S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రణక్షేత్రం 13

‘సార్! నేను మీ అభిమానిని. సినిమాల్లో నటించాలని వచ్చాను. ఒకసారి నా ఫొటో ఆల్బమ్ చూడండి. వీలయితే అవకాశం ఇవ్వండి...’ అన్నాను.
‘అడ్డమయిన వాళ్లకీ ఇవ్వటానికి ఇక్కడ వేషాలు గుట్టలుగా పోగేసుకుని కూర్చున్నామటమ్మా! పోవమ్మా! పోయి వేరే పని చూసుకో...’ అన్నాడతను.
‘ఒక్కసారి ఆల్బమ్ చూడండి సార్...’ అతని ముందుకు ఆల్బమ్ జరుపుతూ అన్నాను.
టేబుల్ మీద ఏదో గొంగళి పురుగు వచ్చినట్లు ఒక్క తోపు తోశాడు. నా ఆల్బమ్ వెళ్లి దూరంగా పడింది. ‘నీకంటే రంభ ఎవరూ లేరనుకుంటున్నావా? చిటికె వేస్తే క్యూలో నిలబడతారు నీలాంటి వాళ్లు. నీ ఆల్బమ్ చూడటం కంటే వేరే పనేమీ లేదనుకుంటున్నట్లుంది..’ అన్నాడు స్వరం పెంచి. ఈసారి అతని గొంతులో కోపం మాత్రమే కాదు నా మీద అసహ్యం కూడా వినిపించింది. అతను నన్ను ఎందుకంత అసహ్యించుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు.
కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాను.
‘చెప్తుంటే అర్థం కాలేదా? పో...’ అన్నాడు. అడుక్కునే వాళ్లని కూడా అలా విసుక్కోరేమో!
ఇప్పటికి ఎంతోమందిని వేషం అడిగి ఉంటాను. ఎవరూ ఇవ్వలేదు. అది వేరే విషయం. వేషం ఇవ్వటం, ఇవ్వకపోవటం అతని ఇష్టం. కానీ నన్ను అంత విసుక్కోవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. ఆ సంగతే తేల్చుకోదలచుకున్నాను.
ఇంతలో లోపల నుండి అతన్ని ఎవరో పిలిచారు.
అతను లోపలకు వెళ్లి పది నిమిషాల తరువాత బయటకు వచ్చాడు.
అతన్ని కడిగి పారేయటానికి రెడీ అయి మాటలన్నీ పేర్చుకుని తయారుగా ఉన్నాను నేను.
కానీ.. లోపలకు వెళ్లిన మనిషికీ, బయటకు వచ్చిన మనిషికీ సాపత్యమే లేదు.
ఈసారి కే.కే. మొహంలో నా మీద అసహ్యం కనపడలేదు. వేరే భావం ఏదో కనపడింది. అదేమిటో అప్పుడు అర్థం కాలేదు. తరువాత అనిపించింది. బహుశా అది నా మీద జాలేమో...
మొత్తానికి నేను అతన్ని ఝాడించక ముందే, అతనే తిరిగి నన్ను పలకరించాడు. ‘ఏదీ! ఆల్బమ్ ఇలా ఇవ్వు...’ అంటూ.
అప్పటిదాకా అతన్ని అడుగుదామన్న మాటలన్నీ మరిచిపోయి ఆనందంగా చేతిలోని ఆల్బమ్ అతనికి ఇచ్చాను.
చాలా కాజువల్‌గా ఆ ఫొటోలను చూసిన అతను, ‘.. ఇలా అవకాశాల కోసం అంటూ ఎక్కడ పడితే అక్కడ వెంట పడితే ఎలా? మాకూ సమయం ఉండాలిగా? రాత్రికి గెస్ట్ హౌస్‌కి రా... అక్కడ తీరిగ్గా చూసి చెప్తాను’ అన్నాడు.
‘నేను మాల్‌లో పని చేస్తున్నాను సార్! రాత్రిపూట రావటం కుదరదు’
‘నీ ఇష్టం. పగలయినా ఫరవాలేదనుకుంటే ఇప్పుడే రా...’
ఆ మాటల్లో వెకిలితనం లేదు. కొంటెతనం లేదు. జస్ట్... అతని బాకీ ఏదో తీర్చుకుంటున్నంత సహజంగా అడిగాడు.
అంత పెద్ద మనిషి అలా ప్రవర్తించటం చూసి మ్రాన్పడిపోయాను. అంత దూరం వచ్చి వెనక్కి తగ్గటం ఎందుకన్నట్లు, ‘అక్కడికి ఎందుకు సార్?’ గొంతు పెగల్చుకుంటూ అడిగాను.
‘బాగుందమ్మా!...’ అన్నాడతను. ‘నీ ఆల్బమ్ చాలా బాగుంది. మంచిమంచి డ్రెస్సుల్లో నీ ఫొటోలు చాలా బాగున్నాయి. కాకపోతే ఆ డ్రస్సులు లేకుండా ఎలా ఉంటావో చూడాలిగా! డైరెక్టరన్నాక అన్ని యాంగిల్సూ వాడుకోవాలిగా... అందుకు’ సిగ్గు, బిడియం లేకుండా ఓపెన్‌గా చెప్పాడతను.
ఏమి సమాధానం చెప్పాలో కూడా తెలియనట్లు నిశే్చష్టురాలినయ్యాను.
కళ్ల వెంట నీళ్లు తిరుగుతుంటే బయటకు నడిచాను.
ఇప్పుడు నాకు రాయుడు చెడ్డవాడిగా అనిపించటం లేదు. కనీసం శషభిషలు లేకుండా తనకు కావలసింది అడిగాడు. ఇతను అలా కాదే! తన కోరికకు కళాపోషణ అన్న ముసుగు కప్పి కళను కూడా అవమానపరుస్తున్నాడు.
ఇలాంటి సంఘటనలతో నా దృఢచిత్తం మరింత గట్టి పడింది.
వడివడిగా బయటకు నడుస్తుంటే వెనుక నుండి పిలుపు వినిపించి ఆగి చూశాను.
నేను నగరానికి వచ్చిన రోజు కింద బెర్త్ మీద ప్రయాణించిన వ్యక్తి, మొన్నటి వరకు ట్రాలీలు తోసిన వ్యక్తి - చంద్రం.
ఇప్పుడు ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లున్నాడు.. మరి ఆ గొప్ప నా దగ్గర చూపించుకోవటానికేమో, నాకు సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు.
‘తాదూర కంతలేదు కానీ, మెడకో డోలు...’ అనే సామెత గుర్తుకు వచ్చింది. అతని సంగతి అతను చూసుకోలేడు, నాకు సాయం చేస్తాడంట. ప్రతి ఒక్కడికీ, ఒంటరిగా ఆడది కనిపిస్తే పలుకరించటానికి ఏదో ఒక వంక కావాలి.
ఇక్కడకు వచ్చిన తరువాత నేర్చుకున్న విషయం అనవసరంగా ఎవరినీ శత్రువులను చేసుకోవద్దని. అదీకాక ఏ పుట్టలో ఏముందో... అందుకే! నా ఫొటో, అతనడిగిన ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ నుండి బయటపడ్డాను.
* * *
నేను పనిచేసే మాల్‌లో జ్యుయలరీ సెక్షన్‌కి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉండేవన్నీ బ్రాండెడ్ జ్యుయలరీ. మామూలు షాపుల్లో ఉండే వాటి కంటే చాలా ఖరీదు కలిగి ఉంటాయి.
ఆ మాల్‌కి వచ్చే వారిలో నూటికి తొంభై మంది కాజువల్‌గా వచ్చి మోడల్స్ చూసి వెళ్లిపోయే విండో షాపర్లు ఉంటారు.
నిజంగా కొనటానికి వచ్చేవారు చాలా తక్కువమంది ఉంటారు.
ఇక మూడవ రకం మోసం చేయటానికి వచ్చేవారు. వీళ్లు ఎక్కడో ఒకరు ఉంటారు. ఆ ఒకరే సంస్థకి ఎక్కువ హాని చేస్తారు.
ఇప్పుడు మాల్‌లో నాకు బాగా అనుభవం వచ్చింది. ఎవరు విండో షాపర్లో, ఎవరు నిజం కస్టమర్లో ముందుగానే ఊహించ గలుగుతున్నాను. అఫ్‌కోర్స్ ఎవరు దొంగతనానికొచ్చారో ఊహించటం ఎవరివల్లా కాదనుకోండి...
టైమ్‌పాస్ కోసం వచ్చే వారిని గుర్తించటమే కాదు, అసలయిన కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా వారిని డిస్కరేజ్ చేయవలసిన బాధ్యత కూడా నాదే! ఆ పనులన్నీ నేను ఇప్పుడు అవలీలగా చేయగలుగుతున్నాను.
ఎవరయినా ఎక్కువసేపు నా సెక్షన్‌లో గడుపుతున్న అనుమానం కలిగితే నెమ్మదిగా వారి దగ్గరకు వెళ్తాను నేను.
‘ఏమి కావాలి సార్!...’ అని అడుగుతాను.
కాలక్షేపం కోసం వచ్చిన వారయితే తడబడతారు. ‘ఏమీ అక్కర్లేదు... ఊరికినే చూస్తున్నాం..’ అంటారు.
చాలామంది ఆ మాటతో అక్కడ నుండి వెళ్లిపోతారు. కొంతమంది ఏ సమాధానమూ చెప్పకుండానే వెళ్లిపోతారు. మరి కొంతమంది అప్పటికీ వెళ్లరు.
వాళ్లని ఎలా డీల్ చేస్తానంటే ‘ఈ రింగ్ చూడండి సార్! ఫైవ్ క్యారెట్ డైమండ్ స్టడెడ్ వన్. జస్ట్ ఫైవ్ లాక్స్. చూపించమంటారా?’ అంటాను.
‘అంత ఖరీదా?’ అంటారు.
‘ఏ రేంజ్‌లో చూస్తారో చెప్పండి. అవే చూపిస్తాను..’ అంటాను.
ఆ మాటతో తప్పనిసరిగా వెళ్లిపోతారు.
అంతేకాదు వారానికొకసారి మధ్యతరగతి వారు కూరగాయలు కొనుక్కున్నట్లు నెలకో, రెండు నెలలకో క్రమం తప్పకుండా వచ్చి లక్షలు పెట్టి నగలు కొనే రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు. వారిని చూడగానే గుర్తు పట్టి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వవలసి ఉంటుంది.
ఇవన్నీ నాకు ఎవరూ నేర్పలేదు. నేనే నేర్చుకున్నాను. ఆధారం చూపితే అల్లుకుపోయే గుణం నాకు మొదటి నుండి ఉంది. ఇప్పుడు ఈ మాల్‌కి వచ్చే రెగ్యులర్ కస్టమర్లు నన్ను అడిగి నేను ఉన్న రోజే షాపింగ్‌కి వస్తున్నారు.
నా ఆహార్యంతోపాటు భాష, వ్యక్తిత్వం కూడా రోజు రోజుకీ పరిణతి చెందాయి. బయట ఎవరైనా నన్ను చూస్తే కచ్చితంగా పేజ్ త్రీలో కనిపించవలసిన అమ్మాయినని అనుకోవటం ఖాయం.
‘నువు చాలా మారిపోయావు. మొదట్లో మాకు పరిచయమయిన వసుంధరకీ, ఇప్పటి నీకూ పోలికే లేదు...’ అని నాతో అనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
దాన్ని కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను తప్ప, తలకెక్కించుకోలేదు.
అయితే ఆ మాట ఎంత నిజమో చెప్పే సంఘటన ఒకరోజు జరిగింది.
ఆ రోజు కూడా మాల్ ఎప్పటిలానే కస్టమర్లతో బిజీగా ఉంది. అందులో సెలవు రోజు కావటంతో మామూలు కంటే ఎక్కువ రద్దీగా ఉంది.
రకరకాల కస్టమర్లతో మాట్లాడుతూ మధ్యలో వచ్చిన ఒక క్షణం గ్యాప్‌లో తలెత్తి చూసిన నేను ఉలిక్కిపడ్డాను.
అక్కడ కాస్త దూరంగా నిలబడి నా వైపే చూస్తూ ఉన్న రాయుడు కనిపించాడు.
గుండె ఆగి కొట్టుకున్నట్లయింది. తరువాత కూడా ఎక్స్‌ప్రెస్ వేగంతో కొట్టుకుంటోంది. అయినా నా ఆందోళనని బయటకు కనపడకుండా అదుపు చేసుకున్నాను.
ఒకసారి గట్టిగా ఊపిరి తీసి వదిలి పరిస్థితిని ఆకళింపు చేసుకున్నాను.
రాయుడు నన్ను గుర్తు పట్టలేదు. అతనికి కొద్దిగా అనుమానం వచ్చింది అంతే!
అతని దృష్టి పథంలో ఉన్న వసుంధర చౌకరకం దుస్తులు ధరించి స్టేజ్ మీద గంతులు పెట్టే అమ్మాయి. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న నేను అధునాతనంగా, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాను. అందుకే ఇద్దరూ ఒకరే అని అతనే నమ్మలేకపోతున్నాడు.
వెంటనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రాయుడి దగ్గరకు వడివడిగా నడిచాను. ‘ఏం కావాలి సర్...!’ ఇంగ్లీషులో అడిగాను.
అతను ఒక్క క్షణం ఏమీ అర్థం కానట్లు బ్లాంక్‌గా చూశాడు. తరువాత ఏదో గుర్తుకు వచ్చినట్లు, ‘నీ పేరేమిటి అమ్మాయ్?’ అన్నాడు.
‘ఇక్కడ మేము మా పేర్లు చెప్పకూడదండి. అయినా నా పేరుతో మీకు పనేంటి?’
‘నాకు తెలిసిన ఒక అమ్మాయి అచ్చు నీలానే ఉండేది. అందుకని...’
‘ఆ అమ్మాయి పేరేమిటో?’
‘వసుంధర...’
‘నా పేరు అది కాదండి’
‘కానీ, నువు అచ్చం మా వసుంధరలానే ఉన్నావ్..!’
‘మనిషిని పోలిన మనుషులు ఉండవచ్చు. మీరు ఏదైనా కొనదలచుకుంటే చెప్పండి, హెల్ప్ చేస్తాను’
‘కొంటానులే! ముందు ఇది చెప్పు. మీదే ఊరు?’
‘మీ వసుంధరది ఏ ఊరు?’
చెప్పాడు రాయుడు.
‘సారీ! ఆ ఊరి పేరు కూడా నేను వినలేదు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను...’
‘అది నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే...’ మనసులో అనుకోబోయి బయటకే అన్నాడు రాయుడు.
‘మీకు ఏమి కావాలో చెప్తే...’
‘ఏమీ వద్దులే అమ్మా! వెళ్లొస్తాను...’ అని ముందుకు కదిలి.. ‘మనిషిని పోలిన మనుషులు ఉంటారని విన్నా కానీ.. మరీ ఇంత ఇదిగానా?..’ అనుకుంటూ బయటకు నడవబోయాడు.
ఎదుటి మనిషి తగ్గటంతో నాకు అతనితో కాస్త ఆడుకోబుద్ధయింది.
నేనే ఆయన దగ్గరకు నడిచి, ‘ఇంతకీ మీ వసుంధర ఏమయింది?’ అని అడిగాను.
‘ఇంట్లో నుండి పారిపోయింది’
‘అయ్యో పాపం. ఎందుకు?’
‘పెళ్లి చేయటానికి పూనుకున్నాం. ఇష్టం లేనట్లుంది. వెళ్లిపోయింది...’
‘ఓహ్! సారీ... ఇంతకీ, నా వయసు అమ్మాయి అంటున్నారు. మీకేమవుతుంది? కూతురా...?’
‘కాదుకాదు...’ కంగారుగా అన్నాడు రాయుడు.

‘మనవరాలా?’ అమాయకంగా అడిగినట్లు అడిగాను.
కోపంగా నా వైపు చూశాడు రాయుడు. ‘మరీ అంత వయసున్నట్లు కనపడుతున్నానా ఏమిటి?’ అంటూ నన్ను తప్పించుకోవటానికన్నట్లు వడివడిగా నడుస్తూ బయటకు వెళ్తున్నాడు.
‘అంత కోపం ఎందుకండీ! కొంపతీసి మీరే పెళ్లికొడుకా ఏమిటి?’ అతన్ని అక్కడ కూడా వదలకుండా వెంట పడి మరీ అడిగాను.
‘మీలాంటి వాడు అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే, పారిపోక ఏం చేస్తుంది లెండి?...’ అన్నాను.
నా మాట పూర్తికాక ముందే బయటకు వెళ్లిపోయాడు.
రాయుడి మీద విజయం సాధించినట్లు గర్వంగా అనిపించింది.
‘నా భయమే తప్ప, ఒకవేళ అతడు గుర్తు పట్టినా ఇక్కడ నన్ను ఏమి చెయ్యగలడు?..’ అని నాకు నేనే ధైర్యం చెప్పుకుని తిరిగి నా పనిలో పడిపోయాను.
ఆ తరువాత ఇంకెప్పుడూ రాయుడు నాకు కనపడలేదు.
ఆ మాల్ అప్పుడప్పుడూ సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. ఎదురుగా తమని అటెండ్ అవుతున్న సేల్స్ గర్ల్ కూడా ఒక మనిషే అని గుర్తించటానికి ఇష్టపడని వారి నుండీ, ఎదుటి మనిషి చెప్పింది యథాతథంగా అనుసరించి ఆమె సూచించినవే కొనే వారి వరకూ ఎన్నో రకాల మనుషులు.
ఒకరోజు ఒక వ్యక్తి అలానే నా దగ్గరకు వచ్చాడు. అతను నా భావి జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడని నాకు తెలిసే అవకాశం లేదు. అదే తెలియనప్పుడు ఆ మలుపు మంచికా, చెడుకా.. అని అసలే తెలియదు కదా!

ప్రస్తుతం
‘అమ్మా! చంద్రంగారు బయలుదేరారంట. దగ్గర్లోకి వచ్చేశారు. మరో గంటలో ఇక్కడకు రావచ్చు’ చెప్పాడు రామభద్రం.
‘అనవసరంగా అతనెందుకు తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు?’ అంది వసుంధర.
‘మీ విజయంలో పాలుపంచుకోవటానికంట...’
‘నేను గెలుస్తానని నాకే నమ్మకం లేదు. అలాంటిది సెలబ్రేషన్స్ కోసం అంత దూరం నుండి అతను రావటం అవసరమా?’
‘మీరు గెలవటం మీకు అవసరం కాకపోవచ్చు. కానీ మాలాంటి చాలామందికి అది అవసరం. ఆ సంగతి అతనికి బాగా తెలుసు’ అన్నాడు రామభద్రం.
వసుంధర చంద్రానికి ఫోన్ చేసింది. ‘నువ్వు వస్తున్నావని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు...’ నిష్ఠూరంగా అంది.
‘చెప్తే రానివ్వవుగా..!’ అన్నాడతను.
‘ఇక్కడ ఉన్న మేమందరం చేయలేనిదీ, నువ్వు వచ్చి చేయగలిగిందీ ఏముంది చెప్పు...’
‘మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోలేరు. నేను చేయగలను’
నవ్వింది వసుంధర. ‘ఎన్నికలప్పుడు నీ విలువయిన సమయాన్ని వెచ్చించి నాకు ప్రచారం చేశావు. అప్పుడంటే అవసరం. అందుకే వద్దనలేదు. ఇప్పుడు నీకు శ్రమ ఇవ్వడం అనవసరం అని రావద్దన్నాను...’
‘నేను చేసిన ప్రచారం ఎంతవరకు ఫలించిందో చూసుకోవటానికయినా రావద్దూ...’
‘విజయంలో ఎంతమందయినా పాలుపంచుకోవచ్చు. అపజయం ఒంటరిగా అనుభవిస్తేనే బాగుంటుంది...’
‘ఓడిపోతానని అప్పుడే ఫిక్సయ్యావా?’
‘నేననుకోవటం కాదు. వస్తున్న రిజల్ట్స్ అలా ఉన్నాయి’
‘నాకు అబద్ధం చెప్పకు. గత రెండు రౌండ్లలో నీకే ఆధిక్యం వచ్చింది. మొదట్లో పెరుగుతూ వచ్చిన ఇద్దరి మధ్య తేడా, ఇప్పుడు తగ్గుతోంది. నెక్స్ట్ రౌండ్ ఫలితాలు తెలిసేటప్పటికి నువ్వే ఆధిక్యంలో ఉంటావు చూడు...’
‘దారిలో కూడా ఈ సంగతులు కనుక్కునే పని మీద ఉన్నావన్నమాట...’ అంటున్న వసుంధర మాట పూర్తి కాకుండానే రేఖ లేటెస్ట్ ఫలితాలు మోసుకువచ్చింది. ఫలితాలు ఎంత ఆశాజనకంగా ఉన్నాయో వెలిగిపోతున్న ఆమె మొహం చూస్తేనే తెలుస్తోంది.
వౌత్ పీస్ మీద చెయ్యి అడ్డం పెట్టి, ‘ఏమయింది?’ అని అడిగింది వసుంధర.
‘మేడమ్! మీరు మొట్టమొదటిసారి ఎదుటి పక్షం మీద ఆధిక్యంలోకి వచ్చారు. ఇప్పుడు మీరే పదిహేను వందల ఓట్ల మెజారిటీతో ఉన్నారు..’ రొప్పుతూ చెప్పింది.
బయట ఒక్కసారిగా టపాకాయల మోతలు వినిపించాయి.
ఏమి జరిగిందో అర్థంకాని చంద్రం ‘ఏమిటి హడావిడి? నేను రాక ముందే గెలిచేశావా ఏమిటి?’ అని అడుగుతున్నాడు.
‘కాదులే! నేను ఆధిక్యంలోకి వచ్చానని ఆనందపడుతున్నారు’
‘అదేంటి? అదేదో నీకు సంబంధం లేని విషయంలా చెప్తావు? నీకులేదా ఆనందం?’
‘జరగబోయేది తెలిసిన నాకు ఈ చిన్న విజయం ఆనందం కలిగించటంలేదు’
‘ఏం జరగబోతోంది?’
‘నేను ఓడిపోబోతున్నాను’
‘జ్యోతిషం కూడా నేర్చుకున్నావా ఏమిటి?’
‘లేదు కొన్ని నిజాలు తెలుసుకున్నాను’
చంద్రం గొంతులో కూడా సీరియస్‌నెస్ చోటు చేసుకుంది. ‘ఏమి జరిగింది?’ అన్నాడు.
‘నీకు తెలియని కొన్ని కుట్రలు ఈ మధ్యే బయటకు వచ్చాయి చంద్రం. నాకు వ్యతిరేకంగా కనీవినీ ఎరుగని రీతిలో కుట్ర జరిగింది. దాని ఫలితం రాబోయే రౌండ్లలో బయటపడుతుంది...’

మిగతా వచ్చేవారం

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002