S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లబ్ధప్రతిష్టుల వాణి... అలనాటి ఆకాశవాణి

రేడియో కోసమే పుట్టి రేడియోకే తమ జీవితాలను అర్పణ చేసిన వారిలో చరితార్థులైన వారెందరో ఉన్నారు. నిజానికి వారెప్పుడో చేసి ఉంచిన కళాఖండాలే ఈ వేళ రేడియో ప్రతిష్టను నిలబెట్టి ఉంచుతున్నాయనటంలో సందేహం లేదు. కొన్ని ప్రమాణాలను
నిర్దేశించి, చక్కని దిశను దశనూ ఏర్పరచి వెళ్లారు. ఆ
మహామహుల అనన్య కృషి వల్ల రేడియోకు ఒక స్థిరత్వం ఏర్పడింది.

- మల్లాది సూరిబాబు
9052765490
నాకు తెలిసినంతవరకూ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నింటికీ బాధ్యత వహించేవారు రెండు రకాలుగా ఉంటారు.
ఒకరు కార్యక్రమ నిర్వాహకులు/ సాంకేతిక సిబ్బంది.
రెండవ వారు కళాకారులు.
వివిధ కళా సాహిత్య రంగాలకు సంబంధించిన వ్యక్తుల్ని స్టూడియోకు పిలిచి వారితో చేసే ముచ్చట్లతో రూపొందించే పరిచయాలు చేసేవారు కొందరు.
కళలతో, కళాకారులతో కలిసి ఆలోచనలు పంచుకుంటూ, సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించటంలో అధికారుల కంటే కళాకారులే ప్రశంసలందుకుంటూ శ్రోతలకు దగ్గరవుతూంటారు. విజయవాడ రేడియోలో 35 ఏళ్లు నా జీవితం. 1960 నుంచి కొనే్నళ్లపాటు పరోక్షంగానూ, 1970 నుండి మూడున్నర దశాబ్దాలపాటు ప్రత్యక్షంగా రేడియో కార్యక్రమాల వైభవం నేనెరుగుదును. ఒక అనౌన్సర్ తన ఇంద్రజాల నైపుణ్యంతో ఎంతవరకూ అవసరమో అంతే విశేషాలతో వినిపిస్తూ శ్రోతలను కూర్చోబెట్టి వినేలా చేయటమే అసలైన విద్య.
మాటలతో మంత్రముగ్ధుల్ని చేయటం చిన్న విద్య కాదు. ఇందులో ఘటికులుగా పాతకాలంలో, ఉషశ్రీ, కూచిమంచి కుటుంబరావు, నండూరి విఠల్, ఎ.బి.ఆనంద్ గార్లను చెప్పుకునేవారు.
అనౌన్సర్ అనే మాట ప్రక్కనే ‘కంపేర్’ అనీ, యాంకర్ అనీ, మరో రెండు పదాలు కూడా రేడియోలో వాడుకలో ఉన్నాయి.
ఒకప్పుడు బయట ఊళ్లలో రేడియో కార్యక్రమాలు నిర్వహించేవారు. వాటిని ‘ఔట్‌డోర్ బ్రాడ్‌కాస్ట్’ (ఓబి) కార్యక్రమాలనేవారు. క్రమంగా ఇపుడు కనుమరుగయ్యాయి. ఆర్థిక మాంద్యమే కారణం. కానీ ఎన్ని విప్లవాత్మక మార్పులొచ్చినా ఆకాశవాణి అంటే ఇప్పటికీ అభిమానించే శ్రోతలున్నారు. అందుకు ప్రధాన కారణం - జీవితాలను మైకులకు అంకితం చేసిన గళాలే. కొందరు రేడియోలో మాట్లాడితే కదలాలనిపించదు. వారి గొంతులో ఏదో జీవం కూర్చోబెట్టేస్తుంది. గలగల పారే సెలయేరులా, మేఘ గంభీరమైన స్వరంతో మాటను మంత్రం చేస్తూ శ్రోతలను ముగ్ధులను చేసిన వారిలో ‘ఉషశ్రీ’ ఒకరు. అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయనతో, నా సాన్నిహిత్యం రెండు దశాబ్దాలకు పైనే. విజయవాడలో బాలాంత్రపు రజనీకాంతరావు డైరెక్టర్‌గా వున్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన ఉషశ్రీ.. పండిత పామరులకు పరిచితమైన అద్భుతమైన కంఠం. అక్షరానికీ, శబ్దానికి, అర్థం చెప్పిన ఉషశ్రీ, రామాయణ భారతాలు రేడియోను ఉత్తుంగ శిఖరంపై నిలబెట్టాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పురాణ శ్రవణానికి శ్రోతలు వశులై అన్ని పనులూ మానుకుని రేడియో చుట్టూ చేరిపోయేవారు. ఆ సమయంలో రేడియో ఇంటింటా మారుమోగిపోయేది. మొదట వ్యవసాయదారుల కార్యక్రమంలో వుంటూ అంచెలంచెలుగా ఎదిగి, మాట మీద పట్టు సాధించిన ఉషశ్రీకి సాహిత్యాభిమానులైన శ్రోతలతోబాటు, సామాన్య శ్రోతలు కూడా ఉండేవారు. అత్యంతాసక్తితో ఆయన్ని చూడాలని విజయవాడ రేడియో కేంద్రానికి వస్తూండేవారు. ‘ఉషశ్రీ ధర్మసందేహాలు’ కార్యక్రమంలో నేను పద్యాలు పాడేవాణ్ణి. నా పక్కనే ఎ.బి.ఆనంద్, సి.రామ్మోహనరావులు ప్రశ్నలు సంధిస్తూండేవారు. శ్రోతల ధర్మసందేహాలకు ఉషశ్రీ సమాధానాలు చాలా ఆసక్తిని కలిగిస్తూండేవి. ఎంతో లౌక్యంగా చెప్పే ఆయన తీరు ముచ్చటగా ఉండేది. గిలిగింతలు పెట్టేది కూడా. రేడియోకు అఖండ గౌరవాన్ని తెచ్చిన ఉషశ్రీ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడ్తారు.
అసలు రేడియోకు సంగీతం, నాటకం, సాహిత్యం.. ఈ మూడూ మూడు ప్రాణాలు. వైఖరి బాగోలేకపోతే ప్రసారాలు సవ్యంగా శ్రోతలకు చేరవు. మాటాడే మనిషిని వినిపించుకోక పక్కన పెట్టేస్తారు.
అదే పత్రికైతే మడతపెట్టి అటక ఎక్కించేస్తారు. మనకు నచ్చకపోయినా, ఆసక్తిగా వింటాం, చదువుతాం. ఎందుకు? చెప్పేవాడిపైనా, రాసేవాడిపైనా ఉంటుందంతా.
ఏం చెప్పాలో తెలియటం.. తెలిసిన దాన్ని కాగితం మీద పెట్టడం.. ఒక పద్ధతి. అలా వ్రాసుకొచ్చిన దాన్ని మొక్కుబడిగా చదివేస్తూ పోతే ఏ ఒక్కరికీ నచ్చదు. అదో గోలగా ఉంటుంది. మన ఎదురుగా కూర్చుని మనతోనే మాట్లాడినట్లుగా చెప్పడంలోనే ఉంది మజా.
సాధారణంగా, లాయర్లు, డాక్టర్లు, కొందరు స్టూడియోలో కూర్చుని మైకు చూడగానే బిగుసుకుపోతారు. యాంత్రికంగా మాట్లాడతారు. ఆత్మీయత ఉండదు. లాయర్లు నయం. డాక్టర్లను గమనించే వుంటారు. రోగులతో ఎప్పుడైనా కాస్త ఆప్యాయంగా మాట్లాడుతూ, పలకరించే వారుంటారా? అసలు ఆ అలవాటుంటేగా? స్టూడియోలో స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలరు? అందుకే ప్రశ్నలు వేస్తూ మాట్లాడిస్తారు. రేడియో ప్రసారాలపై విసుగు కలగటానికి ఇదో కారణం.
నేను రేడియోలో చేరిన కొత్తలో పింగళి లక్ష్మీకాంతంగారి ‘సూక్తిసుధ’ తరచు ప్రసారమయ్యేది. ‘ఏమి వాగ్వైభవం?’ ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటాను. నాలుగున్నర నిమిషాలలో చెప్పదలచిన ఆత్మీయమైన మాటలను, అనునయిస్తూ చెప్పిన తీరు నన్ను ముగ్ధుణ్ణి చేసేది. అదో వరం. సాధనతో రాదు.
ఓసారి ఉషశ్రీ, నేనున్న స్టూడియోలోకి వచ్చి, రేడియోలో ఎలా మాట్లాడాలో చూడు. రమ్మని ఒక టేపు వినిపించారు. విస్తుబోతూ వింటున్నాను. 15 నిమిషాల వ్యవధిలో ‘జానకితో జనాంతికం’ అని ‘దువ్వూరి వెంకట రమణశాస్ర్తీగారి’ చిరుప్రసంగం అది.
భద్రాచలంలో వున్న సీతారామస్వామి గుడికి ఒక్కసారి రమ్మని సీతమ్మ తల్లి తనను పిలిచినట్లు, ‘ఎలా వున్నారు శాస్ర్తీగారూ!’ అని పలుకరించినట్లుగా, దానికి సమాధానంగా శాస్ర్తీగారు మాట్లాడిన తీరు, ఉషశ్రీని సైతం ఆశ్చర్యపరిచిందంటే ఆలోచించండి. అదీ వాక్వైఖరి యొక్క గొప్పతనం. సీతమ్మ తల్లి పాదాల చెంత కూర్చున్న భక్తుడు ఎంత చనువుగా ఉంటాడో ఆయన మాటలు చెప్పాయి.
అందుకే పాత్రలన్నీ మన కళ్లెదుటనే తిరుగుతున్నట్లుగా చూపించగలిగేది రేడియో నాటకం. డైలాగులను అప్పజెప్పేస్తూ పోతే ప్రయోజనం సున్నా. అందుకే రేడియోకి ప్రొడ్యూసర్లుండేవారు. తెలుగు నాటక రంగస్థలంపై తనదైన ముద్ర వేసిన నటుడు సి.రామమోహనరావు - పేరు మీకు గుర్తుండే ఉంటుంది. రేడియో నాటకానికి గుర్తింపు తెచ్చిన ప్రముఖులలో సి.రామ్మోహనరావు స్థానం అద్వితీయం.
విజయవాడ రేడియో కేంద్రానికి రామ్మోహనరావు ఓ మూల స్తంభం అంటే ఆశ్చర్యం లేదు. బందా కనకలింగేశ్వర్రావు శిష్యుడై తొలినాళ్లలో డ్రామా వాయిస్‌గా నాటక నిర్వహణలో పాలుపంచుకుంటూ రేడియో నాటకానికే తన శక్తినంతా వినియోగించి అంకితభావం కలిగిన నటుడు, నాటక ప్రయోక్త ఆయన. రాజరాజు, శ్రీకృష్ణ భీష్మ, వరవిక్రయం, గణపతి, మూడంతస్తుల మేడ, ఆఖరి ప్రేమలేఖ, కల్యాణి, సుశీల వంటి నాటకాలెన్నో ఆయన కీర్తిని ఇనుమడింపజేశాయి. విక్రాంత గిరి శిఖరం, అమరారామం, కొండ నుంచి కడలి దాకా లాంటి జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొందిన రూపకాలకు సృష్టికర్త. ‘వరుడు కావాలి’ ‘బ్రహ్మా! నీ రాత తారుమారు’ లాంటి హాస్య నాటకాలు ప్రేక్షకులను ఆనందింపజేశాయి. అసలు రేడియో నాటకానికో ప్రత్యేకతనూ, విలక్షణతనూ తెచ్చిన వ్యక్తి రామ్మోహనరావు.
నాటకం కోసం మూడున్నర దశాబ్దాలు అహరహం తపించిన వ్యక్తి. రేడియో నాటకానికి, ఒక దిశ, దశ నిర్దేశిస్తూ, నాటకానికే గౌరవం తెచ్చిన వ్యక్తి. సుత్తి వీరభద్రరావు ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా, రామ్మోహన్‌తోనే ఉండేవాడు. వీరభద్రరావు నటించిన ఎన్నో నాటకాల వెనుక రామ్మోహన్ పాత్ర ఉంది. సినీ నటులు మురళీమోహన్, అన్నపూర్ణ, జంధ్యాల, కోట శంకర్రావు, పొన్నాల రామసుబ్బారెడ్డి వీరి శిష్యులే.
రేడియోలో రామ్మోహనరావుతో నేను, ఎన్నో చిరు నాటికలలో నటించాను. మేమిద్దరం చేసిన ‘బావగారి కబుర్లు’ శ్రోతలు ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవారు.
సాధారణంగా ప్రముఖులైన నటీనటులో, రాజకీయ ప్రముఖులో స్టూడియోకు వస్తే అధికార గణం ఆఘమేఘాల మీద ఇంటర్వ్యూ చేయాలని తెగ ఉబలాటపడేవారు. అవతలి వారి సమర్థత, తెలియక, అమాయకంగా ప్రశ్నలేస్తూ, విసిగించిన సందర్భాలు అనేకం. గంటసేపు పైగా, హాయిగా మాట్లాడగలిగే వారికి, ప్రశ్నావళి విసుగు తెప్పించి, సదరు ప్రముఖులు 5 నిమిషాల్లో చల్లగా జారుకునే ప్రయత్నం చేయటం నాకు తెలుసు.
మీడియా, టీవీ ఛానెళ్లు ఇంత ప్రచారం లేని ఆ రోజుల్లో, కేవలం శబ్ద మాధ్యమం ద్వారా సినిమా నటులకున్న క్రేజ్‌ను సొంతం చేసుకున్న నండూరి సుబ్బారావు రామ్మోహనరావుకు సహచరుడు. విజయవాడ ఆకాశవాణికి ఆయనో లైట్‌హౌస్. నండూరి సుబ్బారావు లేనిదే ఆకాశవాణి లేదనుకునేవారు. 50, 60 ఏళ్ల పైబడ్డ ప్రతి శ్రోత గుండెల్లో ఆయన జ్ఞాపకాలు నేటికీ పదిలంగానే ఉన్నాయి.
రేడియో హాస్యబ్రహ్మగా, చిలకమర్తి వారి ‘గణపతి’ నాటకంలో ప్రధాన పాత్రధారిగా శ్రోతలకు చిరపరిచితుడు. ఆ పాత్ర కోసమే పుట్టాడనిపించాడు. ఆ రోజుల్లో సి.రామ్మోహనరావు నండూరి సుబ్బారావు జంట నిజంగా రేడియో శ్రోతల పంట.
నండూరి నటించిన ‘గణపతి’ చిలకమర్తి వారి నాటకాన్ని బందా నిర్వహించారు. ఆ నాటకం విజయవాడ కేంద్రం నుండి ఎన్నిసార్లు ప్రసారమైనా అన్నిసార్లూ అప్పుడే విన్న అనుభూతి కలిగిస్తుంది. సహజంగా వాక్చాతుర్యం ఉండేది. ‘సక్కుబాయి’లో శ్రీరంగం గోపాలరత్నానికి భర్తగా నటించిన సుబ్బారావు నటనకు జోహార్లు అర్పించారు శ్రోతలు.
మూడంతస్తుల మేడ, చివరకు మిగిలేది, రాధాకృష్ణ, సౌందర నందం, తలుపులు, కల్యాణి, పూటకూళ్లు, ఇంటి నెంబరు, తస్మాత్ జాగ్రత్త లాంటి నాటకాలు విన్నప్పుడల్లా పొట్టచెక్కలయ్యేలా శ్రోతలు నవ్వుకునేవారు. వెలికితనం ఎక్కడా కనిపించేది కాదు. రామయ్య కాపురం, సీతారాముడి సన్యాసం, ఎలుకల బోను, చీరల బేరం, అది అంతే, అపరాజిత, నాటికి నేడు, ప్రేమ యాత్ర నాటికలు సుబ్బారావును కీర్తి శిఖరాలపై కూర్చోబెట్టాయి. ఎన్నో హాస్య పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన సుబ్బారావు సరస సంభాషణ చతురులు. ఆయన నాటక నిర్వహణలో ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తూ, ముందుకు నడిపించిన నిగర్వి. ఆయనతో కలిసి కొనే్నళ్లు బావగారి కబుర్లు చేశాను. అదో తీయని జ్ఞాపకం నాకు.
తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్కో మాటతో, లేని సంబంధాన్ని పెంచుకోవచ్చు. మనసుకు స్వాంతన కలిగించేది మాట. ‘మాట చేత దేవతలు మన్నన చేసి వరము లిత్తురు’ అన్నట్లు, మధురంగా ఉండే మాటకు ఎవరు వశులవ్వరు?
‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న సత్య మప్రియం బ్రూయాత్’ చెప్పే పద్ధతిలో చెబితే మనకు తెలియకుండానే చెవి అటువైపు వెళుతుంది. రేడియో ఆవిర్భావమే అందుకు!
సంగీత, నాటక, సాహిత్య, త్రివేణీ సంగమంలా ఆకాశవాణి శ్రోతల అభిమానాన్ని పొందినవారు ఒకరా, ఇద్దరా?
రేడియో కోసమే పుట్టి రేడియోకే తమ జీవితాలను అర్పణ చేసిన వారిలో చరితార్థులైన వారెందరో ఉన్నారు. నిజానికి వారెప్పుడో చేసి ఉంచిన కళాఖండాలే ఈ వేళ రేడియో ప్రతిష్టను నిలబెట్టి ఉంచుతున్నాయనటంలో సందేహం లేదు. నేను రేడియోలో చేరకముందే కొందరు రేడియోకి కొన్ని ప్రమాణాలను నిర్దేశించి, చక్కని దిశను దశనూ ఏర్పరచి వెళ్లారు. ఆ మహామహుల అనన్య కృషి వల్ల రేడియోకు ఒక స్థిరత్వం ఏర్పడింది.
ఇప్పుడు మొత్తం సమాజం ఒక మార్పుల కూడలిలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని ఉంది. ఎనె్నన్నో టి.వి. ఛానెళ్లు బయలుదేరాయి. కాదు వెర్రివెర్రిగా
పెరిగిపోయాయి. ఎనె్నన్నో సాంకేతిక సదుపాయాలు అనూహ్యంగా ఏర్పడిపోయాయి. వ్యవస్థ మీద నియంత్రణ లేదు. ఎవరి చిత్తం వచ్చినట్లు వారు ఏవేవో కార్యక్రమాలను ప్రజల నెత్తి మీద రుద్ది, పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ డబ్బు గడిస్తున్నారు. అన్నిటినీ చోద్యంగా నివ్వెరబోతూ బిక్కుబిక్కుమంటూ చూస్తోంది రేడియో. మన భాషకు తెలుగు వ్యవహారిక వ్యాప్తికి ఆకాశవాణి చేసిన సేవ అనన్యం. దానికి కారణం అనౌన్సర్లు, వార్తలు చదివే న్యూస్‌రీడర్లు మాత్రమే కాదు. రూపకల్పన చేసిన, తెర వెనుకనున్న మేధావులు. వాళ్లని మర్చిపోతే ఎలా?
ఈవేళ రేడియో షాపుల కంటే టీవీ షోరూములు పెరిగిపోయి, క్యాసెట్లు, సీడీల స్థానంలో పెన్‌డ్రైవ్‌లు విస్తారంగా వచ్చాయి. వినిపించేవన్నీ బాహాటంగా కనిపిస్తోంటే ఇంక రేడియో అవసరమేముంది? కానీ ఒకటి నిజం. రేడియో తప్ప మరే ఇతర కాలక్షేప సాధనాలేమీ లేని రోజుల్లో, నిజాయితీగా, కొందరు ఈ మాధ్యమం యొక్క అభివృద్ధికి కారణభూతులై, అంకితభావంతో రేడియో సేవలో తరిస్తూ, రేడియో రుణం తీర్చుకున్నారు.
లబ్ధప్రతిష్టులైన వారెప్పుడూ చిరస్మరణీయులే. ఆకాశవాణి కీర్తిని ఉత్తుంగ శిఖరాలపై నిలబెట్టినది వారే. ఆ కళాకారులు చేసిన కార్యక్రమాలే ఇంకా సజీవంగా ఉండి రేడియోని బ్రతికిస్తున్నాయనేది అక్షర సత్యం. అదంతా ఓ గతం. మీకు తెలుసా? ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అన్న ఆయన కలం ప్రపంచానికి ప్రసిద్ధం. కుక్కపిల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల దగ్గర నుంచి జగన్నాథ రథ చక్రాలవరకూ ఏది వర్ణించినా జనం ఊగిపోయారు. సినీ పాటల రచయితగా, సంభాషణల రచయితగా, డబ్బింగ్ చిత్రాల అద్భుత అనువాదకుడుగా కూడా ఆయన ప్రేక్షకులకు పరిచయమే. ఆయనే శ్రీశ్రీగా తెలిసిన శ్రీరంగం శ్రీనివాసరావు. ఒకప్పుడు ఆయన ఆకాశవాణిలో వార్తలు చదివే వారన్న సంగతి కొందరికే తెలుసు.
తెలుగు చలనచిత్ర రంగంలో విలక్షణ స్థానాన్ని సంపాదించుకున్న ‘కళావాచస్పతి’ కొంగర జగ్గయ్య కూడా ఒకప్పుడు ఖంగుమనే కంఠంతో వార్తలు చదివిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.
స్పష్టమైన భావస్ఫోరకమైన వారి వాచికాభినయం, అభినయ కౌశలం, వారి మూర్తిమత్వం తెలుగు వారికి పరిచితమైనదే. పార్లమెంటేరియన్‌గా ఎదిగిన జగ్గయ్య ఆకాశవాణి కళాకారుడని చెప్పడం మాకెంతో గర్వకారణం.
విమర్శలకు తావివ్వకుండా, ఔచిత్యాన్ని పాటిస్తూ, జనాన్ని జాగృతం చేయటంలో ప్రముఖ పాత్ర వహించిన ‘ఆకాశవాణి’ స్వర్ణయుగపు రోజులు వెళ్లిపోయాయి. ప్రసార భారతిగా మారింది. ఏదేదో చేసెయ్యాలనే ఆలోచనలైతే లేకపోలేదు కానీ ఎలా? ఆచరణ సాధ్యం కాని వాటివల్ల ఏం ప్రయోజనం? ఈ సంస్థలన్నీ మళ్లీ పుంజుకోవాలంటే ఎవరో మేధావులే రావాలి. గత్యంతరం లేదు.
*

చిత్రాలు.. ఉషశ్రీ * సి. రామమోహన్‌రావు * నండూరి సుబ్బారావు * శ్రీశ్రీ * జగ్గయ్య