S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుండె జబ్బులు.. ఆహార జాగ్రత్తలు (మీకు మీరే డాక్టర్)

ప్రశ్న: ఈ మధ్యనే స్టెంటు వేశారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరంగా చెప్తారా?
సెల్వరాజు (నెల్లూరు)
జ: ఒకప్పటితో పోలిస్తే గుండె జబ్బుల్లో మరణాల సంఖ్య బాగా తగ్గింది. అయినా మెడ మీద వేలాడే కత్తిలా గుండె జబ్బుల విషయంలో ఒక కంట కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహారం, ఆలోచన, జీవన విధానం మూడింటిలోనూ మార్పు ఇతరులు గుర్తించే విధంగా వచ్చినప్పుడే గుండె జబ్బుల్లో ఆయుః ప్రమాణాలు పెంచుకోగలుగుతాం. భోజనాల గంట మోగంగానే నోట్లో నీళ్లూరుతాయి. అన్నం తినాలనే కోరిక కలుగుతుంది. ఆకలి బాగానే ఉన్నదనుకుంటాం. ఈ ఆకలొక్కటే బలమైన జీర్ణశక్తికి, జఠరాగ్నికీ కొలబద్ద కాదు. తీసుకున్న ఆహారాన్ని శక్తిగానూ, సమస్త ధాతువులుగానూ మారేవరకూ జఠరాగ్ని బలంగా పనిచేస్తేనే రక్తంలో షుగరు, కొవ్వు వగైరా పేరకుండా ఉంటాయి. ఆకలిని ప్రమాణంగా తీసుకుని ఆకలికొద్దీ తినటం వలన రక్తంలో కొవ్వు, షుగరు పెరిగిపోతున్నాయి. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా తేలికగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎంత తిన్నారన్నది కాకుండా, ఏం తిన్నారన్న విషయం మీద దృష్టి పెడితే రక్తంలో కొవ్వు, షుగరు పెరక్కుండా ఉంటాయి.
రక్తంలో పేరిన కొవ్వు రక్తప్రసారానికి లాకులు వేసి, గుండె జబ్బులకు తలుపులు తెరుస్తుంది. కాబట్టి, కొవ్వును తగ్గించే ఉపాయాలను తెలుసుకొని శ్రద్ధగా పాటించటం అవసరం. కొవ్వు లేనివీ, కొవ్వెక్కించేవి మానేయాలి. రెండు కప్పుల అన్నం తినండి లాంటి తూనికలు - కొలతల పద్ధతిలో భోజనం చేస్తే, తక్కువ తింటామనేది అపోహ మాత్రమే! తినకూడనిది రవ్వంత తిన్నా అపకారమే! అందుకనే, ఎంత తిన్నామన్న దానికన్నా ఏం తిన్నామన్న దాని మీద దృష్టి పెట్టాలి.
ప్యాంట్లు బిగుతవుతున్నాయని, జాకెట్లు టైటవుతున్నాయని గమనించాక, ఇంక ఆలస్యం చేయకూడదు. వెంటనే తగ్గే ప్రయత్నాలు ప్రారంభిస్తే, కనీసం అంతకన్నా బరువు పెరగకుండా ఉంటారు. ఆకలయినప్పుడు పది రూపాయలు పెట్టి ఆలు చిప్స్ కొనుక్కొనే కన్నా, ఒక యాపిల్ కొనుక్కొని తినటమే అనేక విధాల మేలు చేస్తుంది. దాహమైనప్పుడు రంగులూ పురుగు మందులూ కలిసిన కూల్‌డ్రింకులు తాగేకన్నా, అదే డబ్బులకు ఒక పెరుగు కప్పు లేదా మజ్జిగ ప్యాకెట్టు కొని తాగటం ఆరోగ్యదాయకం. కాఫీ, టీలు ఆకలిని చంపుతాయే గానీ తీర్చవు. ఆకలిని చంపటం అంటే జఠరాగ్నిని చల్లార్చటం. జీర్ణకోశానికి తూట్లు పొడవటం. పేగుల్లో పలుగులు దించటం.. అని అర్థం చేసుకోవాలి.
అన్నంలో బియ్యం పాళ్లు తగ్గించి రాగి, జొన్న, సజ్జల క్కూడా ప్రాతినిధ్యం కల్పిస్తే తేలికపాటి ఆరోగ్యదాయక ఆహారం తీసుకున్నట్టౌతుంది. మనం శనగపిండికీ, మైదా పిండికీ, మినప్పిండికీ ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ అన్నానికి బదులుగా టిఫిన్లు తింటున్నాం. ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్లాంటి టిఫిన్లు ఆకలిని చంపేవే గానీ తీర్చేవి కాదు. అన్నానికి ప్రత్యామ్నాయం అన్నమే! ఉదయాన బ్రేక్‌ఫాస్ట్ పేరుతో టిఫిన్లు తినటం అశాస్ర్తియమైన ఆహారమే! సమస్త రోగాలకూ గ్రామ్యాహారం అంటే నాగరిక భోజనం కారణం అవుతుందని చరకుడు చెప్పాడు. టిఫిన్లన్నీ ఈ అనారోగ్యకర నాగరిక భోజన ద్రవ్యాలే! మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయం పూట టిఫిన్ల సంస్కృతి మనకు లేదు. ఇది గత యాభై యేళ్ల కాలంలో వచ్చి చేరిన వింత అలవాటు. గుండె జబ్బు హెచ్చరిక రాగానే అన్నింటికన్నా ముందు మానాల్సినవి ఈ టిఫిన్లనే! బదులుగా కూరగాయలు ఎక్కువగా, అన్నం తక్కువగా కలిపిన పెరుగు లేదా చల్లన్నం తినటమే ఉత్తమం. చద్దన్నం అంటే చలిది అన్నం. అంటే చల్ల లేదా పెరుగు కలిపిన అన్నం అని అర్థం.
బీర, సొర, పొట్ల, కేరెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిపాయలు ఇలాంటి వాటిని సన్న ముక్కలుగా తరిగి ఉడికించకుండా పెరుగు కలిపి, కొద్దిగా అన్నం కలిపి కమ్మగా తాలింపు పెట్టిన కర్డ్‌రైస్ ఇడ్లీకన్నా మెరుగైన ‘హృదయమిత్ర’ ఆహారం. బూడిద గుమ్మడికాయని దిష్టి కోసరం అని గుమ్మాలకు వేలాడకట్టడం కన్నా తురిమి, ఇలా పెరుగు పచ్చడి చేసుకొని ఉదయానే్న తింటే గుండె పదిలంగా ఉంటుంది. సొరకాయతో ఎన్ని రకాల వంటకాలు చేసుకుంటామో అన్నీ లేత బూడిద గుమ్మడితో కూడా చేసుకోవచ్చు. రెండింటి రుచి కూడా ఒకేలా ఉంటుంది. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలను విడివిడిగా పిండి పట్టించుకొని, గోధుమ + రాగి కానీ, గోధుమ + జొన్న కానీ, గోధుమ + సజ్జ కానీ కలిపి, రెండు లేక మూడు పుల్కాలు చేసుకొని తిని, మిగతా ఆకలికి అన్నం తింటే, సగం బియ్యాన్ని తగ్గించ గలిగినట్టే అవుతుంది. కందిపప్పు, పెసరపప్పులతో కట్టు కాచుకొంటే, అది పేగులను బలసంపన్నం చేస్తుంది. అజీర్తిని కలిగించదు. బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పొన్నగంటి కూర, కొయ్యతోటకూర, గలిజేరు ఆకు, లేత ముల్లంగి దుంపలు, చాలా పరిమితంగా అల్లం, వెల్లుల్లి.. ఇవి తినదగినవి.
గుండె జబ్బు వచ్చిందని తెలియంగానే మొదట చేయవలసింది, వంట గదిలోంచి చింతపండును బహిష్కరించగలగాలి. బదులుగా నిమ్మరసం, మామిడి తురుము, నిమ్మ ఉప్పు లాంటి పులుపు ద్రవ్యాలను కలుసుకోవచ్చా అని అడక్కండి. పులుపును ఆపగలిగితేనే గుండె జబ్బులకు తగిన ఆహారాన్ని తీసుకుంటున్నట్టు లెక్క! పులుపు మూలానే, అతిగా ఉప్పూ కారాలు కలుస్తున్నాయి. పులుపు స్వయంగా గుండెను దెబ్బ తీస్తూండగా, అపకారం చేసే ఉప్పూ కారాలను కూడా కడుపులోకి వెంట తీసుకువెడ్తుంది. పులుపు లేకుండా వండిన కూరల్లో ఉప్పు కారాలు చిటికెడంత వేస్తే సరిపోతాయి. ఈ సౌలభ్యాన్ని గుర్తించాలి.
శరీరానికి మాత్రమే కాదు, మెదడుకు కూడా తగినంత వ్యాయామం ఉంటేనే గుండె జబ్బుల్లోంచి త్వరగా బయటపడగలుగుతాం. ఆలోచనలు తగ్గించుకోవాలని వైద్యుడు చెప్తారు. ఓ వంద గ్రాములు తగ్గించగలుగుతామా..? ఆలోచనలు తగ్గించుకోవటం అంటే, బుర్రని సోమరిగా ఉంచుకోవటం కాదు. మనసును రాపాడి, బాధించే ఆలోచనలు మానాలని! అలాంటి ఆలోచనల లోంచి బయటపడాలంటే, ఒక్కటే మార్గం. మనసుకు వేరే వ్యాపకం కలిగించుకోవాలి. ఎప్పుడూ బుర్రతో చేసే నిర్మాణాత్మకమైన పనిలో బిజీగా ఉండటమే ఉత్తమ పరిష్కారం. మేడ మీదకు వెళ్లేందుకు లిఫ్టెక్కినా, దిగేందుకు మెట్ల దారిని ఉపయోగించడంలో కొంత తెలివి ఉంటుందని ఒప్పుకొంటారు కదా..! తా నొవ్వక, తా నొప్పించక తప్పించుకోగలిగే రీతిలో వృత్తి, ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చుకో గలిగితే, బీపీలు పెరగవు, గుండె జబ్బులు రావు.
ఆహారంలో కూర ముక్కలు ఎక్కువగా, అన్నం తక్కువగా ఉంటే అది హృదయమిత్ర ఆహారం. గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికల్లాంటివి హృదయమిత్ర లాభాన్ని కలిగిస్తాయి. చింతపండు, అల్లం వెల్లుల్లి, శనగపిండి, మైదా ఇలాంటివి హృదయమిత్ర భేదాన్ని, ఖేదాన్నీ కలిగిస్తాయి. శరీరానికి, మేథస్సుకు వ్యాయామం ఉంటే గుండె జబ్బులున్నా లోకాన్ని జయించగలుగుతారు. గుండె జబ్బులకు ఇవే చికిత్సా రహస్యాలు. మందుల సంగతి వైద్యులకు వదిలేసి, ఆహార విహారాలను రోగి జాగ్రత్తగా పాటించగలిగితే కడుపును మెడికల్ షాప్‌గా మార్చకుండా ఉండగలుగుతాము. మందుల షాపులలో ఉండే మందులన్నీ మన కడుపులో ఉండాల్సిన పరిస్థితి రాకూడదు కదా!
గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం లాంటి బాధలు వచ్చినప్పుడు శరీరానికి ఈ విధంగా మనం మద్దతిస్తే గుండె స్వయంగా బైపాసుల్ని తయారుచేసుకుని తనకు తానే రక్త సరఫరాను సరిచేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకు ఔషధాలతోపాటు ఆహార విహారాలు గుండెకు సహకరించేవిగా ఉండాలి.
హృద్రోగాలకు క్షుద్ర వైద్యాలు ఉండవు. గుండె భద్రంగా ఉండే ఆహార విహారాలు, ఆలోచనలు మాత్రమే శరీరానికి మేలు చేస్తాయి. మందుల మీద మాత్రమే ఆధారపడాలనుకొంటే గుండె జబ్బులకు అరకొర చికిత్స చేస్తున్నట్టే లెక్క.
శరీరానికి, మేథస్సుకు వ్యాయామం ఉంటే గుండె జబ్బులున్నా లోకాన్ని జయించగలుగుతారు.
గుండె జబ్బులకు ఇవే చికిత్సా రహస్యాలు.
**
- డా. జి. వి. పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

డా. జి. వి. పూర్ణచందు