S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మ మాట

రాము పదవ తరగతి తప్పాడు. పేపర్ కొనుక్కొని వస్తానని పొద్దుటే వెళ్లిన రాము ఎంతకీ రాకపోయేసరికి ఇంట్లోని వాళ్లంతా కంగారు పడ్డారు. రాము స్నేహితుడి ద్వారా రాము ఫెయిల్ అయ్యాడని తెలుసుకొన్నారు.
అందరిలోనూ భయం మొదలైంది. రాము ఏ అఘాయిత్యానికైనా పాల్పడ్డాడేమోనని. తలా ఓ దిక్కు వెళ్లి రాముని వెతకటం ప్రారంభించారు.
రాము వాళ్ల అమ్మ ఏడుస్తూ రాముకి తెలిసిన స్నేహితులకు ఫోన్లు చెయ్యసాగింది. ఎవరూ తమ ఇంటికి రాలేదని చెప్పటంతో.. మరింత భయం ఏర్పడింది. ఏడుపు కూడా వచ్చింది.
నిజానికి రాము తల్లిదండ్రులు చాలామంది పేరెంట్స్‌లా కాదు. చదువు కోసమని పిల్లల్ని వత్తిడి చేసేవారు కాదు. పాపం! రాము కష్టపడి చదివాడు. కానీ జ్ఞాపకశక్తి తక్కువ. దాంతో పరీక్షల్లో చదివినదంతా మర్చిపోయేవాడు. రాము పరిస్థితి తెలుసు కాబట్టి.. తల్లిదండ్రులు అంతగా చదువుపట్ల ఒత్తిడి తెచ్చేవారు కాదు.
* * *
రాము జగన్నాథస్వామి ఆలయంలో ఏడుస్తూ బాబాయికి కనిపించాడు. అతని ముందు కొన్ని గనే్నరుకాయలు, పెద్ద కంకరరాయి ఉన్నాయి. పిలిస్తే భయపడి పారిపోతాడేమోనని చప్పుడు కాకుండా వెళ్లి రాముని పట్టేసుకున్నాడు రాము బాబాయి. రాము గింజుకుంటున్నా బలవంతంగా ఇంటికి లాక్కొచ్చాడు. రాముని చూట్టంతోనే అతని తల్లి రాముని కౌగిలించుకొని ఏడ్చేసింది.
* * *
రామూకి అన్నం తినిపిస్తూ - పెరట్లో ఉన్న చెట్టువైపు చూపించింది.
అక్కడ కాకి గూడు కట్టుకుంటోంది. పుల్లలన్నీ జారిపడిపోతున్నాయి. అయినా ఓపిగ్గా కిందపడిన పుల్లలు తీసుకెళ్లి మళ్లీ గూడు కడుతోంది.
‘అది చూస్తూంటే నీకేమైనా అర్థమైందా?’ అని తల్లి ప్రశ్నించింది.
అడ్డంగా తలూపాడు రాము.
‘పట్టుదలకి మారుపేరు కాకి. ఒక పని మొదలెడితే అది అయ్యేవరకూ ఊరుకోదు. ఆ విషయం అందరికీ తెలిసినా కాకిని చూసి నేర్చుకోము. మనం నేర్చుకోవలసింది పట్టుదల, కార్యసాధన. నువ్వు కూడా అలాగే పట్టుదలతో సాధించాలి. కానీ చనిపోయి ఏం లాభం? నిన్ను ప్రేమించే ఇంతమందిని ఏడిపించటం తప్ప. ఒకవేళ చదువులో నువ్వు రాణించకపోతే వేరే రంగాల్లో రాణిస్తావేమో అందుకు ప్రయత్నించు. ఒక పక్షికి ఉన్నపాటి శ్రద్ధ, పట్టుదల, కార్యదీక్ష మనిషికి లేకపోతే ఎలా? తను బాధపడటం, తన వారిని బాధించటం తప్ప. అవునా? కాదా?’ అంది రాము తల్లి.
రాము సిగ్గుతో తలదించుకున్నాడు.
* * *
ఆ మరుసటి సంవత్సరం ఎంతో కష్టపడి పదవ తరగతి పాసయ్యాడు. చదువు పట్ల ఆసక్తిని పెంచుకొని, జ్ఞాపకశక్తిని పెంపొందించే పాఠాలు నేర్చుకొని చదువులో ఏకాగ్రతని సాధించాడు.

********************************************

ప్రపంచ శాస్తవ్రేత్తలు

అలెగ్జాండర్ ఫ్లెమింగ్
-పి.వి.రమణకుమార్
పెన్సిలిన్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎందరో రోగులకు దిగి వచ్చిన దేవుడు లాంటివాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన ఎందరో క్షతగాత్రులకు సేవ చేయడానికై కెప్టెన్‌గా వెళ్లిన అలెగ్జాండర్ వారి బాధలను చూసి చలించిపోయి వారి సేవ కోసం జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధపడిన మహనీయుడు.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1881 ఆగస్టు 6వ తేదీన స్కాట్లండ్‌లో జన్మించాడు. తండ్రి హగ్ ఫ్లెమింగ్ పర్వత ప్రాంతంలో వ్యవసాయదారుడు. ఆ రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి స్కాట్లండ్ ప్రజలు తప్పనిసరిగా ఇంగ్లండ్ వెళ్లేవారు. అలెగ్జాండర్ కూడా లండన్ వెళ్లి ఒక షిప్పింగ్ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరి పాలిటెక్నిక్ చదివాడు. ఆ తర్వాత రాసిన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో మొత్తం ఇంగ్లండ్‌లోనే ప్రథముడిగా వచ్చాడు.
ఆల్బర్ట్ రైట్ అనే శాస్తవ్రేత్త దగ్గర పరిశోధనల సహాయకుడిగా చేరి పరిశోధనలపై దృష్టి పెట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అలెగ్జాండర్‌ను ఇంగ్లండ్ ప్రభుత్వం కెప్టెన్‌గా నియమించి, క్షతగాత్రుల సహాయార్థం పంపింది. అక్కడ ప్రతిరోజూ ఎందరో సైనికులు గాయాలతో, విరిగిన ఎముకలతో, రక్తసిక్తమైన శరీరంతో ఆసుపత్రికి వస్తుండేవారు. గాయాలను మాన్పడానికి, సూక్ష్మజీవులను హరింపజేయడానికి, మందు లభించకపోవడంతో చూస్తూండగానే కొంతమంది మరణించటం జరిగేది. అది చూసి అలెగ్జాండర్ హృదయం ద్రవించి పోయేది. అందుకు తిరిగి తన పరిశోధనలను ప్రారంభించేందుకు సిద్ధపడ్డాడు.
ఒకసారి తన ప్రయోగశాలలో ఒక ప్లేటులో ఉంచిన పదార్థం చుట్టూ బూజు పట్టి ఉండటం గమనించాడు. ఆ బూజు పట్టిన ప్రాంతానికి సూక్ష్మజీవులు రాలేదు. అంటే బూజులో సూక్ష్మక్రిములను అరికట్టే పదార్థం ఉందన్నమాట.. అనే నిర్ధారణకు వచ్చాడు. అంతే బూజు స్రావాలతో కనిపెట్టిన రసాయన పదార్థమే శక్తివంతమైన పెన్సిలిన్ మందు.
1941లో పెన్సిలిన్ మందుని చావుబతుకుల మధ్య వున్న ఒక మనిషి మీద ప్రయోగించి బ్రతికించాడు. ఆ తర్వాత పెన్సిలిన్ ఔషధం ప్రపంచవ్యాపితంగా గుర్తింపు పొందింది. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్‌కు పెన్సిలిన్ కనిపెట్టినందు వల్ల వచ్చిన బిరుదులు, అవార్డులు, బహుమతులు అసంఖ్యాకం. 1945లో విశిష్టమైన నోబెల్ బహుమతి ఆయనను వరించింది. ఆ మహనీయుడు 1955లో మరణించాడు.

*********************************************

ఆత్మకి ఆహారం

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

డిస్కవరీ ఛానెల్‌లో గుర్రాల పెంపకానికి చెందిన ఓ కార్యక్రమాన్ని చూస్తూ భాగేష్ తండ్రిని అడిగాడు.
‘గుర్రాలు రోజుకి ఎంత తింటాయ్?’
‘చాలా. వాటిని నిత్యం గడ్డి మైదానాల్లోకి వదులుతారు. ఆహారం తినని గుర్రాల గురించి నేనెప్పుడైనా నీకు చెప్పానా?’ తండ్రి అడిగాడు.
‘ఆహారం తినని గుర్రమా?’ భాగేష్ ఆసక్తిగా అడిగాడు.
‘ఆహారం పెట్టకపోవడంతో అది తినకుండా పెరిగిన ఓ గుర్రాన్ని గురించి ఓసారి చదివాను. దాని యజమాని ఎంత డబ్బు ఆదా చేసి ఉంటాడో ఊహించు’
‘ఆహారం తినని గుర్రమా? అదెలా సాధ్యం?’ భాగేష్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అతను గుర్రానికి రోజుకో ఏభై గ్రాముల ఆహారాన్ని పెట్టడం తగ్గించుకుంటూ వెళ్లాడు. అలా ఆ గుర్రం తక్కువ ఆహారానికి అలవాటు పడుతూ వచ్చి చివరికి దాదాపు ఆహారం అందని రోజుకి చేరుకుంది’
‘తర్వాత?’ భాగేష్ ఆసక్తిగా అడిగాడు.
‘బాధాకరమైన విషయం ఏమిటంటే, ఓ రోజు ఆ గుర్రం కిందపడి చచ్చిపోయింది’
‘అయ్యో!’
తండ్రి నవ్వడం చూసి భాగేష్ వెంటనే చెప్పాడు.
‘నాన్నా. నువ్వు జోక్ చేస్తున్నావు’
‘అవును. కానీ తాము పెంచే పశువులకి సాధ్యమైనంత తక్కువ తిండి పెట్టి, అవి ఎక్కువ పాలు ఇవ్వడం లేదని వాపోయే వాళ్లని చూశాను. ఇలాంటి చాలామంది మనుషులు మనకు జీవితంలో తారసపడుతూంటారు. కొందరు గీతాపఠనం, దైవప్రార్థన, దేవాలయ సందర్శన లాంటివి ఆరంభిస్తారు. తర్వాత క్రమేపీ లాభం లేదని వాటిని తగ్గించేసుకుంటారు. వారికి తెలిసినా, తెలియకపోయినా, వారి ఆత్మకి అందాల్సిన ఆహారం అందకపోవడంతో త్వరలోనే వారు దేవుడికి దూరమై పోతారు’
‘అర్థమైంది. నేనెప్పుడూ అలా అవకూడదు’ భాగేష్ చెప్పాడు.
‘అవవనే ఆశిస్తాను. నీ పొట్టకి ఎంత ఆహారం కావాలో, నీ ఆత్మకి కూడా అంత ఆహారం కావాలని మర్చిపోకు’ తండ్రి హెచ్చరించాడు.

-ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి