి బయలుదేరాం. మేము గేటులోకి నడుస్తుండగానే ఓ నలుగురయిదుగురు గోడలు దూకి పారిపోవడం గమనించాను. మిత్రుడిని ఏమిటది అని అడిగాను. అదంతా తన వల్లనే అని అతడు చిరునవ్వులతో చెప్పాడు. మొత్తానికి మా మిత్రుడు ఆ నగరంలో మకుటం లేని మహారాజని అర్థమయింది. కానీ, పోలీసులంతా అంత క్రూరంగాను ఉండవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నది నా ప్రశ్న. ఈ ప్రశ్న నన్ను వదలదు. నాకు పోలీసుల పట్ల గౌరవం ఉండవచ్చు. ఆ పద్ధతి గౌరవం అందరికీ కలిగే ప్రయత్నం. ఎక్కడ, ఎట్లా జరగాలన్నది నాకు తోచలేదు.
మరోసారి జడ్జిగారి గురించి.. ఆయన నిర్మొహమాటంగా మాలాంటి వాళ్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అని ఒక ముక్క రాశారు. నాకు వెంటనే నా మిత్రులు ఒకరిద్దరు మనసులో మెదిలారు. వాళ్ల తీరులో నాకు కొంత తేడా కనిపించిన మాట వాస్తవం. న్యాయాధికారులను కోర్టులలో ఇంచుమించు దేవుళ్ల లెవెల్లో చూస్తారని నాకొక అనుమానం. ఈ మధ్య వరకూ వారిని ‘మై లార్డ్!’ అనే అలవాటు ఉండేది. ఇప్పుడు ‘యువర్ ఆనర్!’ అంటున్నారు. లేదంటే అంత గౌరవకరమయిన మరేదో పేరు ఉండే ఉంటుంది. నేను ఒకానొక జడ్జిగారితో కలిసి ఒకచోట లిఫ్ట్‌లో వెళుతున్నాను. ఆయన మధ్యలోనే దిగుతాడు. నేను మరింత పైకి పోతాను. ఆయన బయటకు వెళ్లవలసిన చోట లిఫ్ట్ గ్రిల్స్ ఎవరు తీసింది నాకు జ్ఞాపకం లేదు. జడ్జిగారు వాటిని మూయకుండానే వెళ్లిపోవడం మాత్రం గుర్తుంది. నేను తడుముకోకుండా ఆయనను పిలిచి తలుపు వేయడం మీ బాధ్యత అని చెప్పాను. నాది మొరటుతనమని నాకు బాగా తెలుసు. మరి నేను మొరటి మనిషినే. ఆయన పెద్ద ఆఫీసరు. కానీ, నేను ఆయన బంట్రోతును మాత్రం కాదుగదా! ఆయన తలుపు వేయకపోవడం అలవాటుకొద్దీ చేసిన పని అనుకోకుండా చేసిన పని. అంతేగాని, నన్ను అవమానపరచాలని చేసింది కాదు. మేమిద్దరం ఆ తరువాతి కాలంలో చాలా మంచి మిత్రులయ్యాము. బహుశా మా జడ్జిగారు ఈ నాలుగు అక్షరాలు చదివినాసరే, హాయిగా నవ్వుకుంటారు తప్ప, మరొక మాట అనరు.
మరొక జడ్జి నన్ను ఏదో సాయం అడగాలని ప్రయత్నించారు. అందులోనూ గొప్ప దాష్టీకం కనిపించింది. ఆ సంగతి నేను మొహమాటం లేకుండా ఆయనకు చెప్పాను. నొచ్చుకున్నాడేమో తెలియదు.
ఇక ఈ పుస్తకంలో జడ్జిగారు ఒకరోజు కారులో ఆఫీస్‌కు వెళుతున్నారు. మరి కారును ఆ దేశంలో ఆయనే నడిపించే పరిస్థితేమో! దారిలో ఒక మొరటు మనిషి తన లారీని అడ్డు పెట్టాడు. నేను ఫలానా జడ్జిని, నీ వల్ల నాకు ఆలస్యమవుతుంది. లారీ కాస్త పక్కకు జరుపూ అన్నా సరే, ఆ మనిషి పట్టించుకోలేదు. చట్టం ప్రకారం ఆ మనిషిని బొక్కలో తోయవచ్చునని జడ్జిగారు అంటారు. ఆయన చిత్రంగా ఆ ప్రయత్నం చేశారు కూడా. కానీ, పని జరగలేదు. తెలివిగల లాయరు ఒకతను అడ్డుపడి లారీ మనిషికి శిక్ష పడకుండా చూస్తాడు.
ఆ సంగతి చదివిన తరువాత నా బుర్రలో తిరిగిన ఆలోచనలు మీ ముందు ఉంచాను. ఆ తరువాత మీ ఇష్టం.

కె.బి. గోపాలం