S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాన్న స్నేహితుడు

కథల పోటీలో
ఎంపికైన రచన
**
‘నాన్నా! నేనో తప్పు చేశాను. దాన్ని నువ్వు సరిదిద్దాలి. ఆ తప్పు చేయకుండా ఉండడానికీ, చేసిన తర్వాత సరిదిద్దుకోవడానికీ ఎంతో ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయింది. సంపాదన ఆగిపోయింది. ఆ తప్పును సరిదిద్దుకొనే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయాను. కాబట్టి, ఆ బాధ్యత నీ మీద పెట్టక తప్పడం లేదు’ భాస్కర్రావు అన్నాడు కొడుకుతో. కొడుక్కి తండ్రి పేరు పెట్టలేదు గాని, అతన్ని ‘నాన్నా’ అనే పిలుస్తాడు. తనకు తండ్రి మీద ఎంత ప్రేముందో కొడుకు మీదా అంతే ప్రేముంది. అయితే తండ్రి పేరు పెంటయ్య కావడంతో, అటువంటి పేరు కొడుక్కి పెడితే అతడు బాధపడతాడని ‘ప్రకాశ్’ అని నామకరణం చేశాడు.
‘చెప్పు నాన్నా! నువ్వు ఏ తప్పు చేసినా అది నా కోసమే చేసుంటావు! దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాదే!’ తండ్రిని బహువచనంతో పిలవడం గాని, ఆంగ్లంలో సంబోధించడం గాని ప్రకాశ్‌కి భాస్కర్రావు నేర్పలేదు.
‘నేను నా స్నేహితుడితో కొన్ని సంవత్సరాలుగా మాట్లాడ్డంలేదు. అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదు. నన్నిబ్బంది పెట్టకూడదనుకొన్నాడేమో ఫోన్ చేయడం మానేశాడు. నేనెందుకు ఆన్సర్ చేయలేకపోయానో, ఇనే్నళ్లూ అతనితో ఎందుకు మాట్లాడలేకపోయానో నీతో చెప్పాలి’
‘నాకు తెలుసు నాన్నా! అమ్మ చాలాసార్లు చెప్పింది. జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో, ఇనే్నళ్లూ ప్రాణ స్నేహితుడితో మాట్లాడకుండా ఉన్నందుకు ఎంత కుమిలిపోతున్నావో అమ్మ చెప్పింది నాన్నా!’
భార్య వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు భాస్కర్రావు. ఆమె పేరు చంద్రావతి. అతనికి తగిన భార్య ఆమె.
ఆమె తల పంకించింది ‘వాడికంతా తెలుసు’ అన్నట్లు.
* * *
భాస్కర్రావు, ధనుంజయరావు తండ్రులు ఒకేరోజు ఒకే పాఠశాలలో వాళ్లిద్దర్నీ చేర్పించారు. పక్కపక్క వీధుల్లో ఉండేవాళ్లు కావడంతో ఆ తండ్రులిద్దరూ ఒకర్నొకరు పలకరించుకొన్నారు. ఏడుస్తున్న పిల్లలిద్దర్నీ ఒక చోటకు చేర్చి ‘ఏడవకండ్రా! మనం పక్కపక్క వీధులవాళ్లం, ఇద్దరూ స్నేహంగా ఉండండి, కలిసి ఆడుకోండి’ అన్నారు. ‘చదువుకోండి!’ అనలేదు. పిల్లలకు ఏ మాటలు ఇష్టమో అవే చెప్పారు.
మంత్రం వేసినట్లు పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు. చేయిచేయి పట్టుకున్నారు. ఏదో ఆట మొదలుపెట్టారు. అలా మొదలైంది వాళ్ల స్నేహం. పోస్టుగ్రాడ్యుయేషన్ వరకూ కలిసే చదువుకొన్నారు. వాళ్ల ప్రాణ స్నేహం చూసేవాళ్లకు ముచ్చటేసేది. ధనుంజయరావుకు హైదరాబాద్‌లో ఏదో ఉద్యోగం వచ్చింది. బతుకుతెరువు కోసం బయలుదేరక తప్పలేదు.
‘వెళ్లరా! ఈ వందల మైళ్ల దూరం మన హృదయాల మధ్య ఏ మాత్రం దూరం ఏర్పరచదు. ఇంకా చెప్పాలంటే అవి మరింత దగ్గరవుతాయి. బెస్ట్ఫా లక్ మిత్రమా!’ అంటూ మిత్రుణ్ణి సాగనంపుతున్నప్పుడు భాస్కర్రావు కళ్లు వర్షించకుండా ఉండలేకపోయాయి.
‘మరింత దగ్గరవుతాయన్నావు! మరి ఏడుస్తావేంట్రా?!’ అంటూ ధనుంజయరావు అశ్రు నయనాలను ఎడమచేత్తో తుడుచుకున్నాడు. అతని కుడిచేయి స్నేహితుడి చేతుల్లో ఉంది.
‘నువ్వూ ఏడుస్తున్నావు కదరా!’ అన్నాడు భాస్కర్రావు.
ఒకర్నొకరు గాఢంగా కౌగిలించుకున్నారు.
‘వెళ్లొస్తాన్రా!’
‘ఆఁ... అక్కడ నీకు గొప్పగొప్ప స్నేహితులు ఏర్పడతారు. ఎంత గొప్ప స్నేహితులు ఏర్పడినా ఈ చిన్ననాటి స్నేహితుణ్ణి మరిచిపోకే!’
‘గొప్పవాళ్లు స్నేహితులవుతారేమో గాని, నువ్వు అందించే అంత గొప్ప స్నేహాన్ని ఎవరూ అందించలేరు’
‘ఎంత గొప్ప స్నేహమైనా స్నేహితులిద్దరూ మంచివాళ్లైతేనే అది ఏర్పడటం సాధ్యమవుతుంది. నాకింత మంచి స్నేహితుడు దొరకడం ఏ పూర్వజన్మ సుకృతమో!’
‘నువ్వు నా స్నేహితుడివవడం ఎన్నో జన్మల పుణ్యఫలం’
ఇద్దరూ నవ్వుకొన్నారు. బస్ బయలుదేరింది. నవ్వుల స్థానంలో విషాదం చేరుకొంది. హృదయాలు బరువెక్కాయి.
ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి ధనుంజయకు వివాహమైంది. మరో ఆరు మాసాలకు భాస్కర్రావుకు కూడా పెళ్లైంది. స్వంత ఊరు మరీ పల్లెటూరు కాకపోవడంతో ఆ ఊరిలోనే ఓ చిన్న ప్రైవేటు ఉద్యోగం సంపాదించాడు.
కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం మానేసి, వ్యాపారం మొదలుపెట్టాడు. రాణించింది. వృద్ధిలోకి వస్తున్న సమయంలో అతను తెలివితో ఎదుర్కోలేని కోణంలో దురదృష్టం దాడిచేసింది.
ఇంటి దగ్గర ఆడుకొంటున్న పదేళ్ల కొడుకు మెట్టు మీద నుంచి పడుతూ మోకాలు ఆనాడు. మోకాలు వాచింది. భాస్కర్రావు అశ్రద్ధ చేయలేదు. జిల్లా కేంద్రంలో ఉన్న పేరుబడ్డ ఎముకల వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. లోలోపల రక్తస్రావం జరగడం గమనించని ఆ వైద్యుడు ఏదో తనకు తెలిసిన వైద్యం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మోకాల్లో తీవ్రమైన బాధ మొదలై ఆ బాబు విలవిలలాడాడు. అంతకు మించిన బాధ భాస్కర్రావు, చంద్రావతి గుండెల్లో మొదలై మనోవేదనతో నిద్రాహారాలకు దూరమయ్యారు.
హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ధనుంజయరావు ఎంతో ప్రేమగా స్నేహితుడి కుటుంబాన్ని ఆహ్వానించి, ఆశ్రయమిచ్చి, విశ్రాంతి తీసుకోమని చెప్పి, అందరికీ ఫోన్లు చేసి హైదరాబాద్‌లో గొప్ప ఎముకల వైద్యులెవరో తెలుసుకొన్నాడు. వాళ్లందరిలో డాక్టర్ విశాల చాలా మంచి వైద్యాన్ని అందిస్తుందని తెలుసుకొన్నాడు. స్నేహితుడి కొడుకుని ఆమె ఆసుపత్రిలో చేర్చాడు. భాస్కర్రావు భార్యతో కలిసి కొడుకుని స్నేహితుడింటికి తీసుకెళ్లడం మాత్రమే చేశాడు. అక్కడ చేయవలసిన పనులన్నీ ధనుంజయరావే చేశాడు.
డాక్టర్ విశాల కూడా ఆ బాబుకి సరైన వైద్యం చేయలేకపోయింది. ఏదో వైద్యం చేసి, ఓ కర్ర సహాయంతో నడిచేటట్లు చేసింది. ఆమె వైద్యం ద్వారా ఆ కాలు మోకాలు దగ్గర ముప్పై డిగ్రీలకు మించి వంగడం లేదు. ఆమె వైద్యం కొనసాగిస్తోంది. పరిస్థితి మెరుగవ్వడంలేదు. భాస్కర్రావుకు అనుమానం వచ్చింది. ఆమె తన వైద్య పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన కొడుకుని బలి చేస్తోందేమో అనుకొన్నాడు.
అప్పటికే భాస్కర్రావు వ్యాపారానికి క్షీణ దశ మొదలైంది. వారంలో సగం రోజులు హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. కొడుక్కి పూర్తిగా నయమై భార్యాబిడ్డలతో సహా తాను సొంత ఊరికి తిరిగొచ్చేవరకూ వ్యాపారాన్ని పునరాభివృద్ధి చేయలేడు. కొడుకు జీవితం కన్నా వ్యాపారం ముఖ్యం కాదనుకొన్నాడు. భార్యాపిల్లలను స్నేహితుడింట్లోనే ఉంచి, తానొచ్చి వ్యాపారాన్ని చూసుకొని వెళుతూ,. కొడుక్కి సరైన వైద్యం ఎక్కడ లభిస్తుందని వాకబు చేస్తూ ఉండేవాడు. రాయవేలూరు తీసుకువెళితే, అక్కడ ఫిజియోథెరపీ చేసి, కాలును పూర్తిగా నయం చేస్తారని తెలుసుకొన్నాడు.
వ్యాపారం మీదున్న డబ్బంతా పోగు చేసి మూటగట్టుకొని భాస్కర్రావు భార్యాబిడ్డలతో రాయవేలూరు బయలుదేరాడు. క్షీణదశలో ఉన్న వ్యాపారం ఎన్నాళ్లు సాగితే అన్నాళ్లు చేయమని ఓ దూరపు బంధువుకు అప్పజెప్పాడు.
నెలలు గడుస్తుండగా పరిస్థితి మెరుగనిపించింది. వైద్యానికయ్యే ఖర్చుకన్నా బస చేయడానికి, భోజనాలు చేయడానికి ఎక్కువ ఖర్చు అయ్యేది. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వండుకొని తిందామంటే వీలుపడలేదు. అంతకాలం హోటల్‌లోనే ఉన్నారు. కాలు పూర్తిగా నయమవడానికి సంవత్సరంన్నర కాలం అక్కడే ఉండవలసి వచ్చింది. అప్పుడే డబ్బు అవసరమైన ధనుంజయరావు దగ్గర పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు.
ఇల్లు అమ్మి స్నేహితుడికి అప్పు తీర్చేయవచ్చన్న ధైర్యంతో ఆ అప్పు చేశాడు భాస్కర్రావు. చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఇల్లు అమ్మలేని పరిస్థితి ఏర్పడింది. స్నేహితుడు ఫోన్ చేస్తుంటే, డబ్బు కోసం ఫోన్ చేస్తున్నాడని భావించి, ఏదో విధంగా డబ్బు సమకూర్చుకొని, తీసుకెళ్లినప్పుడే అతనితో మాట్లాడాలని ఆన్సర్ చేసేవాడు కాదు. ఎలా అయిన అతని అప్పు తీర్చాలని విశ్వ ప్రయత్నం చేశాడు. వీలుపడలేదు. స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని, ఏదొక సమాధానం చెప్పకపోవడం తప్పని తెలిసి కూడా ఆ తప్పు కొనసాగించాడు. ధనుంజయరావు ఫోన్ చేయడం మానేశాడు. అతను అలా చేయడం వల్ల భాస్కర్రావు తన స్నేహితుడు తనని మోసగాడుగా నిర్ధారించేసుకొని ఫోన్ చేయడం లేదని కుమిలిపోయాడు.
‘అతని దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే కంగారుపడిపోయేవారు. డబ్బు తిరిగి ఇవ్వలేకపోతున్నందుకూ, సమాధానం చెప్పలేకపోతున్నందుకూ బాధపడిపోయేవారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేమో ఆయన ఫోన్ చేయడం మానేస్తే, ‘నన్ను మోసగాడిగా నిర్ధారించేసుకొన్నాడు’ అని ఇప్పుడు కూడా బాధపడిపోతారేంటి?’ అనేది చంద్రావతి.
‘ఈ బాధకన్నా ఆ బాధ వెయ్యి రెట్లు నయంగా ఉండేది. నేను మోసగాడినని నాకే అనిపిస్తోంది. అందుకే మరింత బాధగా ఉంది’
‘మీ చిన్నాన్న కొడుకులకు ఎంతో కొంత ఇస్తానని చెప్పి, సంతకాలు పెట్టమనండి. మనకు ఈ ఇల్లు కన్నా మీ ఇద్దరి స్నేహమే ముఖ్యం!’
‘సగం వాటా అడుగుతున్నారు. నా స్నేహితుడి అప్పు తీరకపోగా మనం ఇల్లు పోగొట్టుకొని వీధిన పడతాం! అన్ని సమస్యలూ ఏదొక రోజున పరిష్కారమవుతాయని ఎదురుచూస్తున్నాను’
భాస్కర్రావు మరలా ప్రైవేటు ఉద్యోగంలో చేరి కొడుకుని చదివించాడు. చాలా తెలివైన అతని కొడుకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించి, తండ్రికి పెద్దగా ఖర్చవకుండానే ఇంజనీరింగ్ చివరి సంవత్సరానికి వచ్చేశాడు. క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపికై, మంచి ఉద్యోగాన్ని సిద్ధం చేసుకొని ఉన్నాడు. మూడు నెలల్లో ఉద్యోగంలో చేరిపోయి, తండ్రికి సహాయంగా ఉందామనుకొనేసరికి తండ్రికి రెండు మూత్రపిండాలూ పాడైపోయి, బతికినంత కాలం డయాలసిస్ చేయించుకొని బతకవలసిన పరిస్థితి వచ్చింది.
* * *
‘నీకు తెలుసు అంటున్నావు కదా! ఏం చేద్దామనుకొంటున్నావు?’
‘నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, ధనుంజయంకుల్ అప్పు తీర్చడానికి ఏదొక ప్లాన్ చేస్తాను నాన్నా! నాకు కొంచెం టైమివ్వు. నువ్వేమీ టెన్షన్ పడకు. మిమ్మల్నిద్దర్నీ నేను కలుపుతాను’
‘వాడు నన్ను క్షమించడు గాని, వాడి డబ్బు వాడికి ముట్టజెప్పానన్న తృప్తి అయినా నాకు కలిగించు’
‘సరే నాన్నా!’
ప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. పని పట్ల అతనికున్న అంకిత భావం చూసి, యాజమాన్యం ఆరుమాసాలకే అతని జీతాన్ని రెట్టింపు చేసింది.
ప్రకాశ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి మారడంతో చిన్న తాత కొడుకులు అతనితో ఆత్మీయతను చూపిస్తూ మాట్లాడసాగారు. దాన్ని అతడు సద్వినియోగం చేసుకోదలిచాడు. ఓ పండుగ రోజున వాళ్లింటికెళ్లి, తన తల్లిదండ్రులను తాను ఉద్యోగం చేస్తున్న నగరానికి తీసుకుపోతున్నట్లు ఏవో మాటల సందర్భంలో తెలియజేశాడు. ప్రయత్నపూర్వకంగానే అటువంటి సందర్భాన్ని తీసుకొచ్చాడు. అప్రయత్నంగానే ఆ సందర్భం వచ్చినట్లు వాళ్లు భావించాడు.
‘అయితే, పండుగలకు కూడా ఈ ఊరు రాకపోదామనుకొంటున్నావన్న మాట’ చిన్నతాత పెద్ద కోడలు శ్యామలాదేవి.
‘పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కడదామంటే మీకు, మాకు మధ్య ఉన్న సమస్య వల్ల దాని మీద ఏ బ్యాంకు వారూ లోను ఇవ్వరు. అమ్మానాన్నలను ఆ కూలిపోతున్న ఇంట్లో ఉంచి నేనక్కడ ధైర్యంగా ఉద్యోగం చేసుకోలేక పోతున్నాను. అందుకే...’
‘మన మధ్య సమస్య ఏముందిరా?’ అన్నాడు శ్యామలాదేవి భర్త చంద్రశేఖరం మంచితనాన్ని నటిస్తూ.
‘మనకేం అభ్యంతరం లేదని సంతకాలు పెట్టేయండీ!’ ఆ ఇంటి చిన్న కోడలు శశిరేఖ అంది భర్తతో. ఆ గొప్పతనమంతా తోడుకోడలు, బావగారి ఖాతాలో పడిపోతుందేమోనని భయపడుతూ అలా అందామె.
శశిరేఖ భర్త రవి నారాయణ ఏదో అనబోతుండగా ప్రకాశ్ అడ్డుపడి, ‘ఆ సైట్ రేటు కట్టించి ఇరవై శాతం డబ్బు మీకిచ్చేస్తాను బాబాయ్!’ అన్నాడు.
‘ఇంకేం! ప్రకాశ్ బాగానే చెబుతున్నాడు, ఇంక మీరు అడ్డు చెప్పడం బాగోదు’ అంది శ్యామలాదేవి భర్తను, మరిదిని ఉద్దేశించి.
‘మీ నాన్న అనవసరంగా అమ్మేస్తున్నాడనీ, అలా చేస్తే నీకు ఆ స్థలం కూడా ఉండదనీ మేం అప్పుడు అడ్డు చెప్పాం గాని, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఎలా అంటే అలానే చేయి’ అన్నాడు చంద్రశేఖరం.
అతను చెప్పిన మొదటి వాక్యం అబద్ధమనీ, అది నిజమైతే ప్రకాశ్ ఇస్తానన్న ఇరవై శాతం వద్దనేవాడనీ అక్కడున్న వారందరికీ తెలుసు. వద్దననందుకు ప్రకాశ్‌కు తప్ప మిగిలిన ముగ్గురికీ లోలోపల చాలా ఆనందంగా ఉంది. ప్రకాశ్ మనసులో నవ్వుకొన్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ చూస్తున్నాడు. వాళ్ల మనసులూ, మనస్తత్వాలూ అతనికి తెలియనివి కాదు.
‘్థంక్స్ బాబాయ్!’
‘మనలో మనకు థాంక్సేంటిరా!’ రవి నారాయణ అన్నాడు తన ఉదాత్త గుణాన్ని తెలియజేయడానికి.
‘అలవాటైపోయింది బాబాయ్! చిన్నప్పటి నుంచీ ఎవరొకరి సహాయం తీసుకోవడం వల్ల, నోటి చివరే ఉంటుంది ఆ పదం’ వాళ్లెప్పుడూ సహాయం చేయలేదని గుర్తు చేయడానికి అన్నాడు.
‘ఎవరి దగ్గరో సాయం తీసుకొంటే చెప్పాలి గాని, మనలో మనం చెప్పుకోకూడదు’ శ్యామలాదేవి అంది.
‘ఉంటాను బాబాయ్, చినబాబాయ్, పెద్ద చిన్నమ్మా, చిన్న చిన్నమ్మా’ అంటూ అందరి దగ్గరా సెలవు తీసుకున్నాడు ప్రకాశ్.
వారం రోజుల్లో దసాతవేజులు పక్కాగా రాయించి, వాళ్లకిస్తానన్న ఇరవై శాతం ఖరీదు ఇచ్చేసి వాళ్ల సంతకాలు తీసుకొన్నాడు.
ఇల్లు మరమ్మతు చేయించాడు. రంగులు వేయించాడు.
బ్యాంక్‌లో ఇంటి కాగితాలూ, తన సాలరీ సర్ట్ఫికెట్‌నూ చూపించి లోన్‌కి అప్లై చేశాడు. ఈ పనులన్నీ చక్కబెట్టడానికి ప్రతీ వారాంతంలో ఉద్యోగం చేస్తున్న నగరం నుంచి సొంత ఊరికి ప్రయాణం చేస్తుండటం వల్ల బాగా అలసిపోయాడు. తన ధ్యేయం సాధించడం ద్వారా పొందబోయే ఆనందం ముందు ఆ అలసట చాలా చిన్నదిగా భావించాడు.
ఓ రోజు ఇరవై లక్షల రూపాయలు పట్టుకొని ధనుంజయరావు దగ్గరకు బయలుదేరాడు. అతను తనని గుర్తు పట్టడేమో అనుకొన్నాడు. కాని, అతని అంచనాని తలకిందులు చేస్తూ ధనుంజయరావు అతన్ని వెంటనే గుర్తుపట్టాడు.
‘ఎప్పుడో చిన్నప్పుడు నన్ను చూశారు. ఎలా గుర్తుపట్టారు?’ ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రకాశ్.
‘నా స్నేహితుడు నీలో కనిపిస్తున్నాడయ్యా!’
ప్రకాశ్ కళ్లు చెమర్చాయి. ‘దుర్మార్గుడు, మోసగాడు అంటారనుకొన్నాను. నాన్న కూడా అలానే అనుకొంటున్నాడు. కాని, మీరు... మీరు.. స్నేహితుడు అంటున్నారు’ గద్గద స్వరంతో ప్రకాశ్ అంటుంటే అతని కళ్లల్లోని తేమ అక్కడ నిలువలేకపోయింది. ప్రవహిస్తున్న ఆ తేమని రెండు చేతులతో తుడుచుకున్నాడు.
‘వాడు నన్ను దూరంగా పెట్టాడు గాని, నేను మాత్రం వాణ్ణి ఎప్పుడూ నా హృదయంలోనే పెట్టుకొన్నాను. అటువంటప్పుడు వాణ్ణి గాని, వాడి కుటుంబాన్ని గాని ఎలా మరిచిపోతాను’ అంటూ ప్రకాశ్‌ని ఓదార్చడానికి అతని భుజం మీద చేయి వేస్తూ తాను కంటతడి పెట్టుకోకుండా ఉండలేకపోయాడు ధనుంజయరావు.
‘నాన్న మిమ్మల్ని దూరం పెట్టలేదు బాబాయ్! అనుక్షణం మిమ్మల్ని తలుచుకొంటూనే ఉన్నాడు. ఈ కొడుకుని రక్షించుకోవడానికి తన జీవితాన్ని త్యాగం చేయడమే గాక, తన ప్రాణ స్నేహితుడికి కూడా దూరమై పోయాడు బాబాయ్ మా నాన్న! మీరు తనని మోసగాడు అనుకొంటున్నారేమోనని ఇనే్నళ్ల నుంచీ నరకయాతన అనుభవిస్తున్నాడు. మీ డబ్బు ఎలా అయినా తిరిగి ఇచ్చేయాలని ఎంతో ప్రయత్నించాడు. నా వల్ల వ్యాపారం పాడైపోయి, బతకడమే కష్టమై పోయినా, ఇల్లు అమ్మి ఇచ్చేద్దామని చూస్తే, దాయాదులు అడ్డుపడి అది అమ్ముడవకుండా చేశారు. మా నాన్న మిమ్మల్ని దూరం పెట్టలేదు బాబాయ్! మీ కోసమే బతుకుతున్నాడు. మీ అప్పు తీర్చేశానన్న వార్త వినడానికి బతుకుతున్నాడు బాబాయ్!’
‘ఇంత జరిగితే ఒక్క మాట చెప్పలేదు. నన్ను స్నేహితుడిగా గుర్తు పెట్టుకొంటే తన కష్టాన్ని నాతో పంచుకోవాలి కదా! ఇప్పుడు చెప్పు... వాడి దృష్టిలో నేను బతికి ఉన్నట్లా?.. చచ్చిపోయినట్లా? నన్ను పరాయివాణ్ణి చేసేసి, నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయకుండా, తనకంత ఇబ్బంది వస్తే ఒక్క మాట నాకు చెప్పకుండా ఊరుకొన్నాడు. నన్ను డబ్బు మనిషిని చేసేసి, నా అప్పు తీర్చడమే తన జీవితాశయంగా చేసుకొన్నాడంటే నన్ను స్నేహితుడిగా ఎలా గుర్తించినట్లు?’
‘క్షమించండి బాబాయ్! నాన్న తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. ఈ డబ్బు తీసుకొని నాన్నకు మనశ్శాంతిని కలిగించండి’ ప్రకాశ్ సోఫాలో తన ఎడమ పక్కన ఉంచుకొన్న డబ్బు సంచీలోంచి డబ్బు తీసి ధనుంజయ ముందు టీపాయ్ మీద పెట్టాడు.
‘ఇంత చెప్పినా నువ్వు మరలా డబ్బే ఇస్తున్నావు. నాకు డబ్బు వద్దు మీ నాన్న కావాలి, వాడి స్నేహం కావాలి. ఎంతిది? చాలా ఎక్కువ మొత్తంలా ఉంది?’
‘ఇరవై లక్షలు బాబాయ్!’
‘వడ్డీ కూడా పంపించాడా? మీ దృష్టిలో మీ నాన్న స్నేహితుణ్ణి కాదు, వడ్డీ వ్యాపారస్థుణ్ని. నడు.. మీ ఇంటికి వెళదాం! అడగవలసిన నాలుగు మాటలు వాణ్ణే అడుగుతాను’
‘నాన్న ఆరోగ్యం బాగోలేదు. రెండు కిడ్నీలూ పాడైపోయి, రెండు సంవత్సరాలుగా డయాలసిస్ చేయించుకొంటున్నారు’
ఆ మాట వినగానే ధనుంజయ కళ్ల నుంచి కన్నీరు ఏరులై ప్రవహించింది. ‘మీ నాన్నను నేను వెంటనే చూడాలి’ దుఃఖంతో పూడుకుపోయిన గొంతును పెగల్చుకుంటూ అన్నాడు.
‘సరే బాబాయ్! ఈ డబ్బు లోపల పెట్టండి’
‘మీ నాన్న దగ్గర తీసుకుంటాను. తీసుకొని నడు’
ఇద్దరూ సొంత ఊరికి బయల్దేరారు. దారి పొడుగునా ప్రకాశ్ ఆలోచిస్తూనే ఉన్నాడు. తన తండ్రికి అలా జరిగినందుకు దగ్గర బంధువులు కూడా ధనుంజయరావు చలించిన దాంట్లో పదోవంతు కూడా చలించలేదు. ఆస్తి పంపకాలప్పుడు సరిగ్గా రాయించుకోని కారణంగా తండ్రి దాయాదులు దుర్మార్గంగా ఇరవై శాతం వాటా తీసుకున్నారు. తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నా జాలిపడకుండా, తమది కాని డబ్బు తీసుకొని సంతకాలు పెట్టారు. ధనుంజయరావు తనకు చెందిన డబ్బునే మట్టుకోకుండా, స్నేహితుడి అనారోగ్యం గురించి విని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్నేహం ఇంత గొప్పదా?! తనకు ఇంత మంచి స్నేహితుడు లేడే? అని బాధపడ్డాడు.
మర్నాడు ఉదయానికి సొంత ఊరికి చేరుకొన్నారు. మొదట భాస్కర్రావు స్నేహితుడికి ముఖం చూపించలేక పోయాడు. తర్వాత స్నేహితులిద్దరూ కౌగిలించుకొని ఏడ్చారు.
ధనుంజయరావు తన మూత్రపిండాన్ని స్నేహితుడికిచ్చి, తనే ఖర్చు పెట్టి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయిస్తానన్నాడు. భాస్కర్రావు అంగీకరించలేదు.
ధనుంజయరావు వారం రోజులుండి, స్నేహితుడు కొడుకిచ్చిన ఇరవై లక్షలను స్నేహితుడి పేరు మీద బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, దానికి స్నేహితుడి కొడుకును, భార్యను నామినీలుగా రాయించాడు.
తండ్రి స్నేహితుణ్ణి బస్సెక్కిస్తూ ‘తండ్రి స్నేహితున్ని సేవించు’ అని బైబిల్‌లో ఉందని నా స్నేహితుడొకడు చెప్పాడు బాబాయ్! మిమ్మల్ని కలిసినప్పటి నుంచీ నాకదే గుర్తుకొస్తోంది’ అన్నాడు ప్రకాశ్.
ధనుంజయరావు స్నేహితుడి కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకొని బస్సెక్కాడు. కనీకనిపించకుండా ఇద్దరి కళ్లల్లోకి ఆర్ద్రత చేరింది. బస్సు బయలుదేరుతున్నప్పుడు ‘నాన్న జాగ్రత్త!’ అన్నాడు ధనుంజయరావు. ప్రకాశ్ చేయి ఊపుతున్నాడు. ఇందాకటి ఆర్ద్రత బిందు రూపం దాల్చింది. *

- టి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు
మురమళ్ల - 533 220, ఐ.పోలవరం మండలం
తూ.గో.జిల్లా. 9908893669, 9581545695

టి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు మురమళ్ల - 533 220, ఐ.పోలవరం మండలం తూ.గో.జిల్లా. 9908893669, 9581545695