S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక్క తూటా చాలు..18

తనని పెంచినామెతో ఒకసారి ఆ దేవాలయానికి వెళ్లాడు గంగోత్రి. ఎందుకో అక్కడ జరిగే తంతు నచ్చలేదతనికి. అందుకే ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగకి దూరంగా ఉంటాడు. తన వారిలో ఎవరైనా అరవాన్ దేవాలయానికి వెళ్లాలని, ఆ దేవుడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అడ్డు చెప్పడు. తరాల నుంచి పాతుకుపోయిన నమ్మకాన్ని మార్చలేనని తెలుసు కాబట్టి తన పెద్దరికం నిలుపుకోవడానికి పది మందిని ప్రతి ఏడూ అరవాన్ దేవాలయానికి పంపుతాడు.
నిట్టూర్చాడు గంగోత్రి.
* * *
ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయానికి ఎదురుగా పని లేకుండా కూర్చున్న ఓ బ్రోకర్ని సమీపించాడు రాజేష్.
‘ఏం కావాలి సార్?’ అడిగేడతను.
ఓ స్లిప్ అందించి చెప్పాడు రాజేష్.
‘ఆ కారు ఓనర్, చిరునామా కావాలి’
‘మీరేం చేస్తారు?’ సందేహంగా చూశాడు.
‘ఏమీ చెయ్యను. ఆ కారు ఓనర్‌తో చిన్న పని పడింది. నిన్న రాత్రి నా బండిని గుద్ది ఆగకుండా వెళ్లిపోయాడు...’
‘ఎవరు పడితే వారు ఓ నెంబరు పట్టుకొచ్చి వివరాలు అడిగితే చెప్పరు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి’ బ్రోకర్ స్లిప్ తిరిగిస్తూ చెప్పాడు.
రాజేష్ మాట్లాడకుండా రెండు వంద నోట్లు అందించాడు. స్లిప్‌తోపాటు నోట్లు తీసుకుని,
‘పేరు, చిరునామా రాసుకొస్తే చాలా?’ అడిగేడు.
బదులుగా తలూపాడు రాజేష్.
‘కూర్చోండి’ చెప్పి, అతను ఆఫీసులోకి వెళ్లాడు.
ప్రతీ ఆఫీసులో కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాయి కాబట్టి ఓ వాహనం నెంబర్ని బట్టి చిరునామా తెలుసుకోవడం చాలా తేలిక. అయితే అనధికారికంగా వెళ్లి అడిగితే చెప్పరు. బ్రోకర్లకి ఆఫీస్ సిబ్బందితో పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పనులు తేలిగ్గా అవుతాయి.
అరగంట తర్వాత వచ్చి స్లిప్ చేతిలో ఉంచాడు బ్రోకర్. ఆ కారు ఓనరు పేరు లింగంపల్లి భూపతి. సాగర్‌నగర్‌లో గంగోత్రి ఉంటున్న ఇల్లే చిరునామా. తలపంకించి బ్రోకర్ని అడిగేడు రాజేష్.
‘ఆ పేరుగల వ్యక్తికి ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలుసుకోగలమా?’
‘తెలుసుకోవచ్చు. ఖర్చవుతుంది...’ చెప్పాడు నవ్వుతూ.
‘ఎంత సమయం పడుతుంది?’
‘చెప్పలేం...’
‘సాయంకాలానికి అవుతుందా?’
‘మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లండి. కాల్ చేస్తాను’
బ్రోకర్ అడిగిన అయిదు వందలు, సెల్ నెంబరు ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరాడు రాజేష్. ఆ రోజు డ్యూటీకి ఓ గంట ఆలస్యంగా వస్తానని చెప్పడంతో రాజేష్ వర్క్ మరో అతను చూస్తున్నాడు. అతన్ని అతని సీట్‌కి పంపేసి తన సీట్‌లో కూర్చున్నాడు. మధ్యాహ్నం రెండు వరకూ ఊపిరి సలపని పనితో గడిచిపోయింది సమయం. బయటకెళ్లి లంచ్ ముగించుకుని రాసమణికి కాల్ చేశాడు.
‘గుడి నుంచి హడావిడిగా వెళ్లిపోయావేం?’
‘షరీఫ్ వచ్చాడు’ చెప్పింది.
‘ఎవరతను?’
‘గంగోత్రి మనిషి. అమ్మాయిల్ని విటుల దగ్గరకు పంపడం నుంచి మొత్తం అతనే చూస్తాడు. మేము ఎక్కడికైనా వెళ్లాలంటే షరీఫ్ పర్మిషన్ తీసుకోవాలి. నిజంగా నేను గుడికి వెళ్లానో లేదో తెలుసుకోవడానికి వచ్చాడు. అతను మిమ్మల్ని చూస్తే ఇబ్బందని వెళ్లిపోయాను’ వివరించింది రాసమణి.
‘గంగోత్రి దగ్గర షరీఫ్ లాంటి మనుషులు ఇంకా ఉన్నారా?’
‘నాకు తెలిసి వేరెవరూ లేరు. వీడొక్కడే చాలు మొత్తం చక్కబెట్టడానికి...’
‘అంత సమర్థుడా?’ సాలోచనగా అడిగేడు రాజేష్.
రాసమణి నిట్టూర్చడం వినిపించింది.
‘ఆ మధ్య వివేక్ అనే కుర్రాడ్ని రుషికొండ బీచ్‌కి పిలిపించాడు. బహుశా అతన్ని చంపేసి ఉండొచ్చు’
రాసమణి భయానికి కారణం అర్థమయింది రాజేష్‌కి.
‘వివేక్ ఏం చేశాడు?’
‘డబ్బున్న ఆడవాళ్ల కోరికలు తీర్చే మేల్ ప్రాసిట్యూట్ వివేక్. భూపతి చెప్పిన అమ్మాయి దగ్గరకు వెళ్లి రావాలి. కాని అతను ఆ అమ్మాయిలతో నేరుగా కాంటాక్ట్స్ పెట్టుకుని దొరికిపోయేడు’
నెలకి మూడు నాలుగుసార్లు పని ఉంటుంది. పని పడినప్పుడు ఫోన్ చేసి చిరునామా చెబుతాం. ఆ చిరునామాలోని అందగత్తెని అనుభవించి రావాలి. ఇదంతా గోప్యంగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గంగోత్రి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి రాజేష్‌కి.
‘ఇదంతా నీకెలా తెలుసు?’
‘ఒకనాడు హోటల్ రూమ్‌కి పంపి వివేక్ అనే యువకుడు ఓ గంట గడిపి వెళతాడని చెప్పాడు షరీఫ్. వివేక్ రూమ్‌కి వచ్చిన ఓ నిమిషానికి షరీఫ్ కాల్ చేసి, అర్జంటుగా హాస్పిటల్‌గా వెళ్లాలని, మరోసారి కలుద్దామని చెప్పమన్నాడు. సెల్ ఆఫ్ చెయ్యకుండా ఉంచమన్నాడు. షరీఫ్ చెప్పమన్నట్టుగానే వివేక్‌తో చెప్పాను. మళ్లీ తను రావాలంటే డబ్బు చెల్లించాలని, మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని తన సెల్ నెంబర్ ఇచ్చాడతను. మరునాడు ఫోన్ చేసి రుషికొండ బీచ్‌లోని జీడిమామిడి తోటలోకి రమ్మని నాతో వివేక్‌కి చెప్పించాడు’
బుర్ర తిరిగినట్టయింది రాజేష్‌కి.
‘వివేక్ చిరునామా తెలుసా?’ అడిగేడు.
‘తెలియదు’
‘అతని సెల్ నెంబర్ ఉందా?’
‘ఉంది.. రెండు నిమిషాల్లో చెబుతాను’

12
పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశాఖపట్నంలో ఇల్లు కొన్నాడు బలరామ్ సాహు. అంటే అదే నెల మక్కువ గ్రామంలోని రామచంద్ర రాజు ఇంట్లో దొంగతనం చేసి ఉండాలి. అప్పుడే సాలూరులోని ఓ అమ్మాయితో పరారయ్యాడు. ఆ అమ్మాయి రాజరాజేశ్వరి అయితే బాపడు చెప్పిన దాని ప్రకారం సాలూరులో చదువుతూ ఉండాలి. ముందుకు సాగడానికి ఇదొక్కటే ఆధారం.
సర్వీస్‌లో చాలా కేసులు చూశాడు కాని ఇన్ని చిక్కుముడులతో ఉన్న కేసు మొదటిసారి తగిలింది యుగంధర్‌కి. ఓ ముడి విప్పితే వెంటనే రెండు ముడులు పడుతున్నాయి. చివరికి ఏం తేలుతుందో అంచనాకి చిక్కడంలేదు. పాతికేళ్ల క్రితం జరిగిన విషయాలు తెలుసుకోవడమంటే గడ్డివాములో పడిన సూదిని వెదకడం లాంటిది.
ఇనె్వస్టిగేషన్‌లో నిరాశ నిషిద్ధం.
పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య సాలూరులో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అప్పటికి రాజరాజేశ్వరి వయసు ఇరవై ఉంటుంది అనుకుంటే కనీసం డిగ్రీ చదువుతూ ఉండాలి. అంటే డిగ్రీ కాలేజి గురించి వెతకాలి. డిగ్రీ కాలేజీలో పని చేసి రిటైర్ అయిన మనిషిని పట్టుకుంటే కొంత పనవుతుంది. అలాంటి వ్యక్తిని తను వెదికి పట్టుకోవడంకన్నా పోలీసుల సాయం తీసుకుంటే మంచిదనే నిర్ణయానికొచ్చాడు. మరుక్షణం సెల్ అందుకుని సాలూరు ఇన్‌స్పెక్టర్‌కి కాల్ చేశాడు.
‘నేను యుగంధర్ని మిత్రమా.. ఎలా ఉన్నావ్?’ అడిగేడు.
‘బాగున్నాను... ఏమిటీ సర్‌ప్రైజ్?’ ఆశ్చర్యపోయేడు ఆ ఇన్‌స్పెక్టర్.
‘ఓ కేసు దర్యాప్తు పని మీద సాలూరు వచ్చాను. సలోమీ లాడ్జిలో దిగాను. నాకో సాయం చేసి పెట్టాలి’ యుగంధర్ అన్నాడు.
‘ఏం చెయ్యాలో చెప్పు?’
‘డిగ్రీ కాలేజీలో పని చేసి పదేళ్ల క్రితం రిటైర్ అయిన వ్యక్తితో అవసరం ఏర్పడింది. అతన్ని లాడ్జికి పంపాలి. స్టేషన్‌కి పిలిచినా పర్లేదు కాని అక్కడయితే ఫ్రీగా ఉండదు’
‘సరే పంపుతాను. ఒకసారి స్టేషన్‌కి వస్తే ఓ కేసు విషయం చర్చించవచ్చు..’
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ముఖ్యంగా అధికారుల్లో ఈగో అధికం. తమ పనిలో ఎవరైనా వేలుపెడితే సహించరు. అంతేకాదు, అవతలి ఆఫీసర్ని తేలిగ్గా చూసే స్వభావం ఎక్కువ. కేసు నీరుకారిపోయినా ఇష్టపడతారు కాని ఇతర అధికారుల సాయం మాత్రం తీసుకోరు. వీటికి భిన్నంగా ఆ ఇన్‌స్పెక్టర్ మాటలు ఉండటంతో ఆశ్చర్యం కలిగింది యుగంధర్‌కి.
‘ఏ కేసు?’ ఉత్సాహంగా అడిగేడు.
‘రాబరీ, మర్డర్ ఫర్ గెయిన్’ అని, చెప్పడం మొదలుపెట్టాడు.
‘ఒకరోజు సాయంకాలం అన్నం తిన్నాక బయట పిల్లలతో ఆడుకుంటోంది నాలుగేళ్ల పాప. చీకటి పడ్డాక ఆ పాప ఇంటికి రాలేదు. రాత్రంతా వెదికారు కాని ఉపయోగం లేకపోయింది. మరునాడు ఉదయం దగ్గరలోని గెడ్డకి బట్టలు ఉతకడానికి వెళ్లిన ఆ పిల్ల మేనత్తకి తుప్పల్లో మెడ తెగిన స్థితిలో కనిపించిందా పాప. అందర్నీ పిలిచి కొనఊపిరితో ఉన్న పిల్లని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ స్వరపేటిక తెగకపోవడంతో బతికింది పాప.
పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఓ పాత నేరస్థుడు అక్కడ సంచరించినట్టు దర్యాప్తులో తేలింది. ఇంటరాగేషన్ తట్టుకోలేక నేరం అంగీకరించాడు. కాని మెడ కొయ్యడానికి ఉపయోగించిన కత్తి, పిల్ల చెవుల నుంచి తీసిన బంగారు కమ్మెలు చూపించలేక పోయాడు. అతని మీద అన్యాయంగా కేసు పెట్టడం ఇష్టం లేదు నాకు. అయితే ముందుకు సాగడానికి దారి కనిపించడంలేదు’
‘సీన్ ఆఫ్ అఫెన్స్ చూశారా?’ అడిగేడు యుగంధర్.
‘చూశాను. బట్టలు ఉతుక్కునే కాలువకి ఏభై గజాల దూరంలో తుప్పలున్నాయి’ చెప్పాడు.
‘ఇద్దరం కలిసి వెళ్లి చూద్దామా?’
‘ఇప్పుడే వస్తున్నాను’ అన్నాడతను.
పావుగంటకు లాడ్జి దగ్గరకు జీపులో వచ్చాడు ఇన్‌స్పెక్టర్. ఊరు చివర గెడ్డ ఒడ్డున ఆగాక ఇన్‌స్పెక్టర్‌తోపాటు జీపు దిగాడు యుగంధర్.
గెడ్డలో పెద్దగా నీరు లేదు. అక్కడ నుంచి ఏభై గజాల దూరంలోని తుప్పల దగ్గరకు వెళ్లారు. నేల మీద ఎండిన రక్తం మరకలున్నాయి. తిరిగి గెడ్డ ఒడ్డుకి వచ్చారు. అటుగా పశువులు తోలుకెళుతున్న వ్యక్తిని ఆపి యుగంధర్ అడిగేడు.
‘ఇక్కడ బట్టలు ఉతకడానికి ఆడవాళ్లు ఎప్పుడొస్తారు?’
‘బోరు దగ్గర ఉతుక్కుంటారండి. వర్షాకాలంలో తప్ప ఈ గెడ్డలో నీరుండదు’ చెప్పాడతను.
యుగంధర్ సూచన ప్రకారం గాయపడిన పిల్ల ఇంటికెళ్లారు. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన పిల్ల మెడ చుట్టూ కట్టుతో ఓ బల్ల మీద కూర్చుని ఉంది. ఆ పిల్లని తీసుకుని అదే వీధిలోని మేనత్త ఇల్లు చేరారు. ఇంటి బయట వేసిన నులక మంచం మీద కూర్చున్నారు. యుగంధర్ ఆ పిల్లని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గుండెల మీద చెయ్యి ఉంచాడు.
‘టీ తెత్తాను బాబూ!’ చెప్పి లోపలికి వెళ్లింది మేనత్త. అరగంట తర్వాత అక్కడ నుంచి కదలబోతూ ఓ ప్రశ్న అడిగేడు యుగంధర్.
‘మీ ఆయన ఎక్కడికెళ్లాడు?’
‘జొరం బాబూ! లోపల తొంగున్నాడు’
లాడ్జి దగ్గర దిగిపోయాక చెప్పాడు యుగంధర్.
‘మేనత్తని అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చెయ్యండి. అక్కడే పక్క గదిలో ఆమె భర్తని ప్రశ్నించండి. నిజం బయటకొస్తుంది’
తెల్లబోయి చూశాడు ఇన్‌స్పెక్టర్.
‘గాయపడిన పిల్లని మొదట చూసిన మనిషి మేనత్త. గెడ్డ ఒడ్డు నుంచి తుప్పల్లో పడున్న పిల్ల కనిపించదు. అలాగే ఆ పిల్ల మూలుగు గెడ్డ ఒడ్డుకి వినిపించదు. గెడ్డలో బట్టలు ఉతికే అలవాటు ఆ పేట వారికి లేనప్పుడు మేనత్త మాత్రమే ప్రత్యేకంగా వెళ్లింది. ఇంటి దగ్గర మేనత్తని చూసిన మరుక్షణం ఆ పిల్ల గుండె వేగంగా కొట్టుకుంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేనత్త మొగుడికి జ్వరం రావడానికి కారణం పిల్ల మీద హత్యా ప్రయత్నం కావచ్చు’ వివరించేడు యుగంధర్.
అదే సమయంలో కానిస్టేబుల్ ఒకతను బైక్ మీద ఓ ముసలతన్ని తీసుకొచ్చి చెప్పాడు.
‘ఈయన డిగ్రీ కాలేజీలో పనిచేసి తొమ్మిదేళ్ల క్రితం రిటైరయ్యారు సార్!’
యుగంధర్ని అతనికి పరిచయం చేసి అవసరమైన సమాచారం ఇమ్మని చెప్ప హడావిడిగా తన పని మీద వెళ్లిపోయేడు ఇన్‌స్పెక్టర్. రూమ్‌కి అతన్ని తీసుకెళ్లి కాఫీ తెప్పించాడు యుగంధర్. అతను కాఫీ తాగేక అడిగాడు.
‘డిగ్రీ కాలేజీలో టీచింగ్ స్ట్ఫాగా చేశారా?’
అతను తల అడ్డంగా ఊపాడు.
‘లేదు. ఆఫీస్ స్ట్ఫాగా చేశాను’
‘పందొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైల మధ్య సాలూరులో డిగ్రీ కాలేజీలు ఎన్నున్నాయి?’
‘ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒక్కటే ఉంది!’
‘తొంభైలో డిగ్రీ చదువుతున్న ఓ పిల్ల హఠాత్తుగా చదువు ఆపేసింది. మీకేమయినా గుర్తుందా?’
‘లేదు...’

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994