S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రీడ.. క్రీనీడ

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు మేళవించిన పంచరంగుల భారతావని మనది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత. ఒక్కో రాష్ట్రానిది తనదైన అనిర్వచనీయ శైలి. మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా ప్రజల్ని ఆకట్టుకునేది, అలరించేదే. మన సంస్కృతి గొప్పతనం అనాదిగా విలసిల్లుతోందంటే దాన్ని మనం పరమావధిగా ఆచరించడం పాటించడమే కారణం. ఒక్కో పర్వదినానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అది చూసేవారికి, ఆస్వాదించేవారికి, ఆనందించేవారికే కాదు... దీనిగురించి వినేవారికి కూడా ఓ అద్భుతమైన, అబ్బురమైన భావన కలుగుతుంది. అలాంటి కళల మేళవింపే భారతీయ సంస్కృతికి సౌరభం. ప్రతి రాష్ట్రంలోనూ జంతువులతో ముడివడిన క్రీడలున్నాయి. ముఖ్యంగా ఎద్దులు, ఆబోతులు, కోళ్ళు, గుర్రాలు - ఇలా ప్రతిదీ కూడా దేశ సంస్కృతిలో భాగంగా స్థానిక ప్రత్యేకతలకు అద్దంపట్టేలా కొనసాగుతూనే వచ్చింది. తమిళనాట చెలరేగిన జల్లికట్టు వివాదంతో అన్ని రాష్ట్రాలుకూడా తమదైన జంతు క్రీడలను తెరపైకి తెస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే నిషేధాలను సైతం ఎత్తివేస్తూ జనరంజకమైన క్రీడలకు పునరుజ్జీవనం కలిగిస్తున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ - ఇలా ఒక్కటేమిటి అన్ని రాష్ట్రాల్లోనూ భిన్నమైన ఆచారాలతో ఆరాధ్య భావనతో ఈ పోటీలు జరుగుతాయి. ఆధునిక భారతావని అన్నింటినీ మరిచిపోయి జీవన పోరాటంలో పరుగులు పెడుతున్న తరుణంలో మన సంప్రదాయాల గురించి వాటితో ముడివడిన సాంస్కృతిక వైభవం గురించి మననం చేసుకోవడం ఎంతైనా అవసరం. భారతదేశమంటేనే కుల, మత, ప్రాంత, భాషాపరమైన భేదాలెన్నున్నా అందరినీ ఒకే తాటిపై నడిపించే సాంస్కృతిక చట్రం ఇంతటి మహత్తర దేశంలో శతాబ్దాలుగా సాగుతున్న క్రీడల గురించి వాటి ప్రత్యేకతల గురించి, వాటితో ముడివడిన స్థానిక మనోభావాల గురించి మననం చేసుకోవడమంటే నేటి తరానికే కాదు, రాబోయే తరానికి కూడా మన గత వైభవాన్ని కళ్లకు కట్టడమే. తాజాగా ఈ తరహా క్రీడలన్నీ జల్లికట్టు వివాదం పుణ్యమా అని మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. ఒకప్పుడు పర్యాటకులకు ఆకర్షణీయంగా మారిన ఈ క్రీడలు జనరంజకంగా తెరపైకి వస్తున్నాయి. తమిళనాట ప్రసిద్ధి చెందిన జల్లికట్టును కొనసాగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో అనేక రాష్ట్రాలు తమకే ప్రత్యేకమైన ఈ రకమైన పోటీలను తెరపైకి తెచ్చేందుకు పోటాపోటీగా ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడివున్న క్రీడలు, వాటి ప్రత్యేకతలు, స్థానిక ప్రాధాన్యాతలను తెలుసుకోవడమన్నది కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అవిభాజ్య భాగాలుగా ముడివడివున్న వాటిని ఆస్వాదించడమే. వాటి ప్రత్యేకతలను, గొప్పతనాన్ని వాటితో ముడివడిన ప్రజల మనోభావాలను మరోసారి పరికించడమే. తమిళనాట జల్లికట్టు ఎలా ప్రసిద్ధమో, కర్నాటకలో కంబళ, గోవాలో ధీరియో, అస్సాంలో మాగ్‌బిహు, మధ్యప్రదేశ్‌లో సాయిర్ ఉత్సవం, ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు మొదలైనవి అంతే ప్రసిద్ధమైనవే. వీటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడమంటే ఆ పోటీల లోతుల్లోకి వెళ్లి శతాబ్దాల వాటి చరిత్రను మరోసారి కళ్లకు కట్టడమే. ఈ క్రీడలన్నీ కూడా ఎద్దులతో, ఇతర మగ జంతువులతో ముడివడి వున్నవే. ఈ ఆరు దశాబ్దాల కాలంలో అటు బాలీవుడ్ నుంచి ఇటు ప్రాంతీయ భాషా సినిమాల వరకు అనేక చిత్రాలు ఈ రకమైన క్రీడలకు మరింత ప్రాధాన్యతనిచ్చాయి. ఆబోతుల మధ్య పోటీనే కాకుండా ఆబోతుతో హీరో ఢీకొనడం, దాని కొమ్ము వంచడం మొదలైనవి జన సామాన్యాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా ఆయా చిత్రాల విజయానికి ఎంతగానో దోహదం చేశాయి. ఈ రకమైన సాంప్రదాయక పోటీలు ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా సినిమాల్లో వాటిని జోడించడం వల్ల వాటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ రకమైన క్రీడ తమ రాష్ట్రానిదేనన్న బలమైన మనోభావాలు ప్రజల్లోనూ ఏర్పడ్డాయి. అయితే ఈ రకమైన క్రీడలు ఆయా జంతవులను హింసించడమేనా? వాటి స్వేచ్ఛను హరించడమేనా? అన్న వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో ఈ క్రీడలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు వాటిని నిషేధించాయి. ఇప్పుడు జల్లికట్టుతో మళ్లీ అవి తెరపైకి వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక సహా అనేక రాష్ట్రాలు ఈ క్రీడలకు పట్టం కట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కర్నాటకలో కంబళ
కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్రీడ ఇది. ఎప్పుడైతే జల్లికట్టుపై తమిళనాడు విజయం సాధించిందో కర్నాటక ప్రభుత్వం కూడా కంబళను తెరపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నమే మొదలుపెట్టింది. అసెంబ్లీలో కంబళ బిల్లుకు ఆమోద ముద్ర కూడా పడింది. కంబళ అన్నది కర్నాటకలో కొన్ని ప్రాంతాల్లో జరిగే ఎద్దుల పోటీ. తమిళనాడు తరహాలోనే ఓ ఆర్డినెన్స్ ద్వారా ఈ పోటీని మళ్లీ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనితో తమ ప్రజల మనోభావాలు, భావోద్వేగాలు ముడివడి వున్నాయని చెబుతోంది. ఈ క్రీడ ప్రత్యేకత ఏమిటంటే దక్షిణ కన్నడ ప్రాంతంలో, అలాగే కొన్ని ఉడిపి జిల్లాల్లో రైతాంగం అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించడమే. ఈ పోటీ జరిగే ప్రాంతాన్ని తులునాడు అని వ్యవహరిస్తారు. కర్నాటక కోస్తా జిల్లాల్లోనే ముఖ్యంగా పచ్చిక బయళ్లలో ఈ ఎద్దుల పోటీ జరుగుతుంది.

ఇందులో భాగంగా రెండు ఎద్దులకు నాగలి కడతారు. వాటిని ఓ వ్యక్తి తోలుతూ పరిగెత్తిస్తాడు. ఇలాంటి ఎడ్లబండ్ల మధ్య పోటీయే కంబళ. ఏ ఎడ్లబండి అయితే వేగంగా గమ్యానికి చేరుకుంటుందో అదే విజయాన్ని సాధించినట్లు. ఇలా విజయం సాధించిన వాటికి గతంలో కొబ్బరికాయలు, అరటిమొక్కలు ఇచ్చేవారు. మారిన పరిస్థితుల్లో బంగారు నాణేలు సహా భారీ నగదు బహుమతులు కూడా అందిస్తున్నారు. ఈ క్రీడను మళ్లీ పునరుద్ధరించాలని కర్నాటక అంతటా డిమాండ్లు వెల్లువెత్తాయి.
మహారాష్టల్రో ఎడ్లపందాలు
కర్నాటక మాదిరిగానే మహారాష్టల్రో కూడా ఎడ్లబండ్ల పందాలు అనాదిగా జరుగుతూనే వచ్చాయి. అనంతర కాలంలో వాటిపై నిషేధం విధించడంతో కనుమరుగైపోయాయి. మళ్లీ ఇప్పుడు జల్లికట్టు, కంబళ తరహాలోనే ఈ సాంప్రదాయిక క్రీడను తెరపైకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టింది. ఈ ఎడ్లబండ్ల పందాలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ వీటి నిర్వాహకులు కొన్ని నియమ నిబంధనలకు అనివార్యంగానే కట్టుబడి ఉండాలని షరతులు విధించింది. ఇంతకుముందే సుప్రీంకోర్టు ఈ రకమైన క్రీడలపై నిషేధాన్ని విధించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎడ్లబండ్ల పోటీలకు మళ్లీ తెరతీసింది. అంటే ప్రతి ఎడ్లబండికి ప్రత్యేకమైన మార్గం ఉండాలని, ఈ బండ్లను లాగే ఎడ్లను కొట్టడానికి వీల్లేదని, గాలిలో చర్నాకోలు తిప్పడమో లేదా దాన్ని నేలకు కొట్టడమో చేయాలని షరతు పెట్టింది. అంతేకాదు, ఈ పోటీకి ముందు వాటిలో పాల్గొనే అన్ని ఎడ్ల ఆరోగ్యాన్ని, వాటి శారీరక స్థితిగతులను ఓ పశువైద్యుడు తనిఖీ చేయాలని కూడా స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పోటీలో ఎడ్లను వేగంగా పరిగెత్తించడానికి వాటిని కొట్టినా, ఇతరత్రా గాయపరిచినా, అది జంతుహింసే అవుతుందని కూడా మహారాష్ట్ర పేర్కొంది.
గోవాలో ధీరియో
ఇది కూడా ఒక రకంగా ఎడ్లపందెమే. 1997లో దీనిపై నిషేధం విధించారు. అయితే ఇందులో పాల్గొనే ఎద్దులను ప్రత్యేకంగా పెంచే సంస్కృతి గోవాలో ఉంది. ఒకదానితో ఒకటి పోటీపడేందుకు వీలుగా వాటి కొమ్ములను పదునెక్కేలా సానపెడతారు. అంతేకాకుండా వాటికి ప్రత్యేకంగా కొన్ని అమరికలు, అలంకరణలు చేస్తారు. వీటిని తొడిగిన తర్వాత ఆ ఎద్దులు రాజసాన్ని ఒలకబోస్తాయి. నువ్వా నేనా అన్నట్లు పోటీలోకి దిగుతాయి. దీనికి ముందు ఆరోజు ఉదయమే ఈ ఎడ్లను అన్ని విధాలుగా అలంకరిస్తారు. వాటికి ప్రత్యేకమైన పేరూ పెడతారు. ఎన్నికల ర్యాలీ తరహాలో వాటిని ఆ గ్రామమంతా ఊరేగిస్తారు. బ్యానర్లు కట్టడం, ఓ పక్క సంగీత వాయిద్యాలు మొదలైనవన్నీ కూడా ఆ ఎద్దు పోటీలో విజయం సాధించడానికి ప్రోత్సాహకంగా జరిగేవే. అంతేకాదు, వీటిలో కోపాన్ని, ఆగ్రహాన్ని కలిగించేందుకు వాటిచేత కొన్ని విన్యాసాలు చేయిస్తారు. వాటిని మోకాళ్లపై నిలబెడతారు. అనంతరమే రెండు ఎద్దులూ ముఖాముఖీ ఢీకొనేలా వాటిని వదులుతారు. సాధారణంగా ఈ క్రీడలు వ్యవసాయ క్షేత్రాల్లోనే జరుగుతాయి. వాటికో పరిధి అంటూ ఉండదు. వాటిని తిలకించడానికి వచ్చేవారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఈ పోటీలో బలహీనంగా ఉండే ఎద్దు పారిపోయి పరుగులుపెట్టి జనంలోకి వచ్చేసే సందర్భాలు కూడా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ వీటి పదునైన కొమ్ములు మరో ఎద్దు మెడలోకి దిగిపోయి రక్తం కూడా చిందుతుంది. ఇలాంటి పోటీపై భారీగానే పందేలూ కాస్తారు. ఈ రకమైన క్రీడకు సంబంధించి అభ్యంతరాలు మొదలయ్యాయి. దేశ విదేశాల్లోనూ వీటిని నిషేధించాలన్న అభ్యర్థనలూ తలెత్తాయి. అప్పటి భారత ప్రధానికి కూడా అభ్యర్థనలు అందాయి. దాంతో నిషేధం విధించారు. దానిపై ఎద్దుల యజమానుల సంఘాలు కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు 1997లో వారి అభ్యర్థనను కొట్టివేసింది. ధీరియో పోటీలు చట్ట వ్యతిరేకమని, 1960 నాటి జంతుహింస నిరోధక చట్టానికి విరుద్ధమని తేల్చింది. అయితే, పదేళ్ల తర్వాత దీనిపై రాజకీయాలు మొదలయ్యాయి. తమకు అధికారాన్ని అప్పగిస్తే ధీరియోను పునరుద్ధరిస్తామంటూ నేతలు హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఇంతవరకూ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.
అస్సాంలోనూ....
అస్సాంలో ప్రత్యేకంగా జరిగే మాగ్ బిహు వ్యవసాయ ఉత్సవంలో భాగంగా ఎద్దుల పోటీలు నిర్వహించడమన్నది దశాబ్దాలుగా జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కామరూప్ జిల్లాలో ఈ పోటీలు ఎక్కువగా జరిగేవి. వారం పాటు ఓ ఉత్సవంగా ఎద్దుల పోటీలను ప్రజలు నిర్వహించేవారు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఆదేశానుసారం అస్సాం ప్రభుత్వం ఈ ఎద్దుల పోటీలను నిషేధించింది. అంతేకాదు, కోడిపందాలపైనా వేటు వేసింది.
హిమాచల్‌లోనూ...
ఎడ్ల పందాలను నిషేధించినప్పటికీ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం వార్షికంగా జరిగే సాయర్ ఉత్సవంలో భాగంగా వీటిని కొంతమేర అనుమతిస్తూనే వస్తోంది. సోలన్, సిమ్లా, సిర్‌వౌర్, నూర్పూర్‌లలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనే ఎద్దులను ప్రత్యేకంగా సంరక్షిస్తారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చుపెడతారు. అయితే ఈ పోటీ దాదాపు జంతుహింస తరహాలో సాగడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.
చాలా రాష్ట్రాల్లో ఎద్దులమధ్యే ఈ రకమైన పోటీ జరిగితే, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మనిషికీ ఎద్దుకూ మధ్య పోటీ ఒక దశలో ఆసక్తికరంగానే సాగింది. రాజస్థాన్‌లో ముఖ్యంగా నాగౌర్, పుష్కర్ ఉత్సవాల్లో ఎద్దులమధ్య పోటీలు ఒక దశలో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. సిక్కింలో జరిగే ఈ రకమైన ఎడ్లపందాలు టూరిస్టులను విశేషంగా ఆకర్షించేవి. కేంద్రపాలిత ప్రాంతాలైన డయ్యూడామన్‌లో కూడా ఒకప్పుడు ఈ రకమైన ఎడ్ల పోటీలకు ఎంతో ఆకర్షణ ఉండేది. అయితే ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో జంతువులను హింసించడమన్నది లేదా వాటి సహజసిద్ధమైన లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తించడమన్నది ఎంతమాత్రం క్షమార్హం కాదు. కొన్ని క్రీడలు సంప్రదాయంతో ముడిపడి ఉన్నా అవి ప్రజలకు వినోదాన్ని ఇచ్చేవే అయినప్పటికీ వాటిని ప్రోత్సహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. తాజాగా సుప్రీంకోర్టు జల్లికట్టుకు సంబంధించి తమిళనాడు అసెంబ్లీ నిర్ణయాన్ని కొనసాగించినప్పటికీ దీని నిర్వహణ విషయంలో అనేక రకాల షరతులూ విధించింది. రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ కేవలం వాటిని ఈ రకమైన ఎడ్ల పందాలతోనో, ఇతర జంతుజాతులకు నష్టం కలిగించే రీతిలో నిర్వహించడం ఎంతమాత్రం సమంజసం కాదు. అయితే, ఈ రకమైన పోటీలో ఆనందంకంటే కూడా భారీగా ఆర్థికపరమైన లావాదేవీలు కూడా చోటుచేసుకోవడంతో వీటికి అనివార్యమైన డిమాండ్ పెరిగింది. ఇలాంటి వాటిని సంప్రదాయ ముసుగులో ప్రోత్సహించడం కూడా మంచిది కాదు. ఆయా జంతువులకు నష్టం కలిగించని రీతిలో, చట్టం అనుమతించే పరిధుల్లో వీటిని నిర్వహించడం వల్ల ఈ పోటీల్లో పెడ ధోరణులకు ఆస్కారం ఉండదు.

- బి.ఆర్. ప్రసాద్